top of page

మమతలూ - అనుబంధాలు

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.


Mamatalu - Anubandhalu Written By Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త


అప్పుడే అమెరికాలోని చిన్నకూతురు ' నిత్య ' ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో .

కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది అనూరాధ . పెళ్లిచేసి ఆరునెలలు అయింది కూతురికి .

అప్పుడే శుభవార్త అందించింది . జస్ట్ కన్ ఫర్మ్ అయింది మమ్మీ, రెండవనెల అంటూ.... దేనికో గునిసింది .

మమ్మీ నాకు అయితే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా, మరేమో రాజేష్ కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు, టర్మినేట్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను.

ఈమాట వినగానే అనూరాధ కోప్పడింది . పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నిత్యా , అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవలసింది . ఇప్పుడు టర్మినేట్ అన్నమాట అనకు, చంపేస్తాను అని కోప్పడింది .

మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా, అనగానే .. ఊహు.. లేదు మమ్మీ.. రాజేష్ చెప్పి ఉండవచ్చు . ఒక్క క్షణం మమ్మీ, ఏదో ఫోన్ వస్తోంది, మళ్లీ మాట్లాడతానని బై చెప్పింది నిత్య .

నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది కానీ, పెద్దకూతురు ' నవ్య' నిన్ననే ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ నాకు రెండవ నెల అని కన్ ఫర్మ్ చేసింది, డాక్టర్ అని .

పెద్గ కూతురికి సెకండ్ డెలివరీ. అది ,దాని భర్త, మూడేళ్ల కొడుకు ' పూనే 'లో ఉంటారు. దాని అత్తగారు మామగారు రాజమండ్రీ లో వారి సొంత ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అనూరాధ కి పచ్చి వెలక్కాయ గొంతుకలో పడినట్లైంది. చిన్నకూతురి డెలివరీ కి తను వెళ్లలేదు. పెద్ద కూతురి అత్తగారికి పాపం కీళ్లనొప్పులు. లేచి పని చేసుకోలేరు. రాజమండ్రీ కాబట్టి పనిమనిషి సాయంతో ఏదో సర్దుకుపోతోంది ఆవిడ. కోడలి డెలివరీకి ఆవిడ ఏమీచేయలేదు . తన అవసరం పెద్దకూతురికి ఉంది అలా అని నిత్యకు లేదా అనికాదు . నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే. ఒక్క ఆరునెలలు ఆవిడ అమెరికా వెళ్లి నిత్యకు డెలీవరీ అదీ చూసుకుంటే ఆరునెలల తరువాత తను వెడుతుంది .

ఏది ఏమైనా ఈ శుభవార్తను నిత్య అత్తగారితో చెప్పినట్లూ ఉంటుంది, చూచాయగా ఇక్కడ తన పరిస్తితి ఏమిటో వివరించినట్లుగానూ ఉంటుందని ఆవిడకు ఫోన్ చేసింది .

వారి లేండ్ లైన్ కు చేయగానే నిత్య మామగారు ఫోన్ తీసారు . ఆయన గొంతు వినగానే... నమస్కారం అన్నయ్యగారూ, బాగున్నారా, వదిన గారు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తూనే, మీరు తొందరలో తాత గారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్యగారూ, అనగానే, అవునమ్మా,మా రాజేష్ చెప్పినప్పటి నుండీ ఆనందంగా ఉంది, మీ వదిన అయితే నిన్న స్వీట్స్ తయారుచేసి చుట్టుపక్కల వారికి పంచిందని.. ఉండమ్మా, మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకు ఇచ్చారు .

అవతల నుండి హలో వదినగారూ అన్న పలకరి పుకు ఇక్కడ అనూరాధ నమస్తే వదినగారు అని చెపుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు . నిన్న వాళ్లబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు.

ఆ... వదినా, " మీకు మరో శుభవార్త, మా పెద్దది కూడా కన్సీవ్ అయిందని చెపుతూ, రెండవనెల అంటూ, అక్కచెల్లెళ్లిద్దరూ ముందరే అనుకుని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు . ఈ లోగా అనూరాధ చూచాయగా తన పరిస్తితి వివరించింది .

అయ్యో వదినా, ఈ విషయానికేమీ కంగారు పడకండి . మనలో మనకేమిటీ, సర్దుకుందాం, మీరు టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మాయి డెలివరీ చూసుకోండి, మేము మా కోడలి డెలివరీకి వెడతామని ధైర్యం చెప్పేసరికి... హమ్మయ్య అనుకుని తేలికగా నిట్టూర్చింది . ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య అత్తగారు, నిత్య అదృష్టవంతురాలని మురిసిపోయింది .

నిత్యకు పెళ్లిసంబంధాలు చూస్తున్నపుడు నిత్య బోల్డన్ని కండిషన్లు పెట్టింది . తను చేసుకోబోయే అబ్బాయి అందం, చదువు, ఉద్యోగం సరే, చివరకు తన అత్తమామలు ఎలా ఉండాలో కూడా చెపుతూ, వాళ్లు నేను అనుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది . అత్తగారూ మామగారూ కూడా సిటీ కల్చర్ లో పుట్టి పెరిగిన వారై ఉండాలని, ఆంధ్రా వైపు పల్లెటూళ్లో ఉన్నవారైతే చేసుకోనని . అక్కడ ఉన్నవాళ్లు ఛాదస్తంగా ఉంటారని, అతిచనువు ప్రదర్శిస్తూ, అన్ని విషయాలలో కలగచేసుకుంటారని, అలా తనకు ఇష్టం లేదని, రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉండాలని, కల్చర్డ్ గా ప్రవర్తించాలని .

ఈ విషయం విని, తనూ, నిత్య నాన్నగారూ, దానికి అర్ధమయాయేలా చెప్పాం . ఏం అక్కడ ఉంటున్న వాళ్లు మనుషులు కారా, మేముకూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగ రీత్యా సిటీ వచ్చామని . మీరు మరి ఛాదస్తంగా ఉండరుకదా, మమ్మలని స్వేఛ్చగా పెంచారుకదా అంటూ ఏదో వాదించబోయింది. కాదని సర్ది చెప్పాం. ఎక్కడ పుట్టి పెరిగినా మంచికుటుంబమా కాదా అన్నది ముఖ్యం, కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు, అతని తల్లుతండ్రులు కూడా నీకు ముఖ్యం, గౌరవించాలని. మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు, అందం, ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా, వాళ్లది పల్లెటూరు అయినా, మంచివారు, మంచికుటుంబం అని నచ్చచెప్పి ఒప్పించాం . ఆ... వాళ్లు మాతో ఉండరగా, ఎప్పుడైనా వెకేషన్ కు వచ్చినపుడే కదా, చూద్దాములే అనుకుంటూ నిత్య పెళ్లికి ఒప్పుకుంది . పెళ్లి అయిన పదిరోజులకే తన భర్తతో అమెరికా వెళ్లిపోయింది కాబట్టి, అత్తవారింట ఎక్కువ రోజులు ఉండే పరిస్తితి లేకపోయింది .

మరునాడు తనే కూతురికి ఫోన్ చేసింది . మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్యా అంటూ .

నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ, కాని, రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాటలాడుతుందట నీతో అని ఇస్తాడు మమ్మీ . నిన్న ఆవిడ మాటలాడుతూ, ఆరోగ్యం జాగ్రత్త అని, టైమ్ కు తినమని, పళ్లు తినమని, పాలు తాగమని ఓ... గాడ్, ఏవేవో జాగ్రత్తలు, బోర్ కొట్టింది మమ్మీ . అసలుకే ఆంధ్రావైపు పల్లెటూర్లలో ఇదేదో అతి పెద్ద విశేషం అన్నట్లుగా మాటలాడేస్తారు కదూ .

అలా అనకూడదు నిత్యా, ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు ? నీమీద కన్సర్న్ ఉంది కాబట్టి, జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు. దాన్ని ఛాదస్తంగా కొట్టిపడేయడం చాలా తప్పు నిత్యా .

అయినా, అదేమిటే నిత్యా , రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నీవు మాట్లాడతావా ? మామూలుగా నీ అంతట నీవు ఫోన్ చేసి మీ అత్తయ్యా, మామయ్యతో ఎందుకు మాట్లాడవు? నాకు ప్రతీ రోజూ ఫోన్ చేస్తావు. ఒక్కొక్కసారి రోజుకు రెండుమూడు సార్లు కూడా మాట్లాడతావు .

ఆవిడతో రోజూ మాట్లాడకపోయినా, రెండు మూడురోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుగోలుతనంగా మాటలాడుతుంటే, ఎంత ఆనందపడతారు ? పాపం కొడుకు, కోడలు అమెరికాలో ఉన్నారు, వాళ్లిద్దరూ ఎక్కడో పల్లొటూళ్లో . నీ పలకరింపులు వారికి ఒంటరిగా ఉన్నామనే ఆలోచన లేకుండా చేస్తుంది .

వింటున్నావా నిత్యా ? ఏంటి మమ్మీ, పొద్దుట పొద్దుటే లెక్చర్లు . నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నీవే చెప్పాలా .

సరేలే నిత్యా, పిల్లలకు తెలియకపోతే తల్లితండ్రులు నచ్చ చెపుతారు . పోను పోను నీకూ అర్ధం అవుతుందిలే .

నిన్న మీ అత్తగారితో చెప్పాను, పురుటికి అమెరికా నేను వెళ్లడం కుదిరేలా లేదని .

అదేమిటి మమ్మీ, నీవు రావా అయితే ?

అయ్యో అదే కదే చెప్పబోతున్నాను. మీ అక్క అత్తగారికి కీళ్ల నొప్పులు ఎక్కువ అయ్యాయిట . మోకాలి ఆపరేషన్ చేయించుకోవలసి వస్తుందిట . వైజాగ్ లో ఆవిడ చెల్లెలు ఉన్నారుగా, ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్ లో చేయించుకో మంటున్నారుట . మరి నేనుఅక్క దగ్గర ఉండాలి కదా నిత్యా . ఇద్దరికీ ఒకేసారి .

ఏమిచేయాలిరా దేవుడా అనుకుంటే, పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి, మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటానని మాట ఇచ్చారు . ఎంత మంచావిడ నిజంగా.

మమ్మీ ఆవిడ ఎంత మంచావిడ అని నిన్ను నేను ' రేటింగ్ ' అడిగినప్పుడు నీవు చెబుదువుగాని .

సంధర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలనే ఆత్రుత కనిపిస్తోంది నీ మాటల్లో .

అయితే, నీవు నా డెలివరీకి రాలేవు, నేను ఆ పల్లెటూరి చాధస్తాలన్నింటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అర్ధం . ఇన్ని సంవత్సరాలనుండి పల్లెటూరు లో ఉంటున్నవారు ఒక్కసారి అమెరికా రావడం, అదీ నా డెలివరీకి, ఇక్కడ పధ్దతులూ, వాతావరణానికి అలవాటు పడడం... బాబోయ్... ప్రతీదీ నేను వాళ్లకు చెపుతూ, దగ్గర ఉండీ అన్నీఅది ఇలా, ఇది అలా అని చెపుతూ ఉండాలి .

నేను వచ్చినా అంతే కదా నిత్యా ?

మమ్మీ.. నీవు అలా కాదు. చదువుకున్నదానివి, ఒక్కసారి చెపితే అల్లుకుపోతావు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలవు .టెక్నాలజీ ని తొందరగా గ్రేస్ప్ చేయగలవు .

అందరూ నీలా చేయలేరు కదా మమ్మీ .

సరే, నిత్యా, నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకూ . ఆవిడ కూడా బాగా చేయగలరు .

ఆవిడ మాటల్లో ఇదేమీ పెద్ద సమస్యకాదుకదా వదినగారూ అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు .

పోనీ, ' అక్క డెలివరీ కి ఆవిడని అంటెండ్ అవమని, మీ కోడలికి నేనే కావాలిట ' అని చెప్పనా, ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషి .

మహాతల్లీ, " ఆపని చేయకమ్మా " . నీవు నీ పెద్ద కూతురికే చేయి... నా సంగతి నీ కెందుకు, నా పాట్లు నేను పడతానంటూ.. ఠపీ మని ఫోన్ పెట్టేసింది .

నిత్య పెంకి తనానికి అనూరాధ ముసి ముసిగా నవ్వుకుంటూ పెళ్లి అయి, తల్లి కాబోతున్నా, దీని పెంకితనం పోలేదు, అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికెక్కించుకుంటున్నాడనుకుంటూ పనిలో పడింది .

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు .

అనూరాధ గారి కూతుళ్లిద్దరికీ సుఖ ప్రసవం జరగడం, పెద్దకూతురికి పాప, చిన్నకూతురికి పండంటి మగబిడ్డ కలగడంతో ఆ కుటుంబాల ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి .

ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్ .

ఏమిటి ' నిత్యా ' అనగానే, మమ్మీ నీకు తెలుసా, ఈ రోజ మా అత్తగారు బొప్పాయితో కూరచేసారు. యమ్మీ తెలుసా, మదర్ కి పాలు బాగావస్తాయిట. నీవు అక్కకు కూడా చేసిపెట్టు అంటూ .

మరొకరోజు, మా అత్తగారు తెలగపిండిట, దానితో కూర చేసారని, వెల్లుల్లి కారం మంచిదట, భలే ఉంది తెలుసా అని . అలాగే పత్యాలు , పొడులూ, అంటూ స్పెషల్ గా చేస్తున్నారు, భలే ఉంటున్నాయి తెలుసా, మా అత్తగారు వండుతుంటుంటేనే మంచి సువాసనలు వచ్చేస్తున్నాయని ఊరికే గుక్కతిప్పుకోకుండా భోలెడు కబుర్లు .

ఒక రోజు అనూరాధ అడిగింది, నిత్యను, మరి మీ అత్తగారికి అక్కడ అన్నీ అలవాటు అయినాయా, డిష్ వాషర్ మొదలైనలి అని అడగ్గానే, మా అత్తగారికి ఒకసారే చూపించాను మమ్మీ, తరువాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు. పొద్దుటే లేచిపోతారు. అన్నీ ఫాస్ట్ గా చేసేస్తారు, ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా . ఇంటిని ఎంత నీట్ గా ఉంచుతారో తెలుసా . అలాగే బేబీని కూడా . బేబీ కి స్నానం కూడా కాళ్ల మీద పడుకోబెట్టుకుని , ఆయిల్ మసాజ్ చేస్తూ,నెమ్మదిగా భలే చేయిస్తారు . ఇక్కడ ఈమధ్య అందరూ ఇన్ స్టెంట్ పాట్ వాడుతున్నారని అప్పుడెప్పుడో నీకు చెప్పాను, కాని ఎందుకో కొనలేదు . మా అత్తగారు తెప్పించమని చెప్పారు. ఆవిడే మేన్యుయల్ చదివి ఉపయోగిస్తున్నారు. వంట చాలా తక్కువ సమయంలో వేడి వేడిగా హైజెనిక్ కా తినవచ్చు .

హమ్మయ్య, నా చిన్నకూతురుకి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు . మా నిత్య కోడిగుడ్డుకి ఈకలు పీకే రకం. శల్యపరీక్షలు చేస్తుంది . దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తిమీద పెట్టుకుని అభిమానిస్తుంది దాని ప్రవర్తన దాని అత్తగారిముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి, దాని అత్త మామలు అమెరికా వెడ్తున్నప్పుడు ఆవిడకు ఫోన్ చేసి మరీ చెప్పాను. నిత్యకి ఇంకా చిన్నతనం వదలలేదని, చిన్నకూతురని కాస్తంత గారం చేసామని, ఏదైనా తెలిసీ తెలియక మాట్లాడి బాధపెడితే దాన్ని క్షమించండంటూ . దానికావిడ రాధగారూ, నిత్య మీకెంతో నాకు అంతకం టే ఎక్కువ .మా కోడలు, మా ఇంటి పిల్ల . మీ అమ్మాయి మమ్మలని బాధ పెట్టేలా మాట్లాడే సందర్బమే రాదు . చిన్నపిల్లలు పొరపాటు చేస్తే ... దానిని వాళ్లంతట వాళ్లే గ్రహించి, మరోసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలేదా . మీరు కంగారు పడకండి రాధా అని ఎంత ప్రేమపూర్వంగా మాట్లాడారో .

ఆదివారం, మా అల్లుడు అతని తల్లితండ్రులను ఏదో మాల్ కు తీసుకుని వెళ్లాడని, బేబీకి కాస్త జలుబుగా ఉన్నమూలాన తను వెళ్లలేదని చెపుతూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెపుతుంటుంటే దాని మాటల్లో బోల్డంత ఆశ్చర్యం, ఎక్సైజ్మెంట్ . నిన్న వాళ్ల నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడడానికి వచ్చిందిట . నిత్య తన బెడ్ రూమ్ లో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిడను సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి మాటలాడడం మొదలు పెట్టారుట . వాళ్లు అలా మాటలాడుకుం టుండగా నిత్య బేబీతో రావడం, వాళ్ల దగ్గర కూర్చుని ఆమాటలు వినసాగిందిట . నిత్య అత్తగారు స్వఛ్చమైన ఇంగ్లీషులో ధారాళంగా ఆ అమెరికన్ యువతితో, ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారుట . డెలీవరీ అయిన తరువాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతుంటుంటే నిత్య అప్రభతిరాలైందిట . చక్కని ఇంగ్లీష్, తనుకూడా మాట్లాడలేని స్వఛ్తమైన ఇ గ్లీష్, ఒక్క గ్రామర్ మిస్టేక్ లేకుండా . ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి, బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్లబోతూ నిత్యతో అందిట " యూ ఆర్ సో లక్కీ టూ హేవ్ సచ్ ఎ నైస్ మదర్ ఇన్ లా అని .

ఆ రోజు రాత్రి నిత్య కేజువల్ గా రాజేష్ ను అడిగిందట , అత్తయ్యగారు ఏమి చదువుకున్నారని . ఎమ్.ఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడుట. ఆశ్చర్యపోయిందట . రాజేష్ అన్నాడుట, అమ్మకు సింపిల్ గా ఉండడం ఇష్టం, తను యూనీవర్సిటీ లో టాపర్ అయినా , తన చదువు గురించి గొప్పగా ఎవరికీ చెప్పదని, లీడింగ్ న్యూస్ పేపర్లకి, నేషనల్ మేగ్ జైన్స్ కి మంచి మంచి ఆర్టికల్స్ వ్రాస్తుందని, స్త్రీలు ఎదుర్కునే సమస్యలు, స్త్రీల హక్కులు, సోషల్ ఎవేర్ నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి వ్రాస్తూ ఉంటారని, అన్నీ లేప్ టాప్ లో టైప్ చేసి ఆయా పత్రికలకు, మైగ్ జైన్స్ కు పంపుతారని చెప్పేసరికి నిత్య కళ్లు వెడల్పుచేసుకుంటూ విందిట .

ఈమాట నిత్యకే కాదు, నేను కూడా వినీ ఆశ్చర్యపోయాను . అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి . చూడడానికి అతి సాధారణంగా ఉంటారు .

అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుందనడానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ .

నిత్య అత్తగారు మామగారు వచ్చి అయిదునెలలు కాలం గడచిపోయింది. ఆరునెలల తరువాత ఏమిటి పరిస్తితి అని అనుకుంటున్నారు. నిత్య జాబ్ ప్రయత్నాలలో కూడా ఉంది .

నిత్య రాజేష్ ల బేబీ వాళ్ల బామ్మగారి దగ్గర బాగా అలవాటైంది .

ఒకరోజు రాజేష్ వాళ్ల తల్లితండ్రులతో అన్నాడుట, మరి మీ ప్రయాణం దగ్గర పడుతోంది కదా, మీరు వెళ్లిపోతే మా అత్తయ్యగారిని పిలిపించుకోవాలి, ముందరే టిక్కెట్లు అవీ చూడాలి అంటూ . దగ్గరే ఉన్న నిత్య గబుక్కున వాళ్ల అత్తగారి ఒళ్లోకి దూరి , అత్తయ్యా, మరో ఆర్నెల్లు ఉండిపోరూ అని బ్రతిమాలిందిట . నిత్య కళ్లల్లో కన్నీరుట . ఈ విషయం నిత్య అత్తగారు అనూరాధకు ఫోన్ లో చెపుతూ... వదినగారూ, ' అమ్మా ఇంకో ఆర్నెల్లు ఉండిపోవా' అని మా రాజేష్ అడిగితే ఒప్పుకునేవాళ్లం కాదు, కాని అడిగింది మా నిత్య . నిత్యను బాధపెట్టలేను, అందుకనే మరో ఆరెనెల్లు పొడిగిస్తున్నామని .

ఆ మరుసటిరోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ... ఏయ్, నిత్యా, నేను రావడం లేదని ఆరోజు ఏమన్నావో గుర్తుచేసుకో, " నీవు నీ పెద్ద కూతురికే చేయి... నా సంగతి నీ కెందుకు, నా పాట్లు నేను పడతానంటూ కయ్య్ మన్నావ్ . ఇప్పుడు నీకు అమ్మ కంటే మీ అత్తగారే కావలసి వచ్చేరు అవునా . అనగానే నిత్య ' నిజం మమ్మీ, మనిషిని కేవలం ఒక్క చూపుతోనే అంచనా వేయకూడదు , కొంతమంది సింపుల్ గా ఉన్నా ఎన్నో మంచిగుణాలను అసాధారణ తెలివి తేటలను కలిగి ఉంటారు, సింపిల్ గా ఉండడం వారినైజం అంతే . నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ, నీవు చెప్పినా నాకు అర్ధంకాలేదు . కాని ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను, నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది . తన చిన్నారి కూతురి విషయంలో ఇంక నిశ్చింతగా ఉండవచ్చని .


రచయిత్రి ఇతర రచనలు :487 views0 comments

Comments


bottom of page