top of page

హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్

Hats Off to What's App Written By Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ


సంస్కృతి కాలేజ్ లో వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాటల్లో ఆ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ప్రమీల వంతు వచ్చింది. ప్రమీల మైక్ అందుకుని పాడడం మొదలుపెట్టింది. " వేణుమాధవా... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ... " అంటూ. ఆ పాట ఎవరి చెవిలో చేరి గాంధర్వమైందో తెలియదు కాని అర్జున్ చెవికి మాత్రం అది గానామృతమే అయింది. అర్జున్, ప్రమీలా క్లాస్ మేట్స్. ఆ పాట పాడుతున్నంతసేపూ తన్మయత్వంతో వింటూ అయిపోగానే అందరికంటే ముందు చప్పట్లు కొట్టినవాడు అర్జున్.

ఉండబట్టలేక స్టేజ్ దగ్గరకు వెళ్లి " కంగ్రాట్స్ ప్రమీలగారూ మార్వెలస్. అద్భుతంగా పాడేరు. " అని అభినందించేడు. ఆ సన్నివేశంతో ప్రమీలా, అర్జున్ ల పరిచయం పెరిగింది. ఒకరి సెల్ నెంబర్లు ఒకరు ఇఛ్చి పుచ్ఛుకోవడం జరిగింది. మర్నాడు కాలేజ్ లైబ్రరీలో ప్రమీలను చూసి " ప్రమీలగారూ! నేను వాట్స్ ఆప్ లో పంపిన వీడియో చూసేరా? " అని అడిగేడు అర్జున్.

" చూసేను. అయినా నన్నడగకుండా, నాకు చెప్పకుండా ఆ వీడియో ఎందుకు తీసేరు? " నిలదీసింది ప్రమీల.

" అదేంటండీ? ఎవరైనా, ఏదైనా ప్రదర్శన ఇస్తున్నప్పుడు వీడియో తీసుకునే హక్కు ప్రేక్షకులకు ఉంది. అయినా మంచి పని చెయ్యడానికి ఎవర్నీ అడగక్కర్లేదండీ. అది సరే గాని మీతో కొంచెం మాట్లాడాలి." అన్నాడు అర్జున్.

" కొంచెం ఎందుకు? ఎక్కువే మాట్లాడుతున్నారుగా. అయినా ఇది లైబ్రరీ అండి. ( 'కీప్ సైలెన్స్' బోర్డు చూపిస్తూ) ఇక్కడ సైలెంట్ గా ఉండాలి. చదువుకోవడమే గాని మాట్లాడుకోకూడదు." అంది ప్రమీల నవ్వుతూ.

" ఇక్కడ కాదు నేను మాట్లాడాలనేది."

" మరి? "

" ఇంకెక్కడైనా "

" ఏమైనా మాట్లాడాలంటే క్లాస్ లోనో, కేంటీన్ లోనో మాట్లాడొచ్చుగా "

" అందరూ ఉంటారు కదండీ! "

" ఏం ఎవరూ ఉండకూడదా? అలా అయితే అసలు మాట్లాడకూడదు." అనుమానిస్తున్నట్లుగా అంది ప్రమీల.

" అది కాదండీ! ఎవరూ ఉండకూడదని కాదు. పర్సనల్ విషయాలు మాట్లాడుకునేటప్పుడు తెలిసిన వాళ్ళుంటే ఇబ్బంది కదా అని." తన అభిప్రాయం వెలిబుచ్చేడు అర్జున్.

" మీకూ, నాకూ మధ్య పర్సనల్ విషయాలేముంటాయ్? " అడిగింది ప్రమీల.

" ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే అవి పర్సనల్ మేటర్సే కదా! " అన్నాడు అర్జున్. కానీ అందరూ వీళ్ళిద్దరివైపే చూస్తుండడం గమనించి " వస్తానండీ! మళ్ళీ కలుద్దాం." అని అక్కడనుండి జారుకున్నాడు.

* * *

సాయంకాలం కాలేజ్ కేంటీన్ లో మళ్ళీ తారసపడింది ప్రమీల అర్జున్ కి. " ప్రమీల గారూ, మీరు కాఫీ త్రాగుతారా? టీ త్రాగుతారా? " అడిగేడు అర్జున్.

" నేను తీసుకుంటాను లెండి. " జవాబిచ్చింది.

" నేను మీకు టీ ఇచ్చినంత మాత్రాన నా ఆస్తేమీ తరిగిపోదు లెండి."

" బలే మాట్లాడతారే ! " అంటూ ప్రమీల నవ్వుతుంటే కెవ్వు కేక వెయ్యాలనిపించింది అర్జున్ కి. కాని అంతలోనే తమాయించుకుని " అందుకే ఆ మాటలు వినిపించడానికే మిమ్మల్ని అనుమతి కోరుతున్నాను. " అన్నాడు.

" సరే! పదండి." అనగానే ఇద్దరూ టీలు తీసుకుని ఓ ఖాళీ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు.

" ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారో " అంది ప్రమీల. ఏం మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో తెలీక తికమక పడుతున్నాడు అర్జున్.

" అదేంటండీ? నేను టీ త్రాగడం పూర్తి అయిపోయింది గాని మీరేంటి టీ వదిలేసి నీళ్లు నమిలినట్లు వాటర్ సిప్ చేస్తున్నారు? " తెలియజేసింది అర్జున్ అవస్థను గమనించి.

" ఆబ్బె! అదేం లేదండీ! " తడబడుతూ అన్నాడు అర్జున్.

కాని ప్రమీల ' ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి' అనేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చ్చేసింది అర్జున్ కి. "కాలేజ్ ఎలక్యూషన్ లో మీరు లవ్ మేరేజెస్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి నా అభిప్రాయమూ అదేనని మీకు చెప్పాలనిపించింది. అందుకే మీతో మాట్లాడాలన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఐ లవ్ యూ " అన్నాడు.

ఆ మాట అనేసరికి అందరి ఆడపిల్లల్లా కంగారుపడిపోలేదు ప్రమీల. కోపం తెచ్చుకోలేదు. "సరే! ఆ విషయం మరోసారి మాట్లాడదాం లెండి. " అని లేచి వెళ్ళిపోయింది.

అర్జున్ కి గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. ' నా అభ్యర్థనను అంగీకరించి ఇక్కడ కాదని వెళ్లిపోయిందా లేక నా కోరికకు కోపం వఛ్చి తప్పించుకుని వెళ్లిపోయిందా ' అర్థం కాలేదు. ఆ రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు అర్జున్ కి. అనవసరంగా తొందర పడ్డానేమో అనుకున్నాడు. 'నన్ను అపార్థం చేసుకుంటుందేమో, తన దృష్టిలో నన్నెలా ఊహించుకుంటుందో అలా అయితే మొదట్లోనే మాట్లాడేది కాదు కదా ' ఇలా తర్జన భర్జన పడుతూ నిద్ర లోకి జారుకున్నాడు.

* * *

" గుడ్ ఈవినింగ్ అర్జున్ గారూ! " ఏమీ జరగనట్లు పలకరించింది ప్రమీల. అర్జున్ కి కొండంత ధైర్యం వచ్చింది ప్రమీల తనను అపార్థం చేసికొనందుకు. " వెరీ గుడ్ ఈవినింగ్ ప్రమీల గారూ! " అన్నాడు.

" మీ ప్రపోజల్ కి ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదని ఆలోచిస్తున్నారు కదూ! " అడిగింది.

" అరే ! ఎలా కనిపెట్టేసేరు? " " పేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కదా! సరే కాని మీ ప్రపోజల్ కి ఇది సరైన సమయం కాదు. మనం ఇంకా స్టూడెంట్స్ మి. మనం దాని గురించి ఆలోచించవలసింది మనం సెటిల్ అయ్యాకే." చెప్పింది ప్రమీల.

" నిజమేనండీ! కాని ఎప్పుడో ప్రయాణానికి మనం ముందుగా రిజర్వేషన్ చేసుకోవడంలేదూ? లేకపోతె మన ప్రయాణం రోజున బెర్త్ కావాలంటే దొరుకుతుందా? ఇదీ అలాగే. "

" ఏం చెప్పేరండీ? జీవితానికీ, ప్రయాణానికీ బలే ముడి పెట్టేరు. " అంది నవ్వుతూ ప్రమీల.

" జీవితమూ ఓ ప్రయాణమేనండీ! ప్రయాణం సుఖంగా, ఏ ఇబ్బందీ లేకుండా జరగడానికి మనం ఏర్పాట్లు ఎలా చేసుకుంటామో అలాగే జీవితంలో ఏ ఒడిదుడుకులూ లేకుండా సాఫీగా, సంతోషంగా సాగిపోవడానికి జీవిత భాగస్వామి ఎంపిక కూడా ముందు చేసి ఉంచుకోవడంలో తప్పు లేదు కదండీ! మీరు అన్నట్లు మనం ఉద్యోగస్థులమయ్యాకే ఒకటవుదాం."

" ఇంతకీ మీరు నాలో ఏం చూసి లవ్ చేస్తున్నారు? రంగా? రూపమా? చదువా? " ఇంటర్వ్యూ ప్రారంభించింది ప్రమీల.

" ప్రేమించడానికి అందంతో పని లేదండీ! గుణం ఉండాలి. చదువుంటే చాలదు. సంస్కారం ఉండాలి."

" మరి మా కులమేంటో, మతమేంటో తెలుసా? "

" కులం, మతం చూసుకుంటే అది లవ్ మేరేజ్ ఎలా అవుతుంది? "

" మాకు ఆస్తిపాస్తులున్నాయనుకుంటున్నారా? "

" ఆస్తులూ, అంతస్తులూ లేకపోయినా సంపాదించుకోవచ్చు. కానీ ప్రేమించడం,ప్రేమింపబడడం అనేవి మనసులనుబట్టే ఉంటాయి. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అంటారు అందుకే. ఎప్పుడు ఎవర్ని చూస్తే ప్రేమ పుడుతుందో తెలీదు. "

" చివరిగా మీరు కట్నం ఆశించరా? "

" కట్నం ఆశిస్తే అది కట్నం మీద లవ్ అవుతుంది. "

" మీకక్కర్లేకపోవచ్చు కాని మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని? "

" మా పేరెంట్స్ ని ఆల్ రడీ కన్విన్స్ చేసేను. మీ పాట వీడియో వాట్స్ ఆప్ లో పంపించాను మా వాళ్లకు. అది చూడగానే వాళ్లకు మీరు నచ్చేసేరు."

" నేను లవ్ మేరేజెస్ ని సపోర్ట్ చేసినా మా పేరెంట్స్ అంగీకారం తోనే చేసుకుంటాను. " తేల్చి చెప్పింది ప్రమీల.

" ముందు మీకు అంగీకారమో కాదో చెప్పండి. " . . . . . . . . . . . . . . . . . . . . . " మౌనమె నీ భాష ఓ మూగ మనసా! అన్నట్లు మీ మౌనమే మీ అంగీకారం అనుకోవచ్చా?" అడిగేడు అర్జున్.

నవ్వే ప్రమీలను చూసి అది లవ్వే అని తేలిపోయింది అర్జున్ కి. వీళ్ళ ప్రేమ పాఠాలతోపాటు కాలేజ్ లో పాఠాలు కూడా పూర్తయిపోయేయి. పరీక్షలయిపోయేయి. ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ “ నాకు మీ పేరెంట్స్ అంగీకారం తెలియపరుస్తారుకదూ” అన్నాడు అర్జున్.

“ వాట్స్ ఆప్ లో కలుద్దాం.” అంది ప్రమీల.

“ మీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంటాను.” అన్నాడు అర్జున్.

* * *

“ సుశీలా! అమ్మాయేంచేస్తుంది?” అడిగేడు శ్రీకాంత్ భార్యని.

“ ఏదో పుస్తకం చూస్తున్నట్టుంది.” జవాబిచ్చింది సుశీల.

“ ఇంకేం పుస్తకం? ముఖ పుస్తకమే అయి ఉంటుంది.”

“ ముఖ పుస్తకమా?” ఆశ్చర్యంగా అడిగింది అర్ధాంగి.

“ అదేనోయ్! పేస్ బుక్.ఈ రోజుల్లో పిల్లలకి పుస్తకం కాదు సెల్ హస్తభూషణం. పేస్ బుక్ ఫ్రెండూను.” తెలియ చెప్పేడు శ్రీవారు.

“ దాన్ని మీరు మరీ ముద్దూ,గారాబం చేసి నెత్తికెక్కించుకున్నారు.అది ఆడింది ఆట,పాడింది పాటగా ఉంది.” అంది ఉక్రోషంగా.

“ ఏం నీకలా లేదనా నీ బాధ?”

“ నాకే బాధా లేదు కానీ ఉండండి అది ఎందుకో పిలుస్తుంది.” అంటూ కూతురి గదిలోకి వెళ్ళింది సుశీల. ప్రమీల తల్లికి తన లవ్ మేటర్ అంతా చెప్పింది. అది వినగానే సుశీల అవాక్కయిపోయింది.వెంటనే “ ఏమండీ! ఓ సారి ఇలా రండి.” అని భర్తను పిలిచింది. ఏమైందో అని కంగారుగా పరిగెత్తుకుని వచ్చిన శ్రీకాంత్ అంతా విని “ ఇదేమిటే! ఇదెక్కడి చోద్యమే! మన ఇంటా వంటా లేదు. నువ్వు ప్రవేశ పెట్టేవ్.అందాన్ని చూసి ప్రేమించడాన్నిలవ్ అనరు. ఎట్రాక్షన్ అంటారు.” నచ్చ చెప్పేడు తండ్రిగా.

“ నేను అందాన్ని చూసి ప్రేమించ లేదు డాడీ! అతని గుణాన్ని చూసి.” సమర్థించుకుంది కూతురు.

“ అప్పుడే నీకు అతని గుణం ఎలా తెలిసిపోయిందే? మొదట్లో అందరూ మంచివాళ్ళలాగానే ఉంటారు.” హెచ్చరించేడు శ్రీకాంత్.

“ అయినా కులం,మతం అవీ చూసుకో అక్కర్లేదటే!” అడిగింది సుశీల కూతుర్ని.

“ కులం ఎలా ఏర్పడింది? చేసే వృత్తిని బట్టి. ఇప్పుడెవరు కులవృత్తుల్నిచేస్తున్నారు? ఇక మతం అంటారా అతను హిందూయే. అయినా ఈ రోజుల్లో అవసరాలకోసం మతాన్నే మార్చుకుంటున్నారు. అలాంటప్పుడు ఏ మతమైతెనేంటి?”

“ అవునమ్మా! గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిదన్నట్లు నువ్వు మాకు నీతులు నేర్పొచ్చేవ్! నీకు నువ్వే నిర్ణయం తీసేసుకుని నిశ్చయించేసుకుని ఇప్పుడు మాకు చెప్పడమెందుకు? మీ తరానికి పెళ్ళంటే ఫ్రెండ్షిప్ లా అయిపొయింది.వంశం,సాంప్రదాయం అవీ అక్కర్లేదటే! “ అని తండ్రి అనేసరికి “ మీ చాదస్తం గాని వంశంలో అందరూ ఒక్కలాగే ఉంటున్నారా? సంప్రదాయాలూ,ఆచారాలూ పాటిస్తున్నారా? మీరు చెప్పిన సంబంధం చేసుకుంటే నేను మంచిదాన్ని.మీకు సంతోషం. నేను ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను.ఆలోచించుకోండి.మీ ఇష్టం.” అని తేల్చిచేప్పేసింది ప్రమీల.

సుశీలా,శ్రీకాంత్ లకు నోట మాట రాలేదు. “ ఇన్నాళ్ళూ ఆడపిల్లంటే తలిదండ్రులకు బరువు సమస్య.ఇప్పుడు పరువు సమస్య.” బాధపడుతూ తండ్రి అనేసరికి “మీ మర్యాదకు భంగం వాటిల్లే పరువు తక్కువ పనేం నేను చేయలేదు.ప్రేమించడం,పెళ్ళిచేసుకోడం పరువు తక్కువ అనేం నేను అనుకోవాదం లేదు.” అంది ప్రమీల.

“ అది సరే!వియ్యానికైనా,కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలికదే!అబ్బాయినీ,వాళ్ళతలిదంద్రుల్నీ,కుటుంబాన్నీ,ఇంటినీ మేం చూడక్కర్లేదా?అలాగే వాళ్ళూ మనల్నీ,మన ఇంటినీ చూడడం,పెళ్ళి చూపులూ, మాట్లాడుకోవడం ఇవేవీ అక్కర్లేదా?” అడిగింది తల్లిగా సుశీల.

“ పెళ్లి చూపుల్లో ఎవరైనా చూసేది రంగూ,రూపమే.చూసినంతమాత్రాన గుణమూ,సంస్కారమూ తెలియవు.అయినా మీకు కావలసింది చూడడం,మాట్లాడుకోవడం అంతే కదా! ఇదిగో! ఈ సెల్ లో వాట్స్ ఆప్ లో అబ్బాయీ,వాళ్ళ తలిదండ్రులూ, కుటుంబసభ్యులూ,వాళ్ళ ఇల్లూ అన్నీ ఫోటోలు ఉన్నాయి.చూడండి.అలాగే వాళ్ళ వివరాలన్నీ ఇచ్చేరు. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే వీడియో కాల్ చేసి ఇస్తాను.వాళ్ళతో మాట్లాడండి.ఇవి తత్కాల్ పెళ్లి చూపులు.” అంది ప్రమీల అమ్మా,నాన్నలతో.

“ ఎంత ఎదిగి పోయావే” అనుకున్నారు తల్లీ,తండ్రీ.

“ అలాగే వాళ్ళూ మిమ్మల్ని చూస్తారు.మాట్లాడతారు.నన్ను ఆల్ రడీ చూసేసేరు.” అనగానే “ అదెప్పుడే?” ఆశ్చర్యంగా అడిగేరు సుశీలా,శ్రీకాంత్ ఒక్కసారిగా.

“ మా కాలేజ్ ఏనివర్సరీ ఫంక్షన్ లో నేను పాడుతుంటే వీడియో తీసి వాళ్ళ వాళ్లకు పంపించేరట ఆయన.అది చూడగానే నేను వాళ్లకు నచ్చేసేనట.” ముగింపుగా చెప్పింది ప్రమీల. నోరెళ్ళబెట్టడం సుశీలా,శ్రీకాంత్ ల వంతయింది.

* **

రెండు పార్టీలూ వీడియో కాల్ లో మాట్లాడుకున్నాయి.వాట్స్ ఆప్ లో జాతకాలు పంపించుకున్నారు.అవి నప్పడం, ఒకరికొకరు తాత్కాలికంగా అంగీకారం తెలుపుకోవడం జరిగిపోయేయి. “ శుభలేఖలు కూడా వాట్స్ ఆప్ లో పంపించొచ్చు కదండీ!” అడిగింది సుశీల భర్తని. “ శుభలేఖలేం ఖర్మ పెళ్లి వీడియో కూడా పంపించొచ్చు.” చెప్పేడు శ్రీకాంత్.

“ అప్పుడు పెళ్ళికెవరొస్తారు? అందరూ వీడియో చూస్తాం లెండి అంటారు.మరి కానుకలు చదివించడం?” అమాయకంగా అడిగింది సుశీల.

“ వాటిని ఆన్ లైన్ లో వాళ్ళ అడ్రస్ కు ఆర్డరిచ్చేస్తారు.”

“ ఆ!” ముక్కున వేలేసుకుంది సుశీల.

“ ఆ! మరేంటనుకున్నావ్? ఫిఫ్త్ జనరేషన్ ఇలాగే ఉంటుంది.ప్రమీలార్జునీయం అంటే ఇదే.” అన్నాడు శ్రీకాంత్.

సరిగ్గా అదే సమయంలో ఫోన్ వచ్చింది ప్రమీలకు.ఎక్కడినుండి అనుకుంటున్నారు? అర్జున్ నుండి.ఏమని? “ నేనీ దరినీ,నువ్వా దరినీ వాట్స్ ఆప్ కలిపింది ఇద్దరినీ.”

హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్

( సమాప్తం )


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

67 views0 comments

Comments


bottom of page