గాజుబొమ్మ - మట్టిబొమ్మ
- Munipalle Vasundhara Rani

- 2 hours ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #గాజుబొమ్మమట్టిబొమ్మ, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 32
Gajubomma - Mattibomma - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 25/02/2026
గాజుబొమ్మ - మట్టిబొమ్మ - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
నీలిమకి కొత్త వస్తువులన్నా, ఖరీదైన బొమ్మలన్నా చాలా ఇష్టం. తన పుట్టినరోజున వాళ్ళ నాన్న ఒక అరుదైన, మెరిసిపోయే గాజు సైనికుడి బొమ్మను కానుకగా ఇచ్చారు. అది విదేశాల నుండి తెప్పించినది కావడంతో నీలిమకి ఆ బొమ్మ అంటే ఎంతో గర్వం. దాన్ని తన గదిలోని షెల్ఫ్ పైన అందరికంటే ఎత్తులో పెట్టి, రోజూ గర్వంగా చూసుకునేది.
ఒకరోజు సాయంత్రం ఇంటి ముందు కొంతమంది పేద పిల్లలు వర్షానికి తడిసిన మట్టితో చిన్న చిన్న ఇళ్లు, బొమ్మలు చేసుకుని ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు.
నీలిమ తన గాజు బొమ్మను పట్టుకుని వాళ్ల దగ్గరికి వెళ్లి, "చూడండి, నా బొమ్మ ఎంత అందంగా మెరుస్తోందో! మీ మట్టి బొమ్మలు చూడండి ఎంత అసహ్యంగా, మురికిగా ఉన్నాయో. ఇలాంటి వస్తువులతో మీరెలా ఆడుకుంటారో ఏంటో! అసలు మీకు తెలివి ఉంటే ఇలాంటి మురికి బొమ్మలు చేసుకుంటారా?" అని ఎగతాళిగా నవ్వింది. ఇది బామ్మ గమనించింది. ఆ పిల్లలు నీలిమ మాటలకు బాధపడినా, ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు.
నీలిమ విర్రవీగుతూ తన గదిలోకి వెళ్లి, ఆ గాజు బొమ్మను అద్దం ముందు పెట్టి మురిసిపోసాగింది.
అయితే, ఒక చిన్న పొరపాటు జరిగింది. నీలిమ కిటికీని సర్దుతుండగా, ఆమె చేయి తగిలి ఆ గాజు బొమ్మ టేబుల్ మీద నుండి కింద పడిపోయింది. ఒక్క క్షణంలో అది వంద ముక్కలైపోయింది. నీలిమ అది చూసి తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. "నా ప్రియమైన వస్తువు విరిగిపోయింది! ఇది మళ్ళీ రాదు!" అని బావురుమంది.
ఇదే సరైన సమయం నీలిమకి గుణపాఠం నేర్పడానికి అనుకుని బామ్మ అక్కడికి వచ్చి, కింద పడి ఉన్న గాజు ముక్కలను, బయట పిల్లలు ఆడుకుంటున్న మట్టి బొమ్మలను చూసి నీలిమను దగ్గరకు తీసుకుని ఇలా అంది, "నీలిమ, గాజు బొమ్మ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దానికి గర్వం ఎక్కువ. ఒక్క దెబ్బ తగిలినా అది ముక్కలైపోతుంది, ఆ ముక్కలను మనం మళ్ళీ అతికించలేము. కానీ ఆ బయట పిల్లలు ఆడుకునే మట్టి బొమ్మలను చూడు.. అవి కింద పడ్డా విరగవు, ఒకవేళ విరిగినా ఆ మట్టిని మళ్ళీ నీళ్లతో కలిపి అంతకంటే అందమైన బొమ్మను తయారు చేసుకోవచ్చు.
మనిషి స్వభావం కూడా ఇలాగే ఉండాలి. మన దగ్గర ఉన్న తెలివితేటలను కానీ, ఖరీదైన వస్తువులను కానీ చూసుకుని గాజు బొమ్మలా గర్వపడితే, రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం తట్టుకోలేక కుంగిపోతాం. మన తెలివి మనల్ని ఇతరుల కంటే గొప్పగా చూపించుకోవడానికి కాదు, అందరితో కలిసి ఉండటానికి ఉపయోగపడాలి. ఎదుటివారిని తక్కువ చూసే గర్వం ఎప్పుడూ గాజులాంటిదే, అది ఎప్పుడో ఒకప్పుడు పగులుతుంది. కానీ అందరితో కలిసిపోయే వినయం మట్టిలాంటిది, అది ఎప్పటికీ విలువను కోల్పోదు."
బామ్మ మాటలు విన్నాక నీలిమకు తన తప్పు స్పష్టంగా తెలిసొచ్చింది.
తాను తన వస్తువులను చూసి అహంకరించినందుకు సిగ్గుపడింది. తెలివి అంటే ఇతరులను తక్కువ చేయడం కాదు, అందరితో కలిసి ఉండటం అని గ్రహించింది. వెంటనే బయటికి వెళ్లి, తనను క్షమించమని ఆ పిల్లలను అడిగి, వాళ్లతో కలిసి మట్టి బొమ్మలు చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు ఆ మట్టిలో ఉన్న సహజమైన సంతోషం తన ఖరీదైన గాజు బొమ్మలో లేదని నీలిమ మనస్ఫూర్తిగా తెలుసుకుంది.
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments