'Evarikevaru emoutharo' written by Muralidhara Sarma Pathi
రచన : పతి మురళీధర శర్మ
కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ట్రెయిన్ దిగి భార్య అనూరాధతో బయటకు వస్తున్నకృష్ణారావును “రిక్సా కావాలా బాబూ “ అని ఓ రిక్షావాడూ, “ సార్ ! ఆటో “ అని ఓ ఆటోవాలా అడిగేరు.
“ బాబూ ! రిక్సా “ మళ్ళీ అడిగేడు రిక్షావాడు.
“ ఎక్కడికి వెళ్ళాలి సార్ ? “ ఆటోవాడి ప్రశ్నకు బదులుగా “ రామారావుపేట వస్తావా? “ అని అడిగేడు కృష్ణారావు.
“ ఎంతమంది సార్ ? “
“ ఇద్దరమే ! ఎంతిమ్మంటావు చెప్పు ? “ కృష్ణారావు అడిగేడు.
“ 60 రు. ఇవ్వండి సార్ “
“ రానూ పోనూనా ? “
“ అదేంటి సార్ ? మీరూ అలా అంటే నేనేం చెప్తానండి ? ‘
“ లేకపోతే ఏంటి ? “
“ మీకు తెలీనిదేముంది సార్ ? పెట్రోలు ధర పెరిగిపోయింది. మినిమమ్ ఛార్జ్ 30 రు. పోనీ ఇంకా ఎవరినైనా పాసెంజర్స్ ని ఎక్కించుకోమంటారా ? “ అడిగేడు ఆటోవాలా.
“ వద్దు గాని 50 రు. ఇస్తాను. పోనీ. “ బేరమాడేడు కృష్ణారావు.
“ సరే ! రండి సార్ ! “ ఆటోవాలా అంగీకరించేడు.
“ బాబూ ! నా రిక్సా ఎక్కండి బాబూ ! “ రిక్షావాడు బ్రతిమాలుతున్నాడు. కృష్ణారావు “వద్దులే” అన్నాడు.
“ మీకు తోసినంత ఇవ్వండి బాబూ ! పొద్దున్నుండీ బేరం నేదు బాబయ్యా ! “ రిక్షావాడు అభ్యర్థించేడు.
“ వద్దని చెప్పేను కదా ! “ విసుక్కున్నాడు కృష్ణారావు.
“ ఏయ్ ! తప్పుకో.నీకు బేరాల్లేవ్ సరి కదా మా బేరాలు చెడగొడుతున్నావు.” ఉక్రోషంగా అన్నాడు ఆటోవాలా.
“ ఈ ఆటోలొచ్చి మా బతుకులిలా అయిపోనాయి.” సణుక్కున్నాడు రంగన్న. రిక్షా తీస్తూ మళ్ళీ “ బాబూ ! బాబూ ! రిక్షా ఎక్కండి బాబూ ! “ బ్రతిమాలుతున్నాడు.
“ పోనీ లెండి. పాపం అంతగా ప్రాధేయపడుతున్నాడు.అతని రిక్షా ఎక్కుదాం పదండి.” అంది జాలిపడుతూ కృష్ణారావు భార్య అనూరాధ.
“ ఆ ముసలాడి రిక్షా ఎక్కితే మనం ఇంటికి చేరేసరికి పొద్దుపోతుంది. “ అసహనంగా అన్నాడు కృష్ణారావు.
“ ఇప్పుడు మీరు అర్జంటుగా ఇంటికి వెళ్లి చేసే ఘనకార్యమేమిటో ! “ ఎగతాళిగా అంటూ “ అయినా ఓ ముసలాడు రిక్షా త్రొక్కుతున్నాడంటే అతనికి ఎంత గడవక అయి ఉంటుందో ఆలోచించేరా ? “ అంది సానుభూతిగా అనూరాధ.
“ నిజం సేప్పేవు తల్లీ ! ఇప్పుడు మీరు నా రిక్సా ఎక్కితే మీరిచ్చే డబ్బుల్తో నేనూ, నా ఆడదీ కాస్త గంజి తాగుతాం. మీకు పున్నెం ఉంటుంది “ విన్నపంతో కూడిన వేడుకోలుగా అన్నాడు రంగన్న.
“ చూసేరా ! నేను చెప్పలేదూ ? “ అంది అనూరాధ.
“ ముందు జాలీ,తర్వాత మీ ఆడాళ్ళూ పుట్టేరనుకుంటాను. సరే కానీ ! “ ఒప్పుకున్నాడు కృష్ణారావు.
“ సార్ ! అన్యాయం. ఆటో బేరమాడి మళ్ళీ ......” ఆటోవాలా ఆదుర్దా.
“ రిక్షాలో వెళ్లిపోతాము లేవోయ్. అదిగో ! నీకింకో బేరం వచ్చింది చూడు.” సర్ది చెప్పేడు కృష్ణారావు. దొరికిన బేరంతో ఆటోవాలా వెళ్లిపోయేడు.
“ ఏవోయ్ ! రామారావుపేటకి ఎంత ఇమ్మంటావ్ ? “ కృష్ణారావు రిక్షావాడితో మళ్ళీ బేరం.
“ మీరెంత ఇచ్చినా సరే బాబయ్యా ! నా రిక్షా ఎక్కడమే బాగ్యం. అందరూ ఆటోల్లోనూ,నేకపోతే ఒయసు (వయసు)లో ఉన్న కుర్రగాల్లు తొక్కే రిక్సాల్లోనూ ఎక్కుతారు గాని నన్నెవరూ పిలవరు బాబయ్యా ! ఈయాల (ఈవేళ) లేచిన ఏల (వేళ) బాగుంది. మీ బేరం దొరికింది. రండి బాబయ్యా ! అమ్మా ! కూకోండి. “ అన్నాడు రంగన్న.
“ అవునూ ! ఇంతకీ ఎంత ఇమ్మంటావో చెప్పనేలేదు. “ అడిగింది అనూరాధ.
“ నానడగను తల్లీ ! మీ దయ. మీ యిట్టవొచ్చినంత ఇవ్వండి.” భరోసా ఇచ్చేడు రంగన్న.
“ ముందు ఇలాగే అంటారు.తర్వాత పేచీ పెడతారు.” ముందు జాగ్రత్తగా అన్నాడు కృష్ణారావు.
“ ఛ ! ఊరుకొండి. ఏంటి వందలా? వేలా? ఏమన్నానా? “ అంది అనూరాధ.
“ నానట్టాంటోడ్ని కాదు బాబయ్యా ! అలాటోల ఒల్లే అందరికీ సెడ్డపేరు ఒచ్చేసింది.”
“ సరే ! పద.” రిక్షాలో కూర్చున్నారు కృష్ణారావూ,అనూరాధా.
“ అన్నట్టు నీ పేరేంటి ? “ అనూరాధ అడిగింది రంగన్నని.
“ రంగన్న అమ్మా ! “
“ ఏమిటో ఈ రిక్షాలో నాకు ఇబ్బందిగా ఉందోయ్ ! “ అన్నాడు కృష్ణారావు భార్యతో.
“ మీరెంత ట్రెయిన్లో వస్తే మాత్రం రిక్షా కూడా ట్రెయిన్లా పోవాలంటే ఎలా ?” అంది అనూరాధ.
“ ఇదే ఆటో అయితే ఈ పాటికి ఝామ్మని వెళ్ళిపోయి ఇంట్లో ఉండేవాళ్ళం.” కృష్ణారావు మాటలకు సమాధానంగా అనూరాధ “ ఆటోవాడికి మనం కాకపోతే మరొకరు దొరుకుతారు బేరం.కాని ఈ రిక్షా తాతకి గడిచేదెట్లా ? “ అంది.
“ అమ్మో ! నేరకపోయి కదిపేను.నీ సామాజిక స్పృహకి జోహార్లు. “ అన్నాడు కృష్ణారావు.
“ రంగన్నా ! “ ఆప్యాయంగా పిలిచింది అనూరాధ.
“ అమ్మా ! “
“ అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఈ వయసులో కూడా నీకు రిక్షా త్రొక్కవలసిన అగత్యమేమొచ్చింది? ఏం నీకెవరూ లేరా? “ అడిగింది అనూరాధ.
“ నేకేవమ్మా? చెట్టంత కొడుకున్నాడు.ఒక్కగానొక్కడు.” జవాబిచ్చేడు రంగన్న.
“ మరి ? మిమ్మల్ని చూడడా ? “ ప్రశ్నించింది అనూరాధ.
“ ఏం సెప్పమంటావు తల్లీ ! ఆడి బతుకూ నాలా కాకూడదని సదివిద్దావని బడికి అంపేను.సదువు రానేదు సరి గదా సెడు సావాసాలు సేసి పాడయిపోయేడు.ఆడు రిక్సా రంగన్న కొడుకని సెప్పుకోడానికి మనసొప్పక ఓ రాత్తిరికి రాత్తిరి ఇంటో ఉన్న డబ్బులు కాత్తా అట్టుకుని ఎటో ఎల్లిపోయేడు. నా మాటెలా ఉన్నా ఆడి అమ్మ మాత్తరం ఆడికోసం రోజూ సూసి సూసి అలవాటు పడిపోనాది.”
“ప్చ్! “ నిట్టూర్చింది అనూరాధ. రంగన్న చెప్పుకుంటూ పోతున్నాడు.” అందొచ్చే కొడుకు అగుపడకుండా పోయేక నాకీ రిక్సాయే కూడెట్టింది. మరి దాన్నెట్టా ఒదులుకోమంటారు? సెప్పండమ్మా. నాలుగిల్లల్లో పని సేత్తూ నా ఆడదీ,రిక్షా తొక్కుతూ నానూ ఇన్నాల్లూ నెట్టుకొచ్చేం. ఇప్పుడు మా ఒల్లల్లో ఓపికలు నేవు. అయినా తప్పదు కద తల్లీ! “
ఆ అభాగ్యుడి కథ వింటున్న అనూరాధ కళ్ళు చెమ్మగిల్లేయి.
“ ఆ! ఆపవోయ్! వచ్చేసేం. ఇదిగో ఇంద ఇరవై రూపాయలు.సరిపోయిందా?” అన్నాడు కృష్ణారావు.
“ ఆటోవాడికి 50రు. ఇస్తానన్నవాళ్ళు కష్టపడ్డ ఈ తాతకి ఇవ్వలేరా? పోనీ ఓ 40 రు. అయినా ఇవ్వండి.” సిఫారసు చేసింది అనూరాధ.
“ సరేలే.ఇంద తీసుకో “ అని 40 రు. రంగన్నకి ఇచ్చేడు కృష్ణారావు.
“ మీ దయ. దండాలు బాబుగారూ! ఒత్తానమ్మా!” అన్నాడు రంగన్న.
“ అలాగే “ అన్నారు ముక్తకంఠంతో కృష్ణారావూ,అనూరాదా.
* *
డోర్ లాక్ తీస్తూ “ అబ్బ! వళ్ళంతా హూనమైపోయింది వెధవ రిక్షాలో రావడం కాదు గాని.నీ మాట కాదనలేకపోవడం నా వీక్ నెస్” కృష్ణారావు బాధ వెళ్ళగక్కేడు.
“అందుకే ఓ పని చెయ్యండి.” అంది అనూరాధ.
“ఏమిటీ?”
“ఓ చక్కటి బుల్లి కారు కొనండి. ఏ కుదుపులూ ఉండవు.నొప్పులూ ఉండవు.” సలహా ఇచ్చింది కరణేషు మంత్రి లాగ.
“ చాలు తల్లీ! రిక్షావాడు అయిపోయేడు.ఇంక నేను దొరికేనా నీకు? అవునూ! ఆ రిక్షావాడి గురించి అన్ని ఆరాలు నీకెందుకు?వాడేం మనకు చుట్టమా?పక్కమా?కావలసినవాడా? “ అడిగేడు కృష్ణారావు.
“ఎవరు ఎవరికి ఎప్పుడు కావలసిన వాళ్లవుతారో చెప్పలేం.” వేదాంత ధోరణిలో తెలియచెప్పింది భర్తకి.
“ ఇదెక్కడి డైలాగు?” అన్నాడు కృష్ణారావు.
“ అంటే మీ ఉద్దేశం? కాపీ కొట్టాననా? “ నిలదీసింది అనూరాధ.
“ బాగా గుర్తు చేసేవు.ముందు నా మొహాన్నింత కాఫీ కొట్టు. తర్వాత నువ్వు చెప్పిన డైలాగులన్నీ వింటాను.”
“ మంచి బాలుడిలా చెప్పింది విని వెళ్లి ఓ మిల్క్ పాకెట్ పట్టుకురండి. జస్ట్ వన్ మినిట్ లో ఇన్స్టెంట్ కాఫీ రడీ అయిపోతుంది.”
“ తప్పదా? “ అన్నాడు కృష్ణారావు.
“ కాఫీ కావాలంటే తప్పదు మరి.” చెప్పింది భార్యామణి.
“ సరే “ అని బయలుదేరేడు బయటికి భర్తగారు.
* *
హాల్లో ఫోన్ ఒకటే మ్రోగుతుంది.అనూరాధ వంటింట్లో పనికి కామా పెట్టి వచ్చి ఫోన్ అందుకుంది.అవతలి వైపు కృష్ణారావు ఆఫీస్ లో పని చేసే ఆనందరావు అంకుల్ కంఠం.” అమ్మా! అనూరాధా!”
“ నమస్తే అంకుల్! బాగున్నారా? చెప్పండి. “ అంది అనూరాధ మామూలుగా.
“ ఏం చెప్పమంటావమ్మా? మీ ఆయనకీ చిన్న ఏక్సిడెంట్ అయిందమ్మా “ అన్నాడో లేదో “ఆ “ అంది ఒక్కసారిగా అనూరాధ. “గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు.” అంతే! తర్వాత ఆనందరావు ఇంకా ఏదో చెప్తున్నాడు కాని అనూరాధ వినిపించుకోలేదు.ఫోన్ పెట్టేసి ఇంటికి తాళం ఎలా వేసిందో తెలియదు.ఆఘమేఘాల మీద హాస్పిటల్ కు చేరుకుంది.
అక్కడ వెయిట్ చేస్తున్న ఆనందరావుని అడిగింది వెక్కి వెక్కి ఏడుస్తూ “ అంకుల్! ఆయన ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?” అని.
“ ఐ.సి.యు లో పెట్టేరమ్మా.ఎవర్నీ లోపలకు వెళ్ళనివ్వడం లేదు.”
“అసలు ఏక్సిడెంట్ ఎలా జరిగింది?”
“ నేను చెప్తూనే ఉన్నాను.నువ్వు వినిపించుకోలేదు.ఫోన్ పెట్టేసేవ్. నేను ఆఫీస్ కి వెళ్తూ త్రోవలో ఏదో ఏక్సిడెంట్ అయినట్లుందని చూస్తే ఇంకెవరు? బైక్ మీద వెళ్తున్న మీ ఆయన్ని వెనకనుండి ఓ లారీ గుద్దేసిందట.క్రింద పడిపోయి నెత్తురోడుతూ ఉన్నాడు.వెంటనే నేను 108 కి ఫోన్ చేసేను. వాళ్ళు వచ్చి ఇక్కడకు తీసుకొచ్చేరు.వాళ్ళతో పాటూ నేనూ వచ్చేను. నీకు ఫోన్ చేసేను.” అని చెప్పేడు ఆనందరావు.
“ ఇంతకీ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? డాక్టరుగారు ఏమన్నారు?” కంగారుగా అడిగింది అనూరాధ కన్నీళ్లను ఆపుకోలేకపోతూ.
“ రక్తం చాలా పోయిందట.వెంటనే రక్తం ఎక్కించాలి.లేకపోతే బ్రతకడు అన్నారు. నా బ్లడ్ గ్రూప్ సరిపోలేదు. మీ ఆయన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదు.” చెప్పేడు ఆనందరావు.
“ ఆయన బ్లడ్ గ్రూపూ, నా బ్లడ్ గ్రూపూ వేరు. మరిప్పుడెలా?” అంటున్న అనూరాధతో ఆనందరావు చెప్పేడు. ““నువ్వు వచ్చేలోపే ఓ ఆపద్భాందవుడు వచ్చి మీ ఆయన ప్రాణాలు నిలబెట్టేడు తన రక్తాన్నిచ్చి.”
“ ఎవరూ? “ ఆత్రుతగా అడిగింది అనూరాధ.
“ అదిగో! ఆ గదిలో ఉన్నాడు. ఏక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్నాడు. మీ ఆయనని చూసి మాతో పాటు వచ్చేడు. అప్పుడు అతనెవరో నాకు తెలియదుగానీ డాక్టరుగారు మీ ఆయనకు రక్తం ఎక్కించాలననీ ఆ గ్రూప్ కావాలనీ నాతో చెప్తున్నప్పుడు విని తను రక్తం ఇస్తానన్నాడు. అతని బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే లక్కీగా సరిపోయింది. అతని బ్లడ్ గ్రూపూ, మీ ఆయన బ్లడ్ గ్రూపూ ఒక్కటవడం మన అదృష్టం. అతనికి మనం ఎంత ఇచ్చినా ఋణం తీరదు. “ అని ఆనందరావు చెప్తుండగానే ఆ గదిలోకి వెళ్లి చూసింది. ఇంకెవరు? రిక్షా రంగన్న. తన భర్తకు జరిగిన ఏక్సిడెంట్ విషాదంలో రంగన్న తన రక్తాన్నిచ్చి తన భర్త ప్రాణాన్ని నిలబెట్టేడన్న ఆనందం ఓ తొలకరి జల్లే అయింది. రిక్షా రంగన్న మనకేమి చుట్టమా? పక్కమా? కావలసినవాడా? అన్న తన భర్తకు ఎవరికెవరు ఏమయ్యేరో తెలియపర్చాలనుకుంది. బెడ్ మీద మగతగా పడుకున్న రంగన్నకు రెండు చేతులెత్తి నమస్కరించి ఐ.సి.యు వైపు నడిచింది అనూరాధ.
* *
కృష్ణారావును హాస్పిటల్ నుండి డిస్చార్జ్ చేసేరు.ఇంటికి తీసుకువచ్చేరు. ఏక్సిడెంట్ అయిన తర్వాత కృష్ణారావు ఏం జరిగిందీ తెలుసుకునే పరిస్థితిలో లేడు.అయినా అనూరాధ ఏం చెప్పలేదు.స్థిమితపడ్డాక చెప్పొచ్చని.
“ మీరు ఎప్పుడూ బైక్ జాగ్రత్తగానే నడుపుతారు కదా మరి ఎందుకిలా అయింది?” అడిగింది అనూరాధ.
“ ఎందుకేంటి? అంతా ఆ రిక్షా రంగన్న వల్లే!”
“ పాపం వాడేం చేసేడు మధ్య?”
“ ఏం చేసేడా? నేను బయలుదేరినప్పుడు నాకు ఎదురొచ్చేడు.” బాబుగారూ! బాగున్నారా? అంటూ. వాడు ఎదురవడంవల్లే నాకు ఏక్సిడెంట్ జరిగింది.”
“ ఏక్సిడెంట్ వాడివల్ల జరగలేదు.లారీవాడి వల్ల జరిగింది. రంగన్న ఎదురవడంవల్లే మీరు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఇంటికి తిరిగి వచ్చేరు. తెలుసా? ఆ సంగతి మీకు తెలియదు.” అంటూ జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరంగా చెప్పింది అనూరాధ. కృష్ణారావుకు నోట మాట రాలేదు.
“ వాడేం మనకు చుట్టమా? పక్కమా? కావలసినవాడా? అని అడిగేరు.అంతకన్నా ఎక్కువే అయ్యేడు మీకు రక్తదానం చేసి. ఎవరికెవరు ఏమవుతారో తెలిసిందా ఇప్పుడు? “ అనేసరికి కృష్ణారావు సిగ్గుతో తల దించుకున్నాడు రంగన్నను అలా అన్నందుకు. “ వెంటనే నేను రంగన్నకు కృతజ్ఞతలు చెప్పాలి.వాడి ఋణం ఎలా తీర్చుకోవాలి? “ అంటున్న భర్తకు చెప్పింది అనూరాధ “ వాడికి మీరు తీరికగా కృతజ్ఞతలు చెప్పుకొండి. వాడి ఋణం మాత్రం నేను తీర్చేస్తానని చెప్పేను.” అని.
“ఎలా?” కుతూహలంగా ప్రశ్నించేడు కృష్ణారావు.
“ ఏముందీ మన అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా ! అందులో వాడ్నీ,వాళ్ళావిడ్నీ ఉండమన్నాను.వాళ్లకు చేతనైన పని చేస్తుండమన్నాను. తిండికి లోటు లేకుండా జీతం ఇస్తానని చెప్పేను. ఇదంతా మీకు చెప్పకుండా మాట ఇచ్చి నందుకు మీరేమీ అనుకోరనే ధీమాతోనే చేసేను.”చెప్పింది భార్యామణి నింపాదిగా.
“ ఎంతమంచిదానవే .....
“ ఆ! ఆ! ఆగండి. ఎంత మంచి వారండీ పొరపాటు గ్రహించితిరీ .....
ఇంతలో రంగన్న వచ్చేడు.” బాబుగారూ! బాగున్నారా “అంటూ.
“ రా! రంగన్నా! నీ గురించే అనుకుంటున్నాం. నీకు నూరేళ్ళు ఆయుష్షు.” అన్నాడు కృష్ణారావు.
“ నాకెందుకు బాబూ నూరేల్లాయుస్సు ? రేపో మాపో పోయేవాడిని.” అన్నాడు నిరుత్సాహంగా.
“ అదేంటి అలా అంటావ్? నీ వల్లే నా ఆయుష్షు నిలబడింది. లేకపోతే నేనేమయిపోయేవాడ్ని? “ అన్నాడు కృష్ణారావు.
“ అంతమాట అనకండి బాబుగారూ! నాకు సేతనైనది నాను సేసేను. ఎవురికైనా ఇవ్వడానికి నా దగ్గర నా రగతం (రక్తం) తప్పితే మరేం లేదు బాబయ్యా!” అన్నాడు రంగన్న.
“ అదే రంగన్నా! ఋణానుబంధం. రక్తసంబంధం కన్నా మించింది. అమ్మగారు నీకు అన్నీ చెప్పేరటకదా ఈవేళటినుండీ నువ్వు మా వాడివి. వెంటనే నీ మకాం ఇక్కడికి మార్చెయ్.” అన్నాడు కృష్ణారావు.
రంగన్నకు ఆనందంతో నోట మాట రాక కృతజ్ఞతాభావంతో కళ్ళు చెమ్మగిల్లేయి.
( సమాప్తం )
Comments