top of page

లీలా మానస నిగ్రహ


'Leela Manasa Nigraha' New Telugu Story


Written By Vasundhara


(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: లక్ష్మి శైలజ)

నేను మాలతి అత్త ఇల్లు చేరేసరికి రాత్రి పదయింది. అత్త, బావ మానస్, మానస్ భార్య

లీల నన్ను సాదరంగా ఆహ్వానించారు. అతిథులకని అన్ని సదుపాయాలూ ఉన్న గది

నాకిచ్చారు. తలుపులేసుకుని పడుకుంటే మంచి నిద్ర పట్టింది. మర్నాడుదయం

మెలకువొచ్చేసరికి- ఇంట్లోవాళ్లు లేచి తిరుగుతున్న హడావుడి తెలుస్తోంది. త్వరగా

తెమిలి- తలుపు తియ్యబోయి ఆగిపోయాను.


“ఉద్యోగం చేస్తున్నావ్ సరే! అంతమాత్రాన ఆడదానివి కాకుండా పోతావా? కనీసం కాఫీ

ఐనా సరిగ్గా పెట్టివ్వలేవా?” అరిచాడు మానస్ బావ.


బావ నెమ్మదస్థుడు. మర్యాదస్థుడు. సంస్కారి. అలాంటి వాడు సంసారి కాగానే ఇంత

గట్టిగా భార్యమీద అరవడమా- పెళ్లామని లోకువా?

లీలమీద జాలిపడేదాన్నే. కానీ అంతలోనే- అరవలేదు కానీ దురుసుగా, మోటుగా లీల

గొంతు- “ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగస్థురాల్ని కాబట్టి, నేను పెట్టే కాఫీ మగాళ్ల

కాఫీలాగే ఉంటుంది”


నేను లేచానని తెలియక వాళ్లు నిస్సంకోచంగా గొడవ పడుతున్నారనుకుందుకు లేదు.

తర్వాత నన్ను చూసి కూడా, వాళ్లిద్దరూ నా ఊహకందని కుసంస్కారంతో నిస్సంకోచంగా

వాగ్యుద్ధం కొనసాగించారు.


వాళ్లది ప్రేమ వివాహం. ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకున్నాను. ఏమయింది వాళ్ల

ప్రేమకి?

-----

ప్రేమే దైవం అంటారు. దైవానికి లాగే ప్రేమకూ ఎన్నో రూపాలు. దైవభక్తుల్లో కొందరిలాగే

ప్రేమభక్తుల్లో కొందరు ఇతర రూపాలవారిని ద్వేషిస్తారు, వారితో కలహిస్తారు.

బిడ్డను కనాలంటే తల్లి నవమాసాలు కడుపులో మోయాలి. ప్రాణం పోతోందనిపించే

పురిటినొప్పులు భరించాలి. ఆ పుట్టిన బిడ్డపై తల్లికుండేది పగ కాదు, ప్రేమ! అది అన్ని

ప్రేమల్లోకీ ప్రత్యేకం.


తల్లిప్రేమను ప్రశంసిస్తూ ఎన్నో కథలొచ్చాయి. పాటలొచ్చాయి. ఇంకా వస్తున్నాయి. కానీ

ఏనుగు ప్రత్యేకత కళ్లతో చూడాలి కానీ, చేతులతో తడిమితే అవగాహనకు రాదుకదా!

తల్లిప్రేమ కూడా అనుభవైకవేద్యం.


వయసొచ్చిన బిడ్డకి జత కావాలి. ఆ జత మనుగడకు ప్రేమ కావాలి.

ఆ ప్రేమజంటలో క్రమంగా ఒకరికొకరు తల్లిని మించిన ఆలంబన ఐతే అది సహజం.

ఎన్నో కథలు, కావ్యాలు ఆ ప్రేమను మనోహరం చేశాయి, చేస్తున్నాయి. ప్రణయప్రేమ

కూడా అనుభవైకవేద్యమే!


తల్లిప్రేమకూ, ప్రణయప్రేమకూ మధ్య జరిగే సంఘర్షణ స్థాయి ఒకోసారి మతకలహాలకు

తీసిపోదు. అందువల్ల కొందరికి జీవితాలు దుర్భరమౌతుంటాయి.

అదే జరిగింది వినోద్‍తో నా ప్రేమ విషయంలో.


అతడు నాకు ఆర్నెల్లుగా పరిచయం. మాది తొలిచూపు ప్రేమ. తర్వాత సినిమాలు,

పార్కులు వగైరాలతో చనువు పెరిగింది. అది సరిపోక, చాలాసార్లు నన్నతడు ఏకాంతానికి

ప్రోత్సహించాడు. అతణ్ణే కాదు, నన్ను నేనూ వారించడం కష్టమని అర్థమై, నాల్రోజుల

క్రితం పెళ్లి చేసుకుందామని చెప్పాను. అప్పటికేమనకుండా మళ్లీ ఈ రోజు నన్ను

కలిశాడు.


“మన పెళ్లికి మావాళ్లొప్పుకోలేదు. కాదని ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే, పెద్ద గొడవే

అయ్యేలాగుంది. వాళ్లని మన దారికి తీసుకురావడానికి ఒక్కటే మార్గం కనబడుతోంది.

సహజీవనం” అన్నాడతడు.

“మరి పెళ్లి?” అన్నాను.


“ఏళ్లు గడిచినా మనం సహజీవనానికి కట్టుబడి ఉంటే- మావాళ్లు దిగిరావడం తథ్యం”

అన్నాడతడు.

నాకది పరిష్కారంలా కాక, స్త్రీపట్ల పురుషుడి అవకాశవాదంలా తోచింది. “నాకిష్టమైన ఏ

వ్యక్తినైనా పెళ్లి చేసుకునే స్వేచ్ఛ నాకుంది. కానీ సహజీవనానికి మా పెద్దవాళ్లొప్పుకోరు”

అన్నాను.


“పెళ్లికైతే ఏమో కానీ, ప్రేమ విషయంలో పెద్దల ప్రసక్తి దేనికి?” అన్నాడతడు ఆశ్చర్యం

నటిస్తూ.

“సహజీవనంలో శారీరకబంధమే కానీ మానసిక అనుబంధం ఉండదు. శారీరక బంధానికి

మోహం, వాంఛ చాలు. ప్రేమతో పని లేదు. బంధంకంటే అనుబంధానికి ప్రాధాన్యమిచ్చే

పెళ్లికి దారి తీసే ప్రేమనే నేను గౌరవిస్తాను. అప్పుడైతే నువ్వన్నట్లు మన పెళ్లిని

నిర్ణయించడానికి మనకి మనమే పెద్దలం”


అతడు సహజీవనానికి పెద్దల ప్రసక్తి ఎందుకన్నాడు. దాన్నే కాస్త తిప్పి- పెళ్లికి

వర్తింపజేశాను.

“ఇన్ని మాటలెందుకు! నీకు నా ప్రేమమీద నమ్మకముంటే- నేను చెప్పేది విను.

సహజీవనం చెయ్యకుండా, పెళ్లి చేసుకున్న ప్రేమికుల ప్రేమ ఎన్నాళ్లో నిలబడదు.

అందుకే ఎన్నో ప్రేమపెళ్లిళ్లు పెటాకులౌతున్నాయి. మన విషయంలో అలా జరకూడదని

నా తాపత్రయం” అన్నాడు వినోద్.

అది తాపత్రయమో, అవకాశవాదమో తెలీదు కానీ సహజీవనానికి ఒప్పుకోకపోతే ఇప్పుడే

మా ప్రేమకు స్వస్తి పలికేలా ఉన్నాడు వినోద్. అతణ్ణి వదులుకోలేను. సహజీవనానికి

ఒప్పుకోలేను. ఏంచెయ్యాలి?

అప్పుడు గుర్తొచ్చారు లీల-మానస్‍. వాళ్లదీ ఇంచుమించు ఇలాంటి కేసే.

-----

మాలతి నాకు వరుసకు మేనత్త. ఆమె ఒక్కగానొక్క కొడుకు మానస్. అందగాడు.

బుద్ధిమంతుడు. నేను ఇంటర్లో ఉండగానే మావాళ్లతణ్ణి నాకోసమని అడిగారు. కానీ మానస్ తనకి నామీద అలాంటి ఫీలింగ్సు లేవన్నాడనీ, ఐనా తను బ్రతిమాలి ఒప్పించాననీ చెప్పింది అత్తయ్య. ఏడాది తర్వాత, అంటే నేను మేజర్నయ్యేక తాంబూలాలు అనుకున్నారు. కానీ ఆలోగానే మామయ్య అనుకోని ప్రమాదంలో చనిపోయాడు. దాంతో మావాళ్లు వెనక్కి తగ్గారు.

ఎందుకంటే బంధువర్గంలో అత్తయ్యకి మంచి పేరు లేదు. ఆమె ధాటికి తట్టుకోలేక,

అత్తమామలు స్వగ్రామానికి మారి, అక్కణ్ణించే స్వర్గాని కెళ్లారు. మామయ్య లౌక్యంతో

ఆమెను కొంత కాసుకొస్తున్నాడు. ఐనా తెలిసినవాళ్లెవరూ ఆ ఇంట్లో పిల్లనివ్వరు. ఎటొచ్చీ

అత్తయ్యకున్న సుగుణమల్లా కొడుకంటే పిచ్చిప్రేమ. కొడుకు సంతోషంకోసం ఏమైనా

చేస్తుంది. మానస్‍కీ అత్తయ్యంటే అంత ప్రేమానూ!


మామయ్యుంటే- అత్తయ్య ఆయనతో ఉంటుంది, బావ ఉద్యోగరీత్యా వేరేఊళ్లో ఉంటాడు-

అనుకున్నారు మావాళ్లు. కానీ మామయ్య పోవడంతో, పరిస్థితి మారింది. ఇప్పుడు

బావెక్కడుంటే అక్కడ అత్తయ్య తప్పనిసరి! అందుకని, మావాళ్లా సంబంధం

వదిలేశారు.


‘ఇలా సంబంధం అనుకోగానే, అలా ఆయన పోయారు. అచ్చిరాలేదని ఆ సంబంధం

వదులుకున్నాం’ అన్న ప్రచారంతో తన పరువు నిలబెట్టుకుంది అత్తయ్య.

మానస్ చదివే కాలేజిలోనే, అతడికి రెండేళ్లు జూనియర్ లీల. వాళ్లదీ మాకులాగే

తొలిచూపు ప్రేమ. ఓ ఆర్నెల్లు ప్రేమించుకున్నాక, పెళ్లి చేసుకుంటామని ఇళ్లలో

చెప్పేశారు.


అప్పటికి మామయ్య పోయి రెండేళ్లయింది. పెత్తనం అత్తయ్యదే! ఆమెకి కొడుకిష్టమే

ప్రధానం. అలా అట్నించి పచ్చ జెండా ఊగింది కానీ- కులాంతరమని లీల

తలిదండ్రులే ఓ పట్టాన ఒప్పుకోలేదు. బ్రతిమాలి బామాలి ఎలాగో లీల వాళ్లనీ

ఒప్పించింది.


ఇక వాళ్ల పెళ్లికి అడ్డేం లేదు. ఐతే మానస్‌కే నన్నడగాల్సిన ప్రశ్నొకటుంది. అది భుజాన

వేసుకుని లీల నాదగ్గర్కొచ్చింది. అదే ఆమెతో నాకు తొలిపరిచయం.

తను ఫోన్ చేస్తే ఇద్దరం ఓ రెస్టారెంట్లో కలుసుకున్నాం.


మానస్‍కి నన్ననుకోవడం, అత్తయ్య గయ్యాళితనం వగైరాలన్నీ లీలకి తెలుసు. “మొదట్లో మీవాళ్లే మానస్‍కి నిన్నడిగారు. మాలతిగారూ ఒప్పుకున్నారు. అందుకని తనమీద నీకేమైనా ఫీలింగ్సున్నాయా అని మానస్ అనుమానం. నీకు తనమీద ఫీలింగ్సుంటే కనుక, తన తల్లిని సంతోషపెట్టడానికి- మా ప్రేమని, ప్రేమ దగ్గరే ఆపేస్తానని చెప్పమన్నాడు!” అంది లీల.

ఊహించని ఈ రాయబారానికి తెల్లబోయాను. “అలా నిన్ను తిరస్కరిస్తే, నీ

ఆత్మాభిమానం దెబ్బ తినదా?” అన్నాను.


“ప్రేమికుల మధ్య అనుమానాలకే కాదు, ఆత్మాభిమానాలకీ తావు లేదు. అందుకే మానస్

తను నన్ను తిరస్కరించలేదనీ, నేనే తనని తిరస్కరించాననీ చెప్పుకుంటానన్నాడు.

అది నాకిష్టంలేదు. అదీకాక తను చేసుకోబోయే నీ ఆత్మాభిమానం కూడా దెబ్బతింటుంది.

అదీ నాకిష్టంలేదు” అంది లీల.


అటు మానస్, ఇటు లీల- ఇద్దరూ ప్రేమమూర్తులు. మూర్తీభవించిన సంస్కారాలు.

ఇద్దరూ ఒకటైతే ఆదర్శ దంపతులు ఔతారనిపించి, అందుకు నావంతు సాయం

చెయ్యాలనుకున్నాను.


“పెద్దలు పట్టుబడితే అప్పట్లో ఒప్పుకునేదాన్నేమో చెప్పలేను! ఇప్పుడు నా

మనోభావాలు వేరు. ముందు చదువు. తర్వాత ఉద్యోగం చేస్తూ, కనీసం రెండేళ్లు స్వేచ్ఛగా బ్రతకాలి. అందాకా పెళ్లి ఆలోచనే చెయ్యను. ఆలోచించినా- ఊహలో కూడా బావకి వరుడి స్థానమివ్వలేను”- అని స్పష్టం చేశాను.


లీల థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. తర్వాత రెండేళ్లకి తన పెళ్లి శుభలేఖని స్వయంగా

ఇచ్చింది.

పెళ్లికి సకుటుంబంగా వెళ్లాం. మా అమ్మ పెళ్లిపీటలమీద లీలని చూసి, “ముత్యంలా

ఉంది పిల్ల. కోరి జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఆ దేవుడే కాపాడాలి” అని

నిట్టూర్చింది.

-----

లీల-మానస్‌ల ఘర్షణ విన్నాక- దేవుడు లీలని కాపాడలేదని అర్థమైంది నాకు.

ఐనా ప్రేమే దైవం అంటారు. ఆ ప్రేమే వాళ్లమధ్యనుంచి తప్పుకున్నాక- కాపాడ్డానికి

దైవమెక్కడుంటాడు? మరి ప్రేమ ఎన్ని రకాలో కానీ- యువతీయువకుల మధ్య పుట్టే

ప్రేమ మాత్రం- తాత్కాలికమైన మోహంతో, వాంఛతో ముడిపడి, వాటితోపాటే మాయం

కావడాన్ని పెళ్లి కూడా ఆపలేదు. ఇది వింటే- వినోద్ రెచ్చిపోడూ!


ఆఫీసుకెడుతూ లీల నన్ను నా గదిలోకి తీసుకెళ్లి, “నీకు మా ఆఫీసు చూపిస్తానని

అత్తయ్యతో అన్నాను కానీ, మనం వెళ్లేది ఆఫీసుక్కాదు, వైటిటి మాల్‍కి. నీతో చాలా

మాట్లాడాలి” అంది.


నా సందేహాలు తీర్చడంకోసమే లీల ఆ ప్రోగ్రాం పెట్టిందని గ్రహించాను.

ఇద్దరం ఆ మాల్‍లో ఓ రెస్టారెంట్లో గంటకు పైగా మాట్లాడుకోవడంలో ఊహకందని

విశేషాలు తెలిశాయి.


కోడలు సంతోషంగా ఉంటే ఓర్వలేదు అత్తయ్య. కోడలి మనసు కష్టపడాలన్నది ఆమె

ధ్యేయం. కానీ అలా చేస్తే ఉద్యోగం ఉందన్న ధైర్యంతో కోడలు కొడుకునొదిలేసి

వెళ్లిపోతుందని భయం. అందుకని ఆమె కొడుక్కి కోడలిపై చాడీలు చెప్పేది. అతడు

పట్టించుకోకపోతే- ‘అవున్లే, నాన్న లేరుగా! నాకవమానం జరుగుతుంటే


పట్టించుకునేవాళ్లు లేరు’ అని కళ్లనీళ్లు పెట్టుకునేది.

లీల-మానస్‌ల మధ్య దాపరికాలు లేవు. ‘అత్త, మానస్, లీల కలిసుండాలి. అత్త

సంతోషంగా ఉండాలి. లీల మనసుకి కష్టం కలక్కూడదు’- ఇదెలా సాధ్యమా అని ఇద్దరూ

కలిసే ఆలోచించారు. అలా వారికి తోచిన పరిష్కారమే- ఇప్పటి ఆ దంపతుల ప్రవర్తన!

రోజూ మానస్ లీలని నోటికొచ్చినట్లు తిట్టి, లీల మనసు కష్టపెడతాడు. అలా అత్తయ్యకు

సంబరం.


“ఇదేం విడ్డూరం! తల్లి సంతోషంకోసం, భార్య మనసు కష్టపెట్టడం ఓ పరిష్కారమా! ఐనా,

ఇలా అత్తయ్య సంబర పడుతుందనుకుంటే అది మీ భ్రమ! బావ మాటలు విని

నువ్వేమన్నా ఊరుకుంటున్నావా? ప్రతి మాటకీ ధీటుగా బదులిస్తున్నావ్! అది అత్తయ్యకి

నచ్చుతుందనుకోను” అన్నాను.


లీల నవ్వి, “విని ఊరుకుంటే, మానస్ తిట్లకు విలువేముంది? ఉద్యోగం చేసే అమ్మాయికి,

అంతో ఇంతో ఆత్మాభిమానం ఉండాలిగా! మాటకి మాట ఎదురు చెప్పేనంటే-

నాకుక్రోషం వచ్చిందనేగా! నా రియాక్షన్‌కి అత్తయ్య ఫుల్ హాపీ!” అంది.


“ఏదేమైనా భర్తతో అలాంటి కాపురం, నాకైతే నరకమే!” అన్నాను అసంతృప్తిగా.

“ఐతే మానస్ అనే మాటలు తనవి కాదు. ముందురోజు రాత్రి నేను రాసిస్తాను. వాటికి

జవాబులు తను నాకు రాసిస్తాడు. ఇద్దరం వాటిని వల్లె వేసుకుంటాం. మర్నాడు

లేవగానే- ‘యాక్షన్!’ అనుకుని మొదలెడతాం. నాకోసం నేను రాసిన డైలాగ్సు

నన్నెందుకు బాధిస్తాయి? ఎంత బాగా రాశానో అని మురిసిపోతాను. మానస్ కూడా

అంతే!” నవ్వింది లీల.


“మరి నువ్వు తన కొడుక్కి ఎదురు సమాధానాలు చెబుతుంటే, అత్తయ్య కలగజేసుకోదా?”

అన్నాను.


“అత్తయ్య మాట్లాడరు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారని సంబరపడతారు. మేం

రోజూ గొడవ పడతామని- లేని బాధ నటిస్తూ, ఎంతో హుషారుగా ఇరుగుపొరుగులకి

చెబుతారు. మొగుడూపెళ్లాల గొడవల్లో వేలెట్టడం తనకి ఇష్టముండదని గొప్పగా

అంటారు. నాకు అణకువ లేదనీ, ఉద్యోగం చేస్తున్నానని గర్వమనీ, మొగుణ్ణి బొత్తిగా లెక్క చెయ్యననీ ప్రచారం చేస్తారు. చుట్టుపక్కల పనీపాటూ లేని చాలామందికి నేనంటే వెరీ బాడ్ ఇంప్రెషననుకో” అంది లీల.


“ఇద్దరూ రోజూ గొడవపడుతున్నారు. చుట్టుపక్కల నీకు చెడ్దపేరు. ఎన్ని చెప్పు, ఇదే

విషమ పరిస్థితుల్లో నేనుంటే- పరిష్కారం ఇది కాదు- వేరు కాపురం, లేదా విడాకులు…”

అన్నాను.


“ఇందులో విషమానికి తావెక్కడ? రాత్రిళ్లు మా ఏకాంతానికి ఏమాత్రం అడ్డు రారు

అత్తయ్య. నామీద ప్రేమతో కాదు- కొడుకు సంతోషంగా ఉండాలని! అందువల్ల నేనూ

ఎంతో సంతోషంగా ఉంటున్నాను. పగలు మానస్‍కీ, నాకూ జరిగే గొడవలు ఆమెను

సంతోషంగా ఉంచుతున్నాయి. ఇలా ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నప్పుడు

చుట్టుపక్కలవాళ్లేదో అనుకుంటున్నారని- విడాకులదాకా వెడతామా?”


“నా దృష్టికోణంలో నీది చాలా పెద్ద సమస్య. నీ దృష్టికోణంలో దానికి పరిష్కారం

లభించినా, అది ఎన్నాళ్లో పని చేస్తుందనుకోను. అత్తయ్యని ఏ ఆశ్రమంలోనైనా….” అని

ఇంకా ఏదో అనబోతుండగా-


“అడ్డాలబిడ్డను తల్లి నిస్వార్థంగా ప్రేమిస్తుంది. ఆ బిడ్డమాత్రం తనకు అవసరమనే

తల్లిని ప్రేమిస్తాడు. గెడ్డాల బిడ్డకు తల్లి అవసరం లేదు. అందుకని ప్రేమించడం

మానేస్తే ఆ బిడ్డ స్వార్థపరుడే ఔతాడు. ఈ వయసులో తల్లిని అంతలా ప్రేమించే మానస్

నా భర్త ఐనందుకు గర్వంగా ఉంది. ఆ తల్లీబిడ్డలను వేరు చెయ్యడం నాకేమాత్రం

సంతోషాన్నివ్వదు” అని ఓ క్షణమాగి, “బయట్నించి నీకేమనిపిస్తోందో కానీ- నాదీ,

మానస్‍దీ మహావృక్షమౌతున్న ప్రేమానుబంధం. మానస్‍దీ, అత్తయ్యదీ- ఆ వృక్షాన్ని

ఆలంబనగా చేసుకుని లతలా అల్లుకుపోతున్న మమతానుబంధం. ఆ రెంటినీ

అనుసంధానం చెయ్యడానికి అవసరమైన నిగ్రహాన్ని పాటించడమే మా ధ్యేయం.

ఏమంటావ్?” అంది లీల.


ఏమంటాను? పిన్నల దాంపత్య జీవితంలో పెద్దలకి ప్రాధాన్యాన్నిచ్చే నిగ్రహమే అసలైన

ప్రేమ అని అర్థమై, “లీలా మానస నిగ్రహా- నీ పరిష్కారానికి నా జోహార్లు” అన్నాను

అప్రయత్నంగా.

---0---

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.


42 views0 comments

Comments


bottom of page