top of page

ఫేస్ బుక్ ఫ్రెండ్


'Facebook Friend' - New Telugu Story Written By D V D Prasad

'ఫేస్ బుక్ ఫ్రెండ్' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఏం చిట్టిబాబూ! ఉగాది పండుగకి మీ మామగారు రమ్మని పిలిచారు కదా! ఏం కానుకలు ఇచ్చారేంటి?” అడిగాడు బుచ్చిబాబు.


"ఆఁ...ఏం ఇచ్చుంటారు, కొత్త బట్టలు మాత్రం పెట్టారు. అంతే! ఫేస్బుక్లో, వాట్సప్లో కూడా పెట్టాడు కదా! చూడలేదా? కాకపోతే మనవాడికి బలవంతంగా ఉగాది పచ్చడి మాత్రం తినిపించారు. ఫేస్ బుక్ లో ఆ పోస్ట్ చూడలేదేమిటి? ఉగాది పచ్చడి తిన్న తర్వాత మనవాడి ఎక్స్ప్రెషన్ చూడాలి సుమా, పాపం ఏడ్వలేక నవ్వుతూ ఆ ఫోజూ వాడూను!" పకపక నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు.


సుబ్బారావు చేసిన కామెంట్స్కి చిట్టిబాబు మొహం మాడిపోయింది.


"అయినా చిట్టిబాబూ, నువ్వు పెట్టిన ఫోటోలకి బోలెడన్ని లైకులు వచ్చి ఉండాలే! నువ్వు పెట్టిన ఫొటోలు చాలా బాగున్నాయిలే! మొత్తమ్మీద ఉగాది పండుగ అత్తవారింట్లో బాగా ఎంజయ్ చేసినట్లున్నవు. మీ మామగారు కవి సమ్మేళనంలో చదివిన కవితలు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించాయిరా!" అన్నాడు బుచ్చిబాబు.


బుచ్చిబాబు తనని పొగడటంతో చిట్టిబాబు మొహంలో కళ తిరిగి వచ్చింది. "అవును! నేను కూడా అందులో ఓ కవిత చదివాను చూడలేదా?" అడిగాడు చిట్టిబాబు.


"ఆ చూసాములే! మీ మామగారి సావాస దోషం నీకు కూడా బాగానే అంటినట్లుంది. మాకూ అంటకుండా కాస్త భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఇకముందుంది, లేకపోతే కరోనాలా మాకూ తగులుకుంటుందా పైత్యం." అన్నాడు సుబ్బారావు.


మళ్ళీ మొహం చిన్నది చేసుకున్నాడు చిట్టిబాబు.


"పాపం చూడు చిట్టిబాబు ఎలా ఫీలవుతున్నాడో నీ మాటలకి. వాడి మాటలకేంగానీ, నీ కవితలు బాగానే ఉన్నాయిలే!' అని చిట్టిబాబు భుజం తట్టాడు బుచ్చిబాబు.


చిట్టిబాబు మొహంలోకి మళ్ళీ వెలుగు తిరిగివచ్చింది స్నేహితుడు పొగడటంతో. "దానికైతే వేల మీద లైకులు వచ్చాయి తెలుసా? నా కవితని చాలా మంది మెచ్చుకుంటూ కామెంట్స్ పెట్టారు తెలుసా!" గొప్పగా అన్నాడు చిట్టిబాబు.


"అవునవును, నేనూ బాగుందని పెట్టానే!" అన్నాడు బుచ్చిబాబు.


మరింత ఉబ్బిపోయాడు చిట్టిబాబు. "కొత్త కవితలు రాసాను వినిపించమంటావా?" ఉహ్సాహంగా, ఉల్లాసంగా అడిగాడు.


వాచీ చూసుకున్నాడు సుబ్బారావు. "ఇప్పుడే గుర్తుకు వచ్చింది, నాకో అర్జెంట్ పని ఒకటి ఉంది., నేను వస్తానోయ్! మరోసారి తీరుబాటుగా వింటానులే." అంటూ మెల్లగా జారుకున్నాడు బుచ్చిబాబుని అతని ఖర్మకి వదిలేసి.


"నీకేం అర్జెంట్ పనిలేదు కదా, నువ్వు విను!" అని జేబులోంచి కొన్ని కాగితాలుతీసి చదవడం ఆరంభించాడు చిట్టిబాబు తగ్గేదేలే అన్నట్లు.


‘ఉగాది వచ్చింది తెచ్చింది ఉగాది పచ్చడి, తినకపోతే అవుతుంది మన మొహం పచ్చడి!....’


ఇలా సాగింది ఆ కవితా ప్రవాహం. ఆ ప్రవాహంలో తడిసో, లేక చెమటతో తడిసో పాపం బుచ్చిబాబు తడిసి ముద్దవసాగాడు. చేసేదిలేక, అక్కడే నిలబడి చిట్టిబాబు కవితా ధాటికి బలవసాగాడు పాపం బుచ్చిబాబు. రష్యా బాంబుల ధాటికి విలవిలలాడిన ఉక్రైన్లా ఉంది అతని పరిస్థితి. ఓ గంట సేపు తన కవితలన్నీ ఏకధాటిగా వినిపించిన చిట్టిబాబు కొద్దిసేపు ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు.


అదే మంచి అదుననుకొని, "సరే! మరో రోజు నీ మిగతా కవితలు వింటాలే!" అని అక్కణ్ణుంచి కదలబోయాడు బుచ్చిబాబు.


"ఉండుండు, ఓ సెల్ఫీ తీసుకోనీ! ఫేస్ బుక్లో పెట్టాలి కదా!" అన్నాడు చిట్టిబాబు.


'నీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా!' అని మనసులో తిట్టుకున్నా సెల్ఫీ కోసం పోజిచ్చాడు బుచ్చిబాబు.


మరు నిమిషంలో చిట్టిబాబు ఆ సన్నివేశాన్ని ఫేస్బుక్లో 'నా కవితలు ఆస్వాదిస్తున్న మిత్రుడు, సహృదుడైన బుచ్చిబాబు.' అన్న టాగ్లైన్తో పెట్టాడు. స్మార్ట్ ఫోన్ కొన్న దగ్గర నుండి సామాజిక మాధ్యమాలకి, ముఖ్యంగా ముఖపుస్తకానికి బాగా బానిసైపోయాడు చిట్టిబాబు. తనకి తెలిసినవాళ్ళనీ, తెలియని వాళ్ళనీ అందర్నీ ఫేస్బుక్ ద్వారా స్నేహితుల్ని చేసుకున్నాడు. అతనికిప్పుడున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ వేలమంది పైనే ఉన్నారు.


ఎవరిదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడమే తరువాయి, తన స్నేహితుల బృందంలో చేర్చుకోకుండా మాత్రం ఊరుకోడు. రోజంతా తన కార్యక్రమాలన్నింటినీ ఫేస్బుక్లో పెడుతూనే ఉంటాడు. ఉదయం లేచి బెడ్కాఫీ తాగిన దగ్గరనుండి, రాత్రి పడుక్కోబోయే వరకూ అతని రోజువారీ కార్యక్రమాలు అందరికీ విదితమే. వారం రోజుల తర్వాత కలిసిన చిట్టిబాబుని పలకరించాడు బుచ్చిబాబు.


"చిట్టిబాబూ, ఈ మధ్య నీకు దైవ భక్తి బాగా పెరిగి పోయినట్లుంది. రోజూ బ్రహ్మానందం బాబా ఆశ్రమానికి వెళ్తున్నావు కదా! రోజూ నీ ఫేస్బుక్ పోస్టులు ఫాలో అవుతున్నాలే! అయినా నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా? ఎప్పుడూ ఓ దేవాలయానికి కూడా వెళ్ళవు నువ్వు! అలాంటిది ఇంత హఠాత్తుగా ఆధ్యాత్మికత ఎలా అబ్బిందిరా నీకు, అదే ఆశ్చర్యంగా ఉంది." అడిగాడు.


"ఆ బ్రహ్మానంద బాబా దేవుడురా! అతనికి తెలీనవి లేవు. అతనికి సర్వం తెలుసు! నా మొహం చూస్తూనే నాకు సంబంధించిన విషయాలు అన్నీ చెప్పారతను. అందుకే క్రమం తప్పకుండా ప్రతీరోజూ సాయంకాలం బ్రహ్మానంద బాబా అశ్రమానికి వెళ్తున్నాను."


"ఇవాళా రేపూ వీధికో బాబా చొప్పున వెలుస్తున్నారు. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. పేపర్లలో వచ్చే వార్తలు చూడటం లేదా!" అని అడిగాడు బుచ్చిబాబు.


వెంటనే లెంపలేసుకున్నాడు చిట్టిబాబు. "అలా అనకురా! ఆ బాబా మహా శక్తి మంతుడు. నువ్వు కూడా లెంపలేసుకొని, అతనికి క్షమాపణలు చెప్పి శరణు కోరు! నాతో పద!" అన్నాడు చిట్టిబాబు.


"అలాగా! సరే, ఆ బాబా శక్తి ఏపాటిదో చూద్దాం పద!" అన్నాడు బుచ్చిబాబు.


అలా చిట్టిబాబుతో బుచ్చిబాబు కూడా బ్రహ్మానంద బాబా ఆశ్రమాన్ని పావనం చేసాడు. అక్కడ చాలామంది భక్తులు క్యూలో నిల్చున్నారు. చిట్టిబాబు అక్కడ రిసెప్షన్ కౌంటర్లో డబ్బులు కట్టి ఇద్దరి కోసం టికట్లు తీసుకున్నాడు. ఇద్దరూ క్యూలో నిల్చున్నారు. యాత్రలా ఉన్న అక్కడి జనాన్ని చూసి బుచ్చిబాబు విస్తుపోయాడు. ఆ పరిసరాల్లో బోలెడన్ని దుకాణాలు వెలిసాయి.


ఓ రెండు గంటలు ఓపిగ్గా కాచుకున్న తర్వాత వాళ్ళ వంతు వచ్చింది. శిష్య పరమాణువొకడు వీళ్ళిద్దర్నీ బ్రహ్మానంద బాబా అంతరంగిక మందిరంలోకి తీసుకెళ్ళాడు. బాబా ఓ బ్రహ్మాండమైన సింహాసనంలాంటి ఆసనంలో సుఖాశీనుడై ఉన్నాడు. అతనికి ఇరుపక్కలా ఇద్దరు శిష్యులు వింజామరలు వీస్తున్నారు, లోపల ఏసీ ఉన్నా కూడా.


అగరొత్తుల సువాసన గదంతా వ్యాపించి ఉంది. బాబాని చూడగానే చిట్టిబాబు అతనిముందు సాస్టాంగ పడిపోయాడు. చిరునవ్వు నవ్వుతూ, చిట్టిబాబుని ఆశీర్వదించాడు బాబా. బుచ్చిబాబు మాత్రం బ్రహ్మానందబాబాని నిశితంగా పరిశీలిస్తూ రెండు చేతులూ జోడించి దండం మాత్రం పెట్టాడు. అది గమనించిన బాబా బుచ్చిబాబువైపు తన తీవ్రమైన చూపు సారించాడు. అయినా బుచ్చిబాబు ఏ మాత్రం చలించక ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.


ఆ తర్వాత బాబా చిట్టిబాబువైపు తిరిగి, "ఏం నాయనా.. నిన్న నీ పని నేను చెప్పినట్లే సానుకూలమైంది కదా!" అన్నాడు.


"అవును బాబా! మీరు చెప్పినట్లే చేసాను. మీ దయవల్ల మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. ఈ సందర్భంగా నా చిరు కానుక స్వీకరించండి స్వామీ!" అని తను తెచ్చిన కానుక బాబా కాళ్ళ ముందు పెట్టాడు.


బాబా చిరునవ్వుతో ఆ కానుక స్వీకరించి, తన శిష్యుడికిచ్చాడు జాగ్రత్త చెయ్యమని చెప్పి. "నీకు కాబొయే అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అవునా! ప్రస్తుతం విదేశాల్లో, అంటే స్టేట్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. నీ వియ్యంకుడు రాజమండ్రి వాసి కదా!" అన్నాడు బ్రహ్మానందబాబా.


"అవునవును! స్వామీ, తమకు సర్వం తెలుసు, మీరు సర్వంతర్యామి." తబ్బిబ్బయిపోతూ అన్నాడు చిట్టిబాబు.


అప్పటివరకూ మౌనంగా ఉన్న బుచ్చిబాబు అప్పుడు నోరు తెరిచాడు. "కాబోయే అల్లుడి జీతం మన డబ్బుల లెక్కల్లో నెలకు పదిలక్షలు. వియ్యంకుడికి రాజమండ్రిలో ఓ రైస్ మిల్లు, ఓ సినిమా హాలు, మాల్ కూడా ఉన్నాయి. అక్కడ మూడు డూప్లెక్స్ ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇతను కట్నం కింద పాతిక లక్షలు, ఓ ఖరీదైన కారు కూడా అల్లుడికి ఇస్తున్నాడు." అన్నాడు బుచ్చిబాబు.


స్నేహితుడి మాటలు విన్న చిట్టిబాబు ఆశ్చర్యపోయాడు. "ఓరే, బుచ్చిబాబూ, నువ్వెప్పుడు ఫేస్ రీడింగ్ విద్య నేర్చుకున్నావు? ఈ వివరాలన్నీ నీకు చెప్పలేదే? ఎలా తెలిసింది నీకు?" అని అడిగాడు విస్మయంగా.


"అంతే కాదు, నువ్వు ఇవాళ ఏ కూరలు తిన్నావు, ఎక్కడెక్కడికి వెళ్లావు, ఏం చేసావు కావాలంటే వివరంగా చెప్తాను. అంతకాక, నీ రోజు వారి కార్యక్రమాలు కూడ చెప్పగలను." అన్నాడు ధీమాగా. నమ్మలేనట్లు చూసాడు చిట్టిబాబు.


"ఒరే పిచ్చి చిట్టిబాబూ! ఈ విషయాలన్నీ నేనే కాదు నీ ఏ ఫేస్బుక్ ఫ్రెండ్ అయినా చెప్పగలడు. నువ్వెలాగూ రోజుకి యాభై పోస్టులు కన్నా ఎక్కువే పెడతావు కదా! నిన్ను బురిడి కొట్టిస్తున్న ఈ బ్రహ్మానంద బాబా కూడా నీ ఫేస్బుక్ ఫ్రెండే! సరిగ్గా చూడు! ఊరంతా అప్పులు చేసి పారిపోయి ఈ అవతారం ఎత్తిన మన దగుల్బాజీ ధర్మారావే ఈ బురిడీ బాబా. నీ ముఖపుస్తక స్నేహితుడు! నాకు వీడ్ని చూడగానే అనుమానం వచ్చింది." అని బ్రహ్మానందం బాబా దగ్గరకి వెళ్ళాడు బుచ్చిబాబు.


ఒక్కసారి గతుక్కుమన్నాడు బ్రహ్మానంద బాబాగా చలమణీ అవుతున్న ధర్మారావు. అక్కణ్ణుంచి పారిపోయేందుకు పరిగెత్తబోయేసరికి, తను కట్టుకున్న పంచె అడ్డువచ్చి కింద పడి బుచ్చిబాబు చేతికి చిక్కాడు. అప్పటికే ఈ విషయం తెలిసిన భక్తులు అందరూ ఒక్క ఉదుటున లోపలికి దూసుకొచ్చారు. నిమిషాల మీద పోలీసులకు కబురెళ్ళింది.

వాళ్ళు ఆ బురిడీ బాబాని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు.


"చూసావా చిట్టిబాబు! నువ్వేమో ఈ బాబా చాలా గొప్పవాడనుకున్నావు, కానీ నీ ఫేస్బుక్లో చూసిన వివరాలే నీకు తిరిగి అప్పచెప్తున్నాడని కనుక్కోలేక పోయావు. ఇంతకు ముందోసారి నువ్వు తిరుపతి వెళ్తూ, 'నేను కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్తున్నాను. అట్నుంచి అటే తీర్థ యాత్రలు చేసుకొని వారం రోజుల్లో తిరిగి వస్తాను.' అని పెట్టావు. నువ్వు వెళ్ళిన తర్వాత రోజు నీ ఇల్లు గుల్ల చేసాడు నీ ఫేస్బుక్ దొంగ ఫ్రెండ్. ఇకనైనా ఇలాంటి పిచ్చిపిచ్చి విషయాలు మరి పెట్టకు, నీ మంచి కోరే చెప్తున్నాను." హితబోధ చేసాడు బుచ్చిబాబు తలవంచుకున్న వింటున్న చిట్టిబాబుకి.

……………………

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.75 views0 comments

ความคิดเห็น


bottom of page