top of page
Writer's pictureLalitha Sripathi

ఇల్లే బృందావనం


'Ille Brundavanam' New Telugu Story

Written By Sripathi Lalitha

'ఇల్లే బృందావనం' తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా ? నీకు ఇష్టమని మసాలా వడలు చేశాను. రెండు డబ్బాలు పెట్టాను. ఒకటి నువ్వు తిను వేరేది మీ ఫ్రెండ్స్ కి ఇవ్వు. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. ఆఫీస్ కి వెళ్ళాక మెసేజ్ పెట్టు. " లిఫ్ట్ దగ్గర నుంచుని చెప్తున్న మాలతిని చూసి నవ్వుతూ " అలాగే అమ్మా

మీరు లోపలికి వెళ్ళండి ఓకే, బై " లిఫ్ట్ రాగానే వెళ్ళింది ప్రియ.


అవి హైటెక్ సిటీ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ఫ్లాట్స్. ప్రియ, ప్రమోద్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వాళ్ళకి ఒక పాప ఐరా, 5 ఏళ్ళు.


ప్రియ వెళ్ళగానే లిఫ్ట్ నుంచి ఫ్లాట్ లోపలికి వస్తున్న మాలతి ని చూసి ఎదురు ఫ్లాట్

లో ఉన్న ఆమె పలకరింపుగా నవ్వింది.

" నా పేరు స్వాతి, మేము కొత్తగా వచ్చాము ఆంటీ. ప్రియ ఆఫీసుకి వెళ్లిందా? " అంది. "


"అవునమ్మా ? ప్రియ చెప్పింది మీరు ఈమధ్యే వచ్చారని. అలవాటు పడ్డారా ? "

అడిగింది మాలతి.


"లోపలికి రండి ఆంటీ " పిలిచింది స్వాతి. " లేదమ్మా పొయ్యి మీద కూర పెట్టాను తరవాత వస్తానులే " అంటూ హడావిడిగా లోపలి వెళ్ళింది మాలతి.


స్వాతి, ఆమె భర్త సంతోష్ కొత్తగా ఫ్లాట్ కొనుక్కొని వచ్చారు. వాళ్ళ అబ్బాయి చెన్నై లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంతోష్ కి సొంత బిజినెస్. స్వాతి ఇంట్లోనే ఉంటుంది.

ఒక్క ప్రియా వాళ్ళ తోనే కొంచెం పరిచయం. ఒక్కతికి ఏమి తోచక ఎవరైనా కనిపిస్తే మాట్లాడుతుంది. మెయిన్ డోర్ దగ్గరికి వేసి కూర్చుంటుంది

కొద్దిగా మాటలు వినపడితే సందడిగా ఉంటుంది అని.


ప్రియా వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్టున్నారు అనుకుంది.

కొంచెం సేపటికి ప్రమోద్ కూడా బయటికి వచ్చాడు.

కరెక్ట్ గా ప్రియా కి చెప్పినట్టే చెప్పింది. మాలతి.

"ఆఫీస్ కి చేరాక మెసేజ్ పెట్టు. టిఫిన్ బాక్స్ లో నువ్వు తీసుకోని మిగిలినవి ఫ్రెండ్స్ కి ఇవ్వు "అంటూ.


"గుర్తుంటే మెసేజ్ పెడతాను. అందరమూ కూర్చుని తినేప్పుడు అలా కుదరదు. " కోపంగా అంటూ వెళ్ళాడు ప్రమోద్.

"అల్లుడి పొగరు " అనుకుంది స్వాతి.

సాయంత్రం ఐరా ని స్కూల్ బస్సు నుంచి తీసుకొని వచ్చారు మాలతి ఆమె భర్త మనోహర్.

ఐరా ఆపకుండా ఒకటే కబుర్లు " తాతా, అమ్మా ". అంటూ.


మరికాసేపటికి ప్రియ వచ్చింది. వాళ్ళు కూడా తలుపు దగ్గరికి వేసారేమో నవ్వులు కబుర్లు బాగా వినిపించాయి.అందరూ కూచుని భోజనం చేస్తున్నట్టున్నారు " అనుకుంది స్వాతి.

స్వాతి భర్త పొద్దున్న వెళితే రాత్రి రావడం. ఇద్దరు కలిసి ఒకపూట కూడా భోజనం చేయరు.

కలిసి తింటే ఒక ముద్దా ఎక్కువ కూడా తింటాము. కబుర్లు చెప్పుకుంటూ తింటే తిన్న తిండి ఒంటికి పడుతుంది.

ఇలా ఒక్కతీ ఇంట్లో ఉండి చాల బోర్ గ ఉంటోంది. " నిట్టూరుస్తూ లోపలి వెళ్ళింది.


ఆ తరువాత రోజు ఇదే తంతు.

ఎంతైనా అమ్మ అమ్మే. ఆమె వచ్చాక ప్రియ మొహంలో సంతోషం కనిపిస్తోంది.

రెండు రోజుల తరవాత ప్రియ స్వాతి దగ్గరికి వచ్చింది

స్వాతి గారు నాకు ఒక సహాయం కావాలి " అంది

"తప్పకుండ ప్రియా ఏమిటి ? "అంది స్వాతి.


"ఇవాళ అమ్మ పుట్టిన రోజు ముందు చెపితే తనకు వద్దు అంటారు. నేను ఆన్లైన్ లో చీర, బొకే కేక్ బుక్ చేశాను. అవి మీరు తీసిపెట్టుకుంటారా ?నేను రాత్రి 10 తరవాత తీసుకుంటాను"

అంది.


"తప్పకుండా ! ఇందులో ఏముంది. ఎలాగో మా వారు వచ్చేసరికి రోజు 12 అవుతుంది నేను మేలుకునే ఉంటాను " అంది స్వాతి.


అన్నట్టుగానే ప్రియ బుక్ చేసినవి 10 గంటలకి వచ్చి తీసుకుంది. 12 గంటలకి ప్రియ వాళ్ళ ఇంట్లో నుంచి హ్యాపీ బర్త్ డే పాట, నవ్వులు వినిపించాయి. స్వాతి భర్త కూడా రావడంతో తలుపులు వేసింది.


ఆ మరునాడు సాయంత్రం ప్రియ వాళ్ళ ఇంట్లోనుంచి ప్రమోద్ గొంతు కోపంగా

వినిపిస్తోంది. నేను ఏమి చెప్పాను మీరు ఏమి చేసారు ? ప్రియా! నీకు చెప్పానా లేదా? ఊరికే వళ్లు విరగొట్టుకొని చేయద్దు నేను ఆర్డర్ ఇస్తాను అన్నా కదా ? ఇప్పుడు పడి పడి అన్ని రకాలు చేయాలా నేను తినను. " కోపంగా వినిపించింది.


"నేను చెప్పేది విను. మామయ్యగారు మొన్ననే జబ్బు పడి లేచారు. వాళ్ళ కోడలు ఏమో కడుపుతో ఉంది. వాళ్ళు బయట తెప్పించిన వాటి కంటే ఇంట్లో చేసినవి తింటే నయం కదా. అన్ని నేను చెయలేదుగా. కొన్ని ఎలానో బయటినుంచి తప్పవు. " అని ప్రియా వాళ్ళ అమ్మ సంజాయిషీ చెప్తోంది.


"లేదు మీకు సుఖపడడం రాదు. అంత వంట చేసి అలసిపోయి చమటలు కారుతూ కూచుంటారు. తినేది అందరు కలిసి కూచుని తినడం ముఖ్యమా. బయట నుంచి కూడా చూసే తెప్పిస్తాగా, వచ్చిన దగర నుంచి నీకిష్టం, ప్రియకి ఇష్టం, అని వంటింట్లో నే మగ్గిపోవడం "

" ఎవరైనా చూస్తే వంట చేయడానికి వచ్చింది అనుకుంటారు "

ప్రమోద్ అరిచాడు.


"ఒకళ్ళ సంగతి నాకు అనవసరం, నా పిల్లలకి నేను చేసిపెడితే నాకు సంతోషం. "" తిని బావుంది అంటే నా కడుపు నిండుతుంది " మాలతి అంటోంది.


"అవును అంతా మేము తినేసాక గిన్నెలోది ఊడ్చి తింటే ఇంకా నిండుతుంది. "

"చెప్పడం వేస్ట్ ఏమి చేయాలనుకుంటే అది చేయడం అలవాటేగా "

విసురుగా తలుపు తీసుకొని కిందకి లిఫ్ట్ లో వెళ్ళాడు.


బయటికి వెళితే బావుండదు అని స్వాతి ఇంట్లోనే కూర్చుంది.

కొంచెం సేపటికి ప్రియ బెల్ కొట్టింది.

"కొన్ని నీళ్ల బాటిల్స్, ఐస్ క్రీమ్ మీ ఫ్రిజ్ లో పెట్టనా మా ఇంటికి డిన్నర్ కి మా అన్నా వాళ్ళు వస్తున్నారు. " అంది.


"మీ అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారా మీ అమ్మగారు వాళ్ళు వాళ్లతో ఉండరా ? "

అడిగింది స్వాతి.

"ఉంటారు అందరు వస్తున్నారు " అంది.


"నేను ఇలా అన్నాను అని ఏమి అనుకోకండి కానీ మీ వారు మీ అమ్మగారి మీద అరవడం ఎందుకో బాగా అనిపించలేదు ఆయనకి మీ అమ్మ, నాన్న రావడం ఇష్టం లేదా? " అంది స్వాతి నెమ్మదిగా.


ప్రియ ఒకసారి అయోమయంగా చూసి పెద్దగా నవ్వింది. " అరే ! మీరు వాళ్ళని మా పేరెంట్స్ అనుకుంటున్నారా. వాళ్లు ప్రమోద్ వాళ్ళ అమ్మ, నాన్న " అంది

"మరి మీరు అమ్మ అన్నారు. " తడబడుతూ అంది స్వాతి.


" మేము నార్త్ ఇండియన్స్, ప్రమోద్ వాళ్ళు తెలుగు, మాది ప్రేమ వివాహం. మాలో అత్తగారిని అమ్మా అనే పిలుస్తాము. వాళ్ళకి ప్రమోద్ ఒక్కడే కొడుకు.


ఆవిడకి అమ్మాయిలు లేని లోటు నాతో తీర్చుకుంటున్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా ప్రేమగా ఉంటారు. ప్రమోద్ కి కూడా వాళ్ళ అమ్మ అంటే ప్రాణం, ఎటొచ్చి ఆవిడకి కూచోకుండా ఏదోఒక పనిచేసే అలవాటు, ప్రమోద్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు.


వాళ్ళ ఇద్దరికీ ఇది ఎప్పుడు ఉండేదే కాసేపయ్యాక వచ్చి వాళ్ళ అమ్మని కాకా పడతాడు."

నవ్వుతూ అంది. "


"మరి మీరు వాళ్లతో ఉండరా ?వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారు కదా ? " అని స్వాతి అడిగితే

"మేము వచ్చి కూడా 6 నెలలు అయింది. వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. "


మాకు ఆఫీస్ కి దగ్గర అని ఇక్కడ ఇల్లు కొన్నాము. " మొన్న, మొన్న వరకు మా ఐరాని వాళ్లే చూసుకున్నారు.

వాళ్ళకి కూడా కొంత రెస్ట్ ఉండాలని మేము ఇక్కడ ఐరాని పని అమ్మాయి సాయంతో చూసుకుంటున్నాము.


ఇవాళ మా వాళ్ళు కూడా అమ్మ పుట్టినరోజు కోసం వస్తున్నారు. ప్రమోద్ అన్ని బయటి నుంచి తెప్పిస్తాను అంటే వినకుండా అమ్మ కొన్ని వంటలు చేసారు. అదీ తన కోపం. పుట్టిన రోజు నాడు కూడా ఎందుకు కాస్త పడడం అని. కేక్ కట్ చేసినప్పుడు పిలుస్తాను. రండి "


"మీకు కొన్ని రుచి చూపిస్తాను. "అని చెప్పి వెళ్ళిపోయింది ప్రియ.


అందరూ వచ్చాక మళ్ళీ మాలతి చేత కేక్ కోయించారు. ఆ టైంకి ప్రియ స్వాతి ని కూడా పిలిచింది.

అందరు చక్కగా నవ్వుతూ పలకరించారు స్వాతిని.


బాల్కనీ లో మగవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు నలుగురు డిన్నర్ కి అన్ని సర్దుతున్నారు. ఐరా అందరిదగ్గర ముద్దులు పోతూ తిరుగుతోంది.


ఇద్దరి తల్లులు కూర్చుని సలహాలు చెప్తూ మధ్య మధ్యలో అందరిమీద జోక్స్ వేస్తూ నవ్వుతున్నారు. స్వాతి కి అదంతా చూస్తే చాలా ముచ్చట గా

అనిపించింది.


"నేను వెళతాను ప్రియా " అనగానే

అందరూ "అయ్యో భోజనం చేసి వెళ్ళండి" అన్నారు.

"లేదండీ మా వారు ఇవాళ త్వరగా వస్తాను అన్నారు " అంటే

"మరింకే ఆయన్ని కూడా పిలుద్దాము " అన్నాడు ప్రమోద్


"లేదులెండి. మీరు అందరూ ఎంజాయ్ చెయ్యండి మేము ఇంకోసారి తప్పక జాయిన్ అవుతాము. " అని బయలుదేరగానే,


"మీరు వెళ్ళండి డోర్ తీసి ఉంచితే నేను మీకు స్వీట్, కేక్ తెస్తాను "

అని ప్రియ స్వాతి వెనకే నాలుగు అయిదు గిన్నెలు తెచ్చింది.


"అమ్మ చేసిన పులిహోర, వడ రుచి చూడండి. మా మమ్మీ కూడా స్పెషల్ స్వీట్ చేసి తెచ్చింది." అని గిన్నెలు బల్ల మీద పెట్టి మంచినీళ్ళ సీసాలు, ఐస్క్రీమ్ తీసుకొని వెళ్ళింది.


అన్ని చూసి ఇవే సరిపోతాయి ఇంకా వంట

అక్కరలేదు అని స్వాతి టీవీ పెట్టి కూర్చుంది.


అనవసరంగా పని, పాటా లేక తాను ఏవోవో ఆలోచింది. ఎవరినో ఏదో బాధ పెడుతున్నారు అని. వాళ్ళందరూ ఎంత సరదాగా సంతోషం గా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ, అనురాగం గౌరవం అన్ని ఉన్నాయి.


అందమైన బృందావనం లాగా ఉంది ఆ ఇల్లు.

కానీ తనేమో టీవీ సీరియల్స్ లో ఆడవిలన్ లాగ

ఆలోచించింది. అవును ఈమధ్య తోచక ఆ టీవీ అలానే

మోగుతూ ఉంచేస్తోంది. కొన్ని కాకపోతే కొన్ని అయినా బుర్రలకీ వెళ్తాయి.


ముఖ్యంగా తనకి ఇక్కడికి వచ్చాక వ్యాపకం లేకుండా అయింది. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే కానీ మనసు సరిగా ఉండవు, ఒంటరిగా ఉండి అనవసరమైన ఆలోచనలు. ఇక్కడ కమ్యూనిటీ లో చాలా కాలక్షేపాలు ఉన్నాయి. తన వయసు వాళ్ళ కి తగ్గ గ్రూప్ లో చేరాలి.


ప్రియా వాళ్ళ ఇల్లు లాగ తన ఇంటిని కూడా బృందావనం చెయ్యాలి. "నిజం "అన్నట్టుగా బెల్ మోగింది స్వాతి తలుపు తియ్యడానికి లేచింది.

***

శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్ర్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.











115 views0 comments

Comments


bottom of page