top of page

జీవితం ఎంతో అందమైనది


'Jeevitham Entho Andamainadi' New Telugu Story

Written By Gannavarapu Narasimha Murthy

'జీవితం ఎంతో అందమైనది' తెలుగు కథ

రచన: గన్నవరపు నరసింహ మూర్తి



ఉదయం తొమ్మిది గంటల వేళ ; ఆ సమయంలో "మహాత్మా గాంధీ ఇంజనీరింగ్ కళాశాల వారి సివిల్ ఇంజ‌నీరింగ్ విద్యార్థుల పిక్‌నిక్‌" అన్న బేన‌ర్ కట్టిన ఒక టూరిస్టు వోల్వో బ‌స్సు స‌ముద్ర‌పు ఒడ్డున ఆగింది...


ఆగ‌గానే కండ‌క్ట‌ర్ త‌లుపు తియ్య‌డం, అందులోంచి ప‌రుగులు పెడుతూ విద్యార్థినీ, విద్యార్థులు కింద‌కు దిగ‌డం మొద‌లైంది. వాళ్ళంద‌రూ దిగిన త‌రువాత వాళ్ళ‌తో పాటు వ‌చ్చిన ఆ కాలేజీ లెక్చ‌ర‌ర్స్ న‌లుగురు దిగారు. వాళ్ళ‌లో సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్ ర‌ఘునాథ్‌... అంత‌ని నేతృత్వంలోనే ఇప్పుడు ఆ కళాశాల విద్యార్థులంతా పిక్‌నిక్‌కి వ‌చ్చారు...


ఆ ఇంజ‌నీరింగ్ కాలేజీ ప్రారంభించి ప‌దేళ్ళైంది... ప్ర‌తీ సంవ‌త్స‌రం కార్తీక మాసంలో ఓ ఆదివారం అన్ని బ్రాంచీల విద్యార్థులు ర‌క‌ర‌కాల ప్ర‌దేశాల‌కి లెక్చ‌ర‌ర్ల ఆధ్వ‌ర్యంలో పిక్‌నిక్‌ల‌కు వెళుతుంటారు. ఈరోజు సివిల్ ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌ను ర‌ఘునాథ్ గారు చేప‌లపాలెం బీచ్‌కి తీసుకువ‌చ్చారు. ఈ బీచ్ కొండ ప‌క్క‌న విశాల‌మైన ఇసుక దిబ్బ‌ల‌తో ఉంటుంది. దూరం నుంచి చూస్తే న‌ల్ల‌టి ఎత్తైన కొండ‌, దాన్ని ఉధృతంగా ఢీ కొడుతున్న స‌ముద్ర కెర‌టాలు, డీ కొన్న త‌రువాత ఎగిసిప‌డుతున్న తెల్ల‌టి త‌రంగాల నుర‌గ‌లు, ప‌క్క‌న విశాల‌మైన తీరం, తీరం ప‌క్కన తెల్ల‌టి ఇసుక తిన్నె, తీరాన్ని తాకుతూ వెన‌క్కి మ‌ర‌లుతున్న కెర‌టాలు... అలా ఆ ప్ర‌దేశం చాలా అందంగా ఉంది. దిగ‌న వెంట‌నే విద్యార్థినీ, విద్యార్థులంతా కొండా పక్కన రెండు టెంటుల‌ను వేసి తరువాత టిఫిన్ తిని స‌ముద్రం ఒడ్డుకి చేరుకున్నారు. వెంట‌నే అక్క‌డికి ర‌ఘునాథ్ మిగ‌తా ముగ్గురు లెక్చ‌ర‌ర్స్‌తో వ‌చ్చి ఈత‌కు దిగుతున్న విద్యార్థులతో "ఎవ్వ‌రూ లోప‌లికి వెళ్ళ‌వ‌ద్దు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశం... ఇక్క‌డ క్రితం వారం ఇద్ద‌రు విద్యార్థులు ఈత‌కి వెళ్ళిన‌ప్పుడు చ‌నిపోయార‌ట‌. కాబ‌ట్టి లోప‌లికి ఎవ్వ‌రూ వెళ్ళ వ‌ద్దు" అని గ‌ట్టిగా చెప్పాడు.


అయినా స‌రే అత‌ని మాట‌లు ఎవ్వ‌రూ విన‌లేదు... పైగా అత‌ని ముందే స‌ముద్రం లోప‌లికి వెళ్ళ‌సాగారు...


ఇంత‌లో ఆ ప్ర‌దేశంలోకి ముగ్గురు పోలీసులు విజిల్ ఊరుకుంటూ వ‌చ్చారు... వాళ్ళు లోప‌లికెళుతున్న విద్యార్థుల‌తో "ఎవ‌రూ లోప‌లికెళ్ళ వ‌ద్దు. చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన అల‌లు ఇక్క‌డ వ‌స్తుంటాయి. అవి మ‌నుషుల్ని లోప‌లికి లాగేస్తాయి" అంటూ వాళ్ళ‌కి చెప్పారు...

అదే స‌మ‌యంలో న‌లుగురు ఈత‌గాళ్ళ‌తో ఒక లైఫ్‌ బోట్ తీరంలో క‌నిపించింది... అది ఆ బీచ్ ప్రాంతంలో తీరుగుతూ ఈదుతున్న విద్యార్థుల‌ను హెచ్చ‌రిస్తూ క‌నిపించింది.

అమ్మాయిలు మాత్రం తీరంలో పాతిన పెద్ద‌పెద్ద గొడుగులు కింద కూర్చుని క‌బుర్లు చెప్పుకుంటుంటే మ‌రికొంద‌రు హౌసీ ఆడుకుంటూ క‌నిపించారు. మ‌రికొంద‌రు దూరంగా తీరం వెంబ‌డి న‌డ‌వ‌సాగేరు...

ఆరోజు ఆదివారం కావ‌డంతో చుట్టుప‌క్కల చాలా కాలేజీల పిల్ల‌లు పిక్‌నిక్‌కి రావ‌డంతో బీచంతా కోలాహ‌లంగా క‌నిపించ‌సాగింది.


ర‌ఘునాథ్ రాను రాను అక్క‌డికి వ‌స్తున్న విద్యార్థులు పెరుగుతుండ‌టంతో త‌మ క‌ళాశాల వారెవ్వ‌రో పోల్చుకోలేక ఇబ్బంది ప‌డ‌సాగేడు. అత‌ను ప్ర‌తీ అర‌గంట‌కు బీచ్ మొత్తం తిరుగుతూ విద్యార్థుల‌ను గ‌మ‌నించ సాగేడు. అత‌నికి పిక్‌నిక్‌కి వ‌చ్చే ముందు ప్రిన్సిప‌ల్ ఫోన్ చేసి "విద్యార్థులు జాగ్ర‌త్త‌. ఏదైనా జ‌రిగితే త‌ల్లితండ్రుల‌తో లేని పోని తంటా" అంటూ హెచ్చ‌రించాడు.


క్రితం సంవ‌త్స‌రం కూడా పిక్‌నిక్‌కి వ‌చ్చిన ఒక విద్యార్థి స‌ముద్రంలో మునిగి చ‌నిపోవ‌డంతో అప్ప‌ట్లో పెద్ద దుమారం రేగింది. అప్ప‌ట్నుంచీ స‌ముద్రం ద‌గ్గ‌రికి పిక్‌నిక్ అంటే లెక్చ‌ర‌ర్స్‌కి భ‌యం. ఏదైనా జ‌రిగితే త‌మ‌ని బాధ్యుల్ని చేస్తార‌ని వాళ్ళ‌ భ‌యం.


ఇంత‌లో స‌మ‌యం ఒంటి గంట కావ‌డంతో ర‌ఘునాథ్ గ‌ట్టిగా విజిల్ ఊది అంద‌ర్ని లంచ్‌కి ర‌మ్మ‌న‌మ‌ని చెప్పాడు. అత‌నితో వ‌చ్చిన మిగ‌తా ముగ్గురు కూడా తీరం అంతా తిరిగి వాళ్ళ క‌ళాశాల విద్యార్థుల్ని పిలుచుకువ‌చ్చారు...


అర‌గంట త‌రువాత అంద‌రూ టెంట్లు ద‌గ్గ‌రికి వ‌చ్చారు. వెంట‌నే బ‌స్సులో తాము తెచ్చిన లంచ్ పేకెట్స్ అంద‌రికి ఇచ్చారు. న‌లుగురు విద్యార్థులు, ఇద్ద‌రు అమ్మాయిలు అంద‌రికీ స‌ర్వ్ చేసారు... భోజ‌నం చేస్తున్నంత సేపు విద్యార్థినీ విద్యార్థులంతా మంచి మంచి జోకులు చెప్పుకుంటూ ఆనందంగా గ‌డిపారు...


ఇంత‌లో విద్యార్థుల్లో అల‌జ‌డి మొద‌లైంది... అంద‌రి ముఖాల్లో ఆందోళ‌న! ర‌ఘునాథ్‌కి ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. వెంట‌నే లేచి వాళ్ళ ద‌గ్గ‌రికి వెళ్ళి "ఏం జ‌రిగింది" అని అడిగాడు.

"సార్‌! మోహ‌న్ క‌నిపించ‌టం లేదు..." అని చెప్పాడు ఒక విద్యార్థి.


"ఎవ‌రు? ఫైనల్ ఇయర్ మోహ‌నా? లంచ్‌కి వ‌చ్చాడా? అత‌న్ని ఎవ‌రైనా చూసారా?" అని ఆదుర్ద‌గా అడిగాడు.


"సార్‌! వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచీ అత‌ను ఒక్క‌డే వంట‌రిగా కూర్చున్నాడు. మేము ర‌మ్మ‌న్నా అత‌ను రాలేదు. అత‌ను ఎందుకో ఈ రోజు డ‌ల్‌గా ఉన్నాడు" అని మ‌రికొంద‌రు విద్యార్థులు చెప్పేరు.

అంతే! ర‌ఘునాథ్ ఒక్క‌సారిగా తీరం ద‌గ్గ‌రికి ప‌రిగెత్తాడు. అత‌ని వెన‌కే మిగ‌తా లెక్చ‌ర‌ర్లు, విద్యార్థులు... అంద‌రి ముఖాల్లో ఆదుర్ద‌... అత‌నికి ఏం జ‌రిగిందోన‌న్న భ‌యం.


ర‌ఘునాథ్ అక్క‌డ ద‌గ్గ‌ర్లోనే తిరుగుతున్న పోలీసుల‌కు ప‌రుగున వెళ్ళి మోహ‌న్ క‌నిపించ‌టం లేద‌న్న విష‌యాన్ని చెప్పాడు. వాళ్ళు వెంట‌నే వాకీ టాకీ తీసి లైఫ్ బోటు వాళ్ళ‌ని హెచ్చ‌రించారు. అంతే... అంద‌రూ ప‌రుగులు... ఏం జ‌రుగుతునాదో తెలియ‌ని పరిస్థితి !... అమ్మాయిలు భ‌యంతో ఒడ్డున నిల‌బ‌డి కెర‌టాల వైపు చూస్తునారు...


దూరంగా లైఫ్‌బోట్ క‌నిపిస్తోంది. అది కెర‌టాల ఉదృతికి కింద‌కూ మీద‌కు ఎగురుతూ వ‌స్తోంది... పోలీసులు ప‌రుగున ఆ లైఫ్ బోటు ద‌గ్గ‌రికి వెళుతునారు...

ప‌దినిముషాల త‌రువాత ఆ బోటు తీరం చేరింది. అందులోంచి న‌లుగురు ఈత‌గాళ్ళు దిగారు... అందులో మోహ‌న్ ఉన్నాడు.


అంద‌రి ముఖాల్లో ఆందోళ‌న‌... ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఇంత‌లో ఒక ఈత‌గాడు వ‌చ్చి "ఇత‌ను కొట్టుకు పోతుంటే అదృష్ట‌వ‌శాత్తూ మా కంట‌బ‌డ్డాడు. వెంట‌నే మేము వెళ్ళి ఇత‌న్ని ర‌క్షించాము... కొద్దిగా ఆల‌స్యం అయితే ఇత‌ని శ‌వం కూడా దొరికేది కాదు" అని చెప్పాడు.


ఆ మాటలు విన్న ర‌ఘునాథ్‌కి ఆనందం క‌లిగింది. విద్యార్థుల ముఖాల్లో సంతోషం... వాళ్ళు మోహ‌న్ని చూసి కేరింత‌లు కొట్ట‌డం మొద‌లు పెట్టారు. వెంట‌నే అత‌న్ని టెంట్ ద‌గ్గ‌రికి తీసుకెళ్ళారు...


కొద్దిగా నీళ్ళు తాగ‌డంతో క‌డుపు ఉబ్బింది. ఇంత‌లో పోలీసులు మోటారు సైకిల్‌తో అక్క‌డికి ద‌గ్గ‌ర్లో ఉన్న ఊళ్ళోకి వెళ్ళి డాక్ట‌ర్ని తీసుకొచ్చారు. అత‌ను మోహ‌న్ని ప‌రీక్ష చేసి మందులిచ్చాడు. రెండు ఇంజ‌క్ష‌న్లు చేసాడు. అర‌గంట త‌రువాత అత‌ని ప‌రిస్థితి మెరుగైంది. లేచి కూర్చున్నాడు. ర‌ఘునాథ్ విద్యార్థులంద‌ర్నీ అక్క‌డ ఉండొద్ద‌ని చెప్పాడు. దాంతో వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయారు.

ర‌ఘునాథ్‌కి మోహన్ ని చూస్తే కావాల‌ని స‌ముద్రంలోకి వెళ్ళిన‌ట్లు అనిపించింది. బ‌హుశా ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసాడేమో అన్న అనుమానం వ‌చ్చింద‌త‌నికి... కొద్దిసేప‌టికి అక్క‌డి విద్యార్థుల్లో ఫైన‌లియ‌ర్ విద్యార్థుల‌ను పిలిచి అత‌ని గురించి అడిగాడు.


వాళ్ళ‌లో గిరిధ‌ర్ అనే కుర్ర‌వాడు మోహ‌న్ కి క్లోజ్ ఫ్రెండ్‌. అత‌ను ర‌ఘునాథ్‌తో "సార్‌, వారం క్రితం జ‌రిగిన కేంప‌స్ సెల‌క్ష‌న్స్‌లో మోహ‌న్‌కి జాబ్ రాలేదు. ఆరునెల‌ల నుంచి దాని కోసం వాడు ఎంతో బాగా ప్రిపేర్ అయ్యాడు. కానీ ఎందుకో అత‌ను సెల‌క్ట్ కాలేదు. అప్ప‌ట్నుంచీ అత‌ను డిప్రెష‌న్‌లోకి వెళ్ళిపోయాడు; అందుకే వాళ్ళ‌మ్మ గారు ఈ రోజు పిక్‌నిక్ వెళ్ళొద్ద‌ని చెబుతున్నా వాడు విన‌కుండా వ‌చ్చాడు. బ‌హుశా ఇందుకోస‌మేనేమో" అని చెప్పాడు.


ర‌ఘునాథ్‌కి ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా అర్థ‌మైంది. అత‌ను కేంప‌స్ సెల‌క్ష‌న్లో జాబ్ రానందుకు నిరాశ చెంది ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసాడు. అదృష్ట‌వ‌శాత్తూ గ‌స్తీ బృందం దృష్టిలో ప‌డ‌టంవ‌ల్ల బ‌తికాడు. లేక‌పోతే చాలా ఘోరం జ‌రిగిపోయి ఉండేది. కాలేజీకి మ‌రింత చెడ్డ‌పేరు వ‌చ్చి ఉండేది. ఏదేమైనా ఒక గండం గ‌డిచింద‌ని అత‌ను ఆనందించాడు.


ఇంత‌లో పోలీసులంద‌రూ ఒడ్డుకి ప‌రిగెత్తుతుండ‌డం క‌నిపించింది. వాళ్ళ వెన‌కాల చాలామంది ఆడా, మ‌గా వెళుతునారు...

ర‌ఘునాథ్‌తోపాటు కొంద‌రు విద్యార్థులు కూడా అక్క‌డికి వెళ్ళారు... అక్క‌డ ఒక చిన్న పడవ లో ఒక వ్య‌క్తి ఉన్నాడు...


పోలీసులు అక్క‌డ జ‌నాల‌ను దూరంగా నెట్టి ఆ వ్య‌క్తిని బ‌య‌ట‌కు తెచ్చారు. అత‌ను ఒడ్డుకి రాగానే అత‌ని భార్య పిల్ల‌లు కాబోలు అత‌ని ద‌గ్గ‌రికి వెళ్ళి ఏడుస్తూ క‌నిపించారు.

అప్పుడు ఒక పోలీసు వ‌చ్చి ర‌ఘునాథ్‌తో "ఇత‌ను ప‌క్క‌నే ఉన్న చేప‌ల పాలెం మత్సకారుడు ; పేరు సింహాద్రి. మూడురోజుల క్రితం సముద్రంలోకి చేపల వేట‌కోసం వెళ్ళాడు. వ‌స్తున్న‌ప్పుడు ప‌డ‌వ కెర‌టాల తాకిడికి మునిగిపోయింది. మిగ‌తా జాల‌ర్లంద‌రూ వ‌చ్చేసారు కానీ ఇత‌ను రాలేదు. అంద‌రూ చ‌నిపోయాడ‌నుకున్నారు. అదృష్ట‌వ‌శాత్తూ సముద్రం మధ్యలో అత‌ను ఈదుతూ కనిపించడంతో ఒక ప‌డ‌వ వాళ్ళు చూసి అత‌న్ని ర‌క్షించి ఇక్క‌డికి తీసుకొచ్చాఋ; విచిత్రం ఏమిటంటే అతను ఒక రోజంతా ఈదుతూనే ఉన్నాడ‌ట‌... అలా ధైర్యంగా ఈద‌డం వల్లే మ‌రో ప‌డ‌వ కంట ప‌డ్డాడు. లేక‌పోతే చ‌నిపోయేవాడు... అత‌ని భార్యా పిల్ల‌లు అదృష్ట‌వంతులు" అని చెప్పి వెళ్ళిపోయాడు.


ప‌ది నిముషాల త‌రువాత అత‌ను భార్యా పిల్ల‌లతో కలసి ఊరివైపు వెళుతూ క‌నిపించాడు; ఈ విష‌యం తెలిసిన అక్కడే వున్న ఒక వార్తా ఛాన‌ల్ విలేఖ‌రి అత‌న్ని "ఒక‌రోజంతా స‌ముద్రం మ‌ధ్య‌లో ఈదుతూ ఉన్నావు క‌దా... చ‌నిపోతాన‌ని భ‌యం వెయ్య‌లేదా?" అని మైకు పెట్టి అడిగాడు.

"నిజంగా అయితే భ‌యంతో స‌నిపోయేవాడినే... కానీ మునిగిపోతున్న‌ప్పుడు నాకు నా భార్యా పిల్ల‌లు గుర్తుకు వ‌చ్చారు. నేను లేక‌పోతే ఆళ్ళు బ‌త‌క‌నేరు. అందుకే ఆళ్ళ‌కోసం ఎలాగైనా బ‌త‌కాల‌ని తెగించి ఈద‌డం మొద‌లెట్టినాను. ఈత కొడుతూ ఆ సంద్రం తల్లిని నా భార్యా పిల్ల‌ల కోసం న‌న్ను బ‌తికించ‌మ‌ని ఏడుకున్నాను... ఆ అమ్మే నన్ను కాపాడింది"; అని చెప్పి అత‌ను భార్య‌, పిల్ల‌ల‌తో కలసి వెళ్ళిపోయాడు;


గంట త‌రువాత ర‌ఘునాథ్ టెంట్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో టెంటులో మోహ‌న్ ఒక్క‌డే వంట‌రిగా ఉన్నాడు.


ర‌ఘునాథ్ అత‌నితో "మోహ‌న్‌! ఈరోజు నువ్వు చాలా త‌ప్పు చేసావు. చ‌నిపోయి ఏమి సాధిస్తావ్ చెప్పు? నువ్వు చ‌నిపోతే నీ మీద ఆశ‌లు పెట్టుకున్న నీ త‌ల్లితండ్రులు ఏమి కావాలి చెప్పు? వాళ్ళ గురించి ఒక్క క్ష‌ణం ఆలోచిస్తే నువ్వీ ఆత్మ హత్యా ప్ర‌య‌త్నం చెయ్య‌క‌పోదువు. ఇందాక నువ్వు ఆ జాల‌రి సింహాద్రిని చూసావా? స‌ముద్రం మ‌ధ్య‌లో మునిగిపోతూ కూడా అతను తన భార్యా పిల్ల‌ల కోసం బ‌త‌కాల‌న్న‌ఒకే ఒక కోరిక‌తో ధైర్యంగా ఈది ప్రాణాల‌ను ర‌క్షించుకున్నాడు. ఏమి చ‌దువుకోని ఒక జాల‌రే బ‌త‌కాల‌ని అంత ధైర్యం చేస్తే ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్న నువ్వు పిరికిత‌నంతో ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించ‌డం త‌ప్పు కాదా? చ‌నిపోయి ఎవ‌ర్ని సాధిస్తావ్‌? వెయ్యి చావుల క‌న్న ఒక బ‌తుకు గొప్ప‌దంటారు; మనిషి కి నిరాశ పనికిరాదు; అది మనిషిని నిలువునా ముంచేస్తుంది;


"నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క కన్నా తక్కువేనురా

సంద్ర మెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా" అన్నాడొక కవి;


గాలిలో ఎగిరే పక్షిని చుస్తే ఎందుకు బతకాలో తెలుస్తుంది; అలాగే నీటిలో ఇదే చేపని చూస్తే బ్రతుకు విలువ తెలుస్తుంది; అవి ఎన్నడూ నిరాశ చెందవు; బ్రతకాలని నిరంతరం అవి పోరాడుతుంటే మనిషిగా పుట్టిన నువ్వు పిరికితనంతో ఆత్మ హత్యకి ప్రయత్నించడం సిగ్గు పడవలసిన విషయం; నీకు ఆలోచించే మెదడు ఇచ్చాడు; రక్షించుకునే తెలివితేటలిచ్చాడు; దాంతో జీవన పోరాటం చెయ్యాలి ; ఈ సృష్టిలో అన్నింటికన్నా గొప్పది మనిషి జన్మ; దాన్ని మనం సార్ధకం చేసుకోవాలి గానీ పాడుచేసుకోకూడదు;


ఉద్యోగం రాక‌పోతే ఏమైపోతుంది చెప్పు? నాకు నాలుగు సంవ‌త్స‌రాలు ఉద్యోగం రాలేదు. కానీ ఆ త‌రువాత ప్రొఫెస‌ర్ని అయ్యాను. పిరికిత‌నంతో చ‌నిపోతే సాధించేదేమీ ఉండ‌దు... పిరికి వాళ్ళే చ‌నిపోతారు. ధైర్య‌వంతులు బ‌తుకుతో పోరాడ‌తారు... ఇంకెప్పుడూ ఇటువంటి ప‌నులు చెయ్య‌కు; బాగా చదివి మ‌ళ్ళీ ప్ర‌య‌త్నం చెయ్యి... మంచి ఉద్యోగం, అందమైన జీవితం రెండూ నిన్ను వెతుక్కుంటూ వ‌స్తాయి" అని చెప్పాడు.


వెంట‌నే మోహ‌న్ ప‌రుగున వ‌చ్చి ర‌ఘునాథ్ కాళ్ళ‌మీద ప‌డి "నన్ను క్షమించండి సార్‌! మా త‌ల్లితండ్రుల మీద ఒట్టువేసి చెబుతునాను. ఇంకెప్పుడు ఇటువంటి ప‌నులు చెయ్య‌ను" అన్నాడు క‌ళ్ళు తుడుచుకుంటూ.

(స‌మాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.

68 views0 comments
bottom of page