top of page

కలుపుకుంటే కలదు సుఖం!



'Kalupukunte Kaladu Sukham' - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 31/03/2024

'కలుపుకుంటే కలదు సుఖం!' తెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పచ్చగా పేడతో అలికిన వాకిట్లో ముత్యాల ముగ్గులు, దారికిరువైపులా స్వాగతం చెప్తూ పచ్చని బంతిపూలు విరగబూసి ఉన్నాయి. మిరపమందార, ముద్దామందార, గరుడవవర్ధని, నందివర్ధని, మెట్టతామర పూలతో కలకళలాడుతూ, కల్మషమెరుగని కన్నెపిల్లలా సోయగాలు విరజిమ్ముతున్నది ఆ లోగిలి! 


గడప గౌరి పసుపు కుంకుమలతో నిండి, వాకిలి కి కట్టిన పచ్చని మామిడి ఆకులు, బంతిపూల తోరణంతో పండు ముత్తయిదువులా పకపకలాడుతున్నది ఆ లోగిలి!


జడగంటలు ఊపుకుంటూ, పచ్చని లంగా, ఎర్రని జరీ అంచు జాకెట్టు, ఎర్రని ఓణీలతో, నిండు యవ్వనం తొణికిసలాడే పడుచు పిల్ల పకపకలాడుతూ, ఎదురు వచ్చింది, అప్పుడే ఆ గడపలో కాలు పెడుతున్న ఆ ఇంటి ఆడబడుచు నీలవేణికి. వెనకాలే టాక్సీకి డబ్బులు ఇచ్చి వస్తున్నాడు ఆ ఇంటి అల్లుడు, నీలవేణి భర్త శ్యాంసుందర్. 


"అమ్మా! అత్తయ్యా మామయ్య వచ్చారే" అత్త చేతిలో బాగ్ అందుకుంటూ లోపలికి కేక వేస్తున్న మేనకోడలిని మురిపెంగా చూస్తూ నీలవేణి, "ఎంత పొడుగయ్యావే?" అంటూ బుగ్గలు పుణికింది. 

"అంతా నీ పోలికే అంటారు అత్తా" అంటూ అత్తని ఇష్టంగా చూస్తూ అన్నది స్నిగ్ధ. 


పెద్ద వదినగారు సుమిత్ర చెంగుకి చేతులు తుడుచుకుంటూ ఆడబడుచుని అక్కున చేర్చుకుని, కొంగు కప్పుకుంటూ, ఇంటి అల్లుడి యోగక్షేమాలనడిగింది. 


మెల్లిగా తల్లి రాజేశ్వరి, తండ్రి రామారావు, పెద్దఆన్నగారు శేషాద్రి, చిన్న అన్న సాకేత్, చిన్న వదిన రమ్య, వాళ్ళ అబ్బాయి రవి, కూతురు లాస్య, పెద్దన్నగారి కొడుకు పార్థు... అంతా బిలల్లాడుతూ వచ్చారు. 


ఉగాది పండుగ అంతా వాళ్ళింట్లోనే ఉన్నదా అన్నట్లు అందరూ హాసపరిహాసాలతో, తలా ఒక పని చేసుకుంటూ, తోటి కోడళ్లద్దరూ మడి కట్టుకుని అత్తగారు చెప్పినట్లు చేస్తూ, అరమరికలు లేకుండా నవకాయ పిండివంటల్తో వంటలు చేశారు. మగవాళ్ళు, అత్తగారు, పిల్లలకి తీరుగా అరిటాకులు వేసి వడ్డించి వాళ్లంతా తిని లేచాక, తోటికోడళ్లు, ఆడబడుచు కూర్చున్నారు భోజనాలకి. 


"నువ్వు కూడా వాళ్ళందరితో కూర్చుని తినవమ్మా అంటే తిన్నావు కాదు. చూడు రెండు దాటిపోయింది. " పెద్ద వదిన సుమిత్ర మరదలిని చిన్నగా మందలిస్తూ అన్నది. 


"ఆ అమ్మా! అక్కచెల్లెలిద్దరూ మాకు వేయకుండా ఏమి దాచిపెట్టి వేసుకుంటున్నారో చూడద్దూ!" నీలవేణి మేలమాడింది. 

పెద్ద వదిన తల మీద చిన్నగా మొట్టి, " మేమేం తింటున్నామో చూస్తావు కదూ... ఇదిగో.. ఈ పెద్ద బొబ్బట్టు నీకోసం ప్రత్యేకంగా చేసా. ఆపకుండా తినాలి" సుమిత్ర కూడా మరదలిని ఆట పట్టించడం మొదలెట్టింది. 


చిన్న వదిన రమ్య, "పిల్లల్ని ఎప్పుడూ తేవేమిటి నీలా?" అన్నది. 


"మహేష్ ఇప్పుడు జాబ్ మారాడు. కొత్తది కదా సెలవు పెట్టే వీలు లేదని వాడు రాలేదు. ఇంక సుస్మితకి ఫైనల్ పరీక్షలు బాగా దగ్గరకొచ్చాయి అని, అది రాలేదు... అంటే వదినా". 

"సుస్మిత ఏమి చదువుతున్నదే"? అక్కడే ముక్కాలి పీట మీద కూర్చుని వత్తులు చేసుకుంటూ, వీళ్ల మాటల్లో అప్పుడప్పుడు మాట కలుపుతున్న తల్లి ఆడిగిందానికి, "నువ్వెప్పుడూ మర్చిపోతూనే ఉంటావు మనవరాలి చదువు. అదిప్పుడు ఎం. టెక్ చేస్తున్నది. " అన్నది. 


సరదాగా వదినా మరదళ్ళు ఛలోక్తులతో భోజనాలు చేసారు. 

***


ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా, అల్పాహారాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్ల మీదకి పోయింది సంభాషణ. 


పెద్ద అన్నయ్య శేషాద్రి, " అమ్మాయ్ నీలా! ఈ ఏడాది ఆడపిల్లలు లాస్య, స్నిగ్ధ ఇద్దరికీ పెళ్లిళ్లు చెయ్యాలని నాన్నగారు తీర్మానించారు.... అని మాట్లాడబోతుంటే రామారావుగారు అందుకుని, "చెప్పవే అమ్మడూ! నీ కొడుక్కి ఏ మేనగోడల్ని చేసుకుంటావో?" అన్నారు. 


ఇంత సడన్ గా, ఇంత సూటిగా తండ్రి ప్రశ్నిస్తుంటే నీలవేణి ఖంగుతిన్నది. ఒక్క నిమిషం తమాయించుకుని, "నన్ను అడుగుతారేమిటి నాన్నగారు? మీ అల్లుడు పక్కనే ఉన్నారుగా... ఆయన్ని అడగండి " అన్నది. 


బాధ్యత అంతా తన మీదకి నెట్టేసి తప్పించుకున్న భార్యని కొరకొరా చూసి, సమాధానం కోసం చూస్తున్న మావగారితో, "ఇంకా ఇప్పుడే అనుకోవడం లేదండీ. అయినా ఎప్పుడయినా వాడి ఇష్టమే" అంటూ ఆయనా తప్పించుకున్నాడు. 



ఇంతలో లాస్య చేతిలో సెల్ మోగింది. 

మహేష్ ఫోన్ చేసాడు... లాస్య అవతలి రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతుంటే, రమ్య కూడా లేచి వెళ్ళింది... 


 ఇటీవల లాస్య అర్థరాత్రి దాకా ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన రమ్య ఆమె సెల్ ఫోన్ లో హిస్టరీ అంతా చూసింది. మహేష్ దగ్గర నుండి రోజూ కాల్స్ ఉండటం చూసింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆ దిశగా మాట్లాడుతున్నారు... అసలు సంగతి తెలుసుకుందామని లేచింది. 



మహేష్ తో మాట్లాడుతున్న లాస్య తల్లి రావటం చూసి ఖంగారేమీ పడలేదు. రమ్య చేతికి ఫోన్ ఇచ్చింది. మహేష్, "హాయ్ చిన్నత్తా! ఫోన్ తీసుకుని నువ్వు పెద్దవాళ్ళ దగ్గరకు రా" అన్నాడు. మహేష్ వీడియో కాల్ లో మాట్లడటం అందరికీ కనపడేటట్లు గా అక్కడ టేబిల్ మీద పెట్టింది రమ్య. 


అందరూ ఆశ్చర్యంగా, సందేహంగా రకరకాల ఆలోచనలతో వింటున్నారు. 


పండగ పలకరింపులు అయ్యాక మహేష్ చాలా కూల్ గా తాతయ్య రామారావు గారిని, అందర్నీ ఉద్దేశించి, 

అసలు మేనరికాల వలన జరిగే ఎన్నో జెనిటికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి, చిన్నప్పట్నుంచీ ఒక్క చోట చాలా రోజులు కలిసి ఆడుకున్న తమ పిల్లలందరి మధ్యనా స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాడు ముందుగా. తరవాత అదే స్నేహం లాస్యకి, తనకీ చాలా ఎక్కువ అని చెప్తూ, లాస్య తనతో పంచుకున్న తన ప్రేమ కథ గురించి చెప్పాడు. వింటున్న వాళ్ళు విస్తుపోయారు! 


పండగ వాతావరణం చాలా సీరియస్ గా అయిపోయింది. అసలు తమకు చెప్పకుండా మహేష్ కి చెప్పడం ఏమిటి, అని ముందుగా గింజుకున్నారు. మహేష్ ఓపికగా నచ్చచెప్పాడు, లాస్య అన్నలు రవి, పార్థులకు కూడా తెలుసని, వాళ్ళు తన లాగా ధైర్యం చెయ్యలేకపోతున్నారనీ చెప్పి, అసలు లాస్య, ఆ అబ్బాయి పరస్పరం ఇష్టపడిన వెంటనే తమ ముగ్గురికీ చెప్పారని, అప్పట్నుంచీ తాము వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నామని, ముఖ్యంగా ఆ ఆబ్బాయి గురించి అన్ని విషయాలు విచారించామని. ఇంతకీ ఆ అబ్బాయి పెద్ద వాళ్లకు తెలియని వాడు ఏమీ కాదంటూ, ఎవరో చెప్పారు. రామారావు గారు ఆ సంబంధం వివరాలు వింటూనే తాడెత్తున లేచారు!

***


చిన్నప్పట్నుంచీ ఒక కంచం, ఒక మంచంగా పెరిగి, అక్కచెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న స్నేహితులు, తోడల్లుళ్లు రామారావు, పరాందామయ్య. ఒకానొక భూమి విషయంలో వచ్చిన స్పర్థల వలన ఈనాటికి గర్భ శత్రువులయ్యారు!


పరందామయ్య కూతురు అనుపమ కొడుకు మురళి, లాస్య కాలేజీలో స్నేహితులయ్యారు, సన్నిహితులేనని తెలుసుకున్నారు. కాలక్రమంలో ప్రేమ అంకురించింది వాళ్ళ మధ్యన. కానీ కుటుంబాల పాత పగలు తమ ప్రేమకి అవరోధమవుతాయని, ముందుగానే అన్నలకి, చిన్ననాటి చెలికాడికి చెప్పి లాస్య, మురళిని కూడా కలిపించింది. ఇపుడు లాస్య, మురళి ఎంబీఏ చేసి ఒకటే కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి చెప్పాలంటే భయపడి ఇంక ఇప్పుడు తెరతీశారు. రవి, పార్థు కూడా తాతయ్య, తల్లిదండ్రులతో ఎదురు కుండా నిలబడి అన్ని విషయాలూ పూస గ్రుచ్చినట్లు చెప్పారు. 


కోపంతో మండి పడుతున్న రామారావుగారిని, నీలవేణి, శేషాద్రి శాంతపరిచారు. నీలవేణి, "నాన్నగారూ! ఎప్పుడో మీకు, పరం బాబాయికి వచ్చిన గొడవలు వలన, లాస్యని బాధ పెడతారా?" అంటుంటే, శేషాద్రి, "అది అయోగ్యుణ్ణి ప్రేమించలేదు. మన మధ్యలో పెరిగిన మన కుటుంబాల్లో పిల్లవాణ్ణి ఎంచుకున్నది. నాన్నగారూ! మీరు ఎన్నిసార్లు పరం బాబాయితో ఉన్న ఫోటోలు చూసుకుంటూ బాధపడటం నేను చూశానో. ఇంక ఇలా కలుపుకోవటంతో మీ పగలకి తెర వేసేయండి నాన్నగారు. " అని ఎన్నో విధాలా చెప్పారు. ఎన్నడూ దేనికీ మాట్లాడని భార్య రాజేశ్వరి కూడా, "అనుని నేనే పెంచానండీ. అది పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గిర పాలు లేకపోతే నేనిచ్చాను. అప్పుడు శేషు పసివాడు. వద్దండీ ఇంక ఈ గొడవలు" అని బ్రతిమాలింది. అందరి వేడికోళ్లకి కరిగిపోయారు రామారావుగారు. 


అంత తొందరగా అహం వదులుకోలేని రామారావుగారు, " వాడు ఎన్నేసి మాటలన్నాడురా, వెధవ భూమి కోసం!"

శేషాద్రి నవ్వుకున్నాడు, 'ఈయన తక్కువ మాటలన్నాడా?' అని. 


"కోపం అంటూ వచ్చాక ఎవరేమి మాట్లాడుతున్నారో ఎవరు మాత్రం గ్రహించుకుని మాట్లాడతారు నాన్నగారూ?”

అన్యాపదేశంగా కొడుకు ఎత్తి చూపుతున్నది తననే అని అర్థమయింది ఆయనకి. 

ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. 


రాజేశ్వరి ఊరుకోలేక, " ఇలాగే మీరిద్దరూ పంతాలు పట్టి కూర్చోండి. పిల్లలు చెప్పా పెట్టకుండా దండలతో వాకిట్లో నిలబడతారు. అప్పుడు ఇద్దరు పెద్దమనుషుల పరువు ఏ గంగలో కలుస్తుందో ఆలోచించుకోండి. మంచి పిల్లలు కనక, పెద్దవాళ్లకి గౌరవం ఇచ్చి ఇలా ముందుగానే చెప్తున్నారు" గట్టిగా నాలుగూ ఝాడించింది. 


నీలవేణి, " అవునండీ నాన్నగారూ! ఎన్ని రకాలు వింటున్నాము పిల్లలు ప్రేమ పేరుతో చేసే పైశాచికమైన పనులు... నా మాట విని మీరు పెద్ద మనసు చేసుకుని బాబాయికి ఫోన్ చెయ్యండి. ఆయన కాదంటే అప్పుడే చూడచ్చు" అన్నది. 


"ఆ నామాట కాదంటాడూ... " అంటూనే, ఆ ఊళ్ళోనే ఉంటున్న స్నేహితుడికి ఫోన్ చేశారు రామారావుగారు. అంతా నీలవేణిని ప్రశంసాత్మకంగా చూసారు. 


 అక్కడ పరందామయ్యగారి ఇంట్లో కూడా ఇదే ప్రహసనం నడిచింది. మురళి తండ్రి రఘు, అనుపమ తండ్రికి నచ్చచెప్పారు. 


వాళ్ల కుటుంబమంతా తమ తోటలో కాసినవి, పూసినవీ తీసుకుని రామారావు కుటుంబాన్ని కలవడానికొచ్చారు. 


రామారావు చాపిన కౌగిట్లోకి పరందామయ్య ఒదిగిపోయాడు!

ఉగాది సంబరాలు అంబరానంటాయి ఆ ఇంట... పిల్లలు విజ్ఞతతో చెప్పిన తీర్పుతో!

***

విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!


67 views0 comments

Commentaires


bottom of page