top of page

దూరం కావాలి


'Duram Kavali' New Telugu Story

Written By Kalanos

'దూరం కావాలి' తెలుగు కథ

రచన: కాలనోస్



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“అదేంట్రా ఊరు చివర ఇల్లు తీస్కుంటున్నావు మళ్లీ?” అని నా మిత్రుడు సురేష్ అడగ్గానే నేను ఒక్కసారిగా గతం లోకి వెళ్లిపోయాను.


సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రిందట నేను ఓ స్థలం తీసుకున్నప్పుడు కూడా వాడిదే మాటన్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడున్నంత కాలుష్యం లేకపోయినా, కాలుష్యం బాగా పెరిగిపోయింది అని అనుకునే రోజులవి. నా పిల్లలు నాకు లాగా కాకుండా సొంతింట్లో పెరగాలని నేను, నా భార్య కలిసి ఇళ్లు వెదకడం మొదలుపెట్టాం.


ఇల్లు బాగుంటే ధర మరీ ఎక్కువుండేది, ధర బాగుంటే ఇల్లు బాగుండేది కాదు. ఇదంతా కాదు, ఓ స్థలం కొని మనమే మనకి కావాల్సినట్టుగా కట్టుకుందాం అని అనుకున్నాము. ఓ మధ్య తరగతి కుటుంబానికి నగరం లో అయితే స్థలం దొరకడం కష్టమే. మాకు కూడా అంతే!


మాకు అనుకూలమైన ధరకి ఊరు చివర అప్పుడప్పుడే స్థాపిస్తున్న కాలని లో మాకో స్థలం దొరికింది. స్థలం దొరికిన ఆనందం లో కొనే ముందర సురేష్ కి చూపిద్దాం అని వాడిని అక్కడికి తీసుకువెళ్ళాను. ఓ చిన్న విషయం వాడికి చెప్పడం మరిచిపోయినట్టే మీకు కూడా చెప్పడం మరిచిపోయాను – ఆ కాలని కి వెళ్ళే దారి.


కాలని చేరుకోవాలంటే ముందుగా ఓ అడవి దాటాలి, దాని తర్వాత కొన్ని పొలాలు దాటాలి, అప్పుడు ఓ కొండ లాంటి రోడ్డు లేదా రోడ్డు లాంటి కొండ కనిపిస్తుంది. అది ఎక్కగానే మా కాలని గేటు కనిపిస్తుంది. కాలని లోపలికి అడుగు పెట్టాకా ఇంకో కొండ లాంటి రోడ్డు ఒకటి కనిపిస్తుంది, అది ఎక్కగానే కుడి వైపుకి మా స్థలం కనిపిస్తుంది.


అక్కడికి చేరుకోగానే వాడు నా వైపు జాలి గా చూసాడు. “ఒరేయ్! తక్కువకి దొరికిందని టెంప్ట్ అయిపోకు. మనమింకా మంచి ఇల్లు చూద్దాం.”


“మరీ అంత తక్కువకి కూడా దొరకలేదులే. నచ్చే కొంటున్నాను.” అని జవాబిచ్చాను.


“స్థలం కొంటే ఆత్మలు ఫ్రీ అని ఆఫర్ ఏమైనా ఇచ్చాడా? కాలని లో తిప్పికొడితే పదిళ్లు కూడా లేవు. పొద్దున్న పూటే భయంకరం గా వుంది. ఇంక రాత్రిళ్లు ఎలా ఉంటాయో?”


“ప్రస్తుతానికి పదే ఇళ్లు ఉన్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉంటుందేంటి?”


“ఇక్కడ బుద్ధున్నవాడేవ్వడు ఇల్లు తీసుకోడు.”


వాడలాంటి వంకలు పెడతాడని నాకు ముందే తెలుసు. అందుకనే వాడి పెట్టే ప్రతి వంక కి నా దగ్గర జవాబు రేడీ చేసి పెట్టుకున్నాను.


“పిల్లల స్కూలు?”


“నమ్మకస్తుడైన ఆటో వాడున్నాడు. అయిదారేళ్లుగా పిల్లల్ని అతనే స్కూల్ దగ్గర దిగిపెట్టి తీస్కొస్తున్నాడు.”


“మరీ మీ ఆఫీసులు?”


“ఒరేయ్. నువ్వింకా ఎడ్లబండి కాలం లోనే ఉన్నావురా. ఇదంతా ఆటోమొబైల్ జమానా – దూరం అనే ఆలోచనలు ఇక్కడ నడవవు, కార్లూ, బైక్లూ మాత్రమే నడుస్తాయి.”


“అది సరే! నువ్విక్కడ ఇల్లు కట్టుకుంటే మనం నెలకోసారైనా కలవలేము రా!” అని వాడు విచారించాడు.


“ఇప్పుడు మాత్రం నెలకోసారి కలుస్తున్నామేమిటి?” అని తిరిగి వాడిని ప్రశ్నించడం తో వాడు మునిగిపోవాలనుకునే వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడని చెప్పి ఊరుకున్నాడు.


మొత్తానికి దాచుకున్న డబ్బులతో స్థలం కొని లోన్ తీసుకొని మరీ అక్కడ ఇల్లు కూడా కట్టించుకున్నాము. గృహ ప్రవేశానికి వచ్చిన వారంతా సురేష్ చెప్పిన మాటలను నాకు మళ్లీ చెపారు. “ఇల్లు చాలా బాగుంది. కానీ మరీ దూరంగా ఉంది. రావడానికే గంట పైన పట్టింది. ఇంక పిల్లలు రోజు స్కూల్ కి ఎలా వెడతారు? నువ్వు ఆఫీసు కి ఎలా వెడతావు?”

అందరూ అలా భయపెట్టేసరికి నేను ఓ సారి కాలని లో ఉంటున్న వారందరిని ఇక్కడ ఎలా ఉంటుందో అడుగుదామనుకున్నా. వారందరూ చెప్పింది ఒక్కటే – దూరం కానీ, చాలా బాగుంటుంది ఇక్కడ.


వారి హామీ తో ధైర్యం గా మా కొత్తింటికి వచ్చాము. వచ్చిన నెల రోజుల్లో ఆ పది ఇళ్లల్లో వున్న వారితో మా పరిచయాలు బాగా పెరిగాయి. వాళ్ల పిల్లలు, మా పిల్లలు మంచి ఫ్రెండ్స్ అయిపోయి రోజూ ఆడుకునేవారు కూడా.


అందరూ దూరం అంటుంటే ఏంటో అనుకున్నాను కానీ వచ్చాకా నాకే అర్థమైంది. అనుకున్నట్టుగానే మా ఆఫీసులు, పిల్లల స్కూలు మాకు బాగా దూరమయిపోయాయి.


వెళ్లడానికో గంట, తిరిగి రావడానికో గంట పట్టేవి. మా కాలని లో కిరాణా కొట్టులేవీ లేవు. ఏమైనా సామాన్లు కావాల్సి వస్తే కొంచెం దూరం వెళ్లాల్సిందే. నడుస్తూ వెళ్లడమైతే కుదిరేది కాదు.


ముందర ఏమైనా వస్తువు కావాల్సి వస్తే పిల్లల్ని షాప్ కి పంపి తీసుకురమ్మనే వాడిని. ఇప్పుడా సౌకర్యం లేకుండా పోయింది. దానికి తోడు మాయింటికి అతి దగ్గరైన సినిమా హాల్ ఏడు కిలోమీటర్ల దూరం లో ఉంది. ఎదైనా మంచి హోటల్లో భోజనం చేయాలంటే కనీసం మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి.


ఇక మా కాలని లో ఆ పది ఇళ్లల్లో ఉండే వాళ్లు తప్ప వేరే మనిషి కనిపించేవాడు కాదు. అంతా చాలా నిశబ్దం గా ఉండేది. సాయంత్రం ఏడైతే చాలు, సరిగ్గా పనిచేయని వీధి లైట్ల వల్ల ఓ హార్రర్ ఫీల్ వచ్చేది. అందుకే కాబోలు, కాలని లో ఉన్నవారంతా ఇలా కలిసికట్టుగా ఉంటాం.


ఇలా సాగుతున్న మా జీవితాలకి తిప్పలు ఇంకా తిప్పలేవు. నేను పనిచేసే కంపెనీ ని ఇంకో పెద్ద కంపేనీ టేక్ ఓవర్ చేసింది. అందువలన నన్ను వేరే ఆఫీసుకు మార్చారు. గంట ప్రయాణం కాస్తా గంటన్నర అయింది.


నగరం లో ఆరు-ఏడవ తరగతి లో ఉన్న పిల్లలికి ఐఐటీ కోచింగ్ చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. మా పిల్లల స్కూలు వాళ్లు ఈ ఫ్యాషన్ ని సద్వినియోగం చేస్కుందాం అని చెప్పి స్కూల్ తర్వాత ఓ రేండు గంటలు ఐఐటీ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. బాగానే ఉంది గా అని మాకు అనిపించినా మా పిల్లల ఆటోవాడికి అలా అనిపించలేదు. ఇలా అయితే రోజూ ఇంటికి వేళ్లేసరికి అతనికి ఆలస్యమవుతోందని చెప్పి ఇంక చేతులెత్తేసాడు.


వాళ్ళని స్కూల్ లో దించి తీసుకువచ్చే బాధ్యత ఇక నాదైపోయింది. దురదృష్టవశాత్తు నా ఆఫీసు ఓ దిక్కున ఉంటే పిల్లల స్కూల్ ఇంకో దిక్కున ఉండేది. ముందు రానూ పోనూ ఓ గంటన్నరైతే ఇప్పుడు రెండు గంటలయింది.


“అందరికీ అన్ని దూరమయిపోయాయి కదా? కొంతకాలం పిల్లల స్కూల్ దగ్గర్లో ఇల్లు అద్దెకి తీసుకోని ఉందామా?” అని నా భార్య నన్ను అడిగింది.


“ఏంతో ప్రేమతో కష్టమైనా సరే ఈ ఇల్లు కట్టుకున్నది మళ్లీ అద్దె ఇంటికి వెళ్లడానికా? ఈ ఇంటికి ఇంకా లోన్ కూడా కడుతున్నాము. కావాలంటే స్కూలు మార్పిద్దాం కానీ ఇల్లు మాత్రం మారద్దు.”


ఓ రోజు సురేష్ ఇంటికి వచ్చాడు. వీడి రాక ఒక్కటే తక్కువయిందనుకున్నాను. ఇప్పుడు “చెప్పానుకదా!” అని నాతో అంటాడు. నేననుకున్నట్టుగానే వాడు నా తో అదే మాటన్నాడు.


“ఏడు దాటితే ఓ మనిషి కూడా కనిపించడేంట్రా? అదే మా దగ్గరయితే ట్రాఫిక్ తో కళకళలాడిపోతుంది. ఇంత నిశబ్దం ఉంటే రాతిరి నిద్ర ఎలా పట్టుతుంది రా నీకు?”


“ట్రాఫిక్ ఉంటే కళకళాడటం అని అనర్రా!” అని వాడికి జవాబిచ్చాను.


“మా ఇంటి నుండి రెండడుగులేస్తే సినిమా థియేటర్ వస్తుంది. ఇంటి ఎదురుగా ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మా వెనక వీధిలోనే మా పిల్లల స్కూలు.” అని వాడు చాలా గొప్పగా చెప్పాడు.


వాడికి ఏం జవాబివ్వాలో తెలియక దేవుడ్ని ప్రార్థించాను – “దేవుడా! నా కోసం నాకు పెద్దగా కోరికలు లేవు కానీ లోక కళ్యాణం కోసం కొన్ని కోరికలు కోరతాను. మా కాలని లో ఓ కిరాణా కొట్టు రావాలి, దగ్గర్లో ఓ స్కూలు, హోటల్, హాస్పిటల్, సినిమా హాల్ రావాలి. అదే చేత్తో ఆ స్ట్రీట్ లైట్ల సంగతి కూడా చూడు స్వామి రాత్రిళ్లు చాలా భయంగా ఉంటోంది.”


దేవుడి దగ్గర నా పెటిషన్ పెట్టాకా చాలా మంది పెటిషన్లు నా కంటే ముందే ఉండుంటాయిలే టయిమ్ పడుతుందని అనుకున్నాను. మెల్లెగా ఆ సంగతి మరచిపోయాను. నేను మొదట గమనించనంత చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. మా కాలని లో ఇంకెవరో వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకొకరు వచ్చారు. అలా నెమ్మదిగా పది ఇళ్లు కాస్తా ఇరవై ఇళ్లు అయ్యాయి, ఆ ఇరవై యాభై అయ్యాయి. దాంతో మా వీధి లైట్లను కూడా బాగుచేసారు.


ఆ క్షణం దేవుడికి నా కోరికి అందిందని సంతోష పడ్డాను. కోరిక తీర్చడం లో ఆలస్యం అయిందనేమో బహుశా నేను అడిగిన వాటికి మించి యిచ్చాడు. కిరాణా కొట్టు అడిగాను కాలని లో సూపర్ మార్కెట్ వచ్చింది. ఇంటికి దగ్గర్లో ఓ సినిమా హాల్ అడిగాను ఏకంగా మల్టీప్లెక్స్ ఒచ్చింది. దానితో పాటు ఓ మాల్ కూడా వచ్చింది. మా ఎరియాకి ఓ కొత్త కళ తీసుకువచ్చింది. దెబ్బకి దారిన ఉన్న పొలాలు, అడివి మాయం అయిపోయి మాకు లాంటి కాలనీలు ఇమ్కో రెండు మూడు వచ్చాయి.


ఇక్కడతో ఆగలేదు. మా కాలని లో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది. అప్పటికి మా పిల్లల స్కూల్ అయిపోయింది కానీ మాకు లాగా వేరే కుటుంబాలు కష్టపడవని ఆనంద పడ్డాము. పిల్లల ఇంటర్ అయేసరికి కాలని లో ఓ ఇంటర్ కాలేజ్ కూడా వచ్చింది. వీళ్ళ ఇంజినీరింగ్ అయ్యాక కాలని లో ఓ ఇంజినీరింగ్ కాలేజ్ కూడా వస్తుందేమో అని అనుకొని నవ్వుకున్నాము.

ఇదంతా అవుతుండగా సురేష్ నాకు ఫోన్ చేసి మా కాలని లో స్థలాలు చూడడానికి వస్తున్నాం అని చెప్పాడు.


“బుద్ధున్నవాడెవ్వడూ ఇక్కడ ఇల్లు తీసుకోడన్నావ్?” అని వాడిని అడిగాను.


అలా వాడితో అన్నప్పటికీ వాడు నాకు దగ్గర్లో ఉండబోతున్నాడని ఆనందం వేసింది. వాడే కాదు నాకు తెలిసిన వేరే వాళ్లు కూడా మా కాలని లో ఇల్లు తీసుకున్నారు. ఊరు అవతల కాస్తా ఊరిలోని భాగం అయింది.


పిల్లల చదువులు అయిపోయి విదేశాల్లో మంచి ఉంద్యోగాలు సంపాదిచారు. నేను నా భార్య కూడా రిటైర్ అయిపోయాము. అన్ని సదుపాయాలు పక్కనే ఉండటం వల్ల రిటైర్మెంట్ తరువాత చాలా సరదాగా ఉండేది. ఒక్కప్పుడు అన్ని సదుపాయాలు దూరంగా ఉండేవి కానీ ఇప్పుడు దూరం అనే మాటే మాకు దూరం అయిపోయింది.


దూరం మాకు దూరం అయింది అని పూర్తిగా ఆనందించకుండానే వేరే సమస్యలు మాకు దగ్గరయ్యాయి. సిటీ లో ఉండే అలవాటు కోల్పోయి అక్కడి సమస్యలు పూర్తిగా మరిచిపోయాం మేము. అప్పట్లో ఏ నిశబ్దం అయితే మాకు భయంకరంగా అనిపించిందో అదే ఇప్పుడు ప్రశాంతంగా మారింది. ఆ ప్రశాంతత మాకు దొరకడం ఆగిపోయింది. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ హార్న్ శబ్దాలు! ఒకప్పుడు ఎక్కడ చూసినా పొలాలు, అడవులు అనుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. మేము తప్ప వేరే మనుషులు లేరని బాధ పడేవాళ్లం. ఇప్పుడు రోజూ పొద్దున్న మా ఇంటి ముందే ట్రాఫిక్ జామ్ అయి ఉంటోంది. ఇది చూసి నేనింక తట్టుకోలేకపోయాను.


మేము వచ్చిన కాలని ఏనా ఇది అని అనుకున్నాను.


ఆలోచించి చూస్తే మేము కాలని కి వచ్చిన కొత్తలో వున్న పది కుటుంబాల్లో ఎవ్వరూ ఇప్పుడు ఈ కాలని లో లేరు. అందరూ మళ్లీ ఊరవతలకి వెళ్లిపోయారు.


మా పిల్లలతో మాట్లాడి మేము కూడా ఊరవతల ఓ కొత్తిల్లు తీస్కున్నాము. ఏ దూరమయితే వద్దనుకున్నామో అదే దూరం కోసం వెత్తుకొని మరీ ఇల్లు మారబోతున్నాము. ఈ విషయమే చెపుదామని సురేష్ దగ్గరికి వచ్చాను.


“ఎందుకు రా?” అని వాడడగ్గానే, “అన్నీ మరీ దగ్గరయిపోయాయి రా ఇక్కడ!” అని వాడికి బదులు చెప్పాను….


---0---


కాలనోస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link:

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


రచయిత పరిచయం: కాలనోస్

పరిచయ వాక్యాలు- నేను Children's Hospital of Philadelphia లొ Data Analyst గా పని చేస్తున్నాను. నేను తెలుగు మరియూ ఇంగ్లీష్ లో కథలు వ్రాయడం ఇష్టపడతాను. నేను వ్రాసిన మొదటి తెలుగు కథ 'డ్రైవింగ్ స్కూల్' సెప్టెంబర్ 2019 లో ఆంధ్రజ్యోతి లొ ప్రచురింపబడింది. సెంటిమెంట్ నా రెండవ కథ.


103 views1 comment
bottom of page