top of page
Original_edited.jpg

మాయా గది

#PhaniShyamDevarakonda, #MayaGadi, #మాయా గది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Maya Gadi - New Telugu Story Written By Phani Shyam Devarakonda

Published In manatelugukathalu.com On 21/11/2025

మాయా గది - తెలుగు కథ

రచన: ఫణి శ్యామ్ దేవరకొండ


ఎండిన చెట్లు, బీటలు వారిన పొలాలు, ఎండిపోయిన చెరువులతో కనిపించే ఆ చిన్న గ్రామంలో, వేసవి ఎండ తీవ్రంగా కాస్తోంది. ఎర్రటి మట్టి రోడ్లపై ధూళి రేగుతుంది, గాలి వీచినప్పుడల్లా. గ్రామం చివర, పాడుబడిన గుడి దగ్గర, ఒక చిన్న గుడిసె ఉంది. పాత తాటాకు కప్పుతో, మట్టి గోడలతో ఉన్న ఆ గుడిసెలో లచ్చి కుటుంబం నివసిస్తోంది. 


చిన్న చిన్న కష్టాలు కూడా పెద్దవిగా అనిపించే ఆ గ్రామంలో, ప్రతి రోజూ ఒక కొత్త సవాలు. రామయ్య, లచ్చి భర్త, పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని చేతులు కాయలు కట్టినట్లు గట్టిపడి ఉన్నాయి, ఎండలో పని చేయడం వల్ల. ఒకప్పుడు అతని చేతుల్లో మట్టి పని చేసే నైపుణ్యం ఉండేది, కుండలు, మట్టి బొమ్మలు చేసేవాడు, కానీ వరుస కరువులు, అప్పులు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. లచ్చి, ఇంటి పనులతో పాటు, పక్కింటి వారి పొలంలో కూడా పని చేస్తూ కుటుంబానికి తోడ్పడుతోంది. ఆమె చేతులు కూడా కఠినమైనవి, కానీ ఆమె కళ్ళలో ఇంకా ఆశ మిణుకు మిణుకుమంటోంది. కానీ ఇటీవల కాలంలో, వారి జీవితం మరింత కష్టతరం అవుతోంది. 


ఆ రోజు సాయంత్రం, రామయ్య అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖంలో చింత స్పష్టంగా కనిపిస్తోంది, భుజాలు వంగిపోయి ఉన్నాయి. ఇంటి ముందు మట్టి దిబ్బపై కూర్చుని, దూరంగా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళలో నిరాశ, అయోమయం కనిపిస్తున్నాయి. 


"ఇంకా ఎన్ని రోజులు అయ్యా మనకీ కష్టాలు.. రోజు ఎవడో ఒకడు వచ్చి ఇంటి ముందు గొడవ చేసి వెళ్ళిపోతున్నాడు.. " లచ్చి నిట్టూర్పుతో అంది, తన భర్త పక్కన కూర్చుంటూ. ఆమె చేతిలో ఒక గిన్నెలో మజ్జిగ తెచ్చింది. 


రామయ్య మజ్జిగ గిన్నెను అందుకుని, ఒక్క గుక్కలో తాగేసి, తన చేతులను నుదుటిపై ఆనించాడు. "ఏం చేయమంటావు లచ్చి.. నేను ఏటేటీ సేయాల్నో అన్ని చేసేసిన.. ఇప్పుడు ఏటి చేయాలో నా మట్టి బుర్రకి తట్టట్లేదు.. " అన్నాడు నిస్సహాయంగా. "నా తండ్రి నాకు ఈ పొలం ఇచ్చి పోయాడు, అతని తండ్రి అతనికి ఇచ్చాడు.. ఇప్పుడు నేను దాన్ని అమ్మేయాలా?"


లచ్చి తన భర్త భుజం మీద చేయి వేసి, "అదే అయ్యా.. ఉన్నా ఆ అర ఎకరా పొలం అమ్మేసి మనం బస్తీకి పోయి బతుకుదాం అయ్యా.. ఆడ నేను ఏదో ఒక పని చేసి నీకు తోడుగా ఉంటా.. ఈ పాలికి ఒప్పుకో.. " అని బతిమాలింది. "ఇక్కడ మనకి భవిష్యత్తు లేదు. ఆ వడ్డీ వ్యాపారి మళ్ళీ వస్తాడు, ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతాడు. "


ఇంతలో, వారి ఐదేళ్ల కొడుకు చంటి, ఇంటి వెనుక నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని చిన్న చేతుల్లో ఒక బంతి ఉంది, ముఖంలో ఆనందం ఉప్పొంగుతోంది. "నాన్నా, చూడు! రాము ఇచ్చాడు!" అని కేకలు వేసాడు, బంతిని గాలిలోకి ఎగరేస్తూ. 


రామయ్య చంటి వైపు చూసి, అతని ముఖంలో కొద్దిగా చిరునవ్వు కనిపించింది. "అది కాదే.. మన చంటిగాడు సూడు.. ఈ వయసులో.. ఆయన వాళ్ళ నుంచి దూరం పోయి ఎట్టా ఉంటాడే.. ఇక్కడైతే కొంత మంది పిల్లలు ఉన్నారు.. వాళ్లతో ఆడతాడు.. ఆడికి పోతే.. వాడికి ఆడుకోవటానికి తోడు ఉండదే.. నా మాట విను.. " అన్నాడు భర్త, చంటిని ప్రేమగా చూస్తూ. "నాకు తెలుసు నగరంలో జీవితం కష్టం.. కానీ వాడి భవిష్యత్తు కోసం.. "


లచ్చి కళ్ళల్లో నిశ్చయం కనిపించింది. "ఈ పాలి నేను చెప్పేది నువ్వు వినాలే అంతే.. లేదంటే నీతో మాట్లాడ సూసుకో.. " అంది గట్టిగా. "నగరంలో వాడికి చదువు దొరుకుతుంది. మన లాగా బతకడు. "


రామయ్య లచ్చి కళ్ళలోకి చూసాడు. అతని కళ్ళలో భయం, ఆశ రెండూ కలిసి కనిపించాయి. "నువ్వు వాడే నా ప్రపంచం.. మీ ఇద్దరు కోసం ఏదైనా సేస్తా.. సరే.. రేపు పొద్దుగాలే పోదాం.. " అని ఒప్పుకున్నాడు. "కానీ ఒక్క మాట గుర్తుంచుకో లచ్చి, నగరంలో మనలాంటి వాళ్ళని ఎవరూ లెక్క చేయరు. మనం మన బలంతోనే నిలబడాలి. "


ఇంతలో చంటి వచ్చి, "అమ్మా ఆకలేస్తుంది.. అన్నం పెట్టే.. " అని అడిగాడు. 


లచ్చి చంటిని దగ్గరకు తీసుకుని, "పోయి కాళ్ళు సేతులు కడుక్కో రాపో.. బువ్వ వడ్డిస్తా.. పొద్దునే బస్తీకి పోతున్నాం.. ఆడ నీకు కొత్త కొత్త దోస్తులు ఉంటారు.. " అంది ఉత్సాహంగా. 


చంటి కళ్ళు పెద్దవి చేసి, "అవునా.. ఐతే సరే.. జల్ది తినేస్తా.. " అని పరుగెత్తాడు. 


ఆ రాత్రి, చంటి నిద్రపోయాక, రామయ్య బయట వరండాలో కూర్చుని ఉన్నాడు. లచ్చి వచ్చి అతని పక్కన కూర్చుంది. 


"ఏంటి ఆలోచిస్తున్నావ్?" లచ్చి అడిగింది. 


"నా తండ్రి ఈ ఊరిలో గౌరవంగా బతికాడు. నేను ఇలా పారిపోతున్నట్లు ఉంది, " రామయ్య అన్నాడు, గొంతు బొంగురుపోతుండగా. 


లచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. "ఇది పారిపోవడం కాదు. మన పిల్లాడి భవిష్యత్తు కోసం ముందడుగు. నీ తండ్రి కూడా అదే చేసేవాడు. "



రామయ్య నిట్టూర్చాడు. "నాకు తెలుసు. కానీ ఇక్కడ నేను ఎవరో. అక్కడ నేను ఎవరినో కూడా తెలియదు. "


"నువ్వు మా అన్నదాత, మా రక్షకుడివి. ఎక్కడైనా అదే, " లచ్చి అంది, అతని భుజంపై తల ఆనిస్తూ. 


మరుసటి రోజు ఉదయం, సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే, లచ్చి కుటుంబం ప్రయాణానికి సిద్ధమైంది. వారి చిన్న గుడిసె ముందు, పక్కింటి వదిన సీతమ్మ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న డబ్బా ఉంది. 


"వదినా పోయిస్తా.. జర మా ఇల్లు సూసుకో.. " లచ్చి అంది, తన చిన్న మూటను భుజానికి తగిలించుకుంటూ. 


"ఇదిగో లచ్చి, చంటికి దారిలో తినడానికి కొన్ని అట్లు చేసి తెచ్చా, " సీతమ్మ అంది, డబ్బాను అందిస్తూ. "నగరంలో మన ఊరి రుచులు దొరకవు. "


"ఎంత మంచిదానివే వదినా, " లచ్చి కృతజ్ఞతతో అంది. 


సీతమ్మ రామయ్య వైపు తిరిగి, "రామయ్య, నువ్వు మంచి వాడివి. అక్కడ కూడా నీ మంచితనం నిన్ను కాపాడుతుంది. భయపడకు, " అని ధైర్యం చెప్పింది. 


"అట్లనే నువ్వు జాగ్రత్త లచ్చి.. చంటోడు జాగ్రత్త.. " సీతమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అంది. 


"పదే.. బస్ ఎల్లిపోతుంది.. చంటి ఆడుకుంది సాలు పద పోదాం.. " రామయ్య తొందరపెట్టాడు, తన గొంతులో ఉద్వేగాన్ని దాచుకుంటూ. 


చంటి తన చిన్న స్నేహితుడు రాము దగ్గరకు వెళ్ళాడు. రాము కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. 


"ఒరేయ్, నేను బస్తీకి పోతున్నా.. మళ్ళీ రాను.. ఆడ నాకు కొత్త దోస్తులు ఉన్నారంట.. మా అమ్మ చెప్పింది.. " చంటి చెప్పాడు, తన స్వరంలో ఉత్సాహం, భయం రెండూ కలిసి ఉన్నాయి. 


"నువ్వు మళ్ళీ రావా?" రాము అడిగాడు, గొంతు బొంగురుపోతుండగా. 


"నాకు తెలియదు. కానీ ఇగో రాము.. నా గోలి తీసుకో.. నీకు ఇస్తున్న.. " అని చంటి తన అత్యంత విలువైన గోలీని అందించాడు. 


రాము నిశ్శబ్దంగా ఆ గోలీని తీసుకున్నాడు, చంటి వైపు దిగులుగా చూస్తూ. "నేను నిన్ను మర్చిపోను, " అని చెప్పాడు. 


ముగ్గురు ఆ ఊరి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. బస్సు ప్రయాణంలో, చంటి కిటికీ నుంచి బయటకు చూస్తూ, మారుతున్న దృశ్యాలను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. చిన్న గ్రామాలు, పచ్చని పొలాలు, నీలి చెరువులు వెనుకబడిపోతుండగా, క్రమంగా రద్దీ రోడ్లు, పెద్ద భవనాలు కనిపించడం మొదలయ్యాయి. 


బస్సు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించేసరికి, చంటి కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి. ఎక్కడ చూసినా జనం, వాహనాలు, శబ్దాలు. హారన్ల మోతలు, వ్యాపారుల కేకలు, వాహనాల ధూమం - అన్నీ కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఆకాశాన్ని తాకేలా ఉన్న భవనాలు, రంగురంగుల హోర్డింగులు, వెలుగుల మెరుపులు - ఇవన్నీ చంటికి కలలా అనిపిస్తున్నాయి. 


"అమ్మా, ఇవన్నీ ఏంటి?" అని అడిగాడు చంటి, ఎత్తైన భవనాలను చూపిస్తూ, అతని గొంతులో ఆశ్చర్యం, భయం రెండూ కలిసి ఉన్నాయి. 


"అవి పెద్ద పెద్ద ఇళ్ళు రా.. వాటిలో చాలా మంది ఉంటారు.. " లచ్చి చెప్పింది. 


పొద్దంతా తిరిగి, ఒక బస్తీకి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న గుడిసె అద్దెకి దొరికింది. పొలం అమ్మిన డబ్బులతో అప్పులు అన్ని తీర్చగా మిగిలిన కొంత డబ్బులు ఖర్చుల కోసం ఉంచుకున్నారు. వాటితో ఆ గుడిసె అద్దెకు తీసుకొని ఉందాం అని నిర్ణయించుకున్నారు. 


గుడిసె చిన్నదే అయినా, వారికి కొత్త ఆశలతో నిండిన ఇల్లు. లచ్చి దాన్ని శుభ్రం చేసి, వారి కొద్దిపాటి సామాన్లతో అలంకరించింది. చంటి కోసం ఒక మూలలో చిన్న పడక ఏర్పాటు చేసింది. 


చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా మెలగడం మొదలుపెట్టారు. పక్కింటి అమ్మాయి సుమతి, లచ్చికి బస్తీ గురించి చాలా విషయాలు చెప్పింది. ఎక్కడ సరసమైన ధరలకు సరుకులు దొరుకుతాయో, ఎక్కడ పని దొరకవచ్చో తెలియజేసింది. 


అలా కొద్ది రోజులు గడిచాక లచ్చి భర్తకి కూలి పని దొరికింది. ఒక నిర్మాణ ప్రాంతంలో రోజువారీ కూలిగా పని చేయడం మొదలుపెట్టాడు. వారి సమస్యలు తీరిపోయాయి అని ఆనందపడుతూ ఉన్నారు. 


కానీ చంటికి మాత్రం కొత్త పరిసరాలు అంత సులభంగా నచ్చలేదు. ఒక సాయంత్రం, అతను ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. 


"ఇక్కడ నాతో ఎవ్వరు సక్కగా ఆడ్తలేరు.. అంతా తోతిరి తొండి ఆడుతున్నారు.. ఎప్పుడు వాళ్లే గెలుస్తున్నారు.. మనం మన ఊరికి ఎల్లిపొదం.. " అని ఏడుస్తుంటే, లచ్చి దగ్గరకి తీసుకొని సర్దిచెప్తుంది. చంటి వింటూ వింటూ నిద్రలోకి జారుకుంటాడు. 


ఆ రాత్రి, లచ్చి భర్త చింతగా అన్నాడు, "సుసావే లచ్చి.. మనకి పని దొరికిందనుకుంటున్నాం కానీ వాడి గురించి ఆలోచిస్తలేము.. "


"అది కాదయ్య.. ఈడ్నే ఉంటే వాడే మారతాడు.. వాడ్ని నేను చూసుకుంటా.. పండుకో పొద్దుగాల్నే పోవాలే కదా పనికి.. " లచ్చి ధైర్యం చెప్పింది. 


అలా కొద్దిరోజులు గడిచాయి. ఒక రోజు, లచ్చికి కూడా పని దొరికింది. ఒక అపార్ట్మెంట్ బయట ఇస్త్రీ చేయడానికి మనిషి కావాలి అని పక్కింటామె చెప్పింది. లచ్చి ఆ అవకాశాన్ని వదులుకోలేదు. 


"వాడు నాతో పాటే ఉంటాడు.. వాడ్ని నేను చూసుకుంటాలే.. " లచ్చి తన భర్తతో చెప్పింది, చంటి గురించి. 


రోజు పొద్దున్న లేచి ఇద్దరు ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. చంటి, లచ్చితో కలిసి వెళ్తాడు. 


లచ్చి పని చేసే అపార్ట్మెంట్ చాలా పెద్దది. పదిహేను అంతస్తుల భవనం, చుట్టూ పచ్చని తోటలు, రంగురంగుల పూలమొక్కలతో అలంకరించబడి ఉంది. ప్రవేశద్వారం వద్ద పెద్ద ఫౌంటెన్, దాని చుట్టూ చిన్న చిన్న రాళ్ళు, వాటిపై నీటి బిందువులు మెరుస్తున్నాయి. సాయంత్రం అవ్వగానే చాలా మంది పిల్లలు అక్కడి ఆటస్థలంలో ఆడుకుంటుంటారు. వారి చేతుల్లో రంగురంగుల బంతులు, సైకిళ్ళు, స్కేట్‌బోర్డులు. వారి నవ్వులు, కేకలు గాలిలో తేలియాడుతున్నాయి. వారిని చూసి, చంటి కళ్ళు మెరిసాయి, అతని చిన్న గుండె వేగంగా కొట్టుకుంటోంది. 


"అమ్మా నేను వాళ్ళతో ఆడతా, " అని మొండి చేస్తాడు, చేతులు ముందుకు చాపుతూ. 


"మనం వాళ్ళతో ఆడలేము.. వాళ్ళు పెద్దోళ్ళు.. మనం చిన్నోళ్ళం.. " లచ్చి చెప్పింది, చంటి చేతిని గట్టిగా పట్టుకుంటూ. 


"మరి నువ్వేమో మస్తు మంది దోస్తులు ఉంటారు అని ఈడికి తీసుకువచ్చినవ్.. ఈడ నాతో ఆడనీకే ఎవ్వరూలేరు.. " అని ఏడుపు మొదలు పెడతాడు చంటి, కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా. 


ఇంతలో సాయంత్రం అయ్యింది. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తుండగా, ఆకాశం ఎరుపు, నారింజ రంగులతో నిండిపోయింది. ఆ అపార్ట్మెంట్ పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళందరిని కాంపౌండ్ గోడ ఇవతలి పక్కనుంచి చంటి చూస్తున్నాడు. తనకి తెలియని ఆటలు ఆడుతుంటే వింతగా చూస్తున్నాడు. ఒక పిల్లవాడు చేతిలో రిమోట్‌తో ఒక చిన్న విమానాన్ని ఎగురవేస్తున్నాడు. మరొకడు ఒక చిన్న రోబోట్‌ను నడిపిస్తున్నాడు. ఆడపిల్లలు రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటున్నారు. 


అక్కడే, అతను ప్రథమంగా ఆ విచిత్రమైన "డబ్బా"ను గమనించాడు. అపార్ట్మెంట్ ప్రవేశద్వారం దగ్గర ఉన్న ఆ పెద్ద మెటల్ బాక్స్‌లోకి మనుషులు వెళ్తున్నారు, కానీ బయటకు రావడం లేదు. కొంతసేపటికి, వేరే మనుషులు బయటకు వస్తున్నారు. ఆ డబ్బా తలుపులు స్లైడింగ్ తలుపుల్లా తెరుచుకుంటున్నాయి, మూసుకుంటున్నాయి. లోపల నుంచి ఏదో మెరుపు వెలుగు కనిపిస్తోంది. చంటికి ఇది చాలా విచిత్రంగా అనిపించింది, ఒక మాయాజాలంలా. 


చీకటి పడింది. "మీ నాయన ఇంటికాడ ఎదురుచూస్తున్నాడు.. పద.. " అని లచ్చి పిలిచింది. అయినా చంటి ఉలకడు పలకడు. లచ్చి వెళ్ళి భుజం తడుతుంది. అప్పుడు చంటి ఉల్లికి పడతాడు. 


"పద పద, " అని హడావుడిగా ఇంటికి బయలుదేరుతుంది లచ్చి. ఇంటికి వెళ్ళే దారిలో, చంటి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. 


"ఎటిరా ఎటైనాది.. ఏటి అంతగా ఆలోచిస్తున్నావ్?" లచ్చి అడిగింది. 


"ఏటి లేదమ్మా.. మనుషులు మాయం అవుతారా?" చంటి అడిగాడు, ఆ డబ్బా గురించి ఆలోచిస్తూ. 


"మాయం అవ్వటం ఏటి.. బాగా పొద్దెక్కినాది పడుకో, " అని చంటి వాళ్ళ నాన్న అనగానే భయంతో పడుకున్నాడు. కానీ అతని మనసులో ఆ డబ్బా గురించిన ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. 


మరుసటి రోజు లచ్చి ఇస్త్రీ పనిలో ఉండగా, చంటి వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ ఒక చోట నిలబడి చూస్తుంటాడు. ఆ డబ్బా ఉంది, అందులోకి మనుషులు వెళ్తున్నారు.. తరువాత మాయం అవుతున్నారు.. లేకపోతే వేరే వాళ్ళలాగా మారిపోతున్నారు.. ఆ డబ్బాను చూసి భయపడి దూరంగా నిలబడి చూస్తున్నాడు. 


ఇంతలో వాళ్ళ అమ్మ "చంటి చంటి" అని అరిచేసరికి, పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. తన మదిలో ఆ డబ్బా ఒక ప్రశ్నలాగా ఉండిపోయింది. అది ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం పెరిగింది. 


మరుసటి రోజు, "అమ్మా ఎపుడు పోదాం పనికి?" అని చంటి అడిగాడు, అసహనంగా. 


"ఇంట్లో కొంచెం పని ఉంది, కొద్దిసేపటి తరువాత వెళ్దాం, " లచ్చి చెప్పింది. 


"లేదు తొందరగా వెళ్ళాలి, " అని హడావుడి చేసాడు చంటి. అతని ఆరాటం చూసి లచ్చి పని త్వరగా ముగించుకొని బయలుదేరింది. 


లచ్చి తన ఇస్త్రీ చేసే పనిలో ఉండగా, చంటి మెల్లిగా ఆ డబ్బా దగ్గరకి వెళ్ళాడు. కొంతమంది ఎక్కుతున్నారు, మాయం అవుతున్నారు లేదా వేరే లాగ మారిపోతున్నారు. ఆ రహస్యం ఏంటా అని కనుక్కోవాలి అని ఆ డబ్బా దగ్గరకి వెళ్ళాడు. తను దగ్గరకి వెళ్ళేసరికి ఒకతను ఆ డబ్బనుంచి బయటకి వచ్చాడు. 


అప్పుడే లోపల ఏముందా అని తొంగిచూసాడు. అప్పుడు ఆ డబ్బా తలుపులు తెరుచుకున్నాయి. "అదేంటి?" అని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఇంకో సారి తొంగిచూసాడు, మూసుకుంటున్న తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. 


లోపల అంతా వింతగా ఉంది. మెరిసిపోయే మెటల్ గోడలు, పైన ఒక ప్రకాశవంతమైన లైట్, ఒక చిన్న ఫ్యాన్, గోడపై ఒక ఫోన్, మరియు వరుసగా అమర్చబడిన నంబర్ల బటన్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్ నుంచి వస్తున్న చల్లని గాలి చంటి ముఖాన్ని తాకింది. ఆ వింత ప్రపంచాన్ని చూడాలనే కుతూహలంతో, మెల్లిగా లోపలకి అడుగు పెట్టాడు. అనుకోకుండా, ఆ డబ్బా తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి, "ఫిష్" అనే శబ్దంతో. 


చంటికి చాలా భయం వేసింది. కంగారులో ఏమి చేయాలో అర్థం కాక ఏడుపు మొదలు పెట్టాడు. అప్పుడే ఆది కదలడం మొదలుపెట్టింది. ఇంకా భయం వేసింది తనకి. గోడలు కదులుతున్నట్లు అనిపించింది. ఏదో శబ్దం వినిపిస్తోంది, "హమ్మ్.. హమ్మ్.. " అని. 


కొద్దిసేపటి తరువాత ఆ డబ్బా వెళ్ళి ఒక చోట ఆగింది. తలుపులు మెలిగా తెరుచుకున్నాయి. కానీ తను ఎక్కడికి వచ్చాడో అర్ధం కావటం లేదు. ఎదురుగా ఎవ్వరు లేరు. భయం ఇంకా ఎక్కువైంది. తనకి ఏమి చేయాలో అర్థం కావటం లేదు. మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు. 


మళ్ళీ అది కదలడం జరిగింది. "ఏడుస్తే ఈ డబ్బా కదులుతుంది కాబోలు, " అని తన మనసులో అనుకున్నాడు. ఇంకా గట్టిగా ఏడవసాగాడు. 


ఆ డబ్బా వెళ్ళి ఒక చోట ఆగింది. మెల్లిగా తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఆ అపార్ట్మెంట్ గేట్ కనిపించింది. కొంచెం ఆనందపడ్డాడు. ఇంకొంచెం తీక్షణంగా చూసాడు, వాళ్ళ అమ్మ కనిపించింది. లచ్చిని చూడంగానే కొండంత ధైర్యం వచ్చింది. 


పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని హత్తుకున్నాడు. "అమ్మా, నేను మాయం అయ్యాను, మళ్ళీ వచ్చాను!" అని కేకలు వేసాడు. 


లచ్చి ఆశ్చర్యంగా, "ఏంటిరా ఏమైంది?" అని అడిగింది. 


"ఆ డబ్బాలో నేను మాయం అయ్యాను అమ్మా, పైకి వెళ్ళాను, మళ్ళీ కిందికి వచ్చాను", చంటి వివరించాడు, ఇంకా భయంతో వణుకుతూ. 


అప్పుడే వాళ్ళ నాన్న వచ్చాడు. "ఏంటి జరిగింది?" అని అడిగాడు. 


లచ్చి జరిగింది చెప్పింది. "వాడు లిఫ్ట్‌లో ఎక్కినట్లున్నాడు, భయపడ్డాడు, " అని చెప్పింది. 


"అయ్యో, పాపం, " అని చంటిని ఎత్తుకున్నాడు అతని తండ్రి. "ఇవాళ నీ పుట్టినరోజు కదా, పద ఇంటికి వెళ్దాం. నీకోసం ఒక చిన్న బహుమతి తెచ్చాను, " అని చెప్పాడు. 


ఆ రోజు చంటి పుట్టినరోజు. చంటి వాళ్ళ అమ్మ ఇంకా నాన్న, ఇద్దరు తన పుట్టిన రోజు వేడుకుని వాళ్ళకి ఉన్న స్థోమతలో చేశారు. ఒక చిన్న కేకు, కొన్ని రంగురంగుల బెలూన్లు, ఒక చిన్న బొమ్మ - ఇవన్నీ చంటికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. 


చంటి ఆ రోజు జరిగింది కొంతవరకు మర్చిపోయి, తన ఇంటిదగ్గర ఉన్న పిల్లలతో సరదాగా గడిపాడు. కానీ తనలో ఆ భయం అలానే ఉండిపోయింది. 


కొన్ని రోజుల తరువాత, లచ్చి చంటిని తీసుకుని మళ్ళీ ఆ అపార్ట్మెంట్‌కి వెళ్ళింది. ఈసారి, ఆమె చంటికి ఆ "డబ్బా" గురించి వివరించింది. 


"చూడు చంటి, ఇది లిఫ్ట్ అంటారు. ఇది మనల్ని పైకి, కిందికి తీసుకెళ్తుంది. ఇందులో ఎక్కడానికి భయపడాల్సిన అవసరం లేదు, " అని చెప్పింది. 


చంటి భయంగానే ఉన్నాడు, కానీ అమ్మ చేయి పట్టుకుని లిఫ్ట్‌లోకి అడుగుపెట్టాడు. లచ్చి బటన్ నొక్కింది, లిఫ్ట్ మెల్లగా పైకి వెళ్ళింది. చంటి కళ్ళు మూసుకున్నాడు, కానీ అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. 


"చూడు, ఇప్పుడు మనం పైన ఉన్నాం. ఇక్కడ నుంచి కిందంతా చూడొచ్చు, " లచ్చి చెప్పింది, లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి, అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి చూపిస్తూ. 


చంటి కళ్ళు తెరిచి చూసాడు. అతని కళ్ళముందు ఒక అద్భుతమైన దృశ్యం విస్తరించింది. పట్టణమంతా చిన్న చిన్న ఇళ్ళు, రోడ్లు, వాహనాలు - అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి. దూరంగా పొలాలు, కొండలు కనిపిస్తున్నాయి. 


"వావ్!" అని ఆశ్చర్యపోయాడు చంటి. "మనం ఎంత పైకి వచ్చాం అమ్మా!"


"ఇది మాయం కాదు చంటి, ఇది సైన్స్. మనిషి తెలివితేటలతో చేసిన యంత్రం, " లచ్చి వివరించింది. 


ఆ రోజు నుంచి, చంటి లిఫ్ట్‌కి భయపడటం మానేసాడు. అతనికి ఇప్పుడు అర్థమైంది - తను చూసింది ఒక లిఫ్ట్ అని, దానిలో పైకి కిందికి వెళ్ళొచ్చని. కొద్ది రోజులకు తెలుసుకొని తనకి ఉన్న భయాన్ని పోగొట్టుకున్నాడు. 


నగరంలో కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త స్నేహితులను పొందడం మొదలుపెట్టాడు. అపార్ట్మెంట్‌లోని పిల్లలతో ఆడుకోవడం నేర్చుకున్నాడు. వారి ఆటలు వేరుగా ఉన్నా, చంటి త్వరగా అలవాటు పడ్డాడు. 


లచ్చి కుటుంబం నెమ్మదిగా నగర జీవితానికి అలవాటు పడసాగింది. వారి కష్టాలు తగ్గుముఖం పట్టాయి. చంటి కోసం ఒక చిన్న పాఠశాలలో చేర్పించారు. లచ్చి భర్తకు మంచి పని దొరికింది. లచ్చి కూడా ఇస్త్రీ పనితో పాటు, మరికొన్ని ఇళ్ళలో పనిచేయడం మొదలుపెట్టింది. 


ఒక సాయంత్రం, చంటి తన తండ్రితో మాట్లాడుతూ, "నాన్నా, నేను పెద్దయ్యాక లిఫ్ట్ లాంటివి చేసే ఇంజనీర్ని అవుతాను, " అని చెప్పాడు. 


అతని తండ్రి నవ్వి, "తప్పకుండా అవుతావు రా, " అని చెప్పాడు, చంటి తలపై ప్రేమగా నిమురుతూ. 


గ్రామంలో ఉన్నప్పుడు కనిపించని అవకాశాలు, కలలు ఇప్పుడు చంటి ముందు విస్తరించాయి. ఒకప్పుడు భయపెట్టిన "మాయం" ఇప్పుడు అతని భవిష్యత్తుకు ద్వారం తెరిచింది. 


ముగింపు

************

ఫణి శ్యామ్ దేవరకొండ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/phanishyam

నా పేరు ఫణి శ్యామ్ దేవరకొండ. నేను హైదరాబాద్, తెలంగాణలో నివసిస్తున్నాను. గత ఇరవై సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగ బాధ్యతలతో పాటు, రచన పట్ల ఉన్న ఆసక్తితో కథలు రాయడం నా జీవితంలో ఒక భాగంగా మారింది.


2019వ సంవత్సరం నుండి కథా రచనను ప్రారంభించాను. ఇప్పటివరకు ఇరవైకి పైగా కథలు రాశాను. నా కథల్లో ఎక్కువగా సస్పెన్స్, డిటెక్టివ్ థ్రిల్లర్, ఎమోషనల్, ఇన్‌స్పిరేషనల్ మరియు సందేశాత్మక అంశాలు ఉంటాయి. 

ప్రతి కథలో జీవితంలోని ఒక కోణాన్ని, ఒక ఆలోచనను లేదా ఒక విలువను ప్రతిబింబించేలా ప్రయత్నిస్తాను.


నా కథలు ప్రతిలిపి, స్టోరీ మిర్రర్, మాతృభారతి వంటి ప్రసిద్ధ వేదికలలో ప్రచురితమయ్యాయి. స్టోరీ మిర్రర్‌లో ప్రచురితమైన నా కథ “అదే రోజు” చదివిన ఒకరు, దానిని షార్ట్ ఫిల్మ్‌గా రూపొందిస్తామని నన్ను సంప్రదించారు. అది నాకు ఎంతో గౌరవంగా, గర్వంగా అనిపించిన సందర్భం. ఆ కథని షార్ట్ ఫిలింగా మలిచి యూట్యూబ్ లో విడుదల చేశారు.


ఇటీవల 'మన తెలుగు కథలు' వెబ్‌సైట్ చూసి చాలా సంతోషం కలిగింది. కథా రచయితలకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం, నిర్వహిస్తున్న పోటీలు, బహుమతులు మరియు అభినందనలు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయి.


కథల ద్వారా పాఠకుల మనసును తాకడం, వారిలో స్ఫూర్తిని కలిగించడం, జీవితానికి ఒక చిన్న వెలుగును చూపించడం — ఇదే నా లక్ష్యం.


రచయితలకు మీరు ఇస్తున్న ప్రోత్సాహం, ఆదరణ మరియు సాహిత్య స్ఫూర్తి నిజంగా అభినందనీయం. 'మన తెలుగు కథలు' బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page