'Halika Brahma - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 22/07/2024
'హాలిక బ్రహ్మ' తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
"అమ్మా అమ్మా నేల తల్లి..
అన్నం పెట్టే అమ్మ తల్లి..
వందనమమ్మ వందనం...
శతకోటి ప్రణవాకృతుల ప్రా ణాభివందనం...
మట్టి వాసనల మకరందం...
ఊపిరికి ఊపిరులూదే బ్రహ్మ ప్రసాద అమృత బాండాగారం.. పచ్చని పంట పొలాల సోయగం..
ప్రకృతి మాతకు వన్నె చిన్నెల చీరల వయ్యారం..
పసిడి కంకుల ధాన్య స్వరూపం..
విశ్వ మానవుని ఆకలి తీర్చే అన్నపూర్ణ మహా తేజం"
ఇలా నా రెండెకరాల నేల తల్లిని పలు రీతుల్లో స్తుతిస్తూ పదివందల పేజీల కవిత్వం వ్రాసుకున్నాను.
నా కవిత్వం చూసిన ఒక తెలుగు భాషాభిమాని, జిలుగు వెలుగుల జానపద తెనుగు కవిత్వం వ్రాసే కవి పుంగవుడు, "మీ కవితలన్నిటినీ కలిపి ఒక పుస్తకం గా తీసుకురండి. అందుకుగాను ఒక లక్ష రూపాయలు పుచ్చుకున్నారంటే సరిపోతుంది. మనీ లేక పోతే మీ రెండెకరాల నేలలో ఒక ఎకరం అమ్మేయండి. లేదార పొలాన్ని తాకట్టు పెట్టండి.." అని అన్నాడు.
"లక్ష రూపాయలు పెట్టి పుస్తకాలు ముద్రించి వాటిని ఏం చేయా”{లని నేను అడిగాను.
"మీ అదృష్టం బాగుండి పుస్తకాలన్నీ అమ్ముడు పోతే మంచి లాభాలు వస్తాయి. లేదంటే మీ పుస్తకాలన్నిటినీ అందరికీ ఉచితంగా పంచిపెడితే మంచి పేరు వస్తుంది. అదీ కాకుంటే చిత్తు కాగితాల వానికి మీ పుస్తకాలు అమ్మితే కొంత పైకం వస్తుంది" అని అన్నాడు.
కవి పుంగవుని మనసు నాకు అర్థం అయింది. లక్ష రూపాయలు నేను అతని చేతిలో పెడితే, ఆపై తన సగం కమీషన్ తను తీసుకుని నా కవిత్వాన్ని పుస్తక రూపంలో నాకు అందిస్తాడు. ఆపై పుస్తకాలను నేను ఏం చేస్తాననేది అతనికి అనవసరం.
నమ్ముకున్న నేలతల్లిని అమ్ముకుని అమ్మ భారతి తనకు ఖర్చు పెట్టమని ఎక్కడా చెప్పలేదు అని నాకు అనిపించింది. వెంటనే నా కవిత్వాన్ని అటకకు ఎక్కించేసాను.
నేలతల్లిని నమ్ముకున్నాను. రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను. నన్ను నమ్మి నా ధర్మపత్ని అయిన నా యిల్లాలి మనసు తెలుసుకున్నాను. ప్రతి ఉగాది కి పది మంది కవితా ప్రియులకు కడుపునిండా అన్నం పెడుతున్నాను. వారి కవిత్వాన్ని వింటున్నాను. నా కవిత్వాన్ని వినిపిస్తున్నాను.
ఒక సంవత్సరం ఉగాది కి,
"మట్టి తల్లి ని నమ్మి, రెక్కల కష్టం ధారపోసిన రైతన్న...
హలం పట్టి.. కలం పట్టి సహజకవి పోతన వ్రాసాడు
మహా భాగవతం...
నేలతల్లి అణువణువున చూసాడు భక్తి సుధామృతం...
భక్తి సుధామృతం...
హలం పట్టిన రైతన్న..
పొలం దున్నగ పద పదరన్న..
పొలం దున్నగ పద పదరన్న...
మట్టికి పదును పెట్టన్న..
కలుపును తరిమి కొట్టన్న..
పొలం గట్టున నిలువన్న..
కవన హృదయం తెరువన్న...
కవనమంటే కాలక్షేపం కాదనే సత్యం తెలుపన్న....
కష్టజీవి స్వేదమందు పుట్టిన కవనమే నవలోకం అనే నీతిని చాటన్న....
అదే అదే మానవ లోకం మా నవ లోకం..
నిర్మల హృదయ భక్తి సంద్రం అని తెలుపన్న.... "
అంటూ నేను కవిత్వం వ్రాసాను. అది చాలా మందికి నచ్చింది.
నా రెండెకరాల పొలాన్ని పదెకరాల పొలం చేద్దామనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. కథల్లో సాధ్యమవుతుందేమో కానీ నిజాయితీ గా బతికేవానికి నిజ జీవితంలో సాధ్యం కాదు.
ఆ రెండెకరాలను నమ్ముకునే ఇద్దరబ్బాయి లను, ఒకమ్మాయిని పెంచి పెద్ద చేసాను. వారందని ఒకింటివారిని చేసాను.
నా పెద్ద కొడుకు మోహన్. బాగానే చదువు కున్నాడు. ఇంటర్ దగ్గర నుండి తన కాళ్ళ మీద తానే నిలబడి పై చదువులు చదువుకున్నాడు. అత్యవసర మనుకుంటే తప్ప నన్ను మనీ అడిగేవాడుకాదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. కొంత కూడా పెట్టుకున్న తర్వాత మేఘనని పెళ్ళి చేసుకున్నాడు. మోహన్ ‘అందరూ స్వేచ్ఛగా ఆలోచించాలి. స్వేచ్ఛగా బతకాలి. దేవుడు లేడు. దెయ్యం లేదు. భయం వద్దు. భక్తి వద్దు’ అంటాడు.
అతని భార్య మేఘన కూడా భర్త లాగానే ఆలోచిస్తుంది. తన కాళ్ళ మీద తాను నిలబడతానని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి, లేడీ ఫేస్ మసాజ్ సెంటర్ ని ఒకటి పెట్టుకుంది. ఇద్దరూ పట్టణం లో స్థిరపడ్డారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి పప్పీ డింగ్ అని ఏదో కుక్క పేరు పెట్టారు.
ఇక రెండవ కొడుకు మురళీధర్. రాజకీయాలంటూ ఊర్లు పట్టుకు తిరిగేవాడు. ఒకసారి రెండెకరాల పొలం అమ్మి మనీ యిస్తే యం. యల్. ఏ. అయ్యి కోట్లు కూడా పెడతానన్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. అలిగి యింటిని వదిలాడు. పట్టణంలో రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాడు. పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నన్ను నా భార్య ను పెళ్ళికి మాత్రం పిలిచాడు. అన్న మోహన్ సహాయం తో రాజకీయాలలో తిరుగుతున్నాడు. వారికి సంతానం లేదు.
మూడవ సంతానం కూతురు సుమతి. ఆమెను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉర్వీపతికి ఇచ్చి పెళ్ళి చేసా ను. సుమతి కూడా ఏదో ఒక ప్రభుత్వేతర పాఠశాల లో పని చేస్తుంది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాడి కి జయరాం అని పేరు పెట్టారు.
మోహన్, మేఘనలు ఒకే యింటిలో ఉన్నప్పటికీ ఎవరి రూం లో వారుంటారు. పప్పీ డింగ్ ను సెంట్రల్ ఏ. సీ. ఉన్న హాస్టల్ లో పడేసారు. ఇద్దరూ స్వేచ్ఛగా మరొకరితో రాసలీలలు సాగిస్తున్నారు. ఎవరిష్టం వారిది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఒకసారి ఇద్దరినీ నిలేసాను. మా యిష్టం మాది అన్నారు. చివరికి, వంశం.. అంటూ ప్రాధేయపడ్డాను.
వంశమా వంకాయా అన్నారు. కొడుకు ఆలనా పాలనా అన్నాను.
వాడు బతకడానికి వాడి పేర ఫిక్సిడ్ డిపాజిట్ చేసామన్నారు. ఆ పప్పీ డింగ్ గాడు కూడా స్కూల్ లో ఇద్దరు గరల్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేస్తున్నాడు.
అన్న సంసారాన్ని సరిచేయరా అని మురళీధర్ ని అడిగాను. మురళీధర్ ‘వారికేం సూపర్ గా ఉన్నారు’ అన్నాడు.
వాడి భార్య పల్లవికి చెప్పాను. "మామయ్య మమ్మల్ని అందరినీ మరిచిపోయి మీరు హాయిగా పల్లెటూరి లో బతకండి. మీరు నేలతల్లిని నమ్ముకున్నారు. కలిసివచ్చే కాలాన్ని నమ్ముకున్నారు. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా దేవుని నమ్ముకున్నారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మీవారు మాయని నమ్ముకున్నా రు. ఎవరి యిష్టం వచ్చినట్లు వారు సంచరించాలనే ధర్మాన్ని నమ్ముకున్నారు. ఇక కాలం కలిసి రానప్పుడు ఎలా ఉంటారో చూడాలి. మీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. మీ చిన్నబ్బాయి మంచివాడేం కాదు. రాజకీయం ముసుగులో చేయరాని పనులెన్నో చేస్తున్నాడు " అని అంది.
సుమతి సంసారం గురించి చెప్పాలంటే వారిది మరో లోకం. అల్లుడు ఉర్వీపతి ‘దున్నకుండా విత్తితే కొయ్యకుండా పనైపోతుంది కదా మామగారు’ అంటూ తనేదో సైంటిస్ట్ అయినట్లు సలహాలు ఇస్తాడు.
ఎవరి లోకం వారిది. ఇక నా యింటి దాని విషయానికి వస్తే పిల్లలకు ఏదేదో చేసి పెట్టేయాలని అరిసెలు, సున్నుండలు, లడ్డూలు, కారప్పూస వంటివి కష్టపడి తన చేతితో చేసుకుని పిల్లలింటికి తీసుకువెళుతుంది. వారు వాటిని ఎక్కువ గా పని మనుషులకు, కుక్కలకే పంచుతారు.
పప్పీ డింగ్ గాడైతే “ఫాదర్మా! నువ్వు చేసి తెచ్చిన స్వీట్స్ మా యింటి డాగ్ కూడ తినడం లే”దంటాడు.
ఉర్వీపతి అయితే “కాలం మారింది అత్తగారు.. మీరు చేసి తెచ్చిన స్వీట్స్ ఈ కాలం పిల్లలకు పెట్టకూడదు. పొరపాటున వాటిని పిల్లులు తిన్నా అవికూడా చస్తాయి” అంటాడు.
ఒక పల్లవి తప్ప నా యింటిదాని వంటలను మెచ్చుకునే వారు అక్కడ ఎవరూ లేరు.
పల్లవి బాగా పాడుతుంది. అందరితో మర్యాదగా ఉంటుంది.
"రామా.. రామా.. శ్రీరామ.. రఘుకుల నందన.. శ్రీరామ.. దశరథ నందన పట్టాభిరామ.. యుగమేదైన జగమేదైన.. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నీ నామం జపిస్తే భవభయతాపం తొలగు.. దురితం దుర్మార్గం దూరమవ్వు.. అమ్మా.. నాన్న.. అన్నా.. వదిన.. అక్కా చెల్లెలు.. తమ్ముడు తాత మిత్రుడు.. జగతి జనులు అనే సద్బావన హెచ్చు. "
అని పల్లవి పాడే పాటంటే నాకు మహా యిష్టం.
ఆవూరికి ఈవూరు ఎంత దూరమో ఈవూరికి ఆవూరూ అంత దూరమే ఉంటుందండి అని పల్లవి చెప్పిన మాటలతో నాలో అతిగా అల్లుకున్న ప్రేమాభిమానాలు తగ్గుముఖం పట్టాయి.
నోటితో ఉచ్ఛరించడానికే భయం వేసే రకరకాల అనారోగ్యాలతో మోహన్ చనిపోయాడు. అప్పుడు మేఘన, పప్పీ డింగ్ ‘కాలం చెల్లింది, పోయాడు. ఆయన పోతే మాకేం ఇబ్బంది లేదు. హాయిగా బతికేస్తాం’ అని మాతో అన్నారు. పైకి మాత్రం ‘ఏమండీ మీరే నా ప్రాణం’ అని మేఘన, ‘డాడీ డాడీ ఐ లవ్ యూ డాడీ’ అని పప్పీ డింగ్ బాగా రాగయుక్తంగా ఏడ్చేసారు.
మురళీధర్ కట్టించిన స్కూల్ బంగ్లా కింద పడి నాలుగువందల మంది విద్యార్థినీ విద్యార్థులు చనిపోయారు. ఆ విద్యార్థినీ విద్యార్థులలో పట్టణం వెళ్ళి కూరగాయల బండి పెట్టిన నా స్నేహితుడు రామయ్య మనవరాలు గాయత్రి కూడా ఉంది. అప్పుడు పల్లవి చట్టానికి అనుకూలంగా సాక్ష్యం చెప్పింది. మురళీధర్ ని ప్రభుత్వం వారు అరెస్టు చేసారు.
తను నెల తప్పింది అని పల్లవికి అప్పుడే తెలిసింది. పది రోజుల్లో మురళీధర్ జైలునుండి బయటకు వచ్చేసాడు. పల్లవిని బయటకు నెట్టేసాడు. వదినె మేఘనను, పప్పీ డింగ్ ను తెచ్చి యింట్లో పెట్టుకున్నాడు.
పల్లవి ని నేను తీసుకువచ్చాను. పల్లవి పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబును చూడటానికి ఎవరూ రాలేదు. సుమతి మాత్రం వచ్చింది.
మురళీధర్ కాల్పులకు గురయ్యాడు. మురళీధర్ ని చంపింది కొందరు నక్సలైట్లు అన్నారు.
మురళీధర్ తో సహజీవనం చేసిన మేఘన మురళీధర్ పదవికోసం ట్రై చేస్తుంది. అంతకాలం తన అన్నల కుటుంబాలకు జై అన్న సుమతి కుటుంబం జరిగిన సంఘటనలను చూసి భయపడిపోయింది. పుట్టింటి ముఖం చూడటం మొదలు పెట్టింది. ఉర్వీపతి ఆలోచనల లో కూడా మార్పు వచ్చింది.
ఎలాంటి అనారోగ్యం లేకుండానే నా యింటిది కాలం చేసింది. తల్లి అంతిమ యాత్ర కు సుమతి కుటుంబం వచ్చింది.
‘మంచిగా వీడియో తీసి పంపండి. లైక్ ల కోసం ట్రై చేస్తాను’ అని మేఘన అంది.
ఒకనాడు రామయ్య తన కొడుకు మరో ఆడబిడ్డ అవనిని తీసుకుని యింటికి వచ్చాడు. "నా కోడలు అనారోగ్యం తో చనిపోయింది. నేను ఏ పని చేయలేక పోతున్నాను. పట్టణంలో ఏదో పాముకుందామని వెళ్ళి అనారోగ్యాన్ని పాముకున్నాను. నేలతల్లిని నమ్ముకున్న నీవు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్న రెండు ఎకరాలతో హాయిగా జీవిస్తున్నావు. హాలిక బ్రహ్మవు అయ్యావు.
నీ మురళీధర్ ని నక్సలైట్లు చంపలేదు. మా వాడే చంపి ఎక్కడికో పారిపోయాడు. వాడికి వాడి కూతురు అంటే మహా ప్రాణం. నీ మురళీధర్ వలన బలైన నాలుగు వందల విద్యార్థినీ విద్యార్థులలో మా వాడి కూతురు కూడా ఉంది. అందుకే మీ వాడి మీద పగబట్టాడు. అనుకున్న ది సాధించి అంతర్థానం అయ్యాడు.
వాడు చేసింది తప్పు కాదు అని నేను అనను. కానీ వాడు తప్పుకాదు అన్నాడు. మురళీధర్ లాంటి వాడు ఒక్కడు పోతే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నాడు. చివరికి వాడు చెప్పిన గొప్ప విషయం ఏమిటంటే మన కుటుంబం రోడ్డున పడితే నిన్నే కలవమన్నాడు. అలా ఎందుకన్నా డో నాకైతే తెల్వదు" అని చెప్పాడు.
పల్లవి అవనిని దగ్గరకు తీసుకుంది. మాకున్న దాంట్లో నాలుగు ముద్దలు నీకూ పెడతాం. ఇక్కడే పడి ఉండు అని రామయ్యతో అన్నాను.
నా నేలతల్లిని పైరుపచ్చలతో కళకళలాడించడానికి నాకు పల్లవి రామయ్య లు తోడుగా నిలిచారు.
"ఆకు పచ్చని చేలు ఓయమ్మో..
కళకళల నేలతల్లి మాయమ్మో..
పురి నిండా ధాన్యాలు ఓయమ్మో..
దంచాలి దంచాలి ధాన్యాలు
నడుము వంచి దంచాలి ధాన్యాలు..
కడుపు నింపు నేలతల్లి..
మంచి పెంచు మా రామయ్య తండ్రి..
రామ రామ శ్రీరామ రామ రామ"
అంటూ పల్లవి పాడే పాటలు వింటుంటే నా ఆయుష్షు అలా అలా పెరిగి పోతుంది.
అన్నట్లు చెప్పడం మరిచాను. పప్పీ డింగ్ గాడు అమ్మ కడుపులో కత్తి దింపలేదు. ఆమే దింపుకునేటట్లు చేసి గద్దెను ఎక్కాడు. ఆ గద్దె పేరేమిటో నాకు తెల్వదు కానీ కొందరు మేయర్ గద్దె అంటారు. మరికొందరు యమ్. ఎల్. ఏ. గద్దె అంటారు. ఏదేమైన... వాడబ్బ.. వాడబ్బే నా కంటే ముందు పోయాడు. ఎందుకండీ నిండూ నూరేళ్ళు బతకడం చేతకాని సంపాదన?
ఆశలు.. కుతంత్ర ఆవేశ ఉపన్యాసాలు.. తలరాతలు రాసేది పై వాడైన పట్టుమని పాతిక సంవత్సరాలు బతకక పోయిన నూరు సంవత్సరాలు బతికినంత బతుకును బతికాం అని మనసుకు అనిపించేటట్లు బతకాలి. అంటే.. అంత తృప్తి తో బతకాలి. అంత తృప్తి మనిషికి రావాలంటే వృత్తినే దైవంగా భావించాలి. దేవుడిచ్చిందే ఆరోగ్య కరమైన పాయసాన్నంగా స్వీకరించాలి.
పదుగురిలో ఉండాలి. ఉన్నంతలో నలుగురికి నాలుగు ముద్దలు పెట్టాలి. పల్లవి చెప్పినట్లు పిల్లల్ని కని వారిని సక్రమంగా పెంచడమే మన బాధ్యత. ఆపై అడిగితే సలహా చెప్పా లి తప్పించి అంతకు మించి ఒక్కడుగు ముందుకు వేయకూడదు.
మంచంలో కాలు మీద కాలు వేసుకుని నా గతాన్ని కొంచెం తవ్వాను. ఇప్పుడు నా వయసు మొన్ననే నిండూ నూరేళ్ళు నిండాయి. మరో మూడు రోజుల్లో భీష్మునికి నచ్చిన ఏకాదశి వచ్చినట్లు నాకు నచ్చిన నా తిథి రాబోతుంది.
అప్పుడే "ప్రాణమా.. ప్రాణమా. ఓ నా ప్రాణమా.. చిలకలా పైకెగిరి పోవమ్మ.. నా అనుభవాల దొంతరను ఆ బ్రహ్మ కు ఇవ్వమ్మ"
అంతేగదా మరి. అన్నట్లు అసలు విషయం చెప్పడం మరిచాను. నా యింటిది నాకంటే ముందుగానే పోయినప్పటికీ నాలాగానే తను అనుకున్న తిథిలోనే తాను పోయింది. నేను అంతేననుకోండి. అన్నట్లు మరో అసలు విషయం చెప్పడం మరిచాను. నా పేరేమిటి? ఇదేకదా మీ సందేహం.. ఏహే.. మీరే తెలుసుకోండి..
మూడు రోజుల అనంతరం పల్లవి, " హరిః ఓం
శివనారాయణ.. హరిహర నారాయణ.. ఆది నారాయణ.. కరుణతో ఈ జీవుని చూడుమా.. కైలాస గిరి మీద కైవల్య పథంబుకు తీసుకుపొమ్మా..
ముచ్చట ముచ్చట లాడుకుంటూ...
అనుభవాలను పంచుకుంటూ..
అలా అలా ఆనందంగా రమ్మా రమ్మా
ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.. "
అంటూ హాయిగా నిద్రపోతు న్నట్లు ఉన్న మామగారి శవాన్ని చూస్తూ దేవదేవుని ప్రార్థించింది.
ఓం శాంతిః శాంతిః శాంతిః
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments