కృష్ణా! నీ కోసం!
- T. V. L. Gayathri
- Mar 31
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #కృష్ణానీకోసం, #KrishnaNeeKosam, #రక్షకభటులు, #IndianPolice

గాయత్రి గారి కవితలు పార్ట్ 8
Krishna Nee Kosam - Gayathri Gari Kavithalu Part 8 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 31/03/2025
కృష్ణా! నీ కోసం! - గాయత్రి గారి కవితలు పార్ట్ 8 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
కృష్ణా! నీ కోసం!
(కవిత)
*****************************
నీ కోసమే మళ్ళీమళ్ళీ పుట్టాలనిపిస్తుంది
నీ తలపులో నిత్యం మునకేయాలనిపిస్తుంది
నీ రూపాన్నే పదేపదే చూడాలనిపిస్తోంది
నీ పలుకే మరలమరల వినాలనిపిస్తోంది
నీ ధ్యాసతో అనుక్షణం శ్వాసించాలనిపిస్తోంది
నీ మదిలోనే శాశ్వతంగా నిలవాలనిపిస్తోంది
నీ కథల నెప్పుడూ తీయగా పాడాలనిపిస్తోంది
నీ చేతుల్లోనే గువ్వలా ఒదిగుండాలనిపిస్తోంది
నీ వెనువెంటే పదము కలిపి నడవాలనిపిస్తోంది
నీ పాదాలనే తనివితీరా ముద్దాడాలనిపిస్తోంది.
కృష్ణా! నీ కోసమే పలవరిస్తూ మరణించాలనిపిస్తోంది.//
************************************
రక్షక భటులు
(తేటగీతి పద్యములు )

1.
రక్షకభటులు దక్షులై రాజ్యమందు
శాంతి భద్రతల్ కాపాడి జనుల కొఱకు
న్యాయదేవత వెనువెంట నడచి నడచి
త్యాగనిరతితో వరలెడి దైవసములు.//
అర్థములు:
రక్షకభటులు= పోలీసులు.
దక్షులై = సమర్ధులై.
2.
ప్రజల కాపదల్ రాకుండ బాధ్యతలను
మోయుచుందురు నిష్ఠతో పూనుకొనుచు
సంఘసేవకై నిల్తురీ శక్తియుతులు
వారి సేవల కర్పింతు వందనములు //
అర్ధములు:
పూనుకొనుట = ఒక పనిని చేయాలని గట్టిగా అనుకోవటం.
3.
ఆలుబిడ్డలన్ వీడుచు నలసిపోక
దేశసేవలో మున్గుచు ధీరులైన
కార్యశూరులీ భటులకు గౌరవంబు
నీయవలయును ముదముతో నీ జనంబు.//
అర్ధములు:
కార్యశూరులు = అనుకున్న పనిని చక్కగా చేసేవారు.
4.
తాపమొందిన వేళలో ధైర్యమిడుచు
బాధకల్గిన తఱితాము పరుగుబెట్టి
వచ్చి వ్రాలెడి రక్షక భటులు మనకు
చోర భయమును మాన్పెడి చోపుదార్లు//
అర్ధములు:
తాపము: బాధ, వేడిమి.
తఱి = అప్పుడు.
5.
సంఘహితమును కోరుచు సాగుచుండి
జాతిరక్షణ చేసెడి సాహసికులు
ప్రజలు వీరిని గుర్తించి భక్తిచూపి
శిరము వంచుచు నతులు చేయవలయు!//
అర్ధములు :
నతులు = నమస్కారములు.
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments