top of page

నీ మనసంటే ఇష్టం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Ni Manasante Ishtam' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

ఆమె కవితలంటే అతనికి చాలా ఇష్టం.

ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.

మనిషిని చూడకుండానే ప్రేమించాడు.

తీరా ఆమెను చూసాక అతని ప్రేమ నిలిచిందా లేదా అన్నది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి నీ మనసంటే ఇష్టం కథ చదివితే తెలుస్తుంది.


శ్రీహర్ష కు కవితలు అంటే చాలా ఇష్టం. అతను ఒక సాహిత్య పిపాసి అని చెప్పవచ్చు. మంచి సాహిత్యాన్ని వదలకుండా చదువుతాడు.


అలాగే కవితలు కూడా. తనకు నచ్చిన కవిత కనిపిస్తే దానిని అందంగా కట్ చేసి ఒక ఫైల్ లో నీట్ గా భద్రపరుస్తూ వీలైనప్పుడల్లా చదువుతూ ఒక అలౌకికానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.

ఒకసారి ఇలాగే ఎవరో వ్రాసిన ఒక కవితను ఒక వార పత్రికలో చదివాడు. చాలా నచ్చింది .

" నాకు తెలిసిన మహా అద్భుతానివి నువ్వు

ఏ క్షణంలో ఎలా ఆసీనమవుతావో

మరుక్షణానికి ఎప్పుడు వీడ్కోలు చెపుతావో

తెలీనట్టే ఉంటుంది నీ గమనం.

నీ ఛాయలను తడిమితే చాలు

జీవించిన కాలాలు కళ్ళలో మెదులుతూ

తెరలుతెరలుగా రెపరెపలాడతాయి"..


ఎంత చక్కని కవిత అని పదే పదే అనుకోవడం, ఆ కవిత కింద ఇవ్వబడిన మొబైల్ కు ఫోన్ చేసాడు, ఆ వ్యక్తిని అభినందించాలని.

పేరు చూసాడు. 'తపస్వి' అని ఉంది. అవతలి వైపు నుండి వీనుల విందైన ఒక తీయని స్వరం 'హలో ఎవరూ..' అంటూ పలికారు. ఒక స్త్రీ కంఠస్వరం !

'హలో' అంటూ, 'నమస్తే' అని విష్ చేస్తూ ... 'మీ కవిత చదివాను చాలా బాగుంది, అభినందనలండీ' అని మాటలాడాడు.


అవతలి స్వరం సుతిమెత్తని స్వరం తో ధన్యవాదాలని చెప్పడం, ఫోన్ పెట్టేయడం జరిగింది !

ఇలా రెండు మూడు సార్లు పత్రికలో పడ్డ ఆమె కవితలను చదవడం, ఫోన్ చేయడం, ఒకరి పేరు మరొకరు అడగి తెలుసుకోవడం తో పరిచయం బల పడింది ఇద్దరి మధ్య.

తపస్వి అన్నది తన కలం పేరని, అసలు పేరు మైధిలి అని చెప్పింది. వీలున్నప్పుడల్లా ఫోన్ లో సాహిత్యం గురించి చర్చించుకోవడం, తపస్వి తన రాయబోయే కవితల గురించి హర్షతో చర్చించే స్థితికి రావడంతో, వారిమధ్య స్నేహ బంధం మాలతీలత లా పెనవేసుకు పోయింది. వారి మాటల్లో ఎక్కువ సాహిత్యం గురించి , కవులు, రచయితలు గురించిన విశేషాలే ఎక్కువగా ఉండేవి.

శ్రీహర్ష ఉండేది హైదరాబాద్ అయితే తపస్వి ఉండేది వైజాగ్. హర్ష ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరైతే తపస్వి ఒక బేంక్ లో పనిచేస్తోంది.

సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ ఫోన్లు చేసుకుంటూ అనేక విషయాలు ముచ్చటించుకుంటూ మరింత దగ్గరైనారు. స్నేహమే కాకుండా వారి మధ్య మరో సున్నితమైన బంధం ఏదో ఉందని ఇద్దరికీ అర్ధమౌతూనే ఉంది. కాని ఇద్దరికీ మొహమాటమే బయటకు చెప్పాలంటే !


ఇలా సంవత్సరంపాటు గడచిపోయింది ! ఫోను లో కాకుండా ఇద్దరూ కలుసుకుని ఒకరినొకరు చూసుకోవాలని ఆరాట పడుతున్నారు !


ఎన్నో సార్లు తపస్వి తో అనేవాడు.... సడన్ గా వచ్చేస్తాను నీ దగ్గరకంటూ !


'బాబోయ్ ఆ పనిచేయకు హర్షా, ముందుగా కాల్ చేసిరావూ...' అంటూ గోముగా వేడుకునేది !


ఒక నెల రోజుల క్రితం శ్రీహర్ష తపస్వి ఉంటున్న ఫ్లాట్ డూప్లికేట్ కీ కొరియర్ చేయమని అడిగినప్పుడు, తను ఎందుకూ అని అడిగితే , ఆఫీస్ పనిమీద వైజాగ్ కు వచ్చే ప్రోగ్రామ్ ఉంది .. నిన్ను చూడడానికి నీ ఫ్లాట్ కు వస్తానేమో, ఆ టైమ్ లో నీవు లేకపోతే, అందుకనే నీ ఫ్లాట్ కీస్ పంపు అని అడిగాడు..


నిజానికి హర్షకు ఆఫీస్ పనంటూ ఏమీ లేదు.. కేవలం తపస్విని చూడాలనే ఒక చిన్న అబధ్దం ఆడేడు..


"ఊహూ, పంపించలేను హర్షా' అని అనేసింది తపస్వి..

అలా అన్నందుకు హర్ష ఒక వారం రోజులు తనతో మాట్లాడడం మానేసాడు..

అతని మౌనాన్ని అలకను భరించలేని తపస్వి చివరకు ఏమైతే అయిందనుకుంటూ ఫ్లాట్ కీస్ ను దడ దడ లాడే గుండెలతో పంపించింది.


ఉన్నట్టిండి శ్రీ హర్ష నుండి రెండు రోజులుగా ఏ ఫోన్లు లేవు, ఎన్నిసార్లు చేసినా స్విచ్డ్ ఆఫ్ అని జవాబు వచ్చేది !


ఎన్నో మెసేజ్ లు ఇచ్చింది... నో రెస్పాన్స్ !


ఏమైంది శ్రీ కి ? క్షణం ఆలోచించింది, భయంతో శరీరం గగుర్పొడ్చింది !

గాడ్.... తనని అతడు చాటుగా చూడలేదుకదా ఒక వేళ తనని చూసేసాడేమో !

ఖచ్చితంగా అదే అయ్యుంటుంది....తనని శ్రీ చూసేసాడు... చూసేసి ?

ఏది జరగకూడదనుకుందో అది జరిగిపోయి ఉండవచ్చు !

ఇంక జీవితంలో శ్రీ తన ముఖం చూడడు !


ఒక్క క్షణం ముఖంలో కంగారు, ఒక రకమైన భయం, దేవుడా నన్ను శ్రీ చూసి ఉండకూడదనుకుని మనసులో దేవుడ్ని కోరుకుంది..


ఇంతలో హఠాత్తుగా శ్రీ నుండి నుండి ఫోన్.... హాయ్ తపస్వీ, ఎలా ఉన్నావంటూ ?


"బాగానే ఉన్నాను శ్రీ , ఏమిటీ నీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది ?"


"రెండురోజులు మా ఊరెళ్లి వచ్చాను, నాన్నగారు అర్జంట్ గా రమ్మనమంటే"


"ఏమైంది శ్రీ, అందరూ బాగానే ఉన్నారు కదా ?"


"అందరూ బాగానే ఉన్నారు తపస్వీ.."


"హా... ... ఇంతకీ సంగతి ఏమిటంటే నేను రెండురోజుల్లో నీ దగ్గరకు వస్తున్నాను, నీతో ఒక ముఖ్యవిషయం మాటలాడాలని"

ఇక్కడ తపస్వి నుండి నిశ్శబ్దం....


"ఏం మాట్లాడవే తపస్వీ ? "


"ఆ... ఏమీ లేదు శ్రీ , రా !'


మరుసటిరోజు సాయంత్రం హర్ష బయలదేరుతున్నట్లు, రేపు ఉదయాన్నే మీ ఫ్లాట్ ముందు ఉంటానంటూ మెసేజ్ చేసాడు..


ఒక్క క్షణం అక్కడ నిలువలేనట్లు, హర్ష కంట పడలేనట్లు గా వెంటనే ఒక చిన్న సూట్ కేస్ లో కొన్ని డ్రస్ లు పెట్టుకుని బయటకు నడిచింది తపస్వి !


వెడ్తూ ఒక లెటర్ హర్ష కు కనిపించేటట్లుగా టేబిల్ పైన పెట్టి పేపర్ వైట్ పెట్టింది !


ఆమె ఊహించినట్లుగానే హర్ష తపస్వి ఫ్లాట్ కి వచ్చాడు.. డోర్ లాక్ చేసి ఉంది.. ఉదయం తొమ్మిది గంటలకే బేంక్ కు వెళ్లిపోయిందా అనుకుంటూ తన దగ్గరున్న డూప్లికేట్ కీ తీసుకుని లోపలకు వచ్చాడు. ఫ్లాట్ ఎంతో అందంగా కళాత్మకంగా తీర్చి దిద్దుకుంది. ఆమె మనసులాగే ఎంతో అందంగా ఉంది . తపస్వి తనను చూసి సంతోషంతో ఎగిరి గంతలేస్తుంది.. తను ఆర్తిగా ఆమెను దగ్గరకు తీసుకుంటాడు... విశాఛ బీచ్ లో ఇద్దరూ ఆ సముద్రపు గాలికి పరవశిస్తూ నడుస్తూండగా తను తపస్వి తో తన మనస్సులోని భావాన్ని తెలియ చేస్తాడు.. ఆ మాటవిన్నతపస్వి కళ్లల్లో నునులేత సిగ్గులని చూస్తూ ఆ కనురెప్పలమీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటాడు.. ఇలా ఏవేవో ఊహించుకుంటున్న హర్ష కు తన ఎదురుగా ఉన్న టేబిల్ పైన గాలికి రెప రెప లాడుతున్న కాగితం వైపు చూసి, దగ్గరకు నడచి, అది తనకే అడ్రస్ చేయడం చూసాడు.

అందులో " శ్రీ! నన్ను క్షమించు. నిన్ను నేను మోసం చేసానని నన్ను నిందించినా ఫరవాలేదు. ఏమిటో, ఈ నా జీవితం ప్రేమ, పెళ్లి లాంటి ఏ అనుభూతులకు నోచుకోలేదని తెలిసినా నీతో పరిచయం, స్నేహం, ప్రేమ నా ప్రమేయం లేకుండానే ఒకటి తరువాత మరొకటి వేగవేగంగా జరిగిపోయాయి. ఆ మత్తునుండి బయటకు వచ్చేసరికి ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను. అన్నీ తెలిసీకూడా ఎందుకు తప్పుచేసానని .


శ్రీ! నీవంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను.

మరి అయితే, ఏమిటీ అభ్యంతరం అని నీవు అడగవచ్చు. చెపుతాను శ్రీ . నా మనస్సు అంతా నీ ముందు పరుస్తాను.

నాకు అమ్మ నా చిన్నతనంలో అంటే నా పదేళ్ల వయస్సులో చనిపోయింది. తరువాత మరో సంవత్సరానికి నాన్న పోయారు.. మా అక్కకు నాకూ వయస్సులో పది సంవత్సరాల వ్యత్యాసం.. అమ్మ చనిపోయాక నాకు మా అక్కే అమ్మగా నన్ను ప్రేమతో పెంచి పెద్ద చేసింది. .ఒక రోజు స్కూల్ నుండి ఆటోలో ఇంటికి వస్తూంటే ఎదురుగా వస్తున్న లారీ నేను ఉన్న ఆటోను గుద్దేయడం ఆటో బోర్లా పడడంతో నాకు చాలా పెద్ద ఆక్సిడెంట్ అయింది. నా ఎడమ కాలు ఆటో చక్రం కింద పడి నుజ్జు నుజ్జు అయిపోవడం వెంటనే ఆపరేషన్ చేసి కాలు తీసేసారు. కొన్నాళ్లకు జైపూర్ వెళ్లి కుత్రిమ కాలు పెట్టించారు మా అక్క బావగారు.

నేను అవిటిదాన్ని శ్రీ. నీతో కలసి ఏడడుగులు వేయలేని దౌర్భాగ్యురాలిని.. ఈ విషయం నీతో చెప్పలేక ఎంత మధన పడ్డానో తెలుసా ? అలా ఎప్పటకీ దాచిపెట్టాలని భావించడం నా మనస్తత్వం కాదు. ఆ అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను !


ఇదిగో ఆ అవకాశం వచ్చేసింది.. గుండెలు బ్రద్దలయ్యే నిజాన్ని నీ ముందు పెట్టేసాను.. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంది.. నీ ముఖం చూడలేకే నీనుండి తప్పించుకోవాలని నీవు ఇక్కడకు వచ్చేముందే ఇంటినుండి బయటకు వచ్చేసాను.. నీవు వస్తానంటే ఎందుకు నిన్ను ఉత్సాహపరచలేదో ఇప్పటికి అర్ధమై ఉంటుంది..


నన్ను క్షమించు శ్రీ ! నీవు ఇక్కడకు వచ్చి ఏమి మాటలాడతావో తెలుసు. నీ ఎదురుగా నిలిచే ధైర్యం లేదు నాకు !


నానుండి వెళ్లి పో శ్రీ ! నా జీవితంలోకి నీవు అలా ఒక మలయమారుతంలా వచ్చి వెళ్లిపోయావని అనుకుంటాను .


' నీ కనులముందుకు రాలేను....కానీ నా కనులనిండా నిన్నే దాచుకున్నాను

నీ చెవిలో గుసగుసలాడలేను... కానీ నా మది ఊసుల్లో నిన్నే నింపుకున్నాను

నీవు ఎదురుపడితే నిన్ను చూడలేను...కానీ నను తాకే గాలిలో నీ సవ్వడి వింటాను

నిన్ను దూరం చేసుకున్నా...నీ దరికి నే రాలేకున్నా....

నీ కోసమే పరితపిస్తాను...నీ ఊహలతోనే బతికేస్తాను జీవితమంతా '....!

నీకు ఏమీ కాని తపస్వి ! "

ఆ ఉత్తరం చదివిని హర్ష ఒక్క క్షణం అచేతనంగా ఉండిపోయాడు. తను తపస్వి బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించలేదు. అతి కోమలమైన ఆమె మనసు ఎటువంటిదో ఆమె కవితలే చెపుతాయి. తను ఎలా ఉన్నా ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కాని తపస్వి తనని సరిగా అర్ధం చేసుకోలేదు .


రెండు రోజుల తరువాత శ్రీ వెళ్లిపోయి ఉంటాడని ఊహించిన తపస్వి తన ఫ్లాట్ కు వచ్చి తన దగ్గర ఉన్న కీస్ తో ఫ్లాట్ మెయిన్ డోర్ తెరిచింది !


ఆశ్చర్యం.... ఎదురుగా సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్న హర్ష చటుక్కున తలెత్తి చూసాడు !


ఎదురుగా అపురూప లావణ్యరాశి... అలా తెల్లబోతూ ఆమెవైపే చూస్తున్న హర్ష ...


"మీరు... మీరు... " అంటుండగా


"ఆ నేనే శ్రీ .... నీకు ఏమీకాని తపస్విని !"


"ఏమిటీ, నాకు ఏమీ కావా" అంటూ ఒక్క ఉదుటున ఆర్తితో ఆమెను చేరిన హర్ష.... ఆమెను తన గుండెల్లో పొదుపుకుని .... "ఏదీ నా కళ్లల్లోకి చూసి చెప్పు తపస్వీ నాకు ఏమీ కావని ?

నేను ప్రేమించింది అందమైన నీ మనసుని మాత్రమే అంటే నమ్ముతావా ? మనిషి కి కేవలం అందమైన రూపం ఉంటే చాలా తపస్వీ ? ఆ రూపానికి అందమైన మనసు లేకపోతే ?

నాకు అతి కోమలమైన నీ మనస్సు చాలు.. నీవు నడిచే ప్రతిదారిలోనూ నీ పాదాలు కందకుండా నీకు పూలమార్గం వెయ్యాలని నేను ఆరాటపడుతున్నాను..

నా సర్వశ్వం నీవే" నంటూ ప్రేమగా ఆమె నుదుటిని చుంబించాడు .

అతని కౌగిలిలో మైమరచిన తపస్వి హర్ష చెవిలో గుస గుసగా

'మనసంతా నువ్వే నిండి ఉన్నావని

నా కన్నీటి ధారల్లో ప్రవహించే ప్రాణధారవు నీవని

స్వప్నంలో కూడా నిను వీడిపోలేనని

నా మది సవ్వడే నీవని

నీకెలా తెలుపను ప్రియతమా'


అంటూ పరవశంతో కనులు మూసుకుంది.

పౌర్ణమి జాబిలి ఈ ప్రేమికుల జంటను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంది!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


192 views0 comments

Comments


bottom of page