top of page
Original.png

మానస వీణ

Jan 2, 2021
6 min read

Updated: Sep 15

గత ప్రేమ జ్ఞాపకాలతో బాధపడుతున్న మానసకు కొత్త జీవితాన్ని స్వీకరించమని ధైర్యం చెబుతున్న వదిన కౌసల్య – మానస వీణ తెలుగు కథ


Maanasa Veena - Telugu Emotional story | Yasoda Pulugurtha

మానస వీణ - తెలుగు భావోద్వేగ కథ | యశోద పులుగుర్త


ప్రేమ, దాంపత్యం, కుటుంబ అనుబంధాలు, మానసిక సంఘర్షణలతో సాగే యశోద పులుగుర్త గారి హృద్యమైన తెలుగు కుటుంబ కథ “మానస వీణ” చదవండి.


"వదినా!" అంటూ వంటింట్లో వంట చేసుకుంటున్న కౌసల్యను, సుడిగాలిలా వచ్చి చుట్టేసుకుంటూ భోరున ఏడుస్తున్న మానస వైపు ఆందోళనతో చూస్తూ... 

"ఏమైంది మనూ, ఏమిటీ ఆకస్మిక ఆగమనం?

నవీన్ కూడా వచ్చాడా నీతో, ఏడీ? హాల్లో కూర్చున్నాడా?"


"లేదు వదినా, నేనే వచ్చేశాను. అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఉండకూడదని. "


"ఏమైంది మనూ? వచ్చేయడమేమిటీ, ఏమి జరిగింది అసలు?"


"వదినా!" అంటూ ఒక్కసారిగా బావురుమంటూ ఏడ్వసాగింది మానస. 


"వదినా, నవీన్‌తో కలసి కాపురం చేయడం నా వల్ల కావడం లేదు... ఎంత మరచిపోదామన్నా నాకు నా గౌతమ్ గుర్తొస్తున్నాడు వదినా" అంటూ బేలగా, నిస్సహాయంగా కన్నీళ్లు పెడుతున్న ఆడపడుచు వైపు జాలిగా చూడసాగింది కౌసల్య. 

"అసలేమైంది మనూ?"


"ఏం చెప్పను వదినా... పెళ్లై మూడు నెలలైనా నేను అతనితో భార్యగా సంసారం చేయలేకపోతున్నాను. 'నాకు కొంచెం సమయం కావాలి నవీన్' అంటే సరే అన్నాడు. ఇద్దరం ఎవరి బెడ్‌రూమ్‌లలో వాళ్లం పడుకుంటున్నాం అప్పటి నుండీ. నిన్న రాత్రి నవీన్ తలనొప్పిగా ఉందని నుదుటికి కాస్త అమృతాంజనం రాయమని రిక్వెస్ట్ చేశాడు. రాద్దామని దగ్గరకు వెళ్లగానే నన్ను బలవంతంగా తన కౌగిట్లోకి తీసుకున్నాడు. గట్టిగా ప్రతిఘటించాను. 'తప్పేమిటి మానసా, ఇద్దరం భార్యాభర్తలం కదా, ఎన్నాళ్లు నాకు దూరంగా ఉంటావు?' అని సీరియస్‌గా మాట్లాడాడు. 


'అసలు పెళ్లే చేసుకోని గౌతమ్ గురించి అంతగా బాధపడిపోతున్నావే, నిన్ను పెళ్లి చేసుకుని కూడా నీ నుండి ఏ ఆనందాన్ని ఇంతవరకు పొందని నేను ఎంతగా బాధపడాలి మానసా? నా గురించి, నీ గౌతమ్ గురించి ఆలోచించిన దానిలో పది శాతం ఆలోచించినా నా బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. అయినా ఎప్పుడో చనిపోయి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన గౌతమ్ మీద ఇంకా అంత ప్రేమేమిటి?' అని ప్రశ్నించాడు వదినా. 


అతనన్న మాటలు వేరే ఎవరైనా అని ఉంటే వాళ్ల మొహం జన్మలో చూసేదాన్ని కాదు... మీ అందరి కోరికతో అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా విషయం అంతా నవీన్‌కు మా పెళ్లి ముందు చెప్పావు కదా వదినా! అన్నీ తెలిసీ కూడా నవీన్ నన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోతున్నాను వదినా. నవీన్ అన్న మాటలకు దుఃఖం వచ్చేసి నా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయి తలుపేసుకుని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను. ఆఫీస్‌కు కూడా వెళ్లలేకపోయాను. 


చచ్చిపోయిన గౌతమ్ మీద ఇంకా ప్రేమేమిటంటాడా?

గౌతమ్ మీద ప్రేమ నేను చచ్చేవరకూ నాతో అలానే ఉంటుందని, గౌతమే నా ఊపిరని అతనికి ఎలా అర్థమవుతుంది?"


మానస అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే కౌసల్య అచేతనురాలైపోయింది. మానస మనసును మార్చేదెలా?


మానస కౌసల్యకు ఆడబడుచైనా మానసికంగా అంతకంటే ఎక్కువే. 

కౌసల్య శ్రీరామ్‌తో పెళ్లై అత్తవారింటికి వచ్చిన రెండు సంవత్సరాలకు అత్తగారు గుండెపోటుతో చనిపోయారు. 


అప్పటికి మానస ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. 

భార్య ఆకస్మిక మరణానికి మామగారు బెంగతో కృంగిపోతే, అల్లారుముద్దుగా పెరుగుతున్న మానస, తల్లి మరణానికి బెంగపెట్టేసుకుని జ్వరంతో మంచానికి అంటుకుపోయింది. 


అప్పుడు కౌసల్య మానసను దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంది. 

తల్లిలా దగ్గరకు తీసుకుని ఓదార్చింది. 


కౌసల్య అణుకువ, మంచితనంతో ఆ ఇంటికి తిరిగి జీవకళ వచ్చేలా చేసింది. 

మానస ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఒక మల్టీనేషనల్ కంపెనీలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా ఉద్యోగం రావడం జరిగింది. మానసకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి మామగారు కౌసల్యతో, "చూడు కౌసల్యా తల్లీ, మానస ఉద్యోగంలో స్థిరపడిందిగా, ఇంక పెళ్లి సంబంధాలు చూసి మంచి అబ్బాయితో అమ్మాయికి మూడు ముళ్లూ వేయిద్దాం. 


నేను కూడా సంబంధాలు వెతుకుతాను" అని మామగారు అనగానే, "అలాగే మామయ్య గారూ, మన మానసకు కూడా ఒకసారి ఈ విషయం చెబుదాం. బాగా చదువుకుంది, మంచి ఉద్యోగంలో ఉంది... తనకు కూడా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కదా. 

నేను మానసతో మాట్లాడాక, తన అభీష్టం తెలుసుకున్నాక సంబంధాలు చూద్దాం మామయ్య గారూ" అనగానే కోడలి మంచితనానికి ఆయన హృదయం ఉప్పొంగిపోయింది. 


ఇంటికి మంచి కోడలు రావడం పూర్వజన్మ సుకృతమే. 

అత్తగారు పోయినా బాధ్యతగా ఇంటి విషయాలను పట్టించుకుంటూ అందరినీ ఆప్యాయంగా, అభిమానంగా చూసే కౌసల్య అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా. 


మానసకైతే ఎప్పుడూ వదిన నామస్మరణే. ఏ విషయాన్నైనా గానీ వదినతో పంచుకోకుండా ఉండలేదు. 


'వదినా, నీ అర్థమొగుడిని నేనే, నా తరువాతే అన్నయ్య నీకు' అని ఆటలు పట్టించే మానస అంటే కౌసల్యకు మహాముద్దు. 


అన్నతమ్ముళ్లే గానీ చెల్లెళ్లు లేని కౌసల్యకు మానస ఒక చిన్నారి చెల్లి. 

మామగారితో చెప్పినట్లుగా, ఒకరోజు ఆదివారం సాయంకాలం డాబా మీద నీరెండలో చాప మీద కూర్చుని కౌసల్య సన్నజాజుల మాల కడుతోంది. కౌసల్య ఒడిలో పడుకుని మానస వదినతో ఏవో కబుర్లు చెబుతోంది. 


ఉన్నట్టుండి కౌసల్య మానసతో, "మనూ, ఇంకెన్నాళ్లు ఈ వదినతో ఇలా ఒళ్లో పడుకుని కబుర్లు చెబుతావులే కానీ, మామయ్య గారు నీకు మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసేద్దామన్నారు. 


మీ అన్నయ్య కూడా దానికి ఓకే చెప్పారు. మ్యాట్రిమొనీలో చెల్లాయి వివరాలు రిజిస్టర్ చేస్తానన్నారు. మరి నీ రిక్వైర్‌మెంట్స్ ఏమిటి మనూ?


నీకు ఎటువంటి వ్యక్తి కావాలి, నీ ఇష్టాలు, అభిరుచులు లాంటివి ఉంటే చెబితే బాగుంటుంది కదా. "


వదిన ఒళ్లో పడుకుని వదిన మాటలు వింటున్న మానస చటుక్కున లేచి సరిగ్గా కూర్చుంది. 


"వదినా, ఈ అవకాశం కోసమే చూస్తున్నాను. నాకు నేనుగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేనుగా. 


నీతో ఒక విషయం ఈరోజే చెప్పేయాలనుకోవడం, అనుకోకుండా నీవే నా పెళ్లి టాపిక్ తేవడం భలే కో-ఇన్సిడెన్స్ వదినా. మా కొలీగ్, నా సీనియర్ అయిన గౌతమ్ నన్ను ప్రపోజ్ చేశాడు. 


'నో' అనడానికి కారణాలు కనిపించలేదు. అతని చదువు, ఉద్యోగం, కులం, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అన్నీ బాగున్నాయి వదినా. నాకూ అతనంటే ఇష్టం ఏర్పడింది. అతని వ్యక్తిత్వం, అభిప్రాయాలు నన్ను ఇంప్రెస్ చేశాయి. నీకూ, అన్నయ్యకూ, నాన్నగారికీ నచ్చితే అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను" అని మానస చెప్పగానే కౌసల్య ఈ విషయం ఇంట్లోని వారికి చెప్పింది. అంతా వెళ్లి గౌతమ్ తల్లిదండ్రులను కలసి పరస్పర అంగీకారానికి వచ్చారు. నిశ్చితార్థానికి ముహూర్తం చూస్తున్నారు. 

ఈలోగా అనుకోకుండా గౌతమ్‌ని కంపెనీ ఒక వారం రోజుల పాటు ఆఫీస్ పనిమీద సింగపూర్ పంపించింది. 


గౌతమ్‌ని క్షణం కూడా చూడకుండా ఉండలేని మానస దిగులు ముఖం పెట్టేసింది... మానస ముఖాన్నే తదేకంగా చూస్తూ... "ఏయ్ మనూ, వారం రోజులు ఎంతసేపు, గిర్రుమని తిరిగిపోతాయి. నేను వచ్చేశాక ఈ అల్లరిపిల్లతో నాకు ఎంగేజ్‌మెంట్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నవ్వుతూ బొన్ వోయేజ్ చెప్పమ్మాయ్. 

ఆ... అన్నట్లు సింగపూర్ నుండి నీకు ఏమి కావాలి?

ఆ... గుడ్ ఐడియా, మన ఎంగేజ్‌మెంట్‌కు డైమండ్ రింగ్స్ తెస్తాను" అంటూ సైజ్ కోసం మానస రింగ్ తీసుకున్నాడు. 


ఇంక రేపే గౌతమ్ సింగపూర్ నుండి వచ్చేస్తాడని మానస హడావుడి పడుతోంది... గౌతమ్ తిరిగి వచ్చిన సరిగ్గా ఒక వారానికి ఇరువురి ఎంగేజ్‌మెంట్‌కూ సన్నాహాలు చేస్తున్నారు. 


హఠాత్తుగా దారుణమైన వార్త విన్నారు... సింగపూర్ ఆఫీస్ నుండి హోటల్‌కు కారులో వస్తూండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు బ్రేక్ సరిగా పడకపోవడంతో కారు పల్టీ తిరిగిపోయి పేవ్‌మెంట్‌ను గుద్దేయడంతో గౌతమ్ అక్కడకక్కడే తలకు పెద్ద దెబ్బతగిలి ప్రాణాన్ని కోల్పోయాడు. 


దారుణమైన విస్ఫోటకం. వార్త విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టడమే. ఆఫీస్ యాజమాన్యం స్వయంగా వచ్చి గౌతమ్ తల్లిదండ్రులకు తమ సంతాపాన్ని తెలిపాయి. 

ఇక్కడ మానస పరిస్థితి దారుణం... స్పృహ తప్పిపోయింది. ఒక రాయిలాగ స్పందన లేనిదానిలా శూన్యంలోకి చూస్తూ... 


మానస కదిలి ఏడిస్తే బాగుండునని, ఆమె హృదయం ద్రవించాలని అందరూ కోరుకున్నారు. కాసేపటికి వాస్తవానికి వచ్చిన మానస వదినను కౌగలించేసుకుని దుఃఖంతో అల్లల్లాడిపోయింది. 


తల్లి పోయినప్పుడు కూడా అంత దుఃఖపడలేదు. 

ఏడ్చి ఏడ్చి వదిన ఒళ్లో సొమ్మసిల్లిపోయింది. 

మానస తిరిగి వాస్తవ ప్రపంచంలోనికి రావడానికి మూడు నెలలకు పైనే పట్టింది... కౌసల్య మానసని పొదవి పట్టుకుని తినిపించడం, అవీ చేసేది. రాత్రీ పగలూ కంటికి రెప్పలా చూసుకుంది. 


మామగారు మానస పరిస్థితికి విచలితుడవుతూ... "అమ్మా కౌసల్యా, ఏ జన్మలోనో మానస నీ కడుపున పుట్టిన కూతురై ఉండవచ్చు. కన్నతల్లి కంటే చాలా జాగ్రత్తగా కాపాడావమ్మా నా కూతురిని" అంటూ ఆయన కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. 


ఎలాగైతేనేం మానస మామూలు మనిషై తిరిగి ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. అంతా కౌసల్య తీసుకున్న శ్రద్ధ. 


మానస మనుషుల్లో పడడంతో ఇంట్లో అందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు. 

కౌసల్య చిన్న తమ్ముడి వివాహం కుదిరిందని, పెళ్లికి ఒక పది రోజులు ముందరే రావాలంటూ కౌసల్య తల్లిదండ్రుల నుండి ఆహ్వానం వచ్చింది. 


మానసకి కాస్తంత మార్పు కూడా ఉంటుందని మానసను కూడా పెళ్లికి తీసుకుని వెళ్లింది కౌసల్య. అంతమంది మనుషులూ, హడావుడిని చూడగానే మానసలో నిజంగానే చైతన్యం వచ్చింది. 


అందరిలాగే తను కూడా చక్కగా తయారై, పెళ్లిలో అటూ ఇటూ తిరగడం ఆరంభించింది. 


అసలే అందంగా, ఆకర్షణీయంగా, చూడగానే మళ్లీ చూడాలనే రూపంతో ఉండే మానస, కౌసల్య పిన్ని కొడుకైన నవీన్‌ను ఆకర్షించింది. నవీన్ తనకు తానుగా మానసకు పరిచయం చేసుకుని, తను హైదరాబాద్‌లో ఫలానా కంపెనీకి బెంగళూరు నుండి రీసెంట్‌గా మారానని చెప్పాడు. కౌసల్యతో అతనికి బాగా చనువు కూడా. "కౌసల్య అక్కా" అంటూ అభిమానంగా ఉంటాడు. 


నవీన్ మానస పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కౌసల్య గ్రహించేసింది. 

మనసులో చటుక్కున ఒక అందమైన ఆలోచన చోటు చేసుకుంది. 


మానసను ఎలాగైనా ఒప్పించి నవీన్‌తో పెళ్లి జరిపించాలని... మనసులో ఇది జరిగే పనే అన్నట్లుగా పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. నవీన్ అమ్మా నాన్నకు మానస గురించి చెప్పింది. మానస దగ్గర లేనప్పుడు చూసి, మానస గురించి నవీన్‌కు అంతా చెప్పింది. మానస పెళ్లి చేసుకుందామనుకున్న గౌతమ్ ఆకస్మిక మరణం గురించి కూడా చెప్పింది. 


"అరే! పాపం, అయినా జీవితంలో ఎన్నో అనుకుంటాం కౌసల్య అక్కా, కానీ అన్నీ నెరవేరాలని లేదుగా. విధిలిఖితం అంటే ఇదే. 


అయినా మానస ఎప్పుడూ ఆ గతం గురించే ఆలోచించడం ఫూలిష్‌నెస్. తిరిగి తన జీవితాన్ని తను నిర్మించుకోవాలి. నేను మానసను వివాహం చేసుకోవాలను కుంటున్నాను కౌసల్య అక్కా. తను నాకు చాలా నచ్చింది. మా ఇద్దరి పెళ్లి జరిపించే పూచీ నీదే" అంటూ, "ఎలాగూ నేను హైదరాబాద్ వస్తానుగా, మీ ఇంటికి వస్తానక్కా. ఈలోపల మానసను పెళ్లికి ఒప్పించు" అంటూ పదే పదే చెప్పి వెళ్లాడు. 

కౌసల్యకు పట్టరాని ఆనందంగా ఉంది, మానసను నవీన్‌కు ఇచ్చి వివాహం చేసేయాలని. 


పెళ్లి నుండి తిరిగి వచ్చాక మానసకు అనేక రకాలుగా చెప్పి చూసింది... మానస తను ప్రేమించిన గౌతమ్‌ను మరచిపోలేనంది. 


ఇలాగే వ్యర్థంగా ఆలోచించడం సబబు కాదని, ప్రాప్తం లేని వాటి గురించి ఎన్నాళ్లు ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటావని, వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదని నచ్చచెప్పింది. నవీన్ చాలా మంచివాడని, నిన్ను అర్థం చేసుకుంటాడని చెప్పింది. 

పాపం మామయ్య గారు ఎలా అయిపోయారో నీమీద బెంగతో అని సెంటిమెంట్‌తో కొట్టింది. "నీవు ఇలా విరాగిణిలా అయిపోవడం మా మనసులకు ఆనందంగా లేదు మనూ" అని బ్రతిమాలగా బ్రతిమాలగా వివాహానికి సమ్మతించింది. 


చక్కగా నవీన్‌తో పెళ్లి చేసేశారు. మానస ఉద్యోగం కొనసాగిస్తోంది. నవీన్, మానస కొత్త కాపురం పెట్టారు. 


ఇద్దరూ ఆనందంగా కలసి కాపురం చేసుకుంటున్నారనుకుంటుంటే ఆశనిపాతంలా ఇలా జరుగుతోందేమిటీ?


అంతా మానసదే తప్పని కౌసల్య భావించింది. 


మానసకి స్ట్రాంగ్‌గా కౌన్సిలింగ్ చేసి నవీన్ దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంది. 

మానస కాస్త రిలాక్స్ అయ్యాక మాట్లాడడం కొనసాగించింది. 


"చూడు మనూ, గాఢంగా ప్రేమించుకుని, ఒకరొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుని కొద్దికాలం కాపురం చేసి కూడా ఏదో చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు చాలామంది. 


అంత ప్రేమించుకున్నవారు, ప్రేమే లోకం అంటూ తిరిగినవారు... మరి వారి మధ్య ఉన్న అంత ప్రేమా ఏమైనట్లు?


మరో వివాహం చేసుకుని మరొకరితో ఎలా కొత్త జీవితాన్ని సాగిస్తున్నారు?

భర్తతో ఎన్నో ఏళ్లు కాపురం చేసి, మనసా వాచా భర్తే లోకంగా బ్రతికిన స్త్రీ, భర్త చనిపోగానే ఎందుకీ జీవితం అనుకుంటూ విరక్తి చెందిపోతూ ప్రాణత్యాగం చేస్తోందా? లేదే!


బాధపడుతుంది భర్త దూరమైనందుకు, కొన్ని నెలలు, సంవత్సరాలు... ఆ తరువాత రొటీన్‌లో పడక తప్పదు. తనకంటూ పిల్లలు, వారి భవిష్యత్తు కోసం, తన మీద ఆధారపడి ఉన్నవారి కోసం బ్రతుకుతుంది, బ్రతికి తీరాలి కూడా. 

ఇది లోక సహజం. 


కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలెందరో పునర్వివాహం చేసుకుంటున్నారు కూడా... పోయిన భర్త మీద ప్రేమ లేక కాదు, 

తనకంటూ జీవితంలో ఒక తోడు, ఆలంబన కోసం. 

అలాంటిది, నీవు గౌతమ్‌ను గాఢంగా ప్రేమించి ఉండొచ్చు... అతను నీకు దూరమైనంత మాత్రాన నీవు జీవితమే లేదనుకుంటే ఎలా మనూ?

ఒకవేళ నీ స్థానంలో గౌతమ్ ఉండి ఉంటే నీలా ఏడుస్తూ కూర్చోడు, హాయిగా పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో జీవిస్తాడు. 


భార్య పోయి సంవత్సరం కాకుండానే తిరిగి పెళ్లి పీటలెక్కేస్తున్న మగ మహారాజులెందరో!


అటువంటిది, కొన్ని నెలల ప్రేమ మాత్రమే మీది. మీదేమీ షాజహాన్-ముంతాజ్, లైలా-మజ్నూ, దేవదాస్-పార్వతి లాంటి ప్రేమ కాదు కాదే. 


ఏదో గొప్పగా ఆలోచిస్తున్నాననుకుంటూ చక్కని నీ జీవితాన్ని పాడుచేసుకోకు మనూ... ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా. నవీన్‌తో హాయిగా సంసారం చేయి, అతన్ని బాధపెట్టడం సమంజసం కాదు" అంటూ అక్కడ నుండి మెల్లిగా వంటగదిలోకి వెళ్లిపోయింది. 

మానసను అలాగే ఆమె ఆలోచనలకు వదిలేసింది ఒక అరగంట సేపు... కాసేపటి తరువాత కాఫీ ఇద్దామని మానస ఉన్న చోటుకి వస్తే మానస లేదు అక్కడ... ఒక పేపర్ గాలికి ఎగురుతూ కనిపించింది... కౌసల్య ఆ కాగితంలోని అక్షరాల వైపు చూసింది. మానస చేతివ్రాతతో, "వదినా తప్పు నాదే, నవీన్ దగ్గరకు వెళ్లిపోతున్నాను, క్షమించమని అడగడానికి. నీకు నా కృతజ్ఞతలు వదినా, కళ్లు తెరిపించావు... బై... మనూ. "

-----

మరో పది నెలల తరువాత. 

కౌసల్యా శ్రీరామ్‌ల ఇల్లు మామిడాకు తోరణాలతో, పచ్చని గడపలకు కట్టిన బంతిపూల హారాలతో మెరిసిపోతోంది... పట్టుచీరల రెపరెపలు, గాజుల గలగల శబ్దాలు, వంట సావిట్లో వంటవాళ్లు వండే పిండి వంటల ఘుమాయింపులతో ఆ ప్రదేశమంతా సువాసనలు వెదజల్లుతోంది... కౌసల్య మామగారు విశ్వనాథం గారు పట్టు దుస్తులు, ఉత్తరీయం ధరించి హడావుడిగా అందరినీ పలకరిస్తున్నారు... శ్రీరామ్ అప్పుడే లారీ నుండి దిగిన అరటిపళ్ల గెలలను దగ్గరుండి దింపిస్తున్నాడు... కౌసల్య చిలకాకు పచ్చని పెద్ద కంచి పట్టుచీరలో, నడుముకి పెట్టుకున్న బంగారపు ఒడ్డాణంతో మెరిసిపోతోంది. 


వారింటి ముద్దుల ఆడపడుచు మానస శ్రీమంతం వేడుక అట్టహాసంగా జరుగుతోంది అక్కడ. 

***

రచయిత్రి ఇతర రచనలు :



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page