top of page

జీవన సంధ్య


Jeevana Sandhya written by P.L.N.Mangaratnam

రచన : P.L.N.మంగారత్నం

ఆ రోజు ఉదయం ..

తొమ్మిది గంటలకు నేనింకా .. వంటలో ఉండగానే వీధి గుమ్మంలోనుంచి ఉషామణిగారి పిలుపు ‘రత్నంగారూ’ అంటూ. అలా పేరుతొ పిలిచేది ఆవిడ మాత్రమే.

రెండు బ్లాకులుగా కట్టిన ఈ అరవై పోర్షన్ల అపార్టుమెంటులో మిగిలిన వాళ్లందరికీ నేను ‘అంటీ’ నే. పిల్లలకైనా, పెద్దలకైనా. ఇంకా ఉంటే .. వాళ్ళ మనవలకైనా. రిటైరు అయి రెండేళ్ళు గడిచిన నా వయసుకన్నా .. మరో పదేళ్ళు పెద్దది ఆవిడ.

మా డోర్ కర్టెను ప్రక్కకు లాగి పట్టుకుని, లోపలి తొంగి చూస్తూ “ పనిలో ఉన్నారా?” మళ్ళీ అడిగింది.

ఉదయం, నిద్ర లేచినపుడు తీసిన తలుపు .. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడే వేసేది. అయిదవ ఫ్లోర్లోని లిఫ్ట్ ప్రక్క పోర్షన్ అయినా సరే, అది అలానే ఉంటుంది ఎప్పుడూ.

నాకు తలుపులు తెరుచుకుని ఉండే అలవాటు ఉన్నందుకేమో! ఎదురు పోర్షన్లోకి ఎవరు వచ్చినా తలుపులు బిడాయించుకునే ఉంటారు.

అలాగే, ఈవిడా. ఎంతో అవసరం అయితే తప్ప బయటకు రాదు. కనిపిస్తే పలకరించుకోవడమే. అలాంటిది ఏం అవసరం వచ్చిందో, ప్రొద్దుటే, గుమ్మం ముందుకు వచ్చింది.

ఇంతకుముందు అయితే .. సాయంత్రాలు వాళ్ళ తలుపులు తెరిస్తే, అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లి కూర్చునేదాన్ని. ఇంట్లో ఆవిడా, అన్నగారు ఇద్దరే ఉంటారు. ఆవిడకి భర్త లేకపోతే ..అన్నగారికి భార్యలేదు. ఉషామణి గారికి ఒక కొడుకూ, కూతురు అయితే .. అన్నగారికీ ఓ కొడుకూ, కూతురే. ఈవిడ కొడుకు ‘ సుదర్శనరావు ’ హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉంటే .. కూతురు పెళ్లై అత్తవారింటిలో ఉంటుంది.

కొడుక్కి చేసుకున్నది, ఇంకో అన్న కూతుర్నే.. అయినా, ఆ పిల్లకి మేనత్త పొడగిట్టక పోవడంతో .. రిటైరు అయినా కొడుకు దగ్గరకు వెళ్లి ఉండక .. ఉన్న ఊరిలొ స్వంత ఇంట్లోనే ఉండిపోయిందిట ఒంటరిగా. ఆ తరువాతి కాలంలో, అన్నగారికి భార్యా, కొడుకూ పోవడంతో .. ఒంటరిగా ఉన్న చెల్లెలి దగ్గరకు వచ్చేసాడట, ఆవిడది స్వంత ఇల్లు కావడంతో.

తరువాత .. తరువాత ఏవో కారణాలతో, ఉషామణిగారు కూడా ఉన్న ‘ఫ్లాట్’ ను అమ్మేసుకుని, అన్నగారితో పాటు, ఎక్కడెక్కడో ఉండి, చివరికి మా ఎదుటి ఫ్లాట్లోకే .. అద్దెకు దిగారు నాలుగేళ్ళ క్రిందట. ఆవిడకి పెన్షను ఆసరా అయితే. అన్నగారు తద్దినం బ్రాహ్మడు. ఎవరి దగ్గరో జీతానికి పని చేస్తాడు. అయినా, ఇద్దరి సంపాదనలూ అంతంతమాత్రమే. అన్ని సౌకర్యాలూ ఉన్నాయని, చివరి రోజుల్లో ఈ ఖరీదైన అపార్టుమెంటులో దిగారు గానీ, గొర్రె తోక బెత్తెడే. తల్లిని, తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకోకపోయినా .. ఖర్చులకు ఇబ్బంది లేకుండా డబ్బు పంపిస్తుంటాడు సుదర్శనరావు.

మొదట్లో.. ఆఫీసు పనుల వల్ల ఆవిడని, నేను అంత పట్టించుకోకపోయినా .. కాలక్రమంలో మంచి స్నేహమే కుదిరింది మాకు. ఇంట్లో కష్టం సుఖం చెప్పుకునేంతగా. ప్రొద్దుటే, ఆవిడ అలా వచ్చేసరికి “ ఆ .. వస్తున్నా ఉండండి” అంటూ కాగే నీళ్ళ క్రింద స్టవ్ కట్టేసి ముందు ఉన్న హాల్లోకి వెళుతుంటే .

“ మాస్కు వేసుకెళ్ళు” అంటూ ఆయన హెచ్చరిక చిన్నగా వినిపించింది.

ఈ కరోనా వచ్చినప్పటి నుంచీ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం వెళ్ళడం మానేసాం. ఒకవేళ కనిపించినా .. ఎవరి గుమ్మాల్లో వాళ్ళు ఉండి, సామజిక దూరం పాటించేలా మాట్లాడుకునే వాళ్ళం. అయితే, ఆవిడ ఆ వయసుకి ఎంతో సేపు నిలబడలేకపోవడంతో .. ఆ కబుర్లూ లేవు ప్రస్తుతం. అలాంటిది ఈరోజు ఈవిడే వచ్చింది మాస్క్ వేసుకుని. అందుకు, ఆయన మాటల్ని పట్టించుకోకుండానే వంటగది దాటి, హాల్లోకి అడుగుపెట్టాను.

“ నేను నాలుగు రోజుల బట్టీ ఇంట్లో లేను, మా అమ్మాయి గారి ఇంటికి ‘ కాట్రావుల పల్లి’ వెళ్ళాను పండక్కి” చెప్పింది ఆవిడ.

“ ఆ ..అవును. లేకపోవడం గమనించాను. గుమ్మం ముందు ముగ్గు కూడా లేదు” చెప్పాను. ఆవిడ చేతిలో ఉన్న డోర్ కర్టెను గుడ్డని తీసుకుని .. తలుపు మీదకి జారేస్తూ.

ఆవిడ బయటా .. నేను లోపలా. ‘లోపలికి రండి’ అనే మాట దూరం అయిపోయి౦ది.

“ ఓ గంట అయ్యింది వచ్చి. ఇప్పుడే మా ఇంటి ఓనరు సతీష్ గారు ‘ఫోన్’ చేసారు. ఆయన అక్కకీ .. అతనికీ ఏవో ‘గొడవలు’ వచ్చాయట. ఆ అక్కగారి పోర్షన్లో అతను ‘రెంటు’కే ఉంటూ .. అతని పోర్షన్ మాకు అద్దెకు ఇచ్చాడట. ఇప్పుడు ఆవిడ అర్జంటుగా .. ఆవిడ పోర్షన్ ఖాళీ చేసి ఇచ్చెయ్యమందట. కాబట్టి, అతని పోర్షన్లోకి అతను వచ్చేయ్యడానికి .. మమ్మల్ని రెండు రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు” చెప్పిందావిడ.

“ అయ్యో!” షాక్ తిన్నాను.

ఎందరితో స్నేహం ఎలా ఉన్నా .. కాస్త మనసు విప్పి మాట్లాడింది ఈమెతోనే. అందుకు వయసు ఓ కారణం కావచ్చు.

“ అలా అన్నది మొదలు కాళ్ళూ, చేతులూ ఆడడం లేదు. ముందు మీకే చెప్పాలని వచ్చాను” గుమ్మం కమ్మీని పట్టుకుని నిలబడింది. ఒక్క నిముషం పాటు మాట్లాడలేకపోయినా..

“ ఆ .. ఆ అక్క అయినా వచ్చి ఈ ఇంట్లో ఉండిపోతుందా? ఏమిటి? వాళ్ళకి ముందునున్న, వీధిలో పెద్ద ఇల్లే ఉంది. తమ్ముడితో ఖాళీ చేయించిన ఇల్లు .. ఇంకెవరికో ఇచ్చుకునే బదులు .. ‘రెంటు’ ఇచ్చేటపుడు తమ్ముడిని ఉండనిస్తే ఏమయ్యిందో” అన్నా స్వగతంలా.

“ అదే కాదు, సతీష్ గారి భార్య ‘అరుణ’ మొన్నా మధ్య .. ఆ ముందు వీధిలోనే ‘బ్యూటీ పార్లర్’ కూడా పెట్టింది కదా!”

“ ఊ”

“ ఆ ఇల్లు కూడా అక్కగారిదేనట. దాన్నీ, ఖాళీ చేసేయ్యమంటే, నిన్నటి రోజున అదీ ఖాళీ చేసి ఇచ్చేసారట”

“ హా” ఆశ్చర్యపోయాను.

“ అలాగే ‘అతను’ నడుపుకునే మెయిన్ రోడ్డు మీద ఉన్న ‘కార్ వాష్’ సెంటరు ‘స్థలం’ కూడా అక్కగారిదేనట. అదీ ఖాళీ చేసెయ్యమంటే .. నిన్నటి రోజున అది కూడా ఖాళీ చేసి ఇచ్చేసారట”

ఇంకేం మాట్లాడలేదు ఈసారి.

ఆస్తులు .. అయిన వాళ్ళ మధ్య ఎంత చిచ్చు రేపుతాయో అప్పుడే తెలిసింది. వెంటనే, ఆ కుటుంబ నేపధ్యమూ కళ్ళముందు మెదిలింది. సతీష్ తండ్రి, సత్యనారాయణగారూ ఈ ఇంట్లోనే .. మూడవ ఫ్లోర్లో, ఫ్లాటు కొనుక్కున్నారు మాతో పాటే ‘పదహారేళ్ళ’ క్రిందట. అతను బ్యాంకు ఉద్యోగం చేసి, రిటైరు అయిపోయి, రియల్ ఎస్టేటు వ్యాపారంలోకి దిగారు. ఎక్కడ చవుకగా వస్తే అక్కడ భూములు కొనడం .. అమ్మడం. అలాగే ..

ఆ తరువాతి కాలంలో .. మా ఎదుటి పోర్షనూ, రెండవ సేల్లో’ కొన్నారు. అలా ఈ అపార్టుమెంటులో అతనికి రెండు ఇళ్ళు ఉన్నాయి. ముందు కొన్నది పెద్దదైన కూతురికి ఇచ్చి, రెండవది కొడుక్కి ఇచ్చినట్లున్నారు. దానికి తోడు కూతురు ‘ హన్విత ’ భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడే ఓ ఇల్లు కొనుక్కుని స్టిర పడడమే కాదు. వీలైనపుడు మావగారికి డబ్బు పంపిస్తుంటాడట,తమ కోసం కూడా భూములు కొనమని. అలా కొన్నవి అన్నీ, తరచూ వచ్చి పోయే కూతురి పేరు మీదే ఉన్నాయన్న మాట.

మళ్ళీ ఆవిడే అంది “ అయినా, డబ్బేం చేసుకుంటార౦డీ? మొగుడో చోట .. పెళ్ళాం ఓ చోట. బ్రతికే బ్రతుకు సుఖంగా ఉండాలి కదా!” అని. ఏమీ చెయ్యలేని పరిస్తితిలో ఆవిడ అసహనాన్ని అలా వ్యక్తపరుస్తూ.

“ అదేం. లేదు లెండి. వెళ్ళాలంటే, ఆ అమ్మాయి రెండు నెలలకు ఓ సారి .. భర్త దగ్గరకు వెళ్లి రాగలదు, అమెరికా చదువుల కన్నా .. ఇండియా చదువులే మేలని, కూతుర్ని ఇంటర్మీడియట్ చదివించడం కోసం అన్నట్లూ, తండ్రి కూడా పెద్దవాడు అయిపోవడంతో ప్రస్తుతం వచ్చి ఇక్కడ ఉంటుంది ” చెప్పాను.

“ అయినా, ఎవరిష్టం వారిది లెండి. మా అన్నాచెల్లెళ్ళ౦ ‘ఇద్దరి’లో .. ఎవరు ముందు ‘పోయినా’ రెండో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయ్యాలనుకున్నాం. కానీ, ఇప్పుడే ఇలా ఖాళీ చేసేయ్యాల్సి వస్తుందనుకోలేదు ” మనసులోని మాటను చెబుతూ దిగులు పడింది.

ఆ క్షణాన్న.. నాకూ అలాంటి ఆలోచనే వచ్చింది. బ్రతికినన్నాళ్ళూ ఎలా బ్రతికినా చివరికి ఓ గూడు ఏర్పరచుకోవాలని అనుకుంటారు ఎవ్వరైనా! వీళ్ళు ఉన్న గూడుని అమ్మేసుకున్న విధివంచితులు. ఇంకా చెప్పాలంటే .. ఆ పెద్దవాళ్ళు ఇద్దరూ ఇంట్లో దిగినప్పటి ఓపికలతో ఇప్పుడు లేరు. ఆవిడ అయితే, సందు చివరన ఉన్న మందుల షాపుకే వెళ్ళలేకపోతుంది. అన్నగారూ అంతే, బయట నుంచి వచ్చి క్రింద కారిడార్లో కాస్సేపు కుర్చీలో కూర్చొనిదే .. లిఫ్ట్ ఎక్కరు. వీళ్ళకు చేసి పెట్టడానికి కూడా మరెవ్వరూ లేరు. ఇవి అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఒక్క ‘కొడుక్కి’ తప్ప.

భార్యకు నచ్చచెప్పుకోలేడా? చెప్పేవాళ్ళులేక గాని. అంతలోనే తేరుకుని “ అయితే, సతీష్ ఖాళీ చేసే .. ఆ అక్కగారి పోర్షన్ అయినా ఇవ్వమని అనకపోయారా?” సమస్య అలా తీరిపోతుంది అనుకుంటూ.

“ అదీ అయ్యింది. అంత అద్దె మీరు భరించలేరు .. ఎనిమిది వేల అద్దె, ఎనిమిది వందల మెయింటినెన్సూ .. మీకు కష్టం అన్నాడు”. అది రోడ్డు ఫేసింగ్ లో ఉన్న .. విశాలమైన ఫ్లాటు. పైగా కప్ బోర్ద్సూ, బయట అంతా గ్రిల్సూ. ఇక మాట్లాడడానికి ఏముంది? ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాక .. లేవలేని వాళ్ళకి డబ్బు కోసం అయినా, ఎవరు .. ఎన్నాళ్ళు ఆశ్రయం ఇస్తారు? ‘అయిన’ వాళ్ళకే మనుషుల మీద ఆసక్తి లేకపోతే, బయట వాళ్ళకు ఏమిటి? వీళ్ళు కాకపోతే, మరొకళ్ళు వచ్చి ‘అద్దె’ ఇస్తారు. ‘గ్రాసం’ లేకపోయినా ఓ పూట పెడతారు గానీ .. ‘వాసం’ లేకపోతే ఎవ్వరూ చేరదియ్యరు అనేది ఓ తెలిసినావిడ. అదేదో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను.

ఆ రోజ౦తా మనసు మనసులో లేదు, వాళ్ళ పరిస్థితిని తలుచుకుని. రోజంతా ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ .. బాధ పడుతునే ఉంది ఆవిడ. కూర్చున్న పీట కదిలి పోతే, ఎవరికి మాత్రం స్థిమితం?

ఆ సాయంత్రం ..

ఎక్కడికో వెళ్లి .. నీరసపడుతూ వచ్చింది. జారిపోయే, నైలెక్సు చీరేను ఎగదోపుకుంటూ.. అవైతే, కాస్త సబ్బులో పెట్టి, జాడించుకుంటే సరిపోతుంది. పనిమనిషి ఉతుకు నచ్చక .. ఆ వయస్సులోనూ ఆవిడే కష్టపడుతుంది.

పండక్కి గుమ్మానికి కట్టిన .. పూలమాలలు ఎండి పోవడంతో తీసేస్తూ, అక్కడే ఉన్న నన్ను చూసి ..

“ మా పనిది, ఈ చుట్టుప్రక్కల పదకొండు ఇళ్ళు చేస్తుంది కదా! దానికేమన్నా

చెబితే పని అవుతుందేమో! నని చెప్పా. అలా చెప్పినందుకు .. ప్రక్కనున్న ‘సుజనా అపార్టుమెంటు’లోకి తీసి కెళ్ళింది. నేల మీద పోర్షను. ఓ మెట్టు ఎక్కాల్సిన పని లేదు అనుకున్నా. అద్దె కూడా ఫర్వాలేదు .. దీని అంతే, ఐదువేలే. అయితే, బాత్రుంలు ‘బయట’ కు ఉన్నాయి. రాత్రి పూట బయటకు వెళ్ళాలంటే కష్టం కదా! వచ్చేసాను” చెప్పిందావిడ. ఇప్పుడు నేను శ్రోతనే. ఆవిడ ఏం చెబితే అది వినడమే.

“ మా అన్నయ్యని ‘తిరుమలరావు’ వీధిలో ఏమైనా ఉంటాయేమో కనుక్కోమన్నాను. అక్కడ తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది. క్రింద పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందేమోనని. అక్కడికైతే మా ‘పని’ది రాలేదు. అంతదూరం. మళ్ళీ అక్కడెవరు దొరుకుతారో నాకు ” తలుపుకి ఉన్న తాళం తీస్తూ చెప్పింది ఆవిడ.

ఆవిడ కళ్ళ ముందు అంతా చీకటి. అన్నీ సమస్యలే. ఆ వయస్సులో ఒకళ్ళు వండి పెడితే, తిని సుఖంగా ఉండాల్సిన పరిస్తితి. అయితే, ఆవిడకు అది సాధ్యపడడం లేదు. తనతో పాటు మరొకరికీ వండిపెట్టాలి. జీవిత చరమాంకంలోనూ వదలని కష్టం. ఒకప్పుడు సంపాదించుకుని, మహారాణిలా బ్రతికిన ఆమె, అభిమానం చ౦పుకుని కొడుకు ఇంటికి వెళ్ళినా .. కోడలి నిరాదరణను తట్టుకోలేక పోతానేమో! నన్న భయం.

కొడుకుతో ఏమైనా అంటే “ నువ్వు వచ్చేస్తే, మామయ్య ఒంటరి వాడైపోతాడు కదే! అంటాడు. లేవలేని తల్లి కన్నా .. మేనమామ భాద్యతే ఎక్కువన్నట్లు. ఇంతలో .. బయటకు వెళ్ళిన అన్నగారు కూడా వచ్చారు.

“ ఏమయ్యింది? కనుక్కున్నావా?” అడిగింది ఆత్రంగా గుమ్మంలోనే. నేనేం వాళ్ళకి కొత్తదాన్ని కాదు.

“ ఆ.. నేల మీద ఏమీ లేవు. మూడో అంతస్తులో ఉన్నాయి అంటే, వెళ్ళబోయాను. రెండు అంతస్తులు ఎక్కే సరికి, ఆయాసం వచ్చింది. ఇక వెనక్కి వచ్చేసాను” చెప్పాడతను. అతనికీ డెబ్బై అయిదు పైనే.

“ మెట్లు అంటే అసలు వెళ్ళాల్సిన పనే లేదు, మీరు ” చెప్పాను. అలా మాట కలిపినందుకో! ఏమో! ..

“ ఆ మధ్య .. మీరో ఇల్లు కొన్నారు కదా!” అడిగాడు ఆశగా నా వైపు చూస్తూ .. ఆశ ఎంత బలియమైనదో అతన్ని చూస్తేనే తెలిసింది.

సంవత్సరం క్రిందట .. రిటైరుమెంటు డబ్బుల్తో, ఉన్న అపార్టుమెంటులోనే, ఒక పోర్షన్ అమ్మకానికి వస్తే, డబ్బులు బ్యాంకులో ఉంటే, ‘ఇన్కంటాక్స్’ సమస్య అని .. కొన్నాను. ఇప్పుడు అందులో అబ్బాయి వాళ్ళు ఉంటున్నారు.

“ మా అబ్బాయే వచ్చి ఉంటున్నాడు” చెప్పాను, నేను మీకేం సహాయం చెయ్యలేను అన్న అర్ధం వచ్చేలా.

విషయం సద్దుమణిగినాక .. మా శ్రీవారితో అన్నాను ..

“ ఇక నుంచీ సతీష్ వాళ్ళు వచ్చి ఉంటారన్న మాట, నలుగురు మనుషులు వాళ్ళు, ఆ పిల్లాడు అసలే అల్లరిగాడు, కాలు నిలవదు. హడావుడిగా ఉంటుంది ఇంటి ముందు” అని.

నాకు ఆ సతీష్ మీద అంత మంచి అభిప్రాయంలేదు. ఎసోసియేషన్ మీటింగ్స్లో అతను అందరి మీదా నోరు పారేసుకుంటు౦టాడు. ‘ఆడూ, ఈడూ’ అంటూ గట్టిగా మాట్లాడతాడు. అందరూ వాళ్ళ .. నాన్న సత్యనారాయణగారి ముఖం చూసి, సర్దుకుపోతూ ఉంటారు. అందుకే, వాళ్ళు వస్తారంటే, ఇప్పటి నుంచే కాస్త అలజడిగా ఉంది మనసులో.

“ అతను ఏమీ రాడు. ఏదో, వీళ్ళని ఖాళీ చేయించే ఆలోచన .. అంతే” అన్నారు.

“ అలా ఎలా తెలుసు” అడిగాను ఆశ్చర్యంగా. ఎందుకైనా క్రిందికి వెళ్ళినప్పుడు ..

అతను కనిపించి చెప్పాడు గానేమో! అని. ఆయన మాట్లాడలేదు.

‘అవును’ అంటే, నేను మళ్ళీ ఆవిడతో అనేస్తాననుకున్నారో! ఏమో! మరో నాలుగు రోజులు గడిచినా వాళ్ళ సమస్య తీరలేదు. ఈ కరోనా సమయంలో ఊరిలొ చాలా ఇల్లు ఖాళీ అయినా .. అద్దెలు ఏవీ ఎనిమిది వేలకు తక్కువ లేవు. కొన్ని చోట్ల, అయిదు అంతస్తుల పైన ‘పెంట్ హౌస్లు’ మాత్రమే ఉన్నాయి. అంత చివర ఉండ లేక .. వెళ్లి చూసే ప్రయత్నమూ చెయ్యలేదు. తరచూ ఫోన్లోనే ఉంటుంది ఆవిడ. “ అబ్బే, ఇండివిడ్యువల్ హౌస్ వద్దు, అపార్టుమెంటు అయితేనే, సెక్యురిటీ ఉంటుంది. అలాంటి ఇళ్ళలోకి వెళ్లి .. ఆ కడుగుళ్ళూ, తుడుపులూ నేను చెయ్యగలనా” అంటుంది ఎవరితోనో!

నాలుగు రోజుల తరువాత ఆవిడే వచ్చి ..

“ మనింటిలోనే, రెండవ ఫ్లోర్లో .. ఆ బట్టల దుకాణం వాళ్ళు ఖాళీ చేసిన పోర్షన్

ఖాళీగా ఉందిట ” చెప్పింది సంతోషంగా.

“ హా! ఇంకా అది ఖాళీగానే ఉందా! నాలుగునెలల నుంచీ” నేనూ సంతోష పడ్డాను.

చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊర౦తా తిరిగినట్లు అయ్యింది. అయితే, దానికి ‘

టు-లెట్ ‘బోర్డు పెట్టలేదు. వాళ్ళు ఖాళీ చేసేముందు ఆ ఇంటి అతనికి ‘ కరోనా’ వస్తే.

అక్కడే ఉండి, తగ్గిన తరువాతే .. వెళ్లారు.

అప్పుడు అన్నీ రోజులూ .. మున్సిపాలిటీ వాళ్ళు అ ఇంటి ముందు ఎక్కువ మోతాదులో బ్లీచింగు జల్లి, సానిటైజ్ చేసేవాళ్ళు. అందుకేనేమో ఖాళీ అయిన అన్ని రోజులైనా ఎవరూ వచ్చింది లేదు. ఇప్పుడు ఈవిడ కాలికి తగిలింది.

“ అద్దే .. ఏడువేల అయిదు వందలు చెబుతున్నారు. ఇంటి ఓనర్స్ ఇక్కడ ఉండరట. కొడుకు విజయవాడలో డాక్టరు అయితే, వెళ్లి అక్కడ ఉండిపోతున్నారట. మన ‘శ్రీధర్’ గారు ఏ విషయమూ రేపు చెబుతానన్నారు” చెప్పింది.

ఆ శ్రీధరూ .. ఈ ఇంట్లో వాడే, ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ, దగ్గర లేని వాళ్ళ ఇళ్ళకి ‘కేర్ టేకర్లా’ వ్యవహరిస్తాడు. ఇంటి పనులు అంటే, సున్నాలు వేయించడం, రిపేర్లు వస్తే చేయించడం .. మాత్రమే కాదు, ఇళ్ళ అమ్మకాల బేరాలు చూసిపెట్టడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. తెలివితేటలు ఉంటే డబ్బు సంపాదించడం సులువే. దానికి పెద్ద చదువులు అవసరం లేదు. ఆ మరునాడు ..

“ ఆ ఇంటికి రెండు నెలల ఎడ్వాన్సు ఇచ్చేశాను. మా అబ్బాయి డబ్బు పంపిస్తాను. ఇబ్బంది పడవద్దు అన్నాడు ” చెప్పింది నిశ్చింతగా.

“ పోన్లెండి”

“ శ్రీధర్ గారు ఫోన్లో ‘ఇంకా ఓపికలో ఉన్న వాళ్ళే. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. బయటకీ వెళ్లి వస్తుంటారు’ అంటూ, చెప్పడంతో వప్పుకున్నారు .. ఆ ఇంటి ఓనర్లు” అంటూ.

అలా చెప్పకపోతే, అతని ‘కమీషన్’ అతనికి రాదు. మళ్ళీ ఆవిడే “ వెనుక వీధిలో నేల మీదే ఒక ఇల్లుంది. అద్దె .. దీనిలానే అయిదు వేలే. అయితే, ఇంటి ఓనర్లు ప్రక్కనే ఉంటారు. వాళ్ళూ ‘మా’ బ్రాహ్మలే. అయితే, మాత్రం .. ఇంటి ఓనర్లు ప్రక్కనే, ఉంటే ఇబ్బంది. అక్కడ తుడవలేదు .. ఇక్కడ కడగలేదు అంటే, కష్టం. అసలే ఓపిక లేని దాన్ని. అందుకే అది వద్దనుకున్నా” చెబుతుంటే వింటున్నాను.

“ అందుకే. ఏమైతే అయ్యిందని, దీనికి ఎడ్వాన్సు ఇచ్చేశాను. ఇప్పుడు మా అబ్బాయికి నా వలన .. మరో రెండున్నర వేలు అదనపు ఖర్చు” అంటూ బాధ పడింది.

“ ఏం ఫర్వాలేదు “ చెప్పాను ఒక్క పిసరు కోపంగానే. నా కోపం ఏమిటో! ఆవిడకు తెలుసు. భార్య ఇష్టపడదన్న కారణంగా ఎప్పుడూ తల్లిని ఇంటికి పిలవడు. మొన్న ‘నాలుగు’ బెడ్రూంల ఫ్లాటు, ‘ కూకట్పల్లి’ లో, ఎనభై లక్షలు పెట్టి కొనుక్కుని .. తల్లిని గృహప్రవేశానికి పిలిచి, రెండో రోజుకే రిటన్ టిక్కెట్టు కూడా తీసేసుకున్నాడు.

అసలు ‘నాలుగో బెడ్రూం’ .. ‘తన’ కోసమేనేమో! అన్న ఆశ కూడా కలగకపోలేదు ఈవిడకు.

కొడుకు నుంచి ఆ మాట వినాలనుకుంది. అలా రాలేదు. మనవరాలు ఇల్లు చూపిస్తూ చెప్పిందట “ ఈ పెద్ద బెడ్రూం అమ్మానాన్నాలది, ఆ ప్రక్కది నాది, ఆ ఎదురుది చెల్లిది. చివరిది ‘ బ్యూటీ పార్లర్ కోసం” అంటూ, ఆ గది చూపిస్తూ .. ఈ గదికి బయట మెట్ల దగ్గరికి వచ్చేలా .. ఈ డోర్ ‘ఎక్ట్రాగా’ పెట్టించింది అమ్మ. వచ్చిన వాళ్ళు, బయటి నుంచే వెళ్ళిపోయేలా ” అంటూ. కోడలు ఎన్నో ఏళ్లుగా బ్యూటీ పార్లర్ నడపడం తెలుసు. అది ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నారన్న మాట.

తనూ, వాళ్ళ ఇంటిలో సభ్యురాలేనని, చివరి దశలో ఉన్న ముసలి నాయనమ్మ అందర్లా .. వచ్చిపోయే చుట్టం కాదనీ బంధాల్నీ, అనుబంధాల్నీ గురించీ ఎవరూ చెప్పకపోతే, ‘ ఆ పిల్లలకి’ అయినా ఎలా తెలుస్తుంది? అని అనుకుంటూ వచ్చేసింది ఆవిడ.

ఆవిడ పరిస్తితి చూసి జాలి పడడం తప్ప ఎవ్వరేం చెయ్యగలరు? అవసరానికి డబ్బు పంపించే కొడుకు ‘అయినా’ ఉన్నాడని సంతోషపడడం తప్ప.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత్రి పరిచయం :

నా పేరు పి.ఎల్ ఎన్. మంగారత్నం, బి.ఎస్సీ చదివి 1984 లో రెవిన్యూ డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంటుగా జాయిను అయి, డిప్యుటీ తహసీల్దారుగా డిసెంబర్ 2018లో రిటైరు అయ్యాను. చిన్నప్పుడు బొమ్మలు బాగా వేసేదాన్ని. ఇప్పుడు రచనలు జై సమైక్యాంద్ర సమయంలో వచ్చిన సెలవులలో రెండవ సారి మొదలు పెట్టి వ్రాయడం మొదలు పెట్టాను. ఇప్పటికి 100 పైగా కధలు వ్రాసాను. త్వరలో ఒక సంకలనం కూడా వేసుకునే ఆలోచనలో ఉన్నాను.70 views0 comments

Commentaires


bottom of page