top of page
Original.png

చూపు లోపం

#ChupuLopam, #చూపులోపం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు


Chupu Lopam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 03/03/2026

చూపు లోపం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

“ప్రతిరోజూ పక్కింటి ఆవిడ బట్టలు చూసి విమర్శించేది… కానీ ఒక ఉదయం ఆమె చూసింది ఆమె జీవితాన్నే మార్చేసింది…”


పక్కవారిని తప్పు పట్టే ముందు మన లోపాన్ని సరిచేసుకోవాలి. జీడిగుంట శ్రీనివాస రావు గారి చూపు లోపం కథ  ఈ నీతిని బోధిస్తుంది. 

సచిన్, రమణిలది కొత్త కాపురం. సచిన్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుంటే, రమణి ఊరగాయలు తయారు చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తుంది. ఇన్కమ్ బాగుండటంతో ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్‌ను కొనుక్కున్నారు.


చుట్టాలందరినీ పిలిచి పెద్ద ఎత్తున గృహప్రవేశం చేసుకుని, నూతన గృహంలో ప్రవేశించారు.


హడావుడి తగ్గిన తరువాత రమణి తన బెడ్ రూమ్ కిటికీ నుండి చూస్తే పక్కనే ఉన్న ఒక పాత కాలపు పెంకుటిల్లు, దాని వెనుక ఉన్న విశాలమైన పెరడు కనిపిస్తుంది. ఇల్లు పెంకుటిల్లు అయినా అంత పెద్ద ఖాళీ స్థలం ఉండటం, అటువంటి స్థలం ఉంటే తన ఊరగాయల తయారీకి ఎంతో ఉపయోగపడేది కదా, అనుకుంది.


రమణికి చేతిలో డబ్బులు ఆడటంతో, తనంత తెలివితేటలు గల భార్య దొరకడం భర్తకు అదృష్టం అనుకునేది. పనిమనిషిని కూడా మంచి బట్టలు కట్టుకుని రావాలి అని చెప్పేది. ప్రతీ వారిలో ఏదో ఒక వంక కనిపెట్టి, భర్త సచిన్ ఇంటికి రాగానే వినిపించేది. 


"మనకెందుకు రమణి? వారి పరిస్థితులు ఏమిటో మనకు తెలియదు కదా? ఎందుకు అందరిలో లోపాలు వెతుకుతావు?" అనేవాడు. 


"ఎందుకంటే మా పుట్టింట్లో ఎంతో శుభ్రత పాటించేవాళ్ళం, అందుకే" అనేది రమణి.


ఒకరోజు డాబా మీద గుమ్మడి వడియాలు పనిమనిషి సుభద్రతో పెట్టిస్తూ, పెంకుటిల్లు ముందు మంచం వేసుకుని కూర్చొని ఉన్న అరవై ఏళ్ల ఆవిడను చూసి, "బాగున్నారా? నా పేరు రమణి, మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాము, మీ పేరు ఏమిటి?" అని పరిచయం చేసుకుంది.


"మంచిది. కొన్నాళ్ల క్రితం గృహప్రవేశం చేసుకున్నారు కదా, గమనించాను. నా పేరు తులసమ్మ. వయసులో ఉన్నప్పుడు నన్ను తులసి అనే వాళ్ళు" అంది నవ్వుతూ.


"మీరు ఒక్కరేనా? బాబాయ్ గారు కనిపించరు" అంది రమణి. 


"బాబాయ్ గారు ఈ ఊరిలో ఉన్న శివాలయంలో పూజారి. అందుకే తెల్లవారుజామున గుడికి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను. మీ వ్యాపారం బాగానే ఉన్నట్టు ఉంది. రోజూ ఇంటికి రాపిడో వాళ్ళు వస్తుండటం చూశాను" అంది తులసమ్మ గారు.


సాయంత్రం భర్త రాగానే విషయం చెప్పి, "వ్యాపారం బాగానే ఉన్నట్టు ఉంది అని దిష్టి కొట్టేసింది ఆ పెంకుటిల్లు ఆవిడ" అంది.


ఒకరోజు, "నువ్వు తయారుచేసిన పచ్చళ్లు శాంపిల్ ఇవ్వు. ఇంక దిష్టి ఉండదు. రుచి చూసిన తరువాత" అన్నాడు. 


"అంటే నేను పెట్టే పచ్చళ్లు రుచిగా ఉండవు అనేగా మీరు అనేది? రుచిగా లేకపోతేనేనా ఇన్ని ఆర్డర్లు వస్తున్నాయి? ఇంటి లోన్ డబ్బులు నా సంపాదన నుంచి కూడా అనేది గుర్తు పెట్టుకోండి" అంది.


మర్నాడు ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ కిటికీలో నుంచి పెంకుటిల్లు వైపు చూసింది. తన పెరట్లో బట్టలు ఉతుక్కుని, తాడు మీద ఆరవేసుకుంటున్న తులసమ్మ గారిని చూసి, "ఏమిటో ఆ బట్టలు ఉతికిందా లేదా? ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి. అంతగా పని చేసుకోలేకపోతే పనిమనిషిని పెట్టుకోవాలి" అనుకుంది.


మర్నాడు కూడా ఆరేసిన బట్టలు మురికిగా ఉండటం చూసి,


"సచిన్ ఒక్కసారి ఇటు రావా?" అని పిలిచింది. సచిన్ ఆఫీస్ బ్యాగ్ సర్దుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. "చూడు సచిన్, ఆ పక్కావిడ బట్టలు ఎలా ఉతికిందో! ఆ తెల్లటి తువ్వాళ్లు చూడు... అన్నీ బూడిద రంగులో ఉన్నాయి. సరిగ్గా ఉతకడం రాదో లేక ఆవిడకు ఓపిక లేదో కానీ... అంత మురికి బట్టలు తాడు మీద వేస్తే చూడటానికే చిరాగ్గా ఉంది. మన గెస్టులు ఎవరైనా వస్తే, 'మనం ఇటువంటి వాళ్ళ పక్కన ఉన్నమేమిటి?' అంటారేమో" అంది రమణి.


"మన ఇల్లు తప్ప చుట్టపక్కల ఎవరూ ఉండకూడదు అంటే అడవిలో కట్టుకోవాలి లేదా ఏ ఫిల్మ్ నగర్‌లోనే కొనుక్కోవాలి. అయినా పక్కింటి వాళ్ళ విషయం నీకెందుకు? టైం వేస్ట్ చేసుకోక కేటరింగ్ కూడా మొదలుపెట్టు" అన్నాడు నవ్వుతూ సచిన్.


ప్రతిరోజూ ఆమెకు ఆ కిటికీ దగ్గర నిలబడటం, తులసమ్మ ఉతికిన బట్టల మీద విమర్శలు చేయడం ఒక వ్యసనంగా మారిపోయింది.


"ఈరోజు ఆవిడ ఉతికిన బెడ్ షీట్లు చూడు... వాటి మీద ఇంకా పాత మరకలు అలాగే ఉన్నాయి. బహుశా ఆవిడకు మంచి డిటర్జెంట్ కొనుక్కునే స్తోమత లేదేమో!" అని ఒక రోజు... "ఆవిడ బట్టలు ఆరవేసే తీరు చూస్తుంటేనే, ఆవిడ ఎంత అపరిశుభ్రమైన మనిషో అర్థమవుతోంది" అని ఇంకో రోజు... ఇలా రకరకాలుగా విమర్శించేది.


ఒకరోజు తట్టుకోలేక, "రమణి, ఎదుటివారి గురించి మనకెందుకు? ఆవిడ ఈ వయసులో కూడా తన పని తను చేసుకుంటోంది. నీలాగా పనిమనిషితో పనులు చేయించుకోవడం లేదు. మనం మన పని చూసుకుందాం" అన్నాడు. 


కానీ రమణి తగ్గలేదు. "నేను చూస్తున్నది నిజం సచిన్. కళ్ళకు కనిపిస్తున్న మురికిని కాదనలేము కదా? నా దృష్టిలో పరిశుభ్రత లేని మనుషులు సంస్కారం లేనివారితో సమానం" అని కఠినంగా మాట్లాడింది.


"ఒక పని చేద్దాం. వాళ్ళ ఆయన పూజారిట. మన ఇంట్లో ఏమైనా పూజ చేయించుకుని కొంత డబ్బు సహాయం చేద్దాం. ఏమంటారు?" అంటున్న భార్య వంక, 'తనకి ఈ గర్వం ఎలా వచ్చిందో' అనుకున్నాడు.


ఆ రాత్రి ఏదో సినిమా చూసి లేటుగా పడుకున్న రమణి, పది గంటలకు లేచింది. ఆదివారం అవ్వడంతో అప్పటికే నిద్రలేచిన సచిన్ వేడి వేడి టొమోటో బాత్, ఫ్లాస్కులో వేడి కాఫీ పోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి న్యూస్ చూస్తున్నాడు. ఆవలించుకుంటూ హాల్లోకి వచ్చిన భార్యను చూసి, "గుడ్ మార్నింగ్. రమణి, త్వరగా రా! ఈరోజు ఆ పక్కావిడ బట్టలు చూడు... నువ్వు షాక్ అవుతావు" అన్నాడు.


ఆత్రంగా కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. ఆమె నమ్మలేకపోయింది. ఆ తాడు మీద ఆరవేసిన బట్టలు సూర్యకాంతిలో తళతళలాడుతూ కనిపించాయి.


"చూశారా సచిన్, ఈరోజు ఆవిడ బట్టలు ఎంత తెల్లగా ఉతికిందో! బహుశా ఆవిడ వాషింగ్ మెషిన్ కొని ఉండాలి. మొత్తానికి ఆవిడలో మార్పు వచ్చింది" అంది.


అప్పుడు సచిన్ భార్య భుజంపై చేయి వేసి, "రమణి, ఆవిడలో ఏ తేడా లేదు. నిజానికి తేడా నువ్వు చూసే కిటికీ అద్దంలో ఉంది. ఇంటికి కలర్ వేసినవాడు అద్దానికి అంటిన కలర్స్ తుడవకపోవడంతో, నీ కంటికి అలా కనిపించింది. ఈరోజు ఉదయం నేను ఆరు గంటలకే లేచి... సోపు నీళ్లు తీసుకుని మన బెడ్‌రూమ్ కిటికీకి ఉన్న అద్దాన్ని శుభ్రంగా తుడిచాను. ఇన్నాళ్లూ నువ్వు చూసిన మురికి ఆవిడ బట్టల మీద లేదు" అన్నాడు శాంతంగా.


రమణి "అయ్యో, అది గమనించక ఇన్నాళ్లూ ఆవిడను తప్పుగా అనుకున్నాను. తను చూసిన ప్రతి మురికి, ప్రతి మరక తన అద్దానిదే" అని తెలిశాక సిగ్గుపడింది.


సచిన్ మెల్లగా ఆమెను కూర్చోబెట్టి ఇలా అన్నాడు, "రమణి, ఈ ఒక్క అద్దమే కాదు... నువ్వు నీ మనసులో కూడా ఒక మురికి పొరను ఏర్పరచుకున్నావు. అందుకే నీకు ఎదుటివారిలో లోపాలు మాత్రమే కనిపించాయి. ఇందాక నేను పూజారిగారిని పలకరించాను, ఆయన చెప్పారు...


వాళ్ల అబ్బాయి ఆర్మీలో మేజర్. సరిహద్దుల్లో ఉండి మన దేశాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నాడు. ఏడాదికి ఒక పది రోజులు వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉంటాడట. పూజారి గారు అంతకంటే ముందు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి, ఖాళీగా ఉండకుండా గుడిలో పూజారిగా ఉంటున్నారట.


ఒకసారి వెళ్లి ఆవిడను ఆప్యాయతగా పలకరించి, 'ఏదైనా అవసరం అయితే నువ్వు వస్తాను' అని చెప్పి రా" అన్నాడు సచిన్.


రమణి కళ్లల్లోంచి నీళ్లు ధారగా కారాయి. ఆమెకు తను చేసిన పాపం అర్థమైంది. ఇన్నాళ్లూ తను సాటి వ్యక్తిని నిందిస్తూ కాలం గడిపింది. కిటికీలోంచి చూసింది. ఇప్పుడు అద్దం ఎంత స్వచ్ఛంగా ఉందో, ఆమె ఆలోచనలు కూడా అంతే స్పష్టంగా మారాయి.


ఆమె వెంటనే కిందకు వెళ్లి, తనను తులసమ్మ గారికి పరిచయం చేసుకుని, ఆవిడ తాడు మీద బట్టలు ఆరవేస్తుంటే, "అమ్మా... నన్ను మీ కూతురిలా అనుకుని ఈ బట్టలు ఆరవేయడంలో సహాయం చేయనివ్వండి" అని అడిగింది.


మనసులో మురికి పెట్టుకుని ఎవరిని చూసినా ఏదో ఒక లోపం కనిపించడం సహజం. ఎదుటివారిలో కూడా ఏదో తెలియని గొప్పతనం ఉంటుంది అనుకుంటే, అందరూ మనవాళ్ళే అనిపిస్తుంది.

శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@t.s.sbhargavateja6196

•9 hours ago

Awesome story srinivas rao garu. Chaala bavundi🎉

Like

@saipraveenajeedigunta8361

•37 minutes ago

Very interesting story

Like
bottom of page