top of page

నేటి కోడళ్లు


'Neti Kodallu' written by Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

నిద్రలేవగానే ప్రభాకరానికి తల్లి గుర్తొచ్చింది. ఎనభై ఏళ్ళు పైబడిన తల్లికి తను సపర్యలు చేయాలి. కానీ రాత్రి ఆమె చేతనే కాళ్ళకి నూనె మర్దనా చేయించుకున్నాక గానీ ఓ రెండు గంటలు నిద్రపోలేక పోయాడు. అలాంటి పరిస్థితి దాపురించినందుకు ఎంతగానో బాధపడ్డాడు.

ప్రభాకరానికి షుగర్ వ్యాధి వలన కళ్ళు సరిగా కనపడక, కాళ్ళనొప్పులతో విలవిల్లాడుతుంటే భార్య అరుంధతికి ఏ అక్కరా లేదు. కారణం తనతో ఆమెకు ఏ అవసరమూ లేదు చెప్పుకుంటే తీరిపోయే ఏ అప్పుల బాధో కాదు ప్రభాకరానిది. నూరేళ్ళ బ్రతుకుని అరుంధతి చేతిలో పెట్టి ఒట్టి చేతులతో మిగిలిన సగటు మనిషి వ్యధ. అరుంధతి లేనప్పుడు తన బాధను అమ్మకు చెప్పుకుంటాడు ప్రభాకరం. తనకి ఆసరాగా ఉండాల్సిన కొడుకే ఆప్యాయత కోసం తనను ఆశ్రయిస్తుంటే తన ఇబ్బందులు కూడా చెప్పి ఇంకా బాధపెట్టటం ఎందుకని అన్నీ తనలోనే దిగమింగుకుంటుంది లక్షమ్మ.

తల్లి గది దగ్గరకు వచ్చి చూసాడు ప్రభాకరం. మంచం ఖాళీగా కనిపించింది.పెరట్లోకి వెళ్లి చూశాడు. ఒక్కోసారి మామిడి చెట్టు కింద కూర్చుంటుంది. అది ఆవిడకు విశ్రాంతి స్థలం.

ఇల్లు మనకే సొంతం అంటూ అరుంధతి అన్నప్పుడల్లా, నిష్ప్రయోజకుడి తల్లివని తూలనాడినప్పుడల్లా, తను పెంచి పెద్ద చేసిన కొడుక్కి చెప్పుకోలేక, తను నీళ్లు పోసి పెంచిన మామిడి చెట్టు మొదళ్లను కన్నీళ్ళతో తడుపుతుంటుంది.

ఆందోళనగా ఇంటి వెనక తిరిగి చూసాడు. అక్కడా లేదు. ఇంటి లోపల వుండే అవకాశమే లేదు. కోడలు అరుంధతి కాఫీ, టిఫిన్ అయ్యేదాకా లోపలికి రాదు. రాకూడదు. అది అత్తగారికి గీసిన లక్ష్మణ రేఖ. మీరితే మిన్ను విరిగి మీద పడినట్లే. తను ఉడకేసుకుందుకు స్టౌ తన వంతు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉత్తరప్పక్క సందులో కూర్చుంటుంది . ఉత్తరం వైపుకెళ్లి చూసాడు. అక్కడ కూడా లేదు. ఇంట్లోంచి బయట వసారాలోకి వచ్చాడు. అశోక చెట్టు కింద మంచం మీద కూర్చుని ఉంది. ఆ పక్కనే అరుంధతి కూర్చుని ఉంది. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.

నాకు ఇంకా నిద్ర మత్తు వదల్లేదా.. ఇది నిజమా కలా? అనుకుంటూ సరిగ్గా చూసాడు. నిజమే! తను ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న దృశ్యం ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతోంది. వీళ్ళిద్దరి వైరం ముఫై ఏళ్ల నాటిది. ఎవరూ తీర్పు చెప్పలేనిది. నేరం తనదైతే శిక్ష అనుభవిస్తున్నది ముగ్గురు.

ఇద్దరి మధ్య సఖ్యత ఎలా కుదిరిందో అంతుపట్టక వాళ్ళని కదిలించటం ఇష్టంలేక మెల్లిగా వంట గదిలోకి వెళ్లి కాఫీ కలుపుకుని తాగాడు.

పెరటి గుమ్మం గుండా పక్కింటి శ్రీరామ్ ఇంటికి వెళ్ళాడు. శ్రీరామ్ భార్య సుగుణ

"అన్నయ్యగారూ! మళ్లీ ఇంట్లో గొడవా! కాఫీ తెస్తాను ఉండండి" అంది.

భార్యకూ తల్లికీ మధ్య ఎప్పుడు తీర్పు చెప్పాల్సి వచ్చినా అతని ఆయుధం పలాయనవాదం. వీళ్ళింటికొచ్చి తల దాచుకోవటమే తారకమంత్రం.

"వద్దమ్మా! తాగే వచ్చాను" అన్నాడు కుర్చీలో విశ్రాంతిగా కూర్చుంటూ.

"పిల్లలు ఇంకా లేచినట్టు లేరు?"అన్నాడు శ్రీరామ్

"వాళ్ళు పదింటికిగానీ లేవరు. అమెరికాలో అలవాట్లు. ఇక్కడకొచ్చినా అంతే" అన్నాడు ప్రభాకరం.

"పోన్లే పండక్కని వచ్చారు. కూతురూ అల్లుడూ,కొడుకూ కోడలూ. నలుగురూ ఉద్యోగస్తులే. ఇంకో రెండ్రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారంటే ,వెళ్ళాక వాళ్ళ ఉరుకులు పరుగులు ఎట్టాగూ తప్పవు."అన్నాడు శ్రీరామ్.

"ఈరోజు ఓ అద్భుతాన్ని చూసానురా శ్రీరామ్" అన్నాడు ప్రభాకరం తను చూసిన దృశ్యాన్ని నెమరువేసుకుంటూ.

"అమ్మా,అరుంధతీ పొద్దున్నే మాట్లాడుకుంటున్నారు.

నేను చూశాను. నా రెండు కళ్ళతో చూశాను"ఉద్వేగంతో చెప్పాడు.

"ఓహ్! చాలా మంచి విషయంరా..

సుగుణా! విన్నావా?" అన్నాడు శ్రీరామ్

"చాలా మంచి మాట విన్నాను..పిల్లలు వచ్చినందుకు సంతోషంతో ఇద్దరూ కలిసిపోయి వుంటారు. ఇది శాశ్వతం కావాలి" అంది సుగుణ

"పిల్లలు వస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఇలాంటి మార్పు వాళ్లలో నేనింతవరకూ చూడలేదు. ఈ మార్పు శాశ్వతం అనుకోవట్లేదు నేను. దురదృష్టానికి చిరునామా నేనైనప్పుడు,

అదృష్టం దారి తప్పైనా నా తలుపు తడుతుందా?" అన్నాడు ప్రభాకరం.

"ఉరేయ్ బాధపడకు. ఇరవై ఏళ్ళ వేడి వయసులో

మీ పక్కింటి అరుంధతి మీద మనసు పడ్డావు.

నీ చిన్నప్పుడే మీనాన్న పోవటంవల్ల

నువ్వే ఆ యింటికి మగదిక్కువని మీ అమ్మకీ,

మీ పెద్దమ్మకీ ఇష్టం లేకపోయినా నువ్వు ముచ్చటపడ్డావని పెళ్లి జరిపించారు.

పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అరుంధతిని, భర్త పోయిన ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉంచావు.

ఆమె మానసిక స్థితిని అంచనా వేయటంలో విఫలమయ్యావు.

నీకు సరైన చదువు ,తిన్ననైన ఉద్యోగం లేదు. అరుంధతి కష్టపడి చదివి బి ఈ డీ పూర్తి చేసింది. ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం సంపాదించి ఇంటికి ఆసరా అయ్యింది. ఈ ఇల్లు కూడా ఆమె కష్టార్జితమే.

ఉరేయ్. పాతతరం ఆడవాళ్ళతో ఇప్పటి తరం వాళ్ళని పోల్చటంవల్లే అంచనాలు తప్పుతున్నాయి. వారధి పటిష్టంగా ఏర్పడితే సమస్యలు రావు " అన్నాడు శ్రీరామ్

"అదిగో! అమ్మ పిలుస్తున్నట్టుంది శ్రీరామ్. నేను వెళతాను"

అని ఇంటికి వెళ్ళాడు ప్రభాకరం. తల్లి ఒక్కతే ఉంది. అరుంధతి లోపల పనిలో ఉంది.

"ఏమ్మా..కాఫీ తాగావా?"అడిగాడు తాగి ఉండదని నమ్మకంతోనే.

"తాగాను. కోడలు ఇచ్చింది" అంది తల్లి సంతోషంగా

"నీ కోడలు నీకు కాఫీ ఇచ్చిందా? తన పని అయ్యేదాకా నిన్ను

వంటింట్లోకి కూడా రానీయదు? అలాంటిది...?"

నీ కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడిని చూశాక నాకనిపించింది. అది నీ భార్య సాధించిన విజయం అది. అది చూపించుకోవాలనే తాపత్రయపడుతూ ఉంటుంది.

నేనర్ధం చేసుకున్నదైతే ఇది. ఈ రోజు నాతో అభిమానంగా ఎందుకు మాట్లాడిందో మాత్రం నాకు తెలీదు."అంది లక్షమ్మ.

పిల్లలు లేచి,స్నానాలు కానిచ్చి టిఫిన్లు తింటున్నారు. ఇంట్లో సందడి ఉండేది మరో రెండ్రోజులే. వీళ్ళు వెళ్ళిపోతే మళ్లీ ముగ్గురమే. ఎడమోహం పెడమొహం అనుకుంటూ

లోపలికి వెళ్ళాడు ప్రభాకరం.

అరుంధతి రెండు టిఫిన్ ప్లేట్స్ చేతికిచ్చి "మీ అమ్మగారికిచ్చి మీరూ తినండి "అంది

"అమ్మకి ఉదయం టిఫిన్ చేసే అలవాటు లేదుగా"అన్నాడు ప్రభాకరం

"ముందటి సంగతి వేరు. ఇప్పటినుంచి వేరు. టిఫిన్ తిని మందులు వేసుకోమనండి" అంది.

"ఏవిటీ మార్పు.. ఇదెంతకాలం? కొత్త అలవాట్లు దేనికిప్పుడు? తరవాత మళ్లీ బాధ పడ్డానికా?', అన్నాడు ప్రభాకరం భార్య మొహం లోకి సూటిగా చూస్తూ.

" నా కోడలి ప్రవర్తన చూస్తుంటే నా మతి పోతోంది.

పోన్లే పదిరోజులు ఉండటానికి వచ్చారు కదా అని కాలు కందనీకుండా అన్నీ తెచ్చి చేతికిస్తుంటే నన్ను పూచికపుల్లలా తీసేస్తోంది.

అదేం అంటే 'మీరు మీ అత్తగారికి గౌరవం ఇస్తున్నారు గనకా నేనివ్వటానికి. అమెరికాలో మీక్కూడా ఒక స్టోర్ రూమ్ సిద్ధం చేస్తాను. మీ అత్తగారిని వుంచినట్టే మిమ్మల్నీ అందులో ఉంచుతాను. యధారాజా తథా ప్రజా..మిమ్మల్ని చూసి నేర్చుకోమని మీ అబ్బాయే చెప్పారు. అత్తగార్ని ఎలా చూడాలో మిమ్మల్నే చూసి నేర్చుకుంటున్నాను' అంది.

నా గుండె గుభేల్ మంది. నా కోడలు నన్నెంత దారుణంగా చూడబోతోందో ఊహించుకుంటేనే భయం పట్టుకుంది. ఇక మీదట అత్తయ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి" అంటున్న అరుంధతి మాటలు పక్క గదిలో ఉన్న కోడలు సునందకి వినపడ్డాయి. భర్త వైపు చూసి నవ్వింది.

"పాపం అత్తయ్య. నన్ను తప్పుగా అనుకుంటారేమోనండీ" అంది.

"ఏం ఫర్లేదులే! ఇన్నాళ్లూ మా బామ్మ అవస్థను చూసీ చూడకుండా వదిలేశా. ఈ సారి అలా కాదు. మా అమ్మలో మార్పు తీసుకురావాలి. అది నీ ద్వారానే జరగాలి. వజ్రాన్ని మెరిపించాలంటే సాన పట్టక తప్పదు మరి " అన్నాడు.

బామ్మ మీద తన భర్తకున్న ప్రేమకు ముచ్చటపడింది సునంద.

***శుభం***


గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.203 views0 comments

Comments


bottom of page