కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Lohitham' New Telugu Story Written By Allu Sairam
రచన: అల్లు సాయిరాం
సమయం రాత్రి ఏడున్నర కావస్తోంది. ఆగకుండ కురుస్తున్న వర్షంలో
తడిచిపోయి యింటికి వచ్చిన లోహిత్ బైక్ శబ్దానికి, వంటగదిలో వంట చేస్తున్నఈశ్వరి తువ్వాలు పట్టుకుని ఎదురుగా వచ్చింది. లోహిత్ బ్యాగ్ పక్కనబెట్టికూర్చుంటూ, ఎర్రగా ఉన్న ఈశ్వరి కళ్ళు చూసి "ఏమైందోయ్? ఉల్లిపాయలు కొస్తున్నావా? మిరపకాయలు కొరికావా?" అని నవ్వుతూ అడిగాడు.
ఈశ్వరి లోహిత్ తల తుడుస్తూ "ఆఁ ఉల్లిపాయలు, మిరపకాయలు! కుదిరితే మిమ్ముల్ని కుడా కొరికి తినేస్తా! కానీ, మీరు, మీ ముద్దుల కూతురు మాత్రం, నేను ప్రేమగా ఏది చేసినా తినరు! పైగా, అలా ఉంది, యిలా ఉందని వంకలు పెడతారు!" అని టేబుల్ మీదున్న కప్పులో సగం తిన్న సేమ్యా పాయసం చూస్తూ అంది.
తన తల తుడుస్తున్న ఈశ్వరిని ఆపి, సూటిగా చూస్తూ "ఏమైంది? లలితని ఏమైనా అన్నావా?" అని అడిగాడు.
"నేనేమంటాను! అది కూడా మీలాగే! దానికి బుద్ధి పుడితే చిలుకలా ఆపకుండా మాట్లాడుతుంది. బుద్ధి పుట్టకపోతే, ఎదుటివారు ఎంత గింజుకున్నా నోరుతెరిచి మాట్లాడదు. ఎందుకో, రెండుమూడు రోజుల్నుంచి ముఖం అదోలా పెట్టుకుని, దిగాలుగా, ఏదో దాని లోకంలో అది ఉంటుంది. నవ్వదు. మాట్లాడదు. సరిగ్గా తినదు. సరేలే! దానికి యిష్టం కదా అని, సేమ్యా పాయసం చేసి పెడితే కుడా తినట్లేదు. ఏమైంది, ఎందుకు యిలా ఉంటున్నావని అడిగితే, అలిగి లోపలికి వెళ్ళిపోయింది. తినడానికైనా వస్తుందో, రాదో అమ్మగారు!" అని జరిగినదంతా వివరంగా చెప్పింది ఈశ్వరి.
ఆలోచనలో పడిన లోహిత్ "పాప అదోలా ఉంటుందా! మొన్న తను నాకు చూపించిన ప్రోగ్రెస్ కార్డులో కుడా ఎప్పటిలాగే తను క్లాస్ ఫస్ట్ వచ్చింది. కాబట్టి, మార్కులు గురించి అయ్యిండదు! ఒకవేళ, స్కూల్లో ఏమైనా అయ్యిందేమో! లేక ఒంటిలో బాలేదోమో! తన చెయ్యిపట్టుకుని ఒళ్ళు వేడిగా ఉందేమో అని చూశావా లేదా?" అని అడిగాడు.
"చూశాను! ఒళ్ళంతా బాగానే ఉంది! స్కూల్లో ఏమైనా జరిగితే, స్కూల్ వారు ఫోన్ చేసి చెప్తారు కదా! దీనికిదే ఏదోదో పిచ్చిపిచ్చిగా ఆలోచించుకోవడం, తలనొప్పి తెచ్చుకుని, యిలా రెండు మూడు రోజులు ఏదో కోల్పోయినట్లు ఉండడం బాగా అలవాటయిపొయింది!" అని అదే చిరాకులో అంది ఈశ్వరి.
"నువ్వు యింత వేడిగా ఉంటే, యింక తనకి ఏమైందో నీకు ఏలా తెలుస్తోంది! ఒకవేళ ఏమైనా కుడా, తను నీతో చెప్పుకోలేదు! ఉండు! నేను మాట్లాడి తీసుకొస్తాను!" అని అంటూ లలిత దగ్గరికి నడిచాడు లోహిత్.
బాల్కనీలో కూర్చుని వర్షం పడుతున్న ఆకాశాన్ని తీక్షణంగా చూస్తుంది లలిత. లోహిత్ వెనుకనుంచి లలిత భుజంమీద చెయ్యి వేస్తే, లలిత తుళ్ళిపడి, లోహిత్ ని చూసి "డాడీ! మీరేనా!!" అని అంది.
లోహిత్ నవ్వుతూ లలిత పక్కన కూర్చుని దగ్గరికి తీసుకుని "ఏమైందిరా తల్లీ! యిక్కడ ఏం చూస్తున్నావు?" అని అడిగాడు.
"ఏం లేదు డాడీ! మమ్మీ ఏమైనా చెప్పిందా?" అని అడిగింది లలిత.
లోహిత్ రెండు చేతులతో అప్యాయంగా లలిత ముఖాన్ని పట్టుకుని "మమ్మీ చెప్పేదేముందిరా! నేను మీ నాన్నని రా తల్లీ! మా లలితమ్మ ఎప్పుడు ఏలా ఉంటుందో, నాకు తెలియదా చెప్పు! ఏమైంది చెప్పురా నాన్నా!" అని అడిగాడు.
లలిత మనసు తెరిచి "ఆనందం అంటే ఏంటి డాడీ?" అని అడిగింది.
పదేళ్ల వయసు కూతురు అడిగిన ప్రశ్నకి లోహిత్ ఒకింత ఆశ్చర్యపోతూ "ఏంటిరా నాన్నా!" అని అడిగాడు.
"వాట్ ఈజ్ హ్యాపీనెస్ డాడీ?" అని ముద్దుగా అడిగింది లలిత.
కూతురి బుద్ధితనానికి లోహిత్ కి తన్మయత్వంతో కళ్ళలో నీళ్ళుతిరిగి "ఏంటి అంటే ఇంగ్లీషులో అడగమని కాదురా నాన్నా! యిప్పుడు ఆనందం గురించి నీకెందుకు అంత పెద్ద డౌట్ వచ్చిందమ్మా?" అని అడిగాడు.
"డాడీ! ఎందుకో తెలియదు కానీ, మైండ్ అంతా ఏదోలా ఉంది!" అని మనసులోమాట చెప్పింది.
లలిత ఆలోచనల లోతుని అర్థం చేసుకోవడానికి లోహిత్ "సరే తల్లీ! అలా ఉండడానికి కారణాలు ఏమైనా ఆలోచించావా?" అని అడిగాడు.
"అదే డాడీ! ఎందుకిలా ఉన్నానని ఆలోచిస్తున్నాను!" అని అంది లలిత. అచ్చుగుద్దినట్లు తన ఆలోచన విధానం కూతురికి వచ్చిందని ఆనందంగా "సరే!" అని అంటూ లోహిత్ ఏదో చెప్పబోతుండగా "రాత్రికి తినాలని, అక్కడ నేను ఒకదాన్ని మీయిద్దరి కోసం చూస్తున్నానని ఆలోచన లేకుండా, తండ్రికూతురులిద్దరూ యిక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారా?" అని అంటూ బాల్కనీలోకి అగ్గిమీద గుగ్గిలంలా వస్తున్న ఈశ్వరిని చూసి, లోహిత్ సీరియస్ గా కుర్చీలో నుంచి లేచేసరికి, ఈశ్వరి, లలిత లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అగ్ని చల్లార్చడానికి నీళ్ళుచల్లినట్లు, అయోమయంగా నిల్చుని చూస్తున్న ఈశ్వరిని తన కుర్చీలో కూర్చోబెట్టి, లలిత దగ్గరికి వచ్చాడు
"సరే తల్లీ! మనం ముగ్గురం కలిసి ఆలోచిద్దాం. నీకు ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏలా ఆలోచించాలో చెప్పాను. గుర్తుందా?" అని అడిగాడు లోహిత్.
"గుర్తుంది డాడీ! ఏదైనా సమస్యకి పరిష్కారం ఆలోచించేటప్పుడు, ఆ సమస్య రూట్స్ అంటే, సమస్యల మూలాల నుంచి ఆలోచిస్తే, తొందరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యగలం!" అని బదులిచ్చింది లలిత.
"గుడ్! యిప్పుడు అదే చేద్దాం. ఒక్కటి చెప్పు నాన్నా! యిప్పుడు నీకు యిలా అనిపించినట్లు, యింతకుముందు ఎప్పుడైనా అనిపించిందా? పోనీ, నీకు ఎప్పుడు బాగా ఆనందంగా అనిపించింది?" అని కూతురి సమస్యని పరిష్కరించడానికి అడిగాడు లోహిత్.
"నాకు ఆనందంగా అంటే, నా పుట్టినరోజున, యింకా, నాకు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు, యింకా, మీరు ఏదైనా గిఫ్ట్ యిచ్చినప్పుడు, నేను ఫ్రెండ్స్ కి ఏదైనా యిప్పించనప్పుడు.." అని ఆలోచించి గుర్తుచేసుకుంటూ చెప్పింది లలిత. తండ్రికూతుర్లిద్దరూ మాట్లాడుకుంటుంటే, కోపం శాంతించి ఆసక్తిగా చూస్తుంది ఈశ్వరి.
"యింకేముంది నాన్నా! నువ్వు చెప్పినదాంట్లో, ఏదోకటి యిప్పుడు చేసేస్తే, నువ్వు ఆనందంగా ఉంటావు కదరా! చేసేద్దామా చెప్పు!" అని కుర్చీలో కూర్చున్న లలిత భుజాలపై చెయ్యి వేసి అడిగాడు లోహిత్.
"అదేలా డాడీ! పుట్టినరోజులు, క్లాస్ ఫస్ట్ లు, గిఫ్ట్ లు, ఎప్పుడంటే అప్పుడు రావు. ఉండవు కదా!" అని అంటూ లోహిత్ ని చూస్తున్న లలిత నుదుటన ముద్దాడుతూ "వెరీ గుడ్ రా తల్లీ! ఐ యామ్ ప్రౌడ్ ఆప్ యూ! నువ్వు చెప్పినట్లే, పుట్టినరోజులు, క్లాస్ ఫస్ట్ లు, గిఫ్టులు కాలంతో పాటు వస్తుంటాయి. పోతుంటాయి! నీకు ఎందుకు ఆనందం గురించి అంత ఆలోచన వచ్చిందని అడిగానంటే, యీ ఆనందానికి సరైన నిర్వచనం గాని, సరైన వివరణ యివ్వాలంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొవాలి. అప్పటికి గాని, మనిషికి ఆనందం గురించి ఆలోచన రాదు. దాని అర్థం బోధపడదు.
సరేలే, ఆలోచన మంచిది అవ్వాలి గాని, వయసుతో పనేముంది! ఆనందం గురించి నాకు అర్ధమైన విధంగా నీకు చెప్తాను. అది నీకు అర్ధమై ఆనందాన్ని యిస్తుందో లేదో చూడాలి! ముఖ్యంగా మనం గమనిస్తే, గతం గురించి జ్ఞాపకాలు, ప్రస్తుతం గురించి ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఊహలు మన ఆనందాన్ని నిర్ణయిస్తాయి. మనం ఆనందం కోసం వాటిమీద ఆధారపడితే, జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండలేం. ఎందుకంటే, ఆనందమనేది మనసుకి సంబంధించినది!
ఆహారం రుచి నోటిజిహ్వకి, ఆనందం రుచి మనసుకి తెలుస్తుంది. మన మనసే క్షణానికి ఒకలా మారుతుంటే, ఆనందం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఏలా ఉంటుంది! యి ఆనందమనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు చాలా ఖరీదైన వస్తువులు వాడుతున్నా, భోగభాగ్యాలు అనుభవిస్తున్నా, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు, యింకా ఏదో కావాలని వెంపర్లాడుతుంటారు. మరికొందరు, పెద్ద గాలేస్తే ఎగిరిపోతుందా అన్నట్లుండే చిన్న టెంట్ వేసుకొని రోడ్డు పక్కన గడుపుతూ, మనసు లోలోపల ఏలా ఉంటారేమో గాని, బయట చూడడానికి మాత్రం వేదాంతం ఒంటపట్టినట్లుగా ఆనందంగా నవ్వుతుంటారు. ఆనందాన్ని ఆస్వాదించే మనసు లేనప్పుడు, ఆదాయాలు ఎన్ని సంపాదించినా, భోగభాగ్యాలకై ఎంత వెచ్చించినా, సమయం వృధా అవ్వడం తప్ప వేరే ఉపయోగం లేదు!
యింకో ముఖ్యమైన విషయం, మనం చేసే సాధారణ పనులను కూడా అద్బుతాలుగా చిత్రీకరించే, మన చుట్టూ చేరే జనాల వ్యక్తిగత అభిప్రాయాలు, వారి అవసరానికి సందర్భానుసారంగా మనల్ని ముంచేత్తే పొగడ్తలపై మన ఆనందాలు ఆధారపడకూడదు. ఎందుకంటే, వారు పొగుడుతారని జీవితంలో అన్ని జరుపుకోలేం కదా! ఒక్కోసారి జరుపుకోలేని పరిస్థితులు రావొచ్చు! అలాగే, టెక్నాలజీల ముసుగులో కొత్త కొత్త వస్తువులు రోజూ కొంటూ ఉండలేం. ఎందుకంటే, యిరోజు మార్కెట్లోకి వచ్చిన కొత్తవస్తువు ఎంత విలువైనదైనా, రేపటి రోజుకి పాతవస్తువు అయిపోతుంది. అంతవేగంగా ప్రపంచం పరుగులు తీస్తుంది. వస్తువులు కొత్తవైనా, పాతవైనా, మన ఆలోచనా దృక్పథం కొత్తదైతే ప్రపంచం కుడా కొత్తగా కనిపిస్తుంది. ఆనందం అందులోనే ఉంటుంది! అర్ధమైందా తల్లీ!" అని లోహిత్ విడమర్చి వివరించాడు. ఈశ్వరి, లలిత లు ఆసక్తిగా వింటున్నారు.
"యింకా అర్ధమయ్యేలా చెప్పాలంటే, చిన్న కథ చెప్తాను. ఈశ్వరి! ఐదు నిమిషాల్లో అయిపోతుంది!" అని వాచ్ చూస్తూ, భార్య అనుమతి అడిగినట్టుగా అడిగాడు లోహిత్. తనకిచ్చిన విలువకి పొంగిపోయి మీరు చెప్పండి అని చెప్పడానికి కుడా మాటలు రాక, తలతో సైగచేసింది ఈశ్వరి.
"ఒకప్పుడు రోడ్డు పక్కన ఒక పెద్దచెట్టు, ఒక చిన్న పూలమొక్క లు ఉండేవి. ఏమైందో తెలియదు కానీ, ఆ రెండింటికి ఎప్పుడు పడేది కాదు! 'నేను అందరికి నా పువ్వులు యిస్తాను. మంచి సువాసలు యిస్తాను. నేనే గొప్ప' అని పూలమొక్క అంటే, 'నేను అందరికి నీడని యిస్తాను. నువ్వు ఉండేది కుడా నా నీడలోనే. నేనే గొప్ప' అని పెద్దచెట్టు అనుకుంటూ, రెండింటి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టుగా ఉండేవి!
చిన్నమొక్క ఎప్పుడూ పెద్దగాలులు వీచినట్లు, ఆ గాలులకి తన శత్రువైన పెద్దచెట్టు వేర్లతోసహా కూప్పకూలినట్లు, తనకి మాత్రం ఏం కానట్లు, తన ఊహల్లో ఊహించుకునేది! మరి, ఆ పెద్దచెట్టు, పెద్ద వరదలు వచ్చినట్లు, తన శత్రువైన ఆ చిన్నమొక్క సమూలంగా వరదల్లో కొట్టుకుపోయినట్లు, తనకి మాత్రం ఏం కానట్లు ఊహించుకునేది! యిలా రెండు దేవుడు సృష్టించిన పకృతిలో పంచభూతాల పరంగా వచ్చే ప్రమాదాల గురించి ఊహలతో అవకాశం కోసం ఎదురుచూసేవి! కానీ, అదే దేవుడు సృష్టించిన మనిషి అనే పెద్ద భూతం గురించి అంచనా వేయలేకపోయాయి.
ఆ రోడ్డు వెడల్పు చెయ్యడానికి, ముందుగా పెద్దచెట్టుని వేర్లతోసహా పీకేసి పక్కనపడేశారు. అది చూసి, తనకి ఏం లాభం రాకపోయినా, చిన్నమొక్కకి ఆనందంగా అనిపించి పగలబడి నవ్వుతుంది. పడిపోయిన ఆ పెద్దచెట్టు యింకా గట్టిగా నవ్వుతూ, 'యింత పెద్దగా ఉన్న నన్ను పీకిపడేస్తే, భూమికి జానెడు లేవు. నిన్ను వదులుతారని ఏలా అనుకుంటున్నా'వని అడిగింది. ఒక్కక్షణంలో చిన్నమొక్క ఆనందం ఆవిరి అయిపోయి, తన వంతు ఎప్పుడు వస్తుందా అని భయం పట్టుకుంది. భయపడినట్టుగానే, చిన్నమొక్క రోడ్డురోలర్ కింద నలిగిపోయింది!" అని లోహిత్ కథ ముగించేసరికి, కథలో లీనమై వింటున్న ఈశ్వరి, లలిత లు యింకా కథాలోకంలోనే ఉన్నారు.
లోహిత్ కొనసాగిస్తూ "ఈ కథలో గమనిస్తే, మంచిచెడులు, లాభనష్టాలు, జయాపజయాలు తేడాలేకుండా క్షణానికి ఒకలా మారుతుంది ఆనందం. నూటికి తొంభై తొమ్మిది మంది పొగిడి, ఒక్కరు తిట్టినా మన ఆనందం హూష్ కాకి! ఎగిరిపోతుంది! పొగిడితే పొంగిపోయేవాడు, తిడితే కృంగిపోతాడు! చెప్పేదేమిటంటే, ఏదైనా ఆశించినది జరిగినప్పుడు వచ్చే ఆనందం కన్నా, జరగనప్పుడు వచ్చే దుఃఖం ఎక్కువగా మనిషిని కృంగిపోయేలా చేస్తుంది. ఎంత తక్కువ ఆశిస్తే, అంత ఆనందంగా ఉండగలం! ఆశ ఉన్న దగ్గరే ఆశాభంగం ఉంటుంది. నీకు అర్ధమయిందనుకుంటాను తల్లీ!" అని అడిగాడు లోహిత్.
విషయం అర్ధం చేసుకున్న లలిత చిరునవ్వుతో లోహిత్ వైపు చూసి "మీరు సమాధానం ఆశిస్తున్నారా నాన్న!" అని నోటితో ప్రశ్నని, కళ్ళతో సమాధానాన్ని చెప్పకనే చెప్పింది. లలిత చూపుల్లో లభించిన ఊహించని సమాధానానికి, కూతురి మనసెరిగిన తండ్రిగా ఆశ్చర్యానందాలతో "లేదురా తల్లీ! నువ్వు ఏంటో, నీ మనసు ఏంటో, నాకు తెలుసురా!" అని అంటూ లలితని అప్యాయంగా హత్తుకున్నాడు లోహిత్. ఈశ్వరి మురిసిపోయి చూస్తుంది.
తండ్రికూతుర్లిద్దరూ ఈశ్వరి వైపు చూస్తూ "మనం సరేరా తల్లీ! తను చేసిన సేమ్యా పాయసం తింటావని మీ అమ్మ, టేబుల్ మీద పాయసం కప్పు మాత్రం ఆశిస్తున్నారురా తల్లీ!" అని నవ్వుతూ అన్నాడు లోహిత్.
వెంటనే ఈశ్వరి చిన్నబుచ్చుకుని "ఏం కాదు! నేను ఏం ఆశించట్లేదు!" అని లోపలికి వెళ్ళడానికి కుర్చీలో నుంచి లేచింది.
లలిత ఈశ్వరి చెయ్యిపట్టుకుని "నాన్న చెప్పింది! ఎక్కువ ఆశించొద్దని! అసలు ఆశించొద్దని కాదమ్మా!" అని నవ్వుతూ అంది.
"ఇంతవరకు నేను ఎంత గింజుకున్నా, అమ్మగారికి ఉలుకు లేదు. పలుకు లేదు. నాన్నతో ఉంటే మాత్రం చిలుకకి మాటలు వచ్చేస్తాయి!" అని అంటూ ఈశ్వరి లలితని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, "చూడండి డాడీ!" అని అంటూ నవ్వుతూ లోపలికి వెళ్తున్న లోహిత్ ని పట్టుకుంది లలిత.
లోహిత్ ఈశ్వరిని ఆపి, లలితతో "మీ అమ్మకి ముద్దు పెట్టమ్మా! కోపం తగ్గుతుంది" అని నవ్వుతూ అన్నాడు. "నాకేమీ మీ ముద్దులు అవసరం లేదు. మీ తండ్రికూతుర్లిద్దరూ ఒకటే!" అని ఏదో చెప్తున్న ఈశ్వరికి ముద్దు పెట్టింది లలిత.
ఈశ్వరి లోలోపల మురిసిపోతూ "యిలాగే, మీ కూతురు బొత్తిగా నా మాట వినదు!" అని అంది.
"తను నీ మాట బాగా వింటుంది. బాగా ఆలోచించి చూడు!!" అని లోహిత్ అంటే "ఏలా ఆలోచించాలో, అది కూడా మీరే చెప్పండి!" అని అంది ఈశ్వరి.
"తను నీ మాట వినదు అన్నావు కదా. నువ్వు చెప్పినట్టుగానే, తను నీ మాట వినట్లేదు కదా. అంటే నీ మాట వింటున్నట్లే కదా!" అని లోహిత్ చెప్తే, ఈశ్వరి 'అవును కదా' అనుకుంటూ అర్ధమయ్యి అవ్వనట్లు అన్నట్టు ముఖం పెట్టుకుని చూస్తుంటే, లలితకి లోహిత్ ఆలోచన అర్థమయ్యి, మెల్లగా నవ్వుకుంటుంది.
ఈశ్వరి చూసి "అది నవ్వుతుందంటే, మీరు ఏదో.." అని ఈశ్వరి అంటుంటే, లోహిత్ తెలివిగా టేబుల్ మీదున్న పాయసం కప్పులో నుంచి స్పూన్ తో పాయసం తీసి "మా యిద్దర్ని తిట్టే కార్యక్రమం తీరిగ్గా పెడుదువులే. మేం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోం గాని, నువ్వు చేసిన యి పాయసం తినకపోతే పాడైపోతుంది. తిందాం పదా!" అని అంటూ ఈశ్వరి నోట్లో పెట్టాడు. తర్వాత, లలిత నవ్వుతూ కబుర్లు చెబుతుంటే, ముగ్గురు కలిసి ఆనందంగా రాత్రి భోజనం చేశారు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
Comments