top of page

కొంప మునిగింది!


'Kompa Munigindi' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 18/10/2023

'కొంప మునిగింది' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఆలోచనలతో సతమతమవుతూ అన్యమనస్కంగా నడుస్తున్నాడు సీతన్న. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. సీతన్న వయసు యాభై దాటింది. ఈ బస్తీలోనే నలభై ఏళ్ళనుండి ఉంటున్నాడు. చిన్నప్పడు తల్లి తండ్రులతో కలిసి వచ్చాడు. తల్లి తండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. తను భార్యా పిల్లలతో అక్కడ మిగిలాడు.


తనొక్కడే కాదు, ఆ బస్తీలోనే తనలాంటివారు వందమంది పైగా ఉన్నారు. ఎవరిపేరునా స్థలం పట్టాలు లేవు. వాళ్ళు నివసిస్తున్న జాగా పట్టాలు వాళ్ళకి ఇస్తామని రాజకీయ నాయకులు వచ్చి హామీలు గుప్పించి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు కూడా మర్చిపోతూనే ఉన్నారు యధావిధిగా. ఇలా ఏళ్ళ తరతరబడి సాగుతూనే ఉంది.


అయితే, ఇప్పుడు ఓ పెద్ద ఆపద వచ్చి పడింది. వాళ్ళ పేరున పట్టాలు లేకపోవడంతో వాళ్ళకి ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఓ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అందుకోసం మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ జాగాలు ఈ గడువు లోపున వాళ్ళ పేరున మార్చుకోకపోతే వాళ్ళు తమతమ స్థలాలు వదులుకోవలసిందే! అందుకోసం కావల్సిన డబ్బులు ఎలాగో సమకూర్చుకున్నారు ఆ బస్తీవాళ్ళు సీతన్నతో సహా.


ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిన వాళ్ళకి అప్పుడే మరో అవాంతరం ఎదురైంది. అందరి గుండెల్లో రాయి పడింది. ఆ పని చేసే ఆఫీసరు అహోబలరావు తలా ఓ లక్ష రూపాయలు ఇస్తే గానీ పట్టాలు వాళ్ళ పేర బదిలీ చెయ్యనని భీష్మించుకున్నాడు. అంత డబ్బులు తమ వద్ద లేవని, ఎలాగోలా ఓ పదివేలైతే మాత్రం ఇచ్చుకోగలమని అతని కాళ్ళావేళ్ళా పడ్డారు అందరూ. కానీ అతను ఏ మాత్రం తగ్గలేదు, వినిపించుకోలేదు. ఏమాత్రం కనికరం చూపలేదు.


రోజులు గడిచిపోతున్నాయి. అతను అడిగిన డబ్బులు సమకూర్చుకునే స్థోమత ఆ బస్తీలో ఎవరికీ లేదు. ఈలోపున చాలా సార్లు అతన్ని బతిమాలుకున్నారు. కానీ, వాళ్ళందర్నీ అహోబలరావు చీదరింపుగా చూసి తన నౌకర్లచేత వెళ్ళగొట్టించాడు. లక్ష రూపాయలకి ఏ మాత్రం తగ్గినా పని జరగదని తేల్చి చెప్పాడు. అంత డబ్బులు ఎలా, ఎక్కణ్ణుంచి తేవాలో తెలియక అందరి మనసుల్లో నైరాశ్యం గూడు కట్టుకుంది. అలా ఆలోచిస్తూ నడుస్తున్న సీతన్నకి ఎదురు పడ్డాడు రామయ్య. అతను కూడా సీతన్నలాగే ఆ బస్తీలో తన చిన్నప్పుడు స్థిరపడినవాడే!


ఏం చెయ్యాలో తోచక తనలాగే ఇటూ అటూ తిరుగుతున్నవాడు సీతన్నని చూడగానే పలకరించాడు. "ఏం సీతన్నా! నీకేమైనా డబ్బులు సమకూరాయా?" అడిగాడు.


"లేదు! మనందరికీ ఒకటే కథ కదా? ఎక్కణ్ణుంచు తేగలం అంత డబ్బులు." అన్నాడు నిరాశగా.

"అయితే మనం ఈ బస్తీ వదిలేయల్సిందేనా! ఇన్నేళ్ళుగా ఇక్కడున్నాం, ఇప్పుడెక్కడికి వెళతాం, ఎలా బతుకుతాం? ఏ రాజకీయ నాయకుడూ కూడా మనకి సహాయం చెయ్యడాయే!" చెప్పాడు సీతన్న.


"ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి ఏం లాభం?" వేదాంత ధోరణిలో అన్నాడు రామయ్య.


"అలా అనుకునే, మన బస్తీ యువకులు ధర్నా చేసారు, కానీ ఏం లాభం, లాఠీ చార్జి చేసి వాళ్ళని వెళ్ళగొట్టారు కదా! అర్జీ పెట్టుకున్నా వినేవాళ్ళే కరువయ్యారు కదా!" అన్నాడు సీతన్న.


ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళారు. అలా సీతన్న ఊరి బయటకు వెళ్ళాడు ఏదో ఆలోచిస్తూనే. హఠాత్తుగా కాలికి ఏదో తగిలి, ఈ లోకంలోకి వచ్చి కిందకి చూసాడు. ఆ చీకటిలో ఏదో పాలిథిన్ బ్యాగ్ నేలమీద కనపడింది. 'ఏమిటా' అని కుతూహలంకొద్దీ చూసాడు. ముందు ఏ తీవ్రవాది పెట్టిన బాంబు కాదుకదా అని ఓ క్షణం భయపడినా, తను ఇప్పుడున్న పరిస్థితిలో బతికినా, చచ్చినా ఒకటే అని గుర్తుకువచ్చి విరక్తిగా మనసులోనే నవ్వుకున్నాడు. ఆ సంచీ చేతులోకి తీసుకొని, అందులోకి చూసిన సీతన్న కళ్ళు చెదిరిపోయాయి.


అందులో తళతళ లాడుతున్న కొత్త నోట్లు చూసిన సీతన్న కళ్ళు ఒక్క క్షణం ఆనందంతో మెరిసాయి. మళ్ళీ పాపం ఆ డబ్బులు పోగొట్టుకున్న అభాగ్యుడెవడో అని మనసులోనే మధనపడ్డాడు. ఇంటికి తీసికెళ్ళి తీరిగ్గా లెక్కపెట్టిన సీతన్నకి వెంటనే ఓ ఆలోచన స్పురించింది. అందులో ఎలాగూ ఆ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి వివరాలూ లేవు కాబట్టి, తిరిగి ఇవ్వడం కుదరదు. అంతేకాక, అక్కడే సీతన్న చాలాసేపు కాచుకున్నా ఎవరూ రాకపోవడంతో ఆ పాలిథిన్ సంచీని ఇంటికి తీసుకువచ్చాడు.


'ఆ సంచీలో ఉన్న డబ్బులు తన బస్తీలో ఉన్నవాళ్ళందరి కష్టాలూ తీర్చగలదు. అహోబలరావుకి అతనడిగిన ముడుపులు చెల్లించి ఇళ్ళ పట్టాలు పొందవచ్చు. సరిగ్గా సమయానికి దేముడే దిగివచ్చి అందించినట్లు ఉందీ డబ్బులు.'


ఇలా ఆలోచించిన సీతయ్య ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోలేకపోయాడు. రామయ్యని తన ఇంటికి పిలిచి, విషయం వివరించాడు. అతనూ సంతోషంగా అందుకు ఒప్పుకున్నాడు. బస్తీవాళ్ళందరితో చర్చించాడు, ఆ మరుసటి రోజు అహోబలరావుని కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందరూ.


*******

బస్తీ అంతా తన ఆఫీసులో గుమిగూడేసరికి అహోబలరావు మనసు ముందు ఏదో కీడు శంకించింది. తనకేదో ఆపద తలపెడతారేమోనని భయపడ్డ అహోబలరావు పోలీసులకి ఫోన్ చెయ్యడానికి ఉద్యుక్తుడవుతుండగా, సీతయ్య ఆఫీసరు గదిలోకి ప్రవేశించి అతనికి ఓ దండపెట్టి, "దండాలు బాబయ్యా! తమరు చెప్పినట్లే మేమంతా మీరు చెప్పిన డబ్బులు తెచ్చాం. అవి పుచ్చుకొని, మా పేరున పట్టాలు ఇవ్వండయ్యా!" అన్నాడు.


అతనివైపు విస్మయంగా చూసాడు అహోబలరావు. వాళ్ళు బీద అరుపులు అరిచేసరికి తను బెదిరిపోతాడనుకున్నారు వెర్రివాళ్ళు, ఇప్పటికి వాళ్ళకి వాస్తవం తెలిసివచ్చింది.


గర్వంగా తల ఎగరేసి, "సరే! మీరందరూ ఆఫీసు ఎదురుగా ఉన్న టీ కొట్టులో కూర్చున్న తిమ్మయ్యకి డబ్బులు చెల్లించి, అతనిచ్చే చీటీ తీసుకురండి. మీ పట్టాలన్నీ క్షణంలో చేసి ఇస్తాను." మొహంమీద నవ్వు పులుముకుంటూ చెప్పాడు అహోబలరావు.


వాళ్ళ దగ్గరనుండి స్వయంగా డబ్బులు తీసుకుంటే ఎక్కడ అనిశా వాళ్ళు వచ్చి మీద పడతారో అన్న భయం ఉన్న అహోబలరావు అందుకోసం ఈ 'తిమ్మయ్య ' ఏర్పాటు చేసుకున్నాడు. వెంటనే, అందరూ తిమ్మయ్య టీ దుకాణం చేరుకున్నారు. తిమ్మయ్యకి ఇక క్షణం తీరిక లేకుండా పోయింది. టీ దుకాణం తన దగ్గర పని చేస్తున్న కుర్రాడికి అప్పగించి, బస్తీ వాళ్ళ వద్దనుండి డబ్బులు తీసుకొని, లెక్కపెట్టి, చిట్టీలు ఇచ్చే పనిలో పడ్డాడు.


అలా తిమ్మయ్య వద్ద నుండి చీటీలు పట్టుకెళ్ళి, ఆ చీటీని అహోబలరావుకి చూపించడం, అతను పట్టాలు వాళ్ళ చేతులో పెట్టడం అంతా చకచకా జరిగిపోతోంది. అహోబలరావు సంతోషంతో తబ్బిబయిపోతున్నాడు. ఒక్కరోజులోనే ఎంత సంపాదన! ఒక్క రోజులోనే తను కోటీశ్వరుడైపోయాడు తను. ఈ డబ్బులతో ఏమేం చెయ్యాలో, ఎక్కడ విల్లాలు కొనుగోలు చెయ్యాలో మనసులోనే లెక్కలు వెయ్యసాగాడు.


బెంగుళూరులో కొంటే బాగుంటుందా, ఊటిలో కొంటే బాగుంటుందా అని మనసులోనే బేరీజు వేసుకుంటున్నాడు అహోబలరావు. ప్రతీరోజూ సాయంకాలం అయిదు గంటలకల్లా ఠంచనుగా ఆఫీసు వదిలే అహోబలరావు రాత్రి ఎనిమిదైనా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు, గడియారం తొమ్మిది గంటలు కొట్టేసరికి ఆ బస్తీ వాళ్ళందరి పని పూర్తైయింది. మనసులోనే లెక్కలు వేసుకుంటున్నాడు అతను. సిబ్బందికి కూడా అందులో కొంత వాటా ఇయ్యాలి, అలాగే తిమ్మయ్యకి కూడా కొంత సొమ్ము ఇవ్వాలి, ఆ తర్వాత తన వద్ద నికరంగా మిగిలేదెంతని ఓ లెక్క వేసుకోసాగాడు. ఎంతలేదన్నా కోటికి పైగా తన వాటా వస్తుందని తేలిపోయింది.


సంతోషంగా ఆఫీసు నుండి బయటపడి ఇంటి దారి పట్టాడు. తిమ్మయ్యకి ముందే చెప్పాడు ఆ డబ్బులు తనకి ఇంట్లో ఇవ్వమని. ఇంటికొచ్చి భార్య అహల్య తెచ్చిన కాఫీ సేవించిన అహోబలరావు, "ఇవాళ మన పంట పండింది. మనం ఇప్పుడు కోటీశ్వరులం. ఈ ఒక్కరోజే నేను కోటి రూపాయలు సంపాదించానంటే నమ్ముతావా?" అన్నాడు నవ్వుతూ.


అహల్యకి తన భర్త సమర్థత మీద అంతులేని నమ్మకం ఉంది. "తప్పకుండా నమ్ముతానండీ! నాకు తప్పకుండా రవ్వల నెక్లెస్ కొంటారు కదా!" అని తన చిరకాల కోరిక చెప్పిందామె.


"అలాగేలేవే!" అంటూ తిమ్మయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అరగంటలో తిమ్మయ్య వచ్చాడు. అతను తెచ్చిన డబ్బుల మూట అందుకుని, టేబులు మీద పెట్టి, "కూర్చోవయ్యా, తిమ్మయ్య!" అని అందులోని నోట్ల కట్టలను బయటకు తీసాడు. అంతే! ఆ నోట్లను చూస్తూనే తాచుపాముని చూసినట్లు ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారి షాక్ కొట్టిందతనికి. అందులో ఉన్నవన్నీ సరికొత్త రెండువేల రూపాయల నోట్లు. అవి మార్చుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు, అంటే సెప్టెంబర్ ముప్ఫై తారీఖు. అవి మార్చడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళతో సరి!


అయినా కోటికి పైగా ఉన్న ఈ డబ్బులు తను బ్యాంక్‌లో గనుక జమ చేస్తే, అనిశావే కాదు, ఆదాయ పన్ను శాఖవాళ్ళు కూడా తన పీక పట్టుకుంటారు. తిమ్మయ్యకి తన తరఫున డబ్బులు తీసుకోవడమే కానీ ఇంకేమీ తెలియదు. ఇప్పుడీ డబ్బులేమి చెయ్యాల్లో తోచక బుర్ర గోక్కున్నాడు పాపం అహోబలరావు. "కొంప మునిగింది!" అని మనసులోనే గొణుకున్నాడు.


వాళ్ళు ఇవ్వచూపిన పదివేలైనా పుచ్చుకున్నాను కాదు అనుకొని మనసులోనే మూలిగాడు. కావాలని పారేసిన రెండు వేల నోట్ల కట్టలు సీతన్నలాంటి వాళ్ళ కొంపలు నిలిపాయి. వాళ్ళకీ ఆ విషయం తెలిసినా, పట్టాలు దొరికితే చాలని అవి తిమ్మయ్యకి అంటగట్టి, అహోబలరావునుంచి పట్టాలు సాధించారు, అవి పారేసిన ఆ అజ్ఞాత వ్యక్తికి మనసులోనే దండం పెడుతూ.


************

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


74 views0 comments

Comments


bottom of page