top of page

కోడలు ఇన్ - అత్త అవుట్



'Kodalu In Attha Out' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 12/03/2024

'కోడలు ఇన్ - అత్త అవుట్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


పెళ్ళి గురించి అందమైన కల లేనిది ఎవరికి? పెళ్ళి కాని అబ్బాయిలందరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుందామా.. అని ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే పెళ్ళాం, వాళ్ళకు ఇష్టమైన సినిమా హీరోయిన్ లాగానో, లేకపోతే ఒక మిస్ వరల్డ్ లేదా మిస్ యూనివర్స్ లాగానో ఉండాలని కలలు కంటారు. ఇలాగే మన హీరో బాలు కుడా ఆలోచిస్తున్నాడు. చేసేది ఒక ప్రైవేటు కంపెనీ లో మంచి ఉద్యోగం.. 'వంటి మీదకి పాతిక వచ్చి.. నాకూ ఒక తోడు కావాలి' అని రోజూ గుర్తు చేస్తూనే ఉంది. అదే మాట వాళ్ళమ్మకి రోజూ గుర్తు చేస్తున్నాడు బాలు. 


"ఒరేయ్ బాలు! అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా! అమ్మ చేతి వంట తినకుండా ఉండలేవు, అమ్మను చూడకుండా ఒక్క రోజు కుడా ఉండలేవు.. అందుకే, బయట ఊరిలో ఉద్యోగం వచ్చినా, వెళ్ళనని మొండికేసావు. పెళ్ళి చేసుకుంటే.. నన్ను ఎలా చూసుకుంటావు.. ? పెళ్ళాం వస్తే, నన్ను మర్చిపోవు కదా.. !?"


"అమ్మా! నువ్వు టీవీ లో సీరియల్స్ బాగా ఫాలో అయిపోతున్నావు.. అందుకే, నీకు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి.. డైలాగ్స్ కుడా అలాగే ఉన్నాయి. నీకు అర్ధమయ్యే విధంగా.. ఆ సీరియల్స్ భాష లోనే చెబుతాను విను.. 


"అమ్మా! నిన్ను బాగా చూసుకుంటాను.. అమ్మ అంటే దైవం.. నువ్వే ఫస్ట్. పెళ్ళాం కొత్త.. సెకండ్. నాకసలే పెళ్ళాం కొత్త.. భయంగా ఉంటుంది.. కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలి అమ్మా!"


"నా మంచి కొడుకు.. అమ్మంటే నీకు ఎంత ప్రేమో.. వేరే కాపురం అది పెట్టమాకు.. ! పెళ్ళాం చెప్పినా వినకు. నీకు నేను అన్నీ చేసి పెడతాను. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు.. "


"అందంగా ఉండాలి, తెలివి ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి.. నిన్ను ఇంకా బాగా చూసుకోవాలి.. "

"మా బంగారమే.. " అని మురుసిపోయింది తల్లి జానకమ్మ 


కిందటి సంవత్సరం మొదలైన కొత్త సీరియల్ 'కోడలు ఇన్ - అత్త అవుట్' లో కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలు లాగ కొంపదీసి తనని ఇంట్లోంచి బయటకు పంపదు కదా వచ్చే కొత్త కోడలు.. ? అని మనుసులో అనేక ఆలోచనలు జానకమ్మ కి. తెలివితేటలు ఉంటే, పొగరుగా ఉండి.. వేరే కాపురం పెట్టే ఆలోచన చేస్తుందేమో వచ్చే నా కోడలు.. ఏం చెయ్యాలబ్బా.. ? అని ఆలోచనలోపడింది జానకమ్మ. అప్పుడే గుర్తొచ్చింది.. 'తెలివైన అత్త' సీరియల్ లో అత్త ఆలోచనలాగా 'చదువుకుంటేనే కదా తెలివితేటలు.. లేకపోతే చెప్పినట్టే వింటుంది కోడలు.. ' అని అనుకుంది జానకమ్మ. 


అనుకున్నట్టుగానే కొడుకు పెళ్ళి కోసం పిల్ల వేట మొదలుపెట్టింది జానకమ్మ. ఆ ఊరు, ఈ ఊరు.. అన్ని చోట్ల చూసింది. చదువు.. తెలివి రెండూ తక్కువ ఉన్న అమ్మాయి దొరకలేదు. ఈ లోపు పక్క వీధిలో ఉన్న మాస్టారి అమ్మాయి కి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ఒక రాయి వేద్దాం అని వెళ్ళి ఎంక్వయిరీ చేసింది. ముందు రోజు చూసిన 'పెళ్ళి చూపులు' సీరియల్ స్క్రిప్ట్ ని గుర్తుపెట్టుకుని.. పెళ్ళిచూపులకి బయల్దేరింది జానకమ్మ.. కొడుకుని వెంటబెట్టుకుని.. 


"నీ పేరు ఏమిటి.. ?" అడిగాడు బాలు

"కావ్య.. " అంది పెళ్ళికూతురు

"ఒరేయ్ బాలు! అమ్మాయిని బాగా చూసుకో.. కావాలంటే విడిగా మాట్లడుకో.. పెళ్ళంటే నూరేళ్ళ పంట.. "

"అలాగే అమ్మా.. "

"అమ్మా.. !నాకు అమ్మాయి బాగా నచ్చింది.. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కానీ.. నా కన్నా ఎక్కువ ఇంట్లో నీతోనే ఉంటుందిగా.. నీకూ నచ్చాలి కదా" అన్నాడు బాలు 

"సంతోషం బాలు! అలాగే.. !" అంది జానకమ్మ


'పెళ్ళి చూపులు' సీరియల్ స్క్రిప్ట్ ని మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుని మొదలుపెట్టింది జానకమ్మ.. 


"అమ్మాయి.. ! నువ్వు కొంచం అలా నడిపించి చూపించు.. "

"అలాగే.. ఆంటీ.. " అని ఒక నాలుగు అడుగులు వేసింది కావ్య.


"అమ్మాయి.. ! అలా.. గట్టిగా పాడి వినిపించు.. "


"అలాగే ఆంటీ.. " అని ఏదో తెలియని ఒక రాగం అందుకుంది.


"అమ్మాయికి.. దైవ భక్తి ఉందా.. ?"


"వదిన గారు.. ! మా అమ్మాయి పెద్ద చదువులు చదువుకోకపోయినా.. దైవ భక్తి మాత్రం చాలా ఉందండి.. ! కొత్త కొత్త పూజలు, నోములు అవీ చేస్తూ ఉంటుంది.. "


"మా అమ్మ నన్ను మరీ పొగుడుతుంది.. ఎన్ని చేసినా.. మా ఆయన కోసమే.. మా అత్తగారి కోసమే కదా.. " అంది కావ్య.

 

"అమ్మాయికి చాలా భక్తి అనుకుంటా.. ! ఆ మాత్రం భక్తీ ఉండాలి.. " అంది జానకమ్మ.


"ఒరేయ్ బాలు! నాకు అమ్మాయి ఓకే.. ముహూర్తాలు పెట్టించేయమంటావా.. ?"


"అలాగే అమ్మా.. !"


కొడుకు పెళ్ళి వైభవంగా జరిగిందని తల్లి జానకమ్మ చాలా ఆనందపడింది. కొత్త కోడలు ఇంట్లో పనంతా చెయ్యడం, కమ్మగా వంట చెయ్యడం చేత.. కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారిని ఆకట్టుకుంది కావ్య. 'నేను భయపడినట్టుగా కోడలు ఏమీ లేదని.. ' మనసులో చాలా ఆనందపడింది జానకమ్మ. కొడుకుతో కోడలు సరదాగా ఉండడం.. వారి సరదాలు చూసి.. 'పెళ్ళైన కొత్తలో' సీరియల్ లో లాగ నా కొడుకు కోరుకున్నట్టుగానే అమ్మాయి ఉందని మురుసిపోయింది. 


ఇలా ఉంటుండగా ఒక రోజు.. 


"అత్తయ్యా.. ! మేము కొత్త ఇంటికి మారిపోదామని అనుకుంటున్నాము.. "


"పెళ్ళయి సంవత్సరం కుడా అవలేదు.. అప్పుడే ఎందుకు.. ?" అంది జానకమ్మ.

 

"మంచి ఇంటికి వెళ్లడం తప్పా అత్తయ్యా!"


"ఒరేయ్ బాలు! నువ్వైనా చెప్పరా నీ పెళ్ళానికి.. నిజంగా కొత్త ఇంటికి వెళ్లిపోతారా మీరు.. ?"

"అవునమ్మా! కావ్య చెప్పింది నిజమే.. !పెద్ద ఇల్లు తీసుకున్నాము.. "


"నన్ను ఇంట్లోంచి పంపించేసి.. ఇద్దరూ వేరే కాపురం పెడతారా? నేను ఏదైతే భయపడ్డానో అదే చేస్తున్నావా బాలూ.. !"


"లేదు అత్తయ్యా! మీ భయం నాకు అర్ధమైంది.. నాకు మా అమ్మ ఎంతో.. మీరూ అంతే.. ! మిమల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తాము చెప్పండి.. ? మీరు టీవీ లో సీరియల్స్ ఎక్కువగా చూసి.. అన్నీ అలానే ఉహించుకుని.. భయం పెంచేసుకున్నారు అత్తయ్యా! అంతే.. ! మన అందరమూ కలిసి కొత్త ఇంట్లో ఒకే చోట ఉంటాము.. "


" 'నా కోడలు బంగారం' సీరియల్ లో కోడలే.. అచ్చంగా నా కోడలు.. నేనే అనవసరంగా భయపడిపోయాను.. " అని నవ్వుతూ అంది జానకమ్మ.. 


***********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


120 views0 comments
bottom of page