top of page

కొత్త కథ కావాలోచ్!


'Kotha Katha Kavaloch'- New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 17/10/2023

'కొత్త కథ కావాలోచ్' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"సరికొత్త కథ కావాలి!" అన్న ప్రకటన వార్తా పత్రికలో కనపడగానే ఆతృతగా ఆసాంతం చదివాడు వర్ధమాన రచయిత వసంత్. నగరంలోకెల్లా ధనవంతుడిగా పేరున్న కోటీశ్వర్రావు తను తీయబోయే సినిమాలకు మంచి కథ కావాలని ఇచ్చిన ప్రకటన అది. అతి పిన్న వయసులోనే అనేక వ్యాపారాలకు, పరిశ్రమలకూ అధిపతిగా మారిన అతనికి మంచి పేరు ఉంది. తనకి కావలసిన కథ ఎలా ఉండాలో కూడా రచయితలకు కొన్ని సూచనలిచ్చాడు.


వసంత్ ఇప్పటికే చాలా కథలు, ఓ అరడజను నవలలు రాసి మంచి ఊపులో ఉన్నాడు. తనకెప్పటికైనా ఓ సినిమాకి కథ రాసే అవకాశం రాకపోతుందా అని ఎదురుతెన్నులు చూస్తున్నాడు. ఆ ప్రకటన చదవగానే ఎగిరి గంతేసాడు. ఒట్టికుట్టినే అలా ఎగిరి గెంతెయ్యడం, కుప్పిగంతులు వెయ్యడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వెంటనే అర్థం చేసుకొని, ఓ మంచి కథ తయారు చేసుకొని, కోటీశ్వర్రావుని కలిసి జాక్పాట్ కొట్టెయ్యాలని నిర్ణయించుకున్నాడు.


అనుకున్నదే తడువుగా ఓ డజను నవల్లు, పాతిక కథలు చదివి, ఓ సరికొత్త (?) కథ తయారు చేసుకొని కోటీశ్వర్రావుని కలవడానికి బయలుదేరాడు. సాయంకాలం ఆరుగంటలకల్లా కోటీశ్వర్రావు ఆఫీసుకి చేరుకొని, అతని పిలుపు కోసం ఎదురు చూస్తూ ముందు గదిలో సోఫాలో కూర్చున్నాడు వసంత్.


తనలాగే అక్కడ ఇంకో అరడజను మంది కూర్చొని ఉండటం చూసిన తర్వాత అతని ధైర్యం కొద్దిగా సన్నగిల్లింది. తమతో పోటీకి వచ్చిన వసంత్ని చూడగానే మొహం ముడుచుకుని తల తిప్పుకున్నారు అందులో అయిదుగురు. ఒకడు మాత్రం లేచి నిలబడి పలకరింపుగా నవ్వుతూ వసంత్ని సమీపించి, "మీరు కూడా కోటీశ్వర్రావు గారికి కథ వినిపించడానికి వచ్చారా?" అని అడిగాడు.


అవునని తల ఊపాడు వసంత్.


"నా పేరు కనకాంబరాల విశ్వేశ్వర్రావు, షార్ట్కట్గా 'కవి'. ఆ పేరుతోనే రచనలు చేస్తాను. నా రచనలన్నీ చాలా ప్రజాదరణ పొందాయి. నా కవితలు, కథలు, నవలలు మీరు చదివి ఉండాలే!" గలగలా మాట్లాడుతూ తనని తాను పరిచయం చేసుకున్నాడు సదరు కవి.


'లేదు!' అని చెప్తే పాపం ఎలా ఫీలవుతాడో అని భావించి ఓ చిరునవ్వు నవ్వి అవుననని మౌనంగా తల ఊపాడు వసంత్.


"చూసారా! నా గురించి తెలియని వారే లేరు ఈ తెలుగు రాష్ట్రాల్లో. అందుకే నా కథ వినిపించడానికి ఇక్కడికి వచ్చాను. నా కథతో సినిమా గనుక అతను తీసాడంటే సూపర్ హిట్ ఖాయం." అన్నాడు సొంత డబ్బా వాయించుకుంటూ.


"అవును మీ కథలన్నీ బాగుంటాయి." అన్నాడు వసంత్ ఎందుకైనా మంచిదని.

దాంతో ఆ ‘కవి’ మరింత రెచ్చిపోయాడు. "నా నవలలు, ఎదురింటి అమ్మాయి-పక్కింటి అబ్బాయి, పాపం పండింది, ఆడది-అగాధం, పండిపోయిన కాపురం-ఎండిపోయిన జీవితం, అల్లుడు దిద్దిన కాపురం, మామగారు-కొత్తల్లుడూ, పెళ్ళంటే నూరేళ్ళ మంట, లాంటివి ఎంత ప్రజాదరణ పొందాయో తెలుసా!" అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో, లోపల్నుండి ఓ రచయిత, కోటీశ్వర్రావు గారి పియ్యే ఏకాంబరం బయటకు వచ్చారు.


"కవిగారూ, మీరిప్పుడు లోపలికి రండి." అని ఏకాంబరం అతన్ని పిలవడంతో ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టాడు కవి.


బయటకి వచ్చిన రచయిత చుట్టూ మూగారందరూ. ఇంటర్వ్యూ ఇచ్చి బయటపడిన అభ్యర్థిని మిగతా అభ్యర్థులు ప్రశ్నించినట్లు ప్రశ్నించారు, "ఏమైంది?" అంటూ.


"కోటీశ్వర్రావుగారికి మూడు కథలు వినిపించాను. మూడు కథలూ అతనికి విపరీతంగా నచ్చాయి. అందులో నుండి ఏదో ఒకటి ఖాయంగా సినిమాగా తీస్తాడనుకుంటాను. అడ్వాన్స్ కూడా దండిగానే ఇచ్చాడతను." అన్నాడు ఉత్సాహంగా.


అతని మాటలు వసంత్ ఆసక్తిగా వింటూంటే మిగతా రచయితల మొహాలు మాత్రం బాగా మాడిపోయాయి. 'ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు!' అని ఒక్క వసంత్ మాత్రం నిబ్బరం కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంటే. అలా ఓ రెండు గంటలసేపు కూర్చున్నాక, లోపలికెళ్ళిన కవి ఉత్సాహంతో చిందులేస్తూ బయటపడ్డాడు.


"నా కథ కోటీశ్వర్రావు గారికి బాగా నచ్చిందోచ్! వచ్చే సంవత్సరం నా కథతో భారీ ఎత్తున నంబర్ వన్ దర్శకుడైన మంత్రిమౌళిని పెట్టి సినిమా తీస్తానని మాటిచ్చారు కోటీశ్వర్రావు గారు. ఇంక నేనో పెద్ద సెలెబ్రిటీ అయిపోయినట్లే!" అని చాటాడందరికీ.


వసంత్ కూడా సంతోషంగా, "మీకు నా అభినందనలు కవి గారూ." అన్నాడు మనఃస్పూర్తిగా. బయటకైతే అలా అన్నాడు కానీ, వసంత్ మనసుని ఓ సందేహం తొలిచేయసాగింది. ఇంతకుముందు రచయిత కూడా తన కథకి డబ్బులు ఇచ్చారని చెప్పాడు, ఇప్పుడు కవిగారి కథని కూడా ఎన్నుకున్నాడు, ఇలా ఎన్ని సినిమాలు తీస్తాడేమిటి అన్న సందేహం వసంత్ మదిని తొలిచేస్తూనే ఉంది. తనకి మరి అవకాశం లేనట్లేనా అన్న నిరుత్సాహం కూడా మనసులో చోటుచేసుకుంది. తనేమో ఎంతో శ్రమకోర్చి కోటీశ్వర్రావు ప్రకటన ఇచ్చిన విధంగా కథ తయారు చేసుకొస్తే, ఇప్పుడేమిటిలా అయిందని మనసులో కించిత్తు బాధకూడా కలిగింది.


ఇంతలో బయటకి వచ్చిన కోటీశ్వార్రావు పిఏ ఏకాంబరం, "ఇవాళ్టికి కోటీశ్వర్రావుగారి కథలు వినడం అయిపోయింది! మళ్ళీ వచ్చేవారమే మిగిలిన కథలు వింటారు. మీరందరూ వచ్చే సోమవారం తప్పకుండా రండి." అని వసంత్ తదితరులని ఉద్దేశించి చెప్పాడు. ఉసూరుమని నిట్టూర్చుతూ మిగతా అందరూ బయటకి వెళ్తే వసంత్ మాత్రం ఇంకా సోఫాలోంచి లేవలేదు.


"చెప్పాను కదా! ఇవాళ మరి కథలు వినరని చెప్పాను కద! ఇక వెళ్ళిరండి, వచ్చే సోమవారం మీ కథలు వినిపిద్దురుగాని." అన్నాడు ఏకాంబరం.


వసంత్ కూడా లేస్తూ, "అవునూ...మరి ఇన్ని కథలు వినడమే కాదు, అందరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. ఎన్ని సినిమాలు నిర్మిస్తారేమిటి కోటీశ్వర్రావుగారు?" అని అడిగాడు ఉండబట్టలేక.


"ఏమో నాకు తెలియదు బాబూ! ఆయనకేం, పేరు మాత్రమే కోటీశ్వర్రావు కాదు, నిజంగానే కోటీశ్వరులకి కోటీశ్వరుడు. ఆయనకేంటి, ఎన్ని సినిమాలైనా తీస్తారు." అన్నాడు.


'కోటీశ్వరులకి కోటీశ్వరుడు - ఇదేదో మంచి సినిమా టైటిల్లా ఉంది!' అని వసంత్ మనసులో అనుకున్నాడో లేదో, బెల్ మోగడంతో లోపలకి పరుగెత్తాడు ఏకాంబరం.


***************

సోమవారం నాడు మళ్ళీ కోటీశ్వర్రావు ఆఫీసుకు బయలుదేరాడు వసంత్. ఇంకో దర్శకుణ్ణో, నిర్మాతనో వెతుక్కోకుండా తను కోటీశ్వర్రావునే నమ్ముకొని తప్పు చేస్తున్నాడేమోనని ఓ మూల ఉన్నా, కిందటి వారం ఇద్దరి కథలు తీసుకొని కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడాయె. ఒకేసారి బోలెడన్ని సినిమాలు తీస్తున్నాడో ఏమో, అతనికి డబ్బులకి కొదవలేదు కదా! అందుకని కాస్త ముందుగానే బయలుదేరి బయట హాల్లో కూర్చున్నాడు. అప్పటికే ఇంతకుముందు సారి క్యూలో ఉన్న రచయితల్లో ముగ్గురు కనపడక పోయినా ఇద్దరు మాత్రం ఇప్పుడు కూడా వచ్చారు. అరగంట తర్వాత, ఏకాంబరం ఒక రచయితని పిలిచాడు.


తన నంబర్ ముచ్చటగా మూడో నంబర్ కనుక తనకి ఈ రోజు పిలుపు వస్తుందో రాదోనని సందిగ్ధంలో పడ్డాడు వసంత్. అయినా ఓపిగ్గా తన వంతుకోసం కాచుకున్నాడు. అయితే ఓ రెండుగంటల తర్వాత, వసంత్కి లోపలనుండి పిలుపు వచ్చింది. తన నిరీక్షణకి ఫలితం లభించినందుకు సంతోషిస్తూ కోటీశ్వర్రావు గదిలోకి అడుగుపెట్టాడు. ఏసీగది కావటం వలన లోపల చాలా చల్లగా ఉంది. ఫుల్సూట్లో హుందాగా రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఉన్నాడు కోటీశ్వర్రావు.


వసంత్ ఊహించుకున్నట్లు కోటీశ్వరావు మధ్య వయస్కుడుకాడు. డబ్బు అతనిలో డాబు నింపింది, హోదా హుందాతనం తెచ్చింది. చూపరులని ఇట్టే ఆకర్షించే వ్యక్తిత్వం అతనిది. తనని తాను పరిచయం చేసుకొని, అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వసంత్.


"వసంత్గారూ, మీ కథలు చాలా చదివాను, ఇంకేవైనా కొత్తవి ఉంటే చెప్పండి, ముఖ్యంగా భార్యా భర్త అనుబంధాల మీద అల్లిన కథలు నాకు కావాలి. నాకు ఎలాంటి కథలు కావాలో వివరంగా మీకు మెయిల్ పంపానుగా!" అన్నాడు కోటీశ్వర్రావు.

తన వద్ద అలాంటి కథ ఉండటంతో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కథ చెప్పటం ప్రారంభించాడు. కథ వినడం పూర్తి కాగానే, తన కథ బాగా నచ్చిందని అతను చెప్పటంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వసంత్. తనలాగే మిగతా రచయితలకు కూడా ఆ విధంగానే అతనన్నట్లు ఆ క్షణంలో గుర్తుకు రాలేదు. ఓ అగ్రిమెంట్పై తన సంతకం తీసుకొని పాతికవేల రూపాయల చెక్ వసంత్ చేతిలో పెట్టాడు అతని పిఏ ఏకాంబరం. చాలా సంతోషంగా ఆ చెక్ తీసుకొని బయటకు నడిచాడు.


బయటకు వచ్చేసరికి అక్కడ ఇంకో నలుగురు రచయితలు ఉండటం అతనికి విస్మయం కలుగజేసింది. ఇప్పటికే డజను కథలు ఎంపిక చేసుకున్నా, ఇంకా కథలు కోటీశ్వర్రావుకెందుకో అర్థం కాలేదు. బయటకు తనతో పాటు తిరిగి వచ్చిన ఏకాంబరం అక్కడ కూర్చున్న రచయితలకు మరో తేది ఇచ్చాడు రమ్మని. వసంత్కి ఈ తంతు ఏమీ అర్థం కాలేదు. తన సందేహం నివృత్తి కాకపోతే నిద్ర పట్టేట్టు లేదు అనుకొని, ఏకాంబరంని దగ్గరకు రమ్మని పిలిచాడు.


"మీకు చెక్ చిక్కింది కదా, ఇంక వెళ్ళండి." మర్యాదగానే చెప్పాడు ఏకాంబరం.


"అదికాదు ఏకాంబరంగారూ!...ఇప్పటికే నా కథతో కలిపి డజను కథలు విన్నారు. డబ్బులు కూడా ఇచ్చారు ఈ కథలన్నీ సినిమాగా తీస్తే, ఎంతలేదన్నా నాలుగైదేళ్ళు గడిచిపోతాయి కదా! మరి ఇంకా కథలెందుకు వినడం?" అని అడిగాడు.

వసంత్ సందేహం విని ముసిముసిగా నవ్వాడు ఏకాంబరం. "అమ్మమ్మా! అది దేవరహస్యం, ఎవరికీ చెప్పకూడదు." అన్నాడు లోపలికి వెళ్తూ.


తన సందేహం తీరకపోవడంతో కడుపుబ్బినట్లు అనిపించసాగింది వసంత్కి. తన ప్రశ్నకి జవాబు లభించకపోతే నిద్రపట్టేట్టు లేదు అనుకుని బయట గేట్ వద్ద ఉన్న వాచ్మాన్వద్దకు నడిచి అతనివద్ద తన సందేహం బయటపెట్టాడు. ఆ వాచ్మాన్ వసంత్ని చూసి తన గారపళ్ళు బయట పెట్టి నవ్వాడు.


నములుతున్న కిళ్ళి బయట ఊసి, "అదా! అది పెద్దవాళ్ళ రహస్యం! ఇప్పుడు నా గురించి చెప్తాను. నేనున్నానే అనుకోండి. నా డ్యూటీ కాగానే ఇక్కణ్ణుంచి తిన్నగా ఇంటికెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరిగి పేకాట ఆడి, మందుకొట్టి, ఎవరితోనో సినిమాకో, షికారుకో వెళ్ళి ఏ రాత్రికో ఇంటికెళ్ళానుకోండి, మా ఆవిడ ఊరుకుంటుందా?" అని ప్రశ్నించాడు.


"ఊరుకోదు...అయితే!" అర్థం కాక అతనివైపే చూస్తూ నిలబడ్డాడు.


"నా భార్యేకాదు, మీ భార్యేకాదు, ఆఖరికి మా అయ్యగారి భార్య కూడా ఊరుకోదు, ఎందుకంటే ఈ ఆస్తంతా ఆవిడదే! మా యజమానురాలు తెచ్చిన ఆస్తినే అతను మరింత అభివృద్ధి చేసాడనుకోండి, అది వేరే విషయం. అయితే ఆలస్యంగా ఇంటికెళ్తే మనమేమో రోజుకో కొత్త కథ అల్లి ఆలికి చెప్పాలి కదా!


మనలాగే అయ్యగారికి కూడా పాపం ఆ తిప్పలు తప్పవు మరి! రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా, అన్నట్లు కోటీశ్వర్రావుగారు తలచుకుంటే కథలకి కొదవా? ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఈ కథలన్నీ ఆవిడకి చెప్పడానికే గానీ, సినిమాలు తియ్యడానికి మాత్రం కాదు. మీ డబ్బులు మీకు ముట్టాయి కాబటీ, సినిమా ఎప్పుడు తీస్తారని అతన్ని అడగలేరు, అడిగినా మీకు ఇంకో కథ చెప్తారు. అంతే! మీకు ముందు ఏ విషయంలో కథ కావాలో ముందే చెప్పారుకదా, అయినా అర్థం కాలేదా? ఇదికూడా ఊహించలేని మరి మీరేం రచయిత సార్!" హేళనగా అన్న ఆ వాచ్మేన్ వైపు కోపంగా చూసాడు వసంత్.


అలా కోపంగా చూసినా ఏ మాత్రం చలించకుండా ముసిముసిగా నవ్వుతూ తలవంచుకొని చెప్పాడు ఆ వాచ్మేన్,"నా కథలు కూడా నాలుగు తీసుకున్నారు సార్ అయ్యగారు." అన్నాడు.


తెల్లబోయి చూడటం వసంత్ వంతైంది.

…………………..

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/padmavathi/profile


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


53 views0 comments
bottom of page