top of page

మొబైల్ ఆటవస్తువు గాదే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Mobile Ata Vasthuvu Gade' Written By Allu Sairam

రచన: అల్లు సాయిరాం


ఒకప్పుడు పిల్లలు తమ పనులకు అడ్డం రాకుండా టివి అలవాటు చేసేవారు. ఇప్పుడు మొబైల్ లో పాటలు చూడటం, గేమ్స్ ఆడటం అలవాటు చేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు. అది ఎంత తప్పో తెలియజేసే ఈ కథను అల్లు సాయిరాం గారు రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


నిఖిల్ ఐదో పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ తల్లిదండ్రులు శ్రావణి, సాగర్ ల ఆహ్వానం

మేరకు స్వప్న, రవి లు, నాలుగున్నరేళ్ల కూతురు అక్షరతో విశాఖపట్నం వచ్చారు.

ఇంటిముందు ఆటోదిగి వస్తున్న వారిని చూసి

"శ్రావణి! మీ అన్నయ్య, వదిన వస్తున్నారు!" అంటూ వారికి ఎదురుగావస్తూ

"ఏంటి బావ! స్టేషన్ కి వచ్చాక ఫోన్ చేస్తే, స్టేషన్ కి కారులో వచ్చేవాడ్ని కదా!"

అని అన్నాడు సాగర్.

"పర్వాలేదులే బావ! మీరు బిజీగా ఉంటారు కదా!" అని అన్నాడు రవి.

"మీ బావకి యిరవైనాలుగు గంటలూ ఫోన్ పట్టుకుని చూడడమే పెద్దపని అన్నయ్య!" అని

యింట్లో నుంచి వస్తూ నవ్వుతూ అంది శ్రావణి.

"ఊరుకోమ్మా! అంతగా మొబైల్లో చూడడానికి ఏముంటుంది?" అని రవి అడిగితే "అలా

అడుగు బావ! నా పేరు చెప్పి, మీ చెల్లెమ్మ నాకన్నా ఎక్కువ మొబైల్ చూసేస్తుంది!" అని

సాగర్ చెప్తుంటే "ఏముండడమేంటి అన్నయ్య! రోజులు ఎలా గడపాలా అని, మొబైల్లో


చూస్తూ రోజులు గడిపేస్తుంటారు మీ బావ! లాక్ డౌన్ అంతా అలానే గడిచిపోయింది" అని

నవ్వుతూ అంది శ్రావణి.

"ఇద్దరికిద్దరూ సరిపోయారు!" అని నవ్వుతూ అంది స్వప్న.

"బాగున్నావా వదినా! అక్షర! బాగున్నావా బుజ్జి!" అంటూ అక్షరని దగ్గరికి తీసుకుని

ఎత్తుకుని ముద్దాడింది శ్రావణి. "బాగున్నా అత్త!" అంటూ ముద్దుగాచెప్పింది అక్షర.

"అబ్బా! అక్షర గుర్తుపెట్టుకుని మనుషుల్ని పలకరించేస్తుంది వదినా!" అని ఆశ్చర్యంగా

చూస్తోంది శ్రావణి.

"ఆఁ వదినా! చిన్నచిన్న కథలు కూడా చెప్తుంది!"అని అంది స్వప్న.


"అవునా! అక్షర తల్లీ! నాకొక కథ చెప్పమ్మా!" అని తను ఎత్తుకున్న అక్షరని ముద్దాడుతూ


అడిగింది.


"ఓఁ చెప్తా అత్తా!" అని చెప్పింది అక్షర.


"మరి నీకు కథలు ఎవరు చెప్తున్నారమ్మా?" అని శ్రావణి అడిగితే "ఇంటి దగ్గర వాళ్ల


తాతయ్య, నాన్నమ్మ ల ఒడిలో ఉంటుంది. మీ అన్నయ్య గురించి నీకు తెలిసిందే.

నిద్రపుచ్చడానికి ఏదోక కథ చెప్తుంటారు. ఈ లాక్డౌన్ సమయంలో అయితే ఇంకా


చెప్పక్కర్లేదు. కథలే కథలు!" అని నవ్వుతూ చెప్పింది స్వప్న.


"శ్రావణి! మనం రెండంతస్తుల యిల్లు కట్టి, రెండునెలల ముందే గృహప్రవేశం చేశాం!


గుర్తుందా?" అని సాగర్ అడిగితే

"అవును! ఏదో మీరొక్కరే యిల్లు కట్టేసినట్టు, ఆ విషయం నాకెందుకు

చెప్తున్నారు! లాక్డౌన్ వలన అన్నయ్యవాళ్ళు గృహప్రవేశం సమయంలో

రాలేకపోయారు. వాళ్ళకి యిల్లు చూపించండి!" అని అంది శ్రావణి. "మరి ఆ

విషయం గుర్తుంటే, వచ్చినవాళ్ళని యింట్లోకి తీసుకెళ్లకుండా, బయటే

నిలబెట్టి మాట్లాడించేస్తున్నావేమీ! అసలే లాక్డౌన్ తరువాత యిదే కలవడం.

మీ వదినామరదళ్లు యిప్పుడు కబుర్లు చెప్పడం మొదలుపెడితే, మళ్లీ లాక్డౌన్

వచ్చేవరకు సరిపడా మాట్లాడతారు" అని నవ్వుతూ అన్నాడు సాగర్.

"ఎప్పుడు చాన్స్ దొరుకుద్దా అని చూస్తారేఁ!" అని శ్రావణి మూతితిప్పుతూ,

మీకుందిలే అని మనసులో అనుకుంటూ "మీరు రండి అన్నయ్య! రా వదినా!"

అని అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళిద్దర్ని చూసి నవ్వుతూ రవి,

స్వప్న లు లోపలికి నడిచారు.

ఇంట్లో హల్ గదిలో థర్మోకోల్ షీట్లు, కలర్ పేపర్లతో ఐదు అంకె డిజైన్లు,

రంగురంగుల బెలూన్లు నిండిఉన్నాయి "వదినా! ఏర్పాట్లు యింకా మధ్యలో

ఉన్నట్లున్నాయి!" అని అడిగింది స్వప్న. "అవును వదినా!

తండ్రికొడుకులిద్దరూ థర్మోకోల్ షీట్లతో డిజైన్ల మీద డిజైన్లు చెక్కుతునే

ఉన్నారు!" అని సాగర్ వైపు చూస్తూ అంది శ్రావణి. "అవును! మేనల్లుడు

ఎక్కడమ్మా?" అని రవి చూడడానికి ఆత్రంగా అడిగాడు మేనమామ హోదాలో.

"చెప్పాను కదా అన్నయ్య! పనిచెయ్యడం వలన మీ మేనల్లుడు సార్

పడుకున్నారు!" అంటూ సెపరేటు బెడ్ రూం లో పడుకున్న నిఖిల్ ని

చూపించింది. "మేనల్లుడికి సెపరేటు బెడ్ రూమా!" అని ఆశ్చర్యంగా రూం

అంతా చూస్తూ అడిగింది స్వప్న. "అంతా మీఅన్నయ్యగారి ఆలోచనే! ఎక్కడో

చూశారంట! పిల్లలకి ప్రైవసీ ఉండాలంట!" అని అంటూ నిఖిల్ ని

నిద్రలేపడానికి బెడ్ దగ్గరికి వచ్చింది శ్రావణి.

" నాన్నా! నిఖిల్! నిన్ను చూడడానికి మీ మావయ్య, అత్తమ్మ వచ్చారు.

నిద్రలేచి చూడు నాన్నా! అక్షర కుడా వచ్చింది!" అని శ్రావణి ఒకవైపు, సాగర్

ఒకవైపు అంటుంటే నిఖిల్ నిద్రలేవకుండా, అటుయిటు తిరుగుతున్నాడు.

"నిన్ను ఏలా నిద్రలేపాలో నాకు తెలుసురా!" అని అంటూ మొబైల్ తీసి,

నిఖిల్ కి యిష్టమైన పాటలువేసి, నిఖిల్ చెవి దగ్గరపెట్టింది శ్రావణి. పాము

కప్పని పట్టుకున్నట్లు, టక్కున దుప్పట్లో నుంచి నిఖిల్ చెయ్యివచ్చి శ్రావణి

చేతిలో ఫోన్ పట్టుకుంది. నిద్రలేచి మొబైల్ చూసుకుంటున్న నిఖిల్ ని

చూస్తూ, శ్రావణి, సాగర్ నవ్వుతుంటే, రవి, స్వప్న, అక్షర లు ఆశ్చర్యంగా

చూస్తున్నారు. రవికి యిటువంటి గారాబాలు అంతగా రుచించక

హాల్లోకివచ్చాడు. అందరికి రవి భావాల గురించి తెలుసు. "చాల్లే! బాబుని నేను

చూసుకుంటాను. టైం ఐదున్నర అవుతుంది. నువ్వు వెళ్ళి టీ, టిఫిన్ల సంగతి

చూడు!" అని శ్రావణికి సైగచేస్తూ చెప్పాడు సాగర్. "సరే ! రా వదినా!" అంటూ

స్వప్న, అక్షర లని వంటింట్లోకి తీసుకెళ్లింది శ్రావణి.

రవి హాల్లో గోడకి పెట్టిన ఫోటోలని తదేకంగా చూస్తున్నాడు. సాగర్ హాల్లోకి

వస్తూ "గృహప్రవేశం ఫోటోలు బావ! ఫోటో ఆల్బమ్ యిదిగో! మీకు వాట్సాప్

లో పంపించిన ఫోటోలు చూసుంటారు!" అని అన్నాడు. "ఆఁ చూశాం. మీ

చెల్లెమ్మ మీరు పంపించిన ఫోటోలు చూపించింది" అని అన్నాడు రవి సాగర్

చేతిలో ఫోటో ఆల్బమ్ అందుకుంటూ. సాగర్ కిచెన్ లోకి ఏదో

వెతుకుతున్నట్టుగా వచ్చి "టీ ప్లాస్క్ ఎక్కడుంది?" అని అడిగాడు. శ్రావణి

తుళ్లిపడి "టీ ప్లాస్క్ మీకు ఎందుకు?"అని అడిగింది. "నేను బాబుని రెడీ చేసి

వచ్చి చాలాసేపయ్యింది. యింకా, మీ వదినామరదళ్ల కబుర్లు అయ్యేటట్లు

కనపడట్లేదు. ఇంకెందుకు, బయటకెళ్లి టీ తీసుకొద్దామని! మీరు

మాట్లాడుకోండి" అని అన్నాడు. శ్రావణి పెద్దకళ్ళతో సాగర్ వైపు మింగేసేలా

చూస్తుంటే "ఏంటి చూస్తున్నావు? స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి. అక్కడ

చూడు!" అని సరదాగా అన్నాడు సాగర్. స్వప్న నవ్వుతూ "నువ్వు వెళ్ళు

అన్నయ్య! టీ తీసుకొస్తాం!" అని అంది. శ్రావణి క్షణాల్లో కమ్మగా టీ చేసి

తీసుకొచ్చింది. బావమరుదులు ఒకవైపు, వదినామరదళ్లు ఒకవైపు కూర్చుని టీ

తాగుతున్నారు.

"అక్షర! మీ అత్తమ్మ కథ చెప్పమని అడిగింది కదా. యిప్పుడు కథ

చెప్పమ్మా!" అని నవ్వుతూ అంది స్వప్న. అక్షర "అనగనగా ఒక చిన్నపాప

ఉందంట. ఆ పాపకి చాలా ఆకలేసిందంట!" అని కథ చెప్పడం

మొదలుపెట్టింది. "అక్షర! ఆ పాప నువ్వేనా? ఆకలేస్తుందా నీకు?" అని

నవ్వుతూ అన్నాడు సాగర్. "కాదు మామయ్య! ఆఁ మీరందరూ

నవ్వుతున్నారు. నేను కథ చెప్పను" అని అలిగినట్లు ముఖం పెట్టింది అక్షర.

"అయ్యో అక్షర! నిన్ను కథ అడిగింది నేను కదా! నేను వింటాను. నువ్వు

చెప్పమ్మా! మనమిద్దరం ఒక జట్టు. మీ మామయ్య జట్టు కట్" అని అంటూ

అక్షరని తన ఒడిలో కూర్చొబెట్టుకుంది శ్రావణి. అక్షర నవ్వుతూ మళ్లీ కథ

చెప్పడం మొదలుపెట్టింది. అక్షర సరిగ్గా నాలుక తిరగక ముద్దు ముద్దు

మాటలతో కథ చెప్తుంటే, నలుగురు కన్నార్పకుండా చూస్తున్నారు. అక్షర

మాటలకి శ్రావణి మురిసిపోతూ "అక్షర తల్లీ! ఎంత చక్కగా

మాట్లాడుతున్నావురా!" అంటూ ముద్దాడింది. "అక్షర కంటే నిఖిల్ ఆరునెలలు

ముందు పుట్టాడు. సరిగ్గా మాట్లాడడు. చదువు సరేసరి! ఆడుకోవడానికి చేతిలో

మొబైల్ ఉంటే చాలు! అమ్మ అక్కర్లేదు. అన్నం అక్కర్లేదు!" అని శ్రావణి

పుత్రవాత్సల్యంతో అనేసరికి, మిగతా ముగ్గురికి బాధగా అనిపించింది.

"అదేంటి వదినా! అలా అంటావు! చిన్నప్పుడు అందరూ అలాగే ఉంటారు.

పెరుగుతున్న కొద్దీ వాళ్ళు అన్ని తెలుసుకుంటారు. అంత మాత్రానికే,

బాధపడడమెందుకు? పైగా, యిరోజు మేనల్లుడి పుట్టినరోజు!" అని శ్రావణికి

సర్దిచెప్పింది స్వప్న. సాగర్ శ్రావణి వైపు చూసి "ఇప్పుడేమైందని?" అని

అడిగాడు. "ఏమైంది అత్త?" అని ముద్దుగా అడిగింది అక్షర. "ఏంలేదురా

తల్లీ!" అని అక్షరని ముద్దాడి "అక్కడ నిఖిల్ బావ, నువ్వు కలిసి ఆడుకోండి!"

అంటూ తన ఒడిలోనుంచి కిందికి దించుతూ చెప్పింది శ్రావణి. "వద్దు అత్త!

బావ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. నాతో ఆడుకోడు. మాట్లాడడు కుడా.

యింతకుముందు యిక్కడకి వచ్చినప్పుడు చేతిలోనుంచి ఫోన్ పక్కన పెట్టి,

ఆడుకుందామని పిలిస్తే, గట్టిగా అరుస్తూ నన్ను కొట్టేశాడు. నేను మీదగ్గరే

ఉంటాను!" అని అంటూ గబగబా ఎదురుగా సోఫాలో కూర్చున్న రవి

ఒడిలోకివచ్చి కూర్చుంది అక్షర. ముక్కుపచ్చలారని పసిపిల్ల అలా

చెప్పేసరికి, సరదాగా వింటున్న నలుగురికి చివుక్కుమంది. అక్షర

ముద్దుమాటలు సాగర్, శ్రావణి మనసుకి బాణాల్లా బలంగా గుచ్చుకుని,

కళ్ళుచెమ్మగిల్లాయి. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.

"నాన్న! నీకో కథ చెప్పనా?" అని అంటూ రవి ఒడిలో కూర్చొని ముద్దుగా

అడిగింది అక్షర. "ఈ కథ నీకు ఎవరు చెప్పార్రా తల్లీ?" అని రవి అడిగితే

"నాన్నమ్మ చెప్పింది!" అని అంది అక్షర. "మనం ట్రైన్ లో యింటికి వెళ్తాం

కదా! అప్పుడు చెప్పుదువు గాని! సరేనా తల్లీ!" అని రవి అడిగితే "అలాగే

నాన్న!" అని అంది అక్షర. మిగతా ముగ్గురు మురిసిపోయి చూస్తున్నారు.

"అక్షరకి ఉన్న బుద్దిలో సగం కుడా నిఖిల్ కి రాలేదన్నయ్య! నాకు భయంగా

ఉంది!" అని మనసులోఉన్న భయాన్ని బయటపెట్టింది శ్రావణి. రవికి బదులు

చెప్పాలని ఉన్నా, ఏలాచెప్పాలా అని మధనపడుతున్నాడు. నిఖిల్ గురించి

అక్షర చెప్పిన మాటలువిన్న తర్వాత, సాగర్ వాస్తవాన్ని గ్రహించి "చాలాసేపు

నుంచి చూస్తున్నా బావ! మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా! చెప్పు

బావ! " అని అడిగాడు. "ఏంలేదు బావ! మీరు ఆలోచిస్తున్నారు కదా! మీకు

నేను చెప్పడమెందుకు అని ఆలోచిస్తున్నాను!" అని మనసులో

కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని చెప్పాడు. "అదేంలేదు! చెప్పడానికి నువ్వు

అంతగా ఆలోచిస్తున్నావంటేనే, అదెంత ముఖ్యమైన విషయమో

అర్ధమవుతుంది. చెప్పు బావ!" అని రవి మనసెరిగి అన్నాడు సాగర్. "సరే

బావ!" అని శ్రావణి వైపుచూస్తూ "ఏంటమ్మా! మేనల్లుడికి సగం బుద్ధి కుడా

రాలేదా! ఎక్కడినుంచి వస్తుందమ్మా? వేరేలోకం నుంచి వస్తుందా? లేకపోతే,

పుట్టేటప్పుడు తెచ్చుకోవాలా? మనమంతా బుద్ధిని తెచ్చుకున్నామా? బుద్ధి,

మాటలు అనేవి, మనుషులతో ఉండి, ప్రేమానురాగాల మధ్య పెరిగితే,

వాటంతట అవే వచ్చేస్తాయి. నేర్చుకోవడానికి పిల్లలు పరితపించక్కర్లేదు!

నేర్పడానికి పెద్దలు ప్రత్యేకమైన కోర్సులు చెయ్యక్కర్లేదు‌! అమ్మమ్మ,

నాన్నమ్మ, తాతయ్యల జీవితానుభవాలు, తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లలకి

ఆచరణమార్గం అవుతుంది! అక్కడ మనవూరిలో, అక్షర అయినవాళ్ళందరి

మధ్యన పెరుగుతుంటే, యిక్కడ నిఖిల్ కి తనవయసు పిల్లలతో పెరగడానికి,

కనీసం ఆడుకోవడానికి కుడా అవకాశం లేకుండాపోయింది. తను

ఆడుకోవాలన్నా, అల్లరిచెయ్యలన్నా, అన్నీ మీ యిద్దరితోనే‌! పైగా, మొబైల్

వాడకం బాగా అలవాటు చేసినట్లున్నారు‌. మనుషులతో కాకుండా మొబైల్

లాంటి వస్తువులతో నేర్చుకున్న బుద్ధి యిలాగే ఉంటుందమ్మా!" అని

అన్నాడు రవి. "ఫోన్ లేకపోతే ఒకనిమిషం కూడా ఉండడు అన్నయ్య!" అని

సమర్దింపుగా చెప్పింది శ్రావణి. "నిజానికి, పిల్లలకి తమచేతిలో ఉన్నది

ఏదోవస్తువని, దాన్ని మొబైల్ అంటారని కూడా తెలియదు. ఆడుకోవడానికి,

ఆడించడానికి మొబైల్ ఆటవస్తువు గాదే! మనమే వాళ్ళకి అనవసరమైన

అలవాట్లు చేసేసి, వాళ్ళు వదలట్లేదని చేతులు దులిపేసుకోవడానికి

చూస్తుంటాం!" అని యదార్థాన్ని చెప్పాడు రవి.

శ్రావణి చిన్నబోయి "ఏం చేయమంటావన్నయ్య! చేతిలో నుంచి ఫోన్

తీసుకుంటే గట్టిగా ఏడుస్తాడు! వాడికి బాగా అలవాటయిపోయింది!" అని

అంది. రవి చిన్నగా నవ్వుతూ "ముందు, పిల్లల చేతిలో మొబైల్

పెట్టిందెవరమ్మ? మనమే కదా! బావ ఆఫీసులో డ్యూటీకి వెళ్లిపోతే, నువ్వు

యింటిపనుల్లో బిజీగాఉన్నప్పుడు, మేనల్లుడు నీ దగ్గర చుట్టూతిరుగుతూ

అల్లరిచేస్తుంటే, తనని ఆడిస్తూ ఉండిపోతే, యింటి పనులు అవ్వవని,

అలాగని చిరాకుతో తనపై చెయ్యిచేసుకుంటే ఏడుస్తాడని, ప్రత్యామ్నాయంగా,

చక్కగా మొబైల్ తీసి యూట్యూబ్లో చిట్టిచిలకమ్మా! అమ్మ కొట్టిందా! అని

పాటలు వేసేసి, తన చేతుల్లో పెట్టేసి, చక్కగా మన పనిచేసుకోవచ్చు.

కదామ్మా!" అని ఏదో జరిగినది పక్కనుంచి చూసినట్లు రవి చెప్తుంటే, ముగ్గురు

ఆశ్చర్యంగా చూస్తున్నారు. "ఏంటి అలా చూస్తున్నారు. నువ్వే కాదు. ఈతరం

తల్లిదండ్రులు చేసేపని యిదే! ఏడుపు ఆపడానికి చేతిలో పెట్టిన మొబైల్ ని

తిరిగి తీసుకుంటే పిల్లలు ఏడుస్తారమ్మా! అదేం తప్పు కాదు! అలాగని

అలవాటు కాదు! కొన్నిరోజులు కంటికి కనిపించకపోతే, పిల్లలకి మనుషులే

గుర్తుండరు! మనం ముందు మానేస్తే, పిల్లలు మానేస్తారు. పిల్లలు మనం

చెప్పింది విని చెయ్యరు! మనం చేసినట్లు చూసి చేస్తారు! కరెక్టా బావ?" అని

సాగర్ వైపు చూస్తూ అడిగాడు. "కరెక్టే బావ!" అని అన్నాడు సాగర్ ఆలోచనల్లో

నుంచి బయటకు వచ్చి.

రవి కొనసాగిస్తూ "అసలు మొబైల్ అవసరమేంటి? దాన్ని మనం ఎందుకు

వాడుతున్నాం? ఒకప్పుడు, ఎక్కడోదూరాన ఉండే వ్యక్తులకి ఫోన్ చేసి క్షేమ

సమాచారాలు మాట్లాడడానికి అవసరమయ్యేది. ఈరోజున ప్రతిదానికి

మొబైలే! మెడకు కట్టుకుని తిరగాల్సివస్తుంది! పిల్లల్ని నిద్రపుచ్చడానికో,

ఏడుపు ఆపడానికో, మనం యూట్యూబ్లో మంచిపాటలే సెలెక్ట్ చేసి వేస్తాం.

కానీ, ఒకటి తర్వాత ఒకటి రకరకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ

వరుసలో వచ్చేవి, పిల్లలు చూడకూడనివి కుడా కావొచ్చు! దానికి తోడు, పిల్లల

బుద్ధిని ఎదగనివ్వకుండా బానిసల్లా మార్చడానికి, ఏవో చిత్ర విచిత్రమైన

పేర్లుతో, హంగులతో మొబైల్ ఆన్లైన్ గేమ్స్ పిల్లల బుర్రలతో కుస్తీలు

చేస్తున్నాయి. పిల్లలు వరకు ఎందుకు, మనమైనా, తెల్లవారి లేవగానే చేసే పని

ఏంటంటే, వాట్సాప్ లో మేసేజ్లు పెట్టడమో, యిదివరకు పెట్టినవారికి రిప్లై

యివ్వడమో, తర్వాత పేస్-బుక్, అది అయిపోతే ట్విట్టర్, ఇన్-స్టాగ్రాం, మళ్లీ

వాట్సాప్! సొంతింటి నుంచి అత్తారింటికి, అక్కడ్నుంచి తాతగారింటికి, మళ్లీ

అక్కడ్నుంచి సొంతింటికి తిరిగినట్లు, మొబైల్ స్క్రీన్ మీద చేతివేళ్లు నాట్యం

చేస్తూనే ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్ అయిపోతున్నా, ఏదో కొంపలు

మునిగిపోతున్నట్లు, చార్జింగ్ పెడుతూనే వాడేస్తుంటాం. యిలా ఒకదశలో

మనకి విరక్తి కలిగినా, రీచార్జ్ చేసుకున్న మొబైల్ డేటాకి న్యాయం

చెయ్యడానికి మొబైల్లో ఏదోకటి చూస్తునే ఉంటాం! మొబైల్ అనే ఒక్క వస్తువు

వచ్చాక, పిల్లల్ని ఆడించడానికి తల్లులకి ఆయాల అవసరంలేదు. తినడానికి

ఆన్లైన్ ఆర్డర్లు, షాపింగ్లు చెయ్యడానికి, బ్యాంక్ పనులకి, లెక్కలేయడానికి

కాలిక్యులేటర్లు, ఫోటోలు తీయడానికి కెమెరాలు, యిలా ఒక్కటేమిటి!

అందులో లేనిదేమిటి! యిలా చాలా వస్తువుల అవసరాన్ని తగ్గించి, తన

అవసరాన్ని పెంచుకుంది. అదే కోవలో, మనుషుల్లో ఒకరితో ఒకరికి

అవసరాన్ని తగ్గించడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఆధార్ నెంబర్ నుంచి

ఫోన్ నెంబర్ వరకు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, అసలు

ఆ ఆలోచనే రానివ్వకుండా, మన బుర్రని వాడడానికి కనీసం అవకాశం

లేకుండా, సర్వం తానై, తన మోమొరీని, సైజుని పెంచుకుంటుంది.

గానుగమిల్లులో ఎద్దుని కళ్ళుకట్టేసి తిప్పినట్టుగా, యి మొబైల్ వాడకం మన

మెడలు వంచేసి ఆడించేస్తుంది! అసలు యింత అవసరమా అనిపించి, పెద్ద

మొబైల్ పక్కనపెట్టి, ఏదో అవసరానికి ఫోన్లు చెయ్యడానికి, చిన్న మొబైల్

యిప్పుడు వాడుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. టైం ఒకటే కాదు,

ఆరోగ్యం కూడా బాగుపడింది! ఆ టైం అంతా మనం పిల్లలతో గడిపితే మన

భావాలు వాళ్లు అర్థం చేసుకుని బుధ్ధిగా ఆలోచిస్తారు" అని కూలంకుషంగా

వివరించాడు. సాగర్, శ్రావణి లు ఆలోచనలో పడ్డారు. స్వప్న గడియారం

చూస్తూ "టైం అంటే గుర్తొచ్చింది. మనం మాట్లాడుకుంటుంటే,

తెలియకుండానే చీకటి పడిపోయింది. తర్వాత మీరు తీరిగ్గా

ఆలోచించుకుందురు గాని, యిప్పుడు పదండి! మేనల్లుడితో కేక్ కట్

చెయ్యించాలి కదా! రా వదినా!" అని అంది.

క్షణాల్లో అంతా సిద్ధం చేశారు. నిఖిల్ తో కేక్ కట్ చేయించారు.

"అన్నయ్య! నిఖిల్ కి ఐదో పుట్టినరోజుకి గిఫ్ట్ ఏమిస్తున్నారు?" అని అడిగింది

స్వప్న. "నిఖిల్ చేతిలో మొబైల్ తీసుకోవాలనుందమ్మా!" అని అన్నాడు

సాగర్. "అయ్యో! పుట్టినరోజుతో ఏడుస్తాడు కదా అన్నయ్య!" అని జాలిగా

అడిగింది స్వప్న. "ఏడవనీ! పుట్టినప్పుడు ఏడ్చాడు కదా! అయినా

చూసుకోవడానికి, మనమున్నాం కదా! యి గిఫ్ట్ వాడి భవిష్యత్తుని మార్చి,

జీవితంలో గుర్తుండిపోతుంది!" అని నమ్మకంగా చెప్పాడు సాగర్. రవి, స్వప్న

లు ఆనందంగా చూస్తున్నారు. సాగర్ మాటల్లో నమ్మకాన్ని అర్ధంచేసుకుంటూ

సాగర్ ని చూస్తున్న శ్రావణి భుజం తట్టి "ఏంటి నన్ను చూస్తున్నావు?

యిప్పుడు నిఖిల్ చేతిలో మొబైల్ తీసుకోబోయేది నువ్వే! తీసుకో!" అని

చెప్పాడు సాగర్. శ్రావణి పళ్ళుకొరుకుతూ "ఇటువంటి దగ్గర నన్ను

యిరికించడానికి ముందుంటారేం! మొబైల్ తీసుకుంటామని చెప్తేనే, వాడు

ఏలా చూస్తున్నాడో చూడండి. తీసుకుంటే, యింకెంత గోలచేస్తాడో! బాబోయ్!

నేను తీసుకోను! ఏదో వాడి భవిష్యత్తుని మార్చేసి, జీవితంలో గుర్తుండిపోయే

గిఫ్ట్ అన్నారు కదా! ఆ గిఫ్ట్ ఏదో మీ సుపుత్రుడికి మీరే యివ్వండి బాబు!" అని

అంది. "అలా అంటే ఏలా! మనిద్దరికీ సమాన బాధ్యత ఉంది కదా! యిటు రా!"

అని అంటూ సాగర్ శ్రావణి చెవిలో ఏదో చెప్పాడు. తర్వాత "ఒక మంచి ఫోటో

తీయ్యండి బావ! గుర్తుండిపోవాలి!" అని రవికి తన మొబైల్ కెమెరా ఆన్ చేసి

యిస్తూ చెప్పాడు సాగర్. రవి ఫోటో తీస్తున్నాడు. సాగర్, శ్రావణి లు వచ్చి,

నిఖిల్ ని చెరోవైపు ఎత్తుకున్నారు. యిద్దరూ ఒకేసారి నిఖిల్ కి కేకు

తినిపించారు. ఒకేసారి ముద్దాడారు. ఒకేసారి నిఖిల్ చేతిలో మొబైల్

తీసుకున్నారు. యింక, అంతే! నిఖిల్ నోట్లో కేకు ఉండడంవల్ల ఏడ్చిన శబ్దం

బయటికి వినిపించకపోయినా, కళ్ళంటా నీళ్ళుదిగిపోయాయి. నిఖిల్ ఏడ్పు

ఆపడానికి, సాగర్, శ్రావణి లు పోటాపోటీగా ముద్దాడుతున్నారు. రవి, స్వప్న,

అక్షర లు అవధుల్లేని ఆనందంతో నవ్వుతూనే చూస్తున్నారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


184 views4 comments
bottom of page