top of page

తాత చెప్పిన కథ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Thatha Cheppina Katha' Written By Jidigunta Srinivasa Rao

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాలి.

అలా కాకుండా తమ స్వార్థం తాము చూసుకోవడం నేర్పితే, ఆ స్వార్ధపు బుద్ధిని ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపుతారు. నలుగురిలో చులకన అవుతారు.

పిల్లల్ని ఎలా పెంచాలో ఈ కథలో ప్రముఖ రచయిత శ్రీనివాసరావు జీడిగుంట గారు చక్కగా వివరించారు.కుర్చీలో కూర్చొని భక్తి టీవీ చూస్తున్న సీతమ్మ గారు, అక్కడే ఆడుకుంటున్న మనవడిని చూసి, "ఒరేయ్! త్వరగా టిఫిన్ తిని ఆడుకో. లేదంటే మీ స్నేహితుడు వచ్చేసాడంటే వాడికి పెట్టాలిసిందే. ఏం స్నేహితులో ఏమిటో... యింట్లో తినకుండా పరాయి యింటి మీద పడటం! అయినా, తల్లిదండ్రులకి వుండాలి బుద్ది!" అంటూ సనగటం చూసిన సీతమ్మ గారి భర్త మూర్తి, మనసులో అనుకున్నాడు "పెట్టువాగు గుణం లేకుండా ఎన్ని భక్తి టీవీ ప్రోగ్రామ్స్ చూసి ఏమి లాభం ".


బామ్మ మాటలతో వంటిింట్లోకి పరుగెత్తడు బాలు టిఫిన్ తినటానికి..


ఒక వారం రోజుల తరువాత బాలు తల్లి, సాయంత్రం పిల్లాడికి, అత్తామామలకు, ఉసూరుమంటో ఆఫీస్ నుంచి వచ్చే భర్త కోసం నాలుగు మైసూర్ బజ్జీలు వేద్దాం అని వంట గదిలోకి వెళ్ళి స్నాక్స్ తయారు చేస్తోంది.


వంట గదిలో నుంచి మంచి సువాసనలు వస్తోండటం తో అప్పటి వరకు ఆడుకుంటున్న బాలు, రివ్వున వంట గదిలోకి వెళ్ళి "అమ్మా త్వరగా బజ్జీలు పెట్టావే, లేకపోతే బామ్మా, తాతయ్య లేస్తారు, మనకి చాలవు " అంటూ హడావిడి పెట్టాడు.


కొడుకు వీపు మీద చిన్నగా ఒక దెబ్బ వేసి, "తప్పు కదూ! ఆలా అనవచ్చా? ఎవరికీ పెట్టకుండా మనమే తింటే పాపం వస్తుంది. ఇంకెప్పుడూ యిటువంటి పాడు మాటలు మాట్లాడకు" అని మందలించింది.


"నాకేం తెలుసు? మొన్న బామ్మ, 'నీ ఫ్రెండ్స్ వచ్చే లోపు టిఫిన్ తినేసి కూర్చో, లేదంటే వాళ్ళకి పెట్టాలి' అంది" అన్నాడు బాలు.


"బామ్మ సరదాగా అంది, నువ్వు త్వరగా తినాలి అని.

అంతేగాని, యింటికి వచ్చిన వారికి పెట్టకుండా తిన కూడదు, గుర్తుపెట్టుకో!" అంది బాలు తల్లి.


మంచం మీద పడుకుని అంతా విన్న, సీతమ్మ గారి భర్త మూర్తి, భార్యతో "చూసావా నువ్వు నీ మనవడితో అన్నమాట ఎలా వికటించిందో? ఎవరైనా వచ్చే లోపు తినేయాలి అన్నమాట మన మీద ఉపయోగించి, మనం లేచే లోపు వాళ్ళమ్మని బజ్జీలు పెట్టేసేయమని అడుగుతున్నాడు, నీ మనవడు. అందుకనే పిల్లలకు మంచి నేర్పాలి కానీ, చెడు మాటలు చెప్పకూడదు.

నీ కొడుకు, కోడలు మంచి వాళ్ళు కాబట్టి నీ బోధనలు పట్టించుకోకుండా వున్నారు. లేదంటే ఈపాటికి మనమిద్దరం వృద్ధాశ్రమంలో వుండే వాళ్ళం" అన్నాడు.


"ఏదో.. 'ఎవరైనా వున్నప్పుడు తింటే పిల్లాడికి దిష్టి తగులుతుంది' అని ఆలా చెప్పాను కానీ, నాకు మాత్రం తెలియదా, పది మందితో పంచుకుని తింటే మంచిది అని!" అన్నారు సీతమ్మ గారు.


యింతలో చేతిలో రెండు బజ్జీలు పట్టుకుని వచ్చిన మనవడు బాలు, తాతగారి చేతిలో ఒకటి, బామ్మ చేతిలో ఒకటి పెట్టి, "తినండి తాతయ్యా, అమ్మ యింకా బోలెడు బజ్జీలు తెస్తోంది" అన్నాడు.


బజ్జి ముక్క సగం తుంచి మనవడి నోట్లో పెడుతో, "ఒరే బాలు, నీకు ఒక విషయం చెప్పనా.." అన్నాడు తాతయ్య మూర్తి.


"చెప్పు తాతయ్యా! కధ చెప్పు, బాగుంటుంది" అన్నాడు బాలు, తాతగారి వొళ్ళో కూర్చుంటూ.


"సరే అయితే! కదలకుండా విను. పూర్వం యిద్దరు బీద బ్రాహ్మణులు ఒక రాజు గారి దగ్గరికి వెళ్ళి, "అయ్యా! మేము పూట కూడా గడవని బీదవాళ్ళం. కుటుంబం లో పిల్లలు ఆహారం లేక మాడి పోతున్నారు. దయచేసి మీరు మాకు ఏదైనా డబ్బు సహాయం చేస్తే మీ మేలు మరిచిపోము " అని ఆ రాజుగారిని వేడుకున్నారు.


దానికి రాజుగారు వారిద్దరిని, రెండు రోజులు తరువాత వచ్చి కలవమన్నాడు.


ఆ ప్రకారమే ఆ యిద్దరు బ్రాహ్మణులు రెండు రోజులు తరువాత రాజుగారిని కలిసారు. అప్పుడు రాజుగారు, మొదటి బ్రాహ్మణుడికి వంద వరహాలు, రెండవ అతనికి వెయ్యి వరహాలు యిచ్చాడు.

దానికి మొదటి అతను రాజుగారిని చూసి "అయ్యా! మేము యిద్దరం పూటగడవని బీదవాళ్ళం, యిద్దరం ఒకేసారి వచ్చి మిమ్మల్ని కలిసి మా బాధలు చెప్పుకుని సహాయం అడిగాము. అయితే మీరు నాకు తక్కువ సహాయం, నాతో వచ్చిన అతనికి ఎక్కువ సహాయం చేసారు, యిది న్యాయంగా అనిపించడం లేదు" అన్నాడు.


దానికి రాజుగారు తనని ప్రశ్నించిన మొదటి అతనితో, "నిన్నటి రోజున నీ యింటికి ఒక బీద బ్రాహ్మణుడు వస్తే, అతనిని వట్టి చేతులతో వెళ్లగొట్టావు, అదే ఈ రెండవ అతను తన యింటికి వచ్చిన ఆ బ్రాహ్మణుడిని లోపలికి తీసుకుని వెళ్ళి తన వండుకున్న ఆహారం లో కొంత ఆ బ్రాహ్మణుడికి పెట్టి పంపించాడు. నీకు నీ అవసరాలు తప్పా, యితరులకు సహాయం చేయడం అలవాటు లేదు. అందుకే నీకు తక్కువ సొమ్ము యిచ్చాను, రెండవ బ్రాహ్మణుడు తను బాధలలో వున్నా, యితరుల ఆకలి తీర్చడానికి ముందుకి వచ్చే మంచి గుణం వుంది కాబట్టి, అటువంటి సహాయాలు చేయడం కోసం అతనికి ఎక్కువ సొమ్ము యిచ్చాను" అని అన్నారుట రాజుగారు.


యిది విన్న రెండవ బ్రాహ్మణుడు, "అయ్యా! మా ఇంటికి వచ్చిన అతిధి కి నేను ఆహారం పెట్టినట్టు తమరికి ఎలా తెలిసింది?" అని అడిగాడుట.


దానికి ఆ రాజుగారు నవ్వుతో 'ఆ అతిధిని నేనే' అని చెప్పి, సభ చాలించి వెళ్ళిపోయారు.


"యిప్పుడు చెప్పరా మానవడా! ఈ కధ లో నీతి ఏమిటో" అన్నాడు మూర్తి.


"తాతా! మన దగ్గర వున్నదానిలో కొంత అవసరమైన వాళ్లకు యిచ్చి సహాయపడితే, మనకి ఎక్కువ డబ్బు వస్తుంది. అంతే.." అన్నాడు బాలు


"భేష్ గా చెప్పావు. అయితే డబ్బే కాదు. ఏదో విధంగా మనం యిబ్బంది లో వున్నప్పుడు, మనం చేసిన మంచి ఉపయోగ పడుతుంది" అన్నాడు మూర్తి

"సరే తాతా! అర్ధం అయ్యింది, యిప్పుడు నీ దగ్గర వున్న బజ్జిలలో నాకు ఒకటి యిస్తావా, నీకు అమ్మ అప్పుడు బోలెడు బజ్జీలు ఇస్తుంది" అన్నాడు బాలు.

"ఓరినీ! భలేవాడివి రా" అంటూ మనవడి చేతిలో రెండు బజ్జీలు పెట్టి నవ్వుకున్నారు మూర్తి గారు.


నీతి : నలుగురితో పంచుకుంటే కలిగే ఆనందం, ఒంటరిగా తింటే వుండదు.


శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


227 views0 comments

Comments


bottom of page