'Intlo Illalu Svapnamlo Priyuralu' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 08/02/2024
'ఇంట్లో ఇల్లాలు స్వప్నంలో ప్రియురాలు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ! ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి.. "
"ఎందుకు అలా అనుకుంటున్నావు మేఘన.. "
"నాతో మీరు సరదాగ ఉండట్లేదు కదా.. "
"అదంతా.. నీ భ్రమ మేఘన.. ! నువ్వంటే నాకు చాలా ఇష్టం.. "
"నేను నమ్మను.. ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏమిటి.. ?"
"నాకంత అదృష్టం కుడాను.. ఉంటే, నువ్వు ఊరుకుంటావా చెప్పు.. ?
"నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి.. " అంది మేఘన.
మేఘన అడిగిన తర్వాత.. మన్మధరావు కు ఆలోచన వచ్చింది. నిజంగానే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ఎంత సూపర్ గా ఉంటుందో.. అయినా నాకంత అదృష్టం కూడాను.. ఈ జీవితానికి ఇక ఇంతేనా! ఆ అదృష్టం కలిగించు స్వామి!
వెంటనే, తథాస్తు దేవుడు ప్రత్యక్షమై..
"మన్మధరావు! ఏమిటి అడిగావు.. ?" అని ఒక స్వరం వినిపించింది.
"ఎవరు స్వామి మీరు.. "?
"తథాస్తు దేవుడను.. నన్ను పిలిచావు కదా.. మన్మధరావు.. "
"ఇంతకీ.. ఒక ప్రియురాలు కావాలంటావు.. "
"అవును స్వామి.. ఈ లోకంలో ఎక్కడ ఉన్నా.. నా భార్య కు తెలిసిపోతుంది.. వేరే లోకంలో ఎక్కడైనా అయితే.. మా ఆవిడ రాలేదు కదా.. "
"నువ్వు బ్రతికి ఉండగా.. స్వర్గలోకానికి నీకు ప్రవేశం లేదు.. ఏం చెయ్యమంటావు.. ?"
"వేరే ఒక లోకం సృష్టించండి స్వామి.. ?"
"అలా అవదు మన్మధా! కానీ ఒక ఉపాయం ఉంది. ఈ పూసల మాల తీసుకో. ఇందులో ఉన్న పూసలను రుద్ది.. రాత్రి పడుకుంటే, తర్వాత స్వప్నంలో నీ ప్రేయసిని కలుస్తావు. గుర్తుంచుకో.. కలలో నువ్వు ఏది చేస్తే, ఇక్కడ నీ జీవితంలో అది తెలుస్తుంది మన్మధా.. !"
"అంటే ఏమిటి స్వామి.. ?"
"కలలో.. నువ్వు నీ ప్రేయసి ని ముద్దు పెట్టుకుంటే, అది నీకు నిజ జీవితంలో అనుభవం లాగే ఉంటుంది. ఈ పూసల దండ మీ ఆవిడకు కనిపించకుండా పెట్టు. పొరపాటున పూసలు రుద్దితే, ఆమె కూడా నీ కలలోకి వస్తుంది.. తరువాత అంతా గందరగోళమే.. ! అప్పుడు నీకు నేను ఏమీ సహాయం చెయ్యలేను. పూసల దండ శక్తి కుడా పోతుంది. "
"అలాగే స్వామి.. జాగ్రత్తగా ఉంటాను.. "
"తథాస్తు.. " అని తథాస్తు దేవుడు మాయమయ్యాడు..
మన్మధరావు.. ఆ రోజు రాత్రి, పూసలదండని రుద్ది.. నీట్ గా రెడీ అయి.. పడుకోవడానికి మంచం ఎక్కాడు.
"ఏమిటండి.. రాత్రి పూట ఎక్కడికైనా వెళ్తున్నారా.. ?" అడిగింది మేఘన.
"లేదు.. ఇలా రెడీ అయి పడుకుంటే, మంచి కలలు వస్తాయని ఎవరో చెప్పారు.. అందుకే.. "
"రోజు రోజుకు మీ చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి.. " అంది మేఘన.
"కావాలంటే, నువ్వు రెడీ అయి పడుకో మేఘన.. ఏముంది.. ?"
మన్మధరావుకు బాగా నిద్ర పట్టేసింది.. నిద్రలో ఒక అందమైన స్వప్నం. అది ఒక అందమైన భవంతి.. చూస్తుంటే, ఒక దేవతా భవంతి లాగ ఉంది.. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఆ భవంతి ఉంది. ఎక్కడనుంచో.. ఒక మధురమైన పాట వినిపిస్తుంది. మన్మధరావు ముందుకు సాగిపోతున్నాడు.
ఒక చోట ఒక అందమైన అమ్మాయిని చూసాడు.. ఆమె చాలా అందంగా ఉంది. 'నేను ఎప్పుడూ రంభను చూడలేదు. ఈమేనేమో ఆ రంభ.. ' అని అనుకున్నాడు.
"ఎవరు నువ్వు.. ఇక్కడకు ఎందుకు వచ్చావు?"
"నేను మీ గానం తో పులకించి వచ్చాను.. ఇక్కడకు వచ్చిన తర్వాత, మీ గానం కన్నా మీరు ఇంకా అందంగా ఉన్నారు.. మీరు ఎవరో తెలుసుకోవచ్చా?"
"నేను.. రంభ కు కజిన్ సిస్టర్ ను.. ఇక్కడ ఈ లోకం లోనే ఉంటాను.. "
"మీ అందానికి నేను మీతో ప్రేమలో పడిపోయాను.. ఇంతకి మీ పేరు.. ?" అడిగాడు మన్మధరావు.
"నా పేరు రంభ.. అయినా మీరు ఇక్కడకు వచ్చారంటే, మీరు వీరులైనా అయిఉండాలి.. లేకపోతే వరం పొందిన వారై ఉండాలి.. "
"నాకు ఒక వరం దొరికింది.. అందుకే రాగలిగాను.. "
"బాగా నచ్చావు అందగాడా.. !" అంది రంభ.
మాట్లాడుతుండగానే తెల్లారింది.. "మళ్ళీ రేపు కలుస్తాను.. " అని చెప్పాడు మన్మధరావు.
"రంభా.. ! రంభా.. ! రేపు కలుస్తాను.. నీతో చాలా చెప్పాలి.. " అని కలవరిస్తున్నాడు మన్మధరావు.
"ఏమండీ.. ! లెండి.. తెల్లారింది.. " అని నిద్ర లేపింది మేఘన.
నిద్రలేచిన మన్మధరావు తో.. భార్య.. "ఎవరండి.. ఆ రంభ.. ?"
"ఏదో కల వచ్చింది లే.. అంతే.. !"
"రంభ లాంటి దానిని నేను ఇక్కడ ఉంటుండగా.. మళ్ళీ రంభ అని కలవరిస్తారా.. ?"
"కలే కదా.. ఎందుకు అంత ఫీల్ అవుతావు చెప్పు.. !"
మన్మధరావు మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తుందా.. అని ఆఫీస్ లో ఉన్నంత సేపు ఎదురు చూసాడు. రోజూ ఇలా.. రాత్రి స్వప్నంలో రంభ ను కలిసేవాడు. ఇద్దరి మధ్య ప్రేమ బాగా చిగురించింది. తనని పెళ్ళి చేసుకుని.. ఇక్కడే ఉండిపోమని అడిగింది రంభ. ఆలోచించుకుని చెబుతానని చెప్పాడు మన్మధరావు..
మర్నాడు ఉదయం భర్త హుషారు చూసిన భార్య.. అతని దగ్గర నుంచి మంచి సువాసన రావడం గమనించి.. ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి.. భర్త ను కనిపెట్టాలని నిర్ణయించుకుంది. అలా.. ఒక రోజు అంతా గమనిస్తూనే ఉంది మేఘన. పూసలు రుద్దడం.. నిద్ర పోవడం.. అంతా గమనించింది..
మర్నాడు.. భర్త పడుకున్న తర్వాత.. మేఘన కుడా భర్త చేసినట్టుగా చేసి.. నిద్రలోకి జారుకుంది. కలలో ఉన్న ఆ భవనం లోకి అడుగుపెట్టిన మేఘన.. భర్త రంభ తో సరదాగా ఉండడం గమనించింది..
"ఏమండి! ఇదా మీరు రోజూ చేస్తున్న పని.. ? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు.. ?"
"నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు మేఘన.. కొంప దీసి ఆ పూస ని.. "
"అవునండి.. తీసాను.. అందుకే మీ బండారం బయటపడింది. రంభ లాంటి దానిని నేను ఉంటుండగా.. మీకు ఇంకో రంభ కావాల్సి వచ్చిందా? ఇంటికి పదండి.. మీ పని చెబుతాను.. " అంది కోపంగా మేఘన.
"ఎవరు మీరు.. ఇక్కడ ఎందుకు ఇలా గోల చేస్తున్నారు.. ?" అడిగింది రంభ.
"నేను ఈ మనిషికి భార్యను.. " చెప్పింది మేఘన.
"నీకు పెళ్ళి అయ్యిందా మన్మధా.. నాకు ఎందుకు చెప్పలేదు.. ? పెళ్ళైన వాళ్ళకి మేము చాలా దూరం.. మీ లోకం లో భార్యలు చాలా గయ్యాళి గా ఉంటారని మాకు తెలుసు. నా దగ్గర ఈ విషయం దాచినందుకు.. నీకు ఎప్పటికీ ఇంక ఇక్కడకి ప్రవేశం లేదు.. " అని ఇద్దరినీ అక్కడ నుంచి పంపించేసింది రంభ..
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments