top of page

జిహ్వ చాపల్యం


'Jihva Chapalyam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'జిహ్వ చాపల్యం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


విశ్వనాథంగారు లెక్చరర్ గా చేసి రిటైరయి భార్య జానకమ్మ తో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎప్పటినుండో రమ్మంటున్న కొడుకు పిలుపు మేరకు తొలిసారిగా అమెరికాకు పయనమయారు విశ్వనాధం దంపతులు.


అక్కడ ఎయిర్ పోర్టుకు కొడుకు రవి, కోడలు సుథ వీళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళారు. స్నాన పాన భోజన కార్యక్రమాలయ్యాక వాళ్ళకోసం తెచ్చిన బట్టలు‌, వస్తువులు, పచ్చళ్ళు మొ. . నవి వాళ్ళకు ఇచ్చి ప్రయాణ బడలిక తో విశ్రాంతి తీసుకున్నారు విశ్వనాథం దంపతులు.


సుధ ఆ సాయంత్రం అత్తగారికి వంట ఇంటి సరుకులు ఎక్కడ, ఏమున్నాయో చూపించి, స్టవ్, ఒవెన్, ఎలా వాడాలో వివరించింది. వీళ్ళకోసం ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ రైస్ తెప్పించింది సుధ. మరుసటి రోజు ఉదయమే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తిని యథావిధిగా రవి, సుథలు ఆఫీసులకు వెళ్ళారు.


జానకమ్మ ఉప్మా చేసి భర్తకు పెట్టి తనూ తిని, వంటచేసే కార్యక్రమంలో పడింది. భోజనాలయ్యాక తెలుగు టీవీ ఛానెల్స్ లో ఏవో ప్రోగ్రామ్ లను చూస్తూ పొద్దు గడిపి సాయంత్రం రవి వాళ్ళు రాగానే వాళ్ళతో కబుర్లలో పడ్డారు.


జెట్ లాగ్ తో రెండు రోజులు ఇట్టే గడిచాయి. విశ్వనాథం గారికి ఏమీ తోచక, చేసే పని ఏమీ లేక, ఇరుగుపొరుగు మాట్లాడే వాళ్ళు లేక విసుగు కొట్టటం మొదలయింది.

"తన ఊరిలో అయితే సాయంత్రం అరుగుల మీద ఇరుగుపొరుగుతో చేరి పిచ్చాపాటి కబుర్లు, లోకాభి రామాయణంతో హాయిగా గడిపేవాణ్ణి " అనుకోసాగాడు. వీకెండ్స్ శెలవులకు వీళ్ళని బయటకు తీసుకెళ్లి అమెరికాని చూపించేవాళ్ళు రవివాళ్ళు.


రవి, సుధ ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటిస్తారు. రోజూ కూరగాయల ముక్కలు, బ్రొకోలీ ఆకులు, బ్రెడ్, సూప్స్, సలాడ్స్, పాలు‌, పళ్ళు, జ్యూస్ లు తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ గా వీళ్ళకు కూడా అదే. జానకమ్మ వంట వీళ్ళిద్దరికే. స్వీట్లు, జంతికలూ, కారప్పూస లాంటి చిరుతిళ్ళు తినటం విశ్వనాథంకు అలవాటు.


ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో పంటికింద నలుగుతూ ఉండాలి. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్, చిరుతిళ్ళు చాటుగా దాచుకుని తినేవాడు. అవి అయిపోయాయి. ఇహ భార్యను పిండి వంటలు చేయమని సణుగుతూనే ఉన్నాడు.


పాపం ఆవిడ కోడలితో చెపితే 'పిండి వంటలు అనారోగ్యము' అని డ్రైఫ్రూట్సు తెప్పించింది సుధ. విశ్వనాథానికి అవి ఏమూలకూ ఆనేవి కావు. జిహ్వ చాపల్యం ఎక్కువ. కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తుంటే అందరూ నిద్రలోకి జారాక నెమ్మదిగా అర్థరాత్రి కిచెన్ లో డబ్బాలు వెతుక్కుని తినేవాడు. భర్త ప్రవర్తనకు జానకమ్మ సిగ్గుతో కుంచించుకు పోతూ కోడలికంట ఎక్కడ పడుతుందో అని భయపడేది.
కిచెన్ లో ఏదో అలికిడి అయితే సుధ కిచెన్ లోకి రాగానే మామగారు డబ్బాలు వెతుక్కుని తింటున్న దృశ్యం కంటబడి‌ " ఇంతవ యస్సు వచ్చినా ఈయనకు ఇంకా ఈ జిహ్వ చాపల్యం ఏమిటి? అనుకుని ఆ విషయం మరునాడు రవితో చెప్పింది.


"నాన్నా! పరిమితమయిన డైట్ ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే మెడికల్ వసతి ఉండదు. ట్రీట్మెంట్ చాలా ఖరీదు. పైగా ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా వెంటనే చూడరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి " అని పెద్ద లెక్చలిచ్చాడు రవి తండ్రికి.


కొడుకు అలా చెప్పటం విశ్వనాథానికి చాలా అవమానకరంగా అనిపించింది. అప్పుడు ఏమీ అనలేక మిన్నకున్నాడు.


మర్నాడు వాళ్లు ఆఫీసుకి వెళ్ళాక "రాను, రాను అంటే నువ్వే అమెరికా, అమెరికా అంటూ ఎగేసుకుంటూ బయలు దేరదీశావు. నీతో పాటు నన్ను కూడా రమ్మని ప్రాణం తీశావు చూడు, ఇప్పుడేమయ్యిందో‌, ఇదంతా నీ వలననే" అని భార్య మీద విరుచుకుపడ్డాడు.


భర్తకు భార్యే కదా లోకువ. "బావుంది ఇది మరీ చోద్యం. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తప్పు మీ వద్ద ఉంచుకుని నన్ను అంటారెందుకు? అయినా రవి చెప్పిన దాంట్లో తప్పేముంది? మీ మంచికే కదా వాడు చెప్పింది. మీ తిండి యావ తగ్గించుకోవచ్చుకా. కోడలి పిల్ల ముందు సిగ్గుతో చస్తున్నాను " అంది జానకమ్మ.


"ఇంక ఇక్కడ ఇలా కడుపు మాడ్చుకుంటూ ఆ బ్రౌన్ రైస్, బ్రెడ్, ఆకులూ, అలలూ, కీరాలు, డ్రైఫ్రూట్సు తింటూ, మాట్లాడే వాళ్లు లేక ఈ జైలులో ఉండలేను. రవితో ఏదో సాకు చెప్పి టికెట్ మార్చుకుని వెళతాను. నీవు వస్తే రా!. లేకపోతే ఇంకా నాలుగు నెలలు ఇక్కడే ఊరేగు. " అన్నాడు విశ్వనాథం.


ఒకరోజున రవితో "ఒంట్లో కొంచెం నలతగా ఉంది. ఇంటి మీద బెంగ గా ఉంది. ఇండియాకు వెళ్తామురా!" అని రవిని అతికష్టం మీద ఒప్పించి బయలు దేరారు విశ్వనాథం గారు. ఈ ప్రయాణం ఇష్టం లేక పోయినా భర్త వెంట బయలు దేరింది జానకమ్మ.


తన ఊరిని, తన ఇల్లును చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయి ఇల్లంతా చిన్న పిల్లాడిలా తిరిగాడు విశ్వనాథం. వీళ్ళు వచ్చారని గమనించి ప్రక్కింటి పార్వతమ్మ వచ్చి " ఏం వదినా! అమెరికా వెళ్ళి ఆర్నెల్లు ఉంటానని అప్పుడే రెండు నెలలకే వచ్చేశారేం?" అని అడిగింది.


"ఆ ! ఏం లేదు వదినా! నీకు తెలుసుగా. ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా, మాకెంత ప్రాణమో! ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇంటి మీద బెంగ వచ్చి రవి వాళ్ళను ఒప్పించి బయలుదేరి వచ్చేశాము" అన్న భార్య సమయస్ఫూర్తి మాటలను విని మనసులో మెచ్చుకుంటూ, పేపరు చదువు కుంటున్న విశ్వనాథం గారు నవ్వుతూ, భార్య తన నవ్వును ఎక్కడ పసిగడుతుందోనని గుబురు మీసాల చాటున దాచే ప్రయత్నం జానకమ్మ దృష్టిని దాటిపోలేదు.


"ఎంతైనా మగమహారాజు. భార్యను అంత తేలికగా మెచ్చుకోరు " అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది జానకమ్మ.

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
71 views0 comments

Kommentare


bottom of page