ఆపరేషన్ రోలు రోకలి
- Nallabati Raghavendra Rao

- Mar 9
- 13 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ఆపరేషన్రోలురోకలి, #OperationRoluRokali, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Operation Rolu Rokali - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 09/03/2026
ఆపరేషన్ రోలు రోకలి - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“రోలు రోకలి భార్యాభర్తలలా ఉంటాయంటారు… కానీ ఆ మాట ఒక మనిషి జీవితాన్నే మార్చేసింది!”
Scene 1
చింతామణిరావు కొడుకు పేరు కృపాకరం. అతనికి పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలయింది. భార్య పేరు అహల్య. భార్యతో సరిపడక కృపాకరం ఆమెను సంవత్సరం క్రితం పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చాడు. ఇప్పుడు 10 రోజుల తర్వాత అతని తమ్ముడు వల్లభరావు పెళ్లి.
చింతామణిరావు బంధువులకు చెప్పి వచ్చాడు, కొంతమందికి శుభలేఖలు పంచాడు, ఇంకొంత మందికి మెసేజ్‌లు కూడా పెట్టేశాడు. తన అత్తవారిని పెళ్లికి పిలవద్దని, శుభలేఖ పోస్టులో కూడా పంపవద్దని కొడుకు కృపాకరం తండ్రికి అభ్యంతరం చెప్పడంతో చింతామణిరావుకు ఏం చేయాలో తోచలేదు.
'భార్యతో చిన్నచిన్న గొడవలే కదా. మాట మాట పట్టింపు అంతే. ఈ శుభకార్యం సందర్భంలో సర్దుబాటు చేసుకోమని, అవసరమైతే పెద్ద మనుషులను తీసుకొని మనందరం వెళ్లి కోడల్ని తీసుకు వచ్చేద్దామని' గతంలో చాలా సార్లు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్పి చూశాడు తండ్రి.
చిన్నప్పటినుండి కృపాకరం కొంచెం మొండి పట్టుదల కలవాడు అని, తను అనుకున్నదే జరగాలి అనే
మనస్తత్వం కలవాడు అని... తండ్రి చింతామణిరావుకు తెలుసు. కనుక తను చెబితే వినక పోవడంతో ఊర్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్దల చేత కూడా పట్టుదల వదిలి వెళ్లి భార్యను తీసుకు తెచ్చుకోమని నచ్చజెప్పించాడు కొడుకు కృపాకరానికి.
''చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇలా పెళ్లి అయిన సంవత్సరానికే భార్యను పుట్టింటి దగ్గర వదిలేసి వస్తే ఎలా?'' అంటూ బంధువులు, పెద్దలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, హితబోధ చేసినా ఇంతవరకు కృపాకరం వినలేదు. అణుమాత్రం కూడా పని జరగలేదు.
సరే... శుభంగా రెండవ కొడుకు వల్లభరావు పెళ్లి సందర్భంలో తగవులాట లాంటి ఆ సమస్య ఒక పక్కన పెట్టేశాడు చింతామణిరావు.
****
ఆరోజు ఉదయం...
ఆ పక్క వీధిలో ఉన్న తన చినతాతగారు అగస్తేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు కృపాకరం.
''నమస్కారం చినతాతగారు. మా డాడీ మీ ఇంటి దగ్గర రోలు-రోకలి తెమ్మని పంపించారు. 4 రోజుల్లో తమ్ముడు పెళ్లి కదా... మీకు తెలుసు కదా. తమ్ముడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు రేపు. ఈ సమయంలో రోలు-రోకలితో పూజా కార్యక్రమాలు, అలాగే ఆడవాళ్లు చేసే ఏవో తతంగాలు ఉంటాయట కదా. మా ఇంట్లో కూడా ఒక రోలు-రోకలి ఉండేవి. అవి ఈమధ్య మా కొత్త ఇంట్లోకి మారుతున్నప్పుడు పగిలిపోయాయి చినతాతగారు''... అంటూ అడిగాడు.
''మీ నాన్న ఫోన్ చేసి నాకు చెప్పాడురా కృపాకరం. అవిగోరా రోలు-రోకలి ఆ మూల ఉన్నాయి. ఉదయమే వంటింట్లో ఆగ్నేయ మూలను ఉన్న వాటిని నువ్వు వస్తావని తీసి తెప్పించి బయట పెట్టాం. పట్టుకెళ్లు.'' అంటూ చూపించాడు అగస్తేశ్వరరావు.
“కానీ కృపాకరానికి అప్పుడే తెలియదు… ఆ రోలు-రోకలి అతని జీవితాన్ని మార్చబోతుందని!”
Scene 2
కృపాకరం వీధి అరుగు మూలన ఉన్న రోలు పైకి ఎత్తబోయాడు. అది చాలా బరువుగా ఉండడంతో పైకి ఎత్తి భుజాల మీద పెట్టుకోవటం చాలా కష్టమైపోయింది. సాయానికి తన చినతాతగారిని పిలుద్దాం అంటే ఆయన చాలా పెద్ద వయసు వాడు. పైగా మడత కుర్చీలో కూర్చుని రిలాక్స్‌గా టీ తాగుతున్నాడు.
కృపాకరం అతి కష్టం మీద మళ్లీ పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు ఆ రోలుని. ఆయాసం వచ్చినంత పని అయింది కానీ దానిని పైకి ఎత్తలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు... ప్రయత్నించాడు... చివరికి ఎలాగైతేనే రోలును రెండు చేతులతో బలంగా పైకి ఎత్తి భుజం మీద పెట్టుకో గలిగాడు. వెంటనే కిందనున్న రోకలిని పట్టుకోవడానికి అతను ఒక చెయ్యిని కూడా రోలు పట్టు నుండి తప్పించుకోలేకపోతున్నాడు. చాలా ప్రయత్నిస్తున్నాడు. రెండు చేతులతో గట్టిగా పట్టుకున్న రోలు మీద నుండి ఒక చెయ్యి తీసేస్తే భుజం మీద ఉన్న రోలు వచ్చి అతని కాళ్ల మీద పడిపోవడం ఖాయం. ఇప్పుడేం చేయాలి... పోనీ రోలుని ముందుగా ఇంటి దగ్గర పెట్టేసి మళ్లీ వచ్చి తర్వాత రోకలిని పట్టికెళ్తే సమస్య తీరిపోతుంది కదా అనుకున్నాడు మనసులో. రెండు చేతులు పట్టుతో భుజం మీద రోలు ఉంటుండగానే అదే విషయం చెప్పాడు తన చినతాతగారికి.
''అబ్బే! అలా కుదరదురా కృపాకరం. రోలు-రోకలి అంటే అవి రెండు భార్యాభర్తల లాంటివి. వాటిని విడదీయకూడదు. పట్టుకు వెళ్ళగలిగితే, రెండు ఒకేసారి పట్టుకెళ్ళు. నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. లేకపోతే మానేయ్. ఒకవేళ రెండు విడివిడిగా పట్టుకెళ్ళడానికి నీకు ఇష్టమైనప్పటికీ ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోదు. నాకు ఇష్టం లేదు!'' అన్నాడు అతని చినతాతగారు అగస్తేశ్వరరావు.
''అదేమిటి చినతాతగారు! రోలు-రోకలి విషయంలో ఇంత కథ ఉందా? ఇలాంటి విషయం ఉంటుందని నాన్న నాకు చెప్పలేదే! అయినా ఇలాంటి అతి చాదస్తపు నమ్మకాలు ఇంకా ఈ రోజుల్లో ఏమిటి చినతాతగారు? రోలు-రోకలి భార్యాభర్తలా? ఇంకా నయం, రోజు కాపురం చేస్తున్నాయి అనలేదు. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. ఉండండి. వీధిలో మా ఫ్రెండ్ ఎవరైనా వెళ్తున్నాడేమో నిలబడి చూస్తాను. వాడు వచ్చాక ఇద్దరం ఒకేసారి చెరో ఒకటి పట్టుకు వెళ్తాం. అప్పుడు మీకు అభ్యంతరం ఉండదు కదా? అలా చేస్తాను.'' అంటూ నెమ్మదిగా ఆ రోలును తన రెండు చేతుల సహాయంతో జాగ్రత్తగా క్రిందకు దింపి యథాస్థానంలో పెట్టాడు. వీధిలోకి వెళ్లి రోడ్డుమీద తన ఫ్రెండ్ ఎవరైనా వెళ్తుంటే బతిమలాడి లోపలకు తీసుకు వద్దామని ముందుకు వెళ్లబోయాడు కృపాకరం.
''ఆగరా! ఆగాగు కృపాకరం. ఇలా వెనక్కు రా. నా పక్కనే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చో. ఆవేశం, ఆయాసం పడకు. నేను చెప్పేది విను. ముందు ఈ మంచినీళ్లు తాగు. ఇప్పుడు విషయం ఏమిటి అంటే... నువ్వు పెళ్ళాన్ని వదిలేసిన వాడివి కనుక నీకు మొగుడు-పెళ్ళాల బంధం అర్థం అయి చావదు. ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. భార్యాభర్తల బంధం, అనుబంధం, ప్రేమ గురించి నీకు ఎన్ని పాఠాలు చెప్పినా అడవిలో గంధపు చెట్టు మాదిరి నిరుపయోగం.
సరే! అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నీ భార్య, నువ్వు మోటారు బండి మీద సినిమాకి వెళ్తున్నారు అనుకుందాం. నీ మోటారు బండి చక్రాల్లో గాలి తక్కువగా ఉందని, నీ మోటారు బండి మీద నువ్వు ఒక్కడివే ఉండి, నీ పెళ్ళాన్ని దారిన పోయే, ముక్కూమొఖం తెలియని వేరొక మోటారు బండి వాడును ఆగమని, అతని వెనకాతల కూర్చోబెట్టించి సినిమాకు తీసుకువెళ్తావా? చాలా అసహ్యం కదా! చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇది కూడా అంతే. పెద్దవాడిని కనుక, నీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ మొండి ఉదాహరణ విధానంలో చెప్పాను. ఇలా చెప్పినా నీకు అర్థం అయి చావదు కానీ, ఒక పని చేస్తాను. అది కూడా ఎందుకంటే నువ్వు నా బంధువర్గంలో వాడివి కనుక.
''అదుగో! సోమయాజులుగారని పక్క ఊరి పెద్ద సిద్ధాంతిగారు. నీకు తెలియదులే. నాకు స్నేహితుడు. అదిగో! ఆ రావిచెట్టు కింద రచ్చబండ మీద కూర్చున్నాడు చూడు, ఆయనే. లోపలకు పిలుస్తాను. రోలు-రోకలి గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలు పూసగుచ్చినట్టు చెప్పగలడు. ఇదంతా నీ గురించి కాదుగాని, ఈ రోలు-రోకలి విషయంలో క్లారిటీ నాకు కూడా అంతగా తెలియదు. నేను విందామని సుమా, నీ కోసం కాదు!''
అంటూ కృపాకరాన్ని తన పక్కనే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టి, అగస్తేశ్వరరావు లేచి బయటకు వెళ్లి, మోపెడ్ స్టార్ట్ చేసి వెళ్లబోతున్న తన స్నేహితుడు సోమయాజిని ఆపి, నమస్కారం పెట్టి లోపలకు తీసుకు వచ్చాడు. ఆయనను మరో పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టి, టీ తెచ్చి ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగాడు. సోమయాజిగారు కూడా స్నేహితుడితో చాలా చాలా విషయాలు ఆనందంగా మాట్లాడారు.
అగస్తేశ్వరరావు చివరగా సోమయాజిగారితో మాట్లాడుతూ... ''నాకు ఒక ధర్మ సందేహం ఉంది సోమయాజిగారు. ఇది నవ్వులాట విషయంగా తీసుకోవద్దు. దయచేసి సీరియస్‌గా చెప్పండి. అసలు పెళ్లిళ్లలో రోలు-రోకలి యొక్క ప్రాముఖ్యత ఏమిటండి?'' అంటూ ప్రశ్నించాడు.
సోమయాజిగారు ఆజానుబావుడు. ఆయనది కంచుకంఠం. ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు:
''ముందు ఈ అబ్బాయి ఎవరు చెప్పు? నీకు దగ్గర బంధువా?'' అంటూ కృపాకరాన్ని చూసి ప్రశ్నించాడు.
అవునన్నట్టు తల ఊపాడు అగస్తేశ్వరరావు.
సోమయాజిగారు మాట్లాడడం మొదలు పెట్టారు:
''సరే, ఎవరైతే నాకెందుకు కానీ... చూడు అబ్బాయ్! చూస్తే నువ్వు బాగా అమాయకపు ముఖం గాడిలా కనిపిస్తున్నావు. అసలు రోలు-రోకలి గురించి వివరంగా చెప్పేముందు, 'పెళ్లి' అనే కార్యక్రమం దగ్గర నుంచి మొదలుపెడదాం.
నీ మొఖం చూస్తే ఇంకా పెళ్లి అయ్యి ఉండకపోవచ్చు. పెళ్లాంతో కాపురం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. సరే, ఆ విషయం కూడా నాకెందుకు కానీ, నువ్వు కూడా జాగ్రత్తగా విను. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. నీలాంటి కుర్రకారు ముఖ్యంగా వినాలి.
మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం 'పెళ్లి'. దీనిని ఏవిధంగా జరుపుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యం. మన దేశంలో వివిధ రకాల మతాలు, కులాలు ఉన్నాయి కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇకపోతే, మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఎన్నో సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. అసలు పెళ్లి అంటే ఎన్నో పనుల సమ్మేళనం...
ఎంగేజ్‌మెంట్, ఇంటి దేవుళ్లను పూజించడం, గౌరీ పూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం, మధుపర్కం, మంగళసూత్ర ధారణ, బ్రహ్మముడి, సప్తపది, నాగవల్లి, అరుంధతీ నక్షత్రం, అప్పగింతలు వంటి ఎన్నో సంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో చాలా మందికి తెలిసిన విషయాలే.
అయితే, ఇక్కడ పెళ్లి సందర్భంగా రోలు మరియు రోకలిని పూజిస్తారని ఎవరికైనా తెలుసా? దీనికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయంటున్నారు పూర్వీకులు మరియు మన పవిత్ర వేదాలు. సనాతన ధర్మం ప్రకారం, ‘ఏ ప్రవర్తనా నియమావళి, మూలసూత్రాలు మరియు ఏ న్యాయం చేత వ్యక్తిగత, సామాజిక, మతపర జీవితం సజావుగా సాగుతుందో దానికి కారణం సర్వ జీవజాలం. ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్క వస్తువు లేదా జీవజాలం మరొక దానితో అనుసంధానం చేయబడి ఉంటుంది.’
దానిలో భాగంగా మన తెలుగు వాళ్లు పెళ్లిళ్ల సందర్భాలలో, కొన్ని శుభకార్యాల సందర్భాలలో, పూజల సందర్భాలలో రోలు రోకలిని ఎక్కువగా ఉపయోగిస్తుండడం అనాదిగా జరుగుతుంది. అంతే కాకుండా వాటికి ఎక్కువగా పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు.
ఎందుకంటే రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ఎంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. విను... ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు తదితర ధాన్యాలను బాగా దంచి వంటకు అనువుగా చేసుకుని వండుకు తినేవారు మన పూర్వీకులు. ఇవన్నీ రెగ్యులర్‌గా చేస్తూ ఉండేవారు. ఆ ధాన్యాలను పిండిగా చేయడానికి, నూకలుగా ఆడించడానికి అప్పుడు మిక్సీలు ఉండేవి కాదు, మిషన్లు ఉండేవి కాదు. ఈ రోలు రోకలి, తిరగలిని ఉపయోగించే తమ ఆహార పదార్థాలు తయారు చేసుకునేవారు. అందుకే అప్పటి తరం వారికి రోగాలనేవి ఎక్కువగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడలా కాదు, మనము ప్రతి ఒక్క పదార్థాన్ని బయటనే కొంటున్నాము. అవి మిషన్ల ద్వారా తయారవుతున్నవి. వాటినే తింటున్నాము, తద్వారా మన ఆరోగ్యం పాడైపోతోంది.
కాబట్టి మన వంటకాలను మన ఇంటిలో ఉన్న రోలు మరియు రోకలితో చేసుకోవడం ఉత్తమం. అందుకే శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తు చేయడం, స్వయంగా అన్నింటినీ మనమే సిద్ధం చేసుకోవడం, అలాంటి ప్రక్రియలు మళ్ళీ మొదలు పెట్టాలని ఈ రోలు, రోకలి, తిరగలిని పూజించి వాటికి మహోన్నతమైన విలువ, గౌరవం ఇస్తున్నాం అన్నమాట.
ఇదిగో అబ్బాయి, అసలు నీకు ఒక విషయం తెలుసా? పురాణాల్లో బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. అంటే నాగలితో భూమిని దున్ని ధాన్యం పండించడం ద్వారా నాగలికి విలువ ఇస్తూ... వచ్చిన ధాన్యాన్ని రోకలితో దంపి పిండి చేసి ఆహారం భుజించడం ద్వారా రోకలికి విలువ ఇస్తూ... అవి రెండింటిని ఆయుధాలుగా స్వీకరించిన బలరాముడే నిజమైన రైతుకు ప్రతీక అన్నమాట. అలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నావ్ ఏమిటి? నోట్లోకి ఈగలు పోతున్నాయిరా కుర్రకుంకా, ఇంకా విను...
గ్రహణ సమయంలో రోటిలో కొంచెం పసుపునీళ్లు పోసి ఏ ఆధారం లేకుండా రోకలిని నిలబెడితే నిలబడుతుంది. గ్రహణం విడిచాక రోకలి దానంతట అదే పడిపోతుంది. ఆ విషయం నీకు తెలుసా?
ఇవి అన్నీ పనికిరాని చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు, మూఢ విధానాలు అనుకోకురా. సైన్స్ విజృంభించేస్తుందని మనం ఆకాశంలో విహరించేస్తున్నామని అనవసరంగా హైరానా పడకు. ఎంత సైన్స్ అయినా ఈ సనాతన ధర్మాలు, ఆచారాలతో ముడిపడితేనే రోజు ముందుకు వెళుతుంది.
ఈ విధంగా రోలును లక్ష్మీదేవితో, రోకలిని విష్ణువుతో, తిరుగలిని శివుడితో, తద్వారా వచ్చిన పిండిని పార్వతీదేవితో పోల్చుకుంటూ వాటిని దేవతలుగా ఆరాధిస్తారు. దీనివల్ల వారికి ధన ప్రాప్తి సిద్ధిస్తుందని గట్టిగా నమ్ముతారు.
ఇలాంటి పరిస్థితులలో ఈ పద్ధతులను అన్నిటినీ పెడచెవిన పెడుతున్న మీలాంటి పింజారి వాళ్లు ఉన్నారే... ఇదిగో, వీళ్ళ వల్లే దేశం అధోగతి పాలవుతుంది. సరే, మూర్ఖత్వంలో కొట్టుకుపోయే బుర్రలకు ఎంత లెక్చరిచ్చినా అనవసరం.
"ఇదిగో అగస్తేశ్వరరావు, ఆప్తమిత్రుడివి నువ్వు అడిగావు కనుక ఈ రోలు రోకలి గురించి ఎంతో వివరంగా చెప్పాను. చివరి విషయం ఏమిటి అంటే, ఈ రోలు రోకలిని ఏ బడుద్దాయి వెధవ అయినా పట్టుకెళ్తాను అంటే... విడివిడిగా ఇవ్వకు. పట్టుకెళ్లగలిగితే ఒక్కసారే అవి రెండు కలిపి పట్టుకెళ్లగలిగే శక్తి ఉన్నవాళ్లకైతేనే అవి ఇస్తూ ఉండు. లేకుంటే కుదరదు గాక కుదరదు. శాస్త్రం ఒప్పుకోదు. ఇంతకీ ఈ పకోడీగాడికి అసలు పెళ్లి అయిందా?" వెళ్తూ వెళ్తూ మళ్లీ అడిగారు సోమయాజి గారు.
"అయిందండి రెండు సంవత్సరాల క్రితం. కానీ సంవత్సరం క్రితం ఏదో చిన్న సమస్యతో పెళ్లాన్ని పుట్టింటి దగ్గర దిగబెట్టి వచ్చేసాడు."
"అదిగదాన్నమాట విషయం. అర్థముఖంగాడన్న మాట. ఇలాంటి వాడికి ఎంత చెప్పినా అది మురికి గుంటలో పోసిన అమృతం అవుతుంది. పెళ్లాంతో కాపురం చేస్తున్న వాడు అయితే వాడికి ఇదంతా అర్థమయ్యేది. నేను చెబుతుంటే నోరు వెళ్లబెట్టి వెర్రి చూపులు చూస్తున్నాడు. వెర్రివెంగళప్పగాడు అని ఇప్పుడు తెలిసింది. సరే, వాడెవడైతే నాకెందుకు కానీ నాకు గుడికి వెళ్లే సమయం దగ్గరపడింది... ఉంటాను మరి." అంటూ మెట్లు దిగి, గేటు తీసుకొని బయటకు వెళ్లి తన మోపెడ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు సోమయాజిగారు.
అంతా విన్న కృపాకరం తన బుర్ర ఒక్కసారి విదిలించాడు. శతసహస్ర సూక్ష్మక్రిములు తన బుర్ర మీద నుండి దూరంగా వెళ్లిపోయిన అనుభూతి కలిగిన తర్వాత తన చినతాతగారితో ఇలా అన్నాడు:
"సరే, చినతాతగారు, ఇదంతా నాకెందుకు కానీ... ఒక రిక్షా బండిని పిలిచి దాంట్లో నేను కూర్చుని రోలు రోకలి రెండు ఒకేసారి పట్టుకెళ్తాను. మీకు ఏమైనా అభ్యంతరమా?" అంటూ అడిగాడు.
"చాలా ఆనందం నాయినా! చాలా ఆనందం. ఇదన్నమాట సరైన విధానం అంటే. టైమ్ వేస్ట్ చేయకుండా ఈ పని నువ్వు ముందే చేయవలసింది. సరే, బయట రిక్షా బండివాడు ఎవరైనా ఉంటే పిలు. మన రిక్షా సింగినాగం ఉంటే మరీ మంచిది. వెళ్లి తీసుకురా." అన్నాడు సర్వేశ్వరరావు.
ఆ ఊరిలో ఉన్న ఇద్దరు రిక్షాబళ్ల వాళ్లలో ఒక అతను ఊరు విడిచి వెళ్లిపోయాడు. మరొకతను సింగినాదం. ఆ ఊరిలో అందరికీ తెలిసిన వ్యక్తి సింగినాదం. కొంచెం వీధి చివరకు వెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న అతడినే తీసుకొచ్చాడు కృపాకరం. సింగినాదం లోపలకు వచ్చి విషయం పూర్తిగా తెలుసుకుని 'సరే' అన్నాడు సర్వేశ్వరరావుతో.
కానీ, సమయం కుదిరింది కదా, ఒక మాట అడగాలని సర్వేశ్వరరావు దగ్గరే మెట్టు దిగువన కూర్చుండిపోయాడు సింగినాదం.
తన పని కోసం వచ్చి ఏమిటీ కాలయాపన ఇలా చేస్తున్నాడు అనుకుంటూ కృపాకరం అర్థంకాక ఆశ్చర్యంగా నిలబడ్డాడు.
వెంటనే సింగినాదం కృపాకరం వైపు చూసి...
"కృపాకరం బాబుగారూ! మీ నాన్నగారు నాకు బాగా తెలిసినవారు కదా! ఈడ చిన్న పని చూసుకుని ఈ రోలు రోకలిని నేను అట్టికెళ్లి మీ ఇంటి కాడ ఆడేస్తాను. మీకు ఏదైనా పనుంటే మీరు వెళ్లిపొండి బాబూ!" అంటూ చెప్పాడు కృపాకరానికి.
"పర్వాలేదులే, నీ పని చూసుకో... నేను కూడా వింటాను. తర్వాతే వెళదాం" అంటూ కృపాకరం తన చినతాతగారు పక్కనే కూర్చుండిపోయి సింగినాదం చెప్పేది వినడం మొదలు పెట్టాడు.
"దొరగారూ, చిన్న మాట అడగాలండి మిమ్మల్ని..." చేతులు నలుపుకుంటూ ఉన్నాడు సింగినాదం సర్వేశ్వరరావు వైపు చూస్తూ.
"సింగినాదం, అడగరా! ఏమైనా డబ్బు అప్పు కావాలా?"
"ఎంత మాట! ఎంత మాట! విషయం అది కాదండి. నాకు నాలుగు అడుగుల బాగా లావు కర్ర దూలం ముక్క కావాలండయ్యా. డబ్బులు పెట్టి కొనలేను. తమరు బాగా తెలిసిన వారు కదా. ఏదైనా పాతది ఉంటే ఇప్పించండి." అంటూ అడిగాడు.
"కర్ర దూలం ముక్క దేనికి?" అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు సర్వేశ్వరరావు సింగినాదం వైపు.
"ఏమీ లేదండయ్యగారూ... మాది తాటాకు కొంప కదా. నిన్న రాత్రి మా కొంపకి ఈశాన్యం మూల లావుపాటి కర్ర దూలం చెదపట్టి ఊడిపోయింది. నా కాడ లావు కర్ర దూలం ముక్కలు ఏమీ లేవు. అంతదాకా అక్కడ ఏదో ఒకటి దాపు పెట్టకపోతే పాక పూర్తిగా ఒరిగిపోతుంది. మరప్పుడు అర్జెంటుగా ఏం చేశానో తెలుసాండయ్యా? మా ఇంటి దాన్ని అడిగి రోలుమీద రోకలి తీసుకొని ఈశాన్యం మూల చెదపట్టిన కర్ర దూలం పీకి పడేసి ఆ మూల ఈ రోకలి దాపు పెట్టేశానండి. నా తెలివితేటలకు మా ఇంటిది చాలా సంతోషించిందనుకోండి. మీరిప్పుడు లావు కర్ర దూలం ఇస్తే... దీన్ని అక్కడ మోపు చేసి ఆ రోకలి తీసేసి రోలు మీద పెట్టేస్తానండి. అదిగదండీ నా ఐడియా!" అంటూ పకపక నవ్వుతూ చెప్పాడు సింగినాదం.
"ఇదేం పనిరా! ఇంత అప్రతిష్టపు పని చేయాలని నీకు ఎలా బుద్ధి పుట్టిందిరా నీచుడా? నీకసలు ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు తినేది అన్నమేనా? భార్య ఒకచోట భర్త ఒకచోట ఉంటే ఎంత చండాలంగా ఉంటుందో ఏమైనా ఊహించావా? అవునులే, నీకెలా తెలుస్తుంది? చదువు సంధ్య లేని అడ్డగాడిదవి నువ్వు!" అంటూ మహాకోపంతో సర్వేశ్వరరావు అరిచి కరిచినంత పని చేశాడు సింగినాదం వైపు చూసి.
సింగినాదం భయపడిపోయి నిలబడ్డాడు. "నేను తప్పు ఏం మాట్లాడాను అయ్యగారూ? కర్రదూలం అడగడం కూడా తప్పేనా? భార్యాభర్త అంటున్నారు, చండాలుడా అంటున్నారు... నాకేమీ తెలియడం లేదండి అయ్యగారూ. మీరింత కోప్పడతారని తెలిసుంటే ఏది అడిగేవాడిని కాదండయ్యా" భయపడుతూ అన్నాడు సింగినాదం.
"నువ్వు కర్రదూలం అడగడం తప్పులేదురా కానీ, రోలును రోకలిని వేరు చేసావు చూడు... అది తప్పు. తప్పు కాదు, భరించరానిది. నేను చెవులతో ఆ మాట వినలేకపోతున్నాను. చక్కగా కాపురం చేసుకుంటున్న నీ భార్యను నిన్ను దూరం దూరంగా పెట్టేస్తే ఎలా ఉంటుందిరా? అదే ఇది. నీ బుర్రకు అర్థం కాలేదు కదూ! రోలు రోకలి అంటే భార్యాభర్తలు. భార్య ఒకచోట భర్త ఒకచోట ఉంటే అది జీవితం ఎలా అవుతుందిరా? నరకప్రాయం అవుతుంది!" చాలా బాధగా అన్నాడు సర్వేశ్వరరావు.
“ఆ మాటలు విన్న కృపాకరం ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు...”
సీన్ 3
"అయ్యగారూ, ఎంత గొప్ప విషయం చెప్పారండి! రోలు రోకలి అంటే మొగుడు పెళ్లామా? అమ్మో... అట్టాగైతే అట్లని ఇడదీసి నేను చాలా పెద్ద తప్పు చేశానని ఎరుకైనదండి. అలాగైతే నన్ను క్షమించకూడదండి... చంపేయండి బాబూ!"
"అయ్యా! నిజమేనండయ్యా, ఇప్పుడు కూతంతా అర్థమైంది. మొగుడు పెళ్లాలు దూరం దూరంగా ఉండకూడదండి. ఆ విషయం నాకు బాగా తెలుసయ్యా. మా పెదనాన్నగారి అబ్బాయిది పక్క ఊరండి. మాట మాట పెరిగి గొడవపడి ఓతూరి పెళ్లాన్ని పుట్టింటి కాడ ఒగ్గేసాడండి. సరే, చూద్దాంలే అనుకొని నేను నెమ్మదిగా ఉన్నానండి. అయితే మా ఎదవ... పెళ్ళాం లేకపోవడంతో ఆగలేక ఇంటి కాడ దారిని పోయే ఆడపిల్లలతో ఎదవ వేషాలు వేయడం మొదలెట్టాడండి. ఆళ్లు ఊరుకుంటారా అండి?
మా సన్నాసిని చెరువు గట్టు కాడికి తీసుకెళ్లి చితక్కొట్టేశారండి. కొట్టులో పెట్టించేశారండి. పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయండి. నాకు తిక్క రేగిందండి. "ఇది కాదు పని" అని నేను వాళ్ల ఊరు వెళ్లి వాడిని ఒకసారి కోక పెట్టి... "ఒరే సాంబయ్యా! పెళ్లాన్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఆడపిల్లలతోటి ఎదవ వేషాలు వేస్తున్నట్టే... అక్కడ నీ పెళ్లాం కూడా మొగోళ్లతోటి ఎదవ వేషాలు వేస్తుంటుంది కదా! అలా ఇద్దరూ చెడిపోతే దరిద్రం కదరా. ఆ తర్వాత ఎప్పుడైనా కలుసుకున్నా కాపురం చేయలేరురా. కొంచెం ఆలోచించి వెంటనే వెళ్లి నీ పెళ్లాన్ని అట్టుకొని తెచ్చేసుకో!" అని నాలుగు చీవాట్లు పెట్టానండి.
వాడి బుర్రకు బాగా ఎక్కిందండి. వెంటనే వెళ్లి సాయంకాలానికి వాడి పెళ్లాన్ని అట్టుకొని వచ్చేసినాడండి. ఇప్పుడు అర్థమైంది బాబూ. రోలు రోకలి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి తమరు కర్రదూలం ఇప్పించండయ్యా. వెంటనే వెళ్లి దాపు పెట్టిన రోకలి తీసి ఓ దండం పెట్టి రోలుకాడ పెట్టేస్తానండి. తప్పైపోయిందని రోలు రోకలికి నేను, మా ఆవిడ పసుపు కుంకుమ రాసి పూజలు కూడా చేస్తామండి బాబూ!" సింగినాదం లెంపలు వాయించుకుంటూ అన్నాడు.
"సరే, తప్పు తెలుసుకున్నావు కదా. ముందు మా కృపాకరం పని చూడు. మా కృపాకరం నీ కూడా రావక్కర్లేదు కదా. నువ్వు వెళ్లి ఈ రోలు రోకలి కృపాకరం తండ్రి చింతామణి రావు గారి ఇంటి దగ్గర దించి తిరిగి వెళ్లేటప్పుడు రా. దొడ్లో నువ్వు అడిగినంత సైజు లావు కర్ర దూలం ఉంది, ఇస్తాను." అంటూ చెప్పాడు సర్వేశ్వరరావు.
వెంటనే సింగినాదం ఆ మూలనున్న రోలును సునాయాసంగా ఒక చేత్తో పట్టుకుని భుజం మీద పెట్టుకుని మరో చేత్తో రోకలిని పట్టుకుని బయటకు వెళ్లి తన బండిలో పెట్టుకుని వెళ్లిపోయాడు.
కృపాకరానికి ఇప్పుడు తన ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు. తన మెదడులోని కణాలన్నీ... "ఏదో గొప్ప కార్యం సాధించరా..." అన్నట్టు తనకు ఇప్పుడు సుగమమైన మార్గం చూపిస్తున్నట్టు అనిపించింది. ఇంతకుముందు సోమయాజి గారు, ఇప్పుడు తన చినతాతగారు, సింగినాదం... వాళ్లందరి మధ్య సంభాషణ పూర్తిగా విన్న కృపాకరం తన భార్య పట్ల తను ప్రవర్తించిన తీరు ఎంత చెడ్డదో గ్రహించగలిగి సిగ్గుతో కుంచించుకుపోయాడు. వెంటనే తన చినతాతగారి వైపు తిరిగి...
"చినతాతగారూ, ఇప్పుడు నేను పెద్దాపురం వెళ్దామనుకుంటున్నాను" అన్నాడు.
"ఇప్పుడెందుకురా? అది మీ మామగారి ఊరు కదా. సడన్‌గా ఈ నిర్ణయం ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు సర్వేశ్వరరావు.
"అహల్యకు ఏమాత్రం ఇష్టమైనా... నా భార్య అహల్యను తీసుకువచ్చేస్తాను. ఈరోజే తీసుకొచ్చేస్తాను."
"బాగుందిరా! ఈ సంబంధం కుదిర్చీ దగ్గరుండి పెళ్లి చేసిందే నేను కదా. నీ భార్యను తీసుకువెళ్లడానికి నువ్వు ఎప్పుడు వస్తావా అని వాళ్లు ఎదురు చూస్తున్నారు. నీ భార్య, మీ మామగారు కూడా ఏమి ప్రశ్నలు వేయరు, అభ్యంతరాలు చెప్పరు. ఏ గొడవలు ఉండవు. పెద్దాపురం వాళ్లకు నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఇటునుంచి ఇటే బయలుదేరి వెళ్లు. ఇదిగో, నువ్వు మీ మామగారు ఇంటికి వెళ్లేసరికి వాళ్లు సారె, చీరలతో అమ్మాయిని రెడీ చేసి ఉంచేలాగా మాట్లాడతాను. నువ్వు చక్కగా వాళ్లతో మాట్లాడి మీ మామయ్యగారిని, అత్తయ్యగారిని కూడా రేపు మీ ఇంటి దగ్గర జరగబోయే శుభకార్యానికి రమ్మని అడిగి, ఈ రోజే మీతో పాటు వాళ్లను కూడా తీసుకుని వచ్చేయి. అంతా నేను సర్దుబాటు చేస్తాను కదా. ఇక నువ్వు బయలుదేరు. మీ నాన్నకు నేను ఫోన్ చేసి చెప్తాలే!" సర్వేశ్వరరావు మహదానందంగా కుర్చీలోంచి పైకి లేచి కృపాకరం భుజం తట్టి పంపించాడు.
తనలో మానసిక మార్పు కలిగినందుకు కృపాకరం శరీరం పంచామృతంతో తడిసి ముద్దైపోయినట్టు అయిపోయింది.
తన నుంచి ఒక చెడు గ్రహం పరిగెత్తుకొని దూరంగా పారిపోయినట్లు అనిపించింది, పెద్దాపురం వెళుతున్న కృపాకరానికి.
****
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments