top of page

కుక్కకాటుకి చెప్పు దెబ్బ


'Kukkakatuki Cheppu Debba' New Telugu Story

Written By Jidigunta Srinivasa Rao

'కుక్కకాటుకి చెప్పు దెబ్బ' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)"అబ్బాయి, ఒకసారి మన ప్లాట్ దగ్గరికి వెళ్లి చూద్దాం రా, కొని పడేసి వుంచాము, డెవలప్ అయితే అమ్ముకోవచ్చు అనుకుంటే, యిరవై ఏళ్ళు అయినా అమ్ముకోవడం కుదరలేదు, నువ్వు వెళ్లి చూడవు, నేను వెళ్ళలేను. నీ ఆస్తి మీద నీకే ఆసక్తి లేకపోతే, యింకా ఎవ్వరికి వుంటుంది" అన్నాడు కొడుకు శ్రీకాంత్ తో వెంకటేశం.


"నాన్నా! నాకు సెలవు దొరికేదే రెండు రోజులు, ఏదో మిమ్మల్ని చూద్దాం అని వస్తే, అక్కడికి వెళ్లి ఆ స్థలం చూసిరా, యిటువైపు వెళ్లి అద్దెకున్న వాళ్ళు యిల్లు ఎలాపెట్టుకున్నారో చూసి రా అంటావ్, వున్న రెండు రోజులలోనే మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, ఒకసారి మా మామగారింటికి వెళ్ళాకపోతే నీ కోడలితో తలనొప్పి" అన్నాడు శ్రీకాంత్ టీవీ చూస్తో.


"అదికాదు రా, నీ ఆస్తి నువ్వు చూసుకోవాలి, నాన్న కారు నడుపుకుంటూ అరవై కిలోమీటర్లు వెళ్ళగలరా, ఆలోచించు" అంది శ్రీకాంత్ తల్లీ లక్ష్మి.


"అమ్మా! నేను సంపాదించుకున్నదే నా ఆస్తి, నాన్న నాకు చదువు చెప్పించారు, అది చాలు. ఆ స్థలాలు అమ్మేసి హాయిగా విమానంలో మీరు చూడాలి అనుకున్నకాశీ, రామేశ్వరం, మధుర లాంటి ప్రదేశాలకి వెళ్ళండి. మీరు నా కోసం డబ్బులు దాచిపెట్టక్కరలేదు" అన్నాడు శ్రీకాంత్.


"మాటలకే బాగానే చెప్పి తప్పించుకుంటావు, యిప్పటికి నేనే నీ ఏ టి మ్

అంటావు" అన్నాడు కొడుకు చేతిలోని రిమోట్ లాక్కుని టీవీ ఆపేసి.


"వుండండి డాడీ, మంచి సినిమా చూస్తున్నాను" అన్నాడు.

"ప్లాట్ చూసి వచ్చిన తరువాత రాత్రంతా టీవీ చూద్దువుగాని" అంటూ బలవంతంగా బయలుదేర చేసాడు.


కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడంటే వంద కిలోమీటర్ల స్పీడ్కి తగ్గడు. అంత స్పీడ్ వద్దు అంటే మీరు కళ్ళుమూసుకొని పడుకోండి, మీటర్ వంక చూసి, నన్ను విసిగించద్దు, మీలాగా గంటకి పది కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళటం నాకు రాదు అన్నాడు తండ్రి తో.


కళ్ళుమూసుకొని పడుకుంటే నీ స్పీడ్ కి మళ్ళీ కళ్ళు తెరిచే అవసరం వుండదు, మనం పెళ్ళికి వెళ్లడం లేదు, నా మాట విని స్లోగా వెళ్ళరా బాబు, కారు డ్రైవ్ చేసే అప్పుడు నీకు భార్య, కొడుకు వున్నారని దృష్టిలో పెట్టుకో అన్నాడు.


ట్రాఫిక్ తప్పించుకుని స్థలం వున్న ప్లేస్ కి వచ్చి, "అదేమిటి డాడీ, మన ప్లాట్ లో ఎవడో కాలేజీ కట్టేసాడు" అంటూ కారు దిగాడు శ్రీకాంత్. గంటసేపు కారులో కూర్చొని వుండటం వలన వెంకటేశం కి కాళ్లు తిమ్మిరితో మొద్దుబారిపోయి, మెల్లగా దిగి చూసి, "యిది మన లేఔట్ కాదనుకుంటా, మన ఏరియాలో యింత డెవలప్మెంట్ ఎక్కడిది" అంటూ ప్లాన్ కొడుకు చేతికి యిచ్చాడు.

ప్లాన్ చూసి "ఇది మన స్థలం, ఎవ్వడో ఆక్రమించి కట్టేసాడు. పదండి అడుగుదాం" అని కాలేజీ గేటు దగ్గర వున్న సెక్యూరిటీ గార్డ్ ని ఆడిగాడు, "ఈ కాలేజీ ఎవ్వరిది, ఎందుకు మా స్థలం లో కట్టుకున్నా"రని.


"నాకేమి తెలియదు సార్, వుండండి లోపల చాలా ఏళ్ళు నుంచి పనిచేస్తున్న సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ని పిలుస్తాను" అని, లోపలికి వెళ్లి యిద్దరిని తీసుకుని వచ్చాడు. వాళ్ళని చూస్తే సినిమా హీరోల చుట్టూ వుండే బౌన్సర్స్ లాగా వున్నారు. వాళ్ళు రావడం రావడం దురుసుగా వచ్చి శ్రీకాంత్ చేతిలోని ప్లాన్ తీసుకుని చింపేసారు.


"హలో, ఈ స్థలం మాది, మా దాంట్లో మీరు బిల్డింగ్ కట్టుకుని, మా పేపర్స్ చింపేసారు. ముందు ఈ కాలేజీ యజమానిని పిలవండి" అన్నాడు శ్రీకాంత్.

"ఏమిటి నీ స్థలమా, అవును మేము కొనుక్కుని కట్టుకున్నాము. నీ కోసం మా యజమాని రావాలా, నడు ముందు యిక్కడినుంచి" అంటూ ఒకడు శ్రీకాంత్ మీద చేయ్యి వేసాడు. మరుక్షణం ఆ సెక్యూరిటీ మొహం మీద పిడుగుల వర్షము కురిపించాడు. ఈ సంఘటన చూసిన రెండవ సెక్యూరిటీ గార్డ్ కి తెలిసిపోయింది, కొట్టినవాడు కరాటే లో ఆరితేరినవాడని. ఎందుకైనా మంచిది అని వెనక్కి జరిగి "సార్! మమ్మల్ని కొడితే ఏమిలాభం, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా యజమాని రాగానే మీతో మాట్లాడిస్తాను" అన్నాడు.


"నేను కొట్టింది మీ వాడు నామీద చెయ్యి చేసుకున్నందుకు. ఇదిగో నా ఫోన్ నెంబర్, మీ యజమానిని ఈ రోజే మాట్లాడమను" అని చెప్పి, "పదండి డాడీ" అని కారులో కూర్చొని, "అసలు మిమ్మల్ని అనాలి డాడీ, యింత దూరంలో స్థలం కొన్నప్పుడు, అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడమో, లేకపోతే కాంపౌండ్ వాల్ కట్టించుకోవడమో చేసుకోవాలి, యిప్పుడు చూడండి ఎంత తలనొప్పి వచ్చిందో" అన్నాడు తండ్రితో శ్రీకాంత్.


"పోతే పోయింది, మనం కొన్నది అరవై వెలకి, యిప్పుడు ఆ రౌడీలతో నువ్వు గొడవ పడతానంటే నేను ఒప్పుకోను. అయినా వాడిని ఆలా కొట్టేసావు యేమిటిరా, ముగ్గురు కలిసి నీమీద పడితే ఏమిచేస్తావు" అన్నాడు కొడుకు వంక కోపంగా చూసి.


"డాడీ నేను ముంబైలో కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ సంపాదించాను. యిటువంటి వాళ్ళు యిరవై మంది వచ్చినా నేను వాళ్ళని మట్టి కరిపిస్తా" అన్నాడు శ్రీకాంత్.


"స్థలం ఆక్రమించాడు అంటే వాడి వెనుక పెద్ద వాళ్ళు వుండే వుంటారు, అనవసరంగా మనం ఈ విషయం లో ముందుకి వెళ్లాద్దు. నీతో వాళ్ళు మాట్లాడినప్పుడు తగాదా పడకుండా, ఒకటో రెండో లక్షలు యిస్తే తీసుకుని స్థలం వదిలేద్దాం" అన్నాడు వెంకటేశం.


"యిప్పుడు ఈ స్థలం ఖరీదు ముప్పై లక్షలు, రెండు లక్షలకు ఎలా యిస్తాను. తప్పు వాళ్ళది. యిరవై లక్షలు యిస్తేనే రాజీ.. లేదంటే ఏమిచేయాలో అది చేసి చూపిస్తా, మీరు ప్రశాంతంగా వుండి, ఈ విషయంలో కలిపించుకోకండి" అన్నాడు శ్రీకాంత్, యింటిముందు కారు పార్క్ చేస్తో.


"ఈ విషయం అమ్మకి కూడా చెప్పద్దు. నేను చూసుకుంటా, నా ఆస్తిని నేను రక్షించుకోగలను" అన్నాడు.


రాత్రి భోజనాలు అయ్యి పడుకోబోతోవుంటే, ఆ కాలేజీ యజమాని ఫోన్ చేసి శ్రీకాంత్ ని బెదిరిస్తున్నట్టున్నాడు, 'నువ్వు మా స్థలం లో కట్టుకున్నందుకు, న్యాయంగా డబ్బు యిచ్చి సెటిల్ చేసుకో, లేకపోతే ఏమి చెయ్యాలో నాకూ తెలుసు, నేను ముంబై లో వున్నవాడిని జాగ్రత్తగా మాట్లాడు' అని శ్రీకాంత్ వాడికి ఎదురు వార్నింగ్ యిస్తున్నాడు.


తెల్లవారిన తరువాత "అబ్బాయి, యింతటి తో వదిలేయ్! ఒక్కగానోక్క కొడుకువి, వెధవ స్థలం పోతే పోయింది, నువ్వు రేపు ముంబై వెళ్ళిపో" అన్నాడు వెంకటేశం.


తండ్రి వంక చూసి "సరేలెండి, వదిలేద్దాం" అన్నాడు.రెండు రోజులు ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్లి సాయంత్రం వచ్చే కొడుకుని చూసి వెంకటేశం కి అనుమానం ఎక్కువైంది. వీడు ఆ కాలేజీ రౌడీతో ఏమైనా గొడవ పడుతున్నాడా అని. అయితే అటువైపు నుంచి ఏమి ఫోన్స్ రాకపోవడం తో నిజమే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు అనుకున్నాడు.


"రేపు సోమవారం నేను ముంబై వెళ్ళాలి, ఒకసారి వనస్థలిపురం లో బాబాయి ఇంటికి వెళ్లి వద్దాం, అమ్మ కూడా వస్తుంది రెడీగా ఉండండి" అన్న శ్రీకాంత్ తో "యిప్పుడు ఎందుకు రా అంత దూరం, యింకోసారి వెళ్ళచ్చు, నీకోసం అమ్మ పచ్చళ్ళు తయారు చేసింది, ఆ వెల్లంకి వెళ్లి ప్యాకింగ్ చేయించుకో" అన్నాడు వెంకటేశం.


"ఆ పని అయ్యింది లే, మనం వెళ్లి తొందరగా వచ్చేద్దాం. యింకో అరగంట లో బయలుదేరాలి, రెడీ అవ్వండి" అన్నాడు శ్రీకాంత్. వీడి మాట వీడిదే మన మాట వినడు అనుకుంటూ రెడీ అయ్యాడు. అప్పటికే భార్య రెడీగా వుండటం చూసి, 'వంట తప్పుతుంది అంటే చాలు, ఎక్కడికైనా వచ్చేస్తావు' అన్నాడు.


కారు బయలుదేరి ఉప్పల్ చేరుకుంది, ఇంతలో బెంగళూరు నుంచి వెంకటేశం తమ్ముడు చంద్రం ఫోన్ చేయటం తో మాటలలో పడిపోయాడు వెంకటేశం.


సడన్ కారు ఆపి దిగండి డాడీ అన్నమాటకి ఫోన్ పక్కన పెట్టి చూస్తే అది తమ స్థలం వున్న ఏరియా. అంతకుముందు వున్న కాలేజీ నేలమట్టం అయ్యి వుంది. "ఇదేమిటిరా, కాలేజీ ఏది, ఈ పోలీసులు ఏమిటి?" అన్నాడు.


ఇంతలో ఒక కారు వచ్చి వీళ్ళ పక్కన ఆగింది. అందులోనుంచి ఒక గగ్గురు మొహం దిగి, శ్రీకాంత్ దగ్గరికి వచ్చి, "తప్పయిపోయింది, కాలేజీ బిల్డింగ్ పడగొట్టి, క్లీన్ చేసి కాంపౌండ్ వాల్ కట్టి ఇవ్వమని సి మ్ గారి పి ఏ చెప్పారు. రెండు రోజులలో పని పూర్తి చేసి ఈ కాలనీలో నుంచి వెళ్ళిపోతాను. మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, గవర్నమెంట్ తో తగాదా పెట్టుకోలేము" అని చెప్పి, అక్కడ మనుషులతో "పని త్వరగా పూర్తి చేయండి" అని చెప్పి వెంకటేశంకి శ్రీకాంత్ కి లక్ష్మి కి కూల్ డ్రింక్స్ తెప్పించి వెళ్ళిపోయాడు.


"నేను ఆస్తి గురించి పట్టించుకొనని అన్నారు గా, చూసారా ఎలా సెటిల్ చేసానో, ప్రతీ మోసం కి మనం ఉపాయం అలోచించి పెద్దమోసం చేయాలి, పదండి, వెళ్తూ చెపుతాను" అని కారులో కూర్చున్నాడు.


"రోజు రాత్రి కాలేజీ యజమాని నన్ను బెదిరించడం చూసిన తరువాత వాడికి తిరుగులేని షాక్ యివ్వాలని అనుకున్నాను. మీకు గుర్తుందా, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు రామం అనే స్నేహితుడు వుండేవాడు. వాడు మన ఇంటికి రోజూ వచ్చే వాడు. మీరు మమ్మల్ని తిట్టే వారు చదువుకోకుండా తిరుగుతున్నారని, అతను ఎం ఎల్ ఏ కొడుకు. మా స్నేహం ఎం బి ఏ వరకు కొనసాగింది.


యిప్పుడు వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్. నేను ముంబై లో వున్నప్పుడు కూడా అతను ఒకసారి వచ్చి వెళ్ళాడు. అతనికి జరిగిన విషయం చెప్పి, మన ప్లాట్ సేల్ డీడ్ పంపించాను. నీకు డబ్బు కావాలా, ప్లాట్ కావాలా అన్నాడు. కాలేజీ వాడి బెదిరింపులు వలన యిహ వాడికి ప్లాట్ యివ్వడం అనవసరం అనిపించి, ప్లాట్ కావాలి అని చెప్పటం, సరే రెండు రోజులలో అంతా సెటిల్ అవుతుంది అన్నాడు.

మిమ్మల్ని ఆడిగాడు, అంకుల్ కి కోపం తగ్గిందా యింకా తిడుతున్నారా" అని అన్నాడు నవ్వుతు శ్రీకాంత్.


"అయితే యిప్పుడు కాలేజీ పదకొట్టుకుని మన స్థలం మనకి అప్పగించడం మీ స్నేహితుడు చేసిన సహాయం అన్నమాట, పాపం అప్పుడు ఏదో చదువుకోవడం లేదని కేకలేసాను కానీ నీకు మంచి స్నేహితులు వున్నారు" అన్నాడు కొడుకుని మెచ్చుకుంటో వెంకటేశం.


"అందరికి మినిస్టర్ కొడుకులు స్నేహితులుగా వుండరు డాడీ, ఈ కబ్జాదారులని అరికట్టాలి, లేకపోతే మనలాగే ఎంతమంది తమ స్థలాలు తక్కువ రేట్ కి అమ్ముకున్నారో. మా స్నేహితుడు వాళ్ళ నాన్నతో చెప్పి, యిటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడేవిధంగా చట్టం తీసుకొని వస్తాము అన్నాడు, ఈసారి ఎలక్షన్ లో వీడు కూడా పోటీచేస్తాడుట" అన్నాడు.


"మొత్తానికి మోసం చేసి మన స్థలం లాగాలనుకుని, నష్టంతో చెడిపోయాడు. నువ్వు సమర్థుడివి అయ్యావని ఒప్పుకున్నాను, యిహ నీ ఆస్తిపాస్తులు నువ్వే చూసుకో, నేను కధలు రాసుకుంటాను" అన్నాడు వెంకటేశం.


"అబ్బే.. మీకు ఏదో ఒక టెన్షన్ లేకపోతే తోచదు నాన్న, అమ్మేసే అంతవరకు మీరే చూసుకోండి" అని రాఘవేంద్ర హోటల్ ముందు కారు ఆపి, "పదండి భోజనం కి" అన్నాడు


శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


60 views0 comments

Kommentare


bottom of page