top of page
Writer's pictureSujatha Thimmana

లహరి


'Lahari' New Telugu Story


Written By Sujatha Thimmana




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మిస్ ఇండియా టైటిల్ కైవసం చేసుకుని ధగధగ మెరిసే కిరీటం శిరసున ధరించింది లహరి. ఆమె రెండు కళ్ళల్లో- ఒక కంట ఆశ్చర్యం తో కూడిన ఆనందం అయితే, మరో కంట తన విజయం వెనుక నాన్న పడిన శ్రమా, పంచిన ప్రేమామృతం.. ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అనే కృతజ్ఞతా భావంతో కూడిన అశృ ధారలు చెంపలను తడిపేస్తూ ఉంటే... కిరీటంలోని రవ్వల మెరుపులు చిన్నబోతున్నాయి... చెక్కిళ్ళపై నిలిచిన నీటి బిందువులపై వున్న ఇంద్రధనుసు రంగులతో పోటీ పడలేక.


చేతిలో కాఫీ కప్పుతో ఆ రోజు పేపర్లోని మొదటి పేజిలో వచ్చిన తన ఫోటోలను చూసుకుంటూ… నిన్నటి సంఘటన లోనుంచి గతంలోనికి జారిపోయింది లహరి.


అక్క తరువాత ‘ఆడపిల్ల‘ గా పుట్టిన నేనంటే అమ్మకి ఎందుకో అసలు ఇష్టం ఉండేది కాదు... కడుపులో ఉన్నప్పుడు నన్ను పూర్తిగా అబ్బాయిగానే ఊహించుకుందట( నలుగురు ఆడపిల్లల మద్యలో నాలుగోది ఆమ్మ కావడంతో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయింది. అయినా తనకు తానే స్పూర్తి అయి టైలరింగ్ నేర్చుకొని తన అవసరాలు తను తీర్చుకోనేదట. తరువాత తెలిసిన నిజం ) అందుకే నేను తొలి శ్వాస తీసినపుడే అమ్మాయి అని తెలియగానే ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపిందట.


మొట్ట మొదటి సారిగా పురిటి కందుగా నాన్న ఒడి చేరానేమో…’నాన్న’ ను తలచుకుంటే చాలు ఆత్మార్పణ భావం మెదులుతుంది. అయన అనురాగాల ఆలింగనాలలోనే అన్ని మరచి పెరిగాను కదూ!


అమ్మ అసలు నాకు కొత్త బట్టలు కూడా కొనేది కాదు. అన్నీ అక్కవే వేసేది. చివరికి స్కూలు పుస్తకాలూ, డ్రస్, షూస్, కూడా అక్కవే.


చిన్న కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తున్న నాన్న ఎప్పుడూ నన్ను సమాధాన పరుస్తూ ఉండేవారు. ఎప్పుడయినా తన బడ్జెట్ లోనుంచి నాకొక్కదానికే తను ఇష్టంగా బట్టలు తెచ్చేవారు. ఇంటి పరిస్థితులు అకళింపు చేసుకుంటూ అక్క గారాభాన్ని సహిస్తూ, నాన్న చెప్పే తన అనుభవాల కథలను, ఝాన్సిలక్ష్మి భాయి, రుద్రమదేవిల వీరత్వాన్నే కాదు... మొల్ల… వెంగమాంబ రచనల గురించి… సరోజిని దేవి… దుర్గాభాయి దేశ్ ముఖ్ యొక్క పోరాట పటిమను సమయం చిక్కి నప్పుడల్లా చెపుతూ నాలో తరగని ఆత్మస్థైర్యాన్ని నింపారు. నేనూ ఏదో సాధించాలనే తపనని నాకందిస్తూ, ’ఆడపిల్ల’ని అని ఎప్పుడూ వెరవకుండా సాగాలనే ధైర్యాన్ని పెంచారు.


బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలనే ద్యేయంతో ప్రతి క్లాసులోనూ నేనే ప్రథమ స్థానంలో ఉండేదాన్ని. అది చూసి అక్క ఎప్పుడూ ఉడుక్కునేది. అమ్మ నా వైపు అభినందనగా చూసేది కానీ ఎప్పుడూ ప్రశంసించేదికాదు..

ఒక్కోసారి ‘నేను తనకి పుట్టలేదేమో?’ అనే సందేహం వస్తూ ఉండేది… అయినా అది కొద్ది సేపే…అమ్మ... అమ్మేగా... మరి.


నిండుగా… గుంబనంగా ఉంటూ కెరటాలతో ఎగసి ఎగసి పడే సముద్రం కూడా ఒక్కో సారి సునామీలను ఎదుర్కోక తప్పటం లేదు. జీవితం కూడా అంతేనేమో!


ఎనిమిదవ తరగతి చదువుతున్నా… అప్పుడు… ఎందుకో తెలియదు ఊరికూరికే వాంతులు... తల తిరగటం… ఆకలి మందగించటం... నీరసం. క్రమంగా రంగు మారిపోవటం … గమనించి నాన్న దగ్గరే ఉన్న డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళి చూపించారు. సాధారణ నీరసమేనంటూ మందులు ఇచ్చారు కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా ఇంకా ఎక్కువవటంతో…. పెద్ద హాస్పటల్ కి తీసుకెళ్ళారు.


అన్ని పరిక్షలు జరిపించినతరువాత చివరకు తెలిసినది… నాకు ‘ లుకేమియా’ (బ్లడ్ కాన్సర్ ) అని.


అప్పుడు చూసాను అమ్మ కళ్ళు… గోదావరి వరదలే అయ్యాయి. అక్కున చేర్చుకొని నన్ను గుండెలవిసేలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మని ఎలా ఓదార్చాలో తెలియలేదు.


”అమ్మా… నాన్నా ! నాకు బ్రతకాలని ఉంది, మీ ప్రేమామృత ధారలలో సంపూర్తిగా తడిచి జీవితాంతం మీ కనుసన్నలలో మీ కూతురుగా జీవించాలని ఉంది” లోలోన హృదయ సంద్రం పెనుతుఫానుకు గురి అవుతున్నా… నిర్జీవమైన చూపులతో ఓదార్చాలనే ప్రయత్నం చేసా.


నాన్న విషయమయితే అసలు ఇక చెప్పనలవి కాదేమో! అటు దుఃఖం దాచుకోలేక, పైకి కనిపించనీయక సుడులు తిరుగుతున్న బాధని మింగుతూ… తిరుగుతూ ఉండేవారు అటు ఇటు. అక్క కూడా క్షణం నన్ను విడువక నాకు తోడుగా ఉంటూ సపర్యలు చేసింది నీళ్ళు నిండిన కళ్ళతో.


‘ఎటువంటి ఆపదలు వచ్చినా… అందులోనుంచి బయట పడే మార్గాలు ఉంటాయేమో కానీ ఇలాంటి జీవన్మరణాల ఆరోగ్య సమస్యలు వస్తే... తప్పించుకొని మనుగడ సాగించటం ప్రతి క్షణం పదునైన గాజుపెంకుల మీద పరిగెట్టటం వంటిదే… ‘


పైగా ఈ కాన్సర్ అనేది కార్పోరేట్ వ్యాది అయిపోయింది. లక్షలతో వ్యవహారం… దిక్కు తోచని స్థితి… చూస్తూ… చూస్తూ తనవారిని కాపాడుకోలేకపోతున్నామనేబాధ వర్ణించనలవికానిది.


పరిస్థితి చేయి దాటి పోక మునుపే నన్ను దక్కించుకోవటం కోసం నాన్న తన సర్వస్వం పెట్టేయటానికి సిద్దపడ్డారు.

వారసత్వంగా వచ్చిన ఆస్తిలో భాగంగా... రెండు పోర్షన్ల ఇల్లు నాన్న వాటాకి వచ్చింది. అది అమ్మకానికి పెట్టారు.


ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్నది అనుకున్నా… ఇప్పుడు అదే హైటెక్ పుణ్యమా అని మంచి ధరేవచ్చింది.

ఖరీదయిన వైద్యం కోసం కార్పోరేట్ హాస్పటల్ లో జాయిన్ చేసి క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ ఇప్పించారు… రెండు సంవత్సరాలు నా జీవితంలో లేవని అనుకోవాలి…

‘అటువంటి నరకం పగవాళ్ళకి కూడా రాకూడదు’ అనిపిస్తుంది.


సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా… చెప్పాలంటే మునుపటి కంటే చలాకీగా తిరిగి పునర్జీవితురాలినయ్యాను.

అమ్మ నాకు తన రక్త మాంసాలతో తయారు చేసి జన్మనిచ్చింది కానీ... నాన్న నను తన సర్వస్వం దారపోసి తిరిగి మళ్ళీ నాకు జీవితాన్ని ఇచ్చారు. అమ్మ, అక్క, నాన్నలతో ఆనందంగా గడిపే ఈ క్షణాలను అనుభూతిస్తూ… కళ్ళు మూసుకొని పడుకున్నా ఆ రోజు.

+++

అమ్మ నాన్నలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వద్దు అనుకున్నా వారి మాటలు వినిపిస్తూ ఉన్నాయి.


‘డాక్టరు గారితో మీరు ఏదోదో మాట్లాడుతూ ఉన్నారు కదండీ… అదే…. ’స్టెమ్ సెల్ ‘ అని. నాకేమి అర్ధం కాలేదు… ఏంటండి?’ అని అడిగింది కుతుహులంగా భారతి.


“ ముందుగా నీవు నన్ను క్షమించాలి భారతి… నీకు తెలియజేయకుండా నేను ఈ పనిచేసాను. ఎప్పుడు చెప్పే సందర్బం రాలేదు. మనకి ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయి కదా! మళ్ళి మీరు ఈ పని ఎందుకు చేసారు అంటావని కూడా కొద్దిగా సందేహించాను భారతి…” అనునయిస్తున్నట్టుగా అన్నాడు అమర్ నాథ్.


“ అయ్యో! అవేం మాటలండీ... ” చిన్నబుచ్చుకుంది భారతి.

“ అంతా భగవంతుని లీల. ఆ రోజు నాచేత ఈ పని చేయించి… చివరికి నా చిట్టి తల్లికే ఉపయోగపడేలా చేసాడు… వాని లీలలు మనకు అర్థం కావు మరి…” హృదయాన్ని చిక్క బట్టుకుంటూ అసలు విషయం చెప్పుకు పోతున్నాడు అమర్ నాథ్.


“అసలు ఎం జరిగిందంటే… మన లహరి పుట్టకమునుపే… మా సార్ కి అబ్బాయి పుట్టాడు. అతను ఈ “స్టెమ్ సెల్ బ్యాంకింగ్ “ లో వాళ్ళ బాబు’ స్టెమ్ సెల్ ‘ భద్రపరుచుకున్నారు. అదే విషయం మా ఆఫీసులో చర్చ అయింది.


ఆ విషయమే మా సార్ని అడిగాను. అయన తనకు తెలిసింది చెపుతూ లైఫ్ సెల్ వాళ్ళ కాంటాక్ట్ డిటైల్స్ ఇచ్చారు.

విషయం కనుక్కుందామని నేను కూడా వాళ్ళని సంప్రదించాను. అక్కడ ఉన్న డాక్టరు గారు... “డెలివరి సమయం తెలుసుకొని మా వాళ్ళు (ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వాళ్ళు) తయారుగా అక్కడికి వచ్చి ఉంటారు.


బిడ్డ బయటకు రాగానే (ఏ ప్రక్రియ ద్వారా… అంటే… సి. సెక్షన్ ద్వారా అయినా… నార్మల్ డెలివరి అయినా సరే)

ఒక్క నిముషం కూడా ఆలస్యం చెయ్యకుండా పేగును బిగించి ముడి వేసి కత్తిరిస్తారు. ప్లాసేంటా (మాయ ) లోని రక్తాన్ని బొడ్డు పేగు నుంచి ఇంజక్షన్ ద్వారా 15 ఔన్స్ ల వరకు సేకరిస్తారు. ఈ ఇంజెక్షన్తో బిడ్డకి ఎటువంటి సంబంధమూఉండదు. ఈ పేగును, వాళ్ళు సేకరించిన రక్తాన్ని వెంట తెచ్చుకున్న పరికరాల్లో వెంటనే భద్రపరిచి, రిజిష్టర్ చేసుకున్న వాళ్ళ పేరు పూర్తి వివరాలు అతికించి ఒక కిట్ లా తాయారు చేసి ఇవన్ని నిల్వఉంచే కేంద్రాలకి తరలిస్తారు. అదే “స్టెమ్ సెల్ బ్యాంకింగ్”.


ఇక ఉపయోగాలంటారా… బొడ్డు తాడు అనేది అనేకానేక కణాలకు మూలం. రోగ నిరోధక సామర్ధ్యాన్ని సమృద్దిగా కలిగి ఉన్న సముధాయం కాబట్టి అవి అవయవాల రక్తనాళాల మరమ్మత్తును చేసుకోగలవు. ఇంకా వ్యాధులకు

“హోస్ట్” చికిత్స చేయటానికి సహాయ పడతాయి.


మన శరీరంలోని ప్రతి భాగమూ మూలకణాల సముదాయం. ఈ కణాలు ఏదేని కారణాలవలన (వ్యాదులచేత)

దెబ్బతిన్న ఎడల సాధారణ రక్త కణాల ఉత్పత్తిని పునరుద్ధరించటానికి ఉపయోగపడుతుంది…కాబట్టి.. ఈ ‘లుకేమియా’ వంటి వ్యాది సోకిన రోగికి ఆ వ్యాది కణాలను తొలగించి కొత్తగా తిరిగి కణాలను ఈ ‘స్టెమ్ సెల్ ‘ నుంచి సేకరించి వారిలో ప్రవేసపెడతారు. అవి తిరిగి శరీరంలో కొత్త కణాలను తాయారు చేసుకోవడానికి దోహద పడతాయి.


అంతే కాకుండా ఈ స్టెమ్ సెల్ నుంచి ప్రవేశ పెట్టిన కణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి కాబట్టి రోగి సంపూర్తిగా... అతి త్వరగా కోలుకోవడానికి మంచి అవకాసం అవుతుంది. ఒక్క కాన్సర్ వ్యాధికే కాదు… మధుమేహం… గుండెకు సంబంధించిన వ్యాధులకు…తలసేమియా వంటి దీర్గ కాలిక వ్యాధులకు ఇంకా ఎన్నో… విధాలుగా ఈ కణాల ద్వారా చికిత్స చేయవచ్చు. రక్తసంబందీకులు ఎవరికయినా ఈ కణాలని నిరభ్యంతరంగా ఉపయోగించ వచ్చు… లేదు ఇతర ఎవరికైనా కూడా అవసరం అయితే… వారి వారి రక్తం … ఇతర శరీరతత్వాలను పరిక్ష చేసి సరిపోయిన వారికి ఉపయోగిస్తారు” అంటూ పూర్తి వివరాలు చెప్పారు ఏకబిగిన.


“నాకు ఈ ప్రక్రియ చాలా ఉపయోగ కరమయినదిగా అనిపించింది కానీ ఆర్ధిక స్తోమత అడ్డు పడుతుంది ఆలోచించాలి… ఎలాగయినా సరే అని మా సార్తో మాట్లాడాను… ఆఫీసులో లోన్ కోసం అప్లయి చేసాను. నీ డెలివరి సమయానికల్లా డబ్బు అందింది. వెంటనే… లైఫ్ సేల్ వాళ్లతో మాట్లాడి మన లహరి “స్టెమ్ సెల్“ ను బద్రపరిచేలా చేసాను…. కానీ ఆనాడు అనుకోలేదు... భారతీ! అసలు ఇలా జరగాలని…” కంట చెమ్మతో తనతో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడు అమర్ నాథ్.


“ ఏది జరిగినా అంతా మన మంచికే కదండీ. మీరు దైర్యం చేసారు కాబట్టి ఈ నాడు మన బిడ్డ మన కళ్ళ ముందు కళకళలాడుతూ తిరుగుతుంది.

***

ప్రతి మాట వింటున్న కొద్ది నాలో నాన్న పట్ల అంతులేని ప్రేమ…” నాన్నా... ఎన్ని జన్మల కయినా మీ ఋణం తీర్చుకోలేనిది... ఆ బ్రహ్మదేవుని ప్రతిరూపం మీరు. నా ప్రాణ దాతలు నా శ్వాస మీదే… నా అణువు అణువు మీవే… మీవే!!”


వర్షించే కళ్ళు దిండును తడిపేస్తున్నాయి… అప్పుడే నిర్ణయించుకున్నా... నేను ఎదగాలి... నాన్న పేరు చిరస్థాయిగా నిలబెట్టాలంటే…. నేనే ఒక ప్రమిదని కావాలి... నా జీవితం ఒక దీపమై… అమ్మా నాన్నలకు వెలుగునివ్వాలి.

ఆ నిర్ణయమే… నాకు ఉన్న అవరోధాలని దాటించి… నన్ను గెలిపించింది… తల్లితండ్రుల నుంచి సంక్రమించిన సౌందర్యం, నిర్మలమైన.. సంస్కారం… నడవడిక… ఓటమికి ఎదురు నిలిచే ఆత్మస్థైర్యం… నన్ను ఈ రోజు

“మిస్ ఇండియా“ గా నిలబెట్టాయి.


“నాన్నా! ఈ విజయం మీదే”

మనసులోనే నాన్నకు వేల వేల వందనాలను సమర్పించుకుంటూ… సెల్ అందుకుంది లహరి… నాన్నకి కాల్ చేయాలని!

**సమాప్తం**

సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


********* సమాప్తం *******

రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.

డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.

చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.

అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.

ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.

బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.

ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.

30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.

మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...

సుజాత తిమ్మన.




58 views3 comments

3 коментарі


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
28 січ. 2023 р.

Anushka N • 7 days ago

Excellent. Madem

Вподобати

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
10 січ. 2023 р.

Sujatha thimmana • 1 day ago

హృదయ పూర్వక ధన్యవాదాలు జగదీష్ గారు

Вподобати

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
10 січ. 2023 р.

Jagadeesh Kandregula • 1 day ago

Excellent practical realistic story. Every telugu people must watch this video and catch the moral of the story. We are expecting more videos from you SUJATHA garu.

Вподобати
bottom of page