top of page

గోదావరి నవ్వింది

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Godavari Navvindi' New Telugu Story

Written By M R V Sathyanarayana Murthy


రచన : M R V సత్యనారాయణ మూర్తి




బెంగుళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగి తమ్ముడి పిల్లలు, మిధున్, వరుణ్ లకు బై చెప్పి లోపలకు వచ్చాడు కృష్ణ. చెకింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి పావుగంట పట్టింది. బోర్డింగ్ పాస్ లో ఉన్న ప్రకారం గేట్ నెంబర్ ఎనిమిది దగ్గరకు వెళ్లాడు. అప్పటికే రాజమండ్రి వెళ్ళే ప్రయాణీకులు క్యూ లో ఉన్నారు.


మరలా చెకింగ్ అవుతుండగా, ముందున్న నాలుగో వ్యక్తి ని బాగా చూసిన జ్ఞాపకం వచ్చింది కృష్ణకు. ఆవిడ, చెకింగ్ పూర్తి అవ్వగానే నాలుగు అడుగులువేసి, విమానం దగ్గరకు తీసుకువెళ్ళే బస్సు ఎక్కింది. తన చెకింగ్ పూర్తి అయ్యి అతను ముందుకు వచ్చేసరికి, ఆవిడ ఎక్కిన బస్సు వెళ్ళిపోయింది. ఆ తర్వాత బస్సు ఎక్కి కూర్చున్నాడు కృష్ణ . మిగతా పాసెంజర్లు వచ్చి ఎక్కిన తర్వాత, ఐదు నిముషాలకు గానీ బస్సు బయల్దేరలేదు. అతని మనసు చాలా ఆందోళనగా ఉంది. ఆమెని తప్పకుండా కలుసుకోవాలి. ఎన్నో విషయాలు మాట్లాడాలి.


బస్సు విమానం దగ్గర ఆగగానే గబ గబా దిగి, నిచ్చెన ఎక్కి విమానంలోకి వచ్చాడు. ఎయిర్ హోస్టెస్, పాస్ చూసి చిరునవ్వుతో సీట్ చూపించింది. తనూ చిన్నగా నవ్వి సీట్ దగ్గరకు వచ్చి బాగ్ పైన పెట్టి, ముందుకి చూసాడు, ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. ఇంతలో అతని పక్క సీట్ వ్యక్తి రావడంతో, కొంచెం జరిగి అతనికి దారి ఇచ్చాడు . అతనిది విండో సీట్. ముందుకు వెళ్లి ఆమెకోసం వెదుకుదామా? అనుకుని, సభ్యత కాదని ఊరుకున్నాడు.


ఎయిర్ హోస్టెస్ వచ్చి అందరూ సీట్ బెల్టులు పెట్టుకున్నారో, లేదో? అని చెక్ చేస్తోంది. ఆమెని చూసి, సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కృష్ణ. అనౌన్స్ మెంట్ అవగానే విమానం బయల్దేరింది. ఎయిర్ హోస్టెస్ ప్రయాణ జాగ్రత్తలు చెబుతోంది. కృష్ణ నిరాసక్తంగా చూస్తున్నాడు. అతని మనసంతా ‘ఆమె’ గురించే ఆలోచిస్తోంది. ఎయిర్ హోస్టెస్ ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణ సీట్ వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకున్నాడు. అతని ఆలోచనలు గతం లోకి పరుగులు తీసాయి.

****

కృష్ణ సంక్రాంతి సెలవలకు అమ్మమ్మ గారి ఊరు సిద్ధాంతం వచ్చాడు. అతనికి ఆ ఊరు అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ గారి ఇంటికి దగ్గరగానే గోదావరి ఉంటుంది. గోదావరికి ముందుగా ఉన్న కోడేరు కాలువ, లాకులు, ఆ ఆవరణలో ఉండే మామిడి, సపోటా, నిద్రగన్నేరు చెట్లు. లాకు సిబ్బంది కోసం కట్టిన చిన్న చిన్న ఇళ్ళు...


...అన్నీ చూడముచ్చటగా ఉంటాయి. పైగా అమ్మమ్మగారి ఇంటి వీధిలో తన ఈడు పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కలిసి గోదావరి ఒడ్డున కబాడీ ఆడడం, గాలి పటాలు ఎగురవేయడం అతనికి ఎంతో ఇష్టం.


అమ్మమ్మగారి ఇంటి పక్కనే ఉన్న కిరణ్ వాళ్ళ ఇంట్లో కేరం బోర్డు ఉంది. కృష్ణ, కిరణ్, సుధీర్, రవి ఉదయం వేళల్లో అక్కడే కేరమ్స్ ఆడుకుంటారు. ఈసారి సంక్రాంతి సెలవలకు కిరణ్ వాళ్ళ మావయ్యగారి అమ్మాయి అమలాపురం నుంచి వచ్చింది. ఆమె కూడా వీళ్ళ జట్టులో చేరింది. ఆమె కూడా పదవ తరగతి చదువుతోందని తెలియగానే వాళ్ళందరూ మరీ సంతోషించారు. ఆమె పేరు ‘మేఘమాల’అని అందరికీ పరిచయం చేసాడు కిరణ్.


ముందుగా కిరణ్, మేఘ ఒక జట్టుగా, కృష్ణ, రవి ఇంకో జట్టుగా కేరమ్స్ ఆడారు.

కిరణ్ జట్టు ఓడిపోయింది, కృష్ణ జట్టు నెగ్గింది. మేఘమాలకి చిన్నతనం అనిపించింది. కృష్ణ ఆడే విధానం ఆమెకి బాగా నచ్చింది.


“బావా, ఈసారి నేనూ, కృష్ణ ఒక జట్టుగా ఉంటాం. నువ్వూ, రవి ఇంకో జట్టుగా ఆడదాం” అంది మేఘమాల. అలాగే అన్నాడు కిరణ్.


రవి, కిరణ్ ఎంత జాగ్రత్తగా ఆడినా కృష్ణ, మేఘమాల జట్టే నెగ్గింది.

“హే, నేను నెగ్గాను” అంటూ చప్పట్లు కొట్టి, “థేంక్ యు కృష్ణ” అని కృష్ణ కి

షేక్ హ్యాండ్ ఇచ్చింది మేఘమాల.


కృష్ణ వళ్ళు ఒక్కసారిగా ఝల్లుమంది. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి

షేక్ హ్యాండ్ ఇవ్వడం అతణ్ణి చాలా ఆనందపరిచింది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కృష్ణ. సంతోషంతో మెరుస్తున్న మేఘమాల కళ్ళు అతనికి ‘తెల్ల కలువ’లని గుర్తుకు

తెచ్చాయి. అప్పడు పరిశీలనగా చూసాడు ఆమె పెద్దకళ్ళని. తన స్కూల్ లో

ఆడపిల్లలకు అంత పెద్దకళ్ళు లేవని అతనికి గుర్తుకు వచ్చింది.


కిరణ్ వాళ్ళ అమ్మగారు పిలవడంతో, మేఘమాల లోపలకు వెళ్ళింది. అప్పుడే వచ్చాడు సుధీర్. వాళ్ళు నలుగురూ మళ్ళీ కేరమ్స్ ఆడటం మొదలుపెట్టారు. కాసేపటికి నాలుగు ప్లేట్లలో జంతికలు తెచ్చి వాళ్లకు ఇచ్చింది మేఘమాల. ఆటకి కాసేపు విరామం ఇచ్చి జంతికలు తినడం మొదలుపెట్టారు. మేఘమాల తన ఎడం చేతిలో జంతిక పెట్టుకుని ఒక్కో పలుకు జాగ్రత్తగా తీసుకుంటూ తింటోంది.


“మేఘా, కృష్ణ బొమ్మలు బాగా వేస్తాడు”అన్నాడు కిరణ్.


’అలాగా’అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి కృష్ణ కేసి ఆశ్చర్యంగా చూసింది మేఘమాల.

ఆ కళ్ళని చూసి మరోసారి ముచ్చటపడ్డాడు కృష్ణ.


“మొన్న ఆగస్ట్ పదిహేనుకి వాళ్ళ స్కూల్లో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో కృష్ణ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. నిన్న చెప్పాడు”అన్నాడు కిరణ్.


‘ఓ.. వెరీ గుడ్. ’ అంది మేఘమాల కృష్ణకేసి తిరిగి.

సమాధానంగా చిన్నగా నవ్వాడు కృష్ణ.


పన్నెండు గంటల వరకూ కేరమ్స్ ఆడి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

సాయంత్రం నాలుగు గంటలకు గాలిపటాలు తీసుకుని గోదావరి ఒడ్డుకు వచ్చారు కిరణ్ బృందం. వాళ్ళతో మేఘమాల కూడా వచ్చింది. కిరణ్ గాలిపటం ఎలా ఎగురవేయాలో మేఘమాలకి వివరించాడు.


మేఘమాల ఎంతో ఉత్సాహంగా తన గాలిపటం ఎగరేసింది. గాలిపటం పై పైకి వెళ్తూ, తోక ఊపుకుంటూ ఆకాశంలో ఎగురుతుంటే చిన్నపిల్లలా ఆనందపడింది.


కృష్ణ తన గాలిపటం ఎగరేస్తున్నా, ఆమె కేసే చూస్తున్నాడు. గాలికి ఆమె మొహం మీద ముంగురులు అలవోకగా కదలడం, మొహం మీద చిరుచెమటలతో.. బంగారం ప్లేటు మీద తెల్లని ముత్యాలు మెరుస్తూ వుంటే ఎలా ఉంటుందో, అలా కనిపించింది మేఘమాల మొహం అతనికి.


“ఒరేయ్ కృష్ణా, నీ గాలిపటం పల్టీలు కొడుతుంటే చూడవేంటి?” అని రవి ప్రశ్నించడంతో, తన చూపు మరుల్చుకుని తన గాలిపటాన్ని సరియైన మార్గంలోకి తీసుకువచ్చాడు. ఒక గంట గడిచాకా అందరూ గోదావరి రేవులో ఉన్న పెద్ద రావిచెట్టు కింద కూర్చున్నారు.


నెమ్మదిగా చీకటి పడుతోంది. లంకలో మేతకి తీసుకువెళ్ళిన పశువుల్ని గోదావరిలో దింపి, అవి ఈదుకుని వస్తూఉంటే, రైతులు వాటి వెనకే ఈదుకుంటూ వస్తున్నారు. లంకలో కూలిపనికి వెళ్ళిన వారు నావ ఎక్కి తిరిగి సిద్ధాంతం రేవుకి వస్తున్నారు. వాళ్ళు అందర్నీ పరిశీలనగా చూసింది మేఘమాల. 'పల్లె జీవనం ఎంత అందంగా, మనోహరంగా ఉంది?' అని అనుకుంది.

నాలుగు రోజులు గడిచాక కృష్ణ, బాల్ పెన్నుతో వేసిన మేఘమాల చిత్రాన్ని ఆమెకి ఇచ్చాడు. అది చూసి మేఘమాల చాలా సంతోషించింది. అలా వారి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. సంక్రాంతి సెలవలు అవ్వగానే కృష్ణ శివపురం వెళ్ళిపోయాడు. మేఘమాల అమలాపురం వెళ్ళింది.


పదవతరగతి పూర్తి కాగానే కృష్ణ శివపురం కాలేజీ లో, మేఘమాల అమలాపురం కాలేజీ లోనూ చేరారు. సంక్రాంతి సెలవలకు ఇద్దరూ సిద్ధాంతం లో కలుసుకోవడం, ముచ్చట్లు చెప్పుకోవడం జరిగింది.


ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పరీక్షలు అవగానే మరలా ఇద్దరూ సిద్ధాంతం లో కలిసారు. మిత్రులు అందరూ తర్వాత ఏం చదివితే బాగుంటుందో చర్చించుకున్నారు. కిరణ్, రవి బి. టెక్. చదువుతామన్నారు. సుధీర్ టీచర్ ట్రైనింగ్ కి వెళ్లి ఉపాధ్యాయుడిగా జాబు చెయ్యాలని ఉందన్నాడు.


“నీ సంగతి ఏమిటి?”అడిగాడు కృష్ణని, కిరణ్.

“బి. ఎస్. సి. చదివి ఆ తర్వాత ఫిజిక్స్ లో ఎం,ఎస్. సి. చెయ్యాలని ఉంది” అన్నాడు కృష్ణ.


“నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు ?”మేఘమాలని అడిగాడు కిరణ్.


“ప్రస్తుతం బి. ఎస్. సి. చదివి ఆ తర్వాత ఎం. ఎస్. సి. యా లేక బి. ఎడ్. కి వెళ్ళాలా?అన్నది ఆలోచిస్తాను” అంది మేఘమాల దీర్ఘంగా నిట్టూర్చి.


ఆ రోజు అందరూ కలిసి సినిమా చూసారు ఆనందంగా.

ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాక, కిరణ్ ఎం. సెట్. రాసి రాజమండ్రి కాలేజీ లో బి. టెక్. లోచేరాడు. రవి తాడేపల్లిగూడెం కాలేజీ లో బి. టెక్. లో జాయిన్ అయ్యాడు. సుదీర్ రాజమండ్రి లో టీచర్ ట్రైనింగ్ లో చేరాడు. యధాప్రకారంగా కృష్ణ శివపురం కాలేజీలో బి. ఎస్. సి. లో చేరితే, మేఘమాల అమలాపురం కాలేజీలో బి. ఎస్. సి. లో చేరింది.


కాలం వేగంగా గడుస్తోంది. కృష్ణ,మేఘమాల డిగ్రీ ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు. సుధీర్ టీచర్ ట్రైనింగ్ పూర్తీ చేసుకుని జిల్లా పరిషత్ సెలెక్షన్స్ కోసం చూస్తున్నాడు. కిరణ్, రవి బి. టెక్. చదువులతో చాలా బిజీగా ఉన్నారు. ఆ సంవత్సరం సంక్రాంతికి కిరణ్, రవి సిద్ధాంతం రాలేదు. కృష్ణ, సుధీర్, మేఘమాల ముగ్గురే కలుసుకున్నారు. సుదీర్ ఇల్లు నడిపూడి వెళ్ళే దారిలో ఉంటుంది. ఆ రోజు అతను రాలేదు. కృష్ణ, మేఘమాల ఇద్దరే గోదావరి ఒడ్డుకి వెళ్ళారు. సాయంకాలం ఒకో పడవా జనాలతో లంకల నుంచి వస్తోంది. ఇద్దరూ కబుర్లలో ఉండగానే చీకటి పడింది.


“కృష్ణా, నువ్వు ఎప్పుడైనా వెన్నెల్లో గోదావరిలో పడవలో వెళ్ళావా? చాలా బాగుంటుందని అంటారు” అడిగింది మేఘమాల కృష్ణని. ఆమె ప్రశ్నకి ఆశ్చర్యపోయాడు కృష్ణ. ఆమె

గోదావరిలోని నీళ్ళకేసే చూస్తోంది.


“లేదు మేఘమాలా, నేను రాత్రిళ్ళు పడవలో వెళ్ళలేదు. ”అన్నాడు నెమ్మదిగా కృష్ణ.


“నాకు వెన్నెల్లో గోదావరిలో పడవ ప్రయాణం చేయాలని ఉంది. మా కిరణ్ కూడా లేడు” అని ఒక క్షణం ఆగి “మనిద్దరం వెళ్దాము. నువ్వు ప్లాన్ చెయ్యగలవా?” ఆశగా అడిగింది మేఘమాల.


ఆమె అలా అడిగేసరికి కాదనలేకపోయాడు కృష్ణ. రెండు నిముషాలు ఆలోచించాడు. రేపే పౌర్ణమి. రేపు గోదావరి చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళాలి.


మేఘమాల అడిగిన చిన్న కోర్కెని తను తీర్చాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అయితే ఇద్దరూ కలిసి రాత్రివేళ పడవలో తిరుగుతామంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. గుడి దగ్గర ప్రోగ్రాములు జరుగుతున్నాయి. వాటికి వెళ్తున్నామని చెప్పి ఇంటి దగ్గర నుండి బయటపడాలి.


తన మనసులోని మాట మేఘమాలకి చెప్పాడు కృష్ణ. వెంటనే ఆనందంగా ఒప్పుకుంది మేఘమాల.


గోదావరి ఒడ్డున ఉన్న వీధి లైట్ కాంతి ఆమె మొహం మీదపడి, సంతోషంగా వెలిగి పోతున్న మేఘమాల మొహం మరింత అందంగా ఉంది. ఆ రోజు గుడి దగ్గర హరికథ ఉంది. అక్కడికి వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు. హరికథ దగ్గర కొద్దిసేపు ఉండి, తర్వాత నెమ్మదిగా గోదావరి ఒడ్డుకి వెళ్ళారు ఇద్దరూ. కృష్ణ అప్పటికే మాట్లాడి ఉంచిన పడవ దగ్గరకు వెళ్లి, పడవ ఎక్కారు. ఒక పావుగంట సేపు పడవలో గోదావరి మీద తిరిగారు.


పైన వెన్నెల, గోదావరి నీళ్ళలో పడి కొత్త అందాలు విరజిమ్ముతోంది. నిండు చంద్రుడు మిల మిలా మెరిసిపోతున్నాడు. గోదావరి నీళ్ళ మీంచి వస్తున్న చల్లని గాలి ఇద్దరి మేనుల్నీ స్పృశించి ఒక వింత హాయిని కలిగించింది. ఎగువకు వెళ్ళిన పడవ తిరిగి సిద్ధాంతం వైపు మరలింది.


“కృష్ణా, గోదావరి అవతల ఒడ్డున కాసేపు కూర్చుందామా?” అడిగింది మేఘమాల.


‘అలాగే’ అని పడవ వాడితో అవతల ఒడ్డుకి పోనిమ్మని చెప్పాడు. ఐదు నిముషాలలో పడవ గోదావరి అవతల ఒడ్డునఆగింది. ముందు కృష్ణ దిగి మేఘమాలకి చేయి అందించి, ఆమె దిగడానికి సాయం చేసాడు.


'ఒక పావుగంటలో వచ్చేస్తాము. ఇక్కడే ఉండు', అని పడవ వాడికి చెప్పి ఇద్దరూ ఇసకలో

నడుచుకుంటూ వెళ్ళారు. ఒక చోట ఆగి వెలుగుతున్న దీపాలు, గోదావరి వంతెన మీద నుంచి వెళ్తున్న వాహనాల ఒడ్డున ఉన్న కేదారేశ్వర స్వామి గుడి శిఖరం మీది లైట్, గోదావరి దిగువన ఉన్న గ్రామం ఒడ్డున ఉన్న లైట్ వెలుగు...


"ఓహ్! చాలా అద్భుతంగా ఉంది కదా కృష్ణా" అంది మేఘమాల ఎంతో ఆనందంగా.

"అవును . చాలాబాగుంది మేఘమాలా" అన్నాడు మనస్ఫూర్తిగా.


అతని మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. ఒక అందమైన అమ్మాయితో వెన్నెల్లో షికారు, అతను ఎన్నడూ ఊహించలేదు. నాలుగు అడుగులు వేసి ఒక చోట కూర్చుంది మేఘమాల. ఆమె దగ్గరే కృష్ణ కూర్చున్నాడు.


ఆకాశంలో చందమామ చాలా అందంగా కనిపిస్తోంది మేఘమాలకు. గోదావరి వెన్నెల్లో మిల మిలా మెరిసిపోతోంది. గోదావరి మీంచి చల్లని గాలులు సుకుమారంగా ఇద్దర్నీ తాకుతున్నాయి.


మేఘమాల పరవశంతో కూనిరాగం తీయసాగింది.

కృష్ణ ఆమె కేసి తిరిగి ‘ఒక పాట పాడు. నీకు పాటలు బాగా వచ్చునని కిరణ్ చెప్పాడు’ అని అన్నాడు.


అతని మాటలకు ఆమె కళ్ళతోనే చిన్నగా నవ్వింది. వెంటనే పాడటం మొదలుపెట్టింది.

“పాట పాడుమా కృష్ణా, పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా, మనసు తీరగా. . ఆ . . ఆ . ”


కృష్ణ ఆమె గొంతులోని మాధుర్యానికి ఆశ్చర్యపోయి ఆమె కేసి అలా చూస్తూండిపోయాడు. అరమోడ్పు కన్నులతో, తాదాత్మ్యంతో మేఘమాల అలా పాడుతూ వుంటే గోదావరి గాలి కూడా సున్నితంగా కదులుతూ ఆమెకి వింజామర వీస్తున్నట్టుగా తోచింది కృష్ణకి. ఐదు నిముషాలకు ఆమె పాట పూర్తి చేసింది. కృష్ణ చప్పట్లు కొట్టి ఆమెని అభినందించాడు.


“లలిత గీతం కూడా ఇంత మధురంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. నువ్వు

చాలా అదృష్టవంతురాలివి మేఘమాలా, భగవంతుడు నీకు చాలా మంచి కంఠాన్ని

ఇచ్చాడు” అన్నాడు కృష్ణ.


“నాకు యమునా తీరంలో కృష్ణుడిమీద పాట పాడాలని ఎప్పటినుంచో కోరిక.

అది ఎప్పటికి తీరుతుందో? అయినా గోదావరీ తీరంలో పౌర్ణమి రోజున నిండు

వెన్నెల్లో తనివితీరా పాటపాడే అదృష్టం నువ్వు నాకు కలిగించావు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది కృష్ణా. నీ మేలు నేను ఎన్నడూ మర్చిపోలేను. థేంక్ యూ . . కృష్ణా” అని ఆనందంగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని కృతజ్ఞతలు తెలిపింది మేఘమాల.


చల్లని వెన్నెలలో వెచ్చని ఆమె కరస్పర్స అతణ్ణి ఒక్క క్షణం వివశుడ్ని చేసింది. ఆమె కేసి ఆరాధనగా చూసాడు. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం మేఘమాలా’ అని

చెప్పాలనుకున్నాడు. కానీ ఆ మాటలు గొంతుదాటి రాలేదు.


పదినిముషాలు అక్కడే కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. మేఘమాలే ముందుగా లేచింది.


హరికథ పూర్తి అయ్యేలోగా గుడి దగ్గరకు వెళ్ళిపోవాలని గుర్తుకు వచ్చింది. ఇద్దరూ మళ్ళీ పడవ ఎక్కి గోదావరి దాటి ఇవతలకు వచ్చారు. మేఘమాల చూడకుండా పడవవాడికి ఐదు వందలు ఇచ్చాడు కృష్ణ . నడుచుకుంటూ గుడి దగ్గరకు వచ్చి అందరితోపాటు అక్కడ కూర్చున్నారు. ఒక అరగంటకు హరికథ పూర్తి అవడం, ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళడం జరిగింది.


తర్వాత కృష్ణ ఏలూరులో ఎం. ఎస్. సి. చదవడం, మేఘమాల విశాఖపట్నం లో ఎం. ఎస్. సి. చదవడం జరిగింది. పరీక్షలు అయ్యాక సిద్ధాంతం వెళ్ళినప్పుడు కిరణ్ చెప్పాడు 'మేఘమాల కి పెళ్లి అయిపోయిందని, భర్తతో బెంగుళూరు వెళ్ళిపోయింద'ని.. 'మేఘమాల నాన్నగారికి ఒంట్లోబాగుండకపోవడం వలన అర్జెంటుగా ఆమెకి పెళ్లి చేసేసార'ని.

.

నాలుగు రోజులు ఉందామని వచ్చినవాడు, ఆ రోజు సాయంత్రమే బయల్దేరి శివపురం వచ్చేసాడు కృష్ణ.

*****

ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనిపించింది మేఘమాల. అతని ఆలోచనలు ముగిసేసరికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చింది. విమానం దిగి లగేజి పిక్ అప్ దగ్గర నుంచున్నాడు కృష్ణ. తన బ్యాగ్ తీసుకున్నాడు. కొంచెం పక్కగా నిలబడ్డాడు.


ప్రయాణీకులు ఎవరి లగేజి వారు తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు కొద్ది దూరంలో కనిపించింది మేఘమాల. రెండు నిముషాలు ఆగి తన బ్యాగ్ తీసుకుని వస్తూండగా పలకరించాడు కృష్ణ ‘మీరు మేఘమాల . . కదూ’ అని.


ఒకసారి తల పైకి ఎత్తి చూసి ‘ఎవరా?’ అని ఆలోచించసాగింది.

“నేనండి కృష్ణని. కిరణ్ ఫ్రెండ్ ని”అన్నాడు చిన్నగా నవ్వుతూ.

అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమెకి, అతను ఎవరో.


తనూ చిన్నగా నవ్వింది.

”మీరు చాలా మారిపోయారు”అంది మేఘమాల.


ఆమె మాటలకు అతనూ చిన్నగా నవ్వాడు. కుడిచేత్తో బట్టతలని తడుముకున్నాడు. ఇన్ షర్ట్ చేసుకున్నా బయటకు కనిపిస్తున్న చిరుబోజ్జని చూసి ‘అవును కదూ. . ముప్ఫై ఏళ్లక్రితం ఉన్న రూపం ఎక్కడ? ఈ రూపం ఎక్కడ? చాలా మారాను’ అని సమాధానపరుచుకున్నాడు. ఇద్దరూ ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చారు.


“మీరు అమలాపురమేనా వెళ్ళడం?”అడిగాడు కృష్ణ.


“అవునండి. అమ్మకి ఒంట్లో బాగుందలేదట. చూడటానికి వచ్చాను”అంది మేఘమాల.


“ మిమ్మల్ని అమలాపురంలో దించి, నేను మా ఊరు వెళ్తాను” అని టాక్సీ పిలిచి ఆమె బ్యాగ్ కూడా అందులో పెట్టాడు కృష్ణ. ఒక గంట గడిచేసరికి అమలాపురం వచ్చింది. మేఘమాలని వాళ్ళ ఇంటిదగ్గర దింపి, వాళ్ళ అమ్మగారిని ఒకసారి పలకరించి శివపురం వచ్చాడు కృష్ణ.


మర్నాడు కిరణ్ కి ఫోన్ చేసి చెప్పాడు, ’మేఘమాల కనిపించింద'ని.


కిరణ్ ఒక నిముషం మౌనం వహించాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు.

“కృష్ణా, మేఘమాల జీవితం చాలా విషాదంగా మారిపోయింది. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగుండలేదని మేఘమాలని చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేసారు. వాళ్లకి ఒక అమ్మాయి కూడా పుట్టింది.


గత సంవత్సరమే ఆమెకి పెళ్లి చేసారు. మేఘమాలకి తరచూ అనారోగ్యం కలగడంతో టెస్ట్ చేయిస్తే, ‘కేన్సర్’ అని తేలింది. కొద్దిపాటి వైద్యం చేయించి మేఘమాలకి విడాకులు ఇచ్చేసాడు చక్రవర్తి. కూతురు కూడా తన వద్దకు రావద్దని చెప్పింది. బెంగుళూరులో ఫ్రెండ్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటోంది మేఘమాల. మా అత్తయ్యకి ఒంట్లో బాగుండడంలేదని చూడటానికి అమలాపురం వచ్చిందన్నమాట” బాధగా చెప్పాడు కిరణ్.


అతను చెప్పిన మాటలు వినగానే కృష్ణ మెదడు మొద్దుబారిపోయింది. ఇదేమిటి? మేఘమాల జీవితం ఇలా మారిపోయింది? అందుకేనేమో, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే, పొడి పొడిగా చెప్పింది. తన కష్టం చెప్పడానికి ఇష్టపడలేదన్న విషయం అతనికి అర్ధం అయ్యింది.


ఆ రాత్రి అంతా కృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు. సిద్ధాంతం లో కిరణ్ ఇంట్లో మేఘమాలతో కేరమ్స్ ఆడటం.. మేఘమాలతో ఉన్న తన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు కృష్ణ. ఆరోజు గోదావరి ఒడ్డున ఎంత ఆనందంగా గడిపింది? ఎంత హుషారుగా ఉంది? ఆమె అద్భుతంగా పాడితే తను ఎంత పొంగిపోయాడు?


ఆమె అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అని భావించాడు. కానీ ఇలా

జరిగిందేమిటి? సుఖ, సంతోషాలతో సాగవలసిన ఆమె జీవననౌక, ఇలా సుడిగుండాలలో

పయనిస్తోందేమిటి? తను ఎంతో అభిమానించే మేఘమాలకి తను ఏం చేయలేడా? ఎలా? ఆమె సమస్యకి పరిష్కారం ఏమిటి?


తెల్లవార్లూ ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణ. సమస్య పరిష్కారం సంగతి ఎలావున్నా, ఆమెకి ధైర్యం చెప్పాలి. నేనున్నానని భరోసా ఇవ్వాలి. అవును. అదే తన తక్షణ కర్తవ్యం, అన్న నిర్ణయానికి వచ్చాడు.


ఉదయమే లేచి అమలాపురం వెళ్ళాడు కృష్ణ. అతని రాకని చూసి ఆశ్చర్యపోయింది మేఘమాల.


“రా కృష్ణా, ఇంత పొద్దున్నే వచ్చావు ఏమిటి?” అడిగింది మేఘమాల. లోపలి గదిలోకి వెళ్లి వాళ్ళ అమ్మగారిని చూసి వచ్చి హాలులో కూర్చున్నాడు.

ఆమె కేసి చూసి "రాత్రి కిరణ్ తో మాట్లాడాను. నీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. నా దగ్గర ఎందుకు దాచావు ఇవన్నీ? నన్ను పరాయివాడిగానే చూస్తున్నావా?" అన్నాడు ఆవేదనగా.


అనుకోకుండా అతని కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. కర్చీఫ్ తో కళ్ళు తుడుచు కున్నాడు. మౌనంగా తలదించుకుంది మేఘమాల.


“నా బాధ నేనే పడాలిగానీ, ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను. అంతే, అంతకంటే ఏంలేదు” అంది తేలిగ్గా నవ్వుతూ.


కానీ ఆమె నవ్వులో జీవం లేదని గ్రహించాడు కృష్ణ. కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళింది. వెంటనే తన ఫ్రెండ్ శ్రీకాంత్ కి ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పాడు. మేఘమాల కాఫీ తేవడం చూసి ఫోన్ కట్ చేసాడు. కృష్ణకి ఒక కప్పు ఇచ్చి తను పాలు తాగుతూ "అవును.. నిన్న ప్రయాణంలో నీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేదు. మీ శ్రీమతి ఏం చేస్తారు? పిల్లలు ఎంతమంది?’ ఆసక్తిగా అడిగింది మేఘమాల.


“నాకు ఫ్యామిలీ లేదు. నేను సింగిల్” అన్నాడు కృష్ణ.

‘అంటే?’ అడిగింది విస్మయంగా.

“నేను పెళ్లి చేసుకోలేదు మేఘమాలా” అన్నాడు కాఫీ కప్పు టీ పాయ్ మీద పెట్టి.


అతని కేసి మరింత ఆశ్చర్యంగా చూసింది. అలా అతనికేసి చూస్తూండగా ఆమెకి సమాధానం దొరికింది. వెంటనే దీర్ఘంగా నిట్టూర్చింది. టాపిక్ మార్చాలని సిద్ధాంతంలోని ఫ్రెండ్స్ గురించి మాట్లాడింది. పొడి పొడిగా సమాధానం చెప్పాడు. అతని దృష్టి అంతా శ్రీకాంత్ కి అప్పచెప్పిన పనిమీదే ఉంది.


“మేఘమాలా, నీకు నేను ఉన్నాను. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధం. ఈ రోజుల్లో కేన్సర్ పెద్ద వ్యాధి కాదు. మంచి ట్రీట్మెంట్ తీసుకుందువుగాని. తగ్గిపోతుంది. నన్ను నమ్ము” అనునయంగా చెప్పాడు కృష్ణ. అతని మాటలకు మరోసారి దీర్ఘంగా నిట్టూర్చింది మేఘమాల.


“నా వ్యాధి చాలా ముదిరిపోయింది కృష్ణా. అయినా నాకు జీవించాలని అనిపించడం లేదు. కట్టుకున్న భర్తకి, కన్న కూతురికి నేను అక్కరలేదు. ఇంకెందుకు నా జీవితం?” ఆమె కళ్ళు జల జలా వర్షించాయి. అది చూసి కృష్ణ చలించిపోయాడు.


"కంట్రోల్. . మేఘమాలా. . కంట్రోల్. . అది గతించిన గతం. దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడి, నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. ఇప్పటినుంచి ఇది నీ జీవితం అనుకో. నీకు ఎలా ఆలోచిస్తే నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుందో, ఆ రకంగా ఆలోచించడం మొదలుపెట్టు" అన్నాడు శాంతంగా.


ఆమె చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది. రెండు నిముషాలు ఇద్దరి మధ్యా మౌనం చోటు చేసుకుంది.


“కృష్ణా, నేను ఇక్కడికి వచ్చింది రెండు పనులకోసం. ఒకటి అమ్మని చూడాలని. రెండోది మళ్ళీ సిద్ధాంతం గోదావరి చూడాలని. నా జీవన సంధ్యా సమయంలో ఈ రెండూ పూర్తి చేసుకోవాలని ఎంతో ఆశగా వచ్చాను” అంది మేఘమాల.


“అలాగే. రేపే నేను సిద్ధాంతం వెళ్లి ఆ ఏర్పాట్లు చూస్తాను. నువ్వు కూడా సాయంత్రానికి వచ్చేయ్” అని అన్నాడు కృష్ణ. 'అలాగే' అంది మేఘమాల. మర్నాడు సాయంత్రం సిద్ధాంతం, కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చింది మేఘమాల. కృష్ణ కూడా వాళ్ళ అమ్మమ్మగారింటికి వచ్చాడు. సాయంత్రం ఏడుగంటలకు శివాలయం దగ్గరకు వెళ్తామని చేప్పి ఇద్దరూ బయటకు వచ్చారు. శివాలయం ముందు భక్తులు గుంపులు గుంపులుగా ఉన్నారు.


ఆరోజు కార్తీకపౌర్ణమి.

గోదావరి రేవుదగ్గర ఉన్న రావిచెట్టు చపటా మీద కాసేపు కూర్చున్నారు ఇద్దరూ. తర్వాత కృష్ణ మెట్లు దిగి అంతక్రితమే మాట్లాడిన పడవవాడిని, పడవ తీసుకురమ్మనమని చెప్పాడు. అతను పడవ తీసుకురాగానే ఇద్దరూ పడవ ఎక్కారు.


పడవ నెమ్మదిగా వశిష్ట వంతెన కిందుగా వెళ్లి, దొంగరావిపాలెం రేవునుండి వెనక్కి తిరిగి వచ్చింది. గతంలో వచ్చినప్పుడు వశిష్ట గోదావరి మీద ఒక్క వంతెనే ఉండేది. ఇప్పుడు రెండో వంతెనకూడా కట్టారు. రావులపాలెం వైపు వెళ్ళే వాహనాలు పాత వంతెన మీంచి వెళ్తున్నాయి. రావులపాలెం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వైపు వచ్చే వాహనాలు కొత్త వంతెన మీంచి వస్తున్నాయి.


గోదావరి మీంచి చల్లని గాలి వీస్తోంది. పున్నమి చంద్రుడు వెన్నెల్ని వర్షిస్తూనే ఉన్నాడు. మేఘమాల ఆకాశం కేసి చూసింది. ముప్ఫై ఏళ్ళక్రితం ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు

చంద్రుడు. అదే వెన్నెల. అదే గోదావరి. అదే చల్లదనం. కానీ అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు. ఇద్దరి మనస్సులో అప్పుడున్న భావోద్వేగాలు ఇప్పుడు లేవు. జీవితంలో ఇద్దరూ ఎన్నో అనుభవాలు చవిచూశారు. కానీ ప్రకృతిని చూసి స్పందించే గుణం ఇద్దరిలో ఉంది. పడవ, సిద్ధాంతం రేవు అవతలి గట్టున ఆగింది.


కృష్ణ ముందుగా పడవ దిగి, మేఘమాల దిగడానికి సాయంచేసాడు. వెంటనే గతం గుర్తుకువచ్చి మేఘమాల పెదవులమీద చిరునవ్వు చోటుచేసుకుంది. ఇద్దరూ కొద్ది దూరం నడిచి ఇసుకలో కూర్చున్నారు.


భుజానఉన్న చిన్న సంచీలోంచి వాటర్ బాటిల్ తీసి ‘మంచినీళ్ళు తాగు’అని మేఘమాలకి ఇచ్చాడు కృష్ణ. కొద్దిగా నీళ్ళు తాగి బాటిల్ కృష్ణకి ఇచ్చింది ఆమె.


“కృష్ణా, మళ్ళీ మనం ముప్ఫై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. సినిమాల్లోకి మల్లె ఏదైనా టైం మెషిన్ దొరికితే బాగుంటుంది కదూ”చిన్నపిల్లలా అడిగింది మేఘమాల.

వెన్నెలలో మెరిసిపోతున్న ఆమె మొహంకేసి ఒక్క క్షణం చూసి ‘అవును మేఘమాలా. అలా జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది’ అన్నాడు మనస్ఫూర్తిగా.


పక్కనే ఉన్న ఇసుక తీసుకుని కుప్పలా పోసింది మేఘమాల. ఒకసారి ఆకాశం కేసి చూసింది. ప్రశాంతంగా ఉంది ఆకాశం. అక్కడక్కడ తెల్లని మబ్బులు నెమ్మదిగా కదిలిపోతున్నాయి. సిద్ధాంతం రేవుకేసి చూసింది. రేవులోని రావిచెట్టు ఆకులు వెన్నెల్లో తళ తళా మెరుస్తున్నాయి.


శివాలయం ముందు జ్వాలాతోరణం వెలిగించారు. ఎర్రని మంటలు కనిపిస్తున్నాయి. లేచి నిలబడి గుడివైపు తిరిగి దణ్ణం పెట్టుకుంది మేఘమాల. కృష్ణ కూడా లేచి దణ్ణం పెట్టుకున్నాడు. తిరిగి ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. మేఘమాల మనసుకి సాంత్వన చేకూరింది గోదావరిని,వెన్నెలనీ చూడగానే.


అకస్మాత్తుగా అడిగాడు కృష్ణ “మేఘమాలా, ఆరోజు నువ్వు ఇక్కడ పాడిన పాట మరలా ఒకసారి పాడవా?”అని. అతని మాటకి ఆమె మనసులో సంతోష వీచికలు కదలాడాయి. ఒక్క నిముషం చంద్రుడి కేసి చూసింది, తర్వాత కృష్ణ కేసి చూసింది. ఆ తర్వాత కళ్ళు మూసుకుంది.


గొంతు సవరించుకుని పాడటం మొదలుపెట్టింది.

“పాట పాడనా కృష్ణా, పలుకు తేనెలొలుకు నటుల

మాటలాడనా కృష్ణా, మనసు తీరగా . . . ఆ ఆ . .

మరలిపోయిన వసంతం మరల వచ్చెనని

వాడిపోయిన తీగ మరల చిగురించెనని . . . పాట పాడనా కృష్ణా

దిగులుతో కుములుతున్న రేవులోకి

ఆశలు నింపుకున్న పడవ వచ్చెనని . . . . . పాట పాడనా కృష్ణా


మేఘమాల పాట అలా మధురంగా గాలిలో తేలుతూ గోదావరి మీంచి వెళ్లి

రావిచెట్టుని పలకరించి మరలా తమ వద్దకు వచ్చినట్టుగా అనుభూతి చెందాడు కృష్ణ.


పాట పూర్తి కాగానే చప్పట్లు కొట్టి ‘బాగా పాడావు మేఘమాలా, ముప్ఫై ఏళ్ళు గడిచినా నీ గొంతులో ఆ మాధుర్యం అలాగే ఉంది’ అని అభినందించాడు కృష్ణ. అయితే అప్పుడు పాడిన పాటలోని సాహిత్యానికి, ఇప్పుడు పాడిన పాటలోని సాహిత్యానికి తేడా గమనించాడు కృష్ణ. మేఘమాలలో ఉన్న నిరాశ కొద్దిగా మారిందని గ్రహించి ఆనంద పడ్డాడు కృష్ణ.


సరిగ్గా అప్పుడే అమెరికా నుంచి శ్రీకాంత్ ఫోన్ వచ్చింది. ”కృష్ణా! డాక్టర్ సదాశివం గారి అప్పాయింట్మెంట్ దొరికింది. నువ్వు మేఘమాలని తీసుకుని ఇక్కడకు రావచ్చు. నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కూడా మీ ప్రయాణఏర్పాట్లు చేసుకోండి. మేఘమాలకి ధైర్యం చెప్పు. బై” అని ఫోన్ పెట్టేసాడు శ్రీకాంత్.


కృష్ణ ఆనందంగా మేఘమాల రెండు చేతులూ, తన చేతుల్లోకి తీసుకుని “గుడ్ న్యూస్ మేఘమాలా, నా ఫ్రెండ్ శ్రీకాంత్ అమెరికాలోని బెస్ట్ డాక్టర్ సదాశివం గారి అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు. ఒక వారం రోజుల్లో మనం అమెరికా వెళ్దాం. నిన్ను నేను బతికించుకుంటాను. . . బతికించుకుంటాను” అన్నాడు సంతోషంగా.


పున్నమి చందురుడిలా వెలిగిపోతున్న అతని మొహం కేసే అలాచూస్తూ ఉండి పోయింది రెండు క్షణాలు మేఘమాల. బలవంతంగా విడాకులు ఇచ్చి బయటకు గెంటేసాడు భర్త. తను లెక్చరర్ గా ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బుతో బయటపడింది.


కూతురు ఇంటికి వెళితే ‘నీ రోగం, మా అందరికీ అంటుకుంటుంది. అయినా నీకు చాకిరీ చేయడానికి నాకు కుదరదు’ అని మొహం మీదే తలుపు వేసేసింది. తన ఫ్రెండ్ శ్రావణి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కానీ తన అనారోగ్యం గురిచి తెలిసిన వెంటనే

రెక్కలు కట్టుకుని వాలిపోయాడు కృష్ణ.


నేనున్నానని ధైర్యం చెప్పాడు, జీవితంపై ఆశ కల్పించాడు. ఎంత గొప్ప మనసు? ఎంత గొప్ప మనిషి? ఆమె కళ్ళు అప్రయత్నంగా నీటి చెలమలయ్యాయి. తన చేతుల మీద పడిన మేఘమాల కన్నీళ్లు చూసి చలించి పోయాడు కృష్ణ. తన చేతులు తీసుకుని, ఆమె కన్నీళ్లు తుడిచాడు. అతని భుజంపై వాలి ఆమె దుఃఖ పడుతోంది. రెండు నిముషాలు గడిచేసరికి ఆమె భారం తగ్గింది.

“థేంక్ యూ సో మచ్ కృష్ణా” అంది మేఘమాల. ఆమె గొంతు భారంగా

పలికింది.


“ఇది నా బాధ్యత మేఘమాలా” అన్నాడు కృష్ణ. ఇద్దరూ లేచి పడవ దగ్గరకు

నడిచారు. అతని ఎడమ చేతిలో ఆమె కుడిచేయి ఉంది. ఇద్దరూ పడవ ఎక్కారు.

నిష్కల్మషమైన వారి స్నేహానికి, ప్రేమకి పున్నమి చందురుడు ఆశీస్సులు అందించగా, గోదావరి కూడా నిండుగా నవ్వింది.


***శుభం***


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.




80 views0 comments
bottom of page