top of page

గువ్వా.. నీ గూడెక్కడే ?

Guvva...Ne Gudekkade? Written By Kishore V Raghu

రచన : కిషోర్ V రఘు


శీతాకాలం..వచ్చేస్తున్నానంటూ సంకేతాలు పంపిస్తోంది. అందుకేనేమో తెల్లారగట్ట వీస్తున్న గాలులు కొంచెం చలిచలిగా వున్నాయ్ ! మామూలుగా వెలుగురేకలు విచ్చుకోకముందే నిద్రలేచే శంకరకుట్టీ సుబ్బరంగా స్నానంగీనం పూర్తిచేసుకుని అయ్యప్ప స్వామితోబాటు గోడ మీది స్టాండులో కొలువుదీరిన తతిమ్మా దేవుళ్ల పటాలకూ చిన్నచిన్న పూలమాలలు తగిలించి.. ఆనక దీపాలూ వెలిగించి.. మనసారా దండమెట్టేసుకుని.. టీ కాచను ఉపక్రమిస్తాడు. తాగితే శంకరకుట్టీ కేంటీన్లో కెట్టంచాయనే తాగాలి. అది భలేవుంటుంది. ఇంత చల్లటివేళ వేడివేడిగా ఓ గుక్కెడు టీ తాగితే బావుణ్ణు అనుకున్న రోగుల తాలూకువాళ్లూ.. బయట వున్న ఆటో డ్రైవర్లూ..అంబులెన్సులవాళ్లూ.. ఆ సర్వజన ఆస్పత్రి ఆవరణలోనే వున్న శంకరకుట్టీ కేంటీను వైపుకి దారి తీస్తుంటారు. స్టవ్ మీది గిన్నెలో టీ కళపెళా తెర్లంగానే బాగా కడిగిన గాజు గ్లాసులోకి వొంపి.. వేళ్లకు వేడి తగలకుండా ఆ టీ గ్లాసుని మరో ఖాళీ గ్లాసులోకి దింపి.. మణికంఠ అనే తనకు అసిస్టెంటూ.. కేరళలోని తమ వూరివాడే అయిన కుర్రాడి చేతికిచ్చి కొంచెం దూరంలోనే చెట్టు కింది చప్టాపై పడుకునో.. కూచునో వుండే ముత్తశ్శికి పంపిస్తాడు. అంతకు ముందు టీ గ్లాసుని పటాల్లోని దేవుళ్లకు నైవేద్యం అన్నట్టు చూపిస్తాడనుకోండి. కానీ.. తొలి గ్లాసు టీ మొట్టమొదట ఆ అవ్వకే. అదీ ఫ్రీగా. దాంతోబాటూ ఓ సింగిల్ బన్ను కూడా. దాదాపూ డెబ్భై ఏళ్ల ఆ అవ్వ ఎవరో శంకరకుట్టీకీ తెలీదు. ఓ పదీపదిహేను రోజుల క్రితం చూశాడామెని ఆ చప్టాని ఆశ్రయించుకుని వుండడం. బిచ్చగత్తెలా లేదు. వైద్యం కోసం వచ్చినట్టూ లేదు. అందుకే అయితే.. ఆమె తాలూకు వాళ్లు వుండాలి కదా. అందుకే అయితే.. డాక్టర్లకి చూపించుకుని వెళ్లిపోవాలి కదా. ఇన్నిరోజులుగా ఒంటరిగా ఆ చెట్టు కింద ఎందుకున్నట్టూ ? కొంచెం మాసినట్టున్నా ఆ చీర కట్టూ.. పక్కనే ఓ మోస్తరు సైజు రెక్సిను సంచీ.. చూస్తే బతికిచెడ్డదాన్లా వుంది. ఆమె గురించి ఏం తెలియకపోయినా.. ఎందుకో ఆమెను చూస్తే వూళ్లో తమ్ముడి దగ్గరే వున్న అమ్మను చూసినట్టే అనిపిస్తుంది. పొట్ట చేత పట్టుకుని ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడికి చేరుకున్న శంకరకుట్టికి తెలుగు బాగానే వంటబట్టింది. ఓనం పండుగ రోజులప్పుడో.. వృద్ధురాలైన అమ్మకి వొంట్లో బావోలేదని కబురొచ్చినపుడో.. కూడబెట్టినదాంట్లో కొంతైనా అమ్మ చేతిలో పెట్టేందుకు వెళ్లినపుడో.. కేంటీనును భార్యకూ..మణికంఠకూ అప్పగించి వెళ్లి చూసొస్తుంటాడు. అమ్మదీ.. ఈమెదీ ఒకే వయసుండొచ్చు దాదాపూ. అమ్మనెలాగూ తను చూసుకోవడం లేదు. కనీసం ఇక్కడి ముసలమ్మకు పొద్దుటే బోణీ కూడా పట్టించుకోకుండా టీతో బాటూ బన్నూ పంపిస్తుంటాడు. మధ్యాహ్నం పూట ఇంత పప్పన్నమో పెరుగన్నమో కూడా. అందులోనే తన కన్నతల్లికి కాస్తంత పెట్టినంత తృప్తి శంకరకుట్టీకి. ఈ పదీపదిహేను రోజుల్లో పగటిపూట ఏదో ఓ సమయంలో ఒక ఆటో డ్రైవరు ఆ ముసలమ్మ దగ్గరికి రావడం రెండు అరటిపండ్లో..కొన్ని సపోటాలో ఆమెకిచ్చి వెళ్లిపోవడం శంకరకుట్టీ గమనించకపోలేదు. కొడుకేమో ! కొడుకైతే ఆమె అతడింట్లో కదా వుండాలి ! ఇన్ని రోజులిక్కడ ఒంటరిగా ఎందుకు వొదిలిపెట్టినట్టు ? పైగా అంత ముసలివయసు మనిషిని ! చలికాలం కూడా రాబోతోంది ! అర్థం కాక.. ఓ సాయంత్రం ఆ ఆటోవాలా వచ్చినపుడు వెళ్లి నిలదీస్తే.. భలేవాడివన్నా.. నాకేం తెలుసు ఈ అవ్వ ఎవరో.. కానీ నెల నుంచీ చూస్తున్నానీ అవ్వను ఆస్పత్రికి ప్యాసింజర్లను తెచ్చినపుడల్లా. ఇంతకుముందు ఓపీ దగ్గరున్న చెట్టుకింద వుండేది. పాపం అనాథేమో అని పండ్లో.. బిస్కెట్లో ఇచ్చేవాణ్ణి వచ్చినపుడల్లా.. కొన్ని రోజులు కనిపించకుండాపోయింది. ఆ మధ్యనే ఇక్కడ కనిపించింది అన్నాడతడు. ఆటో డ్రైవరుకు సంబంధం లేదని తెలియడంతో ఆవిడ అనాథే అనుకుని మరింత జాలేసింది శంకరకుట్టీకి. ఆ అవ్వ అసలెందుకక్కడ వున్నట్టు.. అర్థం కాలేదతడికి. *** ఆర్నెల్లు దాటి పది రోజులవుతోంది. ఇంతవరకూ అయిపు లేడు మీ తమ్ముడు. కొంచెం కనుక్కోకూడదూ.. ఎప్పుడొచ్చి పిలుచుకెళ్తాడో. ఈ చాదస్తపు మేళంతో వేగలేక ఛస్తున్నా.. ఏడాదిలో ఆర్నెల్లయినా కాసింత మనశ్శాంతిగా బతకనివ్వరు కాబోలు. రెండ్రోజులుగా సణుగుతూనేవుంది నాగరాజు పెళ్లాం. వస్తాళ్లేవే. వాడికక్కడ ఏం పనులున్నాయో ఏమో.. కొంచెం ఓపిక పట్టు. ఆర్నెల్లవ్వంగానే అదే సణుగుడు ఆమె నుంచి.. అదే బుజ్జగింపు అతడి నుంచీ. మరో ఆర్నెల్ల తర్వాత ఇదే దృశ్యం.. సణుగుడు టవున్లో తమ్ముడు నారాయణ ఇంట్లోనూ. ఆ ఛాదస్తపు మనిషి ఎవరో కాదు.. ఆ నాగరాజు, నారాయణల కన్నతల్లే. పేరు.. ఆదిలక్ష్మమ్మ. వాస్తవానికి ఆమె ఆ యిద్దరు కోడళ్ల పాలిట ఆదిలక్ష్మివంటి అత్తగారే. పూర్వకాలం మనిషి కావడం మూలాన పనులు సక్రమంగా చేసినట్లు అనిపించకపోతే బయటికి గట్టిగా అనలేక లోపల దాచుకోలేక మంద్రస్థాయిలోనే ఇట్లా చేస్తున్నారే.. అట్లా చేస్తున్నారే.. అంటుంటుంది. అది వాళ్ల ప్రాణాలకి గొణుగుడు కిందే లెక్క. ఆమె ఉనికే చిరాకు మరోపక్క. అటు తల్లిని మందలించలేకా.. ఇటు భార్యల్నీ బుజ్జగించ లేకా.. కొడుకులిద్దరూ చెరో ఆర్నెల్లపాటు నలిగిపోతుంటారు. వాళ్లకూ ఆమెతో ఓ సమస్య లేకపోలేదు. వృద్ధాప్యంవల్ల కలిగే అనారోగ్యానికి మందులు కొనడమే ఆ సమస్య. అదేం పెద్దది కాకపోయినా ఒక్కోసారి ఇంట్లో నెలకొన్న వాతావరణాన్నిబట్టి భూతద్దంలోలా కనిపిస్తుంటుంది. లేదంటే ఒక్కోసారి నిజంగానే మందులపై వ్యయం కొంచెం ఎక్కువే అవుతోంటుంది. ఆమెను అప్పుడప్పుడూ రెండో కొడుకున్న టవున్లోని ప్రైవేటు డాక్టర్లకు చూపించాల్సివస్తోంటుంది. ఇక ఆదిలక్ష్మమ్మ వైపు నుంచి చెప్పాలంటే.. భర్త చనిపోయిన కొంతకాలానికి ఆస్తిని ఇద్దరు కొడుకులకూ సమంగా పంచి ఇచ్చేసింది. అటు తర్వాత కొడుకులిద్దరూ అమ్మను పంచేసుకున్నారు.. ఆర్నెల్లపాటు ఒకరి దగ్గరా.. ఆర్నెల్లపాటు మరొకరి దగ్గరా అని. ఆస్తి పంపకాలైపోయిన తర్వాత పెద్దకొడుకు పల్లెలోనే వుండిపోయినా రెండోవాడు పొరుగునేవున్న చిన్నపాటి టవునుకు చేరుకున్నాడు. మొదట్లో అంతా బాగానే వున్నట్టు కనిపించినా రాన్రానూ ఆమెకు వృద్ధాప్యంతోబాటూ అప్పడప్పుడూ ముసలితనంలో కలిగే నలతవల్ల దగ్గూ.. ఆయాసం తదితర సమస్యలు మొదలయ్యాయి. అదే భరించరానిదైపోయింది కొడుకులకీ.. కోడళ్లకీ. మనవళ్లనూ.. మనవరాళ్లను కూడా తన దగ్గరికి వెళ్లకుండా కట్టడి చేయడంతో ఎదురుగా అందరూ వున్నా ఏదో వెలితీ.. ఒంటరితనం మరింత కృంగదీశాయి ఆదిలక్ష్మమ్మను. ఆమె తనలోతాను మాట్లాడుకోవడం కూడా ఎక్కువైంది. చివరికి పరిస్థితి ఎందాకా వెళ్లిందంటే.. ముసల్ది పోతే బావుణ్ణు అన్నంత దూరం కాకపోయినా.. ఆమె లేకుంటే బావుణ్ణు అనుకునేంత వరకూ. రావలసిన రెండో కొడుకు రానే వచ్చాడు. మరి.. అమ్మను తీసుకెళ్తాడా ? వచ్చినవాడు నాల్రోజులు వుండిపోయాడు అన్న దగ్గరే. అన్నదమ్ములిద్దరి మధ్యా ఎడతెగని చర్చలు.. ఎన్నో తర్జనభర్జనల తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారిద్దరూ. వాళ్ల నిర్ణయంలో పెళ్లాల ప్రమేయం లేదన్నా.. ప్రభావం కొంత లేకపోలేదు ఎంత కాదన్నా. ఆ నాలుగు రోజులూ అమ్మతో అంతకుముందెప్పుడోలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె అనారోగ్యం గురించి చింత కూడా వ్యక్తం చేశారు. ఇక్కడి డాక్టర్లూ.. వాళ్లిచ్చే మందులూ లాభం లేదన్నారు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లి అక్కడి పెద్దడాక్టర్లకి చూపిస్తే మేలన్నారు. వారంలోపే ఆమెను బయల్దేరదీశారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి. అక్కడ ఒకరిద్దరు డాక్టర్లకీ చూపించారు. ఏం లేదు పోండయ్యా.. ముసలితనంలో వచ్చే మామూలు సమస్యలే ఇవి. ఏమయ్యిందావిడకీ !. బీపీ లేదు.. షుగరూ లేదు.. అడిగినవి చేసిపెట్టండి.. తీసికెళ్లండిక అన్నారు. బయటికొచ్చాక ఓ చెట్టు కింద ఆమెను కూచోబెట్టి మేం వెళ్లి కాఫీ తాగొస్తాం అని వెళ్లారిద్దరూ. గంటయ్యింది.. రెండు గంటలయ్యింది. చూస్తుండగానే సాయంత్రమూ కావొస్తోంది. వెళ్లిన ఆ కొడుకులు ఎంతకీ రారేం ? వాళ్లకేమయ్యిందోనన్న దిగులు తప్ప ఆకలిదప్పులు తెలియడం లేదు ఆదిలక్ష్మమ్మకు. మరుసటిరోజు ఉదయం కూడా అయ్యింది. రాత్రంతా నిద్దర పట్టనేలేదు. ఎక్కడని వెతకాలి కొడుకుల్ని ? పోనీ.. వూరికి వెళ్దామంటే వాళ్లనొదిలేసి ఎలా వెళ్లడం ? వూరికి తీసికెళ్లే బస్సు ఎక్కడుంటుందో తెలిస్తే కదా. ఉదయం కాస్తా మధ్యాహ్నం అయ్యే వేళకు ఆకలి మొదలయ్యింది. సరిగ్గా.. అప్పుడొచ్చాడు ఆపద్భాంధవుడిలా ఆటో సూరీ. ఎవర్నో దింపెళుతూ.. ఎవరైనా వస్తారేమో కాసేపు చూసి వెళ్దామని ఆమె కూచున్న చప్టా మీదే కూచున్నాడు. అప్పుడు చూశాడు ఆమెను. ఏమనిపించిందో ఆటోలో పెట్టుకున్న అరటిపళ్లలోంచి రెండు తెంపి ఆమె చేతిలో పెట్టి మాట కలిపాడు. విషయం కొంతే చెప్పిందామె. పెద్దాసుపత్రిలాంటి చోట్ల దొంగలూ.. మోసగాళ్లూ వుంటారు జాగ్రత్తమ్మా అని కొడుకులు చెప్పనేచెప్పారు కనుక. నువ్వెళ్లయ్యా.. నా కొడుకులొస్తారు భరోసాగా అనడంతో ఆటోసూరీ వెళ్లిపోయాడు. ఆ రోజూ దాటింది.. మరికొన్ని రోజులూ దాటాయి. ఆమెకు అర్థం అయ్యిందో లేదో కానీ అప్పుడపుడూ వచ్చే సూరీకి అర్థమయ్యింది ఆమె భారాన్ని కొడుకులు వదిలించుకున్నారని. వచ్చినపుడల్లా పండోఫలమో చేతిలో పెడుతూనేవున్నాడు. రోగుల తాలూకు వాళ్లెవరైనా మిగిలింది ఇంత పెడితే తినడం.. చప్టా మీద పడుకోవడం ఆమె దినచర్య అయ్యింది. రాత్రింబవళ్లు ఓపీ దగ్గర వుండడం చూసిన సిబ్బంది ఎవరో అక్కడి నుంచీ వెళ్లిపొమ్మంటే.. ఇదో శంకరకుట్టీ కేంటీను దగ్గరి చప్టాను ఆశ్రయించింది. కానీ.. కొడుకులొస్తారన్న ఆశ చావలే ఆమెలో. రోజులు గడచిపోతూనే వున్నాయి. శంకరకుట్టీ ఆమెకు వెళకింత పెడుతూనేవున్నాడు. స్థలం మారిన విషయం తెలిసి సూరీ మళ్లీ వస్తూనే వున్నాడు.. ఏదో ఒకటి ఇస్తూనేవున్నాడు. ఉన్నట్టుండీ ఓ రోజు తెల్లవారుఝామున ఆ చప్టా మీద ముసలామె కనిపించలేదు శంకరకుట్టీకి. తనలోనూ ఏదో పాశం తాలూకు బాధ అతడిలో. కొన్ని రోజుల తర్వాత.. కెట్టంచాయ తాగుదామని సూరీ కేంటీను దగ్గరికెళితే శంకర కుట్టీ అడిగాడు సూరీని ఆ అవ్వ ఏమైందని ? సూరీ అన్నాడు కదా.. "నాకు అమ్మ లేదు శంకరన్నా.. నా పిల్లలకీ ఓ అవ్వ కావాలి మంచికథలు చెప్పడానికి. అందుకే ఇక్కడి అవ్వను నేను మా ఇంటికి తీసుకెళ్లిపోయా." శంకరకుట్టీ నోట మాట పెగల్లేదు. కళ్లలో నీళ్లూరుతుండగా గబగబా లోనికెళ్లి.. ఓ వెయ్యి రూపాయలు తెచ్చి సూరీ చేతిలోపెట్టాడు. ఆ తర్వాత ఓ మాటన్నాడు.. 'తమ్ముడూ.. అమ్మకు ఓ నాలుగు చీరలు కొనివ్వు." శుభం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత పరిచయం :

చిత్రకారుడు.. జర్నలిస్టు.. కథా.. గేయ రచయిత..


289 views0 comments

Comments


bottom of page