top of page

దొంగన్నయ్య


'Dongannayya' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 11/11/2023

'దొంగన్నయ్య' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


కెవ్వున అరిచిన కాంతం అరుపులకు అదిరిపడి నిద్రలోనుండి మేల్కొన్న అవతారం ఆమెవైపు వింతగా చూసాడు. కాంతం కూడా నిద్రలొంచి బయటపడి బిత్తర చూపులు చూస్తోంది. నిద్ర మత్తు కళ్ళతో గోడ గడియారం వైపు చూసాడు అవతారం. రాత్రి పన్నెండు గంటలు దాటింది. అంత రాత్రివేళ తనకి నిద్రాభంగం కలిగించినందుకు ఆమె వైపు చిరాగ్గా చూసి, "ఏంటి, మళ్ళీ భయంకరమైన కలేమైనా వచ్చిందా?" అని అడిగాడు.


"అవునండి! ఎవరో భయంకర ఆకారం కల అగంతకుడు మిమ్మల్ని చిత్తుగా తన్నేసి, నన్ను ఎత్తుకెళ్ళినట్లు కలవచ్చిందండీ. " అంది కళ్ళు పెద్దివిచేసి.


"అలా నిజంగా జరిగినా బాగుండును, నీ పీడ నాకు తప్పిపోను!' మనసులో అనుకున్నట్లు మెల్లిగా గొణిగాడు.


"ఆ.. ఏమిటి అంటున్నారు?" అడిగిందామె.


"ఆహా.. మరేంలేదు! నన్ను చితక్కొట్టడం మాట సరేకానీ, నిన్ను ఎత్తుకెళ్ళడానికి వాడికెంత దమ్ముండాలి? అయినా అర్థరాత్రివరకూ క్రైం సినిమాలు, క్రైం సిరీస్లు చూడొద్దన్నా వినవు కదా?" విసుక్కున్నాడు. ‘నిన్నెత్తుకెళిపోయి వాడేం బాగుపడతాడులే!’ అని మనసులో అనుకుంటూ.


"నిజమేలెండి!" అంది గర్వంగా.


"ఇప్పటికైనా మించిపోయింది లేదు, అర్ధంపర్ధం లేని క్రైం, హర్రర్ సిరీజులు చూడకు!" అన్నాడు అవతారం నిద్రకి ఉపక్రమిస్తూ.


"అలా అంటే ఎలా కుదురుతుందండీ? క్రైం కథల పోటీకి కథలు పంపడానికి ఇంక వారం రోజులే గడువు ఉందండీ! మరి నాకింతవరకూ ఏ ఐడియా రాలేదు, అందుకే అలాంటి సీరియల్స్, సినిమాలు చూస్తే కథలు ఏమైనా తడతాయేమోనని చూస్తున్నానండీ. " అంది కాంతం.


'ఏడిచినట్లుంది. ' అనుకున్నాడు అవతారం మనసులో. పైకి అనలేక. "పడుక్కో! చాలా రాత్రైంది. " అని మాత్రం అన్నాడు.


ఈలోపున ముందు గది వద్ద మళ్ళీ ఏదో చప్పుడు అయింది.

"విన్నారా! హాల్లో ఏదో శబ్దం వినిపిస్తోందండీ! దొంగోడెవరైనా ఇంట్లో దూరి ఉంటాడంటారా?" అంది కాంతం భయంగా.


ఆమె వైపు వింతగా చూసాడు అవతారం. “వస్తే రానీయ్! అయినా మన ఇంట్లో ఏముంది ఎత్తుకుపోవడానికి? నువ్వు రాసిన అచ్చేసిన నవల్లు, పుస్తకాలు తప్ప!" అన్నాడు.


"నా కథలు, నవలల గొప్పతనం మీకు అర్థం కాదు లెండి. " అంది కానీ, మళ్ళీ ఈ సారి ఇంకొంచెం ఎక్కువ చప్పుడవటంతో, "అబ్బ, లేచి చూడండీ! నిజంగానే దొంగోడెవరో ఇంట్లో దూరినట్లుంది. " అంది కాంతం భయంతో వణికిపోతూ.


ఈ సారి అవతారంకి కూడా చప్పుడు వినిపించడంతో దిగ్గున లేచి కూర్చున్నాడు. ముందు గదిలో చిన్న నీలం రంగు బల్బు వెలుగుతోంది. ఆ సన్నటి వెలుతురులో ఎవరిదో నీడ నేల మీద కనపడటంతో నిజంగానే తమ ఇంట్లో దొంగ దూరాడని నిర్ధారణ చేసుకున్నాడు. అలాగే నక్కి నిలబడ్డాడు. ఆ నీడ మెల్లగా కదిలి ఇంకో గదిలోకి వెళ్ళింది. అవతారం కాంతం దగ్గరికి నెమ్మదిగా తిరిగి వచ్చి, "నువ్వన్నట్లు నిజంగానే మనింట్లో దొంగ దూరాడు. ఆ గదిలోకి వెళ్ళాడు. అలమరా తెరుస్తాడో ఏమో?' అని మెల్లగా అన్నాడు.


"అయినా మీరన్నట్లుగా మనింట్లో ఏమున్నాయిలెండి. వెతికి వెతికి వాడే వెళ్ళిపోతాడు!" అని అటు తిరిగి పడుక్కోబోయింది గాని, అప్పుడే ఆమెకో దివ్యమైన ఆలోచన వచ్చింది. అలాంటి అపురూపమైన ఆలోచన వచ్చినందుకు తనని తానే అభినందించుకొని వెంటనే లేచి కూర్చొని, "ఏవండీ, ఆ దొంగగార్ని పిలుచుకు రండి. " అంది కాంతం.


విస్తుపోయాడు అవతారం.

"అదేమిటండీ, అలా నిలబడిపోయారు? రాకరాక వచ్చిన దొంగగార్ని వదిలేస్తే ఎలాగండి?" అంది.


ఇంతలో ఆ దొంగగారు వాళ్ళ బెడ్రూములోకి రానే వచ్చాడు. వాళ్ళిద్దరూ మెలుకువగా ఉండటం చూసిన ఆ దొంగ ఒక్కసారి ఖంగుతిన్నాడు. వెనుదిరిగి వచ్చినదారినే పారిపోవడానికి ఉద్యుక్తుడైయ్యాడు.


"ఆగు!.. దొంగన్నయ్యా!" పిలిచింది కాంతం.


పారిపోతున్న ఆ దొంగ షాక్ తిని ఆగిపోయాడు. ఒకసారి వెనక్కు తిరిగాడు. ఇప్పటివరకూ తనని అన్నయ్య అని పిలిచిన వాళ్ళెవరూ లేరు. అతని కళ్ళు చెమర్చాయి. ఆ దొంగని అలా వరస కలపి పిలవడం అవతారంకి నచ్చక ఆమెవైపు కోపంతో చూసినా కాంతం పట్టించుకోలేదు. "దొంగన్నయ్యా! దొంగన్నయ్యా.. !" అని మరోసారి పిలవడంతో ఆ దొంగన్నయ్య హృదయం ఆనందంతో పొంగిపొర్లింది. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి.


"నువ్వేనా చెల్లెమ్మా..నన్ను అన్నయ్యా అని పిలిచింది. " అన్నాడు ఆనందంతో ఉప్పొంగిపోతూ.


"అవును దొంగన్నయ్యా!" అని మళ్ళీ అంది కాంతం.


"అదిగో.. అన్నయ్యా అన్నావు బాగుంది, కాని అలా దొంగన్నయ్య అని అంటే మాత్రం ఎలాగో ఉంది" అన్నాడు ఇబ్బందిగా కదులుతూ.


"అది కాదు దొంగన్నయ్య.. సారీ అన్నయ్యా! గ్యాస్ తెచ్చే అతన్ని గ్యాసన్నయ్యా అని, కూరలు తెచ్చే అబ్బిని కూరలన్నయ్యా అని, అలాగే పేపరన్నయ్యా, పాలన్నయ్యా ఉన్నంటే, నువ్వు మా ఇంట్లో దొంగతనానికి వచ్చినందుకు దొంగన్నయ్యా అన్నా, నువ్వేం ఫీల్ అవకు. ఏమండీ అలా చూస్తూ నిలబడ్డారేమిటండీ, మా దొంగన్నయ్యకు మీ చేత్తో మంచి స్ట్రాంగ్ టీ చేసి పట్రండి!" అంటూ భర్తని ఆదేశించింది.


ఆ దొంగ కూడా అవతారంవైపు చూసి, "చాలా అలసిపోయాను, చెల్లెమ్మ చెప్పినట్లు టీ పట్టుకురా బావా!” అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.


తనేం చెప్పిన వినిపించుకో స్థితిలో లేని కాంతంవైపు అదోలా చూసి వంటింటివైపు కదిలాడు అవతారం.


కాంతం మరో కుర్చీలో కూర్చొని దొంగవైపు చూసి, "అన్నయ్యా! నేను క్రైం కథల పోటీ కోసం కథ రాద్దామంటే ఐడియాలేమీ రావడంలేదు కానీ, సరిగ్గా సమయానికి దేవుడన్నయ్యలా వచ్చావు నువ్వు దొంగన్నయ్యా!" అంది కాంతం.


తనని మళ్ళీ మళ్ళీ దొంగన్నయ్య అనడంతో మొహం చిట్ట్లించి, "నా పేరు రంగడు చెల్లెమ్మా! నన్ను రంగన్నయ్యా అని పిలు చాలు. మాటిమాటికీ దొంగన్నయ్య అంటే నాకు ఏదోలా ఉంది. " అన్నాడు రంగడు.


"అలాగే దొంగన్నయ్య.. సారీ రంగన్నయ్యా!" అంది నాలిక్కరుచుకొని.


అవతారం అందించిన టీ తాగుతూ, "ఇంతకీ మా బావగారు ఏం ఉద్యోగం చేస్తున్నారు చెల్లెమ్మా, ఇల్లంతా అయ్యవారి నట్టిల్లులా ఉంది, ఇంట్లో పూచిక పుల్ల కూడా దొరకలేదు. " అన్నాడు రంగడు.


అవతారంవైపు ఓ చూపు విసిరి, "ఏదో ప్రభుత్యోద్యోగం వెలగబెడుతున్నారులే! ఇంకా ఈ నెల జీతాలు కూడా అందలేదు! అది సరే,లక్షలు విలువ చేసేవి రెండు అలమరాల నిండా ఉంటే ఇంట్లో ఏమీ లేవంటావేమిటన్నయ్యా!" అంది కాంతం.


ఒక్కసారి గతుక్కుమన్నాడు రంగడు. తను పొరపాటున సరిగ్గా చూడలేదేమో అని బిత్తరపోయి చూస్తూండగా, "లక్షల విలువ చేసే నవలలు ఉన్నాయి కాదా రెండు అలమరాల్లో నిండుగా చూడలేదా?" అంది కాంతం.


"ఓ.. అవా!.. అవెందుకు పనికివస్తాయి!" నోరు చప్పరించాడు రంగడు.


"అలాగంటావేమిటన్నయ్యా, నా కథలు, నవలలు బహుమతులు పొందాయి తెలుసా? ప్రస్తుతం రాయబోయే క్రైం కథల పోటీకి నువ్వేమైనా నీ అనుభవంలో ఉన్న కథ చెప్తే నేను రాసి బహుమతి వచ్చిందనుకో, ఆ బహుమతి డబ్బులు నీకే ఇస్తాను, అలాగేనా!" అంది కాంతం.


నిరాశగా చూసాడు రంగడు. "ఏం చెప్పమంటావు చెల్లెమ్మా! ఒకప్పుడు ఓ ఇంట్లో జొరబడితే బాగా కిట్టుబాటు అవుతుండేది, ఇప్పుడు పదిళ్ళు తిరిగినా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వస్తోంది, ఇంట్లో మీ దొంగ వదినతో.. అరే నీ భాష నాకూ వచ్చేస్తోంది, అదే.. మీ వదినతో మాటలు పడవలసి వస్తోంది. ఎవరింట్లో డబ్బులు ఉండటం లేదు, అంతా కార్డుల కాలం కదా మరి! అలాగే నగలు కూడా బ్యాంక్ లాకర్లో మూలుగుతున్నాయి. ఇప్పుడీ వృత్తి కిట్టుబాటు కావడంలేదు, ఏం చేస్తాం చెల్లమ్మా!" నిట్టూర్చాడు రంగడు.


"నీకు నా పూర్తి సానుభూతి ఉంది అన్నయ్యా! సరే, నువ్వు ఇంతకు ముందు చేసిన విజయవంతమైన దొంగతనాల గురించి చెప్పు, రాసుకుంటాను, నా కథకి పనికి వస్తుంది. " అని, అవతారం వైపు చూసి, "ఏమండీ, హాల్లో ఉన్న నా కాగితాల దొంతర, పెన్ను తీసుకురండి. " అంది.


తను చేసిన దొంగతనాలు, పట్టుబడకుండా తప్పించుకున్న వైనం కథలుకథలుగా చెప్పనారంభించాడు రంగడు. అతను చెప్తున్నదంతా రాసుకుంటూ, ఆ కాగితాలని భర్తకి అందజేస్తోంది కాంతం.


"చెల్లెమ్మా! ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆదివారంనాడు మిట్టమధ్యాహ్నాం దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటావిడ టివిలో సీరియల్ చూస్తూ ఉంటే, ఇంటాయన సెల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. పిల్లలిద్దరూ సెల్లో కార్టూన్లు చూస్తున్నారు. నేను అలాంటి సమయంలో వాళ్ళింట్లో జొరబడి డబ్బు దస్కం, సామాన్లు సర్ది, తీరుబాటుగా డైనింగ్ టేబులు మీద ఉన్న భోజనం ఆరగించినా కూడా వాళ్ళెవరికీ లేసమాత్రమైనా తెలియలేదు. " అంటూ హుషారుగా చెప్పుకు పోటున్నాడు.


కాంతం 'ఊ.. ' కొడుతూ వింటూ రాసుకుంటోంది.


"మరో సారి ఏం జరిగిందంటే, అత్తగారి నగలు ఎక్కడున్నాయో కోడలు, కోడల నగలు ఎక్కడున్నాయో అత్తగారు ఒకరుమీద కోపంతో ఒకరు చెప్పి నా పని సుళువు చేసారు. ఆ రోజులే వేరు. పెద్ద నోటు రద్దీ మా కొంప ముంచింది. ఎవరూ ఇంట్లో డబ్బులు ఉంచుకోవడం లేదు. డిజిటల్ యుగం వచ్చింది. ఇలా జరిగితే మా రోజులెలా గడుస్తాయి చెప్పు చెల్లెమ్మా, మీ కైతే నెల తిరిగేసరికల్లా లేటుగానైనా జీతాలు అందుతాయేమోగాని, మా గతేంటి చెప్పు. " అన్నాడు.


రంగడివైపు సానుభూతిగా చూసింది కాంతం.


"అవును అన్నయ్యా, నిజంగానే మీకు గడ్డుకాలం వచ్చింది. మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. అవును.. నువ్వెందుకు రాజకీయాల్లోకి చేరరాదు?" అంది కాంతం.


మళ్ళీ దీర్ఘంగా నిట్టూర్చాడు రంగడు. "నాకైతే దొంగతనం చెయ్యడం వచ్చుగాని, రాజకీయాలకి పనికి రానమ్మా! అబద్ధాలు చెప్పడం, మోసాలు చెయ్యడం బొత్తిగా చేతగాదు. అప్పటికీ మా అబ్బాయి చెప్పాడు, 'నాన్నా, రోజులు మారాయి, నువ్వు కూడా మారాలి, అప్డేట్ అవ్వాలి. 'అని. అయినా నేను నా పాత సంప్రదాయాన్నే పట్టుకు వేలాడుతున్నాను చెల్లెమ్మా!" అన్నాడు రంగడు విచారంగా మొహం పెట్టి.


"నువ్వు కూడా మారాలి అన్నయ్యా, ఎప్పుడూ పాత చింతకాయ పద్ధతుల్ని పట్టుకొని వేళ్ళాడకూడదు మరి! ఇంతకీ మీ వాడు ఏంటన్నడేమిటి?" అని అడిగింది కాంతం కుతూహలంగా.


కొంచెం సేపు ఆగి, "ఇలా ఇంట్లో జొరబడి దొంగతనం చెయ్యకుండా, ఇంట్లోనే లాప్టాప్ పట్టుకొని డబ్బులు దోచెయ్యొచ్చు. నాన్నా, అసలే నీకు బిపి, సుగర్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని హాయిగా దోచకుండా ఈ వయసులో ఇంత శ్రమ ఎందుకన్నాడమ్మా. "


"నిజం అన్నయ్యా! నువ్వు అలాగే చెయ్యవలసింది. ఇంత శ్రమ తీసుకోవడం అవసరమా, నీ కొడుకు చెప్పినట్లే నువ్వు వినవలసింది. "


"అయినా పెద్దవాణ్ణి కదు చెల్లమ్మా, నా చాదస్తం నాది మరి. ఏదో ఓటిపి ట. అది తెలుసుకొని డబ్బులు కొట్టెయ్యొచ్చుట. ఉదాహరణకి.. మీకు లాటరీ వచ్చిందనో, లోను ఇస్తామనో, కరెంట్ బిల్లు కట్టమనో.. ఇలా పలు రకాలుగా చెయ్యొచ్చుట!" అన్నాడు.


కుతూహలంగా వింటోంది కాంతం. "చెప్పు చెప్పు! ఇది నా కథకి బాగా పనికి వస్తుంది, అలా ఎలా దోచవచ్చో చెప్పు. దెబ్బకి నా క్రైంకథకి ప్రథమ బహుమతి వచ్చి తీరుతుంది. " అంది ఆనందంగా రంగడి వైపు చూస్తూ.


అటు అవతారం ఆమెవైపు సైగ చేస్తూనే ఉన్నాడు రంగడితో మాటలు పెంచుకోవద్దని. ఆమె భర్తవైపు చూడకుండా మళ్ళీ ఇంకో కాగితాల బొత్తి చేతులోకి తీసుకుంది. "ఇంతగా అడుగుతున్నావు కాబట్టి సరే చెప్తాను చెల్లెమ్మా! ఏదీ నీ సెల్ తీసుకురా!" అన్నాడు.


'వద్దు, వద్దు!' అని అటు అవతారం మొత్తుకుంటూంటే, భర్తవైపు గుర్రుగా చూసింది కాంతం, "నాకు బహుమతి రావడం మీకు ఇష్టంలేదులా ఉంది. " అని సెల్ చేతిలోకి తీసుకొని రంగడివైపు తిరిగి, "చెప్పు అన్నయ్యా! అతని మాటలు పట్టించుకోవద్దు!" అంది.


"నిజమే చెల్లెమ్మా! నీకు బహుమతి రావడం బావగారికి ఇష్టం లేనట్లు ఉంది. సరే, చెప్తాను, రాసుకుంటూ ఉండు. " అని ఏం చెయ్యాలో చెప్పాడు. రంగడు చెప్పినట్లు ఒకవైపు రాసుకుంటునే, అతను చెప్పినట్లు చెయ్యసాగింది.


"చూడు.. ఇప్పుడు నీకో ఓటిపి వస్తుంది, నాకు చెప్పు చెల్లెమ్మా!" అన్నాడు రంగడు.


"అలాగే అన్నయ్యా!" అని అతనికి చెప్పేసింది ఆమె అవతారం వైపు తలతిప్పుకుండా. అవతారం ఎంత సైగలు చేస్తున్న వినిపించుకోదలచుకోలేదు ఆమె. "ఓటిపి చెప్పకుడదే!" అని అవతారం ఒకపక్క మొత్తుకున్నా అతనివైపు తలతిప్పి చూడలేదు కాంతం.


"చూసావా! ఇలాగన్నమాట! ఈ విధంగా చెయ్యడం మంచిదంటావా చెల్లెమ్మా? ఇది నమ్మించి మోసం చెయ్యడం కాదూ!" అన్నాడు రంగడు.


"మరేం చేస్తావు చెప్పు అన్నయ్య, పిల్లలు చెప్పినట్లే వినాలి. కాలంతో పాటే మనమూ మారాలి. " అని ఉపదేశం చేసింది కాంతం.


"సరే, చెల్లెమ్మా! చాలా పొద్దుపోయింది, ఇక బయలుదేరతాను. బావగారికి, నీకు కూడా నిద్ర వస్తున్నట్లు ఉంది. ఇక పడుక్కోండి. బావగారు జాగ్రత్త, పాపం నోట్లో నాలిక లేదు. " అని జాగ్రత్తలు చెప్తూ బయటకు నడిచాడు.


అవతారం ఎంత గింజుకుంటూ కాంతంకి సైగ చేస్తున్నా అతనివైపు చూడనైనా చూడకుండా రంగడ్ని సాగనంపడానికి వీధి గుమ్మం వరకూ వెళ్ళింది కాంతం.


"చాలా ధన్యవాదాలు అన్నయ్యా! నాకు నీ వలన ఓ అరడజను కథలకి సరిపడా కథావస్తువు దొరికింది. " అంది రంగడ్ని సాగనంపుతూ.


"కొంప మునిగింది, కాంతం! నీ దొంగ అన్నయ్య నీ బ్యాంక్ బాలన్స్ దోచేసాడు. నేనెంత మొత్తుకున్నా నా మాట వినకుండా వాడికి ఓటిపీ చెప్పావు కదే! కావలిస్తే చూడు, నీ అకౌంట్లోంచి డబ్బులు పోయినట్లు మెసేజ్ వచ్చింది. " అన్నాడు అవతారం.


బిత్తరపోయి చూసింది కాంతం. "అదెలా జరిగిందండీ?" అంది అర్థం కాక.


"వెర్రిదానా, వాడు చెవిలో బ్లూటూత్ పెట్టుకొని సమాచారం వాడి కొడ్డుక్కి చేరవేసాడు. అలాగే నీ ఓటిపి కూడా. నీ క్రైం కథల పిచ్చేగాని, నా మాట వినిపించుకుంటేనా!" అంటూ ఆమెవైపు ఉరిమి చూసాడు.


"రంగన్నయ్య నిజంగా దొంగన్నయ్యే!" అనుకుంటూ కూలబడింది కాంతం.

************

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


69 views2 comments

2 Comments


Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 11, 2023

కథ బావుంది👌

Like
DURGA PRASAD
DURGA PRASAD
Nov 12, 2023
Replying to

Thanks🙏

Like
bottom of page