top of page

కల కాదిది!

Writer: Divakarla PadmavathiDivakarla Padmavathi

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #KalaKadidi, #కలకాదిది, #TeluguCrimeThriller


Kala Kadidi - New Telugu Story Written By - Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 11/03/2025

కల కాదిది - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఒక్కసారి వాతావరణం హఠాత్తుగా చల్లబడిపోయింది. నలువైపులనుండీ కారుమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఉండుండి మెరుపులు మెరుస్తున్నాయి. పిడుగులు, ఉరుములతో ప్రకృతి దద్దరిల్లిపోతోంది. సమయం ఆరుగంటలు దాటనప్పటికీ చిక్కటి చీకటి అంతటా అలుముకుంది. ఎక్కణ్ణుంచో వస్తున్న తడిసిన మట్టివాసన గుబాళింపు దగ్గర్లోనే ఎక్కడో వానపడుతున్న సూచనిస్తోంది. 


స్కూటీ చెడిపోవడంతో దాన్ని గారేజిలో అప్పచెప్పి బయలుదేరిన అర్చన తొందరగా ఇంటికి చేరాలని నడక వేగం పెంచింది. ఆమె ఎంత వేగంగా నడుస్తుందో, అంత వేగంగా ఆమె మదిలో ఆలోచనలు కూడా సుడులు తిరుగుతున్నాయి. ఆనంద్ జ్ఞాపకాలు మనసులో మెదలగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. పూర్తిగా వారం రోజులైంది ఆనంద్ తన నుండి దూరమై. ఇప్పటికీ జరిగిన సంఘటనని నమ్మలేకపోతోందామె. 


తనతో కలిసి చదువుకున్న ఆనంద్పై ఆమె మనసు పారేసుకుంది. అతనికి కూడా అర్చనంటే ఇష్టమే. అతనికి ఆమె తోటిదే లోకం అయింది. ఆనంద్ ప్రేమలో పడి ఆమె కూడా మైమరిచిపోయింది. ఒకర్నొకరు విడవలేని స్థితికి వచ్చిన వాళ్ళిద్దరి సంగతి ఇంట్లో తెలిసింది. ఆ పెళ్ళికి తన ఇంట్లో వాళ్ళు సుముఖంగా లేరు, ముఖ్యంగా తన తండ్రి. వాళ్ళ ప్రేమనంగీకరించడానికి ఆస్తులు, అంతస్తులతో పాటు కులం కూడా అడ్డు వచ్చింది. 


అర్చనని తన చెల్లెలి కొడుకైన శంకర్ కిచ్చి పెళ్ళి చెయ్యాలని పట్టుబట్టాడు తండ్రి రాఘవరావు. అయితే, ఆనంద్ ని తప్ప తను ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోనని తెగేసి చెప్పడంవల్ల అతను కూడా దిగిరాక తప్పలేదు. పెళ్ళి నిశ్చయమై నెల రోజుల్లోకి వచ్చింది. అప్పుడు జరిగింది ఆ దుర్ఘటన. వాళ్ళ ప్రేమకి సాక్ష్యాలుగా నిలిచిన పంచ భూతాలు కూడా జరగబోయేది ఆపలేకపోయాయి. 


ఆనంద్ ఓ రోజు ఆఫీసు పని మీద మరో ఊరు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు రోడ్దు ప్రమాదానికి గురై ఆ పంచభూతాల్లోనే లీనమైయ్యాడు. ఘాట్ రోడ్డుపై అతని బైక్ ని వెనకనుంచి గుద్దిందో ట్రక్. బైక్ రైలింగ్కి ఢీకొని ఆగిపోతే, ఆనంద్ మాత్రం ఎగిరిపడి కిందనున్న లోయలోకి జారిపోయాడు. వంద అడుగుల లోతున్న ఆ లోయలోనుండి అతని శరీరం వెలికి తీయడం అసాధ్యమైన పనైనా స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం కలిసి సెర్చ్ ఆపరేషన్ చేసారు. కానీ అతని బాడీ దొరకలేదు. అంత మీదనుండి కిందకి పడితే ప్రాణాలతో మిగలడం చాలా కష్టం. అందుకే, అతను చనిపోయాడనే నిర్ధారణకు వచ్చారందరూ. 


ఇది జరిగి వారం రోజులు దాటింది. ఈ వార్త విన్న అర్చన స్పృహతప్పి పడిపోయింది. ఆ వార్త నమ్మశక్యం కాలేదామెకి. తల్లి తండ్రులెంత నచ్చచెప్పినా ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ, ఆలోచిస్తూ కూర్చొనేది. అలా ఇంట్లో కూర్చొని ఆ జ్ఞాపకాలతో మనసు వికలమవడం మినహా మరేమీ లేదని తల్లి నచ్చ చెప్పడంతో ఆ రోజు ఆఫీసుకెళ్ళింది. 


ఆనంద్ ఆలోచనలతో సతమతమవుతూ నడుస్తున్న అర్చన వెనక పెద్ద మెరుపు మెరిసింది. ఎందుకో తలతిప్పి చూసేసరికి ఆ మెరుపు వెలుగులో ఎవరో వడివడిగా తన వంకే వస్తున్నట్లు అనిపించి ఆగింది. ఆ వ్యక్తి దగ్గరైయ్యేసరికి అతని మొహంలోకి చూసిన అర్చన తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం కలిగాయామెకి. అతనెవరో కాదు తన ప్రాణంలో ప్రాణమైన ఆనంద్! అతన్ని ఆ వేళప్పుడు, అక్కడ అలా చూస్తాననుకోలేదు ఆమె. సంభ్రమంతో కళ్ళు పెద్దవయ్యాయి. గుండె గొంతులోకి వచ్చింది.


"ఆనంద్!.. " అందామె. కళ్ళల్లో నీళ్ళు నిండాయి. తనున్న పరిసరాలు మర్చింది. 


"అర్చనా.. " అంటూ మరింత దగ్గరకు వచ్చాడతను.

 

"ఆనంద్!.. ఆనంద్, నువ్వు నా కోసం తప్పకుండా వస్తావని నాకు తెలుసు. నన్ను విడిచి ఎక్కడికెళ్ళావు ఇన్నాళ్ళూ!" ఆమె కళ్ళు నీళ్ళతో నిండాయి. 


"అర్చనా నేనెక్కడికీ వెళ్ళలేదు, నీ గుండెల్లోనే ఉన్నాను. అయినా నేనెక్కడికి వెళ్ళిపోతాను! మనిద్దర్నీ ఈ పంచభూతాలు కూడా వేరు చేయలేవు తెలుసా!" అంటూ నలువైపులా చూపాడు. 

"నువ్వు చనిపోయావని.. " ఆమె మాటలు పూర్తి కాకముందే ఆమె అరచెయ్య అందుకొని ముద్దుపెట్టుకొన్నాడతను. 


"నేను చనిపోవడమేమిటి.. నీ నుంచి నన్ను వేరు చెయ్యాలని చూసారు, కుట్రపన్నారు! కానీ నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను?.. పద!.. ఇంటికి వెళ్దాం!" అంటూ ఆమె చేతులు పట్టుకొని ముందుకి రెండడుగులు వేసాడు. 


"ఎవరు నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు?" ఉద్వేగంతో ప్రశ్నించిందామె. కోపంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. 


"వాళ్ళు.. వాళ్ళు.. " అతని మాటలు మరి వినిపించలేదు. 


అప్పుడే చిన్నగా చినుకులు పడటం ఆరంభమైంది. మరో సారి మెరుపు మెరిసింది. ఎక్కడో దూరాన పిడుగు పడింది. అంతే! ఉలిక్కిపడిందామె! పక్కకి తిరిగి చూసేసరికి ఆనంద్ లేడు. ఇంతలోనే ఎలా మాయమయ్యాడు ఆనంద్! 


"అనంద్.. ఆనంద్!!" అని బిగ్గరగా అరిచింది. చుట్టుపక్కల అంతా చూసింది, ఎక్కడా లేడు ఆనంద్! ఆమె అలా అరుస్తూనే ఉంది, అనసూయమ్మ ఆమెను తట్టి లేపేవరకూ. 


"ఏమ్మా, అర్చనా! పీడకలగాని వచ్చిందా!" ఆమె తల నిమిరింది అనసూయమ్మ. 


"అమ్మా!.. అనంద్!.. " అంటూ తల్లిని పట్టుకొని బావురుమంది అర్చన. ఆమె కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలుతున్నాయి. ఆమె కన్నీళ్ళు తుడిచింది తల్లి. 


"ఊర్కోమ్మా!.. మనసు దిటవు చేసుకోవాలి. మనం ఎంత అనుకున్నా చనిపోయిన ఆనంద్ తిరిగిరాడమ్మా!" అంటూ అనునయించింది అర్చనని. 


అలా తల్లి ఒడిలోనే తలపెట్టుకొని బెక్కుతూ ఉండిపోయిన అర్చనకి చాలా సేపు వరకూ నిద్రపట్టలేదు. 

 *******

అర్చన, ఆనంద్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నప్పుడు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. తనకు ఉద్యోగం వచ్చేవరకూ పెళ్ళి వాయిదా వేద్దామని అనుకున్నారు. ఈ మధ్యనే ఆనంద్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరడంతో ఇద్దరి నిరీక్షణ ఫలించింది. అటు అర్చన పెళ్ళి కోసం ఆమె తల్లితండ్రులు సంబంధాలు చూడటంతో తన మనసులో మాట చెప్పక తప్పింది కాదామెకు. 


అర్చన తండ్రి రాఘవరావుకి విషయం తెలిసి మండిపడ్డాడు. ఆనంద్ తన అంతస్తుకు తగినవాడు కాదు అన్నది మొదటి కారణం కాగా, అతని కులం వేరు కావడం మరో కారణం. అనసూయమ్మ ఎంత నచ్చ చెప్పినా వినలేదు రాఘవరావు. అయితే అర్చన ఆనంద్ ని తప్ప ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోనని తెగేసి చెప్పడంవల్ల ఏం చెయ్యాలో పాలుపోలేదు. 

ఆమెని ఎంత బెదిరించినా వినకపోవడంతో ఆఖరికి అతనే ఓ అడుగు వెనకేసి, బహు కష్టంతో అనంద్ తో పెళ్ళికి ఒప్పుకున్నాడు. తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోవడంతో అర్చన చాలా సంతోషించింది. ఇప్పుడు అదంతా గతం! పెళ్ళి ముహూర్తాలు కుదిరిన వారం రోజుల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. 


మరుసటి రోజు రాత్రి మళ్ళీ నిద్రలో ఉండగా భయంతో అరిచింది. వళ్ళంతా చెమటలు పట్టాయి, చేతులు వణుకుతున్నాయి. పక్క గదిలో నిద్రపోతున్న అనసూయమ్మ వెంటనే లేచి ఆ గదిలోకి వచ్చి కూతురికి మంచినీళ్ళిచ్చి తల నిమిరింది. గ్లాసెడు మంచినీళ్ళు తాగిన తర్వాత కాని స్థిమిత పడలేదు ఆమె. ఇంకా గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి. 


"మళ్ళీ అలాంటి కలే వచ్చిందా తల్లీ!" అంది అనసూయమ్మ కూతురి పరిస్థితికి బాధపడుతూ. 


"అవునమ్మా! ఈ మధ్య రోజూ ఆనంద్ నా కలలోకి వస్తున్నాడమ్మా! ఆనంద్ చనిపోలేదమ్మా! ఎక్కడో బ్రతికే ఉన్నాడు, లేకపోతే ఎందుకు రోజూ నా కలలోకి వస్తాడు?" అశృనయనాలతో తల్లిని అడిగింది అర్చన. 


కూతురివైపు జాలిగా చూసింది అనసూయమ్మ.


"పొద్దస్తమానూ చనిపోయిన ఆనంద్ నే తలచుకుంటూ గడుపుతున్నావు. అందుకే నీకు రాత్రి కలలోకి వస్తున్నాడు. అంతేకాని, అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడా అతనెలా బ్రతుకుతాడు? మనసుని ప్రశాంతంగా ఉంచుకో! అనంద్ ని మరిచిపో అని నేను చెప్పలేను కానీ, నువ్వు అతన్ని ఎంత త్వరగా నీ మనసులోంచి తీసేస్తే అంత మంచిది. నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది. రోజురోజుకీ ఇలా బాధపడుతూ చిక్కి శల్యమవడం నేను చూడలేనే తల్లీ! కనీసం, మా కోసమైనా నువ్వు అతన్ని మర్చిపోవాలి. " అంది అనసూయమ్మ బోధపరుస్తూ. 


అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవరావుకి కూడా కూతురి పరిస్థితి కంటనీరు తెప్పించింది. అతని కళ్ళు కూడా చెమర్చాయి. "నువ్విలా బాధపడుతూంటే మేం చూడలేము. మా కోసమైనా నువ్వు అన్నీ మర్చిపోయి మామూలు మనిషవ్వాలి. " అన్నాడు రాఘవరావు. 


ఓ రోజు అర్చన బావ శంకరం వస్తే, అనసూయమ్మ కూతురి విషయం చెప్పి కంటనీరు పెట్టుకుంది. శంకరం తిన్నగా అర్చన వద్దకు వెళ్ళి, "అర్చనా!.. మీ అమ్మా నాన్నల కోసమైనా నీ దుఃఖాన్ని దిగమింగుకొని మామూలు మనిషవ్వాలి. నీకు ముందుముందు భవిష్యత్తు ఎంతో ఉంది. నువ్వు త్వరగా కోలుకో!" అని ఆమెని సముదాయించాడు. 


 *********

ప్రతీ రోజూ ఇలా అర్చన అన్నపానాలు మాని తనలో తానే కుమిలిపోతూండటం చూసి ఆమె భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న అనసూయమ్మ, "ఏమండీ, రోజూ ఎందుకిలా జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదండీ! అర్చన ఇలా తనలో తానే కుమిలిపోతూంటే నా గుండె తరుక్కుపోతోందండీ. దాన్ని ఓ సారి డాక్టర్కి చూపిస్తే మంచిదేమో!" భర్తతో అంది. 


రాఘవరావుకీ అలానే అనిపించింది. రోజు రోజుకీ ఆమె పరిస్థితి దిగజారిపోవడం చూసి, అర్చనని ఫామిలీ డాక్టర్కి చూపించాడు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ విశ్వనాథ్, "శారీరకంగా ఆమెకేమీ రుగ్మత లేదు. ఆమె సమస్య మానసికమని తోస్తోంది. ఎందుకైనా సైక్రియాటిస్ట్ కి చూపించడం మంచిది. నాకు తెలిసిన ఒక సైక్రియాటిస్ట్ ఉన్నాడు, డాక్టర్ రామానంద్ అని. అతన్ని కలుసుకోండి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలడు. " అని చెప్పాడు.

 

డాక్టర్ రామానంద్ ఆమెని పరిక్షీంచి, ఆమెనుండి విషయమంతా అడిగి తెలుసుకున్నాడు. 


"డాక్టర్, రోజూ ఎందుకిలా జరుగుతోంది? నా కలలోకి వచ్చినట్లే అనిపించడంలేదు, నిజంగా ఎదురుగా ఉన్నట్లే అనిపిస్తోంది ప్రతీసారీ. ఏదో రహస్యం చెప్పబోతూండగా మళ్ళీ మాయమైపోతూ ఉంటాడు. ప్రతీరోజూ ఇలాంటి కలలే వస్తున్నాయి. అనంద్ నిజంగా బ్రతికే ఉన్నాడనిపిస్తోంది డాక్టర్. అలాంటి అవకాశం లేదంటారా?" అడిగింది అర్చన ఆశగా. 


చిన్నగా నవ్వాడు డాక్టర్ రామానంద్. "మీ సందేహం సరైనదే కావచ్చు. అతని బాడీ దొరకలేదు కాబట్టి, ఎక్కడో కదలలేని పరిస్థితుల్లో బ్రతికే ఉండి మీకు సందేశం పంపిస్తూ ఉండవచ్చు. శరీరం అచేతనమైనా అతని మస్తిష్కం పని చేస్తూ మీ గురించే తలచుకుంటూ ఉండవచ్చు. మీరెలా అతను మీ కలలోకి వచ్చినట్లు భావిస్తున్నారో, అలాగే మీ భావనలు అతని మస్తిష్కం పొరల్లో మెదులుతూ ఉండవచ్చు. 


ఇలాంటి ఉదంతాలు చాలా మట్టుకు జరిగాయి కూడా! అయితే ఈ సంఘటనలు సైన్సుకి, రీజనింగ్ కి అందకుండా జరుగుతూ ఉంటాయి. కోమాలో ఉన్న వ్యక్తి తనకి బాగా ఇష్టమైన మరో వ్యక్తికి ఇలా సందేశం పంపిన సంఘటనలు కొన్ని విదేశాల్లో జరిగినట్లు గుర్తించారు. అయితే అందులో నిజమెంతో తెలియదు. అలాగే టెలెపతీ, క్లైర్వాయెన్స్ పై చాలా కథనాలు ఉన్నాయి. సాధారణ భాషలో టెలెపతి అంటే జ్ఞానేంద్రియాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సమాచారం చేరడం. అలాగే, క్లైర్వాయెన్స్ అంటే అతీంద్రియ శక్తుల ద్వారా ఒక వస్తువు గురించైనా, ఒక మనిషి గురించైనా, లేక ఏ ప్రదేశం గురించి అయినా ఒక విధమైన దివ్యదృష్టి కలిగి ఉండటం. 


అయితే వీటికి ఎలాంటి శాస్త్రీయ పరమైన ఆధారాలు లేవని తెల్చారు పలువురు శాస్త్రవేత్తలు. అందుకే అవి పూర్తిగా కాల్పనిక జగత్తుకి పరిమితమైయ్యాయి. చాలా దేశాల్లో వాటి మీద పరిశోధనలు జరిగాయి. పారాసైకలోజిస్టుల థీరిని ఆధునిక విజ్ఞానవేత్తలు అంగీకరించరు. వాటిని ఒట్టి కథలుగా కొట్టిపారేస్తారు. అదో మానసిక జబ్బుగానే పరిగణిస్తారు. " చెప్పాడు రామానంద్. 

"అంటే డాక్టర్! ఆనంద్ అతీంద్రియ శక్తులవల్ల ఇలా జరుగుతోందా?" తన సందేహం వెలిబుచ్చింది. 


"అతీంద్రియ శక్తులు ఉన్నాయో లేవో ఏ విషయమూ సరిగ్గా చెప్పలేము. " పెదివి విరిచాడు డాక్టర్ రామానంద్. 


"అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు? నాకు మాత్రం ఎక్కడో ఓ మూల ఆనంద్ బ్రతికే ఉంటాడని ఓ దృఢమైన నమ్మకం ఉంది. ఆ ఏక్సిడెంట్ లో అతని బైక్ నుజ్జైనా, అతను ఎగిరి ఎడంవైపు ఉన్న లోయలో పడిపోయాడు. అతని బాడీ మాత్రం దొరకలేదు. ఈ పరిస్థితిలో అతను బతికి ఉన్నాడేమోనని నా కనిపిస్తోంది. " అంది అర్చన. 


"కావచ్చు. అయితే ఈ విషయంలో నేనేమీ మీకు సహాయం చెయ్యలేను. పోలీసుల సహకారం, గానీ డిటెక్టివ్ ల సహాయం గానీ తీసుకోమని మాత్రం సూచించగలను. " అన్నాడు నవ్వుతూ. 


"మీ సలహాకి థ్యాంక్స్!" అని అతనికి నమస్కరించి బయటకు వచ్చిందామె. 


తన ఆనంద్ తప్పకుండా బతికే ఉన్నాడు! తను కన్న కల నిజం కావాలని, తన ఆనంద్ తిరిగి రావాలని వేయి దేవుళ్ళకి మొక్కుకుందామె. డాక్టర్ రామానంద్ ని కలిసిన తర్వాత ఆమె తిన్నగా పోలీస్ స్టేషన్ వైపు దారి తీసింది. అర్చనను గుర్తుపట్టిన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆమెని చూసి పలకరింపుగా నవ్వాడు. రాఘవరావు కూతురిగా అర్చన అతనికి బాగా తెలుసు. అతనే ఆనంద్ రోడ్డు ప్రమాదంకి గురైన ప్రదేశానికి వెళ్ళాడు. అగ్నిమాపక దళాన్ని కూడా పిలిపించి ఆ లోయలో ఆనంద్ కోసం వెతికించాడు. 


తిన్నగా అతని దగ్గరకి వెళ్ళి, "ఇన్స్పెక్టర్ గారూ, ఆనంద్ కోసం మరోసారి వెతికించరా ప్లీజ్! నాకెందుకో అతను బ్రతికే ఉన్నాడనిపిస్తోంది. " అంటూ తన అనుభవాలన్నీ చెప్పిందామె. 


అంతా విన్న తర్వాత తేలిగ్గా కొట్టిపారేసాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. "అతీంద్రియ శక్తులు అన్నది ఓ ట్రాష్! మనకు లేని శక్తులని ఊహించుకుంటూ ఆనందాన్ని పొందుతాం. ఇవన్నీ సినిమాల్లోనూ, ఫాంటసీ నవలలకి మాత్రమే పరిమితం." అన్నాడు. 


"సరే!.. కానీ, ఆనంద్ బాడీ మీకు దొరకలేదు కదా! లోయలో పడిన వ్యక్తి ఎలా మాయమౌతాడు, ఈ విషయమై ఏమైనా చెప్పగలరా? అంతేకాక ఆ దుర్ఘటన ప్రమాదవశాత్తూ జరగలేదని నాకనిపిస్తోంది, మీరేమంటారు?" ప్రశ్నించిందామె. 


తల విదిలించాడు ప్రశాంత్. "నిజమే! నేను కూడా ఆ విధంగా భావించి ఆ లోయ కింద ఉన్న ఆదివాసీ గూడెంలో విచారించాను, కానీ నాకెవరూ సహకరించలేదు. నాకూ అది తెలిసి చేసిన ఏక్సిడెంట్ లా తోచడంతో పరిశోధన జరిపాను. వివరాలు తర్వాత చెప్తాను, ముందు ఆనంద్ ఆచూకీ తెలుసుకోవాలి. నాతో రాగలరా, ఆ గూడేనికి వెళ్దాం. " 

ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మాటలకి తలూపింది అర్చన. 

ఓ గంట ప్రయాణం చేసిన తర్వాత ఏక్సిడెంట్ జరిగిన ప్రదేశం వచ్చింది. ఆ ఘాట్ రోడ్డులో కుడివైపున ఎత్తైన కొండలు, ఎడం వైపున అగాధమైన లోయ కనిపిస్తున్నాయి. లోయకు కాస్త దూరంలో ఓ ఆదివాసీ గ్రామం ఉంది. అక్కడి వెళ్ళాంటే ఘాటీ కిందకి దిగి అక్కణుంచి కాలినడకన ఓ పది కిలోమీటర్లు నడిస్తే ఆ గ్రామం వస్తుంది. ఆ గూడెంలో రెండువందల వరకూ గడపలున్నాయి. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని కుగ్రామమది. 


జీపు నెమ్మదిగా ఘాటీ దిగసాగింది. కిందకి చూసింది అర్చన. వంద అడుగులకన్న లోతైన లోయ అది. కింద చాలా చోట్ల పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. కాకపోతే చెట్లు కూడా చాలా దట్టంగా ఉన్నాయి. ఆ గ్రామంలో నివసించే ఆదివాసీలు ఆ అడవి మీదే ఆధారపడి బతుకుతున్నారు. తునికాకు, పుట్టతేనె లాంటి అడివిలో దొరికే సామగ్రి సేకరించి పట్నంలో అమ్ముతారు. అదే వాళ్ళ జీవనాధారం. 


ఆ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ గ్రామం వెళ్ళాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్, కానీ ఊరివాళ్ళెవరూ అతనికి సహకరించలేదు. కొత్తవాళ్ళనీ, అందులోనూ పోలీసుల్ని చూస్తే వాళ్ళకి విపరీతమైన భయం. అందుకే క్రితం సారి వెళ్ళినప్పుడు ఎవరూ పెదవి విప్పలేదు, ఇప్పుడైనా ఎవరైనా ఏమైనా సమాచారం ఇస్తారో లేదో తెలియదు అని మనసులో అనుకుంటూ జీపు ఆపి గూడెంవరకూ నడిచి వెళ్ళాడు ప్రశాంత్, అర్చనతో. 

ఆ గూడెం మొదల్లో అప్పటివరకూ అక్కడో ఓ చెట్టుకింద మాట్లాడుకుంటూ కూర్చున్న జనం పోలీసు యూనిఫాంలో ప్రశాంత్ కనపడేసరికి అప్పుడే ఏదో ముఖ్యమైన పని గుర్తుకు వచ్చినట్లు ఒకొక్కరూ జారుకున్నారు. ఆ సమీపానికి అర్చనతో ప్రశాంత్ వెళ్ళేసరికి ఒకే ఒక్కడు చిక్కాడు వాళ్ళకి. అతను కూడా వెళ్ళిపోబోతూంటే, "ఆగు!.. " అని అర్చాడు ప్రశాంత్.

 

చేసేదిలేక అక్కడే ఆగిపోయాడా వ్యక్తి. "నీ పేరేమిటి?" అడిగాడు ప్రశాంత్. 


తన పేరు చెప్పడం ఇష్టంలేదని అతని మొహం చూస్తూనే తెలిసిపోయింది ప్రశాంత్ కి. వెంటనే ఏమీ చెప్పలేదు. ప్రశాంత్ అతని మొహంలోకి గుచ్చిగుచ్చి చూసేసరికి, "నన్ను రామన్నదొర అంటారండీ! మాకూ ఏ పాపమూ తెలియదు దొరా! ఏదో తునికాకు, తేనె, చింతపండు లాంటివి తీసుకెళ్ళి అమ్మడం తప్ప, గంజాయి లాంటివాటి జోలికి నేనే కాదు, మా ఊరి జనం ఎవ్వరూ పోలేదు దొరా!" అన్నాడతను దండాలు పెడుతూ. 


వాళ్ళ భయం అర్థమైంది ప్రశాంత్ కి. అతని కాళ్ళూ చేతులూ వణకడం చూసిన ప్రశాంత్ శాంతంగా అతనివైపు చూసి, "ఆ విషయం ఆరా తీయడానికి రాలేదు. వారం రోజుల క్రితం మీదున్న ఘాట్ లో ఓ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి లోయలో పడిపోయాడు. ఎంత గాలించినా అతని శరీరం దొరకలేదు. బహుశా అతను విపరీతంగా గాయపడి ఉండగా ఎవరైనా రక్షించి ఎక్కడైనా ఉంచారేమో. ఈ దగ్గర మీ గూడెం తప్పించి ఇంకో ఊరేమీ లేదు. నీకు ఒకేళ ఈ విషయం గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. నీకు తెలియకపోతే ఊళ్ళో ఇంకెవరికైనా తెలుసేమో చూడు!" అన్నాడు. 


ఆ మాటలతో అతని వణుకు కొద్దిగా తగ్గింది కానీ, పోలీసులతో ఎందుకొచ్చిన తంటా అనుకున్నాడేమో ఏమో, "దొరా నాకేమీ తెలియదు దొరా!" అన్నాడు మళ్ళీ దండాలు పెడుతూ. 


ఈసారి అర్చన కల్పించుకుంది. "ఇదిగో రామన్నదొరా! అతను తప్పకుండా ఈ లోయలోనే పడి పోయి ఉంటాడు. నీకు తెలియక పోయినా మీ ఊళ్ళో ఎవరికైనా తప్పకుండా తెలిసే ఉంటుంది. దయచేసి చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. " అతని చేతులు పట్టుకొని జాలిగా అడిగింది అర్చన. 


ఆమె కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్ళు చూసి చలించిపోయినట్లున్నాడు రామన్నదొర. 

"అమ్మా!.. ఇప్పుడు గుర్తుకు వస్తోంది. మా ఊరి పోరగాడు బిజ్జూ అనే వాడికి అడవిలో బాగా దెబ్బలు తగిలి చెట్టుకి వేళాడుతూ, రకతం ఓడుతున్న ఓ మనిషి కనిపిస్తే, తన స్నేహితుల్ని పిలిచి తన ఇంటికి తీసుకెళ్ళాడు. వాడ్నడిగితే చెప్తాడు. " అన్నాడు. 


అర్చన ఇన్స్పెక్టర్ వైపు చూసింది. "సరే! ఆ బిజ్జూ ఇల్లు చూపించు. " అన్నాడు ప్రశాంత్. 


కొద్ది దూరంలో ఉన్న బిజ్జూ గుడిసె చూపించాడు రామన్నదొర. అతను చూపించిన గుడిసెని సమీపించారిద్దరూ. అక్కడ ఇంటి బయట ఓ నులక మంచం మీద కూర్చొని బీడి తాగుతున్న యువకుడు పోలీసు యూనిఫాంలో ఉన్న ప్రశాంత్ని చూసి బెదిరిపోయి బీడీ ఓ మూలకి పారేసి లోపలికి పరిగెత్తబోయాడు. 


వెంటనే ప్రశాంత్ పరిగెట్టి వాడి దారికి అడ్డంగా నిలిచాడు. "ఆగు బిజ్జూ.. ఆగు!" గట్టిగా అరిచిన ప్రశాంత్ మాటలతో వాడికి వళ్ళంతా చెమటలు పట్టాయి. వణుకుతూ నిలబడ్డాడు. వాడి భయానికి నవ్వు వచ్చింది ప్రశాంత్ కి. 


నవ్వు ఆపుకొని శాంతంగా, "బిజ్జూ అలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. " అని తను నులకమంచంపై కూర్చున్నాడు.

 

అతనివైపూ, అర్చనవైపు విచిత్రంగా, భయంగా మార్చిమార్చి చూస్తూ కింద కూర్చున్నాడు బిజ్జూ. విషయమంతా చెప్పడంతో, భయం తగ్గిన బిజ్జూ నోరు తెరిచాడు. "బాబూ, నానే ఆ బాబుని మా ఇంటికి తీసుకొచ్చినాను. బాగా దెబ్బలు తగిలి, అంతా రకతంతో ఉన్న ఆ బాబుకి ఆకు పసర్లు పూసి, మా గూడెం గరుడాచారి ఇచ్చిన మందులు తాగిస్తే రొండు దినాల తరవాత కొద్దిగా తెలివి వచ్చినాది అయ్యా! 


కొద్దిగా ఏదో సెప్పబోయాడు దొరా, మాకెవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు, ఎవళో రోడ్దు వరకూ కారేసుకొని వచ్చి తీసుకెళ్ళినారు దొర! అంతే, సత్తె పెమాణికంగా అంతే, నాకింకేమీ తెలియదు దొరా!" అంటూ దండాలు పెట్టసాగాడు. 


కథ కొత్త మలుపు తిరిగిందని గ్రహించాడు ప్రశాంత్. అప్పటివరకూ బిజ్జూ వైపు ఆత్రంగా చూస్తున్న అర్చన, "అతన్నెవరు తీసుకెళ్ళారో చెప్పగలవా?" అంది ఆశగా.

 

ఆమె వైపు తిరిగి, "లేదమ్మా! నాకెరిక లేదు, బంధువులనీ మాత్రం చెప్పనారు, ఆసుపత్రికి తీసుకెల్తామని కూడా చెప్పినారు, అందుకే ఆ మడిసికి తగ్గకపోయినా పంపించినాను. ఇక్కణ్ణుంచి డోలిలో తీసుకెళ్ళి కారు దాకా తీసుకెళ్ళినాము, అంతేనమ్మా!" అన్నాడు మళ్ళీ దండాలు పెడుతూ. 


"చాలా మంచిపని చేసావు బిజ్జూ! ఓ మనిషి ప్రాణం కాపాడావు" అని మెచ్చుకోవడంతో బిజ్జూ మొహంలో ఆనందం కనిపించింది. అర్చన కూడా కన్నీళ్ళతో వాడివైపు చూసి అనుకోకుండా దండంపెట్టింది. అంతకు మించి మరే సమాచారం లభించదని రూఢి చేసుకొని అక్కణ్ణుంచి కదిలారు వాళ్ళిద్దరూ. 


జీప్లో కూర్చున్న అర్చన మది అంతా ఆలోచనలతో నిండి ఉంది. అక్కడ ఆ ఆదివాసీ యువకుడు రక్షించిన వ్యక్తి తప్పకుండా తన ఆనందే అయుండాలని దేవునికి మనసులోనే మొక్కుకుందామె. ఆమెలాగే, ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కూడా ఆలోచనల్లో పడ్డాడు. అతనికీ అదే అనుమానం కలిగింది. 


అయితే అతన్ని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, ఎందుకు తీసుకెళ్ళి ఉంటారు? ఎవరు వాళ్ళు, బిజ్జూ చెప్పినట్లు వాళ్ళు అతని బంధువులా లేక శత్రువులా? ఆ ప్రమాదం, ఒక వేళ ఆనంద్ ని చంపడానికి చేసిన కుట్ర అయితే, అతను ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు గానీ వాళ్ళకి తెలిసిందా? అందుకే అక్కణ్ణుంచి అతన్ని మాయం చేసారా? ఇలా అతని ఆలోచనలు తెగడం లేదు.

 

స్టేషన్ కి చేరుకున్నాక, "ఆనంద్కి గానీ, మీకు గానీ శత్రువులెవరైనా ఉన్నారా?" అని అడిగాడు అర్చనని. 

"లేరు! ఎందుకలా అడిగారు?" అతనివైపు వింతగా చూసి అడిగింది అర్చన. 


"బైక్ని ట్రక్తో కావాలని గుద్ది చంపాలని ప్రయత్నించారేమో అన్న అనుమానం నాకు కలుగుతోంది. అనంద్ లోయలో పడిపోవడం చూసిన ఆ దుండగుడి మనుషులు ఆ గూడెంలో వెతికి అతన్ని ఎత్తుకెళ్ళరేమో?" అని తన మనసులోని అనుమానం బయటపెట్టాడు ప్రశాంత్. 


అతని మాటలు విని ఆమె కన్నీళ్ళు పెట్టింది. అది చూసి ప్రశాంత్, "అబ్బే, అది నా అనుమానం మాత్రమే, అతని తరుఫువాళ్ళు అంటే అతని తల్లితండ్రులు గానీ అతన్ని ఆ గూడెం నుండి తీసుకెళ్ళారేమో! వాళ్ళింటికి వెళ్తే ఏ సంగతీ తెలుస్తుంది. " అన్నాడు లేస్తూ. అతన్ని అనుసరించింది అర్చన. 


శాస్త్రినగర్ రెండవ వీధిలో ఉన్న ఆనంద్ ఇంటికి వెళ్ళిన వారికి పెద్ద తాళం కప్ప వెక్కిరించింది. అది చూసి నివ్వెరపోయింది అర్చన. చుట్టుపక్కల విచారించిన ప్రశాంత్ కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరూ చెప్పలేకపోయారు. 


"కొడుకు చనిపోయాడని భావించి అతని తల్లితండ్రులు ఈ ఊరొదిలి తమ సొంత ఊరికి వెళ్ళిపోయారేమో, మీ కేమైనా అతని సొంత ఊరిగురించి తెలుసా?" అన్నాడు. 


తెలుసునని తలూపిందామె. "ఇక్కణ్ణుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందా ఊరు, సీతానగరం. అక్కడికి వెళ్ళుంటారేమో? ఒకేళ వాళ్ళు అక్కడికి ముందే వెళ్ళిపోయి ఉంటే, మరి ఆ గూడెం నుండి ఆనంద్ ని తీసుకెళ్ళినవారెవరు?" అంది. 


"ఆ విషయం సీతానగరం వెళ్తే గానీ తెలియదు. మీరు ఇంటికి వెళ్ళండి, రేపు నేను ఆ ఊరెళ్ళి దర్యాప్తు చేస్తాను. " అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. 


అర్చన అందుకు ఒప్పుకోలేదు. "నేను కూడా వస్తాను. " అంది. అమెకెలా చెప్పాలో అర్థంకాక, చివరికి ఒప్పుకున్నాడు ప్రశాంత్. 


ఆ ఊళ్ళో చాలా సులభంగానే వాళ్ళ జాడ తెలిసింది. అక్కడ వళ్ళంతా కట్లతో బెడ్ పై పడుక్కున్న ఆనంద్ ని చూస్తునే అంతులేని ఆశ్చర్యానికి గురైంది అర్చన. ఆనంద్ ని ఆ గూడెం నుండి అతని తల్లితండ్రులే తెచ్చినట్లు ఊహించగలిగాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. 


కదలల్లేని పరిస్థితిలో ఉన్న ఆనంద్ ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకొని భోరుమని విలపించింది అర్చన. ఆమెని చూసి ఆనంద్ తల్లి తండ్రులు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

"అంకుల్! అనంద్ బ్రతికే ఉన్నాడన్న సంగతి మీకు తెలిసినా నాకెందుకు చెప్పలేదు?" కన్నీళ్ళతోనే అడిగింది రామచంద్రయ్యని. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. 


జవాబు చెప్పలేక మౌనం వహించాడతను. కాని, ఆనంద్ తల్లి వర్ధనమ్మ మాత్రం ఊరుకోలేకపోయింది. "మా వాడు బ్రతికి ఉండటం ఇష్టంలేక కావాలనే చంపించడానికి చూసినవాళ్ళు, వాడు బతికి ఉన్నాడని, ప్రమాదం నుండి బయటపడ్డాడని తెలిస్తే ఊరుకుంటారా?" అంది. 


సంభ్రమంతో అర్చన కళ్ళు పెద్దవయ్యాయి. "ఏమిటి ఆంటీ? ఏమంటున్నారు మీరు? ఆనంద్ ని చంపాలని ఎవరనుకుంటారు?" అంది. 


"పెద్దవాళ్ళతో మనకి సంబంధం వద్దురా తండ్రీ అన్నాను, వినిపించుకోలేదు వాడు. అందుకు పర్యవసానంగా ఇదిగో ఇలాంటి కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. " అందామె. 


ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుతూహలంగా వాళ్ళ మాటలు వింటున్నాడు. 

"ఏమిటి ఆంటీ! ఎందుకలా అంటున్నారు?"


అప్పుడు నోరు విప్పాడు రామచంద్రయ్య. “పెళ్ళి కుదరక ముందు, మీ నాన్నగారు మా వాడ్ని బెదిరించారు, ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, మా అమ్మయిని మర్చిపో, అని. కానీ మా వాడు వినలేదు. పైకి పెళ్ళికి ఒప్పుకున్నట్లు నటించి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పరువు కోసం ఎంతకైనా తెగిస్తారు ఈ డబ్బు గలవాళ్ళు. తమ పరపతితో కేసు చాలా సులభంగా మాఫీ కూడా చేసుకోగలరు. " అన్నాడు రామచంద్రయ్య పౌరుషంగా. 


దెబ్బ తిన్నట్లు చూసిందామె. "మా నాన్న ఇలాంటి నీచమైన పని ఎన్నడూ చెయ్యరు, చెయ్యలేడు. " తండ్రిపైన నమ్మకం పోని అర్చన అంది బాధగా. 


పైకి అలా అన్నదే కానీ, ఏ మూలో ఆమెకీ తన తండ్రిపైన అనుమానం లేకపోలేదు. తన తండ్రే పరువుకోసం ఇలా చేయించాడేమో?


చిన్నగా దగ్గాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. రామచంద్రయ్యవైపు తిరిగి, "మీరు పొరబడతున్నారు. మీ అబ్బాయిని హత్య చెయ్యాలని ప్రయత్నించింది అర్చన తండ్రి కాదు. ముందు అతను ఆవేశపడినా, తర్వాత కూతురి మాట తీసెయ్యలేక పెళ్ళికి ఒప్పుకున్నారు. " కల్పించుకొని అన్నాడు. 


"మరి ఇంకెవరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారంటారు?"


"ఆనంద్ హత్యకి ప్లాన్ రచించి, అమలు పరిచిన వ్యక్తి ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. " చెప్పాడు ప్రశాంత్. 


"ఆ.. ఏమిటి? ఎవరు నా ఆనంద్ ని హత్య చెయ్యడానికి ప్రయత్నించింది?" అర్చన మొహంలో ఆశ్చర్యం, ఆవేశం తొంగి చూసాయి. 


రామచంద్రయ్య, వర్ధనమ్మ కూడా ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ వైపు చూసారు. 

ప్రశాంత్ అర్చనవైపు తిరిగి, "ఇంకెవరు, మీ బావ శంకర్ పనే ఇది. " అన్నాడు. 


"ఆ.. శంకర్ ఇలాంటి పని చేసాడా!" విస్తుపోయింది ఆమె. 


ఆనంద్ ప్రమాదానికి గురైన తర్వాత, తన వద్దకి పరమర్శించడానికి వచ్చిన శంకర్ గుర్తుకు వచ్చాడామెకి. 

"అవును, శంకరే ఈ ఈ దుర్మార్గానికి తలపెట్టాడు. అతను మీ నాన్నగారి ఆస్తి మీద కన్నేసాడు. మీరు ఆనంద్ ని ప్రేమించడం, పెళ్ళి చేసుకోవాలనుకోవడంతో ఆస్తి తన చేజారిపోతుందన్న కసి అతనిలో ఏర్పడింది. ఆనంద్ పై ద్వేషం పెరిగింది. 


ఆ రోజు కిరాయి రౌడీని కుదుర్చుకొని, ఆనంద్ ని ఏక్సిడెంట్ కి గురిచేసాడు. రెండు మూడు సార్లు గుద్దిన తర్వాత, బైక్ నుజ్జైంది కానీ, ఆనంద్ ఎగిరి లోయలో పడ్డటం చూసిన శంకర్ ట్రక్ దిగి లోయలోకి తొంగి చూసి ఉంటాడు. అయితే అలా చూడటంతో అతని జేబులోంచి సెల్ జారిపోయి ప్రమాద స్థలంలో పడిపోవడం అతను గమనించలేదు. 


ఆ సెల్ నా చేతికి చిక్కింది. అది ఆనంద్ దేమోనని ముందు పొరబడ్డాను, తర్వాత అది శంకర్ దని తేలింది. అప్పుడు అంతా విచారిస్తే అసలు సంగతి బోధపడింది. శంకర్ ని కస్టడీలోకి తీసుకొని విచారించేసరికి నిజం బయటపడింది. " అన్నాడు ప్రశాంత్. 


ఆశ్చర్యంగా అతనివైపే చూస్తూ ఉండిపోయింది ఆర్చన నమ్మలేనట్లు. "మరి నాకింతవరకూ చెప్పలేదెందుకు?" అడిగిందామె. 


"ముందు మాయమైన ఆనంద్ ఆచూకీ తెలుసుకోవాలి కదా! అందుకే శంకర్ విషయం మీకు చెప్పలేదు. శంకర్ తను ఏక్సిడెంట్ చేయించానని ఒప్పుకున్నాడు గానీ, ఆ తర్వాత ఆనంద్ ఏమైందీ తనకు తెలియదన్నాడు. ప్రస్తుతం ఆనంద్ బ్రతికే ఉన్నాడు గనుక అతనికి హత్యాప్రయత్నం నేరం పైన తప్పకుండా తగిన శిక్ష పడుతుంది. ” అన్నాడు ప్రశాంత్. 


"మేము పొరపాటు పడ్డాం. ఆవేశంతో ఏదో అన్నాను, పట్టించుకోకు. మమ్మల్ని క్షమించు. " అన్నాడు రామచంద్రయ్య పశ్చాత్తాపపడుతూ. 


"అంత మాటనకండి అంకుల్!" అంది అర్చన అతని చేతులు పట్టుకుంటూ. 

అప్పుడే కళ్ళు తెరిచిన ఆనంద్ నలువైపులా దృష్టి సారించాడు. అర్చన, ఆ పక్కనే ఇన్స్పెక్టర్, తల్లీ తండ్రి కనిపించారు. అర్చన వైపు చూసి బలహీనంగా నవ్వాడు. పరిగెట్టుకొని అతన్ని చేరిన అర్చన అతనిమీద వాలింది కన్నీళ్ళతో. 'ఇది కల కాదు కదా!' అనిపించిందామెకో క్షణం. అనంద్ సజీవంగా తన ఎదుటే ఉన్నాడు. 


సంభ్రమాశ్చర్యాలతో అర్చన ఉక్కిరిబిక్కిరైంది. ముమ్మాటికీ ఇది కల కాదు, కాకూడదు. ఇక తననూ, ఆనంద్ నూ ఎవరూ వేరు చేయలేరు. తనకొచ్చిన కలే ఆనంద్ ని బతికించిందేమో, ఏదో తెలియని ఆతీంద్రియ శక్తే అతనికి ప్రాణం పోసిందేమో అనిపించిందామెకు. తన కల నిజమై ఆనంద్ ప్రాణాలతో బయటపడ్డాడు, అంతే చాలు!


"అర్చన!.. అర్చనా!.. ”అంటూ ఏదో చెప్పబోయాడు ఆనంద్. 


"మీరేం మాట్లడకండి, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, మీకు ద్రోహం తలపెట్టినవాడు చట్టానికి చిక్కాడు. " అన్నాడు ప్రశాంత్. 


అతనివైపు సాభిప్రాయంగా చూసి ఆనంద్ పడుక్కొని ఉన్న మంచంవైపు కదిలారు రామచంద్రయ్య, వర్ధనమ్మ దంపతులు.

 

వాళ్ళ మొహంలో ఆనందం తొణికిసలాడుతోంది. 


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


 
 
 

Comments


bottom of page