top of page
Original.png

మార్పు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #Marpu, #మార్పు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Marpu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle

Published In manatelugukathalu.com On 02/12/2025

మార్పు - తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


రంగా రావు గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో, వారి తల్లి ఎంతో కష్టపడి ఆయన్ని, ఆయన తోబుట్టువులను పెంచి ప్రయోజకులను చేసింది. ఆయన చక్కటి శరీరఛాయతో, ఒడ్డు పొడుగుతో ఆకర్షణీయంగా ఉండేవారు, ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించారు. ఈయనకు పెళ్లి ప్రయత్నాలు మొదలైనప్పుడు, తహశీల్దార్ గారి కూతురు సూర్యకాంతం గారి సంబంధం వచ్చింది. ఆమె నల్లగా, మాట తీరులో 'లేడీ విలన్' ఛాయలు కనిపించినా, అత్తగారి వైపు అండ దండ ఉంటాయనే ఉద్దేశంతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. 


ఆమె, 'మంచి కోడలు' అనిపించుకోవడానికి నానా నాటకాలు ఆడేవారు. ముఖ్యంగా, రంగా రావు గారు ఆఫీసు నుంచి రాగానే, అత్తగారు, ఆడపడుచుల మీద పితూరీలు చెప్పేవారు. రంగా రావు గారు ఏమైనా అంటే, వెంటనే ఇంటి వెనుక ఉన్న బావి వైపు పరుగు తీసి, "నేను బావిలో దూకేస్తా!" అని బెదిరించేవారు. రంగా రావు గారు ఆ బావి డ్రామాకు భయపడి, ఆమె మాటే శిరసావహించేవారు. వారికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు పుట్టారు. పిల్లల చదువులు పూర్తి అవగానే, ఇద్దరు కూతుళ్లకు ఘనంగా పెళ్లిళ్లు జరిపించారు. 


కొడుకు రాజీవ్‌కు హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం రావడమే కాకుండా సుధతో సంబంధం కుదిరింది. సుధ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా అందరితోనూ చక్కగా కలిసిపోయింది. కోడలు సుధ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత, తన అత్తగారింట్లో తాను పడిన కష్టం, అనుభవించిన వేధింపులు (అది ఆవిడ భావన) పదే పదే గుర్తు రావడం మొదలైంది. తాను అనుభవించిన కష్టం, బాధ అంతా ఈ కోడలు సుధకు తెలియకుండా, ఆమె హాయిగా, సంతోషంగా ఉండడం సూర్యకాంతం గారికి ఏమాత్రం నచ్చలేదు. 


'నేను ఎంతో కష్టపడ్డాను, కానీ ఈ సుధ మాత్రం అస్సలు కష్టం లేకుండా, నా కొడుకు రాజీవ్ని చెప్పు చేతలలో ఉంచుకుని ఆడిస్తోంది,' అన్న అసూయ ఆమెలో పెరిగిపోయింది. ఒకరోజు, వీళ్ల ఊరిలో చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ రామా రావు గారు, హైదరాబాద్‌లో ఏదో పని మీద వచ్చి, వీళ్లను ఒకసారి కలిసి వెళ్దామని ఇంటికి వచ్చారు. 


ఊరి విషయాలన్నీ మాట్లాడుకున్నాక, సూర్యకాంతం గారితో, "రంగా రావు గారికి, మీకు ఏమైనా బంధుత్వం ఉందా పెళ్లికి ముందు?" అని అడిగారు. 


దానికి సూర్యకాంతం గారు దర్పంగా, "అబ్బే, అలాంటిదేమీ లేదె" అన్నారు. 


దానికి ఆయన, "అదేంటి.. మరి మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకున్నారండీ?" అని అనేశారు. 


అది విన్న సుధ పుసుక్కున నవ్వేసింది. అంతే! ఇంకా సూర్యకాంతం గారికి కోపం నసాళానికి అంటింది. రంగా రావు గారు ఆ మాటలకు బోసి నోటితో ముసి ముసి నవ్వులు నవ్వారు. రాజీవ్, సుధ ఆఫీసులకు వెళ్లగానే, సూర్యకాంతం గారు తన పిన్నికి, బాబాయికి ఫోన్ చేసి, తన అంతరంగ ఆవేదన పేరుతో, సుధ మీద చాడీలు చెప్పేవారు. 


"మా కోడలు పప్పులో నూనె చుక్క కూడా వేయదు, ఆ వంట తింటే నా నోరు చచ్చిపోతోంది!" అని చెప్పేవారు. ఆవిడ గారు ఏది వండినా, ఎలా వండినా నా కొడుకు మాత్రం లొట్ట లేసుకుంటూ తింటాడు. ఆవిడ ఏది చెబితే అదే వేదం వాడికి అని లేనిపోనివన్నీ రోజూ ఫోన్లు చేసి ఆవిడ అమ్మగారికి, ఈవిడంటే సింపతీ ఉన్నవాళ్లకి చెప్పేవారు. 


ఒకరోజు పని మనిషి సుధ దగ్గరికి వచ్చి, "అమ్మా! మీరు ఇద్దరూ వెళ్లాక, మీ అత్తగారు మీ మీద ఫోన్ చేసి ఎవరెవరికో మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు," అని స్వామి భక్తితో చెప్పింది. 


సుధ మొదట్లో నమ్మలేదు. కానీ ఒక రోజు తన మొబైల్ ఆడియో రికార్డర్ ఆన్ చేసి కనిపించకుండా పెట్టి ఆఫీస్‌కు వెళ్లిపోయింది. ఇంటికి వచ్చాక ఆడియో ఆన్ చేసి విని ఆశ్చర్యపోయింది. ఇంత విషం ఈవిడ కడుపులో దాచుకుని, మామూలుగా ఎలా నటిస్తున్నారో సుధకు అర్థం కాలేదు. రాజీవ్‌కు చెప్పినా నమ్మరు అని, "ఈ ఆడియో ఒక్కసారి వినండి," అని వినిపించింది. 


రాజీవ్ నమ్మలేకపోయాడు. కానీ తన తల్లి గురించి ఒక్క మాట కూడా అనకుండా, "ఇంకోసారి రికార్డ్ చేయనని సుధ దగ్గర ఒట్టు వేయించుకున్నాడు." 


రాజీవ్, సుధ ఇద్దరూ కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే, ఆమె ముఖం మాడ్చుకుని కూర్చునేవారు. సుధ మొదట్లో ప్రేమగా వారికి టిఫిన్లు, కాఫీలు అందించినా, ఆమె నిరంతర అసహనం చూసి, ఆ తర్వాత ప్రేమగా ఏ పనీ చేయాలనిపించేది కాదు. సూర్యకాంతం గారికి, తన ఫోన్ సంభాషణలన్నీ సుధ వాయిస్ రికార్డ్ చేస్తోందని తెలిసిన తర్వాత, తాను ఫోన్‌లో మాట్లాడిన ప్రతి అబద్ధం, అతిశయోక్తి సుధకు తెలుసన్న విషయం ఆమెను కుంగదీసింది. కోడలు మొహమాటంగా ఉంటోంది. 


అంతేకాక, వంట చేస్తూ, "అత్తయ్యగారూ, ఒక చుక్క కాదండీ, ఒక గరిట వేస్తున్నాను పప్పులో నూనె," అని అనెటప్పటికి, తాను మాట్లాడినవన్నీ కోడలికి తెలిసిపోతున్నాయని ఆమెకు అర్థమైంది. 


తాను ఎవరూ వినట్లేదు కదా అని నోటికి వచ్చిన అబద్ధాలన్నీ పలికింది. కోడలికి తను మాట్లాడినవన్నీ తెలుస్తున్నాయని అర్థమైంది కానీ, ఎలా తెలుస్తున్నాయన్నది ఆవిడకు అంతుపట్టలేదు. అయినా, ఆవిడకి ఆ నిజాలు తెలిసిపోయాయన్న బాధలో, 'ఎలా' అన్న విషయంపై ఆసక్తి అనిపించలేదు. ఆమె తన గదిలో కూర్చుని ఆత్మ పరిశీలన చేసుకుంది. 


"సరే, నేను అత్తగారింట్లో బాధలు పడ్డాను అనుకుందాం. దాన్లో నా కోడలు సుధ తప్పు ఏముంది? ఆ అమ్మాయి ఎందుకు కష్టపడాలి?" అని ప్రశ్నించుకుంది. 


ఇంకా లోతుగా ఆలోచించి, "నా కొడుకు రాజీవ్, సుధ మాటే వింటాడని బాధపడుతున్నాను కానీ, నా భర్త కూడా నా మాటే వింటారు కదా, మరి నా కూతురి మాటే నా అల్లుడు వింటాడని ఆనంద పడుతున్నాను కదా!" అని గ్రహించారు. 


ఈ ఆత్మపరిశీలన ఆమెలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. సుధకి తన పట్ల ప్రేమ, గౌరవం పోయాయన్న విషయం ఆమెను బలంగా తాకింది. సుధతో మాట్లాడటానికి కూడా ఆమె ధైర్యం చేయలేకపోయారు. మరునాడు ఆదివారం. సుధకు ఆ రోజు హడావుడి ఏమీ ఉండదు కనుక, లేట్‌గా నిద్ర లేస్తుంది. కానీ, సూర్యకాంతం గారు పొద్దున్నే లేచి, వంట, మిగతా పనులన్నీ చకచకా చేసేశారు. సుధ వంటగదిలోకి వచ్చి, అన్నీ చేసేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. 


ఇంతలో సూర్యకాంతం గారు రాజీవ్‌ను పిలిచి, "కోడలిని కూడా పిలు," అన్నారు. 


రంగా రావు గారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ కూర్చున్నాక, సూర్యకాంతం గారు చేతులు జోడించి, కళ్లల్లో నీళ్లతో సుధతో, "నన్ను క్షమించమ్మా. చిన్నదానివి అయినా పెద్ద మనసుతో నన్ను క్షమించు," అన్నారు. 


సుధ ఆశ్చర్యంగా, "ఏంటి అత్తయ్యగారూ? ఏమైంది?" అంది. 


సూర్యకాంతం గారు వణుకుతున్న గొంతుతో, "నేను ఇప్పటివరకూ చేసినవన్నీ తప్పులే. ఇక ముందు ఇలాంటి తప్పులు ఏమీ చేయనని ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను," అన్నారు. 


సుధకు పరిస్థితి అర్థమై, ఆ క్షణంలో ఆమెపై ప్రేమ, జాలి కలిగాయి. "వదిలేయండి అత్తయ్యగారూ. అయిందేదో అయింది. ఇద్దరం కలిసి మర్చిపోదాం," అంటూ సూర్యకాంతం గారిని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. 


సూర్యకాంతం గారికి, తన చాడీల వల్ల కొడుకు, కోడలు గురించి బంధువులందరూ ఏమనుకుంటారో, అనవసరంగా తన కుటుంబ పరువు తానే తీసుకుంటున్నానని తెలుసుకున్నారు. ఇకపైనైనా ప్రేమగా ఉండాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఈ పశ్చాత్తాపం ఆమె ముఖంలో ప్రశాంతతను తీసుకొచ్చింది. ఆమెలో వచ్చిన ఈ శాశ్వత మార్పును చూసి రంగా రావు గారు సంతోషించారు. ఆయన సూర్యకాంతంలో వచ్చిన మార్పు శాశ్వతం కావాలని దేవుడిని ప్రార్థించారు.

***

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page