top of page
Original.png

వంతెన

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #Vanthena, #వంతెన, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు


Vanthena - New Telugu Story Written By Vemparala Durga Prasad

Published In manatelugukathalu.com On 25/01/2026

వంతెన - తెలుగు కథ

రచన: వెంపరాల దుర్గాప్రసాద్

నేను పని చేసేది కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం. చేసేది సెక్షన్ హెడ్ వుద్యోగం. ముఖ్య అధికారి నరహరి చాలా స్ట్రిక్ట్ వ్యక్తి. ఈ మధ్య ఒక ఫైల్ విషయం లో ఆఫీసు లో పెద్ద చర్చే నడుస్తోంది. అది వూళ్ళో ఒక వంతెన నిర్మాణానికి సంబంధించిన విషయం. 


రద్దీ గా వుండే రంగినీడు జంక్షన్ లో ఇటు శంబునగర్ నుండి ప్రకాష్ నగర్ ల మధ్య, ఆ వంతెన కోసం కోట్లలో నగదు మంజూరు అవడానికి అంతా సిద్ధంగా వుంది. ఆ వంతెన గురించి శంభు నగర్ లో కార్పొరేటర్ పెద్ద మహాజరు సమర్పించడం జరిగింది. శంభునగర్ వాసులు రైతు బజార్ కి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, ప్రకాష్ నగర్ లో స్కూళ్ళు ఎక్కువ గా వున్నాయి కనుక, రద్దీ లో పిల్లలు వెళ్ళడానికి, ట్రాఫిక్ సమస్యలు ఛేదించడానికి, ఆ వంతెన ఎక్కువ అవసరమని, ఇలాంటి కొన్ని అర్జీల తో ఆ ప్రతిపాదన ఆఫీసుకి చేరింది. 


కార్పొరేటర్ ఒక సాకు మాత్రమే, దాని వెనుక పెద్ద తలకాయలు, ఆ కాంట్రాక్టు పేరు మోసిన కాంట్రాక్టర్ విశ్వనాధానికి అప్పజెప్పడానికి ఉత్సాహపడతారు అని నాకు తెలుసు. ప్రతిపాదనలు ఆమోదం పొందిన తర్వాత, విశ్వనాధం రంగం లోకి దిగుతాడు. టెండర్ చేజిక్కించుకుంటాడు. అది బహిరంగ రహస్యం మాకు.


 

ఒక రాజకీయ నాయకుడి ప్రేరేపణ తో ఆ ఫైల్ పరుగులు పెట్టి, నరహరి గారి దగ్గరకి వచ్చి 20 రోజులయింది. నరహరి గారు ఆ ఫైల్ సంతకం పెడితే, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి పంపడం జరుగుతుంది. అక్కడ అధికార పక్షం బలంగా వుంది. పాలకవర్గ సమావేశం లో అది ఆమోదం పొందడం, ప్రభుత్వానికి పంపడం లాంఛనమే. 


కార్పొరేషన్ నిధుల నుండి 40 శాతం ఇచ్చి పనులు మొదలు పెడితే, ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మిగిలిన 60 శాతం ఆమోదించి పంపిస్తుంది. ఎక్కడి కక్కడ అన్ని విధాలుగా ఆ వంతెన నిర్మాణానికి తగు ఆమోదం పొందడానికి పాలక పక్ష నాయకుడు ఏర్పాట్లు చేసుకున్నాడు. 


విచిత్రంగా, నరహరి ఆ ఫైల్ లో కొన్ని లొసుగులను చూపించి 2, 3 సార్లు ఫైల్ తిప్పి సెక్షన్ కి పంపిస్తుండడం, నా సెక్షన్ లో మేము రిప్లైలు తయారు చేయడం జరుగుతోంది. 


కానీ, ఆ ఫైల్ నరహరి టేబుల్ మీద నుండి కదలడం లేదు. నాకు లోగుట్టు తెలుసు. ఆ ఫైల్ లో అవకతవకలు గురించి, టెండర్ దక్కించుకోవడానికి ఏర్పాట్లు ముందే చేసుకున్న, ఏకైక మగాడు విశ్వనాధం చేసే ఎత్తుగడలు గురించీ తెలుసు. 

కానీ నేను ఏమి చేయగలను. నేను ఒక్క సెక్షన్ ఆఫీసర్ ని మాత్రమే. 


ఆరోజు సాయంత్రం టైపిస్ట్ నాగభూషణం పిడుగు లాంటి వార్త మోసుకొచ్చాడు. 

“గురువు గారూ! తెలుసా. మన బాస్ ని మార్చి, రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారుట” అన్నాడు. 


ఆ విషయం అప్పటికే వినేసారేమో, హెడ్ క్లర్క్ బాషా, జూనియర్ క్లర్క్ కల్పన ముసిముసి నవ్వులు నవ్వుతూ.. “బాగానే సేకరించావు విషయం” అన్నట్లు అభినందనగా నాగభూషణం కేసి చూస్తున్నారు. 


నేను పని చేసుకుని ఇంటికి వచ్చేసే రకం. పెద్దగా బయట విషయాలు తెలియవు. 


"ఇంతకీ, ఈయన స్థానం లో ఎవరిని వేసేరో?" అన్నాను చిన్న స్వరం తో. 


పక్క కాబిన్ లో నరహరి గారి స్టెనో కూర్చుంటాడు. మా సంభాషణ బయటకి వినపడ్డం నాకు ఇష్టం లేదు. 


“ఎవరో సుధాకర్ గారట. రాజమండ్రి జోనల్ ఆఫీస్ నుండి వస్తున్నారట” అన్నాడు నాగభూషణం. 


నా మొహం లో సంతోషం బయటపడ నీయలేదు. 

కారణం.. ఆ వచ్చే సుధాకర్ నాకు పాత మిత్రుడు. ఇద్దరం, ఇదివరకు చాలా కాలం రాజమండ్రి లో పని చేసిన వాళ్ళమే. ఒక 4 సంవత్సరాలు నాకంటే సీనియర్. 

మంచి పనిమంతుడు. ఎక్కువ నీతిమంతుడు అనే పేరు వుంది. రూల్స్ లో గట్టివాడు. నరహరి స్థానం లో వచ్చే సుధాకర్ కూడా అంతే కొరకరాని కొయ్య. నేను మనసులో అనుకున్నాను..” ఎడమ చెయ్యి తీసి పుర్ర చెయ్యి పెడుతోంది డిపార్ట్మెంట్”. 


అయితే, సుధాకర్ నేనంటే అభిమానిస్తారు. నాకు కొద్దిగా ఆఫీసులో సెలవుల విషయం లో గాని, నా అభిప్రాయలు వ్యక్త పరచడం లో కానీ, ఆయన దగ్గర ఇబ్బంది ఉండదు అనేది నా ఆలోచన. 


యిలా ఆలోచిస్తున్న నేను, తర్వాతి ప్రశ్న వేసే లోపలే, లోపల నుండి నరహరి గారు బయటకి రావడం తో, స్టాఫ్ సైలెంట్ అయిపోయారు. 


“మూర్తి!, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏమయినా ముఖ్యమైన విషయాలు ఉంటే, కాల్ చెయ్యి” అని నా వైపు తిరిగి చెప్పి, హుందాగా వెళ్లి పోయారు మా బాస్. 


“సరే’ అని తలూపాను. 


ఇంటికి వచ్చి, భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం ఆఫీస్ కి వచ్చి పని చేసుకుంటుంటే.. నాగభూషణం హడావిడి మళ్ళీ మొదలయింది. 


“సుధాకర్ సార్ గారు వస్తున్నారు” అన్నాడు. 

ఇంతలో నరహరి గారు, సుధాకర్ గారు ఒక్కసారే మాట్లాడుకుంటూ ఆఫీసు లో కి రావడం, నరహరి గారి ఛాంబర్ లోకి వెళ్లడం జరిగింది. 


సెక్షన్ హెడ్ గా, మర్యాద పూర్వకం గా నమస్కారం పెట్టేను సుధాకర్ గారికి. 


"మీరు ఇక్కడే పని చేస్తున్నారు కదా " పలకరింపు గా అన్నారు సుధాకర్ గారు. 


ఇంతకు ముందు ఏకవచనం తో పిలుచుకునే వాళ్ళం. కానీ, ఇప్పుడు ఆయన పెద్ద ఆఫీసర్ కదా, క్రింది వారు చనువు తీసుకోకుండా, ఆలా మాట్లాడుతారని అర్ధం అయింది. 


"అవునండీ" అనేశాను. 


సుధాకర్ గారు ఛార్జ్ తీసుకోవడం, నరహరి గారు మరో గంటలో ఆఫీసు వదిలి వెళ్లిపోవడం జరిగింది. 


సాయంత్రం 5 గంటల వరకూ, చాలామంది పుష్ప గుచ్చాలు పట్టుకుని రావడం, సుధాకర్ గారిని అభినందిస్తూ ఉండడం కనిపిస్తోంది. 


ఛాంబర్ లో ప్యూన్ ఏడుకొండలు కి తీరిక లేదు. వచ్చే వాళ్లకి, సార్ కి, మంచినీళ్లు, కాఫీలు, టీలు అందిస్తూనే వున్నాడు. 

సాయంత్రం 5. 30 అయింది. స్టాఫ్ ఆరు ఎప్పుడవుతుందా.. సర్దుకుని వెళ్లిపోదామా అని చూస్తున్నారు. నాకు తప్పదు కదా.. ఆఫీసర్ గారు వెళ్లే వరకు ఉండాలి. 


ఇంతలో కాంట్రాక్టర్ విశ్వనాధం, మరో ముగ్గురు మనుషులతో ఛాంబర్ లో కి వెళ్ళేడు. నాకు కబురు వచ్చింది. ఆ వంతెన ఫైల్ కోసం. 


ఆ ఫైల్ తీసుకుని వెళ్లి ఇచ్చి వచ్చాను. సుధాకర్ గారు సీరియస్ గా వున్నారు. ఎదురు గా కూర్చున్న పెద్ద మనుషులు కూడా సీరియస్ గా కనిపిస్తున్నారు. 


ఒక అరగంట ఏదో గట్టి గా విశ్వనాధం గారు చెప్పడం వినపడింది. దానికి సమా ధానం గా సుధాకర్ గారి సమాధానం నాకు వినపడ లేదు. అయన నెమ్మదిగా, స్థిరంగా మాట్లాడతారని నాకు తెలుసు. 


మరో పావుగంట లో ఏడుకొండలు ఆ ఫైల్ తిరిగి తెచ్చి, నాకు ఇచ్చేసాడు. 


ఇంతలో, విస విసా విశ్వనాధం గారు అనుచరులతో వెళ్లిపోవడం జరిగింది. 


మరో పావుగంట కి సుధాకర్ గారు ఛాంబర్ లోంచి వచ్చేసి, కారు ఎక్కి వెళ్లిపోవడం జరిగింది. 


నేను కూడా డెస్క్ కట్టేసి, ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చేక ఏదో టీవీ ప్రోగ్రాం చూసి, పడుకుంటుంటే.. మళ్ళీ ఆ వంతెన ఫైల్ విషయం గుర్తుకు వచ్చింది. రేపు ఆ ఫైల్ గురించి నన్ను అడుగుతారేమో, జరిగిన విషయాలు చెప్పాలి అని అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారాను. 

***

ఉదయం ఆఫీసు లో ఏడుకొండలు నన్ను స్వయం గా ఆ ఫైల్ తెమ్మనడం తో, నేను పట్టుకెళ్లి ఆయన టేబుల్ మీద ఉంచేను. 


కూర్చోండి మూర్తి గారు" అన్నారు ఆయన. కూర్చున్నాను. 

నేను ఆయనకి, విషయాలు వివరిస్తున్నాను. 


ఇంతలో పెద్ద గొంతుతో.. అరుచుకుంటూ విశ్వనాధం గారు తన మనుషులతో వచ్చేడు. సుధాకర్ గారి వైపు వేలు చూపిస్తూ.. ”నీ సంగతి చూస్తాను” అని బెదిరిస్తున్నాడు. 


“నీకు నచ్చింది చేసుకో.. నన్ను బెదిరించలేవు” అని స్థిరంగా చెప్తున్నారు సుధాకర్ గారు.

 

ఇంతలో పెద్ద శబ్దం. 

హఠాత్తుగా కళ్ళు తెరిచిన నాకు అది కలలో దృశ్యం అని అర్ధం అయ్యేసరికి 2 నిముషాలు పట్టింది. అప్పటికే తెల్లవారిపోయింది. మా ఆవిడ వంటింట్లో ఏదో గిన్ని చేజార్చింది. ఆ శబ్దానికి నాకు మెలకువ వచ్చిందన్నమాట. నేను ఆ ఫైల్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో అర్ధం అయింది. 

***

నేను ఆరోజు ఉదయం ఆఫీసుకి వెళ్ళేక, విశ్వనాధం గారు రాలేదు కానీ, ప్రకాష్ నగర్ నుండి పెద్ద గ్రంధాలయం నడిపే లైబ్రేరియన్ సుగుణారావు గారు, ఇద్దరు స్కూళ్ల ప్రిన్సిపాల్స్ వచ్చేరు. 


మర్నాడు ప్రకాష్ నగర్ కాలనీ రెసిడెంట్స్ సంఘం ప్రెసిడెంట్ గురునాధ్ వచ్చేరు. అలా ఆ వారం అంతా ఏదో ఒక సంఘం నుండి ప్రకాష్ నగర్ వాసులు, వాళ్ళ కాలనీ నుండి శంభు నగర్ కి వంతెన నిర్మాణం కోసం అర్జీలు పెట్టారు. ప్రకాష్ నగర్ కార్పొరేటర్ ప్రతిపక్ష పార్టీ వాడయినా, ఇప్పుడు అతను కూడా ఆ అర్జీలని రికమెండ్ చేస్తూ సంతకం పెట్టేడు. ఆ వారం చివరకి, అర్జీలన్నీ ఒక పెద్ద ఫైల్ అయింది. 


శనివారం సాయంత్రం సుధాకర్ గారి నుండి నాకు ఛాంబర్ లోకి పిలుపు వచ్చింది. 


"మూర్తి గారు, ప్రకాష్ నగర్ వాసులు, కార్పొరేటర్ గారు, లైబ్రేరియన్, హాస్పిటల్ వాళ్ళు తదితరులు పెట్టిన మహాజరులు అన్నీ కలిపి ఒక ఫైల్లో పెట్టి, వంతెన నిర్మాణానికి ప్రొపొసల్స్ తయారు చేయండి. " అన్నారు. 


ఆశ్చర్య పోవడం నా వంతు అయింది. 


"ఇంకో విషయం, ఇదివరకు మీ వద్ద వున్న ఇలాంటి ఫైల్ గురించి మర్చి పోండి. ఇప్పుడు కొత్త ఫైల్ పెట్టండి. 

“ప్రకాష్ నగర్ వంతెన నిర్మాణం అని ఫైల్ పేరు రాసి, మంచిగా నోట్ రాసి సోమవారం మధ్యాహ్నానికి నాకు వచ్చేలా చూడండి” అన్నారు. 


ఆ పాత ఫైల్ పేరు "శంభు నగర్ నుండి ప్రకాష్ నగర్ వంతెన" అని ఉండేది. ఇప్పుడు ఫైల్ పేరు మారింది కానీ, విషయం మారలేదు. నాకు అర్ధం అయింది. 


నేను బయటకి వచ్చి, హెడ్ క్లర్క్ ని, కల్పన ని పిలచి విషయం వివరించాను. నాగభూషణాన్ని అప్పుడే వెళ్ళద్దని, ఉండమని చెప్పాను. 


సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు నాగభూషణాన్ని అడగ కుండా ఉండలేక పోయాను. 

“సుధాకర్ గారు జాయిన్ అయిన రోజు విశ్వనాధం గారి తో ఘర్షణ పడినట్లున్నారు? “ అన్నాను. 


"బయటకి అలాగే ఉండాలి సార్. పనులు చేసేటప్పుడు గానీ, బయట పడరు సార్ పెద్ద వాళ్ళు. పైగా, రూల్స్ తో ఫైల్ గట్టిగా బిగించి ఏపనయినా తనకి అనుకూలంగా మారుస్తారుట ఈ సార్” అన్నాడు పెద్ద తత్వ జ్ఞాని లా. 


నా వెనుకబాటు తనానికి నాకే సిగ్గనిపించింది. 

ఇంకో విషయం పేల్చేడు. 

“ఆ విశ్వనాధం గారు ఎవరో కాదుట.. సుధాకర్ గారి మావగారికి, స్వయానా తమ్ముడుట”. 

ఇప్పుడు నాకు అర్ధం అయింది. సుధాకర్ గారు మారని మనిషి అనుకున్నాను కానీ, మారని మనిషిని నేను మాత్రమే. ఆయన లో మార్పు తెలిసింది ఇప్పుడు. 


సమాప్తం

వెంపరాల దుర్గాప్రసాద్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





bottom of page