top of page

కూతురు పార్ట్ - 2


'Kuturu Part - 2' written by Sudhamohan Devarakonda

రచన : సుధామోహన్ దేవరకొండ

అందరికీ భోజనాలు వడ్డించింది సుమేధ. అందరూ భోజనాలు చేస్తున్నారు. శ్యామలరావు గారు మాత్రం కూతురికి కొసరి కొసరి వడ్డిస్తున్నారు. భోజనం తింటున్నంతసేపు వాళ్ళ కబుర్లు, వాళ్ల సరదాలే తప్ప తన భోజనం గురించి కానీ, తన ఆకలి గురించి కానీ పట్టించుకునే వారు లేరు. భోజనాలు అయిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. రిషి తన పిల్లలతో కలిసి టీవీ చూస్తున్నాడు. శ్యామలరావు గారు వీధిలో కూర్చుని ఫోన్ మాట్లాడుకుంటున్నారు. పర్ణిక కూడా పిల్లలు, అన్నయ్యతో కలిసి టీవీ చూస్తోంది కానీ అన్యమనస్కంగానే ఉంది. ఇదే సరైన సమయం అనుకుని సుమేధ మావగారి దగ్గరికి వెళ్లి పర్ణిక విషయం మాట్లాడాలి అనుకుంది.

“మావయ్య గారూ!” సుమేధ పిలుపుకి ఆయన తలతిప్పి చూశారు.

“ఆ.. ఏంటి?”

“మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను”

“ ఏంటి మాట్లాడేది??” విసుగ్గానే సమాధానం చెప్పారు.

“అదికాదు మావయ్యగారూ! నేను మాట్లాడాలి అనుకుంటుకుంటున్నది మన పర్ణిక గురించి” సూటిగా చెప్పింది సుమేధ.

“నా కూతురి కోసం నువ్వేంటి చెప్పేది? ఏంటి నేను వినేది..”

విషయం చెప్తే మామ గారు ఏమంటారో అని లోపల భయంగానే ఉంది సుమేధ కి.

“అది.. మావయ్యగారూ.. పర్ణికకు తన అత్తవారింట్లో ఏదో సమస్య ఉందని నాకు తోస్తోంది. తను ఎప్పటి లాగా లేదు.. ఏదో దిగులుగా కనిపిస్తోంది. అది ఏంటో మీరు తెలుసుకుంటారని..”

మాట పూర్తవకుండానే గయ్యిమని లేచారు శ్యామలరావు గారు.. “ఏంటి?? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా.. నా కూతురికి అత్తవారింట్లో సమస్య?? అదేమైనా నీలా అనుకుంటున్నావా?? చాలా పొందికైన పిల్ల, తల్లి లేకపోయినా అత్తగారిలోనే తల్లిని చూసుకుంటూ, అత్తగారు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్న పిల్లది. నువ్వేంటి చెప్పేది? నీ కాపురం, నీ కుటుంబం నువ్వు చూసుకో. నీతులు చెప్పడానికి వచ్చింది నీతులు.. చాలు వెళ్ళు! ఇంకెప్పుడూ నా కూతురి మీద నిందలు వేయకు”

ఏదో ఆడపడుచు మనసు తెలుసుకుని సాయం చేయాలి అనుకుంది తప్ప, నిందలు ఎందుకు మోపుతుంది.. తనకి ఇది మామూలేగా.. అలవాటు పడిపోయిన మనసు.. ఇక చేసేది లేక లోపలికి వచ్చేసింది. మావగారికి తనపట్ల ఉన్న చిన్నచూపుకి, ఇంట్లో తన మాటకి ఉన్న విలువకి.. తను, తన మనసు అలవాటు పడుతూనే వచ్చింది. తన మాటను పట్టించుకున్నవాళ్లు వుండరు. తన ఇష్టాయిష్టాలను తెలుసుకున్న వాళ్ళు వుండరు. ఇంకా ఏదో ఒక రోజు అన్నీ సర్దుకుంటాయి అని ఆశతో ఉంది. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపట్టిందో మెల్లగా .. చీకటి ఒడిలో మాయ మత్తును చల్లింది. నిద్రలోకి జారుకుంది సుమేధ. ఎన్ని కష్టాలున్నా, ఆనందాలైనా, బాధలైనా, చీకటి తన వొడిని పంచక మానదు,సేద తీర్చక మానదు. అదేగా ప్రకృతి మాయ. వెలుగు, చీకటి, కష్టం, సుఖం.. అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మనల్ని ఆట బొమ్మలు చేస్తూనే ఉంటాయి.

***

శ్యామలరావుగారి ఫోన్ మోగింది. కూతురి మామగారు చేశారు.

“ఆ.. హలో బావగారూ! చెప్పండి.. అందరూ కులాసానా?” కుశల ప్రశ్నలు వేశారు శ్యామలరావు గారు..

“ఆ ఏదో అలా ఉన్నాం లేండి..”

రవ్వంత వ్యంగ్యం కనిపించింది ఆయన మాటల్లో శ్యామల రావు గారికి. చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన మాటల ధోరణి..

“ఏమైంది బావగారూ..?”

“ఏముంది? మీ అమ్మాయి వచ్చిందిగా మీ ఇంటికి..”

“ఆ.. వచ్చింది బావగారూ! క్షేమంగానే వచ్చింది. అదా మీ దిగులు..”

“అదేమీ కాదు.. మా అందరి పైన అలిగి వచ్చేసింది మీ అమ్మాయి.. కుటుంబం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవి మీ అమ్మాయికి పెద్దగా తెలిసినట్లు లేదు. గారంగా ఏ పిల్లలు పెరగరు? ఏ పిల్లలైనా గారంగానే పెరుగుతారు వాళ్ళింట్లో! కానీ అత్తవారి ఇంటికి వచ్చాక అన్నీసర్దుకుని పోతూ ఉండాలి. అంతే తప్ప అన్నీ పుట్టింట్లో నడిచినట్టే నడవాలంటే సర్దుకోవాల్సిన పని మాకు లేదు. ఏం?? మీ కోడలు మీ ఇంట్లో ఎలా ఉంటుంది.. చక్కటి పిల్ల. ఏ రోజూ నోరువిప్పి మాట్లాడలేదు ఆమె. మేం చూడలేదా ఏంటి? ఆ పిల్లని చూసి నేర్చుకోవాలి కదా..”

“బావగారూ! అసలు ఏం జరిగిందో చెప్పండి?”

“ఏం? మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి” ఫోన్ పెట్టారు పర్ణిక మామగారు.

శ్యామలరావుగారి గుండె జారినట్టు అనిపించింది ఆ మాటలకి. సుమేధ మాట్లాడాలి అనుకున్న విషయం ఇప్పుడు అర్థమైంది ఆయనకు..

ఇప్పుడు కోడలు ముందు తలెత్తలేరు, కూతుర్ని అడగలేరు, సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు ఆయనకి. పర్ణిక ఏం చెబుతుందో అని ఆందోళన మొదలైంది..

సమయం 11 అవుతుంది. అందరూ నిద్రపోతున్నారు. శ్యామలరావు గారు వరండా లోంచి లోపలికి వస్తుండగా పర్ణిక ఎదురొచ్చింది.

“ఏరా తల్లీ! నిద్రపోలేదా?”

“లేదు నాన్నా! కాసేపు బయట కూర్చుందాం. మీతో మాట్లాడాలి నాన్నా”

“చెప్పమ్మా, ఏంటి విషయం?”

“అది.. నాన్నా,.” పర్ణిక కంగారు పడుతోంది. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ, తడబడుతూ, చేతులు నలుపుతూ ఉండటం చూసి తండ్రి,

“అమ్మబంగారి, ఏమైందిరా?? ఎందుకా కంగారు? ఎందుకు?? ఆలోచించకు. నాతో చెప్పు” అని అనునయంగా అడిగారు.

“నాన్నా! నేను ఆ ఇంట్లో ఉండలేను నాన్నా!” సూటిగా చెప్పింది. కాస్సేపు నిశ్శబ్దం అలముకుంది.

“ఏంటి నువ్వు మాట్లాడేది??!!” శ్యామలరావు గారు నిశ్చలంగా ఉండిపోయారు.

‘అవును నాన్నా! మీరు విన్నది నిజమే, ఆ ఇంట్లో ఇంక నేను ఉండలేను”

మాటలు బాణాల్లా అయనకేసి వస్తుంటే ప్రతిఘటించే శక్తి లేనట్టు చూస్తున్నారు.

పర్ణిక బాణాలని సంధిస్తూనే ఉంది, పొద్దుటి నుంచి తనలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. తను వేసిన బాణానికి అలుముకున్న అయోమయం చీలిపోయింది,

“ఏమైందమ్మా అలా అంటున్నావ్ ? ఏమైనా గొడవలా? అల్లుడితో ఏమైనా.. లేక అత్తగారితోనా సమస్య?” తండ్రి మనసు కదా, కరిగిపోయింది. అందులోనూ అప్పటికే ఆమె మామగారు మాట్లాడిన మాటలకి ఆయన మనసు చిద్రమై పోయింది. ప్రశ్నల వర్షం కురుస్తోంది.

ఈ ప్రశ్నలు ఆయన నోటి నుంచి పూర్తవకుండానే తన కోడలితో తను అన్న మాటలు గుర్తొచ్చి చెంప మీద ఎవరో కొట్టిన అనుభూతి కలిగింది. మనసు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది తప్పొప్పులు. పైకి ఎంత గంభీరంగా కనిపించినా మనిషి తన మనసు ముందు మూగబోవల్సిందే..

పర్ణిక చెప్తూనే ఉంది..

***సశేషం***
3,185 views0 comments

Comments


bottom of page