top of page

ఆల్ రౌండర్ ( ప్)...


'All Rounder' written by Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

"బల్లిని చూస్తే పిల్లయ్యేవాడు ఎలిక వెంట పడ్డాట్ట!

అలా వుంది మీ వరస" అంది రాగిణి

తన రాగి రంగు జుట్టుకు రంగేసుకుంటూ.



" 'తేలు మంత్రం రానివాడు పాముపుట్టలో చెయ్యిపెట్టాడు' అని విన్నానుగానీ ఈ కొత్త సామెతాస్త్రo ఎక్కడా వినలేదే?"

అన్నాడు సద్గుణరావు



ఒళ్లు రుద్దుకోగా మిగిలిపోయిన సబ్బు ముక్కల్ని చితక్కొట్టి హ్యాండ్ శానిటైజర్ సీసాలో వేస్తూ.



"మీ రన్నింగ్ కోచ్ ఉద్యోగవేదో మీరు చేసుకోక

తెలియని వ్యవహారాల్లో తలదూర్చటం దేనికిట. సద్గుణరావు అనే చక్కటి పేరుని సలహాలరావుగా మార్పిడి దేనికి?

'ఉచితసలహాల' వాట్సాప్ గ్రూపు సృష్టించి

ప్రతివాళ్ళనీ లోపాయికారిగా పరిశీలించడం,

వాళ్లకి ఉచిత సలహాలు ఇవ్వటం.అవి వికటిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? ఐ సీ ఎమ్ ఆర్ ఒప్పుకోని మందు తప్పు" అంది రాగిణి.


"నేనేమి చేశాను నేరం? నన్నెక్కడంటింది పాపం?" సీసాని షేక్ చేస్తూ భార్యవంక షాక్ కొట్టినట్టు చూశాడు.


"ఏం చేశారా?!

'పదహారువేల సలహాలు' అనే కొంకిణి భాషా పుస్తకాన్ని తెప్పించుకున్నారు.

అందులోని ప్రతి అక్షరాన్నీ కొతుక్కుంటూ చదువుకుంటూ

కనపడ్డ ప్రతివాళ్ళకీ ఉచిత సలహాలివ్వడం.

ముఫై రకాల మూలికలు అనే పుస్తకం చూసి వైద్యం చేయడం.

జనాలు మీకు ఎదురుపడాలంటేనే శానిటైజర్ లేని రేషన్ డిపో క్యూ చూసినంత కంగారు పడుతున్నారు. " అంది


"ఏవోయ్...! ఇలా చూడు! వికెట్ ని వెతుక్కుంటూ విసురుగా దూసుకొచ్చిన బాలల్లే నాకోసం వచ్చిన ఈ ఉత్తరాన్ని చూస్తే నువ్వే చిత్తై పోతావ్!

నా అభిమాని రాసిన ఉత్తరాన్ని చదువుతాను విను.


" రన్నింగ్ కోచ్ కి నమస్కారం!

ఆరోజుల్లో జాతీయ స్థాయి పరుగుపందెంలో

నా కొడుకు కపర్దిని

కొబ్బరి చిప్పలతో మోకాళ్ల చిప్పలమీద కొట్టి మరీ శిక్షణనిచ్చిన ఘనత మీదే.


అప్పట్లో గ్రౌండ్ కి మా అబ్బాయి కపర్దితో పాటు నేనూ

కాస్త కుంటుతూ వచ్చేదాన్ని మీకు గుర్తుందా!

"అలా కుంటకూడదమ్మా! ఇలా నిఠారుగా నడవాలి" అని మీరు ఎన్నో సార్లు నడిచి చూపించారు.


'నాకు నడక చేతకాక కాదండీ!

మోకాళ్ళ నొప్పులు సతాయిస్తున్నాయి.

నేను పరుగు పందానికి రాలేదుసుమీ!

ఉత్తుత్తినే చూడ్డానికి వచ్చాను ' అన్నాను


"ఉత్తిత్తినే వచ్చినా, ఉయ్యాల్లూగటానికి వచ్చినా బరిలోకి దిగాక

సరిగ్గా నడవాలని చెప్పటం నా డ్యూటీ'

అని చక్కని సలహాలు ఇచ్చారు

కపర్ది కప్పు సాధించలేకపోయినా

ఈనాడు వాళ్ళవిడ విసిరే కాఫీ కప్పులూ ,చెప్పుల్ని లాఘవంగా తప్పించుకునే నేర్పు సాధించాడని చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాను.



ఆరేళ్ళకాలం పరుగుపందెంలా గడిచిపోయాక


ఒకరోజు నేను మావారితో కలిసి శివాలయంలో దీపం పెడుతున్నాను.


ఒత్తులు చేసి నూనె పోసి వెలిగించేలోపు

"ఏం చేస్తున్నారు?" అన్నారు మీరు

"దీపం పెడుతున్నాం " అన్నాన్నేను.

"ఎన్ని ఒత్తులు వేశారు?"

"రెండు"

"ఎవరైనా రెండు వత్తులువేసి దీపం వెలిగిస్తారా?" అన్నారు

" మా ఆవిడ ఎప్పుడూ అంతే. లెక్కగా రెండే వత్తులు వేస్తుంది, ఎన్ని వేయాలి? అడిగారు మావారు.


"ఎంతమందికి చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి?

అయిదు వత్తులు వేసి దీపం వెలిగించాలని మొత్తుకుంటున్నా ఎవరూ వినరేం?

మిమ్మల్ని గోవా దాకా తీసుకెళదామనుకుంటే , గోనెపాడుదాటి రారు. అక్కడే ఉండిపోతారు."

అన్నారు మీరు ఆవేదనగా.


"అటుగా పనిమీద వెళుతూ తోవలోనే కదా అని

గుడికి వచ్చాం . ఎలాగో వచ్చాము కదా అని దీపం వెలిగిస్తున్నాం. అంతే" అన్నాను .


మీరు పనిమీదొచ్చినా, పల్లకీమీదొచ్చినా

దీపం పెట్టాలంటే కొన్ని నిబంధనలు పాటించి తీరాల్సిందే. అన్నారు మీరు


" అయ్యో! మాకు చెప్పేవాళ్ళు లేక చాలా కాలంగా రెండే వత్తులు వేసి దీపం వెలిగిస్తున్నాం.ఇప్పుడెలా?" అన్నారు మావారు అపరాధ భావంతో కుమిలిపోతూ.


"ఎన్నాళ్లనుంచి ఇలా వెలిగిస్తున్నారు?"


"పదిహేను రోజులనుంచి" గుడ్లనీళ్లు గుడ్లకుక్కుకుంటూ చెప్పారు మావారు.


"ఏం ఫర్లేదు. పదిహేను ఇంటూ మూడు ,

నలభై అయిదు వత్తులు కలిపి వేసి ఇప్పుడు వెలిగించండి. దోషం పోతుంది" అన్నారు మీరు.


"హయ్యో దేవుడా! అన్ని వత్తులు మా యింట లేవు. ఇప్పుడు ఏవిటి చేయటం?"

అని మావారు కర్చీఫ్ నోట్లో కుక్కుకుని మధనపడుతుంటే

మీదగ్గర ఉన్న ఒత్తులు ఇచ్చి వెలిగించమని చెప్పి

ఆ గండం నుంచి కూడా గట్టెక్కించారు.

మీరు ఆల్ రౌండర్ అనేది విశ్వవిదితమే.


మీకేనాడూ ఆ విషయాన్ని చెప్పలేకపోయాను.

బహుశా నాలోని అహంకారం చెప్పనీయలేదేమో!


ఇకపోతే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది.

మా అమ్మాయి తల్లో పూలు 'గ' వత్తులా పెట్టాలా, లేదా 'జ' లా గుండ్రంగా చుట్టాలా, ఇన్వర్టెడ్ కామాల్లా తలకి అటూ ఇటూ పెట్టాలా?

ఏమీ పాలుపోక, తేనెలాంటి మీ సలహాకోసం ఎదురుచూస్తూ మా ఐదు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తాము.


అనగా నావి రెండు, మా వారివి రెండు,

మా తోటమాలికి ఒకటే కన్ను కాబట్టి మొత్తం ఐదు.

ఈ క్రింది అడ్రస్ కి రాగలరు.

ఇక మీ రాకకై ఎదురుచూసే జయప్రదా జయరాం."

ఉత్తరం చదవటం ఆపి


" చూశావా! నా సలహాలకోసం ఉత్తరాలు ద్వారా కూడా సంప్రదిస్తున్నారు. నన్ను ఆల్ రౌండర్ అని జనాలందరూ ఒప్పుకున్నారు.

ఇక నా సలహాల పరంపర ఆపేది లేదు. త్వరగా బట్టలు సర్దు. ఆఘమేఘాల మీద రాజమండ్రి వెళ్ళాల్నేను" అన్నాడు సద్గుణరావు.


"అవ్వ! ఎవరైనా వింటే నవ్విపోతారు. జడకి పూలు ఎలా పెట్టాలో , బన్నుకి పిన్ను ఎలా గుచ్చాలో చెప్పటానికి ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వెళతారా? అంత బడాయి కూడదు .

టెంకె జల్ల తింటారు జాగ్రత్త!." అని భార్య రాగిణి ఎంత హెచ్చరిస్తున్నా వినకుండా బట్టల బ్యాగ్గు తగిలించుకుని

సలహాల బుక్కు చంకలో ఇరికించుకుని బస్సెక్కాడు

సద్గుణరావు.


మర్నాడు సాయంత్రానికల్లా గుమ్మడికాయ బస్తాకింద పడ్డ అరటిపండులా కమిలిపోయిన మొహంతో ఇంటికొచ్చాడు.


"అయ్యో! టైరులోంచి బయటపడ్డ రిమ్మల్లే నిలబడలేక చతికిలపడిపోతున్నారేంటండీ? అసలేవైంది?" అంది రాగిణి ఆందోళనగా.


"ఆ వెధవలంతా కలిసి ఎంతపని చేశారో చూశావా!

సలహాల గ్రూప్ లో నా సలహాలన్నీ వాడుకుని

నన్ను ఉబ్బేసి , లెటర్ రాసి పిలిపించారు.

ఆల్ రౌండర్ అని పొగిడి చివరికి

అందరూ కలిసి నన్ను రౌండప్ చేసి

పిండిపిండి చేశారు."


"సలహాకి ఓతన్ను బహూకరించారా? వాళ్ళు కక్ష కట్టేంత సలహా ఇచ్చే తెలివి మీకెక్కడిది? ఏవిచ్చారేవిటి? " అంది రాగిణి.


"ఒక పెద్దాయన కిడ్నీలో ఆవగింజలంత రాళ్లున్నాయని చెప్పాడు.

కాల్చిన బొగ్గుముక్కని గుటుక్కున మింగమని చెప్పాను." అన్నాడు


"బొగ్గుముక్కని ఎవరైనా మింగుతారా? అసలు ఎందుకలా చెప్పారు?" అంది


"ఆవగింజల్లాంటి రాళ్లు బొగ్గు వేడికి చిటపటమని పేలి బయటకు వచ్చేస్తాయని అలా చెప్పాను


నేచెప్పింది నచ్చకపోతే చెప్పొచ్చుగా వెధవలు

వేళ్ళు విరిచేశారు. కీళ్లు తిప్పేశారు. హమ్మా...

బాబోయ్ ! సరదాక్కూడా సలహాలివ్వకూడదు. " అంటూ

నెళకిల పామల్లే గోడవారగా పాక్కుంటూ వెళ్లి మంచం ఎక్కి బుధ్ధిగా పడుకున్నాడు సద్గుణరావ్.

ఉచిత సలహాలు, సొంత వైద్యాలు

మొదటికే మోసం అని గ్రహించాడు

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.

126 views1 comment

1 comentario


srinivas gorty
srinivas gorty
04 jul 2021

Very funny. Take care of Printing mistakes vanigaru.

Me gusta
bottom of page