top of page

గాయం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




'Gayam' written By Namani Sujana Devi

రచన : నామని సుజనాదేవి

భార్యను అనుక్షణం అనుమానించడమే కాక, వేధించడం సుహాస్ దినచర్య.

బాధతో కుమిలి పోతున్న విశ్వైక కు సహాయం చేస్తాడు కోలిగ్ శ్రీనివాస్.

సమస్య మరింత జఠిలమవుతుందా లేక పరిష్కారమవుతుందా అనేది రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి గారు రచించిన గాయం కథ చదివితే తెలుస్తుంది.


పరుగెడుతూనే ఉంది విశ్వైక . కాళ్ళకి ముళ్ళు గీసుకు పోతున్నా ,

రాళ్ళు ముళ్ళయి గుచ్చుతున్నా , పాదాలు రక్తాలు కారుతున్నా లెక్క

పెట్టడం లేదు. ఆ బాధ ఏమీ ఆమె లక్ష్యాన్ని సడలించడం లేదు. వెనక్కి

తిరిగి ఆ సెకను సమయాన్ని సయితం వృధా చేసుకో వడం ఆమెకు ఇష్టం

లేదు. ఆమె లక్ష్యం ఒకటే . వెనక వెంబడిస్తూన్న ఆకారం నుండి

వీలయినంత దూరం వెళ్లి పోవాలి. అతని చేతులకు అందనంత దూరం

వెళ్లి పోవాలి. ఆపకుండా పరుగు పెట్టడం వల్లనేమో గొంతు తడారి పోతోంది.

దాహానికి ప్రాణం పోయేలా ఉంది. అల్లంత దూరంలో నీటి చెలిమే. ప్రాణం

లేచి వచ్చినట్లయ్యింది. ఒక్క నిమిషం అయితే అందుకునేదే . కాని సరిగ్గా

అప్పుడే పడింది గట్టిగా భుజం మీద చేయి. అవి గింజుకుంటున్న ఆమెను

నొక్కి పట్టి ఆక్టోపస్ లా బంధిస్తున్నాయి. ఆమె శక్తి వంచన లేకుండా

పెనుగులాడుతూనే ఉంది. కాని బలమైన ఆ చేతుల నుండి తప్పించుకోలేక

పోతుంది.

‘ప్లీజ్ దయచేసి నన్ను విడిచి పెట్టండి!’ అరుస్తూ గింజుకుంటూ ఉంటె,

చేతికి చిక్కిన జింకను చూసిన పులి లా వికటాట్ట హాసం చేసిందా ఆకారం.

ఆకారం మనిషే కాని తల మాత్రం గో ముఖ వ్యాఘ్రం. అంతలోనే ఆ తల

మాయమైంది. సుపరిచితమైన ముఖం ప్రత్యక్షమైంది. దగ్గరకు వచ్చిన ఆ

ముఖం మరెవరిదో కాదు తన భర్త ది. ప్రేమించి ఇంట్లోవారిని ఎదిరించి,

అతనే లోకమనుకుని పారిపోయి వచ్చి పెళ్ళి చేసుకున్న సుహాస్ ది.

‘ఏయ్! నిన్నే ! ఏంటి? ఎవరు పట్టుకున్నారు? విడిచిపెట్టండి

అంటున్నావు. ఎవడు పడితే వాడికి మేస్సేజీలు పెడితే ఇలాగే అవుతుంది ...

’ కోపంగా అంటున్న ఆ కంఠం అతనిదే ! భయంగా కళ్ళు తెరిచింది.

అప్పటికే వణికి పోతున్న ఆమె మోము మొత్తం చెమటలతో

తడిచిపోయింది. బెడ్ లైట్ వెలుతురు లో ఆమె రెండు భుజాలు గుచ్చి

పట్టుకుని అడుగుతున్నాడు భర్త సుహాస్.

ఇంకా వణుకుతోంది విశ్వైక. భయంకరమైన కల. ఆమెకు ఇంకా అది కల

అని నమ్మబుద్ది కావడం లేదు. కళ్ళ ముందు జరిగినట్లే ఉంది. భర్త

వ్యంగ్యపు మాటలు కొత్త కాదు ఆమెకు. భర్త అదిలింపులకు పిల్లలమధ్య

నుండి నెమ్మదిగా లేచింది. ఇక ఆ రాత్రంతా జాగారణమే అయ్యింది. మది

గతం తలుపు తెరిచింది.

, ‘ ఏయ్!నిన్నే ! ఆ మూలుగుడు ఏంటి? ... పక్కకు పడుకుని నిద్ర

చెరిపేస్తావు. నిద్ర లేక పొతే తెల్లవారి లేచి ఆఫీస్ కెళ్ళి నేను ఎలా వర్క్

చేస్తాను అని ఆలోచించవు ... లేచి వెళ్లి బయట పడుకో ..’ పోద్దటి నుండి

పని చేసి చేసి అలసి పోయి ఆమెకు తెలియకుండానే మూలిగినప్పుడు ,

మొట్ట మొదటి సారి నిద్రలో ఉండగా, గట్టిగా కొట్టి చెప్పిన భర్త

మాటలకు ఉలిక్కి పడింది. బిత్తర పోయింది. అలసిపోయిన ఏ భార్య

అయినా భర్త నుండి కోరుకునేది పైసా కూడా ఖర్చులేని సానుభూతి

మాత్రమే. దానికే పొంగిపోయి మళ్ళీ అంతకు మించి పనిచేయడానికి

ఉత్తేజాన్ని పొందుతుంది. కాని అదేంటో చాలా మంది మగవాళ్ళకి ఆ

విషయమే తెలీదు.

‘ఏయ్ ! నిన్నే! పిల్లలు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావ్? పొద్దుననగా వెళ్లి

అలసిపోయి వచ్చాడు , అనే జ్ఞానం ఏమైనా ఉందా?’ సుహాస్ మాటలకి

కోపం వచ్చింది విశ్వైక కి . గత కొన్ని రోజులుగా రోజు రోజుకు ఎక్కువవుతున్న

భర్త కోపం, ఆమె కంటూ పేరు ఉందని మరచింది .

‘నేనేమీ ఖాళీ గా లేను. పొద్దున్న అయిదు గంటలకు లేచింది మొదలు

పనితో పరుగు పందెం మొదలవుతుంది నాకు . ఇక్కడ వంట పనిలో ఉన్నా

కదా మీరు చూస్తె తప్పా?’

‘పోయి పోయి కష్టపడి వచ్చాడు అనే బాదే లేదు నీకు. వెధవ కొంప, వెధవ

సంత అని’

‘నీ పిల్లలు నీకు సంత అయిపోయారా? మీరే కాదు నేనూ పోయి పోయి కష్ట

పడే వచ్చాను. పిల్లల ముందు ఇలా గొడవ పడొద్దని తెలీదా ’

‘వెళ్లి నాలుగు ముక్కలు చెప్పగానే కష్టపడినట్లా ? నాకు ఎన్ని టెన్షన్ లు

ఉంటాయి?’

‘ ఒక్క నాలుగు ముక్కలు చెప్పిందే కనబడుతుందా మీకు. ఇంకా ఎన్ని

పనులు చేస్తున్నాను?’

‘ఏంటో అవి?’

‘ పొద్దున్న అందరికీ టిఫిన్లు, మధ్యాన్నాన్నికి భోజనాలు, సాయంత్రానికి

స్నాక్స్ తయారు చేయాలి . పిల్లలిద్దరూ లేవగానే, వారి పనులు అన్నీ చేసి

వారికి తినబెట్టి హడావుడిగా నేనూ ఇంత కుక్కుకుని వారికి మధ్యాన్నం

తినిపించాల్సిన బాక్స్ లు సాయంత్రాని కి తినిపించే స్నాక్స్ అన్నీ కలిపి

వారిని కేర్ సెంటర్ లో (లాంటి దూరపు బంధువుల ఇంట్లో) పాప

ఏడుస్తుంటే, గుండె రాయి చేసుకుని అప్పజెప్పి, బాబును స్కూల్లో దింపి

కాలేజీ కి పరుగెత్తాలి. అక్కడ క్లాసెస్ చెప్పుకుని , తెల్లవారి చెప్పే క్లాసెస్

ప్రిపరేషన్ చూసుకుని , సాయంత్రం వస్తూ కూరగాయలు తీసుకుని,

పిల్లల్ని తీసుకుని ఇల్లు చేరాలి. అప్పటికి పొద్దున్న హడావుడిగా తిన్న

టిఫిన్, మధ్యాన్నం చారు, పెరుగు లేకుండా ఎదో తిన్నానంటే

తిన్నానన్నట్లు తిన్న భోజనం అంతా ఆవిరై నీరసం వస్తుంది. ఇంటికి

రాగానే వాషింగ్ మిషన్ లో వేయాల్సిన మాసిన బట్టలు, సాయంత్రం

మర్నాడు చేయాల్సిన టిఫిన్ కోసం తయారు చేసుకోవాల్సిన వి , దండేల

పై మడత పెట్టడం కోసం ఎదురు చూసే బట్టలు ...ఎన్ని పనులు . రాగానే

పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు వేయాలా ? తినడానికి పెట్టి , బాబుకు

హోం వర్క్ చేయించి ,వారిని చూసుకుంటూ రాత్రి వంట చేయాలా ! ఇక

నేను ఎక్కడ మీకు ఖాళీ గ కనబడుతున్నాను?’

‘లోకంలో నువ్వొక్కదానివే ఇవన్నీ చేస్తున్నావా? ప్రతీ పని సాగదీసి చెప్పావు.

పని మనిషిని కూడా పెట్టానుగా’

‘కేవలం బయట ఊడ్చి, గిన్నెలు తోమేసి వెళుతుంది. మిగతా పనేమైనా

తక్కువ ఉందా?’

‘ఇది అందరూ రోజూ చేసేదేగా? ఈ మాత్రం దానికి అలసి వచ్చిన

మొగునికి డిస్టర్బ్ చేయకుండా పిల్లల్ని త్వరగా పడుకో బెట్టాలనే ఆలోచనే

ఉండదు. నిద్ర సరిగ్గా లేకపోతె తెల్లవారి ఎలా పని చేస్తాడనే ఇంగితమే

లేదు. ‘

ఇక మాట్లాడాలని పించలేదు ఆమెకు.

అలుపు లేకుండా తిరిగే యంత్రమైనా అతిగా తిరిగితే అరిగిపోవడమో ,

పాడవడమో తప్పదు . దానికి మనుషులు అతీతులు కారన్నది నిరూపిస్తూ ,

రోజు రోజుకూ పెరుగుతున్న పని వల్ల , విశ్రాంతి లేకపోవడం వల్ల , నిద్ర

తక్కువవడం వల్ల ఒకరోజు కళ్ళు తిరిగినట్లయి వచ్చేప్పుడు బండి

అదుపుతప్పి పడిపోవడంతో తప్పనిసరి అయి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు

సుహాస్. అక్కడ తెల్సిన విషయం ఆమె గుండెల్ని బద్దలు చేసింది.

‘చూడండి సుహాస్! రక్తహీనత, పోషకాహార లోపం , నిద్రలేమి తోపాటు

కాన్సర్ కూడా ఉంది ఈవిడకి. ఇక నుండి గాజుబొమ్మలా ,చాలా జాగ్రత్తగా

ఎలాంటి మానసిక , శారీరక ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం

ఉద్యోగం చేయక పోతేనే మంచిది ‘అని చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చెప్పి , మందులు రాసి ఇచ్చింది డాక్టరమ్మ .

‘ ఇప్పటికే ఈ జీతంతో ఈ భాగ్య నగరమైన మహానగరం లో బతకడం

కష్టమంటే , ఇక ఒక్కరి జీతంతో ఈ రోగానికి , మందులకు పెడుతూ ఎలా

బతకాలి?బండి పై వస్తుంటే చూసుకోవద్దూ. అలా బండి మీద నిద్ర పోతావా?

‘ ఇంటికి రాగానే , భర్త నుండి సానుభూతి వచనాలు ఊహించిన విశ్వైక

అంచనాలు పటాపంచలు చేస్తూ భర్త మాట్లాడిన మాటలు విని నిర్ఘాంత

పోయింది.

మానసిక స్థైర్యం ఇవ్వాల్సింది పోయి , అంటు వ్యాధిలా ఆమెను దూరం

పెట్టడం చూసి ఆమె మనసు కుంగి పోయింది. ఆమె కళ్ళముందు పిల్లల

భవిష్యత్తు , తన భవిష్యత్తు ప్రశ్నార్దకమై భూతంలా భయపెడుతోంది.

స్టాఫ్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా కూర్చుని ఆలోచనల్లో

పడిన ఆమె కళ్ళు ఆ పరధ్యానం లో , బాధలో ఆమెకు తెలియకుండానే

కన్నీరు కార్చాయి. అప్పుడే అందులోకి అడుగుపెట్టిన ఇంగ్లీష్ లెక్చరర్

శ్రీనివాస్ కంట పడింది ఆమె కన్నీరు.

‘మేడం! ఆర్ యు ఆల్ రైట్ ! ఏమైనా ప్రాబ్లమా ’ అతని మాటలకు తుళ్ళి

పడిన విశ్వైక కన్నీరు తుడిచేసుకుని,

‘అబ్బే! అదేం లేదు’ అంది.

‘మేడం! మిమ్మల్ని చూస్తె మా చెల్లెలు గుర్తొస్తుంది. అందుకే అడుగుతున్నా

! ఏమైనా బాధ ఉంటె ఆత్మీయులతో పంచుకుంటే పోతుంది అంటారు. నా

చేతులతో చేయగలిగిన ఏమైనా సహాయం వుంటే చేస్తాను. మీకేం

అభ్యంతరం లేకపోతె చెప్పండి.’ ఆత్మీయంగా అడిగిన ఆయన మాటలను

తీసేసి ఆయనను బాధ పెట్టాలని లేకపోయినా , ఎవరికీ చెప్పాలనిపించని

బాధ చెప్పుకోలేక మాట మారుస్తూ , ‘ఒకసారి ఆమెను చూడాలని ఉంది సర్’

అంది .

‘ ఈ లోకంలో ఉంటె తప్పక చూపించే వాడిని అమ్మా! మమ్మల్ని కాదని

ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది . మోసపోయానని తెలుసుకున్నాక ,

మొహం చెల్లక అందర్నీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది ‘ అంటున్న

ఆయన కంఠం లో జీర ఆమె దృష్టి ని దాటి పోలేదు. షాక్ తింది.

అప్పటి నుండి కాలేజ్ లో అడపా దడపా ఆత్మీయంగా మాట్లాడ్డం ,

అప్పుడో ఇప్పుడో ఆ కాలేజ్ స్టాఫ్ వాట్స్ అప్ గ్రూప్ లో మెస్సేజ్ లు పెట్టడం

చేసేవాడు.

********

‘ఏయ్! ఇంత సేపు ఎక్కడెక్కడ, ఎవడితో తిరుగుతున్నావు ?’ రాత్రి

పొద్దుపోయాక ఇంట్లోకి అడుగుపెట్టగానే కోపంతో ఊగిపోతూ ఒక్కటేసాడు

సుహాస్.

‘మీరు..మీరు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను కొట్టారా? కోరి చేసుకున్న

ప్రతిఫలమా ఇది? పిల్లలున్నారని కూడా చూడకుండా..’ కళ్ళల్లో కడలే

ఉప్పొంగింది.

‘ రాత్రయింది. ఇంట్లో ఎదురుచూస్తారు అనే ఇంగితం అయినా లేదా?

డిస్టర్బ్ లేకుండా , సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మరీ ఇంత రాత్రి వరకు

వెలగబెట్టే రాచాకార్యాలేంటో ?’

‘ ఆఫీస్ లో ప్రిన్స్ పల్ తో మీటింగ్ ఉండటం తో సెల్ సైలెంట్ మోడ్

లో పెట్టాను. చార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అయిపొయింది. కనీసం

ఏం జరిగింది? అని బాధపడటం కాక..ఛీ! ఇలా ఎలా

ఆలోచించారు?’చెప్పాలనుకున్నా , చెప్పలేదు విశ్వైక.

అతను అలా ఆలోచించడానికి కారణం ఆమెకు మరో రెండు రోజుల్లో

తెలిసింది.

ఆ రోజు రాత్రి వంట గదిలో ఉన్న ఆమె , ముఖ్యమైన ఒక మెస్సేజ్

పెట్టడానికి సెల్ కోసం బయటకు వచ్చింది. అప్పటికే సుహాస్ చేతిలో ఆమె

సెల్ ఉంది. అప్పటి వరకు, ఆమె కే తెలిసిన కొన్ని విషయాలు మాటల

మధ్యలో సుహాస్ కి ఎలా తెలిసాయో అర్ధం అయింది ఆమెకు. అంటే

ప్రతిరోజూ సెల్ లో వచ్చినవన్నీ చెక్ చేస్తున్నాడన్న మాట. ఛీ..ఎంత

నీచమైన పని. అదే తన ముందే అలా చేస్తే తనకు ఏమీ అనిపించేది

కాదేమో!

‘ఏం చూస్తున్నారు?’ ఆమె మాటలకు తొట్రుపడుతూ, ‘వీడెవడు శ్రీనివాస్ ?

..వాడు గుడ్ మార్నింగ్ పెట్టడం ఏమిటి ? దానికి నువ్వు సిగ్గుపడుతూ ఈ

నవ్వే సింబల్ పెట్టడం ఏంటి? అసలు వాడేవడు? నీకు నవ్వుతూ , గుడ్

నైట్ లు, స్వీట్ డ్రీమ్స్ అంటూ చెప్పడానికి?’

‘మంచిగా మాట్లాడండి. ఆయన నాకు కొలీగ్ ...గుడ్ మార్నింగ్ అని మాత్రమె

చెప్పారు. అయినా ఇలా దొంగతనంగా ఒకరి సెల్ చెక్ చేసే దురలవాటు

మీరెప్పటి నుండి చేస్తున్నారు?’

‘అంటే చేసిన (రంకు )నేరం బయటపడిందని భయమా ? ‘

‘మాటలు చక్కగా రానివ్వండి’

‘ఏంటే !..నీతో చక్కగా మాట్లాడేది? రోగాల్ని, ఇలాంటి సంబంధాలను దాచి

నన్ను చేసుకుని మోసం చేసింది చాలక . పెళ్ళాం అంటే ఎలా ఉండాలో

తెల్సా? సతీ సావిత్రి, సతీ సుమతి గురించి చదివావా? కార్యేషు దాసీ, కరేషు

మంత్రి అని తెలుసా? నువ్వు చదవవు. నాకు తెల్సు...’

‘పెళ్ళాం ఎలా ఉండాలో చెప్పేవాడివి, మొగుడు ఎలా ఉండాలో

తెల్సుకున్నారా? ....

‘ మాంగళ్యం తంతు నానేన

మామ జీవన హేతునా!

కంఠె బధ్నామి సుభగే

త్వాం జీవ శరదాం శతం’ అంటే నూరు సంవత్వరాలు మెండైన, నిండిన

ఆనందం కోసం ఆయురారోగ్యాల కోసం మంగళ ప్రదమైన ఈ మాంగళ్యాన్ని

నీ కంఠం నందు ధరింప జేయుచున్నాను, అని . జీవితాంతం స్నేహంగా

జీవించాలని అగ్ని సాక్షిగా ఏడవ అడుగు వేసారు. అవేమైనా మీరు

చేస్తున్నారా? ‘

‘అంటే...నేను చేయడం లేదని, నువ్వు నీతి తప్పుతావా? బజారు..... ఛీ... ‘

‘ఏం కూసావురా?’

‘ఆ...నన్నే రా అంటావా? నిన్ను .... ’ కోపంగా ఆమె గొంతు పట్టుకున్నాడు.

ఆమె గింజుకుంటుంది. చేతులతో ఎంత విదుల్చుకోవాలని చూసినా అతని

బలం ముందు ఓడిపోతోంది. అతని బలానికి వెనక్కి జరుగుతోంది. ఆ

క్రమంలో తల , వెనక ఉన్న గోడకు తాకి ఇక జరగడానికి లేక ఆగిపోయింది.

అతని బలం ఎక్కువై, అస్సలు ఊపిరి ఆడడం లేదు విశ్వైక కి. ఒక్క సెకన్

అయితే ప్రాణం పోయేదే. అదిగో అప్పుడు ఆమెను రక్షిస్తూ సెల్ మోగింది.

ఒక్క క్షణం అతని పట్టు సడలె సరికి బలవంతాన లేని బలం తెచ్చుకుని

అతని పట్టు విడిపించుకుని కూలబడింది. శ్వాస తీసుకోవడానికి కొంత

సమయం పట్టింది. ఫోన్ తీసుకుని మరో గదిలోకి వెళ్ళిపోయాడు సుహాస్.

ఆ సంఘటన ఊహించనిది కావడం తో భయంతో ఆమె శరీరం వణికిపో

యింది. అతని కళ్ళల్లో ఆ క్షణం లో చూసిన క్రౌర్యానికి అతను కోపం వస్తే

ప్రాణం తీయడానికి వెనకాడడని తెలిసిపోయింది.

దాని పర్యవసానమే ఈ కల ఏమో !....

**************

ఆరోజు నుండి ఇంట్లో ముభావంగానే ఉంటున్నారు ఇద్దరూ.

ఒకరోజు ఆఫీస్ లోని కొలీగ్ విరించి ఫామిలీని భోజనానికి పిల్చాడు సుహాస్.

వారి ముందు అతను చూపించే ప్రేమకు, అనురాగానికి ఆశ్చర్యపోయింది

విశ్వైక.

‘ఏం విశ్వైక ! ఆ రోజు నువ్వు అందరి ముందు దిష్టి తగులుతుందనే

అబద్ధం చెప్పావు కదూ! ఆయన ప్రతి మాటలో నీపై ప్రేమ ఎంత

పొంగిపోతోందో చూడు’ విరించి భార్య మాధవి అననే అన్నది.

ఆమెకు అంతకు పూర్వం అందరూ ఫామిలీ లతో కల్సి వెళ్ళిన టూర్ లో

మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి.

‘మా వారయితే నేను లేనిది అస్సలు ఉండలేరు. ఇంతవరకు నాతొ తప్ప

విడిగా ఒక్కసారి కూడా ఒక్క సినిమాకు వెళ్ళలేదు ‘

‘మా వారు కూడా అంతే . నన్ను విడిచి ఒక్క రోజు కూడా ఉండలేడు’

‘ ఆయన వచ్చే వరకు నేను తినకుండా ఎలా ఎదురుచూస్తానో , నేనెక్కడి

కయినా బయటకు వెళితే మా వారు కూడా అలాగే ఎదురు చూస్తారు.

నేనంటే ప్రాణం’

‘అదేంటో ..అందరూ చెబుతున్నా విశ్వైక మాట్లాడ్డం లేదేంటో ..సిగ్గా ...’

‘ఆ.. వీళ్ళకేం చెప్పేది అనుకుంటుందేమో !’

‘దిష్టి తగులుతుంది అనుకుంటుందేమో’

‘ఏం విశ్వైక ..ఏమీ మాట్లాడవు. ఇద్దరూ చక్కగా ముద్దుగా చిలకా గోరింకల్లా

ఉంటారు. మేమెంత అసూయ పడతామొనని అనుకుంటున్నావా? నువ్వు

చెప్పకపోతే ఇవ్వాళ వెళ్ళనిచ్చేది లేదు.. . చెప్పాల్సిందే!’

చిలకా గోరింకలు..నిజమే ..తాము అవేనేమో....

అందరూ బలవంతం చేయడం తో అబద్ధం చెప్పడం ఇష్టం లేని విశ్వైక

నోరు విప్పింది.

‘మీరంతా అసూయ పడేంత, అందరి దిష్టి తగిలెంత ప్రేమెం లేదు లేండి ‘

చిన్నగా దాటేయ బోయింది.

‘ఎంత తెలివిగా తప్పించుకుంటున్నావు. మేమేం వదిలేది లేదు ...’

బలవంత పెట్టడం తో ఇంతవరకు ఎవరితో పంచుకొని విషయాలలో ఒకటి

చెబుతూ , ‘ఆయన కు పని మీద ఉన్న ప్రేమ , నాపై ఉండదులే!’ అంది .

ఆ విషయాలు ఇప్పుడు గుర్తు వచ్చాయి. ఇప్పుడు మొన్న జరిగిన

సంఘటన, తను చెప్పినా ఎవరూ నమ్మరని అర్ధమైంది . మౌనంగా ఒక

వెర్రినవ్వు నవ్వింది.

అదొక్కటేనా ! మరో వారానికి ఎవరింట్లోనో పార్టీ ఉందని

బయల్దేరదీసాడు. అక్కడ అందరూ సరదా గా బయటకు అలా షాపింగ్ కి

వెళదామని వెళ్ళినప్పుడు అక్కడ ప్రతీ ఫామిలీ లోని పిల్లలకి వాళ్లకు

నచ్చినవి వారికి కొనిచ్చాడు. ఇంట్లో పిల్లలకు కావాలన్నా, ఏ అత్యవసర

వస్తువుల గురించి తెమ్మని చెప్పినా ,’ డబ్బులు లేవు ‘ అంటూ చెప్పి , గీచి

గీచి ఖర్చు చేసే భర్త అలా ఖర్చు పెట్టేసరికి బిత్తరపోయింది విశ్వైక.

‘మీ వారికి పిల్లలంటే ఎంత ఇష్టమో! మీ వారు ఎంత మంచివారో కదా!’

అన్న వారి మాటలకు వెర్రి నవ్వొకటి నవ్వింది. సుహాస్ ఆమె వైపు చూసి

నవ్విన నవ్వు వెనక ఉన్న వంకర నవ్వు ఒక్క విశ్వైక కు మాత్రమె

కనబడింది. అప్పుడు ఆమెకు అతని గుణం అర్ధం అయింది. అంటే ఒక్క

తన దగ్గర కాకుండా అందరికీ అతని మంచి తనమే తెల్సు. కేవలం తనకు

మాత్రమే అతని అసలు గుణం తెల్సు. కాని అతను తెల్సిన ఎవరైనా ఆ

మాట చెబితే నమ్మరు. కాదు కాదు . అలా నమ్మించాడు. ఇప్పుడు ఆమెకు

ఇంకా భయం ఎక్కువైంది. ప్రపంచంలో ఎవరైనా ఆదర్శ

దంపతులంటే తామే అని చెప్పుకునేలా ఉండాలి తమ జంట అనుకుంది

తను. కాని, ఇంత ఘోరంగా మొగుడూ పెళ్ళాలు ఉంటారా అనేలా

ఉన్నారు.

ఇదొక్కటేనా ! మానసిక చిత్రవధ అంటే ఏమిటో క్షణ క్షణం

కనబడుతోంది. భవిష్యత్తు భూతంలా భయపెడుతుంటే , అనారోగ్యం ఇంకా

ఎక్కువైంది. మందులకు అంటే ససేమిరా డబ్బులు ఇవ్వడు.

‘ మీ ప్రిన్స్ పాల్ కి, నాకు ఆరోగ్యం బాలేదని చెప్పి అడుక్కో ‘ అన్న మాటతో

ఆమెకు మనస్సు మొత్తం విరిగిపోయింది. కావాలని వదిలించు కోవాలని

ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాలేదు.

ఆత్మీయంగా అడిగిన కొలీగ్, సోదరునిగా పిలిచే శ్రీనివాస్ దగ్గర ఏడుస్తూ

బయట పడింది.

‘నా పరిస్థితి నాకేం అర్ధం కావడం లేదు అన్నయ్యా! నేనంటూ లేకుండా

పొతే , పిల్లల పరిస్థితి ఏంటి అనేది నాకు అర్ధం కావడం లేదు . ఆయన

మారతారనే నమ్మకము నాకు లేదు ‘

‘లేదమ్మా! ఇలాంటప్పుడు కావాల్సింది మనో ధైర్యం. భయపడ వద్దు ,

భయపడితే ఇంకా భయ పెడతారు . బయటకు వెళ్ళినా చట్టాలు ఆడవారికి

అనుకూలంగా ఉన్నాయి. అది గుర్తుంచుకుని , ఆయనకు అర్ధమయ్యేలా

చెయ్యి’ అనడంతో తలూపింది.

అనుకోకుండా వేసుకున్న టాబ్లెట్స్ కొంచెం తేడా చూపించడంతో డాక్టర్

దగ్గరకు వెళ్ళింది విశ్వైక . ఆరోజు డాక్టర్ దగ్గర చాలా మంది పేషంట్ లు

ఉండటం తో , చూపించుకుని బయల్దేరే సరికి చాలా ఆలస్యం అయింది

విశ్వైక కి . ఎప్పటిలాగే సెల్ లో చార్జింగ్ అయిపొయింది. ఆమె సెల్ కలవక

పోవడంతో సుహాస్ నే వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకోచ్చేసాడు.

********

ఇంట్లోకి వెళ్ళగానే, ‘ఎన్ని సార్లు చెప్పినా నీ బుద్ది మార్చుకోవా ?’ అంటూ

కోపంగా చెయ్యి ఎత్తిన అతని చేయిని గట్టిగా తన చేయితో అడ్డుకుంటూ

అక్కడే ఆపింది.

‘ నేనేం తప్పు చేయలేదు. ఎందుకు ఆలస్యం అయ్యిందని అడగాలనే

ఇంగితం కూడా లేని మీతో చెప్పడం కూడా అనవసరమే’

‘ఆలస్యంగా వచ్చింది కాక అంత పొగరెంటే నీకు... నాకు నచ్చినట్లు

ఉంటానంటేనే ఉండు లేదంటే ఈ క్షణం వెళ్ళు ’

‘ వెళతాను. పెళ్ళి చేసుకుంది నీకు బానిసగా బతకడానికి కాదు. నాకూ ఓ

వ్యక్తిత్వం ఉంది. అది అమ్ముకోలేదు... కాని వెళితే ఊరికే వెళ్ళను. ఏం

చేస్తానో చూడు. నీ వేధింపులన్నీ బయట పెడతాను. చంపాలని చూసిన

దానితో సహా .చట్టాలన్నీ నాకే అనుకూలంగా ఉంటాయి. ఒక్కసారి గృహ

హింస కేసు పెడితే చాలు. ముందు నువ్వు కటకటాల వెనక్కి. దానితో నీ

ఉద్యోగం ఊస్టు. నువ్వప్పుడు కోరలు పీకిన పామువే ! ’ ఈసారి బిత్తర

పోవడం సుహాస్ వంతయ్యింది. ఆమె ఇలా ఎదురు తిరుగుతుందని

ఊహించని సుహాస్ దెబ్బ కు ఖంగు తిన్నాడు.

*******

ఇలా ఇవన్నీ ఊహించుకుంటూ వెళ్ళిన విశ్వైక అందుకు భిన్నమైన

వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వెళ్లేసరికి పిల్లలు స్నానాలు చేసి

స్నాక్స్ తిని , సుహాస్ చెబుతుంటే బాబు హోం వర్క్ కూడా చేసి , అంతా

ఆడుకుంటున్నారు.

‘ఏంటి విశూ... ఎటేళ్ళావు ?’

‘హాస్పిటల్ కి ‘ చాలా కాలం తర్వాత భర్తకు గుర్తొచ్చిన తన పేరు విని

ఆశ్చర్య పోతూ అంది.

‘ చెబితే నేను వచ్చేవాడిని గా ! ఇంతకూ ఏమన్నారు? నీ ఆరోగ్యం కుదుట

పడేంతవరకు రెస్ట్ తీసుకో. నేను కొంచెం ముందు లేచి సహాయం చేస్తాలే’

గిచ్చుకుని చూసుకుంది విశ్వైక . నొప్పి తెలిసింది. కల కాదు. ఇన్ని

రోజుల పూజలు ఫలించాయని దేవుడికి మనస్పూర్తిగా మనసులోనే సర్వస్య

శరణాగతి చేసింది. తన మనసుకు అయిన గాయం ఇంత తొందరగా

మానుతుంది అనుకోలేదు ఆమె .

విరించికి క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీనివాస్ విరించి ద్వారా సుహాస్ కి

రాబోయే పరిణామాల గురించి చూచాయగా హెచ్చరించి బ్రెయిన్ వాష్

చేసిన సంగతి, కౌన్సిలింగ్ చేసిన సంగతి ఎవరికీ తెలిసే అవకాశమే లేదు .

శుభం

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.



లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా.

పూర్తి పేరు : నామని సుజనాదేవి

విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower.

వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి

ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టి‌టి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం.

1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి ******


107 views0 comments

Comments


bottom of page