top of page

కూడలి


'Kudali' New Telugu Story

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


తండ్రి చనిపోతూ ఇచ్చిన కొబ్బరిబోండాల వ్యాపారాన్ని తండ్రి బాటలోనే సైకిల్ మీద కొనసాగిస్తున్నాడు కిష్టప్ప.

ఊరంతా తిరిగి అమ్మడంతో వచ్చే సంపాదన పెరుగుతున్న కుటుంబ అవసరాలకు సరిపోకపోయినా ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టకుండా చేస్తున్నాడు.

జూన్ మాసం. ఆ యేడు ఊరి కూడలిలో రెండు కొత్త కాలేజీలు వెలిశాయి.

"ఇగ్గో...ఏవయ్యో...ఏదోమూల నిలబడితే నీ బొండాలు ఎవడు కొంటాడయ్యో. కొత్త కాలేజీలు పెట్టిన కాడికి పోయి అమ్ము. స్టూడెంట్ కుర్రాళ్ళు రోజూ వచ్చి తాగుతారు. గిరాకీ ఎక్కువ ఉంటుంది" అంది కిష్టప్ప పెళ్ళాం సూరమ్మ.

"అక్కడ అమ్మేటోళ్లు ఎవడూ లేకపోతే నేను అమ్ముదును. ముందే ఎవుడన్నా అమ్ముతుంటే మద్దెలో నేనెళ్తే తిట్టుకోరూ. "

"ఊరుకుముందుగానే నీకన్నీ సందేహాలే.ఎల్తేనేగా తెలిసేది. బేగి ఎల్లి అక్కడ పాగా ఎయ్యి పో. ఎవుడేవంటాడో నేనూ చూస్తా" అంది సూరమ్మ.

పెళ్ళాం నోటికి, పసిరికపాము కాటుకు మందులేదురా అయ్యా అని తండ్రి ఏనాడో చెప్పాడు. వెళ్లకపోతే ఎన్ని తిట్లు కాయాలో. దానికంటే ఎల్లిపోవడమే మంచిది అనుకుంటూ సైకిల్ ని కాలేజీ కూడలి వైపుకి తిప్పాడు.

కాలేజీలన్నీ మెయిన్ రోడ్డునుంచి లోపలికి ఉన్నాయి. రోడ్డు మలుపులో సైకిల్ పెట్టుకుని నిలబడ్డాడు కిష్టప్ప.

సపోటాల బండి తోసుకుంటూ వచ్చాడు ఓ కుర్రాడు.

మోకాళ్ల వరకూ వేసుకున్న చినుగుల లాగూ, బొత్తాలు ఊడిన మాసిన చొక్కా వేసుకున్నాడు.

సపోటాలు పాలసపోటాలోయ్ అంటూ అక్కడికి వచ్చాడు.

తన బండిని రోడ్డు పక్కగా పెట్టి పళ్ళను ఆకర్షణీయంగా సర్దుతున్నాడు.

గోలీసోడా అమ్మే తాత అక్కడకు ముందే వచ్చినట్టున్నాడు. వాళ్ళవంక చూస్తూ నిమ్మకాయల్ని సర్దిపెట్టుకున్నాడు.

ఒకళ్ళనొకళ్ళు తినేసేలా చూసుకున్నారు.

కాలేజీ సందులోంచి కుర్రాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు దుకాణాల్ని పట్టించుకోవట్లేదు.

కిష్టప్ప సైకిల్ గురించి ఎవరూ అభ్యంతరం పెట్టకపోయేసరికి హమ్మయ్య అని కుదురుకున్నాడు.

పొద్దస్తమానం ఎదురుచూసినా ఎవరూ ఆ పక్కకి రాలేదు.

ఆరోజు ఎండ గట్టిగానే కాసింది. చెట్టుకింద సైకిల్ ఆపుకుని కూర్చున్నాడు కిష్టప్ప.

ఆ పక్కనే ముంజలు అమ్మే ముసలవ్వ గోని సంచీ పరిచి ముంజల్ని పెట్టుకుని ఈగల్ని తోలుకుంటోంది.

వేసవిలో చల్లబరిచేందుకు వెలసిన

ఆ చిరు వ్యాపార బళ్ల దగ్గరకు ఎవరొచ్చినా

మరొకరికి కన్నెర్రగానే ఉంటుంది.

నాలుగు డబ్బులకోసం వాళ్ళమధ్య గట్టి పోటీ ఉంటుంది.

రెండు కార్లు వచ్చి సందు ముందు ఆగాయి.

అందులోంచి పదిమంది కుర్రాళ్ళు దిగారు.

ముసలవ్వా, తాతా, కిష్టప్పా , కుర్రాడు వాళ్ళవంకే ఆత్రంగా చూశారు.

కాలేజీ కుర్రాళ్ళు అటూ ఇటూ చూసి రోడ్డు దాటుతున్నారు...

"రండి బాబూ రండి. సల్లటి ముంజలు తినండి బాబూ..."

"పాల సపోటాలండీ..తియ్యగున్నాయి ఎన్నిమ్మంటారు సారూ...."

ఎగబడి అడుగుతున్నారు వాళ్ళు.

పట్టించుకోకుండా రోడ్డుకి అటుపక్కనున్న కూల్ డ్రింక్ షాపులోకి వెళ్లారు కాలేజీ కుర్రాళ్ళు.

పది డ్రింకులు తీసుకుని తాగేసి డబ్బులిచ్చి కారెక్కి వెళ్లిపోయారు.

వాళ్ళవంకే చూస్తున్న వ్యాపారులు

ఉసూరుమన్నారు.

"ఇగ్గో.. ఎవరొచ్చినా రండి రండని పిలుచుడేంది? ..ఆ.. మీ కాడికి రమ్మంటే మా కాడికి ఎల్లమాకనేగా?" గరగర గొంతుతో గిణిగాడు తాత.

"ఓ..నీ గదమాయింపులేంది? పిలవక ఏం సెయ్యమంటావ్" అన్నాడు సపోటాల కుర్రాడికి కోపం ఎగతన్ని.

"గమ్మున ఉండాలి. ఆళ్ళు మనదగ్గరకి వస్తే అమ్మాలి" అన్నాడు గోలీ సోడా తాత.

" సెప్పటానికి నువ్వెవడివి.ఇది నీ తాతగాడి సోటనుకున్నావా? పల్లకుండు" గయ్యిమన్నాడు కుర్రాడు.

"ఏటి బాబూ..పొద్దుటినుంచీ కూర్చున్నాను

ముంజలు అమ్ముడవకపోతే నా కొడుకొచ్చి నన్ను తిట్టిపోస్తాడు. బతిమలాడైనా కొనిపించాలి గానీ మూగమొద్దులా కూకోమంటావా? నీకేం తెలుసయ్యా మా ఆకలి మంటలూ" అంటున్న అవ్వ మొహంలో జీవంలేదు.

ఆరోజు అమ్మకపోతే తన పరిస్థితి ఏమవుతుందో అనే విచారం తప్ప.

అవ్వ బాధ కిష్టప్పకి అర్ధమైంది. అమ్ముడుకాని కొబ్బరిబోండాలతో ఇంటికెళితే

సూరమ్మ తిట్టే తిట్లు గుర్తొచ్చాయి.

'రోజువారీ అమ్మకాలు లాటరీనే అర్ధం చేసుకో' అంటే

'నీకివాళ బువ్వ కూడా లాటరీనే' అని సూరమ్మ పస్తు పెట్టిన రోజులు గుర్తొచ్చాయి.

సూరమ్మ కఠినాత్మురాలు అనిపిస్తుంది కానీ

అది ఆమాత్రం నోరెట్టకపోతే ఈ అవమానాల్ని తట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించనని దాని బెట్టు.

చుట్టూ జనాలే. కానీ కొనేటోళ్ల మనసులో దేవుడుంటే, తమ సరుకు అమ్ముడైతే ఆరోజుపంట పండినట్టే.

తాత ఊరుకోకుండా

"రోడ్డున పోయేటోళ్లని రమ్మని పిలాకండి. గమ్మునుండండి.సేపల మార్కెట్టులా ఈడ గోల పెట్టకండి" అని గొణునుక్కున్నాడు.

"ఏటీ...నువ్వు మా పెద్ద లీడర్ మాదిరి సెపుతుండావే. ఎక్కువ మాట్టాడకు ముసలోడా..!" కుర్రాడి మాటలకి పౌరుషం వచ్చిన తాత

"ఏందిరా, నువ్వూ నీ సోకూనూ.. యాపారానికి అడ్డొచ్చింది కాకుండా వాగుతున్నావ్" అంటూ మీదకొచ్చాడు.

కుర్రాడు తాతని ఒక్కతోపు తోసాడు.పక్కనే ఉన్న కాలవ గట్టుమీద పడ్డాడు.

"నీ జిమ్మడిపోనూ, మా నోట్లో మట్టికొట్టేందుకు దాపురించావురా సచ్చినోడా"

అవ్వ కుర్రాడి మీద పెద్ద నోరుపెట్టి అరిచింది.

"అరవకెసే", అంటూ

అవ్వని చెయ్యి మెలిపెట్టాడు. . గాజులు చిట్లి చేతిలో గుచ్చుకున్నాయి.అవ్వ ఏడుపు మొదలు పెట్టింది.

ఇంతలో టూరిస్ట్ బస్సు వచ్చి అక్కడ ఆగింది. బస్సులోంచి చాలామంది యాత్రికులు దిగారు.

"రండి రండి. కూల్ డ్రింక్స్, బాదం మిల్క్, ఐస్ క్రీం అన్నీ ఉన్నాయ్..రండి" అంటూ

ఎదురు షాపులో కుర్రాడు బస్సు దగ్గరకు పరిగెత్తుకొచ్చి చెబుతున్నాడు.

బేరాలు వాడు ఎగరేసుకుపోతున్నాడు

ఇక మన వ్యాపారం గోవిందా.

అవ్వ, తాత, యువకుడు, కిష్టప్ప ఒక దగ్గర చేరి నిలబడి చూస్తున్నారు.

"ఏ డ్రింక్ ఇవ్వమంటారండీ, మీకు ఐస్క్రీమ్

తెమ్మంటారా?" షాపు కుర్రాడి జోరు పెరిగింది.

యజమాని షాపు బయట కుర్చీలు సర్ది వేస్తూ

మనుషుల్ని లెక్కపెడుతూ మనసులో మురిసిపోయాడు.

ప్రయాణీకులు వాటర్ బాటిళ్ళు కొని మొహాలు కడుక్కుంటున్నారు.

"అవ్వా...ఏమనుకోకే..ఇయాల సపోటాలు అమ్ముడవకపోతే మాయమ్మ కూడెట్టదే. అందుకే నీమీద సిరాకు పడ్డా" కుర్రాడు అవ్వ చేతికి గుచ్చుకున్న గాజుని తీసేసి, రక్తాన్ని గుడ్డతో అద్దుతూ.

"అమ్ముడు కాపోయినా అమ్మ అన్నం పెట్టుద్ది. పెట్టకపోతే అది అమ్మే కాదు" అంది అవ్వ గోతిలో పడ్డ తాతను లేపుతూ.

అందుకు కుర్రాడు సాయం చేసాడు.

"మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందిలే ఈమె నాకు రెండో అమ్మ. చీటికీ మాటికీ చిర్రుబుర్రుమంటది. అయ్యకి చెప్పి తన్నిస్తాది.దెబ్బలు తినీ తినీ బండబారిపోయాను. ఇప్పుడు ఇంట్లోంచి. తరిమెయ్యమని అయ్యకి చెప్పి పోరుపెడతాంది. అయ్య నాకీ బండిచ్చి డబ్బుసంపాదించి తీసుకురా లేకపోతే ఇంట్లోంచి పో అంటాడు. యాడకి పోను.నాకు ఎవరూ లేరు. తిట్టినా కొట్టినా ఆళ్లదగ్గరే పడుంటా." కుర్రాడు కన్నీళ్లతో చెబుతుంటే కిష్టప్పకి బాధేసింది. ఒక కొబ్బరిబోండాం కొట్టి తాగమని కుర్రాడికి ఇచ్చాడు కిష్టప్ప .

"వద్దన్నా, అమ్ముకుంటే డబ్బులొస్తాయ్." అన్నాడు కుర్రాడు.

"అబ్బోస్, ఈ ఒక్క కాయకీ ఏమైపోదులే. తాగు. నీరసంగున్నావ్" అన్నాడు కిష్టప్ప.

కుర్రాడు కొబ్బరిబొండం తాగాడు.

తన బండిమీదున్న మెత్తటి సపోటాలు ఒలిచి తాతకీ, అవ్వకీ ఇచ్చాడు కుర్రాడు. కిష్టప్పకీ రెండు పెళ్లిచ్చాడు.

"అన్నీమనమే తినేస్తే ఎట్టబ్బాయ్" అన్నాడు తాత.

"ఈమాత్రానికి ఎటైపోదులే తాతా, తిను" అన్నాడు కుర్రాడు.

మొహాలు కడుక్కున్న యాత్రికులు కూల్ డ్రింక్ షాపులోకి వెళ్లకుండా

రోడ్డు దాటి వచ్చారు.

"పది కొబ్బరి బొండాలు కొట్టు బాబూ"

"డజను ముంజలివ్వు"

"నాకు నిమ్మకాయ సోడా కావాలి"

"నేను సపోటాలు తింటాను"

దుకాణాల ముందు చేరి

ఎవరికి కావలసినవి వాళ్ళు కొనుక్కున్నారు.

ఇంకో బస్సు వచ్చి ఆగింది. వీళ్ళని చూసి వాళ్ళూ వచ్చారు.

అరగంటలో వీళ్ళ సరుకులు ఖాళీ అయిపోయాయి.

ప్రయాణీకుల్ని ఎక్కించుకుని బస్సులు వెళ్లిపోయాయి.

నలుగురూ ఒకరినొకరు సంబరంగా చూసుకుంటూ డబ్బులు లెక్కపెట్టుకున్నారు.

అంతలో కూల్ డ్రింక్ వ్యాపారి కోపంగా వీళ్ళ దగ్గరకు వచ్చాడు.

నలుగురూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని

నిలబడ్డారు.

వాళ్ళ కట్టు చూసి కొడతారేమో అని భయంతో జంకాడు.

"మీరిప్పుడొచ్చారు. నా షాపు ఎప్పట్నుంచో ఇక్కడే ఉంది. నా వ్యాపారాన్ని దెబ్బతీస్తే నేనూరుకోను.రేపట్నుంచి మీరిక్కడికి రావద్దు" అన్నాడు సీరియస్ గా చూస్తూ.

"నీ కొట్లో నీళ్ల బాటిళ్లు కొన్నాక మా దగ్గరున్న

సరుకు కొన్నారు. మేం కూడా బతకాలిగా అన్నా, మాది చిన్న వ్యాపారం. మా పొట్ట కొట్టకన్నా" అన్నాడు కుర్రాడు.

" మీది చిన్న వ్యాపారం కాబట్టి వస్తే చిన్న నష్టమే ఉంటుంది. నాకొట్టు పెద్దది .నష్టంవస్తే వేలల్లో ఉంటుంది. ఈరోజు అమ్మకాలు జరక్కపోతే నాకు పిల్లనిచ్చిన మామ ఊరుకోడు. కొట్టు పెట్టించి పైకి తీసుకొద్దామంటే దివాళా తీస్తున్నానని తిట్టిపోస్తాడు. నా పెళ్ళాం నసపెట్టి చంపుతుంది. వెళ్లిపోండిరా బాబూ.ఇంకెక్కడన్నా మీ వ్యాపారం చేసుకోండి" అన్నాడు అభ్యర్ధనగా.

నలుగురూ ఒకరిమొహాలు ఒకరు చూసుకుని పైకే గట్టిగా నవ్వేశారు.

షాప్ అతను అయోమయంగా చూసాడు.

నాలుగు రోడ్లనీ కలిపింది ఆ కూడలి .ఆ నలుగుర్నీ దగ్గర చేసింది ఆకలి.

చేతులు కలిపిన వాళ్ళు నలుగురూ ఏకమై తనను వెక్కిరిస్తున్నారనుకుని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు.

"ఇంత పెద్ద కొట్టు పెట్టుకున్న ఇతనికే ఇలా ఉంటే మనం ఏమనుకోవాలి. మన బతుకు పోరాటం అతనికి అర్థంకాదు " అన్నాడు కుర్రాడు.

" అతని పోరాటం కూడా మనలాంటిదే.

పెద్దపాముకైనా, చిన్న పాముకైనా మెలికలు తప్పవు." అంది అవ్వ.

"మనం రోజూ ఇలాగే కలిసి కట్టుగా ఉంటూ వ్యాపారం చేసుకుందాం.సరేనా.." అన్నాడు యువకుడు.

"సరేలేరా మనవడా" అంది అవ్వ.

ఒకరినొకరు తాతా బాబాయ్ అబ్బాయ్ అనుకుంటూ వరసలు పెట్టి పిలుచుకుంటూ

రోజువారీ అమ్మకాలు జరిపే చిన్నకారు వ్యాపారులు తమ జీవితాల్లో చిన్న చిన్న సంతోషాలు వెతుక్కున్నారు.

................శుభం......


గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Linkమనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


48 views5 comments

5 Comments


chinta jayasree • 2 days ago

కథ చాలా బాగుంది.

Like

Srimani Kavana Sameeram • 2 days ago

చాలా బాగుంది వాణిగారు

Like

Singuluri Haranadh • 2 days ago

మంచి కథ .కథనం.. చిరుచిరుబ్రతుకులచిత్రాన్ని చిరస్మరణీయంగా ,సమాజశ్రేయంగా,అద్వితీ యంగా అందించిన రచయిత్రి అభినందనీయురాలు

Like

srinivas gorty • 2 days ago

Seetharam Garu baga chadivaaru

Like

srinivas gorty • 2 days ago

Nice story....

Like
bottom of page