ఏమంటారూ?
- Bharathi Bhagavathula

- Jan 5, 2021
- 5 min read
feminist Telugu story, moral Telugu fiction, Telugu psychological story, social awareness Telugu story

Emantaaruu? - Telugu Social Story | Bhagavathula Bharathi
Published In manatelugukathalu.com On 08/01/2025
ఏమంటారూ? - తెలుగు సామాజిక కథ | భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
స్త్రీల సమస్యలకు ఎప్పుడూ పురుషులే కారణమా?లేక కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలే మన జీవితాన్ని దారి తప్పిస్తాయా?
“ఏమంటారూ?” కథ,అహంకారం, స్వేచ్ఛ, నైతిక విలువలు, మరియు జీవిత బాధ్యతల మధ్య సాగే లోతైన సామాజిక ఆత్మపరిశీలన.
ఈ కథ ప్రతి పాఠకుడిని ఒక కొత్త కోణంలో ఆలోచింపజేస్తుంది.
"తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మగాడు చేసే ఘీంకారమే అహంకారం, కోపం, అసహనం" - అలా వ్రాస్తూ పోతుండగా, వంటమనిషి కాఫీ కప్పు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెనుదిరిగింది.
నేనేదో అడిగేలోపలే,"అమ్మగారూ!" అంటూ లోపలికి వచ్చాడు వరహాలు.
ఏమాటకామాటే కొత్త వంటమనిషి నీరజ కాఫీ చక్కగా పెట్టింది. బాగుంది కాఫీ అని చెబుదామనే లోపే, ఆమె వెళ్లిపోయి వరహాలు రంగప్రవేశం చేశాడు.
"అమ్మగారూ! కావేరి పెళ్లి! శుభలేఖ ఇద్దామనీ!" నసిగాడు.
శుభలేఖ ఇచ్చిన పనివారికి ఏదైనా కానుక ఇచ్చి పంపడం ఆచారం. కావేరి మా ఇంట్లో చక్కని పనిపిల్ల, వరహాలు కూతురు. బీరువాలోంచి కొంత సొమ్ము తీసి అతనికిచ్చి,
"అదేమిటి! కావేరి ఇంకా చిన్నపిల్లేగా! చదివించకుండా పదునాలుగేళ్లకే పెళ్లి ఎందుకో!" అన్నాను నేను యాధాలాపంగా.
"అమ్మగారూ! ఆడపిల్లకి సదువులెందుకండీ! ఆడదాని చదువు ఇంటికే అరిష్టమండీ! మీకు తెలియనిదేముంది! చదువుకున్న ఆడవాళ్లు చెప్పినట్లు వినీ, మగాడికి అనుకూలంగా ఉంటారా? ఆ.. ఇవన్నీ మాకు ఎందుకు. ఈమె ఉద్యోగం చేయాలా? ఊళ్లు ఏలాలా?"
వాక్ప్రవాహం ఇలా సాగుతూనే ఉండగానే నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
"షటప్ అండ్ గెటౌట్!" అరిచాను.
నా అరుపు నాకే భయం గొలిపింది. ఇక వరహాలైతే ఏమనుకున్నాడో కానీ, బిక్కుబిక్కుమంటూ చూస్తూ వెళ్లిపోయాడు. నేను వెళ్లి నా గదిలో మంచం మీద వాలాను. నేను ఆంధ్రుల అభిమాన స్త్రీవాద రచయిత్రి సుధామయిని. ఇప్పుడు 60వ ఏట అడుగుపెట్టాను. బీపీ, షుగర్ మామూలే.
'స్త్రీవాద' అని ఎందుకు నొక్కి చెబుతున్నానంటే, కరుడుగట్టిన ఉగ్రవాదం లాగా, కేవలం స్త్రీల సమస్యలను మాత్రమే - అది కవితైనా, పాటైనా, పద్యమైనా, కథైనా - స్త్రీల తరఫున వాదించే ఓ లాయర్ లాగా పెన్నుతో, రచనతో రాసి ఒప్పించి మెప్పించగలను. అంటే ఆడవాళ్ల వేదనకైనా, రోదనకైనా, ఏ చిన్న సమస్యకైనా మగవాడే కారణం అనే నా రచనల సారాంశం ఎంతోమంది అభిమానులకు నన్ను దగ్గర చేసింది.
ఎన్నో అవార్డులు, సన్మానాలు, రచయిత్రిగా దాదాపు పాతిక సంవత్సరాల అనుభవం నా సొంతం. మా ఆయన గారి సహకారం కూడా ఉందనుకోండి. ఏ ముఖాముఖిలో పాల్గొన్నా ప్రతిసారీ తరచుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు.'స్త్రీవాద రచనలే చేయడానికి కారణం ఏమిటి? స్త్రీవాద సాహిత్యం ఎప్పటి నుంచిమొదలు పెట్టారు?' ప్రశ్నల జవాబు దాదాపు నా అనుభవంలో నేను చూసిన సాటి స్త్రీల వ్యధలు, గాధలు అనేకం, అదే కారణమేమో!
అలాంటి నా ముందు వరహాలు తన ఆడపిల్ల గురించి అలా మాట్లాడటం నేను తట్టుకోలేని అంశమేగా మరి.
/////////
గది గుమ్మం దగ్గర మెత్తని అడుగుల అలికిడి. బహుశా వంటమనిషి కాఫీ తెచ్చిందనుకుని, "ఇప్పుడేం వద్దు" అన్నాను సౌమ్యంగానే.
"నేను కాఫీ ఇవ్వడానికి రాలేదండీ! మీతో మాట్లాడాలనీ.." నసిగింది వంటావిడ.
లేవటానికి ప్రయత్నించాను.
ఆమె "లేవడానికి ప్రయత్నించకండి, రెస్ట్ తీసుకోండి. ఐతే ఎందుకో మీరు టెన్షన్ కి గురయ్యారు."అంది మెల్లగా.
"నేనూ" ~ చెప్పబోయాను.
ఆమె "తెలుసు నాకు! సమాజంలో స్త్రీల మీద, స్త్రీలకు జరిగే అన్యాయాలన్నింటికీ పురుషులే కారణం అని మీ వాదన కదూ! పురుషులే కారణం కాదు, స్త్రీలే కారణమైన సందర్భాలూ అనేకం. మీరు ఆ దిశగా ఆలోచిస్తే ఈ ఆవేశం వచ్చేది కాదేమో! ఓ సర్కిల్ గీసుకుని అందులోంచి బయటకురాలేక.."
నేనూ ఆమె మాట పూర్తికానీయలేదు.
"అలా జరగడానికి వీల్లేదు!" నిదానంగానే అన్నాను. సాటి స్త్రీల మీద నాకెంతో గౌరవం.
"జరిగిందని నిరూపిస్తే?" అన్నది ఆమె.ఆశ్చర్యపోయాను. ఓ వంటమనిషికి ఇంత అతి చనువా?!
"ఇదిగో ఈ పెన్ను వదిలేస్తాను." చేతిలోని పెన్నును మంచం మీదనే విసిరాను. రచయిత్రిననే అహం కంఠంలో ధ్వనించింది.
అంతకంటే ఆమె "అవసరం లేదు, ఏ విషయానికైనా రెండు పార్శ్వాలుంటాయి. నేను చెప్పే కథ విని ఆ కోణంలోంచి సమస్య ఎలా పరిష్కరించాలో ఆ దిశగా రచనలు చేయండి చాలు," ఆమె చెప్పడం మొదలెట్టింది.
ఆమె పేరు మేఘన. నలుగురు సంతానంలో చిన్నది, మహా టెంపర్. లెక్కచేయని మనస్తత్వం. అందగత్తెననే భ్రాంతిలో బ్రతికేది. తల్లిని ఎంత మాటైనా అనడానికి వెనుకాడేది కాదు. ప్రతి విషయానికీ ఇంత గొంతు వేసుకుని గొడవ గొడవ చేసేది. మితిమీరిన అహంకారం.
అతి చిన్న వయసులోనే వివాహం గురించి ముదురు అభిప్రాయాలు, "మొగుడంటే ఇష్టం లేదనుకో, మంగళసూత్రం తెంపేసి విడాకులు ఇచ్చేసి వెళ్లిపోవచ్చు" - వినేవాళ్లు తెల్లబోయి చూసేవాళ్లు. 'చిన్నతనంలే, కాలంతో పాటు మారుతుందిలే' అని ఊరుకునేవారు.
రోజులు గడిచాయి. మేఘనకు పెళ్లయింది. అన్ని కుటుంబాలలో ఉన్నట్లు కలహాలు, చిన్నచిన్న తగాదాలు, అత్త గొణుగుళ్లు, పోట్లాటల నేపథ్యంలో ముగ్గురు సంతానానికి తల్లయింది.
అసలు కథ ఇక్కడే మొదలైంది. అతి చిన్న ఉద్యోగస్థుడయిన మేఘన భర్త, తల్లి, భార్య,ముగ్గురు పిల్లల పెంపకం కొంచెం ఇబ్బంది అనిపించి, అత్యవసర పరిస్థితిలో భార్య ఉద్యోగం చేస్తాననే కోరికను మన్నించాడు.
అక్కడ పరిచయమయ్యాడు సంపత్, ఆఫీస్ మేనేజర్ గా. మేఘనకి అతనికీ చనువు పెరిగింది. ఓ బలహీన క్షణంలో కాలుజారింది.
"ఆడదానికో నీతి? మగాడికో నీతా?" అని ప్రశ్నించింది.
"రోజులు మారాయి, తప్పు ఎవరు చేసినా దిద్దుకుని సరిచేసుకునే వెసులుబాటును సమాజం అందరికీ కల్పించింది," అన్నది.
వెసులుబాటును ఉపయోగించుకుని దిద్దుకోవాలి కదా తప్పును.కానీ, దాన్ని అలవాటుగా మార్చుకుంది మేఘన. అలవాటు ఆఫీసు వరకే అయినా బాగుండేది.
ఆఫీసు వదిలాక కూడా రాత్రి 9 గంటల వరకు భర్త, పిల్లలకు షాపింగ్ పేరుతో అబద్ధం చెప్పి తిరిగి వచ్చేది. పిల్లలు, భర్త ఊరు వెళ్లిన సమయంలో ఇంటికే వచ్చాడు సంపత్. పెళ్లాం ఊరెళితే మొగుడు చేస్తేనే ఒప్పుకోలేని పనిని మేఘన అవలీలగా చేసేసింది. అప్పటికీ ఆపేసితప్పు దిద్దుకోవచ్చు, సంసారాన్ని నడిపించుకోవచ్చు. మళ్లీ మళ్లీ అదే పని చేసి,ఓ రోజున అనుమానాస్పద స్థితిలో భర్తకు పట్టుబడింది.
ఇక కీచులాటలు, కుమ్ములాటలు, తల్లిదండ్రుల రాయబారాలు. భర్త మేఘనను ఏలుకోవడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులు అల్లుడితో కన్నీళ్లు పెట్టుకోగా, అతను దూషించినా మెత్తబడ్డాడు.కానీ మేఘన "ఎవరూ నా విషయంలో కల్పించుకోనక్కరలేదు, నేను బ్రతకగలను," అంది.
పిల్లల్ని తెచ్చుకుని తల్లిదండ్రుల దగ్గర ఉండమనీ, కొన్నాళ్లకు పరిస్థితులు చక్కబడతాయని నచ్చచెప్ప చూశారు. వినలేదు. పోనీ ముగ్గురు పిల్లలలో ఒక్కరినైనా తెచ్చుకో! అండగా ఉంటారు అనే మాట కూడా పెడచెవిన పెట్టింది.
వెళ్లిపోయింది అజ్ఞాతవాసంలోకి. ఎక్కడుందో ఏం చేస్తోందో చుట్టాలకు గానీ, ఆఖరికి తోబుట్టువులకు కూడా తెలియదు. రహస్యంగా ఉంచారు. ఆమెను కలవాలంటే ముందుగా ఓ నంబర్ కి ఫోన్ చేస్తే ఓ స్థలానికి, పార్కైనా సరే, ఆమె వస్తుంది. మాట్లాడాలి. ఆమె మీద ఎన్నో పుకార్లు.నిందలు, చేయకూడని వ్యాపారం ఏదో చేస్తోందనీ, ఇంకా ఇంకా ఎన్నో.
10 సంవత్సరాలు గడిచాయి. ఎవరినో ఓ వ్యక్తిని వెంటబెట్టుకుని స్వగ్రామానికి వచ్చింది, తన పేరు మానస అని మార్చుకుని.
అయితే ఇతను ఆ మేనేజర్ సంపత్ యేనా అని ఎవరూ ప్రశ్నించలేదు. ఆ సంపత్ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కాబట్టి.అంతకన్నా గమ్మత్తు, అతనికి అంతకుముందు పెళ్లి కాలేదట.
అప్పుడూ సమాజం స్వాగతం పలకాలి అనుకుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు "పోన్లే మేఘన జీవితం కుదుటపడింది, ఇంత కాలానికి సంతోషం" అని ఆమెనూ అతణ్ణి హృదయపూర్వకంగా ఆశీర్వదించి, సమాజం మరో అవకాశం ఇచ్చిందనే ఆనందంతో ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండేవారు.అందరి ఇళ్లకు వస్తూ పోతూ, అతనూ చక్కటి కలివిడితనంతో మెలిగేవారు. రెండు సంవత్సరాలు అలాగే జరిగాయి. కాలం అలాగే నడిస్తే బాగుండేది.
ఓ రోజు ఇద్దరూ గుడికెళ్లారు. లింగం మీద నీళ్లు పోస్తూ, గుళ్లోనే పడి మరణించాడతను.
అందరూ తలో చేయీ వేసి సాగనంపాలనుకున్నారు. అతని గురించి వివరాలు చెప్పమనీ, వాళ్లవాళ్లకు కబురు చేద్దామని ప్రయత్నించిన నేపథ్యంలో ఆసక్తికరమైన అంశాలు బయటికొచ్చాయి.
ఇద్దరికీ పెళ్లే కాలేదు! డేటింగ్ లో ఉన్నారు.అతని తరఫు వారితో ఎలాంటి సంబంధాలూ లేవు. ఎలా?పైగా అతని గురించి ఆమె చెప్పిన వివరాలు వేరు, అతని వాళ్లు చెప్పిన పేరు,వివరాలు, ఉద్యోగం వేరు. ఎలాగోలా వాళ్ల వాళ్లను పిలిపించారు. మానస ఉరఫ్ మేఘనను నానా తిట్లూ తిట్టుకుంటూ, శవం వాళ్లే తీసుకుపోయారు.
అతను చాలా అదృష్టవంతుడే. కానీ మేఘన (మానస), అతను చిన్న ఉద్యోగంలో సంపాదించిన సొమ్ముతో నిలబడింది.
ఇంకో వింత ఏంటంటే కట్టుకున్న భర్త, పిల్లలు ఎక్కడో బ్రతికే ఉండగా, డేటింగ్ చేసిన వ్యక్తి కోసం పూలు, మంగళసూత్రం బొట్టు తీసేయడం.
అప్పుడు 'ఏ మనిషైనా ఎలాగైనా ప్రవర్తించవచ్చా? నచ్చినదంతాచేసేయవచ్చా?' అని సమాజం ప్రశ్నించింది.
అయినా సమాజం తనలో ఆశాభావమే నింపింది. తోబుట్టువులు సానుభూతితోనే చుట్టూ కమ్ముకున్నారు. కానీ అహంకారం నిలువనీయలేదు! వాళ్లతో కూడా ఏదో వంకతో తగాదాలు. బావ తనను కోరుకున్నాడనీ, వదిన గయ్యాళిదనీ.. తోబుట్టువులకూ దూరమైంది. స్వతంత్రంగాబ్రతకగలను అని ఆత్మవిశ్వాసం అనుకునే అహంతో తిరిగింది. కానీ కాలం రాపిడికి సొమ్ము కరిగిపోయింది.
మనుమలు, మనుమరాళ్లను ఎత్తుకుని రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో భుజాన బ్యాగ్వేసుకుని, ఏదైనా వంటలక్క ఉద్యోగమైనా దొరక్కపోతుందా అని బయలుదేరింది.తీవ్రమైన పశ్చాత్తాపానికి గురై కుమిలిపోతోంది. తప్పొప్పుల లింగ వివక్షత తీసేస్తే,అనేక కారణాల వల్ల భర్తతో విడిపోయి పిల్లలతో తమకంటూ జీవితాన్ని చక్కగా ఎదుర్కొంటూ సాధించి చూపిన అనేక మహిళామణులున్నారు. మరి ఇక్కడ ఓ మగాడు కారణం కాదుగా! ఆమె పతనానికి కారణం - "ఏమంటారూ?"
//////////////////
కథ చెప్పడం ఆపి నన్ను అడిగింది వంటమనిషి, "ఇందులో ఆ స్త్రీ సమస్యకుకారణం ఎవరు? ఏం సాధించినట్లు? ఓ గృహిణిగా కాకపోయినా తల్లిగానైనా స్త్రీకి పరిపూర్ణత కాదా? స్త్రీల చదువులే సమాజంలో సమస్యలన్నిటికీ కారణం కాదు. అలాగే మగవారూ కారణం కాదేమో... వేరే కోణం ఉందేమో! ఈ రోజు తప్పు తెలుసుకున్నా దిద్దుకోలేదేమో! ఏ లింగమైనా ఈగో ఎవరికైనా సబబేనా అన్ని సమయాలలో!"
స్త్రీకైనా పురుషుడికైనా నైతిక బలమే ఆయుధం. ఆలోచించి ఆ రకంగా రచనలు చేయండి. ఇలాంటి కథలు ఇంకా చాలా తెలుసు నాకు. ఇంకా చెప్పమంటారా?" అని.
"వద్దు! మీరు చెప్పిన కథ ఎక్కడా విన్నట్లు లేదు. కొత్తగా ఉంది. నిజమా? కథా? అయినా వాళ్లని దగ్గర నుండి చూడందే రచయిత్రిగా నేను అంగీకరించలేను. వేరే ఇంకేదో కోణం ఉండే ఉంటుంది భర్త పరంగా," నేను మొండి వాదనకు దిగాను.
'ఆ కథలోని మేఘన - తర్వాత పేరు మార్చుకున్న మానస - ఇప్పుడు మీముందుకొచ్చిన నీరజ నేనే! ఇప్పుడు నేనేం చేస్తే మంచి జీవితంలోకి తిరిగి రాగలను?'ఏడుస్తూ ప్రశ్నించిందామె.
అంతే నాలో గుండె, చేతిలో పెన్నూ జారిపోయాయి.
రచయిత్రిగా నేనే కొత్త జన్మ ఎత్తి, సరికొత్త కోణంలోంచి రచనలు చేయడం మొదలుపెట్టాను.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత్రి పరిచయం : పేరు --భాగవతుల భారతి,
ఊరు--ఖమ్మం ,
చదువు-- m.A;m.A(B.ed),
వృత్తి-- గృహిణి,
అభిరుచి --పాట, వచనకవిత, కథ', వ్యాసం
పద్యాలు వ్రాయటం.
ప్రచురణలు -- అనేకం.




Comments