top of page

మా ఇంటి మహాలక్ష్మి


Ma Inti Mahalakshmi Written By Srinivasarao Jidigunta

రచన : జీడిగుంట శ్రీనివాస రావు


అత్తగారు, భర్త కూర్చొని మాట్లాడుకుంటూ వుండటం చూసి భారతి, రాత్రికి ఏమి చేయాలో అడగటానికి వెళ్ళింది. కోడలిని చూసి అప్పటి వరకు మాట్లాడుకుంటున్నవారు ఆగిపోయి "ఏమిటి "అని చూసారు భారతి వంక. "ఏమిలేదు రాత్రికి టిఫిన్ ఏమిచేయాలి అని అడగటానికి వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను "అంటూ మొగుడి వంక కోపంగా చూస్తో వెనక్కి వచ్చేసింది.

"చచ్చాంరా నాయనా, కోపం వచ్చినట్లు వుంది, "రాత్రికి చివాట్లు తప్పవు అనుకుంటూ కుమార్,, తల్లితో మాటలు ముగించి ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు.

"అప్పుడే వచ్చేసారే 'రహస్య సమాలోచనలు' అయిపోయాయా ! " అంటూ వచ్చి రెండు మాటలు అంటించి వెళ్ళింది భారతి.

"మాకేముంటాయి రహస్యాలు ?అయినా నీ చెవి ఒకటి మా మీద వేసే వుంటావుగా" అన్నాడు కుమార్.

"రోజు రోజుకి మరీ చిన్నపిల్లలు లాగా ఆ తగాదాలేమిటిరా "అంటూ తల్లి రావటం తో మొగుడు పెళ్ళాం యిద్దరూ సైలెంట్ అయిపోయారు.

అనుకున్నట్లుగానే రాత్రి భర్తని దులపరించేసింది "ఈ యింట్లో నన్ను మీలో ఒక దానిగా గుర్తించటం లేదు, అమెరికా నుంచి మీ చెల్లెలు ఫోన్ చేసినా, మీ తల్లీ కొడుకులు మాట్లాడుకోవటమే గాని, మీ చెల్లి అడగదు నాతో మాట్లాడుతాను అని, మీరు సరేసరి, గంటలతరబడి మాట్లాడుకుని పెట్టేస్తారు.

'ఏమన్నారు మీ చెల్లెలు' అని అడిగితే, 'ఏమిలేదు, ఊరికే చేసింది ' అనటం. అంత ఊరికే అయితే గంటలసేపు ఎందుకు మాటలు "అంటూ గొడవ పెట్టిసింది.

ఇవేమీ పట్టించుకోకుండా నిద్రలోకి జారుకున్న భర్త ని చూసి, ఏమిచేయలేక, అటు తిరిగిపడుకుంది భారతి.

మామూలుగానే తెల్లారింది. నాలుగు మెతుకులు గబగబా తినేసి, "అమ్మా! నాలుగు గంటలకల్లా అక్కడకి వచ్చేయి", అంటూ భారతికి బై చెప్పి, ఆఫీస్కి వెళ్ళిపోయాడు కుమార్.

మొగుడు, అత్తగారిని ఎక్కడకి రమ్మంటున్నాడో అర్ధం కాక, భారతి 'నా బంగారం బాగుంటే, కంసాలి ఏమి చేయగలడని ఈయనకి తీరు తెన్నూ వుంటే నాకెందుకు ఈ కర్మ' అనుకుని, వంటిల్లు సర్దుకుని, సగం వరకు చదివిన నవల తీసుకొని చదువుకోవటం మొదలుపెట్టింది.

గడియారం 3 గంటలు కొట్టగానే, అత్తగారు లేచి, మొహం కడుక్కుని, పెద్దంచు పట్టుచీర కట్టుకుని, ముందు గదిలోకి వచ్చి "అమ్మాయి, క్యాబ్ బుక్ చేసాను, ఆలా బయటకి వెళ్ళిరావాలి " నువ్వు కూడా కొద్దిగా నాకు తోడు రా అమ్మా "అన్న అత్తగారితో, "అలాగే అత్తయ్య, ఒక్క నిమిషం, చీర మార్చుకుని వస్తానని "లోపలికి వెళ్ళి అనుకుంది భారతి 'ఎక్కడకి వెళ్తున్నామో చెప్పకుండా వస్తావా !అని అడగటమేమిటో 'అని.

క్యాబ్ రాగానే అత్తాకోడళ్లు ఎక్కికూర్చున్నారు. అత్తగారు డ్రైవర్ కి ఓటీపీ నెంబర్ చెప్పి, కొద్దిగా త్వరగా పోనియ్ అని అంది.

"అబ్బో ఈవిడకి క్యాబ్ బుక్ చేయటం, ఓటీపీ నెంబర్ చెప్పటం "కూడా తెలిసిపోయాయి అనుకుంది భారతి.

క్యాబ్ "మల్బార్ "నగల షాప్ ముందు ఆగింది. యిక్కడకి ఎందుకు వచ్చాము అబ్బా, బహుశా అమెరికాలో వున్న ఆడపడుచుకి ఏమైనా నగలు కొనటానికి నన్ను కూడా తీసుకుని వచ్చింది అత్తగారు, అనుకుంటూ అత్తగారి వెంటలోపలకి వెళ్ళింది. అక్కడ షాపులో తళ తళ లాడుతున్న నగలతోపాటు, తన భర్త కుమార్ కనిపించడం తో, ఓహో నిన్న తల్లీకొడుకులు వేసుకున్న ప్లాన్ అనుకుంటూ మవునంగా వాళ్ళతో నడిచింది.

"ఏమి కావాలి సార్ "అని అడిగిన సేల్స్ గర్ల్ తో, వడ్డాణాలు ఎక్కడ చూపిస్తారని, అత్తగారు దర్పం గా అడిగింది. పెద్ద బేరం తగిలింది అనుకుంటూ థర్డ్ ఫ్లోర్ కి తీసుకునివెళ్ళి, ముందుగా ఒక వడ్డాణం చూపించి, నాలుగు లక్షలు అంది సేల్స్ గర్ల్. కొద్దిగా పెద్ద రేట్ ది చూపించు తల్లీ అంటున్న అత్తగారిని చూసి, ఆమ్మో పెద్ద నగనే కొంటున్నారు కూతురుకి, అనుకుంటూ "అత్తయ్య గారు ఆ నాలుగు లక్షల వడ్డాణం బాగానే వుందిగా "అంది భారతి.

"మా యింటి మహాలక్ష్మి "కి ఆ నగ ఏమిటీ, నీకు తెలియదు వూరుకో, నేను చూస్తాగా అన్న అత్తగారి ని చూసి, మనసులో "ఈవిడకి నేను యింత లోకువ అవటానికి కారణం ఈయనే గా "అనుకుంటూ భర్త వంక చూసింది. అతను యివి ఏమిపట్టించుకోకుండా తల్లితోపాటు నగలు చూడటంలో ములిగిపోయాడు.

సేల్స్ గర్ల్ లోపల నుంచి ఒక వడ్డాణం తీసుకుని వచ్చి మా ముందు పెట్టింది. వడ్డాణం చుట్టూ అష్ట లక్ష్మీదేవి బొమ్మలతో ఎంతో అందంగా వుంది.

యిది బాగానే వుంది, ఎంతవుతుంది సుమారు గా అని అడిగారు అత్తగారు.

12 లక్షల వరకు అవుతుంది అన్న సేల్స్ గర్ల్ తో ఒకసారి మా కోడలికి పెట్టి చూసుకుంటాము అని అత్తగారు నాతో నువ్వు ఒక్కసారి పెట్టుకు చూడు, బాగుందో లేదో చూద్దాము అన్నారు.

"మొదటే నేను పెట్టుకోవటం ఎందుకు అత్తయ్య "అన్న భారతి తో, అదేమిటే ఆలా అంటున్నావు, నీకు కొంటున్నది నువ్వు చూసుకోక, నేను పెట్టుకుని చూస్తానా "అన్నారు.

దానితో షాక్ కి గురిఅయినట్లైనా భారతి, నాకెందుకు అత్తయ్య, యింత ధర పెట్టి, మీ అమ్మాయి కి కొందాము, పెళ్ళిలో కూడా మేము ఆడపడుచు లాంఛనాలు యివ్వలేదు తనకి, అని అంది భారతి మనస్ఫూర్తిగా.

"చూడు భారతి, పెళ్ళికానంత వరకు మా అమ్మాయి మా యింటి మహాలక్ష్మి, ఒకసారి పెళ్లి అయ్యి అత్తవారింటి కి వెళ్ళిన తరువాత, అత్తవారింట మహాలక్ష్మి, యిప్పుడు మా యింట మహాలక్ష్మి వి నువ్వే "అని అంటున్న అత్తగారిలో తన తల్లి కనిపించింది భారతికి. అది కాక నీకు కొనమని చెప్పింది నీ ఆడపడుచే, తను అమెరికాలో ఎలాగో పెట్టుకోలేదు అంది అత్తగారు.

నిన్న, అమ్మా నేను మాట్లాడుకున్నది యిదే, నీకు సప్రైజ్ యివ్వాలని చెప్పలేదు, నువ్వు, నన్ను వాయించేసావు, అన్నాడు కుమార్.

ఛీ, యింట్లో వీళ్ళు నన్ను మహాలక్ష్మి అనుకుంటూ వుంటే నేను వీళ్ళని తిట్టుకున్నాను అనుకుంది భారతి.

రాత్రి వడ్డాణం, పెట్టుకుని, అత్తగారికి చూపించి, అత్తగారి ఆశీస్సులు తీసుకుంది.

యిదంతా చూస్తున్న కుమార్ మనసులో అనుకున్నాడు "ఈ రాత్రి నాకు పున్నమి రాత్రి అని "

శుభం


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


107 views2 comments
bottom of page