top of page
Original.png

బంధం విలువ

2 hours ago
4 min read

బంధం విలువ కథలో భార్యాభర్తలు ప్రతీక, వామనరావు సరదాగా బండి మీద కలిసి వెళ్తున్న దృశ్యం

Bandham Viluva - Telugu Comedy Story | Gorthi VaniSrinivas

బంధం విలువ - తెలుగు హాస్య కథ | గొర్తి వాణిశ్రీనివాస్ | ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 19/11/2026


భార్యాభర్తలు ఒకరినొకరు పోల్చుకోకుండా, వారి బలాలు–బలహీనతలను అర్థం చేసుకుని గౌరవించుకోవడమే దాంపత్య బంధానికి అసలైన విలువ. నవ్విస్తూ ఆలోచింపజేసే ఈ కథ అదే సందేశాన్ని అందిస్తుంది.



“ఏవండీ! ఇలా వస్తారా?” వీణలు మీటినట్టు పిలిచింది ప్రతీక. హాల్లో అడ్డంగా కూర్చుని ‘విధివంచిత’ సీరియల్ చూస్తున్న వామనరావు తల అడ్డంగా ఊపి, కళ్ళు సీరియల్ బల్బుల్లా ఆర్పాడు.


“ఆదివారం అమావాస్య దీపావళి మిట్టమధ్యాహ్నం ఎక్కడికీ?” అన్నాడు టీవీ సౌండ్ పెంచుతూ. “చెప్తా రండి. ఓ మంచి మాటుంది” అంది కొంటెగా చూస్తూ.


“నువ్వు కొంటెగా చూసినా, హంసలా నడిచినా నీ పప్పులు నా దగ్గర ఉడకవు (నీ పల్సెస్ నా దగ్గర కుక్కవ్వవు). వెళ్లి ఆ కుక్కర్ ఓపెన్ చేసి బిర్యానీ పెట్టు” అన్నాడు రిమోట్ ఎగరేసి పట్టుకుంటూ.


“ఎందుకండీ అంత హీటెక్కిపోతారు? కూల్ కూల్‌గా ఎంచక్కా బీచ్ వెంట తిరిగొద్దాం రండి.”

“నీతో బీచ్ అంటే బూచిలా కనిపిస్తోంది. నే రాను పో.” “ఇనార్బిట్ మాల్?”

“మాల్ కన్నా ఈ సీరియల్ మేల్.” “పోనీ... వుడా పార్క్?”


“నా టేస్ట్‌కే పెద్ద రిమార్క్. నో.” “ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా మీ నుంచి గుడ్ రియాక్షన్ రాదా?” అంది బుంగమూతి పెట్టుకుని.


వాళ్ళ మాటలు వింటున్న పక్కింటి సుబ్బారావు లోపలికొచ్చాడు.


“వేమనరావు గారూ! ఎందుకండీ అంత నిరాశగా మాట్లాడతారు?” అన్నాడు. “నా పేరు వామనరావు” అన్నాడు చిరు కోపంగా. “అదేలేండీ. 


మీరు పేరుకు తగ్గట్టు కురచగా ఆలోచిస్తున్నారు. ఆవిడ రమ్మని అంత కమ్మగా బతిమాలుతుంటే, కమ్మెకు కట్టిన మేకల్లా ఊడిపడరేం? కొమ్మెక్కిన కోతిలా దిగిరారేం? నా భార్య అలా పిలిస్తే నేను నరకానికైనా పోతా, తెలుసా?” అన్నాడు కిచకిచా నవ్వుతూ. “మీరు అక్కడుండాల్సిన వాళ్లే లెండి. ఎందుకొచ్చారో చెప్పండి.”


“మన కాలనీలో ఉత్తమ జంట పోటీలో మీ దంపతులు ఇరువురూ విజేతలైనందుకు అభినందనలు. అందుకోండి ఈ పుష్పగుచ్ఛం” అని పూల బొకే ఇచ్చాడు. “అప్పుడే అక్కడే చెప్పేశారుగా. ఇప్పుడెందుకొచ్చారనేది క్వశ్చన్ (కొచ్చిన్)?” క్వశ్చన్ మార్క్ మొహంతో అడిగాడు.


“ఏం లేదు. మా చెల్లెలు బండి కావాలని అడిగింది. ఇదిగోమ్మా కీస్. హాయిగా బయటకెళ్ళి తిరిగిరండి” అని తాళం చెవులు ప్రతీకకు ఇచ్చి, “ఉత్తమ భార్యాభర్తల పోటీలో బాగా నటించి ప్రైజ్ మనీ కొట్టేశారు. ఆ నటననే నిజం చేయండి వాదనరావు గారూ!” అన్నాడు.


“వాదనరావు కాదు వేదనరావు... ఛీ, వామనరావు! మీరిక వెళ్ళొచ్చు.”


“మీరంత మర్యాదగా చెప్పాక వెళ్లకుండా ఎందుకుంటాను వాయసరావు గారూ!” అని వెళ్ళిపోయాడు.


“ఏవండీ!” పిలిచింది ప్రతీక. “ఏంటి నీ గోల? నేను రాను. రోజురోజుకీ పెరుగుతున్న ధరల్లా, క్షణక్షణానికీ నీటిమట్టం పెరుగుతున్న గోదారి వరదలా ఎంత లావయ్యావో చూడు.”


“అదా మీ కోపానికి కారణం? బొద్దుగా అవ్వడం నా తప్పా? మీరెంత తిన్నా బక్కగా ఉంటారు. నేను కాస్త బుజ్జిగా ఉంటాను. 


అది ఒంటి తీరు. లైట్‌గా తీసుకోరూ...”

“ఆ తీరే నా కొంపకి తిప్పలు తెస్తోంది.” “మా మంచి మొగుడు కదూ, బయటకు రండీ!” గోముగా పిలిచింది.


“మంచివాడిని కాబట్టే వరదలో బురదలా ముంచేశారు. పెళ్లికి ముందు మీ నాన్న బంగారు బిస్కెట్ ఇస్తానన్నాడు, నో అన్నాను. నోట్ల కట్టలు ఇస్తానన్నాడు, కటీఫ్ అన్నాను. కారు ఇస్తానంటే మిరియాలు నూరాను. ఏం కావాలన్నాడు? ఐదడుగుల బంగారు తీగ కావాలన్నాను. ‘ఆ...’ అని నోరెళ్ళబెట్టాడు.


సన్నటి తీగలాంటి నీ కూతుర్ని ఇస్తే చాలన్నాను. అలా మన పెళ్లయింది.


కానీ ఇప్పుడు అద్దంలో చూసుకో ఎంత లావయ్యావో. జిమ్‌కి వెళ్ళి ఎదురింటి స్వప్నలా సన్నగా అవ్వాలి. పక్కింటి లక్కీ... అదే లక్ష్మిని చూడు, ఎంత స్లిమ్‌గా ఉంటుందో! అలా ఉండాలి నువ్వు కూడా. ఎక్సర్‌సైజ్ చేసి తగ్గితేనే నీ మాట నెగ్గుతుంది” అన్నాడు.


“మీ అలక చిలకెత్తుకుపోను! జిమ్‌కి వెళతాను, లావు తగ్గుతాను. ఎంతసేపని ఇంట్లో కూర్చుంటాం? సరదాగా అలా వెళ్ళొద్దాం రండి” అని భర్తని సముదాయించి లేవదీసి, సుబ్బారావు ఇచ్చిన బండి మీద సాగర్ నగర్ బయల్దేరారు.


పుల్లలా ఉన్న వామనరావు బండి మెల్లిగా నడపడం చూసిన సైకిల్ వాలాలు గొల్లున నవ్వారు.

“ఈ స్పీడ్‌కి టైర్లు కొట్టుకెళ్లే పిల్లలు కూడా మనల్ని దాటిపోతారు. ఇంకా స్పీడ్ పెంచండి” అని ఉత్సాహపరిచింది ప్రతీక.


“ఎక్కువ స్పీడ్ వెళితే నాకు కళ్ళు తిరుగుతాయి. నేనింతే, మారేదేలే” అన్నాడు వామనరావు. తోపుడు బళ్లవాళ్ళు, తాండ్ర బళ్లవాళ్ళు వామనరావుని దాటి పోతున్నారు. 


సాగర్ నగర్ రోడ్డులో బైక్ రేసర్లు సర్రున వెళుతుంటే భయంతో ఓ పక్కగా నడుపుతూ తీసుకెళుతుంటే...


“ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్...” అంటూ ప్రతీక ఎంత ఎంకరేజ్ చేసినా మెల్లిగా నడుపుతుండటంతో, “ఎహె... ఆపండి” అని బండి ఓ పక్కకి ఆపి వామనరావుని వెనక్కి కూర్చోమని ప్రతీక బండి నడపడం మొదలుపెట్టింది.


ఒక్కసారి స్పీడ్ పెంచి బైకర్‌లా దూసుకుపోయింది. వామనరావు తల వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. 


“ఆపు... ఆపు...” అంటూ అరుస్తున్నా కిలకిలా నవ్వుతూ “హే... జాలీ!” అంటూ ఇంకా వేగం పెంచింది ప్రతీక. “అయ్యో... కళ్ళు తిరుగుతున్నాయి. స్పీడ్ తగ్గించు, ఆపు! నువ్వు ప్రతీకవు కాదు, ప్రతీకారానివి!” అంటూ పొలికేకలు పెట్టాడు.


“అరవకండి. మన ఎదురింటి పురుషోత్తం గారు ఎంత స్పీడ్‌గా బండి నడుపుతారో తెలుసా! ధైర్యం అంటే ఆయనదే. పురుషోత్తముడంటే ఆయనే” అంది సర్రున బండి పోనిస్తూ.


బండి వెనకాల కూర్చున్న వామనరావు బండి వేగానికి ముందు బెత్తెడు, తర్వాత జానెడు ఎత్తు లేచి ప్రతీక భుజాలు పట్టుకుని గాల్లో గబ్బిలంగా వేలాడాడు.


చూసిన వాళ్ళందరూ అదేదో ఫీట్ అనుకుని చప్పట్లు కొట్టారు. ఇదే తనకు ఆఖరి రోజని ఫిక్స్ అయి భయంతో భార్య నడుం గట్టిగా పట్టుకున్నాడు.


ప్రతీక ఒక పక్కగా బండాపి, “కంగారు పడ్డారాండీ! అదే ఎదురింటి పురుషోత్తం గారైతే...” అనబోయింది. వామనరావు ప్రతీక నోటిపై వేలుపెట్టి...


“ఇక చాలు బంగారం. ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు. ఎవరి బలం వాళ్ళది, ఎవరి బలహీనత వాళ్ళది. నువ్వు బండి నడిపినట్టు నేను నడపలేను. పోలికలు పెట్టినందుకేగా నన్ను పొలికేకలు పెట్టించావ్” అన్నాడు.


ప్రతీక గలగలా నవ్వుతూ, “మీ పిరికితనం... నా ధైర్యం, మీ సన్నదనం... నా బొద్దు గుణం కలిస్తేనేగా మనం ఆదర్శ దంపతులమైంది” అంది భర్త బుగ్గమీద చిటికేస్తూ.


“అవును. ఒకరినొకరం కించపరచుకోకుండా అర్థం చేసుకోవడమే పెళ్ళికి అసలైన అర్థం. యాభై ఏళ్ల వయసు వచ్చిన ఆడవాళ్ళు లావు కాకుండా ఉండరు. 


ఈ వయసులో బండి నడిపే లేడీస్ కూడా ఉండరు. అది నా అదృష్టం. ఇక మనం ఒకరినొకరం కించపరచుకోవద్దమ్మా! సరేనా?” అన్నాడు.


“థాంక్యూ... శ్రీవారూ!” అని బండి తీసి భర్తని కూర్చోమంది. వాళ్ళ బండి వెనకే వస్తూ వీడియో తీసిన సుబ్బారావుకి దూరం నుంచే థంబ్ చూపించి థ్యాంక్స్ చెప్పింది ప్రతీక.


భర్త ఎప్పుడైనా తన లావు గురించి చులకనగా మాట్లాడినా, ఇతర వనితలతో పోల్చినా అతను బండి మీద జంపింగులు చేసిన వీడియో చూపించి ఏడిపించాలని ప్రతీక ముందే ఫిక్స్ అయినట్టు వామనరావుకి తెలీదు.



………………. శుభం ………








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y




 గొర్తి వాణిశ్రీనివాస్ గారి మరికొన్ని రచనలు:





గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

గొర్తి వాణిశ్రీనివాస్

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం


గొర్తి వాణిశ్రీనివాస్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page