top of page

ఏడుకొండలు


'Edukondalu' - New Telugu Story Written By Madduri Bindumadhavi

'ఏడుకొండలు' తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)నాలుగు నెలలు పిల్లల దగ్గర గడిపి వద్దామని పరంధామయ్య గారి దంపతులు అమెరికా వెళ్ళారు.


ఆ రోజు శ్రావణ శుక్రవారం! మహలక్ష్మమ్మ గారు మామూలుగా చేసే వంటతో పాటు నాలుగు రకాలపిండివంటలు చేసి అమ్మవారి పూజ చేసుకుని, భోజనం చేసి నడుం వాల్చారు.


ఉన్నట్టుండి గుండెలు పట్టుకుని గిల గిల్లాడుతున్నారు. చెమటతో చీర తడిసిపోయింది. మంచం మీదనించి లేద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ, లేవలేకపోతున్నారు. పక్క గదిలో టీవీ చూస్తున్న భర్తని పిలుద్దామని గొంతెత్తానని అనుకున్నారు. శబ్దం బయటికి రాలేదు. తలంటి పోసుకుని, తడి ఆరుతుందని వేసుకున్న జారు ముడి జుట్టువిడివడి దిండుమీద పరుచుకుంది.


"కాఫీ పెడతావా" అంటూ గదిలొకొచ్చిన పరంధామయ్య గారు భార్యని చూసి, గాభరాగా కొడుక్కి ఫోన్ చేశారు. కొడుకు భరత్ ఆఫీస్ నించి బయలుదేరి వచ్చేసరికి అరగంట పట్టింది. వస్తూ భార్య మణికి ఫోన్ చేసి రమ్మన్నాడు. డాక్టర్ ఫ్రెండ్ ని కనుక్కుని తను వచ్చే లోపు తీసుకోవలసిన జాగ్రత్తలు తండ్రికి చెప్పాడు.

గంట తరువాత వచ్చిన భరత్ తల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఎడ్మిట్ చేశాడు. అన్ని పరీక్షలు చేసి, మహలక్ష్మమ్మగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని… మూడు బ్లాక్స్ ఉన్నాయని, స్టెంట్ వెయ్యాలని నిర్ణయించారు.

********

హాస్పిటల్ నించి వచ్చి పది రోజులయింది. కొడుకు, కోడలు నాలుగో రోజు నించే వారి రొటీన్ లో పడిపోయారు.


ఉదయం కాఫీ కలపటం నేర్చుకున్న పరంధామయ్య గారు, భార్యని లేపి "బ్రష్ చేసుకుని రా, కాఫీ తయారుగాఉంది. కాఫీ తాగి అలా పదడుగులు వేసి వద్దాం" అన్నారు.


అప్పటి వరకు, తను కాచి గ్లాసులో పోసిన కాఫీ చల్లారితే వెచ్చపెట్టుకోవటం కూడా చేతకాని భర్త, కాఫీ కాచి తనని నిద్ర లేపుతుంటే 'ఈ వయసులో ఈయన్ని ఇబ్బంది పెడుతున్నానే' అనుకుంటూ అపరాధ భావంతో లేచి, బ్రష్ చేసుకుని వచ్చారు.


కాఫీ గ్లాసు చేతికిస్తున్న భర్తని అదే భావంతో చూశారు.


"ఏంటోయ్ అలా చూస్తున్నావు. ఇన్నాళ్ళకి చిన్న చిన్న పనులు నేర్చుకుని నీకు సేవ చేసే భాగ్యం కలిగిందని నేను సంతోషిస్తుంటే, నువ్వెందుకు సిగ్గుతో ముడుచుకు పోతున్నావ్" అన్నారు.

"ఇక్కడ అన్నీ నాకే కొత్తగా ఉంటాయి. ఇక పని పాటలు చేతకాని మీరు తడుముకుంటూ చేస్తుంటే, ఏమీ అనుకోకుండా ఎలా ఉండనండి? మన ఊరైతే ఏ వంట మనిషినో మాట్లాడుకునే వాళ్ళం!"


"మన పిల్లలు చెయ్యరని కాదు. వారి జీవితాలు, అలవాట్లు, అవసరాలు వేరు. ఇద్దరికీ సమానంగా డ్యూటీలు, ఆ పైన పిల్లల పనులాయే!" అనుకుంటూ కాఫీ తాగి స్వెటర్ వేసుకుని, స్కార్ఫ్ కట్టుకుని వాక్ కితయారయ్యారు.


********


వర్క్ ఫ్రం హోం అనే భావన అమలౌతున్నందున ఆఫీసు పనులకి ఓ వేళా పాళా అనేది ఉండట్లేదు. రాత్రిపదింటికి కొంత పనయ్యాక భోజనానికి బ్రేక్ తీసుకున్న భరత్ డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళుతూ "అమ్మా మందులువేసుకున్నావా? నాన్నగారూ...మీరు అమ్మా భోజనం చేశారా?" అన్నాడు.


అప్పటికే నిద్రలోకి జారిపోయిన మహలక్ష్మమ్మ గారి నించి సమాధానం లేదు. పరంధామయ్య గారు సగం నిద్రలోంచి 'ఆ’ అన్నారు… అది తెలిసి చెప్పారో, నిద్రలో తెలియక అన్నారో ఆ భగవంతుడికే తెలియాలి!


"రేపు ఉదయం అమ్మతో మాట్లాడాలి! హాస్పిటల్ నించి వచ్చాక ఆవిడ ఆరోగ్యం గురించి తీరుబడిగా కూర్చుని మాట్లాడే టైమే దొరకలేదు" అనుకుని డిన్నర్ ముగించి మళ్ళీ పనిలో పడ్డాడు.


"రేపు పొద్దున్నే నేను లాగిన్ అవ్వాలి. పిల్లలని స్కూల్ కి నువ్వు రెడీ చెయ్యి" అని మణి మెసేజి పెట్టింది.. భరత్ కి. రాత్రి రెండింటికి పడుకుంటూ భరత్ భార్య మెసేజి చూసి "అబ్బా.. రేపన్నా అమ్మతో కాసేపు కులాసాగా మాట్లాడాలని, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. పిల్లలని స్కూల్ కి పంపి తయారయ్యేసరికి నేను లాగిన్ అయ్యే టైం అవుతుంది" అని నిస్సహాయంగా ఆవలిస్తూ నిద్రలోకి జారిపోయాడు.


మరునాడు షరా మామూలే...పరంధామయ్య గారు కాఫీ పెట్టి తను తాగి, భార్యకిచ్చి ఆవిడ తాగాక వాకింగ్ కి వెళ్ళొచ్చారు.


భర్త కూరలు అందిస్తుంటే మహలక్ష్మమ్మ గారు వంట పూర్తి చేశారు.


పై ఫ్లోర్లో తన కంప్యూటర్ దగ్గరకే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళిన కోడలు, పరంధామయ్య గారూ వాళ్ళు భోజనం చేస్తూండగా కిందికి దిగి వచ్చింది.


"అయ్యో అత్తయ్యా! ఆరోగ్యం బాగా లేని మీరే వంట చేసుకోవలసి వచ్చింది. డెడ్ లైన్, దగ్గరలో ఉంది. ప్రోగ్రాంలో ఏదో ప్రాబ్లెం వచ్చిందిట. అందుకే పొద్దున్నే పనిలోకి వెళ్ళవలసి వచ్చింది. మా ఉద్యోగాలకి వారం, వర్జ్యం, సెలవులు ఉండట్లేదు. పోనీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోదామంటే, ఎవరి ఉద్యోగాలకి ఎప్పుడు ఎసరు వస్తుందో తెలియట్లేదు."


"అదీ కాక, రాత్రింబవళ్ళు మీ అబ్బాయి ఆఫీసు పని చూసుకుంటూ కూర్చుంటారు. పిల్లలు వారి చదువుల హడావుడిలో వాళ్ళుంటారు. ఏం చెయ్యాలో తోచక నిరుడే ఉద్యోగంలో చేరాను. ఒక సారి ఉద్యోగంలో చేరాక పులినోట్లో తల పెట్టినట్లే! బయటికి తీసుకోవటం మన చేతిలో ఉండదు" అని నొచ్చుకున్నది.


"పోనీలే అమ్మా, నువ్వని కాదు..మీ తరం వారందరికీ ఉద్యోగ బాధ్యతలు ఇలాగే ఉంటున్నాయి. ఆలస్యమయింది.. ముందు భోజనానికి రా" అని పరంధామయ్య గారు కంచం తేవటానికి వెళ్ళారు.


*******

"నాలుగు నెలలయింది వచ్చి, ఇక బయలుదేరతాం నాయనా! ఈ పాటికే వెళ్ళవలసింది. మీ అమ్మ కాస్త కోలుకున్నాక వెళ్ళచ్చు అన్నావని ఆగాం. ఇక టికెట్ తీసుకో" అన్నారు పరంధామయ్యగారు.


కొడుకు దగ్గర నించి తిరిగొచ్చాక మహలక్ష్మమ్మ గారి ఆరోగ్యం గురించి తెలిసిన నలుగురూ ఫోన్లు చెయ్యటం, ఇంటికొచ్చి పరామర్శించటంతో నాలుగు నెలలు ఇట్టే గడిచి పోయాయి.


ఆ రోజు ఊళ్ళోనే జరుగుతున్న బావ మరిది కూతురు పెళ్ళికి వెళ్ళొచ్చి "ఈ రోజు ఎందుకో కొంచెం అలసటగా ఉందోయ్" అన్నారు పరంధామయ్యగారు.


"పెళ్ళిలో నలుగురితో మాట్లాడటం, అకాల భోజనం… అందులోను పెళ్ళి భోజనం వల్ల అయి ఉండచ్చు" అన్నారు మహలక్ష్మమ్మ గారు.


రాత్రికి లైట్ గా పాలు తాగి పడుకుందామనుకున్నారు దంపతులిద్దరూ.


అర్ధ రాత్రి నిద్రలో ఉన్న భార్యని లేపి, "ఏమిటో తల తిరుగుతున్నట్లుగా ఉన్నది. కొంచెం మంచి నీళ్ళుఇస్తావా?" అన్నారు పరంధామయ్యగారు.


మంచం పక్కనే స్టూల్ మీద పెట్టిన నీళ్ళు గ్లాసులోకి వంచి ఇచ్చే లోపు మంచం మీద నించి కిందపడిపోయారు. ముందు కంగారు పడినా, కాస్త తేరుకుని పక్కింటి బెల్ కొట్టారు మహలక్ష్మమ్మ గారు.

ఈ టైం లో ఎవరా అనుకుంటూ లక్ష్మణ్ వచ్చి తలుపు తీసి, "మామ్మగారూ ఏమిటి? తాతగారు ఎలాఉన్నారు" అంటూ షర్ట్ మార్చుకుని, భార్యని లేపి సెల్ ఫోన్ చేతపుచ్చుకుని వచ్చాడు.


పరంధామయ్యగారిని చూసి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కి తీసుకెళుతూ, "మామ్మగారూ! మీరు ఇంట్లో ఉండండి. నా భార్య.. బాల మీకు తోడుగా ఉంటుంది. మా ఫ్రెండ్ అక్కడే డాక్టర్. అతను తాతగారిని చూసి చెప్పాక బాలకి ఫోన్ చేస్తాను. కంగారు పడకండి" అని చెప్పి వెళ్ళాడు.


********


"వెంటనే తీసుకొచ్చి మంచిపని చేశారు. ఆయనకి "పెరాలిటిక్ స్ట్రోక్" వచ్చింది. ప్రమాదమేమీ లేదు. మందులు వాడి, ఫిజియో థెరపీలు క్రమం తప్పకుండా చేయిస్తే మళ్ళీ ఆయన తన పనులు తను చేసుకోగలుగుతారు" అని చెప్పారని భార్య బాలకి ఫోన్ చేసి చెప్పాడు లక్ష్మణ్.


నాలుగు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి ఇంటికి పంపారు. ఈ నాలుగు రోజులు ఆఫీసుకి సెలవు పెట్టిపరంధామయ్య గారిని కంటికి రెప్పలా కాపాడాడు, లక్ష్మణ్.


తను క్యాంపులకెళ్ళినప్పుడు, తన భార్యకి తోడుగా ఉండి పిల్లలని స్వంత మనవల్లా చూసే ఆ వృద్ధ దంపతులకి కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండటం తన అదృష్టం అనుకున్నాడు.


వేళ కాని వేళ తన తండ్రికి వచ్చిన ఆరోగ్య సమస్యకి, తన కంటే ఎక్కువ శ్రద్ధగా అండగా ఉన్న లక్ష్మణ్ కికృతజ్ఞతలు చెప్పాడు భరత్.


నాన్నగారికి స్ట్రోక్ వచ్చిందని తెలిసి ఢిల్లీ లో ఉండే కూతురు అపర్ణ పరుగెత్తుకొచ్చింది. ఇంట్లో తల్లికి…చేతికి, మనసుకి తోడుగా ఉండి అన్నయ్య వచ్చాక రెండు రోజులుండి "అమ్మా ఇంక నేను వెళ్ళనా మరి. పిల్లలని మా ఫ్రెండ్దగ్గర వదిలి వచ్చాను. వాళ్ళకి వచ్చే వారం నించి పరీక్షలు. సెలవులిచ్చాక వాళ్ళని తీసుకొస్తాను" అని తిరుగు ప్రయాణమయింది.


పది రోజుల సెలవు పెట్టుకుని వచ్చి తండ్రిని చూసి, "నాన్న గారూ! నాతో వచ్చెయ్యండి. అమ్మకి కూడా స్టెంట్స్వేసి ఇంకా ఏడాది అవలేదు. మీ అవసరాలు అన్నీ పక్కనుండి చూసుకోవటం ఈ వయసులో అమ్మకి కష్టం" అన్నాడు.


"అక్కడ మీ పరుగుల జీవితాలు, విశ్రాంతి లేని ఉద్యోగాలు మొన్న వచ్చినప్పుడు చూశాం కదా నాయనా! తప్పుగా అనుకోకు. నెలకి ఓ పాతిక వేలు చెల్లిస్తే, ఇరవై నాలుగు గంటలు మన పక్కనే ఉండి సేవ చేసే మనుషులని పంపే ఏజెన్సీలు ఉన్నాయిట. మన లక్ష్మణ్ కనుక్కున్నాడు.


ముందుగా వారి సేవలకోసం ప్రయత్నిద్దాము. అంతగా వీలు కాకపోతే అప్పుడు వస్తాంలే" అన్నారు పరంధామయ్య గారు.

నాన్నగారు చెప్పింది అసత్యమని అనలేకపోయాడు భరత్.

తనుండగానే ఏజెన్సీ వారితో మాట్లాడి మనిషిని ఏర్పాటు చేసి, జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు భరత్.


********

ఏజెన్సీ వారు నెలకొకరిని చొప్పున ఇద్దరు ముగ్గురిని మొదట్లో పంపించారు.


నిజానికి ఏజెన్సీ నించి వచ్చే వ్యక్తులతో ఇంటి పనులు చేయించ కూడదనేది నియమం. కానీ వాళ్ళు కుటుంబంలో కలిసిపోయి..పెద్దల అవసరాలు కనిపెట్టి... చేతిలో పని అందుకుని అన్ని పనులు చేస్తే… వీళ్ళనిసహాయం కోసం పెట్టుకున్న పెద్దలకి ఎంతో ఊరటగా ఉంటుంది. అది ఎవరికి వారికి ఉండే వ్యక్తిగత లక్షణమేకానీ.. డిమాండ్ చెయ్యగలిగినది కాదు.


తటస్థంగా.. అంటీముట్టనట్టు.. ఏజెన్సీ వారు పంపించే పని మాత్రమే చేసి.. ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళూ ఉంటారు. నిజానికి వాళ్ళే ఎక్కువ!


ఇద్దరి ముగ్గురి తరువాత వచ్చిన ఏడుకొండలు పరంధామయ్యగారి దంపతుల ఆప్యాయతా అనురాగాలతోవారి కుటుంబంలో ఒకడుగా కలిసిపోయాడు. ఆయన అవసరాలన్నీ దగ్గరుండి చూసుకునేవాడు.


అందుచేత ఏజెన్సీ వారిని అడిగి ఏడుకొండలినే ఎప్పుడూ ఉంచుకునే ఏర్పాటు చేసుకున్నారు. అలా వారికి అలవాటు పడిన ఏడుకొండలు నాలుగు నెలలకే వారికి తలలో నాలుకగా మారాడు.


సెలవులిచ్చాక పిల్లల్ని తీసుకుని వచ్చిన అపర్ణ… ఏడుకొండలు తండ్రికి చేస్తున్న సేవలు చూసి ముగ్ధురాలయింది. "వీరిని కూడా వంతుల వారీగా మారుస్తారా? మనం ఎప్పటికీ ఒక్కరినే మనకింద ఉంచమనిఅడగచ్చా?" అనడిగింది.


"పాపం వాళ్ళకి ఇల్లు, సంసారం ఉంటుందమ్మా! అయినా పాపం ఏడు కొండలు శని వారం ఉదయం నాన్నగారికి స్నానం చేయించి పదింటికి వెళ్ళి ఆదివారం సాయంత్రం ఐదయ్యేసరికి వచ్చేస్తాడు. అంతా కలిపి ఓ36 గం లు ఉండడనుకో! అలా ఇతను వెళ్ళినప్పుడు వేరే వారిని ఏజెన్సీ ఏర్పాటు చేస్తుంది. కానీ నిత్యకృత్యానికి మాత్రం మనం అడిగామని ఇతన్నే మన దగ్గరకి పంపిస్తున్నారు" అన్నారు మహలక్ష్మమ్మ గారు.


"అమ్మా.. ఇలా రాత్రింబవళ్ళు ఇలా ఇంట్లో పెట్టుకోవటం క్షేమమఏనా? వీళ్ళు నమ్మకస్తులేనా" అని తల్లిని విడిగా పిలిచి అడిగింది.


"ఇప్పటి వరకు ఏ సమస్యా రాలేదు. నువ్వూ గమనించు నీకే తెలుస్తుంది" అన్నారు.

@@@@


అన్నం తినటానికి మారాం చేసే ఏడేళ్ళ మాధవ్ ని "మా నాన్న కదూ, ఈ ఒక్క ముద్ద తిను నాన్నా. సాయంత్రం నీకు కార్టూన్ చానెల్ ఇంకో పావుగంట ఎక్కువ చూడనిస్తానుగా" అని బతిమాలుతున్న అపర్ణని ఆమె కొడుకుని మురిపెంగా… అపురూపంగా చూస్తున్న ఏడు కొండలు కళ్ళల్లో నీలి నీడలు కదిలాయి.


అతని ఆ చూపు అపర్ణ దృష్టిని దాటిపోలేదు. "పాపం తన కొడుకుని ఎంత మిస్సవుతున్నాడో" అనుకున్నది అపర్ణ.

"అతనికి తల్లిదండ్రులు, భార్యా పిల్లలు లేరా అమ్మా?" అని, "అయినా లేకుండా ఎలా ఉంటారులే! వారినెవరు చూస్తారు? అతని తల్లిదండ్రులు కూడా పెద్ద వాళ్ళే అయి ఉంటారు కదా?"


"అతని భార్య పాపం ఇంత చిన్న వయసులో..ముసలి వారైన అత్త మామలని, తన పిల్లలని ఒంటరిగాచూసుకోవాలి! ఈ రోజుల్లో పిల్లలని తల్లి ఒక్కతే పెంచటం నిజంగా కత్తి మీద సామేనమ్మా! పిల్లలకి కూడా తండ్రిప్రేమ ఆప్యాయత దక్కవు!" అన్నది ప్రశ్నా తనే వేసి సమాధానమూ తనే చెబుతూ అపర్ణ సాలోచనగా.


"అదీ కాక ఆ అమ్మాయి పాపం ఈ వయసులోనే భర్తతో దాంపత్య జీవితం గడపలేని పరిస్థితి! సాంసారికజీవితం అనేది అందరికీ ప్రాధమిక హక్కు! అది కూడా ఆకలి, నిద్ర లాంటి దైనందిన ప్రాకృతిక అవసరమే కదా! అది చంపుకుని బతకాల్సిందేనా?" అనుకుంది మనసులో సానుభూతిగా!


"ఏం చేస్తారమ్మా! ఏదో ఒక విధంగా రూపాయి సంపాదించు కోవాలి! రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు! వారిది అసహాయత అయితే, మనది అశక్తతతో కూడుకున్న అవసరం!" అన్నది మహలక్ష్మమ్మ గారు.


"వీళ్ళ గురించి అనుకుంటున్నాం కానీ.. అసలు ఈ రోజుల్లో కన్నవారిని... కట్టుకున్న వారిని పుట్టిన చోటుని, వదిలేసి వెళ్ళని వారెవరు? పెద్ద చదువులు చదువుకున్న మీ అన్నయ్య లాంటి వాళ్ళూ పొట్ట చేత పుచ్చుకుని విదేశాలకి వెళుతున్నారు! కాకపోతే వాళ్ళు పెళ్ళాం పిల్లలతో కలిసి ఉంటూ తల్లిదండ్రులకి దూరంగా బతుకుతున్నారు! పెద్దగా చదువుకోని వాళ్ళు ఇలా...ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్ళి రెక్కల కష్టం చేసిసంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు!" అన్నది మహలక్ష్మమ్మగారు.


*******


అపర్ణ పిల్లలతో వచ్చాక, పరంధామయ్య దంపతులకి కొంత ఆసరా దొరికిందనే చెప్పాలి. ఆ ధైర్యంతో ఏడుకొండలు "అమ్మగారూ రెండు రోజులు ఇంటికెళ్ళొస్తాను" అన్నాడు.

ఆ రోజు అతని ముఖంలో కనిపించిన ఆనందం అపర్ణని కూడా సంతోష పరిచింది.


చెప్పా పెట్టకుండా వచ్చిన కొడుకు ఏడుకొండలిని చూసి తల్లి తండ్రి సంతోషించారు. అతని భార్య మంగమాత్రం ముభావంగా తప్పించుకు తిరిగింది.


రాత్రి పడక చేరిన మంగని "ఏం అలా ఉన్నావ్? ఒంట్లో బాగాలేదా" అని దగ్గరకి తీసుకున్నాడు.


"ఈ ఉద్యోగంమానెయ్యచ్చుగా! కొత్త చీర కట్టుకున్నప్పుడు బాగుందని మెచ్చుకునేందుకు నువ్వుండవ్! ఏ చికెన్ బిరియానీయో చేసి ఇంట్లో అందరం తింటుంటే, నువ్వేం తిన్నావో..ఎట్లా ఉన్నావో అని బెంగేస్తుంది."


"నాకు హుషారుగా అనిపించినప్పుడు నా పక్కన ఉండవు! మల్లె పూలు చూసినా, మంచి సినిమా బొమ్మ చూసినా నువ్వే గుర్తొస్తావు! చిన్నోడు అస్తమానం 'నాన్నెప్పుడొస్తాడు? నాకు బొమ్మలు కావాలి, ఐస్ క్రీం కావాలి ' అని ఒకటే గొడవ చేస్తన్నాడు. కలో గంజో పంచుకు తినచ్చు వచ్చెయ్ మామా! పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చే ఉద్యోగం ఇంటికి దగ్గరలో ఏదో ఒకటి చూసుకుందాం" అన్నది అతనిలో ఒదిగిపోతూ!


"ఆ పెద్దయ్యగారు వాళ్ళు చాలా మంచోళ్ళే మంగి! నువ్వన్నట్టు సికెన్లు, మటన్లు ఆడ ఉండవు. కానీ ఆళ్ళునన్ను చాలా బాగా సూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు దగ్గర లేక, సొంతంగా పనులు చేసుకోలేక చాలా కట్టపడుతున్నారు. మీకు దూరంగా ఉండటం నాకూ కట్టమే! కానీ నా చదువుకి పెద్ద ఉద్యోగాలేం వస్తాయ్ చెప్పు. బిజినెస్ చెయ్యటానికి మన దగ్గర డబ్బులేడున్నాయ్? వాళ్ళని నమ్మకంగా కనిపెట్టుకుని ఉంటే, వాళ్ళబ్బాయి గారు వచ్చినప్పుడు మనకేదయినా సహాయం చెయ్యమని అడగటానికి వీలవుతుంది. ఒకరికొకరు సాయం అంతే!" అన్నాడు.


"అందుకే ఇంకో సంవత్సరం ఓర్సుకో, ఇంటి దగ్గరే ఏదో ఒకటి సూసుకుంటా! ఇంకా నయం నేను పదేనురోజుల కొకసారి వస్తన్నా. దుబాయి, కువైట్, బహ్రెయిన్... ఇతర అరబ్బు దేశాలకి వెళ్ళే శానా మంది జీవితాలు ఇంతేకదా! ఏళ్ళకి ఏళ్ళు కుటుంబాలకి దూరంగా బతుకుతారు." అన్నాడు.


"నిజమే అనుకో మామా! నీకు నాకు ఒకరి పొందు ఇంకోళ్ళు కోరుకునే వయసు కూడా ఇప్పుడే ఉంది. కొన్నాళ్ళయితే మనమూ పెద్దాళ్ళమై పోతాం" అన్నది.


మాటలు చాల్లే అన్నట్టు ఏడుకొండలు మంగి నోరు తననోటితో మూసేశాడు.


********


తిరిగొచ్చిన ఏడుకొండలు హుషారుగా ఉన్నాడు. అతన్ని ఇంటికి…తన వారి దగ్గరకి పంపించగలిగామనిఅపర్ణ కూడా సంతోషించింది.


పది రోజులుండి అపర్ణ పిల్లలని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది. పరంధామయ్య గారు వాళ్ళు మళ్ళీ దైనందిన జీవితంలో పడ్డారు.


ఒక రోజు ఏడుకొండలికి తల్లి ఏడుస్తూ ఫోన్ చేసింది. తనకి ఒక రిలీవర్ ని వెంటనే పంపించమని, వెంటనేతను ఇంటికి వెళ్ళాలని ఏడుకొండలు ఏజెన్సీ కి ఫోన్ చేసి చెప్పాడు.


పాపం అతని తండ్రికేదయినా ప్రమాదం జరిగిందేమో అని మహలక్ష్మమ్మ గారు "వెంటనే వెళ్ళి రా నాయనా! ఏజెన్సీ మరొక మనిషిని పంపించకపోతే, ఈ పూటకి మన పక్కింటి లక్ష్మణ్ సాయం ఉంటాడులే" అని చెప్పి పంపారు.


అలా వెళ్ళిన ఏడుకొండలు వారానికి కానీ రాలేదు. ఆ వారంలో ఫోన్ కూడా చెయ్యలేదు. ఇక్కడ వీళ్ళ ఆదుర్దా వీరిది.


మొహం వేళ్ళాడేసుకు వచ్చిన ఏడు కొండలిని "ఏం బాబూ, ఇంట్లో అందరూ కులాసాయేనా? ఏం జరిగింది" అనడిగారు మహలక్ష్మమ్మ గారు.


అతని జవాబు విని స్తబ్ధుగా అయిపోయారు.


అప్పుడే అపర్ణ ఫోన్ చేసి "అమ్మా ఏడుకొండలు వచ్చాడా? అంతా బానే ఉందా" అనడిగింది.


మహలక్ష్మమ్మ గారు ఫోన్ తీసుకుని, "ఏడుకొండలు ఈ రోజే వచ్చాడు. భర్తకి దూరంగా ఒంటరిగా ఉంటున్నదని అతని భార్యని గమనించిన ఒకడు.. ఆ అమ్మాయిని నెమ్మదిగా కబుర్లల్లో పెట్టి, మొన్న కూరలు తేవటానికి బయటికి వెళ్ళినపుడు లేవదీసుకు పోయాడుట. నువ్వన్నట్టే అతని భార్య యౌవనంలో ఉంది. ఓర్చుకోలేకపోయిందో ఏమో, కబుర్లకి ప్రలోభపడి కన్న కొడుకుని, అత్త మామలని వదిలేసి వెళ్ళిపోయిందిట” అన్నారు.


"పూర్వం భార్య భర్త ఒక చూరు కింద బతికే వారు. కూలీ నాలి చేసుకుంటూనో, చిన్న వ్యాపారాలు చూసుకుంటూనో సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు.


ఉన్నదాంట్లో పంచుకు తింటూ కుటుంబంలో పెద్దల్ని, పిల్లలని చూసుకుంటూ గుట్టుగా బతికేవారు. టీవీలు లేవు. ఇన్ని ఆకర్షణలు.. ప్రలోభాలు లేవు కాబట్టి కోరికలు కూడా తక్కువ ఉండేవి."


"ఇప్పుడు ప్రపంచం రంగుల మయం. ఆకర్షణలన్నీ అవసరాలుగా కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు, ఈ దిక్కుమాలిన టీవీలు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక...అన్నీ కళ్ళకి కట్టినట్టు బొమ్మలతో చూపిస్తున్నారు. జీవితాల్లో మంచిచెడు విచక్షణ పోయింది. అన్నీ అరచేతిలోకి వచ్చేసరికి, వయసుతో సంబంధం లేకుండా ఇవిచూడచ్చు… చూడకూడదు అనే నియమం లేకుండా పోయింది." అన్నారు మహలక్ష్మమ్మ గారు దీర్ఘంగా నిశ్వశిస్తూ!


"అంతేనా.. తప్పు ఎలా చేశారో, అరిటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చూపిస్తూ, తప్పు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే మనిషి కట్టు తప్పి ప్రవర్తించటం తేలికై పోయింది. అందుకే తాత్కాలిక ప్రలోభాలకి లొంగి, ఆడ వారు కూడా వివాహేతర సంబంధాలకి పాల్పడుతున్నారేమో అనిపిస్తోంది." అన్నారు మహలక్ష్మి గారు కొనసాగింపుగా!


"ఒక దేశంలోనే ఉండి అడపా దడపా వెళ్ళి రాగలిగే అవకాశం ఉంటేనే ఇలా ఉంటే… దుబాయ్ లాంటి దేశాలకి పొట్ట చేత పుచ్చుకుని వెళ్ళి ఏళ్ళ తరబడి రాలేని చిరుద్యోగుల కుటుంబాల్లో మొగుడూ పెళ్ళాల మధ్యలో బంధాల మాటేమిటమ్మా" అన్నది అపర్ణ.


"ఏమోనమ్మా..పాపం ఏడుకొండలిని చూస్తే జాలేస్తోంది. నాన్నకి మందు ఇచ్చే టైమయింది. మళ్ళీ మాట్లాడతాను అని మహలక్ష్మమ్మ గారు ఫోన్ పెట్టేశారు.


@@@@


ఏడుకొండలు అమ్మా..నాన్నకి చేస్తున్న సేవ.. అతని జీవితంలో చెలరేగిన తుఫాను, అపర్ణ మనసులో ముల్లులాగా గుచ్చుకుని తరచు దాని గురించే ఆలోచిస్తూ ఉండేది.


"ఏమండీ! అమ్మ దగ్గరకి వెళ్ళినప్పుడు..అక్కడ వీళ్ళకి హెల్పర్ గా వచ్చిన ఏడుకొండలు గురించి చెప్పాకదా! మొన్న అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందిట. ఇందాక అమ్మ చెప్పింది" అన్నది అపర్ణ రాత్రి అన్నం తింటున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర భర్త మోహన రావుతో!

"నిజానికి భార్యా భర్త ఎప్పుడూ ఒకే చోట బతికే అవకాశం సైన్యంలో పని చేసే వారికి కూడా ఉండదు కదండీ" అన్నది.


"కానీ సైన్యంలో పని చేస్తూ కుటుంబానికి దూరంగా ఉండే వారికి, వారి వృత్తి పట్ల నిబద్ధత, దేశ రక్షణ పట్ల గౌరవం ఉండాలనే ఉద్దేశ్యంతోనే వారికి అవకాశం ఉన్నప్పుడల్లా సెలవులిచ్చి ఇంటికి పంపుతూ ఉంటారు. ఒక ఉదాత్తమైన సేవ చేస్తున్నామనే భావన, అవకాశం ఉన్నప్పుడల్లా తప్పకుండా ఇంటికి వెళతామనే నమ్మకం వారికి ఊరటనిస్తుంది. శిక్షణలో భాగంగా వారికి నేర్పించే దేశ భక్తి, వారికిచ్చే అనేక సౌకర్యాలు, పరిహారాలు వారి చేత డ్యూటీ చేయిస్తాయి. కష్టాన్ని ఇష్టంగా భరించే శక్తినిస్తుంది. వారి వృత్తిని మరొక వృత్తితో పోల్చలేము" అన్నాడు మోహన రావు.

"ఈ రోజుల్లో డబ్బు సంపాదన కోసం ఇలా దూరంగా వెళ్ళటం అనేది తప్పట్లేదు. పడుతున్న కష్టానికి తగ్గ జీతాలు రావట్లేదని, ఆ దేశాలు వెళ్ళి నాలుగేళ్ళు కష్టపడితే జీవితాంతం భరోసాగా ఉండే ఏర్పాటు చేసుకోవచ్చని ఒకరిని చూసి ఇంకొకరు గల్ఫ్ దేశాలకి వెళుతున్నారు."


"అలా ఆ దేశాలకి వెళ్ళిన భారతీయులు, అక్కడ షేకులు, పెద్ద పెద్ద వ్యాపారస్థులు పెట్టే హింసలు తట్టుకోలేక పారిపోయి వచ్చేస్తూ అనేక ప్రమాదాలకి లోనవుతుంటారు తెలుసా? జీవితాలు బాగు చేసుకున్న వాళ్ళూ ఉన్నారు అనుకో!"


"అలా కాకుండా అక్కడికెళ్ళిన వాళ్ళు పంపే డబ్బుతో ఇక్కడ జల్సాలు చేస్తున్న వాళ్ళూ ఉన్నారు."


"అందరూ ఏడుకొండలు భార్య లాంటి వాళ్ళే ఉంటారని అనుకోలేము అపర్ణా" అన్నాడు.


"ఉపాధి పేరు చెప్పి.. పొట్ట చేత పుచ్చుకుని ఇంటికి దూరంగా ఏళ్ళ తరబడి బతకవలసి రావటం ఒక సామాజిక సమస్య అనుకోవచ్చు" అన్నాడు ఎటో చూస్తూ.


"గల్ఫ్ దేశాలకి వెళ్ళి కూలీ.. నాలీ చేసుకు బతికే ప్రవాస భారతీయులు పంపించే విదేశీ మారకానికి ప్రాధాన్యమిస్తూ ఇందులో అంతర్లీనంగా ఉన్న సామాజిక సమస్యా కోణాన్ని.. దాని తీవ్రతని ప్రభుత్వాలు చూడట్లేదు అనిపిస్తోంది కదూ!”

"మన ఇళ్ళల్లో మాత్రం... ఉదా: మా అన్నయ్యనే తీసుకోండి... పై చదువులని.. మంచి జీతాలిస్తున్నారని... విదేశాలకి వలస పోతున్నారు. దానితో మా అమ్మా..నాన్నా లంటి ముసలి తల్లిదండ్రులు వార్ధక్యంలో ఈ దేశంలో ఒంటరిగా మిగులుతున్నారు."


"వాళ్ళ అవసరాలు తీర్చటానికి ప్రైవేట్ ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. దానికి మనం సంతోషిస్తుంటే..అందులో ఉండే చీకటి కోణాలు ఏడు కొండలు లాంటి వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి. పాపం అతని కొడుకు చూడండి.. తల్లి లేని పిల్లవాడైపోయాడు." అన్నది.


"అమ్మ చెప్పినట్టు మనది అవసరమయితే...వాళ్ళది అసహాయత!"


"మారిన సామాజిక జీవన విధానంలో...పిల్లలు అందుబాటులో లేనప్పుడు.... మన తల్లిదండ్రుల లాంటి పెద్దలకి సంబంధించినంత వరకు ఏజెన్సీలు హెల్పర్స్ ని పంపించటం అనేది ఒక మంచి పరిణామమే!”


“కానీ పెద్దగా చదువుకోని వారు ఇది కాకపోతే ఇంకొక రకంగానైనా సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. పెద్దగా చదువుకోకుండా.. రీర కష్టం మాత్రమే చేసి ఓ రూపాయి సంపాదించుకోగలిగిన వాళ్ళకి.. ఇప్పటి వరకు ఇది ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూడాలి" అన్నది అపర్ణ నిట్టురుస్తూ.

మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


67 views2 comments

2 Comments


@akellauma4538 • 22 hours ago

ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు రచయిత్రి. ఇప్పటి రోజులను కళ్ళ ముందు ఉంచారు.

Like

చాలా బాగుంది @Vasanthavallari • 2 hours ago

Like
bottom of page