వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Dongagaru Swagatham' - New Telugu Story Written By Sathya S. Kolachina
Published In manatelugukathalu.com On 07/11/2023
'దొంగగారూ స్వాగతం' తెలుగు కథ
రచన: సత్య ఎస్. కొలచిన
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాష్ట్రంలో ఎన్నికల సంరంభం మొదలైంది. అధికార పార్టీతో పాటు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మరి ఇతర పార్టీలు అన్నీ కూడా ప్రజలని మంచి చేసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధికార పార్టీ తమ వైఫల్యాలని కప్పి పుచ్చుకుంటూ, తాము ప్రవేశ పెట్టిన ప్రజాకర్షక పథకాలని భూతద్దంలోంచి చూపించి ప్రజలకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తోంది. తమకి మరో అవకాశం ఇస్తే తాము మరిన్ని తాయిలాలు పంచిపెడతామని ప్రజలని ఊరిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపించి, తమకి అధికారం ఇస్తే ప్రజాధనాన్ని సద్వినియోగం చేసి, రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలోకి నడిపిస్తామని వాగ్దానాలు చేస్తోంది.
నిజానికి సామాన్యులకి బాగా తెలిసిన విషయం ఏమిటంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకి ఒరిగేదేం లేదని. అన్ని పార్టీలు వాగ్దానాలు చెయ్యడంలో దిట్ట, అమలు చెయ్యడంలో దిబ్బ.
ఓ పక్క ఎన్నికల సంఘం నిబంధనలు అమలులోకి రావడంతో సామాన్యుడి జీవనం అష్టకష్టాల పాలవుతోంది. ముఖ్యంగా, ఎక్కడ ధనం నగదు, బంగారం రూపంలో కనబడ్డా పోలీసులు స్వాధీనం చేసేసుకుంటున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ము తిరిగి వస్తుందని గ్యారెంటీ లేదు. సామాన్యుడు ఏ పనికోసం డబ్బు తీసుకుని బయటికి వెళ్ళాలన్నా భయపడాల్సి వస్తోంది. ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా వంటినిండా నగలు ధరించి వెళ్ళడం మన తెలుగు స్త్రీలకి బాగా ఇష్టమైన అలవాటు. ఎన్నికలు ముగిసేవరకు శుభకార్యాలు జరుపుకోవాలన్నా, లేదా శుభకార్యాలకి వెళ్ళాలన్నా కష్టంగా ఉంటోంది. సాధారణంగా నగలు పెట్టుకుంటే దొంగలు దోచుకుపోతారని భయపడడం సహజం. కానీ, ఇప్పుడు ఎన్నికలు ముగిసేవరకు బంగారం చూస్తే పోలీసులే పట్టుకుపోతున్నారు. ప్రజలకి దొంగలని చూసి భయపడాలో, పోలీసులని చూసి భయపడాలో అర్థం కాకుండా పోతోంది.
ఎన్నికల నియమావళి ఉద్దేశం మంచిదే అయినా, అది ఆచరణలో పెట్టే పధ్ధతి సరిగా లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ నాయకులు పెద్దపెద్ద మొత్తాల్లో పంపిణీ చేసే డబ్బు పోలీసుల కళ్ళకి దొరకదు, ఆ వాసన కూడా వాళ్ళు పట్టలేరు. ఆ డబ్బు నిరాఘాటంగా చేతులు మారిపోతుంది. కానీ, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని సామాన్యులు మాత్రం చిన్న మొత్తాలలో డబ్బు తీసుకెళ్ళాలంటే భయ పడాల్సి వస్తోంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మరో సంచలనం రేగింది. రాజన్న రాజకీయ పార్టీ పెట్టాడు. రాజన్నంటే పెద్దవాళ్ళకి, అంటే భూస్వాములకి, అవినీతితో ప్రజల సొమ్ము కొల్లగొట్టి ధనవంతులైన వారికి, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకులకీ, అధికారులకీ భయం, కానీ, సామాన్యులెవరూ రాజన్న పేరు చెపితే భయపడిన దాఖలాలేమీ లేవు. ఇంకా రాజన్న కనిపిస్తే చూడ్డానికి వెళ్తారు కూడా. సామాన్యులంటే రాజన్నకి జాలి, ఎందుకంటే ఒకప్పుడు రాజన్న కూడా అటువంటి పరిస్థితిలోంచి వచ్చినవాడే. అంటే రాజన్న ఏ నక్సలైటో అనుకునేరు. ఏమాత్రం కాదు. రాజన్న, అతని మనుషులు ప్రజలతో, ప్రజల మధ్య కలిసే తిరుగుతూంటారు.
రాజన్నంటే భయపడేవాళ్ళందరూ రాజన్నని ఒక గజదొంగలా చిత్రీకరిస్తారు. కానీ, డైరెక్టుగా రాజన్నని ఎప్పుడూ దొంగతనం చేస్తుండగా పట్టుకున్న సందర్భాలు లేవు. అలాగని రాజన్న దొంగతనం చెయ్యలేదని కూడా అనలేము. చేసి ఉండొచ్చని అందరూ నమ్ముతారు. రాజన్న చేసిన దొంగతనాలన్నీ అవినీతి పరుల్ని నిలువుదొపిడీ చేసినవే. పోయిన సొమ్ము అక్రమంగా సంపాదించినది అవడంతో తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయేవారు, రాజన్న చేసిన దొంగతనం బారిన పడిన వాళ్ళు. ఒకటీ అరా కేసులు పెట్టి అతన్ని కోర్టుకి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. కానీ అతను దొంగతనం చేస్తుండగా చూసిన సాక్షులు లేరు. అతను దొంగిలించాడని చెప్పిన డబ్బుకానీ, నగలు కానీ, అతని అధీనంలో ఉండగా ఎప్పుడూ దొరకలేదు. దానికి కారణం, ఆ డబ్బు అతను ఉంచుకోడు. సామాన్యులకి, బీదవాళ్ళకీ, ధర్మబధ్ధంగా డబ్బు అవసరం అయినవాళ్ళకీ పంచేస్తాడు. ఈరోజుల్లో ధర్మబధ్ధంగా డబ్బు అవసరం లేనిది ఎవరికి? చాలీచాలని సంపాదనతో బతికే సామాన్యులందరికీ ఆ అవసరం ఉంటుంది. అందుచేత అతనిమీద పెట్టిన కేసులు ఎప్పుడూ కోర్టులో వీగిపోతాయి. ఎప్పుడూ అతను కట్టుబట్టలతోనే కనిపిస్తాడు. ఉండడానికి మంచి ఇల్లు కూడా లేనటువంటి వాడు రాజన్న. ఓ పెంకుటింట్లో ఉంటాడు. ఇటువంటి రాజన్న రాజకీయ పార్టీ పెట్టాడంటే చాలామందికి ఆశ్చర్యం వేసింది.
రాజకీయ ప్రముఖులకి మాత్రం ఈవిషయం నచ్చలేదు. దీనికి ఒక కారణం ఉంది. ఎన్నికల సమయంలో డబ్బు నీళ్ళలా ప్రవహిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎలా ప్రవహిస్తుందో ఎవరికీ తెలీదు. రాజకీయ పార్టీలు రాజన్నని కొరియర్ లాగా వాడుకునేవి. పదిశాతం, ఇరవైశాతం కమీషను మీద పోలీసుల కళ్శుకప్పి నల్లడబ్బుని చేర్చవలసిన వారికి అతి సమర్థవంతంగా చేరవేసేవాడు రాజన్న. అంటే, వంద కోట్ల రూపాయలు పంపిణీ చెయ్యాలంటే రాజన్న కమీషను పది నుండి ఇరవై కోట్లు ఉంటుంది. అతను అన్నిపార్టీలకీ పని చేసేవాడు. ఒకరి డబ్బు పంపిణీ రహస్యాలు మరొకరికి తెలియనివ్వడు. అత్యంత రహస్యంగా ఉంచేవాడు. గతంలో అతన్ని పోలీసులకి పట్టివ్వాలని ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి, అతనిని పట్టివ్వాలనుకున్నవాళ్ళే పోలీసుల చేతికి చిక్కేటట్లు చేశాడు. పోలీసుల దృష్టి ఎప్పుడూ సామాన్యుడిని దాటి ముందుకి వెళ్ళదు. రాజన్నలాంటి వ్యక్తి రాజకీయ నాయకులకోసం పనిచేసి డబ్బు పంపిణీ చేస్తున్నాడని తెలిస్తే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు వెళ్ళడానికి సాహసించరు. ఎవరినో ఒకరిని పట్టుకుని లాకప్ లో పెట్టేసి నాలుగు ఉతికేస్తే, వాళ్ళ బాధ్యత తీరిపోతుంది, వాళ్ళ జీవితాలకి కూడా రిస్కు ఉండదు.
అటువంటి రాజన్న రాజకీయ పార్టీ పెట్టాడంటే, ప్రస్తుత రాజకీయ పార్టీలకి గుర్రుగా ఉంది. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు రాజన్నని డబ్బు పంపిణీ చెయ్యడానికి వాడుకోలేరు. ఇప్పటికిప్పుడు రాజన్నంత సామర్థ్యం ఉన్న కొరియర్ దొరకడం చాలా కష్టం. దాంతో, ప్రముఖ పార్టీలు చిన్నా, చితకా దొంగల్నీ, ఇప్పుడిప్పుడే దొంగవృత్తిలో అడుగుపెట్టిన వాళ్ళని కాంటాక్టు చెయ్యడం మొదలుపెట్టాయి. ఈ అవినీతిమయమైన వృత్తిలో కూడా నిజాయితీ చాలా ముఖ్యం. రాజన్న కమీషను ఎక్కువగా తీసుకున్నా నిజాయితీతో పని చేసేవాడు. అతని దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అలాగే పనిచేసేవారు. రాజన్న వాళ్ళ కష్టం ఎప్పుడూ ఉంచుకోలేదు. తను సంపాదించినదంతా తన దగ్గర పనిచేసేవాళ్ళకి, సామాన్య ప్రజలకి పంచిపెట్టేసేవాడు. రాజన్నంత సమర్థవంతంగా, నిజాయితీతో పనిచేసే కొరియర్ వాళ్ళకి దొరకడం దాదాపు అసాధ్యమైన విషయం.
రాజన్న రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర్నుంచీ ఎన్నికలకి మధ్య ఎక్కువ సమయం లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా బెంబేలెత్తి పోయాయి. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరిపిస్తే, సాధారణంగా ప్రజలు కొంచెమైనా ఔన్నత్యం కలిగిన సభ్యులని ఎన్నుకుంటారు. ఈవిషయం చాలామంది విశ్వసిస్తారు. అలాగే, డబ్బు, మద్యం పంపిణీలో విఫలమైతే, తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని వారందరి భయం కూడాను.
రాజన్న పార్టీలో అన్ని స్థానాల్లోనూ సామాన్యులకే టికెట్లు ఇచ్చాడు. రాజన్న పార్టీద్వారా ఎన్నికలలో నిలబడ్డవాళ్ళందరూ వోటర్లకి బాగా దగ్గరైనవారు. ప్రతిరోజూ వాళ్ళతో, వాళ్ళమధ్య తిరుగుతూండేవాళ్ళే. అందువలన రాజన్నకి ఎన్నికల ప్రచారం పెద్ద సమస్య కాలేదు. ఎన్నికల బరిలో నిలబడ్డవాళ్ళే తమకు తాము ప్రచారం చేసుకోగలుగుతున్నారు. ఎన్నికల ప్రచార ఖర్చు లేదు. ‘నేను రాజన్న తరఫున ఎన్నికల బరిలో నిలబడ్డాను.’ అనుకోవడమే వాళ్ళకి గర్వకారణంగా ఉంది. ‘రాజన్న మనిషినంటే మీమనిషినే అనుకోండి’ అన్నదే వారి ప్రచార వాక్యం.
ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా రాజన్న మనుషులు అన్ని పోలింగు కేంద్రాల మీదా నిఘా వేసి ఉంచారు. రాజన్న మనుషులంటే రాజకీయ పార్టీల తరఫున పనిచేసే గూండాలకి కూడా భయమే.
కౌంటింగు పూర్తి అయి, ఫలితాలు వచ్చేసరికి ఎన్నికల విశ్లేషకుల అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. అత్యధిక మెజారిటీతో రాజన్న పార్టీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. రాజన్నకి ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన పూర్తి మెజారిటీ వచ్చింది. రాజన్న కూడా తాను నిలబడ్డ నియోజకవర్గంలో ఎక్కువ వోట్ల మెజారిటీతో గెలుపొందాడు.
అధికార పార్టీ తీవ్రమైన ఓటమి చవిచూసింది. ప్రతిపక్ష పార్టీ గెలుపు మీద పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఎన్నికలు దేశంలోనే ఒక ప్రభంజనం సృష్టించాయి. ఇంక చిన్నా, చితకా పార్టీల సంగతి సరేసరి, డిపాజిట్లు కూడా దక్కలేదు.
ఈ సందర్భంగా ఒక ప్రముఖ వార్తాపత్రిక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాజన్నని ఇంటర్వ్యూ చెయ్యాలని నిశ్చయించింది. వాళ్ళ కోరిక మేరకు రాజన్నే ఆ వార్తాపత్రిక కార్యాలయానికి వెళ్ళాడు. అతన్ని సాదరంగా ఆహ్వానించి కూర్చుండజేసింది సీనియర్ జర్నలిస్టు సువర్చలాదేవి.
‘రాజన్నగారూ! మీగురించి వినడమే గానీ, ప్రత్యక్షంగా చూడడం ఇదే ప్రథమం. మీరు సాధించిన ఈ విజయం మీద నాలుగు మాటలు చెపితే పాఠకులతో పంచుకుంటాం మేము.’ అన్నది సువర్చలాదేవి.
‘అమ్మా, నేను మీరు అనుకున్నంత పాపులర్ కాదు. నాది సామాన్యుల పార్టీ. ఈ ఎన్నికలలో నాతోపాటు గెలిచిన వాళ్ళందరూ సామాన్యులే. ప్రచారం కోసం మేమేమీ పెద్దపెద్ద మొత్తాల్లో ఖర్చు పెట్టలేదు. సామాన్యులని ఓసారి గెలిపిస్తే ఎలా ఉంటుందోనని ప్రజలు అనుకున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చారు.’ అన్నాడు రాజన్న వినయంగా.
‘ఎన్నికలలో సామాన్యులు గెలవడం సాధ్యం కాదుకదా? మరి మీరు ఎలా గెలిచామనుకుంటున్నారు? ఇదెలా సాధ్యమైంది?’ అన్నది ఆవిడ.
‘అమ్మా, ప్రతీసారీ ఎన్నికలలో డబ్బు, మద్యం నీళ్ళలా ఖర్చుపెట్టేవారు. ఈసారి అలాగ జరగలేదు. అంటే, నేను, నా మనుషులు అలా జరగనివ్వలేదు. అందుకే, డబ్బుకి, మద్యానికి అమ్ముడపోయే వోటర్లు ఈసారి పెద్ద పార్టీల మీద బాగా కోపంగా ఉన్నారు. వాళ్ళకోపం మాకు కలిసొచ్చింది’ అన్నాడు రాజన్న.
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
‘వాళ్ళు డబ్బు, మద్యం పంపిణీ చెయ్యకుండా మీరేం చెయ్యగలిగారు? ఎలా ఆపగలిగారు?’ అడిగిందావిడ.
‘చాలా సింపుల్ తల్లీ. వాళ్ళు పంపిణీ చేసే డబ్బు చేరాల్సిన చోటికి చేరకుండా మేము అడ్డుకున్నాం. మందు సీసాలు, కంటైనర్లు ధ్వంసం చేసేశాం. మేము కలెక్ట్ చేసిన డబ్బంతా మేజిస్ట్రేటు గారి సమక్షంలో తిన్నగా ఎన్నికల కమీషనరు గారికే అప్పజెప్పాం. అలా మేం అప్పచెప్పిన డబ్బు ఎంతుంటుందో మీరు ఊహించగలరా అమ్మా?’ అని అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది.
‘పది వేల కోట్లు. అంత డబ్బు సీజ్ అయిపోయసరికి పెద్ద పార్టీలన్నీ గిజగిజలాడిపోయాయి. అంటే అంత నల్లధనం ఎన్నికలకోసం బయటికి తీశారు బడాబాబులు.’ అన్నాడు రాజన్న నవ్వుతూ.
‘ఎంతో పెద్దమొత్తం ఉంటుందనుకున్నాను గానీ, మరీ అంత పెద్ద మొత్తం ఉంటుందనుకోలేదు’ అంది సువర్చలాదేవి ఆశ్చర్యం వెలిబుచ్చుతూ.
‘ఇప్పుడా డబ్బంతా బ్యాంకులో ప్రభుత్వ ఎకౌంటులో వేసేశారు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయానికి ఈ డబ్బు ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది.’ అన్నాడు గర్వంగా.
‘అంటే నల్లడబ్బుని తెల్లడబ్బుగా మార్చేశారన్నమాట’ అంది ఆమె.
‘అవును తల్లీ. అంతేకాదు. ఈడబ్బంతా ఒకప్పుడు ప్రజలదే. బడా బాబులు ప్రజలని దోచుకున్న డబ్బు. మరి మళ్ళీ అది ప్రజలకే చేరడం న్యాయం కదమ్మా?’ అతని ప్రశ్నకి ఆమె అవునన్నట్లుగా తల ఊపింది.
‘మరో ప్రశ్న రాజన్నగారూ. మీరేమీ అనుకోకుండా ఉంటే?’
‘అడగండమ్మా’ అన్నాడతను తాపీగా.
‘మీరు ఇదివరలో దొంగతనాలు చేసేవారని చెప్పుకునేవారు...’ ఆమె అర్ధోక్తిలో ఆపేసింది. అతను గలగలా నవ్వేశాడు.
'అడగవలసింది అడిగేసి ఇంకా సందేహమెందుకమ్మా? నన్ను దొంగగా ముద్ర వేసి కోర్టులో కూడా నిలబెట్టారు. కానీ ఆధారాలేవీ? నాదగ్గర దొంగసొమ్ము పట్టుకోలేకపోయారు. నేను దొంగనని నిరూపించలేకపోయారు.' అతను రెండు క్షణాలు ఆగాడు. మళ్ళీ అన్నాడు.
‘ఇప్పుడు వాళ్ళు ఎన్నికల్లో పంపిణీ చెయ్యడానికి బయటికి వదిలిన నల్లడబ్బుని నేను పట్టుకున్నాను, పోలీసుల సాయం కూడా లేకుండా. మరి ఇప్పుడు దొంగెవరో తెలిసిందా తల్లీ? నేను, నా మనుషులు, గత ప్రభుత్వాలు నడిపిన ప్రజాప్రతినిధులు ప్రజల నుండి అన్యాయంగా దొంగిలించిన దొంగసొమ్ముని పట్టుకున్నాం. ఇంక ప్రభుత్వం ఏర్పాటు చేశాక తిన్నగా దొంగల్నే పట్టుకుంటాం. మిగిలిన దొంగసొమ్ము కూడా బయటికి లాగేస్తాం. చూస్తూ ఉండండి.’ అన్నాడు మీసం మెలేస్తూ.
పక్కనే నిలబడ్డ ఎడిటర్ గారికేసి చూశాడు గర్వంగా. ‘ఏం ఎడిటర్ గారూ, నా మాటమీద నమ్మకం లేదా?’ ఆ పత్రిక ఎడిటర్ అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీని సపోర్టు చేసే వాడని అతనికి తెలుసు. ఆయన ముఖం ముడుచుకుని చూశాడు రాజన్నకేసి.
అంతకుముందు ఎన్నికలలో నల్లధనం పంపిణీ చెయ్యడానికి సహకరించిన రాజన్నే, ఇప్పుడు ఆ నల్లధనం పంపిణీనే అడ్డుకుని, దొంగకాస్తా దొర అయ్యాడు. దొరల్లాగా చెలామణీ అవుతున్న వాళ్ళని దొంగలుగా నిరూపించాడు.
‘రాజన్న గారూ, స్వాగతం. మీ రాజకీయ చతురతకి స్వాగతం. మీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వానికి స్వాగతం.’ అంటూ ముగించింది సువర్చలాదేవి. ఆవిడ నిజాయితీగా పనిచేసే జర్నలిస్టు. నిజాయితీగా ఉండే ప్రభుత్వాన్ని సపోర్టు చేసే వ్యక్తి.
రాజన్న ఓసారి ఆ పత్రికాఫీసులో అందరికేసి చూసి, తల పంకిస్తూ, బయటికి నడిచాడు.
వెళ్ళిపోతున్న రాజన్నకేసి చూస్తూ అనుకుంది సువర్చలాదేవి ‘పరిపాలకుల కంటే దొంగలే నయమనుకునే పరిస్థితికి ఇప్పటి రాజకీయాలు దిగజారిపోయాయి. డెభ్భయి అయిదేళ్ళ ప్రజాస్వామ్యంలో మనం సాధించింది ఇంతేనా? లేదా, ముల్లుని ముల్లుతోనే తియ్యాలనే సామెత చందాన ప్రజలని ముల్లులాగ బాధించే ప్రభుత్వాన్ని మార్చాలంటే, మరో ముల్లునే ఎంచుకోవాలేమో. ఈ ముళ్ళ రాజకీయాలనుంచి విముక్తి ఎప్పుడో!’ అనుకుని నిట్టూర్చింది ఆవిడ.
***
సత్య ఎస్. కొలచిన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/sathya
సత్య ఎస్. కొలచిన, ఎమ్.టెక్.
వృత్తి – క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినీర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్.
(Cloud Security Engineer, Amazon Web Services, Amazon)
నివాసం – షికాగో నగరం, ఉత్తర అమెరికా
అభిరుచులు – కర్నాటక శాస్త్రీయ సంగీతం (సాధన మరియు బోధన), చిత్రలేఖనం, రచనలు చేయడం, జ్యోతిష్యం, హస్తసాముద్రికం.
సంగీతం గురువు – పద్మభూషణ్, డాక్టర్, శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు.
జ్యోతిషం గురుతుల్యులు – శ్రీ కె.ఎన్. రావు గారు.
చిత్రలేఖనం గురువు – శ్రీ వలివేటి శివరామ శాస్త్రి గారు
రచనలు గురువు – మా తండ్రి గారు శ్రీ కొలచిన వెంకట లక్ష్మణమూర్తి గారు
ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టిన మీ కథ కొలచినగారు. అభినందనలు.
కధ సారాంశం బాగుంది! కానీ వాస్తవ పరిస్థితుల్ని తారుమారు చెయ్యడం అంత సులువా? అన్నది సందేహం! కధ కాబట్టి ఏదైనా సాధ్యం!!
Bagundi katha
DVD
Sir, చాలా బాగా రాశారు. కధ కాకుండా నేను కధానిక అంటాను.