'Lakshmana Rekha' New Telugu Story
Written By Otra Prakash Rao
'లక్ష్మణ రేఖ' తెలుగు కథ
రచన : ఓట్ర ప్రకాష్ రావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"నిన్ను ప్రేమించిన వాడు నయవంచకుడని పెళ్ళి జరగకముందే తెలుసుకొన్నావు" అంటూ ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తున్నకూతురు పల్లవి తల నిమురుతూ అంది తల్లి.
"అమ్మా! వాడు మంచివాడని నమ్మకం పెట్టుకొన్నాను. కానీ వాడు ఇంతటి దుర్మార్గుడనుకోలేదు. సారీ... ”
“సారీ ఎందుకు పల్లవీ, నీవు నన్ను తల్లిగా కాకుండా ఒక మంచి స్నేహితురాలుగా భావించి నీవు ప్రేమిస్తున్న సంగతి నిజం చెప్పి మంచి పని చేశావమ్మా. నేను ప్రైవేట్ డిటెక్టీవ్ వారికి వాడి చిరునామా ఇచ్చి వాడి వివరాలు సేకరించ మన్నాను. వాళ్ళు ఇచ్చిన వివరాలు చూస్తుంటే వాడొక పెద్ద దగుల్బాజీ అని తెలిసింది.
ఈ సంవత్సరంలోనే నీకు ముందు మరో ఇద్దరు అమ్మాయిలతో తిరిగాడంట. ఎందుకో బ్రేకప్ అయింది. అంతేకాదు. వాడు తరచూ పబ్బులకెళ్లడం, తాగడం గురించి చెబుతూ ఫొటోలతో పాటు మనకు ఇచ్చారు. పెద్ద ఆపద కలగకుండా ముందుగానే తప్పించుకొన్నావు. జరిగింది జరిగిపోయింది. ఇకమీదట వాడ్ని కలలో కూడా కన్నెత్తి చూడకు. ఏ సమస్య వచ్చినా నాతో చెప్పడం మరచిపోకు. ఆ డిగ్రీ పూర్తి చెయ్యడం చూడు. "
"అమ్మా మరో పొరపాటు... పెద్ద పొరపాటు జరిగింది "
“ఏమిటీ.... "
“వాడు... వాడు నన్ను తప్పకుండా పెళ్లి చేసుకొంటాడన్న నమ్మకంతో వాడి బలవంతమీద " అంటూ తల వంచింది.
“ఏం జరిగింది పల్లవీ" అదురుతున్న గుండెతో అంటూ కూతురు వైపు చూసింది.
కళ్ళనీళ్ళతో చెప్పింది పల్లవి.
“ఓహ్... నీవుకూడా పొరపాటు పడ్డావా... నాకెందుకో వాడిమీద అనుమానంగా వుంది. ఎంతకైనా తెగించేవాడిలా ఉన్నాడనిపిస్తోంది. వాడితో సెల్ఫీ తీసుకొన్నావా... "
"సారీ అమ్మా... రెండు సార్లు తీసుకొన్నాను "
"ఆ ఫోటోలు చాలు, నిన్ను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి సిద్ధపడతాడు. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. " అంటూ తల పట్ట్టుకొని ఆలోచించ సాగింది.
“ నాన్నకు తెలిస్తే... " కన్నీళ్లతో అంది.
" మీ నాన్నకు తెలిస్తే మనం ఇబ్బందిలో పడాలి. ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చారు. ఆయనకు తెలియ కూడదు. ముందు నిన్ను డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి " అంటూ సాగరికకు ఫోన్ చేసింది.
"హలొ సాగరి.. బాగున్నావా... మీ అమ్మ జయప్రద ఎలా వుంది? మాట్లాడి చాల రోజులయింది. "
"హలొ ఆంటీ... మా అమ్మ బాగుంది, అమ్మ ఎప్పుడూ మీ గురించి చెబుతూ ఉంటుంది. మీ దగ్గర యోగాసనాలు నేర్చుకొని ఇప్పుడు ఈ ఏరియాలో యోగమాస్టర్ అయ్యానని అమ్మ చెబుతూ ఉంటుంది. చెప్పండి ఏమిటి విశేషాలు. "
"సాగరికా ఒక చిన్న సమస్య అందుకే నీకే ఫోన్ చేసాను. డాక్టరుగా నీవే పరిష్కరించగలవు "
"నేనా... చెప్పండి ఆంటీ "
"సాగరికా, మా అమ్మాయి పల్లవి... " అంటూ వివరంగా చెప్పింది.
“ ఆంటీ, పల్లవిని రేపు తీసుకొని రండి. "
"సాగరికా ఈ విషయం ఎవరికీ తెలీకుండా.... "
“ఆంటీ, మీరు మా అమ్మకు మంచి స్నేహితురాలు. మీరు నాకు చిన్నప్పటినుండి తెలుసు. మీరు నా దగ్గర ఇలా అడగడం ఇబ్బందిగా వుంది. ఆ సంగతి నాకు వదిలి వేయండి. మూడో మనిషికి తెలీకుండా చేస్తాను"
*** *** ***
"పల్లవీ, నన్ను చూసీ... చూడనట్లు వెళ్తున్నావు ఎందుకూ"
"మనం సినిమాకు వెళ్లిన సంగతి ఈ మధ్యనే మా అమ్మకు ఎవరో చెప్పారు. ఇంట్లో ఒకటే గొడవ. మా అమ్మ నన్ను గెరిటతో నా చేతిమీద కొట్టింది. " అంటూ చేయి చూపించింది.
కొన్ని రోజుల క్రితం తడిగానున్న నేలపై జారి కింద పడినప్పుడు చేతిపై ఏర్పడిన గాయాన్ని చూపించింది పల్లవి.
"మీ అమ్మ రాక్షసా, డిగ్రీ చదువుతున్న కూతరుని ఇలా.... " కోపంగా అన్నాడు.
"మా అమ్మకు నేనంటే ప్రాణం. అయినా కోపంలో కొట్టింది. నీ గురించి వివరములు అడిగినా చెప్పలేదు. నీకు వుద్యోగం దొరికేంతవరకు నీగురించి చెప్పదలచుకోలేదు."
"వుద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. కానీ నిన్ను చూడకుండా... అలా హోటల్ కెళ్ళి చాయ్ తాగుతూ మాట్లాడుకొందాము."
"సారీ, వేరే విధంగా బావించద్దు. కొంతకాలం మనం కలుసుకోకుండా ఉండటం మంచిది. మనమిద్దరం కలుసుకొన్నట్లు మా అమ్మకు ఎవరైనా చెప్పారంటే నన్ను ఉతికేస్తుంది. నా డిగ్రీ పూర్తిఅయ్యేలోపున నీకు ఎలాగూ వుద్యోగం దొరుకుతుంది. ఆ తరువాత మా అమ్మానాన్నలు అంగీకరించకున్నా పెళ్లి చేసుకొందాము. అంతవరకు బ్రేకప్ తప్పదు."
"బ్రేకప్ అని నీవు సులభంగా చెప్పావు. అంతవరకు నీ వీడియో చూస్తూ ఎంతకాలమని వుంటాను"
"వీడియోనా... ఏం వీడియో"
వీడియో చూపించాడు. వీడియో చూడగానే పల్లవి ముఖం కోపంతో ఎర్రబడింది.
"నీవు... నాకు తెలీకుండా వీడియో... నీవిలాంటి వాడవనుకోలేదు. ప్రేమించిన వ్యక్తితో ఇలా ప్రవర్తించవంటే నీ గుణం ఎటువంటిదో తెలిసింది. నీవంటే అసహ్యం వేస్తుంది. మర్యాదగా ఆ వీడియోను వెంటనే డెలిట్ చెయ్. ఈ జన్మలో నిన్ను చూడను గుడ్ బై " అంటూ కోపంతో అంటూ వేగంగా వెళ్ళింది పల్లవి.
ఇంటికి వచ్చి తల్లితో జరిగింది చెప్పింది.
"అమ్మా వాడితో ఏదో ఒక గొడవపెట్టుకొని ఈ ప్రేమకథకు గుడ్ బై చెప్పాలనుకున్నాను. ఏ కారణం దొరుకుతుందా అని ఆలోచించాను. అనుకోకుండా వాడే దారి చూపించాడు. ఆ రోజు వాడు వీడియో తీసిన చూడగానే నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. గుడ్ బై అంటూ వచ్చేసాను. ఇక వాడితో మాట్లాడటానికి అవకాశమే లేదు. ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడేమోనన్న భయం కలుగుతోంది. "
"వాడు అలా ప్రవర్తించాడంటే వాడి పతనానికి వాడే గోతి తవ్వుకొన్నట్లవుతుంది " ధీమాగా అంటున్న తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది
*** *** ***
తల్లితో కలసి జయప్రద ఇంటికి వెళ్ళింది పల్లవి. జయప్రద వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.
మరికొంత సేపటికి ఇన్స్పెక్టర్ రాజేశ్వరి ప్రతాప్ లోనికి ప్రవేశించింది..
పరిచయాలు పూర్తి అయినా తరువాత "మేము స్టేషన్ కు వస్తే వాడు జాగ్రత్త పడుతాడన్న అనుమానంతో ఎలా ఫిర్యాదు చేయాలా అని ఆలోచించాను. జయప్రద మీకు చాలా క్లోజ్ అని తెలిసింది. మా సమస్య జయప్రదకు చెప్పి మిమ్మల్ని ఇక్కడకు వచ్చేలా... మీకు శ్రమ కలిగిస్తున్నందుకు క్షమించండి " అంది పల్లవి తల్లి.
"పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాక బంధువులు ఫ్రెండ్స్ అంటూ మరచిపోయాను, మీ పుణ్యమా అని జయప్రదను కలిసే అవకాశం కలిగినందుకు మీకు థాంక్స్ చెప్పాలి" అంది రాజేశ్వరి ప్రతాప్.
పల్లవి ఏదీ దాచకుండా వివరంగా చెప్పింది. అంతకుముందు రోజు బ్లాక్ మెయిల్ చేస్తూ పంపిన వీడియో చూపించింది.
*** *** ***
అకాల వర్షంలా ఆరోజు అందరూ మీటింగ్ కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సర్కులర్ పంపారు. మీటింగ్ గురించి ఎటువంటి వివరాలు లేవు. ఎవరూ ఇళ్లకు వెళ్లకూడదని కాలేజీ గేట్స్ మూసివేశారు.
కాలేజీలో వేదిక మీద ఇన్స్పెక్టర్ రాజేశ్వరి ప్రతాప్ మాట్లాడుతున్నట్లు చెప్పారు.
తన పరిచయం గురించి ముగించిన తరువాత తన ప్రసంగంలో "నేను ప్రేమ వివాహాలకు అడ్డు చెప్పడం లేదు. కానీ ప్రేమకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు దాటవద్దండి. నేటి కవులు, రచయితలకన్నా ఈ క్రిమినల్స్ నందు ప్రేమమాటలను మనసుకు హత్తుకొని చెప్పగల నైపుణ్యం ఉంటుంది. అందుకే అమ్మాయిలు వారి మాటలకు ఫిదా అయిపోయి ప్రేమలో పడి వారి వలలో చిక్కుకొంటున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించానంటూ నటించి మాయ మాటలతో ఆమె మోకాలిపై టాటూస్(పచ్చ బొట్టు) వేయించేలా చేసాడు. టాటూస్ వేస్తున్న సమయాన ఆ అమ్మాయికి తెలీకుండా వీడియో తీసాడు. ప్రేమ వికంటించినట్లు పసిగట్టగానే ఆ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడానికి ప్రారంభించాడు. ఆ అమ్మాయి తల్లితండ్రులు మాకు ఫిర్యాదు చేయడం వలన మేము పట్టుకొన్నాము.
'లక్ష్మణ రేఖ’ రామాయణంలో సీతకే కాదు. ఈ కాలం యువతులకు ఆ లక్ష్మణ రేఖ దాటితే కస్టాలు అనుభవించక తప్పదు. ప్రేమ పేరుతొ సెల్ఫీ తీసుకోవడం, పిలిచిన చోటుకు వెళ్లడం, పబ్బులకు, రేవ్ పార్టీలకు వెళ్లడం, ప్రియుడి పేరును తన కాళ్ళపైన, చేతులపైన టాటూ( పచ్చబొట్టు) వేయించుకోవడం, చీకటి వేళ పార్కులకు వెళ్లడం, ఈ స్మార్ట్ ఫోన్లు, వాట్సప్, చాటింగులనబడే వ్యసనం లాంటివి పెళ్లికాని అమ్మాయి లక్ష్మణ్ రేఖ దాటినట్లవుతుంది.
ఆ తరువాత సీత కష్టాలు పడవలసి వస్తుంది. అమ్మాయిలూ.. ప్రేమలో లక్ష్మణ రేఖ లాంటి హద్దులు దాటి ఆపదలో పడవద్దండి. ఈ రోజు మేము అరెస్ట్ చేసిన ఆ రోగ్ ను మా పోలీసులు ఇప్పుడు మీ ముందు తీసుకొనివస్తారు " అంటూ ముగించింది.
సంకెళ్లు తగిలించిన వాడిని వేదిక పైకి తీసుకొనివచ్చారు పోలీసులు.
వాడిని చూడగానే పల్లవి శరీరం ఒక్కసారిగా జలదరించింది. ’ ఆ రోజు వాడి బలవంతం మీద నా మోకాలికి పైబాగాన వాడి పేరు టాటూ వేయించు కొన్నాను. టాటూ వేయించుకున్న సంగతి తల్లికి తెలిసిన తరువాత డాక్టరు సాగరిక వాసిలిన్ ట్రీట్మెంట్ చేసి తొలగించింది. టాటూ వేసుకొంటున్న సమయాన నాకు తెలీకుండా తీసిన వీడియో నాకు పంపుతూ బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధపడ్డాడు. పెద్ద గండం గడిచింది. ప్రేమలో ఎవరూ హద్దులు దాటకూడదు... దాటితే లక్ష్మణ రేఖ దాటిన సీత కష్టాలే' అని మనసులో అనుకొంది పల్లవి.
వేదిక పైనున్న తన వైపు చూస్తూ కృతజ్ఞతతో చేతులు జోడించిన పల్లవి వైపు చిరునవ్వుతూ చూసింది ఇన్స్పెక్టర్ రాజేశ్వరి ప్రతాప్.
( అయిపోయింది)
ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1. పేరు ఓట్ర ప్రకాష్ రావు
https://www.manatelugukathalu.com/profile/oprao/profile 2. నా గురించి : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు : 1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి, 2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి, 2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను. 2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను 2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక 2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది 2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి 2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు
コメント