top of page

స్నేహం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Sneham' New Telugu Story Written By Jidigunta Srinivasa Rao


రచన : జీడిగుంట శ్రీనివాసరావు


రమణ, శ్రీధర్ యిద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరడంతో ఇద్దరికీ స్నేహం కుదిరిపోయింది. ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసి తిరుగుతో వుండేవారు. వాళ్ల పెళ్లిళ్లు కూడా ఒక నెల తేడా లో చేసుకుని, హైదరాబాద్ లో పక్క పక్కన ఇల్లు తీసుకొని, ఆఫీస్ కి యిద్దరు కలిసి వెళ్ళి వస్తోవుండే వాళ్ళు. రమణ కి స్కూటర్ వుండటం వలన అదే స్కూటర్ ఎక్కి రమణతో శ్రీధర్ వెళ్ళేవాడు.


భర్త దగ్గర చనువు వచ్చిన తరువాత, ఒకరోజు రమణ భార్య రమణ ని “మీ ఫ్రెండ్ రోజూ మీ స్కూటర్ మీద రావడమేనా, పెట్రోల్ ఖర్చు సగం ఏమైనా యిస్తున్నాడా” అని అడిగింది.


“ఆ.. వాడు ఏమీ యివ్వడం లేదు, అయినా రోజూ నేను ఎలాగో వెళ్ళాలి. వాడు వెనుక కూర్చుంటాడు.. అంతే! దీనికి డబ్బు సగం ఇమ్మంటే ఏం బాగుంటుంది?” అన్నాడు రమణ.


“యిప్పుడు బాగానే వుంటుంది. యిహ రానురాను అన్నీ మన నెత్తిన పెడతాడేమో” అంది రమణ భార్య గొణుగుతూ.


“వదిలే యిహ, నేను చూసుకుంటాను. పొరపాటు న కూడా శ్రీధర్ భార్య తో మాటవరసకైనా అనకు” అని హెచ్చరించి, చొక్కా తగిలించుకుని శ్రీధర్ ఇంటికి బయలుదేరాడు.

యిద్దరికీ సాయంత్రం ఒక గంట రాజకీయాలు మాట్లడుకోవడం అలవాటు.

శ్రీధర్ రెండు కుర్చీలు మామిడి చెట్టు కింద వేసి రమణ రాక కోసం ఎదురు చూస్తో కూర్చుని వున్నాడు.


గేటు తీసుకుని సరాసరి వెళ్లి కుర్చీలో కూర్చొని, “ఏరా.. ఈ సారి మన ఆఫీస్ స్టాఫ్ ఎలక్షన్ లో నువ్వు తప్పకుండా నిలబడితే గాని లాభం లేదురా. యిప్పుడు వున్న వాళ్ళు, వాళ్ళకి మంచి పోస్టింగ్స్ కోసం పని చేసున్నారు తప్పా ఉద్యోగుల మంచికి ఏమీ చేయడం లేదు” అన్నాడు శ్రీధర్ తో.


యింతలో లోపల నుంచి రెండు ప్లేట్ లలో దోశలు తీసుకుని వచ్చి మొగుడికి ఒకటి, రమణ కి ఒక ప్లేట్ అందించి “తినండి అన్నయ్య గారు, ఈ లోపున మంచి కాఫీ కలిపి తెస్తాను” అంది శ్రీధర్ భార్య సుజాత.


“యిప్పుడు ఎందుకమ్మా! యింకో గంట ఆగితే మళ్ళీ భోజనం చేయాలి..” అంటూ ప్లేట్ లో ని దోశని ముక్కవిరిచి నోట్లో పెట్టుకుని, “దోశ చాలా బాగుంది, యింత రుచిగా ఎలా చేసారు? మా యింట్లో దోశ రుచిగా వుండటం లేదు” అన్నాడు రమణ శ్రీధర్ భార్య తో.

“అయ్యో.. ఈ దోశలు నేను చేసినవి కాదు అన్నయ్య గారు, మీ యింటినుంచి అక్కయ్య వేసి పంపించింది మాకు” అంది.


విని కంగు తిన్న రమణ “అలాగా, చూడు సుజాత మీ అక్కయ్య.. తినేది నేను అని నూనె వేయకుండా వేసి తినిపిస్తుంది. తన వంట గొప్ప తెలియటం కోసం నీకు బాగా శ్రద్ధతో చేసి పంపింది” అన్నాడు.


“చాల్లేరా ఆపండి, మీ అన్నాచెల్లెలుకి ఎప్పుడు తిండి గొడవే” అంటూ ప్లేట్ పక్కన పెడుతో “నువ్వు ఏమన్నా చెప్పు, మీ యింట్లో వంటలు రుచిగా వుంటాయి రా” అన్నాడు శ్రీధర్ రమణ తో.


“సరే.. పొరుగింటి పుల్లకూర రుచి అని, నేను వెళ్తాను యిహ, నువ్వు రేపు త్వరగా రా, నేను ఆఫీస్ కి ముందుగా వెళ్ళాలి” అని బై చెప్పి యింటికి బయలుదేరాడు రమణ.

గేటు చప్పుడు విని బయటకు వచ్చి, లోపలికి వస్తున్న భర్త రమణ తో, “ఈ రోజు మీ ఫ్రెండ్ త్వరగా వదిలినట్టున్నాడు, యిల్లు గుర్తుకు వచ్చింది తమకు” అంది.

“అది సరే గాని వాళ్ళకి దోశలు పంపించావా?” అన్నాడు.


“అవును. పాపం మీ స్నేహితుడి భార్య సుజాత కి రాత్రులు నిద్రపట్టక, తెల్లవారిజామున నిద్రపోయి, పొద్దెక్కిన తరువాత లేస్తుంది ట. దానితో మొగుడికి యింత టిఫిన్, అన్నం లోకి మంచి కూర కూడా చెయ్యలేకపోతున్నాను అని ఒకటే బాధ పడింది. ‘యింతోటీ టిఫిన్ కి, కూర.. నువ్వు వండాలా, నేను పంపుతాలే’ అన్నానండి. ఏదో మీరు అన్నయ్య గారిని మీ స్కూటర్ మీద తీసుకుని వెళ్తున్నారు, నేను నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను” అంది.


యింత లా పాయింట్ లాగిన తరువాత యింకా ఏమనలో తెలియక, “నువ్వు రోజు కూరలు వండి పంపు, అవి తరగలేక నేను చస్తున్నాను. మన యిద్దరికి కిలో చప్పున కూరలు కొంటున్నావు ఏమిటా అనుకుని, నువ్వు కూర ఎక్కువ తింటావేమో అనుకున్నాను, ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నావని తెలియదు” అన్నాడు రమణ.


“ఏ, ఏమన్నా వంటలు బాగుండలేదన్నారా? యిన్నాళ్ళకి యిప్పుడు వంటల గురించి ఎందుకు వచ్చింది, నిజం చెప్పండి, నా వంట వాళ్ళకి కూడా నచ్చలేదా?” అంది.

“అదేమి లేదు, లోట్టలేసుకుని తింటున్నారు. దానితో వాళ్ళకి గ్యాస్ ఆరు నెలలకి పైన వస్తోంది ట. అది సరే గాని నువ్వు నీ వంటకాలు ఎవరి చేతికి యిస్తున్నావు, శ్రీధర్ కా, వాళ్ళావిడకా” అన్నాడు.


“అయ్యో మీ ఫ్రెండ్ చేతికి ఎలా యిస్తానండి, మా స్నేహాతురాలే తీసుకుంటుంది, ఎందుకు అలా అడుగుతున్నారు?” అంది రమణ వంక అనుమానం గా చూస్తో.

“అదికాదే పిచ్చ మొహమా, కూరలు తీసుకోవడానికి లేస్తుంది గాని, మొగుడికి వంట చేయడానికి నిద్ర అడ్డం. మొగుడు పెళ్ళాలు ఇద్దరు నాటకాలు ఆడి, అన్నీ మన చేత చేయించుకుంటున్నారు, రేపటినుండి, ఏమి పంపకు, వాళ్లే వండుకుంటారు లేదా మానేస్తారు” అన్నాడు భార్య తో రమణ.

“సరే, ఈ మాటలన్నీ మీ స్నేహాతుడిని చూడగానే మర్చిపోయి,పద్మా,శ్రీధర్ వచ్చాడు, నాలుగు ఉల్లిపాయలు తరిగి వేడి వేడిగా నాలుగు పకోడీలు వేస్తావా అని ఆర్డర్ వేస్తారు” అంది మొగుడి తో.


“లేదు ఆలా అనను, అన్నా నువ్వు పట్టించుకోకు, వాళ్ళకి అలవాటు అయిపొయింది మన వంటలు తినటం, పైగా నువ్వు వంట బాగా చేస్తావని ఒక సర్టిఫికెట్ కూడా యిచ్చాడు” అన్నాడు రమణ.

“మీకు తప్ప నా వంట ఎవరికైన నచ్చుతుంది అని, సరేలెండి, రేపటి నుంచి మీ ఫ్రెండ్ కి కాఫీ కూడా యివ్వను, వీలుంటే మీరే ఉదయమే వాకింగ్ నుంచి వచ్చే అప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లి కాఫీ టిఫిన్ కానిచ్చుకురండి” అని ఒక ఉచిత సలహా పడేసింది.


కాలం ముందుకు జరుగుతోంది. రమణ యింటినుంచి శ్రీధర్ ఇంటికి ఏ వంటకాలు వెళ్ళటం లేదు. అయినా శ్రీధర్ రోజు రమణ తో పాటు ఆఫీస్ కి వెళ్లడం రావడం జరుగుతోనే వుంది. వాళ్ళ స్నేహం లో ఏ తేడా లేదు.

డైలీ ఉదయం అయిదు గంటలకే లేచి, వాకింగ్ వెళ్లే రమణ, ఏడు అయినా లేవకపోవడం తో, “ఏమైంది యింకా పడుకున్నారు.. లేవండి” అని భర్తని కుదిపింది పద్మ.

భర్త ఒళ్ళు వేడిగా వుండటం తో కంగారు పడి, మంచం మీద కూర్చొని, “ఎలా వుంది వంట్లో, వేడిగా వుంది. జ్వరం ఏమైనా వచ్చిందా, లేచి కూర్చోండి, టెంపరేచర్ చూస్తాను” అని బలవంతంగా భర్తని లేపి కూర్చోపెట్టి, “అదేమిటి.. మొహం నిండా పొక్కులు? అరే.. చేతికి కూడా వున్నాయి” అని కంగారు పడిపోయింది పద్మ.

“వుండండి, అన్నయ్య గారిని పిలుస్తా” అంది పద్మ.


“ వద్దు. వాడు ఆఫీస్ కి వెళ్ళాలి, అనవసరంగా అతనిని కంగారు పెడటం ఎందుకు? మనమిద్దరం హాస్పిటల్ కి వెళ్లి వద్దాం” అని లేచి మొహం కడుగుకోవడానికి వెళ్ళాడు.

ఈ లోపు గా క్యాబ్ ని బుక్ చేసి తను కూడా రెడీ అయ్యింది.


డాక్టర్ గారు రమణ ని టెస్ట్ చేసి, “కొన్ని టెస్ట్ లు చేయించాలి అమ్మా, ఎందుకో ఇతనికి వచ్చింది మంకిఫాక్స్ అని అనుమానం గా వుంది. కంగారు పడకండి, అనుమానమే. రిపోర్ట్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ లోపుగా కొన్ని మందులు యిస్తాను, వాడండి. కొద్దిగా రిపోర్ట్స్ వచ్చే వరకు వేరే గదిలో వుండండి. మీరు వాడే వస్తువులు సెపరేట్ గా వుంచుకోండి. ఏదైనా రెండు వారాలలో అదే తగ్గిపోతుంది” అని చావు కబురు చల్లగా చెప్పాడు.

రోగం పేరు వినగానే రమణ కి, పద్మకి గుండెల్లో రాయి పడినట్లయింది. “పద్మా! నువ్వు రెండు ఆటోలు మాట్లాడు. చెరో ఆటోలో వెళ్లడం మంచిది” అన్నాడు పీలగా.

“బలేవారే, యిద్దరు కలిసే వెళ్దాం. నాకు ఏమి భయం లేదు, నా మంగళసూత్రం గట్టిది. మీరు భయ పడకండి” అని ఒకే ఆటోలో యింటికి చేరారు.

ఆటో దిగి చూసే సరికి ఇంటి మెట్ల మీద కూర్చుని వున్నాడు శ్రీధర్. వీళ్ళని చూసి ‘ఏమైందిరా’ అంటూ కంగారు గా ఆటో దగ్గరికి వచ్చాడు. డాక్టర్ చెప్పిన మాటకి రమణకి నీరసం ఆవహించి, కిందికి దిగలేక అలాగే ఆటోలో కూర్చొని వున్నాడు.

“దిగు, అసలు ఏమైంది?” అంటూ రమణని పట్టుకుని దింపబోతోవుంటే, “వద్దు రా, నువ్వు దూరం గా వుండు, నేను దిగుతాలే” అన్నాడు రమణ.

డబ్బులు తీసుకుంటున్న ఆటో వాడు, ఈ మాటలు విని కంగారుగా, “ఏమి సార్, కొంపతీసి, కరోనా వచ్చిందా మీకు, అసలే ఆటో నడుపుకుంటో బతుకుతున్నాను. అటువంటి జబ్బు అయితే మా ఆటో ఎక్కడం ఎందుకు, ఏ అంబులెన్సు లో నో రాక” అంటూ, వణికిపోతున్నాడు.

“అబ్బే.. అలాంటిది ఏమిలేదు. కంగారు పడకు. నీరసం తో దిగలేక పోయాను. అంతే” అని ఆటో అతనికి యింకో అయిదు వందలు యిచ్చి “వుంచుకో, నీరసంగా వున్న నన్ను ఇంటికి జాగ్రత్తగా తీసుకొని వచ్చావు” అని చెప్పి లోపలికి నడుస్తో వుంటే వద్దన్నా వినకుండా శ్రీధర్, రమణ నడుము చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ యింట్లోకి తీసుకొని వచ్చి మంచం మీద కూర్చోపెట్టి, రమణ భార్యని ఆడిగాడు.


“ఎక్కడకి వెళ్లారు, వాడి ఒంటి నిండా ఆ కురుపులు ఏమిటి, సాయంత్రం బాగానే వున్నాడుగా? రాత్రి ఏమి తిన్నాడేమిటి” అంటూ ప్రశ్నలు కురిపించాడు , స్నేహితుడు కి ఏమైంది అని కంగారుతో.


“ఒరేయ్! కొన్నాళ్ళు యిటు రాకు, నాకు ప్రాణం తీసే జబ్బు వచ్చింది. మంకీఫాక్స్ ట. యిహ నా పని అయిపొయింది. వెంటనే వెళ్ళు, లేకపోతే నా జబ్బు నీకు అంటుకుంటుంది. ఒక ఉపకారం చేస్తావా శ్రీధర్, కొన్నాళ్ళు మీ చెల్లెలు పద్మ ని కూడా మీ యింట్లో వుండనిస్తావా? యిక్కడ తను వుంటే ఈ జబ్బుతో యిద్దరం పోతాం” అన్నాడు రమణ.


“నీ మొహం లే, ఈ స్థితిలో నిన్ను ఎలా వదిలి వెళ్తాను? నాలుగు అయిదు రోజులలో తగ్గిపోతుంది, భయ పడకు, నేను సాయంత్రం సాయిబాబా గుడినుంచి విభూతి తీసుకు వచ్చి బొట్టు పెడతా. రోగం కుదురుతుంది” అని నవ్వుతో, డాక్టర్ గారిచ్చిన ఆయింట్మెంట్ రమణ చేతులకి పుయడం మొదలుపెట్టారు పద్మ, శ్రీధర్.

“వద్దు, మీరిద్దరూ దూరం గా వెళ్ళండి, నా జబ్బు అంటించుకుని చద్దామనుకుంటున్నారా, వెళ్ళండి” అన్నాడు గట్టిగా.

“ఒరేయ్ రమణా, రోజు కలిసి ఆఫీసుకి కలిసి వెళ్తున్నాము, కలిసి తింటున్నాము, ఒక వేళా చావాలిసి వస్తే కలిసే చద్దాం కానీ, నువ్వు ధైర్యం గా వుంటే జబ్బు త్వరగా తగ్గుతుంది” అని అంటున్న శ్రీధర్ ని చూస్తో వుండిపోయాడు.

“చెల్లమ్మ.. మా యింటి నుంచి భోజనం, టిఫిన్ అన్నీ వస్తాయి, నీ పని వాడిని కనిపెట్టుకుని ధైర్యం చెబుతో వుండు. నేను ఆఫీస్ కి వెళ్ళి సెలవు పెట్టి, గుడి నుంచి విభూతి తీసుకుని వస్తా” అని బయటకు వెళ్ళిపోయాడు శ్రీధర్.

టంచనుగా శ్రీధర్ భార్య రెండు కారియర్ లు తీసుకొని వచ్చింది. “యిదిగో పద్మా, అన్నయ్య గారికి యిష్టమైనవి చేసాను, త్వరగా భోజనం చేయండి. ఇప్పటికే మా ఆయన నాలుగు సారులు ఫోన్ చేసారు. భోజనం తీసుకొని వెళ్ళావా అని” అంది.

సాయంత్రం ఆరుగంటలకి ఆటోలో నుంచి ఒక పెద్ద ఆకుల మూట తో దిగి లోపల కి వచ్చి సరాసరి వంటగది లోకి వెళ్లి, చెల్లమ్మ కొద్దిగా పసుపు, నువ్వుల నూనె యివ్వు, మందు తయారు చేయాలి అన్నాడు శ్రీధర్.

ఒక అరగంట ఆ ఆకులు నూనె, పసుపు వేసి నూరి, ముద్ద చేసుకుని వచ్చి, “ఒరేయ్ లేచి కూర్చో, ఈ మందు రాస్తే తెల్లారికల్లా పొక్కులు రాలిపోతాయి. పూజారిగారు చెప్పారు” అని రమణ వంటికి పట్టించడం మొదలుపెట్టాడు శ్రీధర్.

శ్రద్దగా ఆకుల పసరు పూస్తున్న శ్రీధర్ వంక చూసి, ‘ఛీ,, వీడిగురించా నేను దుర్మార్గం గా ఆలోచన చేసాను. డైలీ మన వంటలు తినడం రుచి మరిగాడు అని. పాపం వాళ్ళకి మేము చేసుకున్నవి ఏవి పంపకపోయినా, ఒక్కసారి కూడా ఏమి అనలేదు. నిజం గా చుట్టాలు కంటే స్నేహితులే ప్రాణం యిస్తారు. వీడి గురించి దుర్మార్గంగా అలోచించి నందుకే నాకు ఈ కురపులు తెప్పించాడు భగవంతుడు’ అని మనుసులో బాధ పడుతున్న రమణ ని చూసి, “ఏమిటి రా ఆలోచిస్తున్నావు, యింతకి నీకు అన్నదమ్ములు ఎవరు లేరా?” అన్నాడు శ్రీధర్.

శ్రీధర్ వంక చూస్తో “లేకే.. వున్నాడు, శ్రీధర్ అని, వాడే నా ప్రాణం” అన్నాడు రమణ.

ఆ మాట విని ఆప్యాయత గా రమణ చేయి నొక్కి, “పడుకో! రేపటికి తగ్గుమోహం పడుతుంది” అన్నాడు శ్రీధర్.

“ఎందుకైనా మంచిది, ఈ పసరు నువ్వు కూడా రాసుకో” అంటూ నవ్వుతున్న శ్రీధర్ ని చూసి ధైర్యం తెచ్చుకుంది పద్మ

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.155 views1 comment

1 comentário


shahnaz bathul
shahnaz bathul
17 de jun. de 2022

స్నేహానికి నిర్వచనం చెప్పారు. స్నేహ మంటీ ఇలా ఉండాలి అన్నట్లు చాలా బాగా

Curtir
bottom of page