top of page

సొంత ఇంటి కల

Sontha Inti Kala Written By Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త


విశ్వనాధం టెక్నికల్ బోర్డ్ లో ఎల్.డి.సి. గా పని చేస్తున్నాడు. అతను ఆ ఆఫీస్ లో చేరేనాటికి డిగ్రీ కూడా లేదు. పి.యు.సీ పాస్ అయి టైప్ రైటింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ తో వచ్చింది ఆ ఉద్యోగం. .

కొడుకు స్థిరపడ్డాడు కదా అని అతనికి పెళ్లికూడా చేసారు తల్లితండ్రులు .విశ్వనాధానికి ఒక అక్క .ఆ అమ్మాయి అందగత్తె కావడంతో, కలిగిన కుటుంబంవారు ఆ అమ్మాయిని ఏదో పెళ్లిలో చూసి కట్నకాలుకలు తీసుకోకుండా పెళ్లిచేసుకోవడంతో, విశ్వనాధం తండ్రి ఒక బాధ్యత తీరిందనుకున్నాడు .

విశ్వనాధం భార్య అనూరాధ అత్తవారింటికి వచ్చింది. చాలా సౌమ్యురాలు ఆ అమ్మాయికూడా SSLC పాసై, అతి సాధారణమైన కుటుంబం నుండి వచ్చినదే . ఆ అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకునేది . కాని విశ్వనాధానికి భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదు . పెళ్లైన కొద్దినెలలకే ఆమె గర్భవతి అవడంతో అనూరాధ కూడా తన ఆలోచనని అమలు పరచడానికి ఎక్కువ ప్రయత్నం చేయలేదు.

పిల్లల పెంపకం, అత్తగారి మామగారి సేవలతో అనూరాధ ఇంటికే అంకిత మయిపోయింది . కాని ఆమెకు చదువుమీద ఉన్న అభిలాషతో భర్తను ప్రైవేట్ గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ చదవమని ప్రోత్సహించేది . డిగ్రీ అయితే ఉద్యోగంలో పైకి రావచ్చు కదా అని ఆమె తాపత్రయం . విశ్వనాధం బధ్దకస్తుడు .ఆఫీస్ కు వెళ్లిరావడం తప్పించితే మరో పని చేతకానివాడు .

భర్తకు వచ్చే చిన్న జీతం, అత్త మామలు, పిల్లల ఖర్చులు వీటిని చూసుకుంటూ చాలా పొదుపుగా సంసారం చేసేది అనూరాధ .

పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చేసరికి అత్తమామలిరువురూ రెండేళ్ల వ్యత్యాసంలో స్వర్గస్తులైనారు . కాస్త స్థిమితపడ్డాక భర్తను ప్రోత్సహిస్తూ, డిగ్రీ చదివేలా చేసింది .

అనూరాధకు ఎక్కువ కోర్కెలు లేకపోయినా, తమదంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవాలని కోరిక ఉండేది . ఇంటి అద్దెలు చూస్తుంటే దారుణంగా పెంచేస్తున్నారు . తాము ఉంటున్న రెండుగదులు, చిన్న హాలు, వంటింటికే అయిదువేలు పోస్తున్నారు .

మొత్తానికి విశ్వనాధం డిగ్రీ పూర్తిచేసాడు .ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నాడు .

ఒక రోజు విశ్వనాధం ఆఫీసునుండి ఇంటికివచ్చాక, రాత్రి భోజనాల టైమ్ లో భార్యతో చెప్పాడు. అతని ఆఫీస్ కొలీగ్స్ చాలామంది, అక్కడెక్కడో స్థలాలు చవకగా దొరుకుతుంటే కొనుక్కుంటున్నారని, చదరపు గజం రూ. 25/- చొప్పున మూడువందల చదరపుగజాలు రూ.. 7500/-అని చెప్పేసరికి, అనూరాధ హమ్మో! అంటూ గుండెలమీద చేతులేసుకుంది . మనం ఎలా కొనుక్కోగలం అంటూ నిట్టూర్చింది . దానికి విశ్వనాధం, ఆంధ్రాబాంక్ వాళ్లు ఆ స్థలాల కొనుగోలుకి అయిదువేలు లోన్ ఇస్తామని ముందుకు వచ్చారని, ప్రతీనెల రూ.200/- చొప్పున 25 నెలలు జీతంలో కట్ చేస్తారుట అని చెపుతూ మిగతా డబ్బులు మనం కట్టుకోవాలని చెప్పేసరికి అనూరాధ ఆలోచనలో పడింది . విశ్వం చెపుతున్నాడు, ఇంకా ఆ ప్రదేశం నివాస యోగ్యంగా లేదని, భవిష్యత్ లో డెవలప్ అవుతుందని చెపుతున్నారని .

ఏమో భర్త రిటైర్ అయినాకైనా ఆ స్తలం లో ఇల్లు కట్టుకోగలమేమో అనుకుంటూ, విశ్వంతో వెంటనే అంది , మనం కూడా తీసుకుందాం నెలకు 200 రూ. లోన్ కటింగ్ పోతే కష్టమేకాని, చూద్దాం, కావాలంటే ఎందులోనైనా ఖర్చు తగ్గిద్దాం అని చెపుతూ, నా మంగళ సూత్రం గొలుసు బేంక్ లో పెట్టి లోన్ తీసుకోండి . అలా అనగానే విశ్వం అనూరాధ వైపు చూస్తూ... అదేమిటి అనూ, మెడలో గొలుసుకూడా లేకుండా ఉంటావా, అనేసరికి... 'ఫరవాలేదులెండి, రేపు మీకు ప్రమోషన్ రాదా, మీ జీతం పెరగదా. ఇలాగే ఉంటామా, ఎప్పుడూ ....... అంటూ ప్రోత్సహిస్తూ, మరునాడు విశ్వం ఆఫీస్ కు వెళ్లేటప్పుడు, ఆ గొలుసు పొట్లం కట్టి ఇస్తూ, జాగ్రత్త సుమా, వెంటనే ఆ పని చేయండి అని చెప్పింది.

విశ్వం భార్య మెడవైపు చూసాడు ఒక్క క్షణం. ఆ గొలుసు స్తానంలో పచ్చని పసుపుతాడు .చెప్పినా వినవుకదా, మొండిదానవు దొరికావు నాకు అంటూ జాగ్రత్తగా ఆ పొట్లాం పేంట్ జేబులో పెట్టుకుని ఆఫీసుకు వెళ్లిపోయాడు .

ఆ తరువాత నాలుగు రోజులకు విశ్వం అనూతో చెప్పాడు. బేంక్ లోన్ శాంక్షన్ అయిందని, గోల్డ్ లోన్ లో తీసుకున్న రూ.2500/- అడ్వాన్స్ పేమెంట్ కట్టేసానని .ఒక నెలరోజుల్లో రిజిస్ట్రేషన్, ప్లాట్స్ ఎలాట్ మెంట్ చేసేస్తారుట అని .

అలాగే విశ్వం అన్నట్లుగా నెలరోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ , ఎలాట్ మెంట్ జరిగిపోవడం, ఆ డాక్యుమెంట్లు అవీ తెచ్చి భార్య చేతికి అందించాడు .

ఆ తరువాత కొద్ది నెలలకు విశ్వానికి యు.డిసి గా ప్రమోషన్ రావడం, ప్రమోషన్ తో బాటు ఎరియర్స్ వచ్చేసరికి భార్య గొలుసు విడిపించి తెచ్చాడు .

రోజులూ, సంవత్సరాలు గడచిపోతున్నాయి. విశ్వం అనూరాధా పిల్లలు అమ్మాయి ఇంటర్ మీడియట్ , అబ్బాయి టెన్తె పాసైనారు. పిల్లలకు ఇంజనీరింగ్, మెడిసన్ చదివించే ఆర్ధిక స్తోమతు లేదు . అందుకే అమ్మాయిని బి.కామ్ లో చేర్పించారు . అబ్బాయిని పాలిటెక్నిక్ కాలేజ్ లో చేర్చారు. .

విశ్వం అప్పుడు బేంక్ లోన్ పెట్టిన స్తలం అలాగే ఉంది. అక్కడ ఏమీ డెవలెప్ మెంట్ లేదని, అక్కడ కొని డబ్బు వృధాచేసుకున్నారని అందరూ అంటున్నారని చెప్పాడు. అమ్మేద్దామన్నా ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదని చెప్పాడు . అనురాధ అనుకోసాగింది " నిజమే మనలాంటి వాళ్లు కొంటే అంతే, అదే ఉన్నవాళ్లు కొంటే ఇప్పటికి వాటికి ఎన్నో రెక్కలొచ్చి ఉండేవని " .మధ్యతరగతి జీవితాలు ఇంతేనని నిట్టూరుస్తూ, అటువంటి వాటిమీద ఆశ పెట్టుకోవడం, కలలు కనడం వృధా అనుకుని నిర్లిప్తంగా ఊరుకుంది .

విశ్వం కూతురు బి.కామ్ పూర్తి చేసింది .విశ్వం అక్క ఉన్నట్టుండి విశ్వం కూతురికి ఒక మంచి సంబంధం తెచ్చింది .అనూరాధకు కూతురుకి అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు. కాని విశ్వం అక్క ఊరుకోలేదు. అబ్బాయి తన తోటికోడలుకి బంధువులు అవుతారని, ఇంజనీరింగ్ చదివి, TCS లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని, ఆ అబ్బాయి తల్లితండ్రులిద్దరూ కూడా గవర్న్ మెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారని, ఒక్కడే కొడుకంటూ, ఆస్తి పాస్తులు ఉన్నవారని చెపుతూ, మన కీర్తన వారికి తప్పక నచ్చుందని గట్టిగా చెప్పేసరికి, సరే చూద్దామని చెప్పారు . విశ్వం అనూరాధ అలా చెప్పేసరికి విశ్వం అక్క అన్నీ మధ్యవర్తిగా తనే వ్యవహరిస్తూ, పెళ్లి చూపుల దగ్గరనుండి, పెళ్లి అయేంత వరకు తనే దగ్గరుండి అన్నీ నిర్వహించింది .కల్యాణ మొచ్చినా, కక్కువచ్చినా ఆగదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలి ?

అనుకోకుండా కూతురి పెళ్లి కలసిరావడంతో, విశ్వం పి.ఎఫ్. లోన్ కొంత, అనూరాధ లక్ష రూపాయలకు మార్గదర్శి చిట్ వేస్తోంది, ఇంట్లో ఖర్చులను తగ్గించుతూ .ఆ చిట్ కూడా ముగింపుకు దగ్గర పడడం తో అది కూడా తీసుకుని, కూతురు పెళ్లి చేసేసారు .ఉండడానికి కనీసం టూ బెడ్ రూమ్ ఫ్లాట్ అయినా కొందామనే వారి ప్రయత్నం ముందుకు జరిగిపోయింది . అసలు తమలాంటివారకు అది సాధ్యమేనా అనుకుంటుంది అనూరాధ .

మరో మూడు సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయాయి .

విశ్వం కొడుకు పాలిటెక్నిక్ పూర్తి చేయడం, ఇంజనీరింగ్ చదువుతానని పేచీపెట్టడం జరిగింది. .ఎంట్రన్స్ పరీక్ష కూడా వ్రాసాడు .

కొడుకు ఇంజనీరింగ్ చదివితే తనలాగ చాలీ చాలని జీతంతో బ్రతకనవసరం లేదు కదా, వాడి భవిష్యత్ అయినా బాగుంటుందని , భార్సతో కలసి ఆలోచించి బేంక్ లోన్ తీసు

కొడుకుని ఇంజనీరింగ్ లో చేర్చాడు .

విశ్వం రిటైర్ మెంట్ కూడా దగ్గర పడింది .తన కొడుకు ఇంజనీరింగ్ పూర్తిచేయడం, తన రిటైర్ మెంట్ దాదాపు ఒకే సంవత్సరంలో .

రిటైర్మెంట్ దగ్గర పడుతున్నా సొంత గూడు కూడా అమర్చుకో లేకపోయానని అనుకుంటాడు విశ్వం .ఇంకా అదృష్ట వంతుడే , కూతురు పెళ్లి, కొడుకు చదువు ని నిర్విఘ్నంగా పూర్తిచేయగలిగాడు .

సంసారంలోని ప్రతీ అవసరానికి , పి.ఎఫ్. లోన్లు, బేంక్ లోన్లు తీసుకునేసరికి తనకు ఏమీ సేవింగ్స్ మిగలలేదు. పోనీలే అప్పులు లేవనుకుని భార్యా భర్త లిద్గరూ తృప్తి పడ్డారు .

కాలం దేనికోసం ఆగదు .అనుకున్న రోజు వచ్చింది. విశ్వం రిటైర్ అయ్యాడు .

విశ్వం రిటైర్ అయినందుకు సంతోషంగా లేడు. ఏదో నిర్లిప్తత .

భార్య అనూరాధ, ఎందుకలా ఉన్నారంటూ తరచి తరచి అడిగింది .

ఏమీ లేదు అనూ... చిన్న సొంత ఇల్లుకూడా అమర్చుకోలేకపోయానే అన్న అసంతృప్తి. ఇన్నేళ్ల జీవితంలో నీ కంటూ ఏమి చేసాను ? ఒక్క నగైనా నీకంటూ కొన్నానా ? నా ఆర్ధిక పరిస్తితి చూస్తూ ...నీవు కూడా నన్ను ఏమీ అడగలేదు . ఈ రెండు అసంతృప్తులూ నాకు ఉండిపోయాయి అనూ .

ఫరవాలేదు, మీరు ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నారోనని భయపడ్డాను . జీవితంలో మనం చేయాలనుకున్నవన్నీ సాధ్యం కాదు . మనం చాలా అదృష్టవంతులం. పిల్లలు మనమీద ఆధారపడకుండా వారి బాధ్యతలను చక్కగా నెరవేర్చాం . మీకు వచ్చే పెన్షన్ తో మన జీవితాలు రెండూ గడచిపోతాయి . సంతోషంగా ఉండండి . మీకు ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. రేపటినుండి మీకోసం హడావుడి పడనవసరం లేదని .

ఆ రోజు ఆదివారం .కొడుకు రఘు ఇంజనీరింగ్ రిజల్ట్స్ రావడం, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం, కూతురు కీర్తనా అల్లుడూ ఈ విషయం తెలిసి అభినందించడానికి రావడం జరిగింది. ఇల్లంతా పండగ వాతా వరణం చోటు చేసుకుంది.


ఈలోగా విశ్వం ఆఫీస్ కొలిగ్ శ్రీనివాస్ మూర్తి హడావుడిగా వీరింటికి వచ్చారు . వస్తూనే విశ్వం చేతులు పట్టుకుని ఊపేస్తున్నాడు .

విశ్వం భార్య ఆయనని పలకరిద్దామని వచ్చి వారిమాటలు వింటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది .

అప్పట్లో విశ్వం వాళ్లూ కొన్న స్తలాలకు రెక్కలొచ్చాయని, అనూహ్యంగా వాటి ధర పెరిగిందని చెపుతున్నాడు విశ్వం స్నేహితుడు మూర్తి .

ఏనాటి స్తలం .

పది సంవత్సరాలనుండి దాని గురించి దాదాపు అందరూ మరచిపోయారు .

ఈ మధ్యకాలంలో అక్కడ ఐ.టి . హబ్ నిర్మాణం జరిగిందని, సాఫ్ట్ వేర్ కంపెనీలెన్నో అక్కడ తమ కంపెనీ నిర్మాణాలకు పోటీ పడుతున్నారని, ఉద్యోగులకు చాలా సదుపాయంగా ఉన్నమూలాన, రహదారి మార్గాలు బాగా ఉన్నమూలాన , చదరపు గజం, ముఫైవేలు పై చిలుక పలుకు తోందని, బ్రోకర్లు అమ్మడానికి, కొనడానికీ కూడా పోటీ పడుతున్నారని, ఈ మధ్యనే, తమ కొలీగ్ రాజారావు తొంభైలక్షలకు తన స్తలాన్ని అమ్మివేశాడని చెప్పేసరికి విశ్వం, అనూరాధకు నోట మాటరాలేదు .మీకు కూడా అమ్మే ఉద్దేశ్యం ఉంటే ఒక భ్రోకర్ ఫోన్ నంబర్ ఇచ్చి వివరాలు తెలుసుకోమని చెప్పి " ఆల్ ది బెస్ట్ ' చెప్పి వెళ్లిపోయాడు .

కార్తీక మాసంలో ఒక మంచి రోజున గృహప్రవేశం ముహూర్తం పెట్టుకుని విశ్వం, అనూరాధ దంపతులు తమ బంధువులను, స్నేహితులను తమ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానిస్తున్నారు.

ఒక మంచి ఏరియాలో ఏభై లక్షలు పెట్టి చక్కని పొందిక అయిన అపార్ట్ మెంట్ కొనుకున్నారు .

వాళ్ల ఆనందానికి అవధులు లేవు . తమ కష్టార్జితం వృధా కాలేదు . ఎన్నో రెట్లు అదృష్టాన్ని తెచ్చి ఇచ్చింది .

సొంత ఇల్లు ప్రాప్తం తమకు లేదని నిరాశ పడ్డారు .

ఒక్క పైసా అప్పులేకుండా... తమకంటూ ఒక చక్కని అందమైన పొదరిల్లు ఏర్పరుచుకున్నారు .

భార్యకు, కూతురుకూ తలో అయిదు లక్షలూ ఇచ్చి వారికి నచ్చిన నగలు కొనుక్కోమన్నాడు విశ్వం. తన అక్కకి ఒక మంచి పట్టుచీర కొని, ఆ పట్టుచీరతోబాటు ఒక లక్షరూపాయలు ఆడబడుచు కట్నంగా ఇచ్చాడు . తమ్ముడికి తన మీద ఉన్న ప్రేమకి ఆవిడ కళ్లు చెమర్చాయి .

మిగతా ముఫైలక్షలకూ బేంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు .

కలలోనైనా ఊహించని ఈ అదృష్టానికి మీరేమనుకుంటున్నారని అనూరాధ ఒకరోజున విశ్వాన్ని అడిగింది .

అన్నీ అర్ధం చేసుకుని, భర్తకు కష్టసుఖాలలో సహకరించే నీ లాంటి భార్య ఉంటే, ప్రతీ వారికీ ఇటువంటి అదృష్టం, సంతోషం దక్కుతాయని గాఢంగా విశ్వసిస్తున్నాను అనూ అంటూ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు విశ్వం .


రచయిత్రి ఇతర రచనలు :


194 views0 comments
bottom of page