top of page

పుణ్య దంపతులు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

'Punya Dampathulu' Written By Jidigunta Srinivasa Rao

రచన : జీడిగుంట శ్రీనివాసరావు


ఎవరికీ హాని చెయ్యకుండా, మంచిగా జీవించినవారికి తప్పకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది. అంతే కానీ చిన్న చిన్న విషయాలను దేవుడు పట్టించుకోడని తెలియజేసే కథ పుణ్య దంపతులు. ఈ కథను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు.


రమణారావు, సీతాదేవి యిద్దరూ వృద్ధదంపతులు. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ దూరం గా వున్నారు. లంకంత యిల్లు, పెరటిలో తను యిష్టపడి పెంచుకున్న తోట వదిలి వెళ్లడం ఇష్టం లేక పిల్లలతో వెళ్లకుండా, భీమవరం లోనే వుంటున్నారు.

ఎప్పుడూ నిర్ణయం తను తీసుకోవటం, పాపం ఆ మహాయిల్లాలు అనుసరించటం జరుగుతోంది.

డబ్బు బాగా వుండటంతో, గుళ్ళు, గోపురాలు చూడటానికి, తిరుపతి, రామేశ్వరం, కంచి, మదురై లాంటి ప్రదేశాలకు వెళ్లి వారం రోజుల పాటు మంచి హోటల్ వుండి, టాక్సీలో అన్ని గుళ్ళూ, అక్కడ చుడాలిసిన ప్రదేశాలూ చూసి యింటికి చేరుకునే వారు.

కాశీ, గయా లాంటి క్షేత్రాలకు చాలా సార్లు వెళ్ళి, వెళ్ళినప్పుడల్లా తనకి యిష్టమైన కూర, ఆకు, పండు వదిలివేసి రావడం ఆనవాయితీ రమణారావు కి. ఎప్పుడూ భార్య ని అడిగేవాడు కాదు, ఈసారి ఏమి వదిలేద్దామని.

ఒక వేసవికాలం 9 రోజులు కాశీలో వుండాలి అని నిర్ణయించుకుని, విషయం భార్యకి, పిల్లలకి చెప్పి ప్రయాణానికి కావలిసిన ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఈ విషయం లో రమణారావు ని మించిన వారు లేరు. పక్కాగా ప్లాన్ చేసుకుని, తనకి గాని, తన భార్య కి గాని ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని ఆరెంజిమెంట్సూ చేసుకుని బయలుదేరుతాడు.


మొత్తానికి వారణాసి ఎయిర్పోర్ట్ లో దిగి, బయట తమకోసం హోటల్ వాడు పంపిన కారులో 5 స్టార్ హోటల్ లో దిగాడు. ఎక్కడికి వెళ్లినా ఆ హోటల్ మాత్రం ప్యూర్ వెజిటేరియన్ అయివుండాలి. ఆ వూరిలో అటువంటి హోటల్ లేకపోతే బ్రాహ్మణ సత్రం లో వుండటానికి అయినా యిష్టపడతాడు.

అమెరికా లో వున్న యిద్దరు కొడుకులకు కూడా నిత్య గాయత్రి చేయటం అలవాటు చేసాడు.

సరే, మొదటి రోజు సాయంత్రం గంగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని దంపతులిద్దరూ పరమశివుని దర్శనం మనసారా చేసుకున్నారు.

మర్నాడు ఉదయమే లేచి గంగా నదికి చేరుకుని స్నానం చేసుకుని, శివపార్వతుల దర్శనం చేసుకుని కారులో గయా క్షేత్రం చేరుకున్నారు.

ముందే అలవాటైన ఒక ఘనాపాఠి ని కలిసి ప్రత్యేకంగా పితృదేవతలకు చేయవలిసిన శ్రాద్ధ కర్మ లు చేసి, బ్రాహ్మణులకు సంతృప్తి కలిగే విధంగా దక్షిణ యిచ్చిన తరువాత, అసలైన కార్యక్రమం వచ్చింది. అదే రమణారావు దంపతులకు యిష్టమైన పదార్ధాలు వదలటం.

అప్పటికే చాలాసార్లు గయ లో ఎన్నో పదార్ధాలు వదిలేసాడు. మొదటి సారి గయా క్షేత్రం లో వదిలిన తరువాత, ఎన్నిసార్లు తిరిగి వచ్చినా వదలఖ్ఖరలేదు అని శాస్త్రి గారు చెప్పినా రమణారావు వినడు.

ఈసారి తనకి, తన భార్య కి ప్రాణప్రదం గా ఇష్టపడే వంకాయ వదిలేసాడు. అంతవరకు ఎప్పుడూ నోరెత్తని భార్య వెంటనే రమణారావుతో, “నాకు మిగిలిందే ఆ వంకాయ కూర, దానిని కూడా వదులుకుని నేను ఉండలేను” అంది. “కావాలంటే మీకిష్టమైన కాకరకాయ వదిలేసుకోండి” అంది.

“నీ మొహం! నా షుగర్ వ్యాధి కి కాకరకాయ మంచిది. అదివదిలితే యిబ్బంది. ఆల్రెడీ వంకాయ అన్నాను. నా మాటకు తిరుగులేదు” అని రమణారావు భార్య ని మాట్లాడకుండా చేసాడు.

యిహ మిగిలింది భోజనాలు. అవి కూడా పూజ చేయించిన శాస్త్రి గారింట్లో అరేంజ్ చేసారు. యిద్దరూ పెద్ద దంపతులు కనుక, యిద్దరికీ రెండు కుర్చీలు వేసి టేబుల్ భోజనం అరేంజ్ చేసారు శాస్త్రి గారు.

రమణారావు దంపతులు మళ్ళీ స్నానం చేసి, బట్టలు మార్చుకుని, భోజనానికి కూర్చున్నారు.

మడికట్టుకున్న యిద్దరు స్త్రీలు వడ్డన మొదలుపెట్టారు. మొదట పప్పు, పచ్చడి, స్వీట్, చివరన వంకాయ కూర. అల్లం పెట్టి వండినట్లున్నారు... గుమగుమ లాడుతోంది కూర.

“అయ్యో... ఇదేమిటి శాస్త్రి గారూ! యిప్పుడేగా మేము వంకాయ వదిలేసింది. యిప్పుడు అదే వడ్డించారు” అన్నాడు రమణారావు.

“మీరు వదిలేసారు, నేను వదలలేదు” అంటూ రమణారావు భార్య వంకాయ కూరతో అన్నం కలపడం మొదలెట్టింది.

ఒక్కక్షణం తెల్లబోయిన రమణారావు, నువ్వు మాట తప్పి, నరకానికి పోతే నేనొక్కడిని స్వర్గంలో వుంటే నా మీద పడి ఏడుస్తావు. కాబట్టి నీతోనే నరకానికి వస్తాను” అంటూ ‘రా.. రమ్మ’ని పిలుస్తున్న వంకాయ కూరతో అన్నం కలపడం మొదలుపెట్టాడు.


కాలం గడిచింది. పుణ్యదంపతులు కనుక, కొన్ని గంటల తేడా లో యిరువురూ తనువులు చాలించారు.

విచిత్రంగా తమకోసం దేవతలు రావడం చూసి, “మేము గయా క్షేత్రంలో భగవంతుడికి వదిలిన ఆహారాన్ని తిని మాట తప్పాము. మేము నరకానికి పోవాలిగా” అన్నారు అమాయకంగా.

దేవతలు నవ్వుతూ “ఏదైనా మనస్ఫూర్తిగా చేసినప్పుడే దానికి ఫలితం వుంటుంది. మీరిద్దరూ యిష్టం లేకుండానే వదలటం వలన పాపం రాదు. అయినా మీ పిచ్చిగాని, దేముడికి మీ వంటలు కావాలా? మీరు చేసే మంచి కావాలి. మీరు ఎన్నోసార్లు కాశీని దర్శనం చేసుకున్నారు. గయా క్షేత్రంలో విష్ణుపాదం దర్శనం చేసుకున్నారు. అందుకనే మీకు స్వర్గానికి రావటానికి అనుమతి దొరికింది” అంటూ దేవదూతలు రమణారావు దంపతులని విమానం ఎక్కించుకుని స్వర్గం వైపు వెళ్లిపోయారు.


శుభం

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


194 views1 comment
bottom of page