top of page

కాలమహిమ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.



'Kala Mahima' Written By Srinivasarao Jidigunta

రచన : జీడిగుంట శ్రీనివాస రావు

ఈవెనింగ్ వాక్ పూర్తిచేసుకుని మెల్లగా ఇంటివైపు నడుస్తున్న సంతోష్ కి లేత ఆకుకూరల బండి కనిపించడం తో రోడ్డు దాటి బండి దగ్గరికి వెళ్లి, ఒక యిరవై రూపాయల పాలకూర, ఒక పది రూపాయల తెల్ల గోంగూర కొన్నాడు.

“ఏమిటమ్మా! గోంగూర కట్ట మరీ యింత చిన్నగా వుంది…” అన్నాడు.

“అయితే యింకో కట్ట కూడా కొనండి సార్, చాలా వస్తుంది” అంది ఆమె నవ్వుతూ.

‘బహుశా చదువుకుంది అనుకుంట, తెలివిగా మాట్లాడుతోంది’ అనుకున్నాడు.

“రెండు కట్టలు ఎక్కువ అవుతాయి” అంటూ యింటికి చేరుకుని, ఆకుకూరలు టేబుల్ మీద గుమ్మరించాడు.

“ రేపు గోంగూర పప్పు, ‘ఎత్తుకు ఎత్తు’ వెల్లులిపాయలు వేసి వండు. చేమదుంపల వేపుడు కరకరలాడేటట్లు వేయించు” అని భక్తి టీవీ చూస్తున్న భార్య తో చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు సంతోష్.

పాపం భార్య కుమారి, ఎక్కువ టైం భక్తి టీవీ చూడటంలోనూ, వంట చేయటంలోను గడిపేస్తుంది.

స్నానం చేసి కిందకి కి వచ్చిన భర్తతో, "మీరు వండమన్న రెండు, మీకు, మీ అబ్బాయి కి సరే, మరి నాకు గోంగూర, చేమదుంపలూ రెండు పడవు. మరి నేను ఏమి తినాలిట గడ్డి " అంది విసుగ్గా.

“గడ్డెందుకు, బీరకాయ కూర వండుకో, త్వరగా అవుతుంది కూడా” అన్నాడు సంతోష్.

మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ... సాంబార్, చట్నీలతో తిని, వేడి వేడి కాఫీ త్రాగి, రెండు పేపర్లు పట్టుకొని మేడమీదకి నడుస్తున్న భర్త ని ఆపి, "అలా తప్పించుకుని వెళ్ళిపోతే కాదు, గోంగూర, వెల్లుల్లిపాయలు వలిచిపెట్టి వెళ్ళండి. బాగా నేర్చారు, అది వండు, యిది వండు అని చెప్పి, పేపర్ పట్టుకునివెళ్ళి పైన కూర్చొని భోజనం టైంకి క్రిందకి దిగటం” అంది.

“అబ్బో! రాత్రి వండమన్నప్పుడుఏమీ సణగలేదు ఎందుకా అనుకున్నాను. ఈ పని నాకు పెట్టడం కోసమా” అనుకుంటూ టేబుల్ దగ్గర కూర్చొని గోంగూర కట్ట బయటికి తీసాడు వలవటానికి.

"దీని దుంపతెగ, నిన్న చిన్న కట్టలా కనిపించింది గాని, వలవాలంటే చీపురు కట్టంత వుంది "అనుకుంటూ ఆకులన్నీ వలిచి, అమ్మయ్య అని లేవబోతోవుంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకువచ్చి, “యిది కూడా” అంది.

“మరీ యింత దుర్మార్గం పనికిరాదే కుమారి! ఏదో నోటికి రుచిగా వుంటుంది అని వండమన్నందుకు, యింత చాకిరి చేయిస్తున్నావు నా చేత” అన్నాడు వెల్లుల్లి పాయ అందుకుంటూ సంతోష్.

“ అయినా నీ కొడుకు కూడా తింటాడు కదా, వాడు ఏడి? కొన్ని పనులు వాడికి అప్పచెప్పచ్చుగా” అన్నాడు విసుగ్గా సంతోష్.

“వాడు మీలాగా రిటైర్ కాలేదు యింట్లో పనులు చేయటానికి, ఆఫీస్ కి వెళ్ళాడు. వెర్రికుంక, పొద్దున్న టిఫిన్ తింటే మళ్ళీ రాత్రికి రెండు మెతుకులు తింటాడు, వాడు తినే రెండు మెతుకులుకి, యింటి పని చేయించమనటానికి మీకు మనసు ఎలా వచ్చిందండీ” అంది భార్య కుమారి.

“ఒక్క చిన్న మాటకి, యింత పురాణం వినిపించాలా కుమారి, యిన్ని మాటలు భక్తి టీవీ చూస్తున్నప్పుడు ఎలా ఆగిపోతున్నాయి” అన్నాడు సంతోష్.

“ఏమైనా అంటే నా నోరు పెద్దది అని చాటింపు, పిల్లాడికి పెళ్లి వయసు వచ్చి మూడు ఏళ్ళు అయినా, యింతవరకు ఒక్క సంబంధం కుదర్చలేకపోయారు, ఏమైనా అంటే సర్వీస్ లో నేను యిది సాధించాను, అది సాధించానని కధలు వినిపిస్తారు.

చివరికి ఎవరినో ఒకరిని చేసుకువస్తాడు, అప్పుడు యిద్దరం నెత్తి నోరు కొట్టుకోవాలి” అని అంటున్న భార్య తో “ఛీ... వెధవ చేమదుంపల వేపుడు, అనవసరం గా అడిగాను” అంటూ వెల్లులిపాయని వంటిoట్లోకి విసిరి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సంతోష్.

"అదికాదండీ, యిప్పుడు నేను ఏమన్నాను, పిల్లాడికి సంబంధం చూడండి అన్నాను, దానికి నేను ఏదో వంట చేయడానికి ఏడుస్తున్నా అన్నట్లు గా కోప్పడతారేమిటి? అయినా మీ నాన్నగారు మీకు సంతోష్ అని ఎలా పెట్టారండీ, ఎప్పుడూ…” అని ఆగిపోయింది భార్య.

"నీకు కుమారి అని పెట్టలా, పెళ్ళైనా కుమారి అనిపించుకోవాలని , అలాగే నా పేరు సంతోష్ అని పెట్టారు” అన్నాడు సంతోష్.

“బాగానే వుంది వరుస, ఏదో అంటే అందిలే, అని వూరుకోక, రెట్టిస్తో పోతారు, భోజనం కి టైం అవుతోంది, యిలా వచ్చి, విసిరేసిన వెల్లులిపాయ వెతికి పెట్టండి, పప్పులో పోపు పెట్టాలి” అంది కుమారి.

మొత్తానికి వేడి వేడి అన్నం లో గోంగూర పప్పు, ఎర్రగా వేగిన చేమదుంపల వేపుడు, కొత్తగా పెట్టిన ఆవకాయ, గడ్డపెరుగు వేసుకుని భోజనం సంతృప్తి గా తిని, "నీ వంట అచ్చు మా అమ్మ వంటలాగా ఉంటుందోయ్ "అని పెళ్ళాన్ని మెచ్చుకున్నాడు సంతోష్.

సాయంత్రం నాలుగింటికి టీ త్రాగుతో వుండగా, సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేసాడు సంతోష్ స్నేహితుడు, ఏదో మంచి సంబంధం వుంది వెళ్ళి మాట్లాడి వద్దాము రమ్మని.

భార్య కి చెప్పి, సికింద్రాబాద్ బయలుదేరాడు సంతోష్.

యిసుక వేస్తే రాలనంత రద్దీ గా వుంది స్టేషన్ ఏరియా. తన కారు చూసి చేతులు ఊపుతో కనిపించాడు తన స్నేహితుడు శంకరం.

సందులు, గొందులు తిరిగి చివరికి సీతాఫలమండి చేరుకుని ఒక యింటి ముందు ఆగారు. శంకరం ముందు దిగి వెళ్ళి ఆ యింటి గేటు చప్పుడు చేసాడు. గేటు చప్పుడు విని తలుపు తీసుకుని ఒక పెద్దాయన వచ్చి గేటు తీసి “లోపలికి రండి” అని అన్నాడు.

సంతోష్, శంకరం యిద్దరూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. సంతోష్ యిల్లు కలియ చూస్తున్నాడు. కొద్దిగా పాతది అయినా, బాగానే సర్దుకున్నారనిపించింది.

అయిదు నిముషాలు తరువాత ఒక పెద్దావిడ వచ్చి కూర్చొని తనని పరిచయం చేసుకుంది. సంతోష్, శంకర్ కూడా తమని పరిచయం చేసుకున్నారు.

సంతోష్ డైరెక్ట్ గా వచ్చిన విషయం చెప్పాడు, తనకి పెళ్లి కావలిసిన అబ్బాయి వున్నాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడని, మీకు పెళ్ళికావలిసిన అమ్మాయి వుంది అని వచ్చామని చెప్పాడు.

“ఆడపిల్ల వాళ్ళు కదా మగ పిల్లవారింటికి వెళ్ళి అడగాలిసింది, మీరేమిటి రివర్స్ లో వున్నారు.. పిల్లాడు బాగుండడా?” అంది ఆవిడ.

ఆ ప్రశ్నకి కంగు తిన్న సంతోష్ "రోజులు మారిపోయి, ఆడపిల్ల వాళ్ళ యింటి చుట్టూ తిరిగే కర్మ పట్టింది " అన్నాడు.

“సరేలెండి. ఎవరు వస్తే ఏముంది. మీ అబ్బాయి పెళ్లిఅయిన తరువాత మీ అబ్బాయితో పాటు సోఫాలు, డస్ట్ బిన్ కూడా తీసుకువెళ్తాడా?” అని అడిగింది ఆవిడ.

ఆవిడ ప్రశ్న అర్ధం కాక, “సోఫాలు, డస్ట్ బిన్ ఏమిటి” అన్నాడు సంతోష్ .

“అదేనండీ! మీరు, మీ అమ్మాయి కూడా మీ అబ్బాయితోనే వుంటారా” అంది.

ఒక్కసారిగా కోపం తో లేచి నుంచున్న సంతోష్ చెయ్యిపట్టి లాగి, కుర్చోపెట్టాడు శంకర్.

సంతోష్ తమాయించుకుని "ప్రస్తుతానికి మీరు మీ అమ్మాయి జీతం తోనే బతుకుతున్నట్లున్నారు, పెళ్లి అయిన తరువాత మీ పరిస్థితి ఎలా "అని అడిగాడు ఆమెని.

"మా అమ్మాయి, అల్లుడు తోనే వుంటాముగా, మాకేం హాయిగా వుంటాము "అంది ఆవిడ.

"ఓసి నీ దుంపతెగా, పెద్ద ప్లాన్ తోనే వున్నావు " అనుకున్నాడు సంతోష్.

“మరి, మేమెక్కడ వుండా’లని అడిగాడు.

“మీరు మీ అల్లుడు దగ్గర వుండండి” అంది ఆవిడ నవ్వుతూ.

“వద్దులెండి, మీరు మీ అమ్మాయి దగ్గరే వుండండి, మేము మా అబ్బాయి దగ్గర ఉంటా”మంటూ లేచి, శంకర్ చెయ్యి పట్టుకొని బయటకి నడిచాడు సంతోష్.

గేటు వెయ్యటానికి వచ్చిన ఆ పెద్దాయన "అది నా కూతురు డబ్బు రుచి మరిగింది. యిహ దానికి నేను బ్రతికి వుండగా పెళ్లి చెయ్యదు "అంటూ సంతోష్ కి, శంకర్ కి ఒక నమస్కారం చేసి, గేటు వేసుకున్నాడు.

"భలే సంబంధం తీసుకువచ్చావురా. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు యిలా తయారు అయ్యారేమిటిరా? వాళ్ళకి కొడుకు వున్నాడు కదా, ఎదుటివారిని సోఫాలతోను, డస్ట్ బిన్ తోను పోల్చడం ఏమిటి? అన్నాడు శంకర్ తో.

"పోయేకాలం. ఏంచేస్తాం? పద టీ తాగుదాం, ఆ మహాతల్లి టీ కూడా యివ్వలేద”న్నాడు, హోటల్ వైపు నడుస్తో శంకర్.

గుమ్మం లోకి అడుగుపెట్టగానే "ఏమైంది, పండా, కాయా " అంది భార్య.

"సోఫా, డస్ట్ బిన్ "అంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని జరిగింది అంతా చెప్పాడు సంతోష్.

“వీరబ్రహ్మo గారు చెప్పనే చెప్పారు యిటువంటి కాలం వస్తుంది అని, చూద్దాం ఏదో మంచి సంబంధం రావటానికే, ఈ సంబంధం పోయింది” అంది సంతోష్ తో.

రాత్రి కి అన్నం తింటూ కొడుకుతో సంతోష్ "అబ్బాయి, మీ ఆఫీసులో నీకు నచ్చిన పిల్ల, ఎవరైనా సరే వుంటే చూసుకో, పెళ్లి చేస్తాము, యింక నేను, ఇల్లిల్లూ తిరగలేను "అన్నాడు.

రెండు నెలల్లో సంతోష్, కుమారి యింట బాజాలు మ్రోగాయి.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



51 views0 comments
bottom of page