'Kuruvinda' written by Yasoda Pulugurtha
రచన : యశోద పులుగుర్త
“అమ్మాయ్, కురువింద!”
“ఆ ...అత్తయ్యా! పిలిచారా” అంటూ అత్తగారి దగ్గరకు వచ్చింది కురువింద.
“ఆ ఏమీ లేదులే తల్లీ . నేను గుడికి వెడ్తున్నాను, గుళ్లో ఎవరో స్వామీజీ వారి ప్రవచనాలు ఉన్నాయిట. చపాతీల్లోకి కూర చేసేసాను. పొద్దుట చేసిన తోటకూర పులుసు, కంది పచ్చడి ఉన్నాయి. ప్రమోద్ అన్నం తింటానంటే కాస్త బంగాళా దుంపలు వేయించు. ఆఫీస్ కేంటిన్ లో రోజూ ఏమి తింటాడో యేమో గాని, ఇంటికి రాగానే ఏమి కూరలు చేసానో అనుకుంటూ గిన్నెలు మూతలు తెరిచి మరీ చూస్తాడు. వాడికి తోటకూర ఆవపెట్టిచేసిన పులుసంటే మరీ ఇష్టం, దానిలోకి కాంబినేషన్ కందిపప్పు పచ్చడి ఉందంటే అసలు ఊరుకోడు. కాసిని బియ్యం కుక్కర్లో పెట్టి అన్నం వండేయ్ కురువిందా . అలాగే గోధుమ పిండి తడిపి పెట్టుకో. నేను రావడం ఆలస్యం అయితే చపాతీలు వత్తేయమ్మా” అంటూ వీళ్లు ఉంటున్న పక్క సందులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లింది రాజ్యలక్ష్మి గారు .
కురువింద పెళ్లై అత్తవారింటికి వచ్చి రెండు నెలలైంది. పుట్టిల్లు కూడా అదే ఊరు. ఇంజనీరింగ్ పాసై, ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా తెలుసున్న వారి ద్వారా పెళ్లి సంబంధం వెతుక్కుంటూ రావడం, మంచి సంబంధం అనుకుంటూ కురువింద తల్లి తండ్రులు కూతురికి పెళ్లి చేసేయడంతో ఉద్యోగ ప్రయత్నానికి తాత్కాలికంగా వాయిదా పడింది.
కురువింద పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగిన పిల్ల . తల్లి కురువిందని వంటింట్లోకి కూడా రానిచ్చేది కాదు. అయినా అవసరంలేదు వారికి. ఇంట్లో వంటమవిషి, పొద్దుటే వచ్చి సాయంత్రం వరకు వీళ్ల ఇంట్లోనే పనిచేసే పనమ్మాయి ఉండగా, ఏనాడూ, కాస్త కుక్కర్ కూడా పెట్టే అవకాశం రానేలేదు కురువిందకు . కురువింద తల్లికి అతిశయం జాస్తి. వంట రాకపోతేనేమీ, అయినా అదేమైనా గొప్ప విద్యా, నెట్ లో చూస్తూ అన్నీ చేసేయొచ్చు, అవసరం వస్తే తన బంగారు తల్లి ఆ మాత్రం మేనేజ్ చేయలేదా అన్న నమ్మకం అంతే .
కానీ ఇక్కడ కురువింద అత్తగారింట్లో అంతా విరుధ్దమే . వంటమనిషిని ని పెట్టుకోగలిగే స్తోమతు ఉన్నా, రాజ్యలక్ష్మి గారికి అన్ని పనులూ తనే స్వయంగా చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువ. మామూలుగా పని మనిషి పొద్దుటే వచ్చి అన్ని పనులు చేస్తున్నా, ఈవిడ కొన్ని పనులను పనిమనిషితో చేయించదు. గిన్నెలు తోమాక తిరిగి గిన్నెలు ట్యాప్ వాటర్ దగ్గర మరోసారి కడుక్కుంటారావిడ. వంటగది, దేవుడుగది, అలాగే వంట గట్టూ అవీ స్వయంగా ఆవిడే శుభ్ర పరచుకుంటారు. పొద్దుట కాఫీలు, టిఫిన్ లు, మధ్యాహ్నం వంట, రాత్రి డిన్నర్ అన్నీ ఆవిడే తయారు చేస్తారు. ఇంట్లో ఎవరేమి తింటారో తెలుసు కనుక ఆ ప్రకారం చక చకా చేసుకుంటూ పోతారు. కురువిందకు ఆవిడను చూస్తే ఆశ్చర్యం కల్గుతుంది. తన పుట్టింట్లో వంటామె రాకపోతే తల్లి పడే కంగారు గుర్తుకొచ్చింది . బయట హొటల్ నుండి టిఫిన్లు తెప్పించడం, కూరలకు ఆర్డరిచ్చి, రైస్ కుక్కర్లో అన్నం వండడం తెలుసు.
తనకేమీ పనిరాదు. అత్తగారు మొదటి మూడువారాలు తనకి ఏమీ పని చెప్పలేదు . ఒక పదిహేను రోజులనుండి నుండి చిన్న చిన్న పనులు చెప్పడం చేస్తున్నారావిడ. తనతో ఉండి చూడమంటున్నారు.కూరలు కట్ చేయమనడం, పోపు అవీ వేయించి ఇచ్చి మిక్సీలో పొడి లాంటివి చేయమనడం, ఏ పొడులు ఏఏ కూరలకు వాడాలో చెప్పడం, కాఫీలు కలపడం, ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీలు వేయడం, పెనం మీద దోసలు వేయడం లాంటివి అన్నీ దగ్గరుండి చేయిస్తున్నారు. ఒకసారి ఆవిడ కోడలితో ‘చూడు కురువిందా నీచేత పనులు చేయించాలని నా ఉద్దేశం కాదు. రేపు ప్రమోద్ ఉద్యోగరీత్యా ఎక్కడికైనా బదలీ అవ్వచ్చు, నీకు వంట వస్తే హొటల్ బాధలు ఉండవు. హాయిగా ఇంట్లో వండుకుని తింటే ఆరోగ్యాలు బాగుంటాయ’నేసరికి అవునంటూ తల ఊపింది కురువింద.
కురువింద ఆడబడుచు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆ అమ్మాయికి రాని పనంటూ లేదు. కిందటివారం రాజ్యలక్ష్మి గారు ఒక్కరూ ఎవరో బంధువుల ఇంట్లో పెళ్లంటూ విజయవాడ వెళ్తే, ఆవిడ వచ్చేవరకు ఆ అమ్మాయే ఇంట్లో అన్ని పనులూ , వంట చేసింది. చక చకా వంటింట్లో పెద్దవాళ్లు చేసినట్లుగా ఎంతో రుచికరంగా వంట చేసింది. దేవుడి దగ్గర దీపారాధన చేయడం, అన్నీ పొందిగ్గా సర్దేయడం అవీ చూస్తుంటే, తన కంటే రెండు సంవత్సరాలు చిన్నదైన ఆ అమ్మాయి చక చకా పనులు అలా చేస్తుంటే, కురువింద ఆ అమ్మాయిని చూస్తూ, నేనేమీ చేయలేకపోతున్నానే అని గిల్టీ గా ఫీల్ అయ్యేది . వదినా, ఈ కూర ఎలా ఉందో రుచి చూడవూ అంటూ, కురువిందను కూడా కలుపుకుంటూ అన్నిపనులూ నిర్వర్తించింది . అప్పటనుండీ కురువిందకు తను వంట నేర్చుకోవాలని, అందరికంటే బాగా చేసి, అందరి మెప్పూ పొందాలనే ఆరాటం మొదలు అయ్యింది.
మొత్తానికి రాజ్యలక్ష్మి గారు గుడి నుండి ఇంటికి వచ్చేసరికి కురువింద చిన్న చిన్న చపాతీలు వత్తి జాగ్రత్తగా చపాతీలు కాల్చి హాట్ పేక్ లో సర్దింది పొందికగా. ఇది తన మొదటి అనుభవం. మొదట పెద్క పెద్ద చపాతీలు వత్తబోతే అష్టవంకరలు వచ్చేసాయి. అందుకే చిన్న చిన్న చపాతీలు వత్తి కాల్చింది. అందరూ చాలా బాగా చేశావని, మెత్తగా బాగున్నాయని కామెంట్ చేసేసరికి చాలా గర్వంగా ఫీలయ్యింది . కురువింద భర్త ప్రమోద్ మాత్రం కురువిందని చిలిపిగా ఉడికించాడు ' నీవేనా చేసిందీ...నేను నమ్మన’నేసరికి రాజ్యలక్ష్మి గారు, ‘నమ్మకపోతే ఏమి చేస్తావురా, నీ ఎదురుగా చేసి చూపాలా ...పాపం కష్టపడి అన్ని చపాతీలు చేస్తే’ అంటూ కోడలిని వెనకేసుకొచ్చారు .
ఒక ఆదివారం నాడు రాజ్యలక్ష్మిగారు కురువింద తల్లితండ్రులను, తమ్ముడిని వారింటికి లంచ్ కు ఆహ్వానించారు . కురువింద తల్లి ఆవిడతో మా వంటావిడకు ఎలాగూ పని లేదు, మాతో తీసుకురానా, ఆమె చేస్తుంది వంట, మీకెందుకూ కష్టం అనగానే, ' రాజ్యలక్ష్మి గారు అయ్యో కష్టం ఏమీ లేదు వదినగారూ, ఇంతోటి వంటకు ఆమె ఎందుకు, నేను, మాకోడలు, మా అమ్మాయి లేమా, అందరం కలసి ఒక గంటలో చేసేయమూ అంటూ సున్నితంగా తిరస్కరించారు .
అనుకున్నట్లుగా, కూతురి అత్తవారింటికి తల్లి, తండ్రి తమ్ముడూ వచ్చారు. సాదరంగా ఆహ్వానం పలికారు అందరూ. కూతురు కనబడకపోయేసరికి, తల్లి రమాకుమారి రాజ్యలక్ష్మిగారితో, ' కురువింద లేదా, అల్లుడు తను బయటకు వెళ్లారా అని అడగ్గా, లేదు లోపలకి రండి అంటూ వంటగదిలోకి తీసుకుని వెళ్లారు. పాటియాలా డ్రస్ లో తలంటుపోసుకున్న జుట్టుని క్లిప్ తో బంధించి, హడావుడిగా వంటింట్లో మూకుట్లో గారెలను చిల్లుల గరిటెతో అటూ ఇటూ తిప్పుతున్న కూతురుని, బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ నిర్ఘాంతపోయారో క్షణం . తల్లి ని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా, ' అమ్మా ఒక్క క్షణం, మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవగానే వస్తానం’టూ... ‘ఉండు కాఫీ ఇస్తానం’టూ, ఒక వైపు గారెలు వేయిస్తూనే మరోవైపున ఫిల్టర్ లోనుండి కాఫీ డికాషన్ తీసి పాలు కలిపి వేడిచేసి రెండు కప్పుల్లోపోసి తల్లిని ఒకటి తీసుకోమని, తండ్రికి కూడా ఇమ్మనమని పురమాయించిన కూతురివైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం . వంటింట్లో కూతురొక్కతే అన్నీ చేసేస్తోంది . ఇదెలా సంభవం . కూతురికి అన్నంకూడా తనే కలిపి నోట్లోపెట్టేది పెళ్లి అయేంతవరకు. అటువంటిది, గారెలు వండడం, కాఫీ కలపడం... అంటే అంటే తన కూతురి చేత చాకిరీ చేయించేస్తున్నారన్నమాట ఇక్కడ . ఎంత దారుణం . అల్లారుముద్దుగా పెరిగిన తన కురువింద ' బంగారు తల్లి, పెద్ద దానిలాగ ఇక్కడ వంటలూ వార్పులూ... ఏమైనా వియ్యపురాలిని కడిగి పారేయాలనుకుంది. కూతురు అల్లుడిచేత వేరే కాపురం పెట్టించేయాలన్నంత ఆవేశం పొంగుకు వచ్చేసింది. ముఖం ముడిచేసుకుంది .
అందరూ డైనింగ్ టేబిల్ చుట్టూ కూర్చున్నారు. రాజ్యలక్ష్మిగారు కురువిందని తల్లి తండ్రితో భోజనానికి కూర్చోమని చెప్పి ఆవిడ వడ్జన చేయడం మొదలు పెట్టారు. వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయన్నారు వియ్సపురాలు, వియ్యంకుడు . మీ పొగడ్తలన్నీ మీ అమ్మాయికే చెందుతాయి నిజం చెప్పాలంటే.. అంటూ, మొత్తం వంట అంతా కురువిందే చేసిందని చెప్పారావిడ. తనని వంట ఇంట్లోకి రావద్దని , తనే స్వయంగా వంటంతా తయారుచేసి మిమ్మలని సర్ ప్రైజ్ చేయాలని రెండు రోజులనుండి ఒకటే ఆరాట పడుతోందని వియ్యపురాలివైపు చూస్తూ చెప్పిందావిడ. కురువింద తల్లి తండ్రికి ఒకటే ఆశ్చర్యం . వెంటనే కురువింద “అవునమ్మా, అసలు అత్తయ్య నాచేత ఏ పనీ చేయించేవారు కాదు. అన్నీ ఆవిడే చూసుకుంటారు. నేను ఖాళీగా ఉంటూ, ఏమీ చేయకుండా కూర్చోవడం నాకు చాలా గిల్టీగా ఉండేది. వంట చేయడం కూడా ఒక కళ అని నాకు మా అత్తయ్యను చూస్తే అర్ధం అయింది . నా ఇష్టం కొద్దీ అత్తయ్య దగ్గర అన్ని పనులూ, వంటలూ నేర్చుకున్నాను. నా వంటలు తిని మీరంతా మెచ్చుకుంటూ, నన్ను పొగడాలని ఆశపడ్డాను. దాని ఫలితమే అత్తయ్య తాను వంట చేస్తానన్నా, నేను ససేమిరా వద్దని బ్రతిమాలి ఈరోజు వంటంతా నేనే చేసి మిమ్మలని సర్ ప్రైజ్ చేయాలనుకున్నా”నని చెప్పేసరికి ఎంతో చేయితిరిగిన వాళ్లు చేసినంత రుచిగా తమ కూతురు వంట చేసిందని తెలిసి కురువింద తండ్రి అయితే పొంగిపోయాడు. గారెలు తింటున్న ప్రమోద్ చాలా బాగున్నాయి కురూ, క్రిస్పీగా భలే ఉన్నాయంటూ కురువిందని మెచ్చుకున్నాడు . కాని రమాకుమారి ముఖం మ్లానం అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు సంసారం చేసినా తనకు ఏమాత్రం వంట రాదు. వంటమనిషి మీద లేక హొటళ్ల మీద ఆధారపడే తను, కూతురికి ఏ పనీ నేర్పలేదు. పనిచేసే దౌర్భాగ్యం తన కూతురికి రాకూడదని కోరుకుంది . కాని కురువింద, ఇక్కడ ఎంతో ఇష్టంగా, అత్తగారి ద్వారా వంట వార్పూ నేర్చుకుని చక్కగా సంసారం చేసుకుంటూ, అత్తవారింట అందరికీ తలలో నాలుకలాగ ఉంటోంది . తను ఎంత పొరబడింది . ఇంకా నయం, తను నోరుజారి ఉంటే తనే లోకువ అయిపోయి ఉండేది అందరి దృష్టిలో .
ఇటువంటి సంధర్భాలలో ఒక ఆడపిల్ల తల్లిగా తను సంస్కారయుతంగా ప్రవర్తించి కూతురికి మంచి బోధించాలిగాని వారి మనసులలో విషబీజాలని నాటకూడదని పశ్చాతాపపడింది . సాయంత్రం వరకు సరదాగా గడిపిన రమాకుమారి వీడ్కోలు తీసుకుంటూ, తనకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి, ఎంతో హుందాగా అత్తవారింట ఆనందంగా ఉన్న తన కూతురిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది .
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub.Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాకా పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ మా శ్రీ వారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం
Comments